ప్రజాశక్తి - కల్చరల్‌:
                 శతక పద్యాల ఉనికి కోల్పోకుండా ప్రతివారు తమ పిల్లలకు నేర్పుతూ కాపాడుకుందామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం బిరుదరాజు రామరాజు ప్రాంగణంలో సామల సదాశివ వేదికపై సోమవారం శతక సంకీర్తన, గేయ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. అధ్యక్షత వహించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సంకీర్తన సాహిత్యం అతి ప్రాచీనమైనదని తెలుగు భాష గ్రామాల్లో భజన శతక పద్యాల వల్ల సజీవంగా ఉందన్నారు. తెలంగాణ సినీ గయ కవిత్వం అంశంపై సుద్దాల అశోకతేజ మాట్లాడుతూ సినిమా పాటలు సాహిత్యమే కాదనే దశ నుంచి ఆ సాహిత్యానికి కావ్య గౌరవం లభించే విధంగా కృషి జరిగిందన్నారు. పద్యం రానివారు సహితం సినిమా పాటను పాడుకుంటున్నారన్నారు. చందాల కేశవదాసు తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లదలో పరితాప భారము పాట రాశారని తెలంగాణ సినీ తొలి కవి ఆయనేనన్నారు. జయభోలో తెలంగాణలో కెసిఆర్‌ సైతం మొండికి పోయిండ్రు... తొండి చేసిండ్రు అనే పాటను రాశారన్నారు. నందిని సిధారెడ్డి అదే సినిమాలో నాగేటి చాళ్లల్లో పాట రాశారన్నారు. దాశరథి, సినారె, చంద్రబోస్‌ సినీ పాటకు సాహితీ గౌరవం తెచ్చారని వివరించారు. గద్దర్‌, అందెశ్రీ, వడ్డేపల్లి, గోరేటి వెంకన్న, జయరాజ్‌, మాస్టర్‌జీ వంటి తెలంగాణ ప్రాంత కవులు సినిమాల్లోనూ తమ ప్రతిభను చూపారన్నారు.
వడ్డేపల్లి కృష్ణ తెలంగాణ లలిత గేయాలు అంశంపై తిరునగరి శతక సాహిత్యం అంశంపై, పి ఎల్లారెడ్డి జానపద గేయ సౌందర్యంపై, భాస్కరయోగి పద సంకీర్తన సాహిత్యంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్‌ జె. బాపురెడ్డి, విద్యావేత్త డాక్టర్‌ వెలిచాల కొండలరావులకు సత్కారం జరిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి