భారతదేశం అనగానే చాలామంది ఇది జ్ఞాన ప్రదేశం అంటుంటారు. శబ్దార్దాల చర్చ కాదు మనం చేయాల్సింది. విజ్ఞాన దృక్పథంతో ఆలోచించాలి. మనకెన్నో శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటినీ విదేశీయులు కొందరు రాయబారులుగా వచ్చినవారు, మరికొందరు చరిత్రకారులు, ఇంకొందరు కావాలని చరిత్ర రాసినవారు చదివి అనువాదాలు చేశారు. అందులో లేని అపవాదాలు సృష్టించారు. ఏదేమైనా మనకు సంబంధించిన జ్ఞానం విదేశాలకు వెళ్లి అనేక రూపాలుగా మారింది అంటే- అక్కడ ఉన్న ఇతర మతాల చారిత్రకులు, కుతర్కులు తమ మతాలకనుగుణంగా మన పుస్తకాల్లోని విషయాలపై వ్యాఖ్య చేశారు. ఈ ప్రహసనం చాలా రోజులుగా సాగింది. అందులో వేదం మొదలుకొని మామూలు విషయాల వరకు అన్నీ ఉన్నాయి. 1897 తర్వాత స్వామి వివేకానంద, శ్రీ రామతీర్థ భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళేవరకు ఇదే విధానం కొనసాగింది.
స్వామి వివేకానంద, రామతీర్థ, పరమహంస యోగానంద లాంటి మహనీయులు భారతదేశం నుండి అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలకు వెళ్లి ఈ జ్ఞానాన్ని తమ సొంత వ్యాఖ్యానంతో చెప్పినంత వరకు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. పాశ్చాత్య చింతనాపరుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ పరంపరంగా అద్భుతమైన పరిశోధన గ్రంథాలు హిందూ మతంలో వచ్చాయి. మళ్లీ ప్రస్తుతం ఈ పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. రోజురోజుకు మనలో నైతిక విలువలు నశిస్తున్నాయి.
ఈ రోజు వివిధ ఛానళ్లలో, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాం టి ఆధునిక ప్రసార ప్రచార మాధ్యమాల్లో మన గ్రంథాల గురించి, మన మహాత్ముల గురించి, మన సంప్రదాయాలను గురించి అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ చూసి కౌంటర్ ఇవ్వగలిగిన పండితులు, స్వామీజీలు మన దేశంలో కరువయ్యారు.
శాస్త్రాలు, కావ్యాలు ఈ రోజు ఆశ్రమాల్లో నేర్పక్కర్లేదు. ఇలాంటి దుర్మార్గమైన రచనలు చేస్తూ మూర్ఖ వాచాలత ప్రదర్శించేవారిని త్రిప్పికొట్టగలిగే యంత్రాంగాన్ని (యువత) తయారుచేయాలి. అప్పుడే వైదిక సనాతన హిందూ మత ప్రతిష్ఠ మసకబారకుండా ఉంటుంది.
నిరాకారతత్త్వం
ఓ ఇద్దరు మిత్రులు సైన్యంలో ఉన్నారు. అందులో ఒకడు గురుభక్తుడు. ప్రతిరోజూ సంధ్యాకాలంలో ‘పరమాత్మను ప్రార్థించడం’ అతనికలవాటు. ఈ మిత్రులు ఇద్దరూ సంధ్యాకాలంలో గుఱ్ఱాలపై ప్రయాణం చేయవలసి వచ్చింది. తాను నిత్యం చేసుకొనే ప్రార్థన ఆ గురుభక్తునికి గుర్తొచ్చింది. ఒక్కసారిగా తన గుఱ్ఱాన్ని ఆపి మిత్రుణ్ణి ఆగమని సైగ చేశాడు. ప్రార్థన చేస్తున్న ఇతణ్ణి మిత్రుడు చూస్తున్నాడు. తాను తన ప్రార్థనను వైదిక పద్ధతిలో చేస్తున్నాడు గురుభక్తుడు. 24 నిమిషాలు తన ప్రార్థన కొనసాగించాడు. పరమాత్మను తన హృదయంలో దర్శనం చేసుకొన్నాడు. చివరికి మంగళహారతి ఇచ్చినట్లుగా చేతిని త్రిప్పుతూ, మరోచేత గంటను మ్రోగించినట్లుగా చేస్తున్నాడు. ఇదంతా ఎంతో సేపట్నుంచి గమనిస్తున్న మిత్రునికి విసుగుపుట్టి ‘‘ఏమిట్రా! నీ నటన!’’ అంటూ చేయిపై ఒకటిచ్చాడు. ‘‘పళ్ళెం క్రిందపడ్డ శబ్దం’’ వచ్చింది. మిత్రునికి ఆశ్చర్యం వేసింది. అదీ విశ్వాసం. అదీ నిరాకార పూజా మహత్మ్యం. భగవంతుణ్ణి మోక్షసిద్ధి కొరకు యోగ పద్ధతిలోనే ఆరాధించాలి. ప్రాథమిక దశలో ఆధ్యాత్మిక సాధనలోకి తీసుకెళ్ళే ప్రవేశిక ‘సాకారతత్వం’ కాని మనం సాకార పద్ధతినే అవలంభిస్తూ, అక్కడే ఆగిపోతున్నాం. ఉన్నత భూమికల్లోకి మనం వెళ్లలేకపోతున్నాం. అందుకే మనం సంపూర్ణ ఆధ్యాత్మికవేత్తలం కాలేకపోతున్నాం.
సాకార పద్ధతుల్లోని పూజలు, ఆరాధనల అంతరార్థం గ్రహించకుండా వాటిని అవలంభిస్తున్నాం. అందుకే మనకు వైదిక ధర్మ ఆచరణ సరిగా కుదరడంలేదు. ఉదా- పూజా సంకల్పంలో ప్రాణాయామం చెయ్యాలని నియమం. స్వాహా మంత్రాలతో, గాయత్రితో ప్రాణాయామం చెయ్యాలి. కాని కేవలం ముక్కును బ్రాహ్మణుడు పట్టుకోమంటే పట్టుకొంటున్నాం. కేవలం ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం అవుతుందా? అని ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యకపోవడం మన అజ్ఞానం.
దివ్య స్వరూపమైన, నాద రూపమైన పరమాత్మ శక్తి ప్రపంచంలోని ప్రతి ప్రాణిలో దివ్యంగా నిండి ఉంది. అందులో ఈ చరాచర సృష్టి అంతా క్రమం తప్పకుండా నడుస్తున్నది. ఆ తత్త్వంలో ఉండే అనంతమైన సత్యం, జ్ఞానంవల్ల జీవుల్లో ఇన్ని రకాల భేదాలు ఏర్పడుతున్నాయి. పరమాత్మ జీవుల్ని సృష్టించి, అనంతమైన శక్తితో వాటిలోని సంస్కారాల్ని గ్రహించి మోక్షంవైపు నడిపిస్తున్నాడు. పరమాత్మ తత్త్వాన్ని గురువు ద్వారా మనం పొందుతున్నాం. వైదిక విజ్ఞానాన్ని అందించేందుకు గురువు మనకు వారధిగా ఉన్నాడు.

*********************************************
     డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి