‘‘మీరే నాకు ఇంతవరకు ఎదురు మాట్లాడరు! అలాంటిది ఈ కుక్క నన్ను చూసి మొరుగుతోంది..! రేపటివరకు ఇంట్లో నేనైనా ఉండాలి- ఈ కుక్కైనా ఉండాలి’’- అంటూ ప్రొద్దునే్న వెర్రి
వెంగళప్పకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. కుక్కను ఏం చేయాలని రాత్రంతా ఆలోచించిన వెంగళప్ప నిద్రలోకి జారుకొనే ముందు ఓ ఆలోచన వచ్చింది. ఉదయం కార్లో ఆ కుక్కను తీసుకొని అడవిలో వదిలేద్దామని వెళ్ళాడు. అడవి బయట వదిలితే అది మళ్లీ వెనక్కి వస్తుందని లోపలకు వెళ్లాడు. దట్టంగా ఉన్న అడవిలో కుక్కను వదలి
పెట్టాడు కానీ అతనికి వెనక్కి వచ్చే దారి
తెలియట్లేదు. మళ్లీ కుక్క ముందు నడుస్తుంటే దాని వెంబడే ఇంటికి చేరుకొన్నాడు వెంగళప్ప. సరిగ్గా వివిధ ప్రసార మాధ్యమాల్లో వినోద కార్యక్రమాలు తిలకిస్తున్న ప్రేక్షకుల పరిస్థితి, వెర్రి వెంగళప్ప పరిస్థితి ఒక్కటే..! ఏ జ్ఞానం పొందాలని వాళ్ల వెంబడి (టీవీల) మనం పడుతున్నామో, ఆ జ్ఞానమే మన మెదళ్ళలో అజ్ఞానం నింపడం మన దురదృష్టం.
తెలుగు సినిమా రంగానికి సమాంతరంగా ఇవాళ ‘బుల్లితెర’ నడుస్తోంది. జీడిపాకంలా ఏళ్ల తరబడి సాగే సీరియళ్లు- వాటిలో కన్పిస్తున్న మహిళా ప్రతినాయకురాళ్లు సులభంగా మహిళలను ఆకర్షిస్తున్నారు. ఇన్నాళ్లు కుటుంబం మొత్తం కూర్చొని చూసే సినిమాలు ఉండేవి కావు. ఇపుడు సీరియళ్లూ అలాగే ఉంటున్నాయి. ఎందుకంటే వివిధ సీరియళ్లలోని ఎత్తుకు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, వివిధ పాత్రల మధ్య కుట్రలు కుటుంబాలలోని మనుషులమధ్య చిచ్చు
పెడుతున్నాయి.
సినిమా నటులు, బుల్లితెర నటులు, యాంకర్లు ఈ రోజు సెలబ్రిటీలుగా మారిపోయి పండుగలూ- పర్వదినాల్లో కూడా సందేశాలు అందిస్తున్నారు. అత్యంత బలమైన మాథ్యమంగా ఉన్న ‘చిత్రం’ ఇలా వెర్రితలలు వేస్తే ఈ దేశ యువతరం ఏ మార్గంలో వెళ్లాలి. త్యాగబుద్ధి నేర్పించకుండా భోగవాదం మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తే, అవి చూసిన ప్రతివాడూ తాను అలాంటి సుఖభోగాలను అనుభవించాలనుకొంటే వాడు ఏ మార్గంలో ప్రయాణం చేయాలి?
వినోదం కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నడిపే చానళ్లు ఇటీవల ఏర్పడ్డాయి. రోజంతా వినోదం కోసమే మనిషి జీవించాలి అన్నది ఈ చానళ్ల లక్ష్యం. రియాల్టీ షోల పేరుతో చిన్న చిన్న పిల్లలతో అశ్లీల నృత్యాలు, అసందర్భ డ్రామాలు వేయిస్తున్నారు. వారితో బూతు స్కిట్‌లు వేయించి దానిని ‘జస్టిఫై’ చేస్తున్నారు. ప్రసిద్ధంగా నడుస్తున్న ‘జబర్దస్త్’ అనే కార్యక్రమంలో ఆరోగ్యకరమైన హాస్యంకన్నా అపహాస్యంపాలు ఎక్కువ. ఆ కార్యక్రమానికి ఇద్దరు ప్రసిద్ధ నటులు న్యాయనిర్ణేతలుగా ఉండడం, అందులో ఒకరు ప్రజాప్రతినిధి కావడం మరో విశేషం. స్ర్తిలను అవమానపరిచే సన్నివేశాలు లేకుండా ఆ కార్యక్రమం ఇంతవరకు ఒక్క ఎపిసోడ్ కూడా చేయలేదు. ఆడవాళ్లను వల్గర్‌గా చూపించడం, అశ్లీల భాషతో, ద్వంద్వార్థాల ప్రయోగంతో అందులోని స్కిట్‌లు కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో మతపరమైన విషయాలను హేళనగా వెక్కిరిస్తున్నారు. ఓ రోజు కార్యక్రమంలో ఇద్దరు దొంగలు దొంగతనం చేసి పట్టుబడి కోర్టుకు తీసుకెళ్లబడతారు. వారితో కోర్టువారు భగవద్గీతపై ప్రమాణం చేయిస్తూ ‘‘యధాయధాహి ధర్మస్య’’ అంటే మీకు అర్థం తెలుసా? అని అడుగుతారు. దానికి దొంగ సమాధానం చెప్తూ ‘‘వెధవ వెధవకూ ఓ ధర్మం ఉంటుందని’’ దాని అర్థం అంటాడు. ఇలా వాళ్లకు దొరికిందల్లా హాస్యమే!
ఇటీవల కాలంలో సినిమాల విడుదలకు ముందు పాటల రిలీజ్, సినిమా రిలీజ్ కార్యక్రమాలు చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా నిర్విహిస్తున్నారు. ఈ ఫంక్షన్ల కోసం లక్షలాది రూపాయలు తగులబెట్టాల్సి వస్తుందని నిర్మాతలు లోలోపల బాధపడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో సినిమా తీయడం, నటించడం ఆపేసి మూలకు కూర్చున్న దర్శకులు, నటులు, నిర్మాతలతో మొదలుకొని వివిధ బుల్లితెర సెలబ్రిటీలంతా కన్పిస్తున్నారు. అందులో కొన్ని డాన్స్‌లు, పాటలు, స్కిట్‌లు, వహ్వా.. అనిపించే డైలాగులు, పొగడ్తలు, అభిప్రాయాలు అన్నీ మసాలాలాగా వండి వారుస్తారు. ఇటీవల విడుదలైన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ మాటలకు అనుకూలంగా, వ్యతిరేకంగా తెలుగు చానళ్లలో పెద్ద దుమారం చెలరేగింది. ఆ తరువాత ఆయన క్షమాపణ కోరడం యథాలాపంగా జరిగిపోయింది. అయితే క్షమాపణతోపాటు చలపతిరావు మరో రాయి విసిరి వదిలేశాడు. ‘‘టీవీలల్లో, సినిమాలల్లో వస్తున్న ద్వందార్థాల (డబుల్ మీనింగ్)తో పోల్చితే నేను మాట్లాడింది తక్కువ’’ అన్నాడు.
సంచలనాల పేరుతో మీడియాలో ఈ రియాల్టీ షోలు, కామెడీ షోలు ఎక్కువయ్యాయి. అలాగే సినిమాలకు ప్రచారం రావడం కోసం కులాలను, మతాలను కించపరుస్తూ సన్నివేశాలు పెడుతున్నారు. నాలుగు రోజులు అల్లరి జరిగితే, క్షమాపణ చెప్పడమో, కోర్టుకు వెళితే వివాదాస్పద సన్నివేశాన్ని తొలగించడమో జరుగుతుందని వాళ్ల ధీమా. ఇలాంటి తప్పు చేస్తే శిక్ష ఎలాగూ ఉండదు. చీప్ పాపులారిటీ ఎలాగూ వస్తుంది అన్న ఆలోచన చాలామంది సినిమా వాళ్లలో, బుల్లితెర యాంకర్లలో ఉంది. కాబట్టి పదే పదే ఇలాంటివి జరుగుతున్నాయి!
‘దేనికైనారెడీ’ పేరుతో బ్రాహ్మణులను కించపరుస్తూ మోహన్‌బాబు కుటుంబం తీసిన చలనచిత్రం గతంలో వివాదాస్పదమయ్యింది. తనను మరచిపోయినపుడల్లా రామ్‌గోపాల్‌వర్మ ఏదో ఒక వివాదం ముందుకు తెస్తుంటాడు. ఇటీవల శ్రీదేవి-బోనీకపూర్లపై చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ.
కొందరు కులాలను కించపరుస్తూ సినిమాలు తీస్తే మరికొందరు మతాలను వెక్కిరిస్తారు. సినిమా టైటిల్స్‌ను పెట్టడంలోనే వివాదాలు సృష్టించుకొంటారు. ఒకాయన ‘దేవరాయ’ అని సినిమా పేరు పెట్టుకొని శ్రీకృష్ణదేవరాయలను అవమానిస్తాడు. అలాగే ‘ఎ వుమన్ ఇన్ బ్రాహ్మణిజం’ పేరుతో అసభ్యకర జుగుప్సాకర సన్నివేశాలను మరొకరు తెరకు ఎక్కిస్తారు. ఇంకొకరు ‘సారీ టీచర్’ అని ఉపాధ్యాయినిలను అవమానించే విధంగా సెల్యులాయిడ్‌పై చూపిస్తే, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వరకు ఫిర్యాదు వెళ్లింది. ఇక సినిమాల్లో పాటలు, డైలాగులు వారి ఇష్టమే ఇష్టం; వాటిలో ఎన్నైనా బూతులు, ద్వంద్వార్థాలు, అశ్లీలాలు వెతుక్కోవచ్చు. ఏమైనా అంటే ‘కళను కళగా చూడాలని’ మనకే హితబోధ చేస్తారు. అందరూ కె.విశ్వనాథ్‌లా స్వాతికిరణం, సాగర సంగమం తీయాలంటే ఎలా? అంటూ దబాయిస్తారు. వీళ్లేదో శే్లషకవుల్లో ద్వ్యర్థికావ్యాల్లా సినిమాలు తీసేస్తారు. ఏమైనా అంటే ‘‘జనం చూస్తున్నారు, మేం తీస్తున్నాం’’ అంటారు. మరి అదే జనం రేపు చూడడం మానేస్తే ఇండస్ట్రీ మూసుకొని వెళ్లిపోతారా? ఇంకొందరు సినిమా వాళ్ల వాదన ఇంకా విచిత్రంగా ఉంటుంది. మేం చాలా డబ్బు ఖర్చుబెట్టి ఈ సినిమా తీస్తున్నాం; భక్తతుకారాంలా బ్రతకాలా? అంటుంటారు. మిమ్మల్ని వడ్డీలకు తెచ్చి డబ్బు ఖర్చుపెట్టి ఇలాంటి బూతు కావ్యాలను, హింసను ప్రేరేపించే సన్నివేశాలను ఎవరు తెరకు ఎక్కించమని కోరారు..? అంటే సమాధానం శూన్యం.
కొన్ని కుటుంబాలకే పరిమితమైన సినిమా రంగం ఓ మాఫియాలా నడుస్తోంది. రాజకీయాల్లో మాత్రమే మనం చూసే వంశపారంపర్యం, కుటుంబ నేపథ్యం, కుల స్పృహ ఇపుడు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ అని చెప్తారు. ఒక కుటుంబం నుండి వచ్చిన నటుడు మొదట ఎలాంటి నటన రాకున్నా, ముఖం బాగా లేకున్నా తెరపై కన్పిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్లకు ప్రేక్షకులు అతనికి నటనకు అలవాటుపడిపోతున్నారు. ఏం చేసైనా డబ్బు సంపాదించాలనుకొనే చిల్లరదొంగకు ఇలాంటి
అశ్లీల, బూతు, హింసను చూపించాలనుకొనేవాళ్లకు తేడా ఏమిటి? ఫ్యాక్షనిష్టులను ధీరోదాత్తుల్లా ప్రకటించి నడిపిస్తున్న ఇపుడు ‘డాన్’లూ, వాళ్ల చుట్టూ సెట్టింగులూ, ఇంటర్నేషనల్‌గా అతను చేసే వ్యాపారాల చుట్టూ తిప్పుతున్నారు. ముఖ్యంగా స్ర్తిలను వ్యాపార వస్తువుగా మార్చేసిన కార్పొరేట్ వ్యాపారస్థులు సినిమా వాళ్ళ సహకారంతో కోట్లకు కోట్లు దండుకొంటున్నారు. టూత్‌పేస్ట్‌లనుండి అండర్‌వేర్‌ల వరకు ఏవి అమ్మాలన్నా అందులో స్ర్తిని అంగడి సరుకుగా చూపిస్తున్నారు. ఆఖరుకు రైతులు వ్యవసాయం చేసే విత్తనాలను అమ్మడానికి కూడా ఎన్నడూ వ్యవసాయ పొలం ముఖం చూడని సినిమా నటుడు ప్రచారం నిర్వహిస్తున్నాడు.
ఇక 24 గంటల న్యూస్ ఛానెళ్లూ, ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లు మనిషిలోని భావ వికాసాన్ని చంపే విధంగా ప్రవర్తిస్తున్నాయి. పార్టీకో చానల్ వాళ్ల వాళ్ల నాయకుల నటనా విన్యాసాలను చూపిస్తున్నాయి. ఇందులో రాజకీయ నాయకులు ఏం తక్కువ తినలేదు. వాళ్లూ అద్భుతంగా నటిస్తున్నారు. ఓ నాయకుడు ఇష్టానుసారంగా నోరు పారేసుకొంటాడు. మరోరోజు అందరూ తప్పని చెప్తే ఖండిస్తాడు; క్షమిం
చమని వేడుకొంటాడు. సదరు రాజకీయ నాయకుడు తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తేవాలనుకొంటే- అతనితో ప్రణాళికాబద్ధంగా ఏదో వార్తల్లోకి ఎక్కే పని చేయిస్తాడు. పబ్బుల్లో, క్లబ్బుల్లోనో, కారు రేసులోనో, బైక్ రేస్‌లోనో ఎవరిపైనో దాడిలోనో.. మొత్తానికి మీసాలు మొలవకముందే తెరపై కన్పించి ‘రాజకీయ అరంగేట్రం’ చేస్తాడు. ఆయా చానళ్ల మేనేజ్‌మెంట్ మనస్తత్వాన్ని, సిద్ధాంత తత్వాన్ని, పార్టీ తత్వాన్ని బట్టి చర్చలు జరుపుతుంటారు. ఏ చర్చ జరిగినా ఆ నాయకుని ప్రతిష్ఠకు భంగం రాకుండా, వీలైతే అతగాడి కీర్తి కొంచెం ఇనుమడించేలా న్యూస్ చానళ్ల యాంకర్లు ప్రోగ్రాంను మలుపులు తిప్పుతుంటారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, కాంట్రాక్టుల ద్వారా సంపాదించిన డబ్బును రాజకీయ రంగం అండతో కాపాడుకొంటున్నారు. అలాగే కులాన్ని, టీవీలను, మాటకారితనాన్ని అడ్డుగా పెట్టుకొని తమ అస్తిత్వాన్ని మరింత పెంచుకొంటున్నారు. ఇక సినిమా రంగానికి చెందిన వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి రాజకీయాల్లో పదవులు సంపాదిస్తున్నారు. తద్వారా ఆదాయపు పన్ను, ఇతర సౌకర్యాలు సులభంగా అనుభవిస్తున్నారు. ఇలా సినిమా, బుల్లితెర అష్టవంకర్లు తిరుగుతూ చేస్తున్న విన్యాసం వల్ల సమాజానికి నష్టమా! లాభమా! అని విజ్ఞులెవరూ ఆలోచించకపోతే ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న మన దేశ యువశక్తి నిర్వీర్యం కావడం ఖాయం. ఒక సంవత్సరంలో పదుల సంఖ్యకు పైగా వస్తున్న సినిమాలు, ఒక్క తెలుగు ప్రాంతాల్లోనే 70కిపైగా పుట్టుకొచ్చిన చానళ్లు మన యువతను వివేకానందుడో, డా బాబాసాహెబ్ అంబేద్కర్‌గా మార్చకున్నా ఫర్వాలేదు కానీ, సమాజానికి పనికిరాని వ్యక్తుల్లా మార్చితేనే జాతికి తీరని ద్రోహం!
డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి Published Thursday, 15 June 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి