‘నేనెవరికీ భయపడను, నేనే దేవుణ్ణి’ అని ప్రచారం చేసుకొన్న ఏడవ నిజాం ఉక్కుమనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు విమానాశ్రయంలో తలవంచి నమస్కరించి స్వాగతం పలికాడు. దేశం మొత్తం 1947 ఆగస్టు 15వ తేదీనే పరతంత్రం నుండి విముక్తి పొందినా, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించింది.
‘మన అన్నల చంపిన
మన చెల్లెళ్ళ చెరిచిన
మానవాధములను మండలాధీశులను
మరిచిపోకుండగ గుర్తుంచుకోవాలె
కాలంబురాగానె కాటేసి తీరాలె
పట్టిన చేతులను పొట్టులో బెట్టాలె
తన్నిన కాళ్లను దాగలిగ వాడాలె..’
– కాళోజి
ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి కాళోజీ కలాన్ని కదలించింది ?
ఏ భావం కాళోజీ కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది ?
ఏ సంఘటనకు కాళోజీ హృదయస్పందన కవితాధారలై స్పందించింది ?
అదే 1948లో జరిగిన రజాకార్ల దారుణ స్వైరవిహారం. అది ఒక్క కాళోజీనే కాదు; యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్గిరవ్వలు రేపిన సంఘటన! మతోన్మాద శక్తులైన రజాకార్లకు కొమ్ముగాసిన హైద్రాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుతంత్రాలతో తల్లడిల్లిన తరుణం. వేలాదిమంది ధీరుల త్యాగాలతో తెలంగాణ క్షేత్రం రక్తసిక్తమైన వైనం. దాస్య శృంఖలాల నుండి భరతమాత బంధాలు విడివడినా, తెలంగాణా మాత్రం పరతంత్రం నుండి విముక్తి కాకపోవడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది.
కానీ.. విధి విచిత్రం కదా ! ‘సైనికదాడులనైనా అరికట్ట వచ్చును కానీ ప్రజల హృదయాంతరాళాల నుండి పెల్లుబికి వచ్చే స్వతంత్ర భావతరంగాలను ఆపజాలరనేది చరిత్రలో ఋజువైన సత్యం’ అని ఓ చరిత్రకారుడన్నట్లు రజాకార్ మూకల దాడుల నెదుర్కోవడానికి సమాయత్తమైన ఈ పోతుగడ్డ ప్రజల ధైర్యసాహసాలను వెనోళ్ల పొగడవచ్చు.
తెలంగాణ గడ్డపై హిందూ ప్రజలపై నాటి రజాకార్లు చేసిన దురాక్రమణ గురించి భగవంతుడే స్వయంగా విన్నాడేమో అన్నట్లు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది. అదే ఈ వీర తెలంగాణ దిశను మలుపు తిప్పిన రోజు. అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కినరోజు. అదే సెప్టెంబర్ 17, 1948.
ఆ రోజే నిజాం నవాబు ఉక్కుమనిషి చెంత మోకరిల్లిన రోజు. అదే అదే తెలంగాణ విమోచన దినం.
ఎక్కడ మొదలైంది ?
క్రీ.శ.1656లో బతుకు దెరువుకోసం ఖులీజ్ ఖాన్ అనే వ్యక్తి టర్కీలోని బోఖరా నుండి భారత్‌కు వచ్చాడు. నాటి మొగల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరి పదవి పొందాడు. అతని మనుమడే ఖమ్రుద్దీన్. ఈ వ్యక్తే ‘నిజాం ఉల్ ముల్క్’ బిరుదు పొందాడు. వీళ్ళ వంశం పేరు ఆసఫ్‌జాహి. ఔరంగజేబు పాలనలో దక్కన్ ప్రాంతానికి సుబేదారుగా, ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ నవాబుగానూ అయ్యాడు.
1724లో స్వాతంత్య్రం ప్రకటించుకొన్న ఈ నవాబు 1748లో మరణిస్తే అతని పుత్రులు, రాజ బంధువులు, వారి బంధువులు – నైజాం సంస్థానం నిండా జాగీర్దార్లు, సుబేదార్లుగా ప్రకటించుకొన్నారు. ఈ నవాబుల్లో చివరివాడే ఏడవ మీర్ ఉస్మాన్ అలీఖాన్.
రజాకార్ అంటే ‘శాంతికోరే స్వచ్ఛంద సేవకులు’ అని అర్థం. కానీ వీరు నిజాం రాజ్యంలో రక్తాన్ని ప్రవహింప చేశారు. ఈ రజాకార్ ముఠాకు మొదటి అధ్యక్షుడు బహదూర్ యార్ జంగ్. ఇతడు నిజాం నవాబుకు నమ్మినబంటు. స్వయంగా ప్రభుత్వంలోని అధికారే ఈ సంస్థకు అధికారిగా ఉండడం వల్ల నిజాం (పోలీస్) సైన్యం, రజాకార్లు కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సంస్థకు మౌల్వీ ఖాశిం రజ్వీ అధ్యక్షుడయ్యాడు. ఇతను పరమత సహనం అణువంతైనా లేనివాడు. స్వమత దురభిమాని.
కొందరు పేర్కొన్నట్లు 4వ నవాబు అభివృద్ధి కారకుడైతే, పరమత సహనం కలవాడైతే భాగీరథి నగరం మహ్మదు నగరంగా భాగ్య (భాగ్) నగరం హైదరాబాద్, భాగీరథి మహ్మద్‌బిగా, భాగమతి హైదర్‌బి గా ఎలా మారిందో చరిత్రలో ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. కుతుబ్‌షాహీల పరిపాలనాంతంలో గొప్ప మేధావులైన అక్కన, మాదన్న మంత్రుల హత్యలు జరిగాయి. అప్పటి నుండే ఈ రాజులు పరమత సహనం కోల్పోయారు.
మరీ ముఖ్యంగా 1724 నుండి, అంటే నిజాం పరిపాలన నుండి ఇది మరీ తీవ్రమై ఏడవ నిజాం కాలం నాటికి ఉధృతంగా కొనసాగింది. 1919లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను పోలిన సంస్కరణలు నైజాం రాష్ట్రంలో రాజకీయంగా ప్రవేశించాయి. అట్టడుగు స్థాయిలోని ముస్లింలకు ఇది ఎలాంటి మేలు చేయలేదు. 1927లో ‘మజ్లిస్ ఇతైహాదుల్ బైనుల్ ముస్లిమీన్’ అనే సంస్థ ఏర్పడింది. 1929లో పై పదంలోని ‘బైనుల్’ అనే పదం పోయింది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌గా మారి ఉన్నత ఆశయాలను వదిలిపెట్టింది.
1937లో ఈ సంస్థ మతపరివర్తన ఉద్యమం ‘తబ్లీగ్’ను ప్రారంభించింది. సంస్థానంలోని హరిజనులకు భూములు, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని ఆశ చూపి మతమార్పిడి చేశారు. కొంత కాలానికి పై సంస్థ అధ్యక్ష పదవి ఖాసీం రజ్వీకి లభించింది. ‘రజాకార్ అనే మాటకు వాలంటీర్’ అని అర్థం. కాని సేవాదృక్పథం ఉండాల్సిన రజాకార్లు, వారి అధ్యక్షుడు పరమత సహనం కోల్పోయారు.
1935లో బ్రిటిష్ ప్రభుత్వ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందువల్ల స్వదేశీ సంస్థానాల ప్రాతినిథ్యం ముందుకు వచ్చింది. రాజ్యానికి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తండ్రి కాలం నుండి ప్రధానిగా ఉన్న మహారాజా సర్ కిషన్ ప్రసాదును తొలగించి, ముస్లింను పెట్టుకొని ఆ తర్వాత అతణ్ణి కూడా తొలగించి తానే రాజు, మంత్రిగా మారాడు. ఒక తులం బంగారాన్ని ‘అష్రఫీ’ అనే వాళ్ళు. అలాంటి అష్రఫీలు ఎవరిస్తే వాళ్ళకు జంగ్, నవాబ్ జంగ్, యార్‌జంగ్ బిరుదులిస్తూ డబ్బు గడించాడు నిజాం.
మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ విభజనకు పట్టుబట్టాడు. కాశ్మీర్‌లో హిందూ రాజు ఉండడం వల్ల అక్కడ ఆయన మాటకు గౌరవం దక్కింది. హైద్రాబాద్‌లో రాజు ముస్లిం, ప్రజలు హిందువులు. ఇక్కడి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జరిపే ఏ చర్య అయినా హిందువులను ఒక్కటి చేసి, విప్లవం తెస్తుంది. ఒకవైపు యూ.ఎస్. సెక్యూరిటీ కౌన్సిల్లో తనను ప్రత్యేక రాజ్యంగా ఉంచాలని అప్పీలు చేసిన నిజాం ఇవన్నీ ఆలోచించాడు. అందుకు రజాకార్లతో కలిసి ఓ ప్రణాళిక రచించాడు. ఇదంతా దేశవిభజనకు ముందే 15 ఏళ్ల నుండి కొనసాగింది. హైద్రా బాద్‌లో ముస్లింల సంఖ్య పెరిగితేనే నిజాం పాదుషా తాను అనుకున్న పనులను నిర్విఘ్నంగా చేసుకోవచ్చని భావించాడు. మతమార్పిడి, హిందువులను భయభ్రాంతులకు గురిచేయడం, ఇతర ప్రాంతాలలో ఉండే ముస్లింలను హైదరా బాద్‌కు తీసుకురావడం. ఇదంతా నిజాం రాజ్యంలో ఓ వ్యూహం ప్రకారం జరిగింది. మరోపక్క నిజాం భారత ప్రభుత్వంతో భవిష్యత్తులో తనకు తగదా వస్తే తనకు అండగా నిలవాలని పాకిస్తాన్‌కు ఇరవైకోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ విచిత్రంగా జిన్నా తన నుండి ఎలాంటి సహకారం లభించదని తేల్చి చెప్పాడు.
నెహ్రూ నిరసించారు
బతుకమ్మ పండుగ అంటే హిందువులకు చాలా ఇష్టం. 1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకొంటుంటే ఈ నైజాం ప్రాంతంలో బతుకమ్మ పండుగ మొదలైంది. వాడీ స్టేషన్ దాటిన రైలును ఆపి అందులో స్త్రీలను దించి, ట్రక్కుల్లో ఎక్కించారు. గాండ్లాపూర్ సమీపంలోని ఠాణాకు తీసుకెళ్ళి వాళ్ళను వివస్త్రల్ని చేసి కట్టె (లాఠీ) లతో కొడుతూ రజాకార్లు బతుకమ్మ ఆడించారు. స్త్రీలను ఎత్తుకెళ్ళారు. పురుషుల్ని నరికేశారు. రజాకార్ల దురాగతాల్ని నెహ్రూ 1947 సెప్టెంబర్ 7న నిరసించారు. అయినా మంత నాల పేరుతో ఒక సంవత్సరం ఆలస్యం చేశారు.
హైదరాబాదు సమీపంలో అమీరుపేట గ్రామం లోకి మహమ్మద్ అస్లం, మహ్మద్ కరీం అనే ఇద్దరు రజాకార్లు ప్రవేశించారు. ఆ గ్రామాన్ని అతలాకుతలం చేశారు. స్త్రీల ముక్కుపుడకలను పట్టి లాగి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించారు. సైదాబాద్‌లో 15 మంది స్త్రీలను మానభంగం చేశారు. ఆనాటి పంజాగుట్ట గ్రామంలో భర్తల ఎదుట తల్లీ, కూతుళ్ళపై ఖాదర్ జిలాని, సికిందర్‌ఖాన్, అబ్దుల్ జబ్బార్ అనే నాయకుల నేతృత్వంలో క్రూరమైన అత్యాచారం జరిగింది. బల్గాం గ్రామంలో మహదేశ్ హత్య, కల్యాణిలో ధర్మప్రకాశ్ హత్య, గుండోటిలో వేద ప్రకాశ్ హత్య, జైల్లో పండిత శ్యాంలాల్‌కు విషమివ్వడం, దసరా ఊరేగింపులో హత్యలు, దేవాలయాల మీద దాడి, కవులను, నాయకులను జైల్లో నిర్భంధించడం జరిగింది.
బీబీనగర్, నిజామాబాద్ దుస్సంఘటల్ని ఖండిస్తూ మజ్లిస్ రజాకార్ల దురంతాలను ఎండగట్టిన ‘ఇమ్రోజ్ పత్రిక’లో పుంఖాను పుంఖాలుగా వార్త లొచ్చాయి. ఆ వార్తలు రాసిన షోయబ్ ఉల్లాఖాన్‌ను అతి కిరాతకంగా రజాకార్లు హత్య చేశారు.
ఒకవైపు దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు జరుపుకుంటుంటే ఇక్కడ రజాకార్ల దురాగతాల పరంపర కొనసాగింది. షోయబుల్లాఖాన్ హత్య తర్వాత నెహ్రూ మేల్కొన్నాడు. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన తీవ్రమైంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, రైతులు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. తమ సంస్కృతి సంప్రదాయాలను, భాషను, వేషాన్ని, దేశాన్ని, దేవాలయాలను విధ్వంసం చేస్తున్న నిజాం రజాకార్లపై తిరగబడ్డారు.
ఆర్యసమాజ్ కార్యకర్త నారాయణరావ్ పవార్ నిజాం కోచ్‌మీద బాంబు విసరగా, అతను త్రుటిలో తప్పించుకొన్నాడు.
ఇక్కడి పెద్దలు కేంద్రానికి వెళ్ళి నెహ్రూను, సర్దార్ పటేల్‌ను కలిసి తెలంగాణ పరిస్థితి వివరించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్‌కు తరలించారు. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన నిజాం సైన్యం, రజాకార్లూ చేతులెత్తేశారు. చివరకు ఎలాంటి రక్తపాతం జరక్కుండానే 1948 సెప్టెంబర్ 17న నిజాం తలవంచాడు.
పగలు రైళ్లను దోపిడీ చేయడం, రాత్రివేళ గానాబజానాలతో తాగితందనాలు ఆడడం రజాకార్ల నిత్యకత్యం. ఈ దోపిడీకి ఆనాటి ప్రముఖ నాయకుడు కె.యం. మున్షీ కోడలు, కొడుకు కూడా బలయ్యేవారే. వారు సెలవుల్లో విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో బెంగుళూరు నుండి బొంబాయి వెళ్లే రైలెక్కారు. గంగాపూర్ వద్ద రజాకార్లు చైను లాగి రైలును ఆపేశారు. అందులోని ఇద్దరిని కాల్చిచంపి నగదు దోచుకొన్నారు. ప్రయాణీకుల్లో ఓ 12 మంది చిరునామా గల్లంతయ్యింది. వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వారిని రజాకార్లు ఏం చేశారో ఎవరూ కనిపెట్టలేక పోయారు. మున్షీ గారి కొడుకు, కోడలును వారు గుర్తు పట్టలేదు. లేకుంటే వారిని రజాకార్లు విడిచి పెట్టేవారేకాదు. రైలు షోలాపూర్ చేరగానే అక్కడి కమాండింగ్ సేనాధ్యక్షుడు వారి క్షేమవార్తను మున్షీ గారికి తెలిపాడు.
‘నేనెవరికీ భయపడను, నేనే దేవుణ్ణి’ అని ప్రచారం చేసుకొన్న ఏడవ నిజాం ఉక్కుమనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు విమానాశ్రయంలో తలవంచి నమస్కరించి స్వాగతం పలికాడు. దేశం మొత్తం 1947 ఆగస్టు 15వ తేదీనే పరతంత్రం నుండి విముక్తి పొందినా, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించింది.
గతి తప్పిన చరిత్ర
‘ఏ జాతి తమ చరిత్ర లోతుపాతులను విస్మరించి కరదీపిక లేకుండా ప్రయాణం చేస్తుందో, ఆ జాతి త్వరలోనే ధ్వంసం అవడం ఖాయం’ అంటాడో చరిత్ర కారుడు. చరిత్ర కొందరి పట్ల ‘రాగం’, మరికొందరి పట్ల ‘ద్వేషం’ కల్గించే పక్షపాతుల చేతుల్లో పడితే…? కరదీపికగా మారాల్సిన చరిత్ర మరణశాసనం కాదా? సరిగ్గా ‘సెప్టెంబర్ 17- తెలంగాణ విమోచన దినం’ పై కూడా అలాంటి ఎర్రమబ్బులు కమ్ముకొన్నారు. నడుస్తున్న చరిత్రను అష్టవంకరలుగా మార్చి ఓ దుష్ట పాలకుడిని నాగరికుడిగా స్తుతించే కుట్ర గత 66 ఏళ్లుగా సాగుతూనే ఉంది.
నిజానిజాలు ‘ఇతరులెరుగకున్న ఈశ్వరు డెరుగడా?’ అన్నట్లు సత్యాన్ని కాపాడడం కోసం మన ప్రయత్నం ఆపవద్దు. ‘నా సిద్ధాంతాన్ని అగ్నిలో వేసి పరీక్షించుకోవచ్చు’ అని గౌతమబుద్ధుడు చెప్పినట్లే మనమూ సరైన చరిత్రను సమాజం ముందు పెట్టి, క్షీర వీర న్యాయం కోరుకొందాం !
– డా||పి.భాస్కరయోగి, 9912070125
జాగృతి 11-17 సెప్టెంబర్ 2017
జాగృతి 11-17 సెప్టెంబర్ 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి