ప్రపంచంలో  అత్యంంత ప్రాచీన భాష సంస్కృతం. భారతీయ భాషలన్నింటిపైనా సంస్కృత ప్రభావం ఉంది. ఇప్పటికీ మన పూజా విధానంలోని మంత్ర విజ్ఞానమంతా సంస్కృతమే వాడుతున్నాం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరి సంప్రదాయ పద్ధతిలో కొద్ది మార్పులతో సంస్కృతభాషను వాడుతున్నాం. మన నిత్యజీవితంలో సంస్కృతం ఓ భాగమై పోయింది. ఆ భాష ప్రభావం  అన్ని ప్రాంతీయ భాషలపై ఉండడం వల్ల మన ప్రార్తనలు, స్తోత్ర పఠనాలపై కూడా వైదిక సమానత్వం కన్పిస్తుంది. హిందూధర్మంలో బహుదేవతారాధన ఉంది. కానీ “ఏకం సద్విప్రా బహుధావదన్తి” - ఉన్నది ఒక్కటే సనాతన సత్యం.. పండితులు దానిని అనేక విధాలుగా చెప్తారు కానీ, అది ప్రధాన సూత్రంగా భావిస్తోంది.


మనధర్మం చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఒకే తత్త్వం అనేకరూపాల్లో ప్రవర్తిస్తుందనేది ఆ వేద వచనం సారాంశం. మోక్ష సాధనకు పరమాత్మను ప్రార్థన చేస్తాం. అందుకు అనుగుణమైన తత్త్వాన్ని అందించడం కోసం దేవతలను ఆరాధిస్తాం. అలాగే మనకు సహాయపడే శక్తులను ఆరాధిస్తాం. “నా ధర్మం సేవచేయడమే..దానికి కట్టుబడి ఉండటమే” అంటాడు అప్పర స్వామి. రంతి దేవుడు పరోపకారం కోసం 48 రోజులు ఉపవాసం చేసి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ‘అఖిల దేహ భాజాం ఆర్తిం ప్రపద్యే” అంటే - ‘సమస్త జీవుల బాధలను స్వీకరించే శక్తిని నాకు ఇవ్వు” అంటాడు. ఇంతకన్నా గొప్ప మాట ఇంకేముంది? హిందూ ధర్మంలో ఇలాంటి మహోన్నతత్త్వానికి భావనలు కోకొల్లలు కన్పిస్తాయి. భూమిని ఒక తల్లిగా, జీవితత్వానికి ప్రతీకగా హిందువులు భావిస్తారు; అందుకే ‘పృధ్వీ సూక్తమ్’ పఠనం చేస్తాం. భూమి మనకిచ్చిన వనరులు-మనం వాడుకొన్నందుకు కృతజ్ఞతగా భూసూక్తంతో ప్రార్థన చేస్తాం.

చెట్టు-పుట్టల పట్ల హిందువులకున్న కృతజ్ఞత ప్రపంచంలో  ఏ జాతికి లేదు. మనకు ఎందరో గ్రామ దేవతలున్నారు, వారి మూలరూపం పౌరాణిక దేవతలే. ఉదాహరణకు మహిషారసుర మర్దని -మైసమ్మగా, బాలా త్రిపురసుందరి - బాలమ్మగా మారింది. త్రిమూర్తులు మొదలు ప్రతి దేవుడికి ఉపాసనకు అనుగుణంగా స్త్రీదేవత, వాహనం మొదలుకుని కన్పిస్తాయి. సిద్ధి, బుద్ధి అనే స్వభావాలు (గుణాలు) వినాయకుడి ఉపాసనలో భార్యలుగా భావిస్తారు. ప్రజలకు నైతిక విలువులు అందించడం కొరకు నీతి సూత్రాలు సంస్కృతంలో ఉన్నా.. సామాన్యులకు అదో సామెతగా, ఆ నీతి సూత్రం మారిపోయింది. ఏమి చదువురాని వారు కూడా ఉదయం నిద్రలేచి, తమ అరచేతిని దర్శించి “కరాగ్రే వసతే లక్షీ...” శ్లోక పఠనం చేస్తారు. సూర్యుడ్ని దర్శించి నమస్కారం చేస్తారు.

వేదంచదువుకొన్న వారు ‘సంధ్యావందనం’ చేస్తారు. ఈ రెండింటి మధ్య అమంత్రక, సమంత్రక భేదమే తప్ప ఇంకేమీ లేదు. హిందూ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఇవాల్టికీ పటిష్టంగా ఉన్నాయి. ప్రపంచ సంస్కృతిలో మనది ప్రత్యేక సంస్కృతిగా నిల బడింది ఈ రెండింటి వల్లనే అని చెప్పొచ్చు. ధర్మేచ,అర్థేచ, కామేచ... అంటూ ప్రమాణం చేయిస్తాడు పురోహితుడు. నాతిచరామి - నేను అతిగా చతుర్విధపురుషార్థాల్లో చరించను అని ప్రమాణం చేస్తాడు. మూడు  ముళ్లు, ఏడు అడుగులు, లాజహోమం, చేసి ఏడు జన్మల వరకు దంపతులు కలిసి జీవిస్తారు. నిత్య, నైమిత్తిక కర్మలో దంపతులు అప్రతిహతంగా జీవితాంతం ముందుకు సాగిపోతారు. కేవలం కొన్ని ప్రమాణాల ద్వారా దేవుడిని ఆధారం చేసుకొని ఇంతచక్కని వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హిందూవ్యవస్థలో విశేషం.

పూర్వం అప్పు తీసుకున్న వారు ఋణ పత్రం రాసుకొనే టపుడు ‘సూర్య చంద్రుల సాక్షిగా’ - అని రాసుకొనే వారు. ప్రత్యక్షంగా కన్పించే దేవతలను సాక్షులుగా పెట్టి నియమాలకు కట్టుబడి ఉండేవారు.  నదీస్నానాలు వివిధ పర్వదినాల్లో ఎవరూ చెప్పకున్నా హిందువులు ఆచరిస్తారు. నదులపై మన ఋషులు సూక్తాలు రచిస్తే, కవులు కావ్యాలు రచించి ప్రజల్లో వాటి పట్ల ప్రేమను నిర్మించారు. మనకు ఆహారాన్ని అందించే పంటలకు నీరు ముఖ్యం. నీటికి నదులు ముఖ్యం. కాబట్టి నదులను ఆరాధించారు హిందువులు, వాటి నుండి సాగునీరు-త్రాగునీరు లభిస్తుంది. కాబట్టి వాటి గొప్పతనానికి పవిత్రతను ఆపాదించడంవల్ల నదీపూజనం మన జీవితంలో ఓ ముఖ్య భాగం అయింది. ఖగోళంలో జరిగే మార్పులను గమనించడానికి జ్యోతిష శ్శాస్త్రం రచింపబడింది.

వాటి శుభాశుభాలను తెలుసుకోవడానికి నక్షత్ర, గ్రహగమనాన్ని, పంచాంగాన్ని సామాన్యుల వరకు అందించడానికి ఫలితభాగం తోడయ్యింది. ఎప్పటికపుడు మనిషి నడతను నియంత్రణలో ఉంచడానికి పంచాగం కీలకమయ్యింది. హిందువులకు ఇంటి దేవతలు, ఇష్ట దేవతలు, కుల దేవతలు, గ్రామదేవతలు వెలిసారు. వీళ్లంతా ప్రజల కష్టనష్టాల్లో మనోధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడతారు. ఇటీవల ఓ మతపార్టీ నాయకుడు మాట్లాడుతూ ‘పుట్టుకతో అందరూ ముస్లింలే’ అన్నాడు. మరి ఇస్లాం పుట్టింది 6,7 శతాబ్దాల్లో అయితే అంతకు ముందు ప్రజలు ఏమతం వారు? ఇస్లాం, క్రైస్తవంలో కూడా కొన్ని సంస్కారాలు గర్భస్థ శిశువు జన్మించాకే నిర్వహిస్తారు.  కాని హిందూ సంప్రదాయంలో పిండోత్పత్తి జరుగకముందే చేసే కొన్ని సంస్కారాలుంటాయి.

ఇవి షోడశ సంస్కారాల్లో భాగమే, గర్భాదానం నుండి అంత్యేష్టి వరకు ఈ సంస్కారాలు హిందూ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్న ప్రాశనం, చూడాకరణము, ఉపనయనం, వైశ్వదేవం, గోదానం, స్నాతకం, వివాహం, అంత్యేష్టి అనే 16 సంస్కారాలు హిందువులను పుట్టక ముందు నుండి మరణించే వరకు కాపాడుతుండడమే గాక, జీవితాలకు ధర్మాన్ని ముడిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తాయి. హిందువుల ప్రతి అడుగులో పాత్రవహించే కుంకుమ, పసుపు, గంధం, తిలకం, పూలు, అలంకరణ, గాజులు, పురుషులకు యజ్ఞోపవీతం, గురుమాల (దీక్షామాల) ప్రాధాన్యత వహిస్తాయి. శరీరం ఎలా తన భాగాలను కలిగి ఉంటుందో, అన్ని విషయాలు ఇందులో భాగమై ఉంటాయి. సంధ్యావేళ దీపం వెలిగించి ‘దీపంజ్యోతి పరబ్రహ్మ’, అంటూ బాలకులు గానంచేసి పరమాత్మను స్ఫురణకు తెచ్చుకొంటారు.

ఇలా హిందువులు నిత్య జీవితంలో మతాచారాలను తమ నిత్య కర్మల్లో భాగంగా ఆచరిస్తారు. మత -సంప్రదాయలను ప్రత్యేకంగా ఆలోచించి చేయకుండా విశ్వాసంతో, శ్రద్దతో క్రమశిక్షణతో ఆచరిస్తారు. అందువల్ల హిందూమతం జీవనవిధానమేగాని జీవితాలపై రుద్దబడేది కాదు. పుట్టడం - పెరగడం - మరణించడం అనేవి నిత్య జీవనంలో సులభంగా గ్రహించే విధంగా వేదాంతం ఏర్పాటు చేశారు మన ఋషులు. అందులోని మర్మాలను అన్వేషించి, ఆధునిక కాలానికి సరిగ్గా అన్వయించుకుంటే మన ధర్మాన్ని మనం శాశ్వతం చేయగల్గుతాం. 

పరమాత్మా ! పరిరక్షించు నా ధర్మాన్ని
వరమిచ్చే దేవుడవై కరుణించే ధాముడవై
పరమానస శక్తుల చుర కత్తుల నుండి
చెరబట్టే దుష్ట శక్తుల దురాగతాల నుండి రక్షించు నా ధర్మాన్ని!


*************************************************** 
 ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ

జస్టిస్ పార్టీ ధ్వంసం అయ్యాక కమ్యూనిష్టు పార్టీల ముసుగులో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం మొదలుపెట్టారు. వావిలాల గోపాలకృష్ణయ్యను అడ్డుపెట్టుకొని టంగుటూరి ప్రకాశం పంతులును నాశనం చేశారు. రాజకీయమే కాదు కళారంగాల్లోని వ్యక్తులనూ ఈ ‘కే టీమ్’ వదిలి పెట్టలేదు. గరిమెళ్ల సత్యనారాయణ లాంటి దేశభక్తుడిని, ప్రకాశంలాంటి ఆంధ్రకేసరిని బిచ్చం ఎత్తుకొనేట్లు చేశారు. 1971లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకొని 400 మంది ప్రాణాలను బలిగొన్నారు. 

గత ఇరవైరోజులుగా పసుపు పచ్చకామెర్లతో బాధపడుతున్న కులవాద మీడియాను చూస్తే జాలేస్తుంది. ఈ గగ్గోలు వెనుక దాగి ఉన్న కథాకమామిషు ఏమిటి? అని సామాన్యుడు బుర్రబద్దలు కొట్టుకొంటున్నాడు.ఈ వింతరోగానికి కారణం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రను తవ్వాల్సిందే. తమిళనాడులో ఇ.వి.రామస్వామి నాయకర్‌ను చూసి ఆంధ్రదేశంలో త్రిపురనేని రామస్వామి చౌదరి అరాచక రాజకీయానికి బీజం వేశాడు. తంజావూరులో జరుగుతున్న జస్టిస్ పార్టీ సభకు తన అనుచరులతో వెళ్లి, ఆ సభకు అధ్యక్షులైన బొబ్బిలిరాజును క్రిందకు లాగినంత పనిచేసాడు. అలామొదలైన ఈ వారసత్వం అనేక సందర్భాల్లో ఆంధ్రప్రజలకు శాపంగా మారిపోయింది,. ఈ వారసులే పొట్టిశ్రీరాములును ఆమరణ నిరహారదీక్షకు దింపి, అతను చచ్చేవరకు వదలిపెట్టలేదు.

శ్రీరాములు ప్రాణత్యాగం మీద ఆంధ్రరాష్ట్రం అనే పేలపుగింజలను ఏరుకొని తిన్నారు. జస్టిస్ పార్టీ ధ్వంసం అయ్యాక కమ్యూనిష్టుపార్టీల ముసుగులో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం మొదలుపెట్టారు. వావిలాల గోపాలకృష్ణయ్యను అడ్డుపెట్టుకొని టంగుటూరి ప్రకాశం పంతులును నాశనం చేశారు. రాజకీయమే కాదు కళారంగాల్లోని వ్యక్తులనూ ఈ ‘కేటీమ్’ వదిలి పెట్టలేదు. గరిమెళ్ల సత్యనారాయణ లాంటి దేశభక్తున్ని, ప్రకాశంలాంటి ఆంధ్రకేసరిని బిచ్చంఎత్తుకొనేట్లు చేశారు. 1971లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకొని 400 మంది ప్రాణాలను బలిగొన్నారు. అదే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రముఖుడైన భోగాది దుర్గాప్రసాద్ పోలీసుకాల్పుల్లో ఆకారణంగా మరణించినా నోరువిప్పని ఈ ఉద్యమకారులు తమ వర్గానికి చెందిన కాకాని వెంకటరత్నాన్ని అమరుల లిస్టులో వేసి పూజించారు.

ఉద్యమం అయ్యాక ఆయన చనిపోతే, మానసిక వత్తిడితో మరణించాడని ప్రచారం చేసారు. ఇదే గుంపు బూర్గుల రామకృష్ణారావుతో కలిసి కుట్రపన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును స్వాగతించారు. తెలంగాణలో నదీ పరీవాహక ప్రాంతాల్లో తిష్టవేసి. తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కారకులయ్యారు. కమ్యూనిష్టు రాజకీయాలను నడిపి తెలుగురాష్ట్రాల ప్రజలకు శాంతిలేకుండా చేశారు. ఒకే వర్గానికి చెందిన లావు బాల గంగాధర్‌రావు, మాకినేని బసవపున్నయ్య, చండ్రరాజేశ్వరరావు వంటి వాళ్లు ఆంధ్రప్రాంతంలో కూర్చొని తెలంగాణ బహుజనులను నక్సలైట్లుగా మార్చేందుకు పరోక్షంగా సహాయపడ్డారు. ఈ  పరంపర రెండు ప్రాంతాల్లో సి.పి.ఎం, సి.పి.ఐ ముఖ్య నాయకుల రూపంలో ఈ రోజుకూ కన్పిస్తుంది. ఒకే సామాజిక వర్గం కనుసన్నల్లో ఆంధ్రా, రాజకీయాలు నడవడం ప్రజల దురదృష్టం.

పింగళి దశరధరామ్, వంగనీటి మోహనరంగా హత్యలకు కూడా ఈ సమాజిక ఉద్రేకాలే కారణం. విచిత్రం ఏమిటంటే వీర కమ్యూనిష్టులకు కూడా లోలోపల చంద్రబాబుపై ఎనలేని ప్రేమ అంటే మనం నమ్మలేం. 1984 తర్వాత తెలుగుదేశం విజృంభించాక జస్టిస్ పార్టీ, కమ్యూనిష్టు పార్టీల్లోని కుల అవశేషాలు ఎన్టీఆర్ వెంబడి నిలబడ్డారు. ఎన్టీఆర్ స్వతాగా ఆలోచించే వాడు కాబట్టి కొన్నాళ్లు వీళ్లాటలు సాగలేదు. లక్ష్మీపార్వతి పెళ్లి అన్న నేపాన్ని ఎన్టీఆర్‌పై నెట్టి వైస్రాయి హోటల్‌పై దాడిచేయించి తండ్రిని చంపిన జౌరంగజేబులా చంద్రబాబు గద్దెనెక్కాడు. చంద్రబాబు దాష్టికాల  వల్ల తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవం దెబ్బతిని, ఇక్కడి ప్రజలు ప్రత్యేక ఉద్యమానికి తెరలేపారు.

ఉధృతంగా ఉద్యమం నడుస్తున్న సమయంలో చంద్రబాబు అమాయకంగా నటించాడు. రెండు ప్రాంతాలు నాకు రెండుకళ్లు అన్నాడు. మళ్లీ అక్కడ వైఎస్ జగన్ మైలేజ్ తీసుకుంటున్నాడని తెలియగానే కృత్రిమ ఉద్యమానికి తెరతీయించాడు. 1953, 1971, 214 సంక్షోభాల్లో ఇలాంటి దగుల్బాజీలే ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచడానికి కారణమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కిరణ్‌కుమార్ రెడ్డిని డమ్మీగా చేసి, సరిగ్గా ఈ రోజు ప్రత్యేక హోదాకు గగ్గోలు పెట్టినట్లే ఆనాడు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు. తెలంగాణ ఇచ్చేసమయానికి మోదీ హవాను గమనించి, సందుచూసి వెంకయ్య నాయుడి చంకనెక్కి భాజపా పంచన చేరాడు. గుజరాత్ అల్లర్ల అనంతరం ఆ నరేంద్రమోదీని నిందించి, ఆనాటి భాజాపాతో పొత్తును నట్టేట ముంచి, ఏపీభవన్‌లో కూర్చొని మోదీ కి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు 2014 ఎన్నికల్లో మోదీని ఆకాశానికెత్తేశాడు.

తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడవడానికి పరుచూరి ఆశోక్‌బాబు సారధ్యంలో మంచి కథనే నడిపాడు. ప్రాప్తకాలజ్ఞత లేకుండా ఆనాడు విభజన అనివార్యం అనితెలిసినా చంద్రబాబు ఎన్నోకుయుక్తులు పన్నాడు. ఈ కుయుక్తులకు పన్నాడు. ఈ కుయుక్తులకు కాంగ్రెస్ పార్టీ కుట్రతో ఎదుర్కోవాలని ప్రయత్నించింది. కాంగ్రెస్‌లోని చంద్రబాబు మనిషులు లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్‌లాంటి కోవర్టులు కాంగ్రెస్‌ను నిండా ముంచేందుకు ఓవర్‌యాక్షన్ చేశారు. బ్రహ్మస్త్రం మాదగ్గర ఉందని చివరకు పార్లమెంటులో పెప్పర్‌స్ప్రే బయటకు తీసారు. అదే సమయంలో కాపు జట్టు చీలకుండా, కాంగ్రెస్‌లోని చిరంజీవి ఓట్లను తనవైపు తిప్పుకోవడానికి పవన్ కల్యాణ్ అనే తలారిని తనపక్కన పెట్టుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌ను దెబ్బతీసినా, జగన్‌ను దెబ్బతీయలేకపోయాడు.

ఎన్నికల అనంతరం జగన్ ఎమ్మెల్యేలను అంగడిసరుకులా తన వైపులాక్కొని రాజకీయం రంగు మార్చాడు. ఎన్టీఆర్‌ను దేవుడు అని పొగుడుతూనే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన మానసికక్షోభకు కారణమయ్యాడు. చంద్రబాబు అదే దారిలో 2014లో నరేంద్రమోదీ ని ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడి ఇరవైరోజుల నుండి తీవ్రంగా నిందించడం వెనుక కారణం...!? ఇటీవల వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతరావడం, అక్రమంగా ఏమీ తెలియని  లోకేశ్‌ను గద్దెమీద కూర్చో బెట్టడం, పోలవరంకన్నా పట్టిసీమపై మక్కువ చూపడం వంటి అంశాల్లో ప్రజావ్యతిరేకత మూటగట్టుకొంటున్నాడు.

జగన్ గ్రాఫ్‌ను తగ్గించాలంటే భాజాపాపై శత్రుత్వంతో ఉన్నట్లు తీవ్రతను ప్రదర్శించాలనుకొన్న చంద్రబాబు కపట వ్యూహమే ఈ గగ్గోలుకు ప్రధానకారణం. అన్ని అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న జగన్‌ను ఢీకోనడం కన్నా, అమాయకంగా చంద్రబాబును నమ్మిన భాజపాలోని ఓ వర్గం పై యుద్ధం ప్రకటిస్తే, వాళ్లు తేరుకొనేలోపే ఏరుదాటి తెప్ప తగిలేయవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన, కానీ అద్వాణీ, వాజ్‌పేయ్‌ల్లా కేంద్రంలో సత్వగుణ సంపన్నులు లేరు. రాజకీయంనుండి రాక్షసినిపుట్టించే అపరచాణక్యులు అమిత్‌షామోదీలు. చెఱుకుగడను పిండుకొని త్రాగాక పిప్పికూడా  మిగలకుండా చేమగల వాళ్ల సమర్థతకు ఉదాహరణలు ఎన్నో చెప్పొచ్చు. గతంలో నీలం సంజీవరెడ్డి ఇలాంటి వేషాలే వేసి ఇందిరాగాంధీని ఇబ్బందిపెడితే ఆమె నీలాన్ని పదేళ్లు నిమ్మతోటకే పరిమితం చేసింది.

మోదీ, షాలు స్కెచ్‌వేస్తే ఎలాఉంటుందో దమ్మున్న చానల్ రోజూ దగ్గుతూనే ఉంది. ఫరూఖ్ అబ్దుల్లా, ములాయం, లాలూ, దేవేగౌడ, చౌతాల, నవీన్‌పట్నాయక్, శరద్‌పవార్, శరద్‌యాదవ్, వంటి రాజకీయ యోధాన యోధులే మోదీతో సయోధ్యకోసం సందులో కలుస్తున్నారు ! ఇప్పటివరకు నరేంద్రమోదీపేరు ఫోటో ఆంధ్రప్రాంతంలోని సామాన్య ఓటర్లకు తెలిసేది కాదు. చంద్రబాబు పుణ్యమా అని మోదీ ఇంటింటికి పరిచయం అయ్యాడు. ఇంకా ఎన్నికలు 14 నెలలు ఉన్నాయి. ఈ మధ్యలో జరిగే రాజకీయ పరిణామాలు చంద్రబాబును సంక్షోభంలోకి నెట్టడం ఖాయం. ఈ పరిణామాలు అన్నీ తెలిసే చంద్రబాబు రాత్రింబవళ్లు చెప్పిందేచెప్పి ఊదరగొడుతున్నాడు.

పదేళ్లు తెలంగాణ ప్రాంతంలో పిట్టల్లా 1300మంది బలిదానాలు చేసుకొంటే కిమ్మని, సోనియాగాంధీ వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేయని ప్రసార మాధ్యమాలు, ఓకులవాదిని మానసిక విశ్లేషకుడిగా ప్రాజెక్టు చేసి మోదీని తిట్టిస్తున్నాయి. ఇలాంటి కుట్రలు చంద్రబాబు ప్రదర్శించినందువల్లనే తెలంగాణలో తెలుగుదేశం నామరూపాల్లేకుండా పోయింది. తెలంగాణ వచ్చాక తెరాసప్రభుత్వాన్ని పడగొట్టాలనే బాబుగారి దురూహను అదే పాఠశాలలో చదువుకొన్న కేసీఆర్ పసిగట్టి అమరావతికి పంపించాడు. అమరావతిని భ్రమరావతిగా మార్చి ఎప్పుడోకట్టిన బుద్ధవిగ్రహం పక్కన మురికి తుమ్మలు కూడా పీకకుండా నేను విశ్వనగరంగా చేస్తానని నారాయణలాంటి మంత్రితో చెప్పిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్‌కల్యాణ్ చల్లిన బురదను కడుక్కోవడానికి ఈ పదిహేనురోజులు చాలడంలేదు.

మరోవైపు జగన్ ఢిల్లీ ఎంపీలతో వేయిస్తున్న ఎత్తులు బాబుకు నిద్రపట్టనివ్వడంలేదు. ఇక బీజేపీ రామ్‌మాధవ్ లాంటి అపరచాణక్యుడితో ఆపరేషన్ మొదలుపెట్టింది. మరోవైపు సోషల్‌మీడియా బాబు స్టంట్‌లను బట్టబయలు చేస్తున్నది. ఇవన్నీ ఇంత తీవ్రంగా ఉంటే తాను గొప్పశ్రామికుడిలా ఫోజులివ్వడం జస్టిస్‌పార్టీ, కమ్యూనిష్టు పార్టీల నటనే... దుర్గగుడి ఫ్లుఓవర్ ప్రారంభం మూడుసార్లు వాయిదా పడడం, ఉత్తరాదికి చెందిన అశోక్ సింఘల్‌ను తితిదే ఈవోగా నియమించడం వెనుక కారణాలు ప్రజలు ఆలోచించడం, డబ్బుతో దొరికిన  శేఖర్‌రెడ్డి లోకేశ్ సంబంధాల రహస్యాలు బయట పడుతుండడం, ఇసుక మాఫియా సంగతి బయల్పడడం, దుర్గగుడిలో తాంత్రిక పూజలు, అమరావతిలో అక్రమాలు ఇవన్నీ మటుమాయం చేయడానికే చంద్రబాబు ఆడుతున్న కొత్తనాటకం ఆంధ్రప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి కుటిల రాజకీయాలే ఆంధ్రప్రజలకు ఆనాటినుండి ఈనాటి వరకు శాపంగా పరిణమించాయి. ఆంధ్రుల  అభివృద్ధిని అడ్డుకొనే ఈ పరిణామాలకు ఇప్పుడు పెట్టిన కొత్తపేరు ప్రత్యేక హోదా. ఈ పాపాల బైరవుల చివరి అవతారం చంద్రబాబు. 

*************************************************** 
 ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐవృక్షో రక్షతి రక్షతి.. అనే స్ఫ్రుహ ఈనాటిది కాదు.. క్రీస్తుపూర్వం నాటికే అశోకుడు రోడ్డుకు ఇరువైపులా వృక్షాలను నాటించాడని చిన్నపుడే పాఠాల్లో చదువుకుంటాం.. మన పురాణేతి హాసాలు, శాస్త్రాల్లో చెట్లు, మొక్కలు, పుష్పాలకు సంబంధించిన శాస్త్రీయ వివరణలు ఎన్నో కనిపిస్తాయి.. వృక్షాల స్పందన, పెరుగుదల ఎలా ఉంటుందనేది మనశాస్త్రాలు చక్కగా చెప్పుకొచ్చాయి..

అశోకశ్చరణా హత్యావకులో ముఖసీధునా
ఆలింగనాత్కురవకస్తిలకో వీక్షనేనచ
కరస్పర్శేన మాకన్దో ముఖరాగేణ మమృకః
సల్లాపతః కర్ణికారః సిన్దువారో ముఖానిలాత్
గీత్యాప్రియాళుర్నితరాం నమేరుర్మ సీతేనచ 

(తాత్పర్యము: అశోక వృక్షము (స్త్రీలు) తన్నుట చేత, పొగడ చెట్టు ఉమ్మడం వల్ల, గోరంట ఆలింగనము వల్ల, తిలకం చెట్టు చూడటం వల్ల, మామిడి చేత్తో తాకడం వల్ల, సంపెంగ చెట్టు ముఖరాగం వల్ల, కొండగోగు చెట్టు మాట్లాడటం చేత, వావిలి చెట్టు ఊపిరి వదలడం వల్ల, మోరట చెట్టు సంగీతం వల్ల, సురపొన్న చెట్టు నవ్వడం వల్ల, పుష్ప ఫలాలతో వృద్ధి పొందుతాయి..)
ఇలా వృక్ష సంపదను ఎంతలోతుగా, నిశితంగా మనవాళ్లు పరిశీలించారో చూడండి. అందుకే మనం వివిధ కార్యక్రమాల్లో ఉపయోగించే కర్రలు - వాటి వెనుక అంతరార్థం గొప్పగా ఉంటుంది.

సోమిడి చెట్టు: ఈ చెట్టు కర్రలను పవిత్రంగా భావిస్తారు. అందుకే గృహాలు నిర్మించేటప్పుడు ఆ ఇంట్లోని దేవమందిరానికి ఈ చెట్టు కర్ర కొంచెమైనా ఉపయోగిస్తారు. ఈ కర్రలోనే దేవుడుంటాడని భావిస్తారు.

మోదుగ: ఉపనయనం తర్వాత వటువుకు మోదుగ కర్ర అందిస్తారు. “ఆయుర్వర్చోయశో బలాభివృద్ధర్థ్యం గోసర్ప భయనివృత్యర్థం పలాశదండ ధారణం కరిష్యే” అని సుశ్రవస మంత్రం చెప్తుంది. ఆయువు, వర్చస్సు, యశస్సు, బలం, గోరక్షణ, సర్పాల నుండి రక్షణకు ఈ కర్ర ఉపయోగపడుతుంది. అంటే మనదేశం వ్యవసాయ దేశం అనీ, సర్పభయం నుండి శత్రు భయం నుండి ఈ కర్ర రక్షిస్తుంది. బ్రహ్మచారి మోదుగ కర్ర, గృహస్తుడు అంకోల (ఊడుగ) కర్ర, సన్యాసులు వెదురు దండం ధరించడం సంప్రదాయం. ఈ చెట్టు ఆకులో భోజనం చేస్తే 60 రకాల వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేద అనుభవజ్ఞులు చెప్తారు. నిన్నమొన్నటి వరకు మనం విస్తర్లు మోదుగ ఆకులతో కుట్టినవే.. నననన

తులసి: ప్రతి హిందువు తప్పనిసరిగా తమ గృహాల్లో పెంచాల్సిన చెట్టు. ఇటీవల ఫ్లోరైడ్ నీటితో కలిసి వచ్చే రోగాలను నశింపజేసే శక్తి దానికి ఉందని నిరూపించారు. అందుకే ఈ విషయం పరోక్షంగా తీర్థంగా ఆలయాల్లో ఇచ్చి మనల్ని రక్షించే వారు. అధర్వణవేదం తులసి మహిమను చెప్తూ..

“అస్థిజస్య కిలానస్య తనూజస్య చయత్త్వచి
దృశ్యాతస్య బ్రహ్మణా యక్ష్మశ్వాసమనీనశత్
నరూపకృత్‌త్వమౌషధే సాసరూపమిదం కృధి
శ్యామా నరూపకరణి పృథివ్యామత్యద్భుతా”

అంటూ శ్లాఘించింది.. చర్మం, మాంసం, ఎముకల్లో పుట్టిన మహా రోగాలను శ్వేతతులసి, కృష్ణ తులసితో శ్వేతకుష్ఠ (బొల్లి)వంటి రోగాలు తొలగిపోతాయి. అందుకే దీనికి ‘అద్భుత’ అని మరో పేరు కూడా ఉంది. మారేడు: శివునికి ప్రీతికరమైన ఈ చెట్టు కేవలం శివార్చనలో మాత్రమే వాడుతారు అని మనకు తెలుసు. కానీ జ్వర, అతిసార, శూల ఆమవాతం, గ్రహణి, మొలలు మొదలైన రోగాలకు దీనిని మందుగా వాడటం ఆయుర్వేదంలో చూస్తాం. మేడి, ఉసిరి, రావి, జువ్వి, మర్రి, వేప, వనమల్లిక, చంపక, అశోక, వాసంతి, మాలతి, కుంద, జాజి, జిల్లేడు, గన్నేరు, మారేడు, తుమ్మ, ఉత్తరేణి, కుశ, జమ్మి, నల్లకలువ, భృంగరాజ, చంద్ర, దూర్య, దర్భ, చందన, మరవ వంటి చెట్ల పుష్పాలు, ఆకులతో పూజలు చేస్తాం.

ఇవన్నీ మనకు ప్రకృతి ఇచ్చిన సంపద. వీటికి మనపూర్వులు గొప్పస్థానం ఇవ్వడం వల్ల మనం పెంచాలని తెలియజేశారు. అన్నిటిలో ఓషదీగుణాలున్నాయి. అందుకే వృరక్షతి రక్షితః అన్నారు. ఇలా చెట్లను పెంచడం ఓ జీవన విధానంగా మనపూర్వులు రూపొందించారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలామంది ఇంటి పెరడులో చెట్లను పెంచడం చూస్తాం. చెట్టు తనను నరికేందుకు వచ్చే గొడ్డలికి కూడా కర్రను ఇస్తుంది. బ్రతికినన్నాళ్లు ఫలం, పుష్పం, కాయలు, వంట చెరుకు ఇచ్చే చెట్టే... మరణించాక గృహోపకరణాలకు అవసరమవుతుంది. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యాన్ని సరిచేసి ప్రకృతిని కాపాడుతుంది చెట్టు. 

ప్రథమ వయసి పీతం తోయ మల్పం స్మరంతః
శిరసి నిహితభరా నారికేళా నరాణాం
సలిలమమృతకల్పం దద్యురా జీవితాంతం
వహికృతముపకారం సాధవో విస్మరంతి 

చిన్నగా ఉన్నప్పుడు పోసినకొద్ది నీటిని త్రాగి ఆ మేలును మరవని కొబ్బరి చెట్టు నెత్తిన ఎంతో బరువైన కాయలను మోస్తూ జీవితాంతం మనుషులకు తీయని నీటిని ఇస్తుంది. ఆహా! సాధువులు ఎంత చిన్న ఉపకారమైనా మరవకుండా ప్రత్యుపకారం చేస్తారుకదా! అని దీని భావం. ప్రత్యుపకారంలో చెట్లకు మించిన గురువులు ఉండరు కదా!

అంతేకాదు మన జ్యోతిష్యం శాస్త్రం కూడా ఒక్కో గ్రహానికి ఒక్కో చెట్టును పేర్కొంది

నవగ్రహాలు నవధాన్యములు నవసమిధలు

రవి గోధుమలు అర్క-జిల్లేడు
చంద్రుడు వడ్లు మోదుగ
కుజుడు కందులు చంద్ర-ఖదిర
బుధుడు పెసలు ఉత్తరేణి
గురువు శనగలు అశ్వత్థ-రావి
శుక్రుడు అనుములు మేడి-అత్తిపత్తి
శని నువ్వులు శమి
రాహువు మినుములు గరిక
కేతువు ఉలవలు దర్భ

 ***************************************************
  
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 ఆధ్యాత్మిక వ్యాసం ॐ
“మీపూర్వీకులు అరణ్యాల్లో నివసించిన అనాగరిక మనుష్యులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహనీయులు వారు. మీ చరిత్ర పరాజయాల మోపు కాదు; విశ్వవిజయాల యశోగానమది. మీ వేదాంత శాస్త్రాలన్నీ ఆవుల కాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుల వంటి మహా మహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్య వచో నిధులవి. లేవండి! మేలుకొనండి! వైభవోపేతమైన మీ చరిత్రను చూసి సగర్వ భావంతో పులకించండి!” - అని స్వామి దయానంద సరస్వతి భారత జాతికి ఇచ్చిన పిలుపు ఇది! కానీ స్వాతంత్య్రం రాక ముందు ఈ దేశంలో జాతీయతను సాధించడానికై ఒక రకమైన పోరాటం చేస్తే స్వాతంత్య్రం వచ్చాక విజాతీయ మనస్తత్వంపై స్వదేశస్థులు పోరాటం చేయాల్సి రావడం ఒక విషాదం!? 1945 జూలై 16 సమయంలో మాన్హట్టన్ ప్రాజెక్టు నాయకుడిగా ఉండి మొదటి అణుబాంబు తయారీలో కీలకపాత్ర పోషించిన రాబర్ట్ జూలియస్ ఓపన్ హామర్ సంస్కృతం నేర్చుకొని, భగవద్గీత చదువుకొని ‘నేను ఈ పని చేయగలిగిన స్థితప్రజ్ఞతను భగవద్గీత నుండి పొందాను’ అని చెప్పుకొన్నాడు.

అంతేగాకుండా అణుపరీక్ష సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన విశ్వరూప సందర్శనం నేను చేయగలిగానని, అందుకు గీతలోని 11/12, 11/32 శ్లోకాలను తన జీవిత చరిత్రలో ఉటంకించాడు. కానీ మన దేశంలో మాత్రం భగవద్గీతను నిషేధించాలని చెప్పేవాళ్లు ఉన్నారు. భారతీయ జీవనతత్వ సారమైన భగవద్గీతను నిషేధించాలని, అది మతోన్మాద గ్రంథమని ఆరోపిస్తూ ఒక మహామేధావి మధ్యప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టాడు. అంతేగాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు పెట్టిన పేర్లు హిందూ జాతీయతను సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

బాలికల సంక్షేమం కోసం లాడలీ లక్ష్మీ పథకం, చెరువులు త్రవ్వించే పథకానికి బలరామ్ తాల్ పథకం, జలవనరుల అభివృద్ధి పథకానికి కపిల ధార పథకం అని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పేర్లు మన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్నాడు. ఇవన్నీ మతతత్వ పేర్లని క్యాథలిక్ బిషప్ కౌన్సిల్కు చెందిన ఫాదర్ ఆనందం కేసు వేశాడు. అయితే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి పేర్లతో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నా సెక్యురల్ ప్రభుత్వం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇవన్నీ ఒకే రకమైన పథకాలు, ఒకే రకమైన పేర్లు. కానీ సెక్యులర్, జాతీయవాద ప్రభుత్వాలు గద్దెపై ఉండడమే తేడా! ఇక్కడ కెసిఆర్ అయినా, అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా అవన్నీ సదుద్దేశంతో పెట్టిన పేర్లే కానీ జాతీయవాద భావజాలం ఉన్నవాళ్లు ఏం చేసినా ఈ దేశంలో నేరమే అన్నంత స్థాయిలో ఈ డెబ్బయి ఏళ్లలో దుష్ప్రచారం జరిగింది.

అయితే హైకోర్టులో ఆనందం వేసిన కేసు కొట్టివేయబడింది. అంతేగాకుండా కోర్టు ఆనందంపై ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ‘భగవద్గీత భారతీయ జీవన మూల్యాలకు ప్రతీక అని, అది జీవిత సారాన్ని తెలిపేదని, అలాగే లక్ష్మి, బలరాం, కపిల వంటి పదాలు భారతీయ సంస్కృతికి ప్రాధాన్యం వహిస్తాయని’ పేర్కొంది. ఇవి ఏ మతానికీ సంబంధించినవి కావని కూడా చెప్పింది.ఇలాంటి స్థితిలో కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మోదీలాంటి నికార్సయిన ప్రకర జాతీయవాది గద్దెపై ఉన్నా జాతీయవాద సంస్కృతిని విస్తరించడం వైపు దృష్టి పెట్టలేదనే సున్నితమైన విమర్శ అక్కడక్కడ వినిపిస్తోంది.

చరిత్ర, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో జరగాల్సినంత వేగవంతమైన మార్పులు జరగడం లేదని జాతీయవాదుల ఆందోళన. ఈ ప్రమాదాన్ని జాతీయవాద సంస్థలు గుర్తించకపోవడం మరో విడ్డూరం.గత డెబ్బయి ఏళ్ల నుండి సాంస్కృతిక, సాహిత్య రంగాలను కమ్యూనిస్టులకు అప్పగించి అధికారం అనుభవించిన కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందో ఈ రోజుకూ అలాగే వుందని విమర్శకుల అభిప్రాయం. భారతీయ సంస్కృతికి ప్రతీకగా చెప్పే ద్రౌపదిని అపహాస్యం చేస్తూ నవల రచించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నరేంద్ర మోదీ జాతీయ ప్రభుత్వంలో పద్మ అవార్డు పొందడం ఒకింత జీర్ణించుకోలేని విషయమే! జాతీయవాదానికి విరుద్ధంగా తన జీవితాంతం కృషిచేసిన ఓల్గాకు కేంద్ర సాహిత్య అవార్డు, మావోయిస్టు రచయితలకు వెన్నుదన్నుగా నిలిచిన కె.శివారెడ్డికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే కబీర్ పురస్కారం లభించడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది! అవసరమొస్తే వీళ్లంతా అవార్డు వాపస్ చేసి కూడా సంచలనాలు సృష్టించగలరు.

ఇవన్నీ ఉదాహరణకు చెప్పేవే. కానీ చెప్పాలంటే పెద్ద లిస్టే వుంది! జాతీయ చరిత్రను నిర్మించే సంస్థకు యల్లాప్రగడ సుదర్శనరావును చైర్మన్గా ప్రభుత్వం నియమించగానే కమ్యూనిస్టులు, మేధావులు, సూడో లిబరల్ సిద్ధాంతకర్తలు ఒంటికాలుపై లేచారు. పురాణాలు చదువుకున్న సుదర్శనరావును ఆ సంస్థకు ఎలా అధ్యక్షుణ్ణి చేస్తారని గగ్గోలు పెట్టారు. విచిత్రం ఏమిటంటే నిరసన తెలిపే గుంపు చాలా తక్కువగా ఉన్నా దానిని ప్రచారం చేసే మీడియాకూడా ఏం తక్కువ తినలేదు. వాళ్లకు ప్రసార మాధ్యమ రంగంపై కావలసినంత పట్టు ఉంది. చరిత్రలో మరుగుపడిన, ఎన్నో అజ్ఞాత విషయాలను జాతికి అందించాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి నిరసనను కట్టడి చేయకపోవడమే గాక, సమూల ప్రక్షాళనకు వెనక్కి తగ్గడం చారిత్రక తప్పిదం.

అటల్బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో నాటి మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి డా.మురళీ మనోహర్ జోషీ చేసిన ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టగానే సూడో సెక్యులర్ పార్టీలు, సంస్థలు, మేధావులు వ్యతిరేకించారు. అంతేగాకుండా ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు కూడా ఆ ప్రచారానికి భయపడి వెనక్కి తగ్గమని ప్రభుత్వ పెద్దలను కోరాయి. కానీ ఈ రోజు సంపూర్ణ మెజారిటీ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడంలేదు. కేవలం పార్టీ విస్తరణకు జరుగుతున్న రాజసూయ యాగమే తప్ప సాంస్కృతిక, చారిత్రక రంగాల మకిలిని వదలించే పని చేస్తున్నట్లు లేదని ఎందరో జాతీయవాద మేధావులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు అన్ని సాంస్కృతిక, చారిత్రక రంగాల్లో కీలక స్థానాల్లో ఈ రోజుకు వామపక్ష మేధావులదే పైచేయి. దాని అండతోనే వాళ్లు ప్రచార, ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.

అలాగే ఈ దేశంలో ప్రాచీనమైన సంస్కృతికి ప్రతీకగా ఉన్న సంస్కృత భాషను సంరక్షించే ఒక్క అడుగూ ముందుకు పడలేదు. సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ ఈ జాతి జాతీయ మహాపురుషులను తిట్టడానికి ఆ భాషలోని సాహిత్యాన్ని ఉపయోగిస్తారు. కానీ సంస్కృతం ఈ దేశంలోని ప్రజల వారసత్వం అంటే ఒప్పుకోరు. ప్రపంచ భాషా పితామహుడిగా పిలవబడే పాణిని మహర్షి గొప్ప సాంకేతిక అంశాలతో సంస్కృత భాషను మనకు వారసత్వంగా ఇచ్చాడు. సుదీర్ఘాయుష్షుగల సంస్కృతం అపభ్రంశం లేకుండా, మార్పులు చెందకుండా నిలబడగలిగింది. 500 ఏళ్ల క్రితం వాడిన ఆంగ్లం, అంతెందుకు షేక్స్స్పియర్ ఇంగ్లీషుకు ఈనాటి ఆంగ్లానికీ చాలా తేడా ఉంది. అంతకన్నా కాస్త వెనక్కి వెళితే క్రీ.శ. 700 నాటి చాపర్ రాసిన ‘పిలిగ్రిమ్స్ ప్రోగ్రెసెస్’ వంటి ఆంగ్ల గ్రంథాలు ఇప్పటి ఆంగ్లేయ పండితులకే అర్థం కావని ‘రట్జర్ కోర్టెన్ హారట్స్’ అనే సుప్రసిద్ధ రచయిత పేర్కొన్నాడు.
నిజానికి చాలా భాషలు మార్పు పొందాయి.

కొన్ని గుర్తుపట్టలేనంతగా మారిపోతాయి. మరికొన్ని భాషలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ సంస్కృతం జీవభాష. దానికి మతం ముద్రవేసి వెనక్కి నెట్టేస్తున్న సాంస్కృతిక సంస్థలకు చలనం లేదు. అంతేగాక భారతీయ భాషలను కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తున్న ఆంగ్లంపై వెర్రివేలం మన యువకుల్ని మనకు వ్యతిరేకంగా మార్చేస్తోంది. 2012 సివిల్స్ పరీక్షలో సెలక్ట్ అయిన మొత్తం 1,150 మందిలో కేవలం 26 మంది (2.3 శాతం) మాత్రమే భారతీయ భాషల్ని ఎంచుకుని పరీక్ష రాశారంటే వాళ్లలో ఉత్తీర్ణులై వచ్చిన వాళ్లు ఈ దేశానికి ఏ రకమైన సేవ చేస్తారో ఆలోచించండి.రాజకీయంగా ‘హిందుత్వ’ ఓ తిట్టుపదంగా మారిపోయింది.

హిందువుగా ఉండి రాజకీయం చేయడం తప్పని చాలామంది నాయకుల మెదళ్లలో వున్న ఆలోచన. దీనికి కారణం ఏమిటి? మన సాంస్కృతిక విధానంపై అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడం శోచనీయం. కేవలం పార్టీలు, ఓట్లు, సీట్లు అన్న విధానంలో పాలన జరిగితే సాంస్కృతిక విధానం చక్కబడదు. తరతరాలుగా ఈ జాతి జీవనాడులన్నీ ముడిపడి వున్న రంగం డెబ్బయి ఏళ్లనుండి క్యాన్సర్తో కొట్టుమిట్టాడుతూ కొనఊపిరితో వుంది. అలాంటి రోగం ఈ మధ్య మరింతగా ముదిరిపోయి విశ్వవిద్యాలయాలకూ ప్రాకిపోతోంది.అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఏళ్లకు ఏళ్లు తిష్టవేసుకొని తీరిగ్గా కూర్చుని సాహిత్య రంగాన్ని విదేశీ యిజాలతో నింపుతున్న వాళ్లపై ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తుందో అర్థం కావడంలేదు. 

దశాబ్దాలుగా జాతీయవాద సాహిత్యాన్ని బ్రతికిస్తున్న కవులు, రచయితలు, మేధావులు తీవ్ర నిరాశా నిస్పృహలతో వున్న జాతీయవాద సంస్థలకు చీమ కుట్టినట్టయినా లేదు.దీనికితోడు కళారంగాల్లో జరగాల్సిన ప్రక్షాళన జరుగకపోవడంవల్ల సంజయ్లీలా భన్సాలీ వంటి వాళ్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఓవైపు స్వచ్ఛ భారత్లో భాగస్వామిగా ఉంటూనే దేశం అభద్రంగా ఉంది అంటూ తన భార్య భుజాలపై తుపాకీ పెట్టి జాతీయ ప్రభుత్వాన్ని కాల్చాలనుకొన్న అమీర్ఖాన్లు రోజూ మనల్ని తిడుతూనే వున్నారు.ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు దానికదే బాగుపడుతుందిలే అని ఎవరి మానాన వాళ్లు నిశ్చింతగా ఉంటే భవిష్యత్తరాలు మనల్ని క్షమించవు. పంజాబ్లో పటిండా అనే చోటు నుండి రాజస్థాన్లోని బికనీర్కు ఓ రైలు వెళుతుంది. ఆ రైలు పేరు పటిండా ఎక్స్ప్రెస్.

కాని దీనిని ప్రస్తుతం క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ రైలులో ప్రతిరోజూ దాదాపు 2,100 మంది క్యాన్సర్ రోగులు బికనీర్లో చికిత్స పొందడానికి వెళ్తారు. అందుకే ఆ రైలు పేరు ‘క్యాన్సర్ రైలు’గా మారిపోయింది.దేశంలో జాతీయతను కూడా దేశద్రోహం అని పిలిచే అకడమిక్ భాషను ఇటీవల ‘సూడో ఇంటెలెక్చువల్స్’ కనిపెట్టారు. ఈ మేధావులు అన్ని సాంస్కృతిక రంగాల్లో పీఠం వేసుక్కూచుని ఎప్పటికప్పుడు క్రొత్త సిద్ధాంతాలను అందిస్తుంటారు. ఆర్యద్రావిడ సిద్ధాంతం నుండి ఐలయ్య తర్కం వరకు అన్నింట్లో ఒకటే లక్షణం.

భౌతికంగా అది వేర్వేరు రూపాల్లో కనబడుతుంది. భారత్ ఒక వలస రాజ్యమనే భావన కలిగించి ప్రపంచ మతమార్పిడి శక్తులకు పట్టం గట్టడమే ఈ సిద్ధాంతాల పరమ లక్ష్యం. అత్యాచార సాహిత్యం (అట్రాసిటీ లిటరేచర్) ద్వారా వివాదాస్పద అంశాలను ఎప్పటికప్పుడు ఎద్దుపుండు కాకి పొడిచినట్లుగా గాయం చేయడమే ఈ సంస్థల ప్రధాన ఎజెండా.అలాగే సుదీర్ఘమైన విదేశీ రాజుల పాలనవల్ల ఇక్కడి మెజారిటీ ప్రజలు సంస్కృతి నాగరికతపరంగా గందరగోళంలో పడ్డారు. కాబట్టి జాతీయవాద సంస్థలు మొద్దునిద్ర, అమాయకత్వం వదలి శరవేగంగా చర్యలు చేపట్టకపోతే ‘భారతీయత’ను భ్రమ ప్రమాదంలోకి నెట్టేస్తారు, జాగ్రత్త!

 ***************************************************  
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ


భారత్‌లో హిందువుల సాకార ఆరాధ్య స్థానం దేవాలయం. దైవభక్తి ప్రేరణ కోసం, ధర్మప్రచారం కోసం ఎన్నో ఆలయాలు మన దేశంలో నిర్మించబడ్డాయి. అన్ని వర్గాలవారూ సమష్టిగా దైవారాధన చేయాలనే సదుద్దేశంతో చక్రవర్తులు, దాతలు భారీ సంఖ్యలో వీటిని నిర్మించారు, ఇప్పుడు కూడా నిర్మిస్తున్నారు. కైలాస మానస సరోవర యాత్ర, వైష్ణోదేవి దర్శనయాత్ర, చార్‌ధామ్ యాత్ర మనకున్న దర్శనాల ఉత్సుకతను తెలియజేస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తంజావూరు బృహదీశ్వరాలయం మొదలుకొని ఓ చిన్న వీధిలో ఉండే గ్రామ దేవత ఆరాధన వరకు అన్నీ హిందువులకు దర్శనీయ స్థలాలే.

ఇటీవల ఆలయాల నిర్వహణ విషయంలో హిందువుల భాగస్వామ్యం కన్నా ఇతరుల జోక్యం ఎక్కువ కావడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందరో గొప్పవాళ్లు గుడులను అభివృద్ధి చేశారు. వాటిని సామూహిక ప్రార్థనాస్థలంగా మార్చే ప్రయత్నం జరగగానే అహంకారాలు, పదవులు, భేషజాలు, పార్టీలు, కులాలు అన్నీ అడ్డు వస్తున్నాయి. ఆలయం అనేది మతపరంగా ముఖ్యమైన శ్రద్ధాకేంద్రం. వ్యక్తికి ఆధ్యాత్మికతలోని ప్రాథమిక సూత్రాలను నేర్పించి ధార్మికతత్వం వైపు ఆలయం నడిపిస్తుంది. ఆలయాల్లో వివిధ ఉత్సవాలు, పర్వదినాల సందర్భంగా ఎందరికో ఉపాధి దొరుకుతుంది. అమూర్తమైన దేవుణ్ణి మూర్తి రూపంలో ఆవిష్కరింపజేసి భక్తినీ, భయాన్ని కలిగించి సమాజ శాంతికి దోహదం చేస్తుంది- ఆలయం. అలాంటి ఆలయాలు ఒకప్పుడు విదేశీ మత వౌడ్యంతో ధ్వంసమైతే, ఇపుడు మనమే ధ్వంసం చేసుకుంటున్నాం.

గజనీ మహమ్మద్ క్రీ.శ.1024లో 16వ దండయాత్రగా సోమనాథ దేవాలయంపై దాడి చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. బాబర్ సేనాని మీర్ బాఖీ అయోధ్యలో రామాలయం ధ్వంసం చేయించాడు. దేశానికి స్వా తంత్య్రం వచ్చాక సోమనాథ దేవాలయం మాత్రం సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, కెఎం మున్షీ వంటి నేతల చొరవతో పునరుద్ధరించుకోగలిగాం. కానీ ధ్వంసమైన దేవాలయాలకు ఆత్మగౌరవం కల్పించలేకపోయాం. ఆలయాలు సమాజ ఐక్యతకు అవసరం అని గుర్తించలేకపోయాం.

స్వాతంత్య్రం వచ్చాక ఆలయ వ్యవస్థపై దృష్టిలేని పాలకులు సరికొత్త వ్యవస్థను సృష్టించలేక పోయారు. అందువల్లనే ఎన్నో వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బ్రిటీషు వారు ‘రిలీజియల్ ఎండోమెంట్ యాక్ట్-1863’ను తెచ్చారు. ఆ తర్వాత హిందూ దేవాలయ వ్యవస్థను ఈ చట్టం క్రిందకు తెచ్చి హిందువుల గొంతు కోశారు. ఇప్పటికీ అదే ఛత్రఛాయల్లో నడుస్తున్న ‘దేవాదాయ ధర్మాదాయ శాఖ’కు పట్టిన మకిలి అంతా ఇంతా కాదు. ఇందులో కుల పక్షపాతం, ఆశ్రీత పక్షపాతం, అవినీతి, ధర్మంపై శ్రద్ధ లేకపోవడం.. చివరకు పాలకులు నడిపే దేవాలయాలపై వారికే అశ్రద్ధ! తెలుగు ప్రాం తాల్లో లక్షల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం కావడానికి దేవాదాయ ఉద్యోగుల, అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణం. అధికారంలో వున్న పార్టీలు తమ అవసరాలకు ఉపయోగపడిన రాజకీయ నాయకులకు పదవులిచ్చి దేవాలయాలను వారికి స్వాధీనం చేస్తున్నాయి. లిక్కర్ మాఫియాలు, అవినీతి పరులకు దేవాలయాలను అప్పగిస్తే అక్కడ ఉండేది అరాచకమే. ఆలయ భూములను భూబకాసురులు కబ్జా చేస్తున్నా పాలకులు కళ్లప్పగించి చూస్తారు. హిందుత్వకు ఆగర్భశత్రువులైన కమ్యూనిస్టులు ‘దేవాలయ భూములు పేదలకు పంచాలి’ అని నినదిస్తుంటారు. కానీ చర్చి భూములను, వక్ఫ్ భూములను కనీసం ఆయా మతాల్లోని పేదలకైనా పంచాలని ఎన్నడూ అడగరు.


తాజాగా తిరుమల ప్రధాన పూజారి రమణ దీక్షితులు రేపిన మంట- రాజకీయ పార్టీల వివాదంగా మారింది. కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రమణ దీక్షితులు ఎక్కువగా గౌరవించారనే ఈ అలజడి ప్రారంభమైందట! దీక్షితులు రెండు ముఖ్యమైన ఆరోపణలు చేశారు. తిరుమల ఆలయంలో ఆగమశాస్త్ర విరుద్ధంగా కైంకర్యాలు జరిపేందుకు పెద్దలు, అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, స్వామివారి ఆభరణాలు, రత్నాలు సురక్షితంగా లేవని ఆరోపించారు. ఆ మరుసటి రోజే అర్చకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లుగా నిర్ణయిస్తూ టీటీడీ బోర్డు అతణ్ణి తొలగించింది. ఈమధ్యనే టిటిడి బోర్డు అధ్యక్షునిగా పుట్టా సుధాకర్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే వివాదం మొదలైంది.

భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పబడే తిరుమలలో హిందూ ధర్మాన్ని నూటికి నూరుపాళ్లు విశ్వసించే వ్యక్తులు టీటీడీ బోర్డు అధికారులుగా ఉండాలనే నైతిక సూత్రం ప్రభుత్వం గౌరవించడం లేదని ఆందోళన ప్రారంభమైంది. క్రైస్తవ సువార్త కూటముల్లో విశ్వాసిగా పాల్గొన్న సుధాకర్ టీటీడీ చైర్మన్‌గా పనికిరాడని హిందూ సంస్థలు ఆందోళన ప్రారంభించాయి. బోర్డు సభ్యురాలిగా నియామకమైన తెదేపా ఎమ్మెల్యే అనిత- ‘నేను క్రైస్తవురాలిని’ అని చెప్పుకొన్న వీడియోలు బయటపడేసరికి ఏపీ సీఎం చంద్రబాబు వెనక్కి తగ్గి, ఆమెను స్వచ్ఛందంగా విరమింపజేశారు. పెద్దనోట్ల రద్దు సమయంలో గుట్టలకొద్దీ కరెన్సీ కట్టలతో దొరికిపోయిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి అవినీతిని దేశమంతా చూసింది. ఇతనికి చంద్రబాబు కుమారుడైన లోకేశ్‌తో సంబంధాలున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు.


పుట్టా సుధాకర్‌పై ఆరోపణలు రాగానే ప్రభుత్వం యాదవులను ఎగదోసింది. హిందూత్వాన్ని వందశాతం విశ్వసించే మరే యాదవుడికైనా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినా- హిందూ ధార్మిక సంస్థలకు అభ్యంతరం ఏముంటుంది? సౌదీలో శ్రీరాముడి ఫొటో పెట్టుకోవడం నిషిద్ధం. క్యాథలిక్కులు మూడో ప్రపంచానికి చెందిన బిషప్పును ఎప్పుడూ పోప్ కానివ్వరు. వారి సిద్ధాంతాలు తప్పుకాదు. కానీ హిందూత్వపై విశ్వాసం లేని వారు తిరుమలను పాలిస్తారా? ఈ వివాదం చల్లారకముందే అమిత్ షాకు రమణ దీక్షితులు ఘనస్వాగతం పలకడం, అదే రోజు అమిత్ షా కాన్వాయిపై దాడి చేయడం, మరుసటి రోజు ప్రధాన అర్చకుణ్ణి తొలగించడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇదంతా రాజకీయ రంగు పులుముకుంది.

రమణ దీక్షితులపై గతంలో ఆరోపణలున్నమాట వాస్తవం. అయితే, ఇప్పుడు ఆయన చేసిన ఆరోణలకు జవాబివ్వకుండా తాజా పరిణామాల్లో భాజపాను, అమిత్ షాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. రమణ దీక్షితులు పాల్గొన్న మీడియా సమావేశంలో ఇద్దరు తమిళనాడు భాజపా నాయకులు పాల్గొన్నారని, అమిత్ షాను, రాజనాథ్ సింగ్‌ను ఢిల్లీలో రహస్యంగా కలిశారనీ, ఎప్పుడూ లేనిది ఓ అర్చకుడు తన అభియోగాలను ‘హిందూ ఓరియెంటెడ్’గా చేశాడని చంద్రబాబు ప్రభుత్వం మండిపడింది. నిజానికి తిరుమలలో వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో నాస్తికుడైన భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం, తిరుమల ఏడుకొండలను రెండు కొండలుగా చేయాలనుకోవడం, తిరుమలపై అన్యమత ప్రచారం జరగడం, తిరుమల నిధులను మళ్లించడం, తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు.. ఇవన్నీ వివాదాలే! కానీ ఆయా సందర్భాలలో వాటిని మరుగుపెట్టి మాట్లాడడం జరిగింది. తిరుమలలో వయోపరిమితిని అర్చకులపై విధించాక చిన్న చిన్న దేవాలయాల్లో పూజారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఈ విషయంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడిన మాటలు మంటలే పుట్టించాయి. ఆ తర్వాత ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది కానీ ఇదంతా రాజకీయంగా దుమారం రేపుతోంది.

తెదేపాకు వెన్నుదన్నుగా ఉండే విశే్లషకులు దీనిని భాజపాపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారతంలో రాముణ్ణి ఆధారం చేసుకొని, దక్షిణ భారతంలో వెంకన్నస్వామిని ఆధారం చేసుకొని రాజకీయాలు చేస్తున్నారని రోజూ కథనాలు వండుతున్నారు. తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయంపై రిపబ్లిక్ చానల్‌లో ఆర్నాబ్ గోస్వామి, జీటీవీ యాంకర్లు చర్చ చేయడంతో ఇది ఇపుడు జాతీయాంశంగా మారింది. ఈ విషయంపై హిందూ ఫైర్‌బ్రాండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తీవ్రంగా స్పందించారు. ఒకవేళ సుబ్రహ్మణ్యస్వామి సీరియస్‌గా తీసుకుంటే చంద్రబాబు కష్టాల్లో పడ్డట్టే అని విశే్లషకులు అంటున్నారు.


నిజానికి తిరుమలలో పరిశుభ్రత తప్ప, మిగతా విషయాల్లో సామాన్య భక్తులకు చాలా కష్టాలున్నాయి. తరతరాలుగా తిష్టవేసుకొని కూర్చొన్న చాలామంది అధికారులకు, రాజకీయ ప్రాబల్యంతో వస్తున్న బోర్డు సభ్యుల్లో చాలామందికి హిందూ ధార్మిక అంశాలపై అవగాహన లేదు. వారికి అధికార దర్పం తప్ప హైందవ ధర్మ అభివృద్ధికి సంబంధించిన మనసు లేదు. పోనీ దేవాలయం మొత్తం ధర్మాచార్యులకు అప్పజెప్పాలన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.

తమిళనాడులో ఎన్నో దేవాలయాల్లో ఈ స్వతంత్ర వ్యవస్థ కూడా ప్రమాదంలో పడింది. తిరుమల అభివృద్ధిలో ఎందరో ఐఎఎస్ అధికారుల పాత్ర చాలా గొప్పగా వుంది. కానీ క్రింది స్థాయిలో పేరుకుపోయిన జాడ్యం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నది. ఇపుడు టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ నియామకం వెనుక ఉన్న రహస్యం ఏంటో చంద్రబాబు చెప్పాలని హిందూ ధార్మిక సంస్థలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడి సంప్రదాయం, ధర్మం, సాహిత్యం తెలిసిన ఎందరో నిజాయితీపరులైన ఐఏఎస్‌లు ఉండగా ఉత్తర భారతానికి చెందిన అధికారిని నియమించడం వెనుక మతలబు ఏమిటి?


తిరుమల ఒక ఉదాహరణ మాత్రమే. తెలుగు నాట ఎన్నో దేవాలయాల్లో ఈ దుస్థితి నెలకొని ఉంది. ఇతర మతాల విషయంలో, వారి శ్రద్ధా కేంద్రాల విషయంలో నిరాసక్తంగా ఉండే పార్టీలు హిందువుల విషయంలో మితిమీరిన జోక్యానికి కారణం ఏమిటి? కరాచీలో వుండే నూరేండ్ల నాటి దేవాలయాన్ని ఒక పాకిస్తాన్ పఠాన్ ఆటో గ్యారేజ్‌గా ఉపయోగించుకుంటున్నాడని ఓ పత్రిక ప్రకటించింది. భక్తి లేకుండా కేవలం పదవుల కోసం, అధికార దర్పం కోసం, రాజకీయ నిరుద్యోగులకు నీడ కల్పించేందుకు దేవాలయాలను ఉపయోగించుకోవడం చూస్తే పాకిస్తాన్‌లోని పఠాన్‌కూ వీళ్లకూ తేడా లేదనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ గణేశ చవితి పూజలో పాల్గొన్నందుకు ముంబయిలోని దారుల్- ఇఫ్తా- మంజర్- ఏ- ఇస్లాం అనే సంస్థ అతనిపై ఫత్వా జారీ చేసింది. మరి సువార్త సభల్లోకి ముఖ్య అతిథులుగా వెళ్ళేవాళ్లు, ఇఫ్తార్ విందుల్లో టోపీలు ధరించేవారు హిందూ ఆలయాలకు అధిపతులుగా ఎలా కొనసాగుతారు? ‘దేవుణ్ణి పూజించేవారు బుద్ధిహీనులు’ అన్న రామస్వామి నాయకర్ విగ్రహాన్ని ప్రఖ్యాత శ్రీరంగం దేవాలయం ఎదుట నెలకొల్పడానికి అప్పటి డిఎంకె ప్రభుత్వం అనుమతి ఇచ్చింది! ఇంకెన్నాళ్లు ఈ దేశంలో హిందువుల పరాధీన మనస్తత్వం..?*************************************************

✍✍- డాక్టర్. పి. భాస్కర యోగి 

Published Andhrabhoomi :


‘‘సత్యం మాతాఫితా జ్ఞానం ధర్మో భ్రాతా దయాసఖా!
శాంతిఃపత్నీ క్షమా పుత్రీ షడైతే మమ బాంధవా’’

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం సఖుడు, శాంతి భార్య, క్షమ కూతురు- ఈ ఆరుగురు నా బంధువులు- ఇదీ శోకార్థం.

నిజమైన సాధకుడు ఇలా భావించాలి. ఇవన్నీ మనిషిని దివ్యాత్మగా మారుస్తాయి. సద్ధర్మాన్ని బోధిస్తాయి. సత్కర్మను నిర్దేశిస్తాయి. భారతీయ దివ్యాత్మవైపు పయనింపజేస్తాయి. సత్యం తల్లిలాంటిది. మనోవాక్కాయ కర్మల్లో ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. తద్వారా సత్య ప్రతిష్ఠ జరుగుతుంది. సత్సంకల్పం పెంపొందుతుంది. ‘సత్యమే ప్రాణము మాటకు’ అన్న ప్రాచీనుల ప్రబోధం నిజం అవుతుంది. తల్లి బిడ్డకు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఏది ఎంత మేరకు అవసరమో చెప్పి, మార్గదర్శనం చేస్తుంది. సత్యం వదలి పెట్టినవాడు, తల్లిలేని బిడ్డవంటివాడు. తల్లి దూరమైన బిడ్డ బ్రతుకు ఎలా భారమో, సత్యాన్ని వదలిపెట్టినవాడి జీవితం కూడా అంతే. జ్ఞానం మనం కావాలనుకొంటేనే వస్తుంది. అది తండ్రిలాంటిది. ఎంత మనం దానివైపు దగ్గరైతే అది మనవైపునకు అంత దగ్గరగా వస్తుంది. మన తండ్రికి లోకానికి ఎలా సంబంధం ఉంటుందో జ్ఞానానికి కర్మకు అలాంటి సంబంధమే ఉంటుంది. జ్ఞాన కర్మలకు సంబంధించి ప్రసిద్ధమైన శ్లోకం గుర్తుకు వస్తున్నది.

జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వినాశకమ్
ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్పవినాశకమ్

పుష్పం ఫలానికి కారణం. ఫలం పుష్పాన్ని నాశనం చేస్తుంది. అలాగే జ్ఞానానికి కారణం కర్మ. కాని జ్ఞానమే కర్మను నశింపజేస్తుంది. జ్ఞాని లక్షణాలెన్నో శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. జ్ఞానమే జ్ఞానికి రక్షణ కవచం. తాను ఏ స్థితిలో వున్నానో, తానే మార్గంలో పయనించాలో తెలియజెప్పేది జ్ఞానం. చివరికి తానెక్కడికి చేరాలో చెప్పేది జ్ఞానం. అది వెంబడి ఉండి కాపాడుతుంది. రక్షగా నిలచి మార్గప్రబోధం చేస్తుంది.

అందుకే అది తండ్రిలాంటిది. ధర్మం అన్నలాంటిది. అవసరమొస్తే దండిస్తుంది. ప్రేమగా అనునయిస్తుంది, తన మార్గంలో నడిపిస్తుంది. తనను అనుసరించమని చెప్తుంది. తాను నడిచిన సత్యం, జ్ఞానం- అనే తల్లిదండ్రుల మార్గంలో వెళ్లాలని శాసిస్తుంది. తన వెంట వాళ్లను అలాగే తీసుకెళ్తుంది. తానే అన్న అయి నిలబడుతుంది. పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అందుకే ధర్మం భ్రాత పాత్ర పోషిస్తుంది.
సత్యం, జ్ఞానం, ధర్మం- ఈ మూడు మనిషికి ఎప్పుడైతే రక్షగా నిలిచాయో దయ అనే సఖుడు సులభంగా లభిస్తాడు. పైమూడింటి ప్రబోధం ఇదే. ‘పరోపరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమ్’ అన్న వ్యాసోక్తి అంతరార్థం ఇదే.

శివపూజ, హరికీర్తనకు ఎంత ప్రాముఖ్యం ఉందో దయాగుణానికి అంత ప్రాధాన్యత ఉంది. శాంతి గుణమే పత్ని. సత్య, జ్ఞాన, ధర్మ దయ- అనే బంధువులు తోడుంటే శాంతి కాక ఇంకేం స్వాధీనం అవుతుంది. అదే హృదయం నిండా, మనసు నిండా భాసిస్తుంది. స్వస్థత చేకూర్చుతుంది.

ప్రేమైకమూర్తిగా తన హృదయాన్ని పులకరింపజేస్తుంది. శాంత స్వభావంతో ఉన్నవాడికి క్షమనే పుత్రికగా లభిస్తుంది. సర్వజీవుల యెడల తన దాస దాసోహ తత్వం దృఢం కావాలంటే ‘క్షమ’ పుత్రికా జన్మించాలి. ఆ క్షమాగుణమే శత్రువును కూడా మిత్రునిగా మారుస్తుంది.

చూడండి! భారతీయుల మహోన్నత ఆదర్శాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి ధార్మిక బుద్ధిని ఋషులు ప్రసరింపజేశారో ఈ ఒక్క శ్లోకం చూస్తే చాలు, అర్థమైపోతుంది. స్వభావరీత్యా మనిషి ఎలా ఉన్నా ఈ గుణాలు అలవర్చుకుంటే దివ్యమూర్తిగా మారిపోతాడు. అదే ఋషులు మనకిచ్చిన సంపద.

*********************************************
*✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ