అజ్ఞానం వధలిపెట్టినవాళ్లు జ్ఞానులు అవుతారు. మూఢత్వం వదలివేసి పరమాత్మవైపు అడుగులు వేసేవారు ‘ముముక్షువు’లు అవుతారు. ఆశ, మోహం, భౌతిక సుఖాభిలాష, అహంకారం- ఇవన్నీ మోక్ష సాధనకు ప్రతిబంధకాలు. ఉదాహరణకు పైవాటిలో ‘ఆశ’నే తీసుకుందాం. ఆశ మనిషికి స్వార్థబుద్ధిని కలిగిస్తుంది. స్వార్థం చివరకు ‘నాది’ అనే అహంకారం రూపంలోకి మారుతుంది. నాది, నేను అన్న చోట భగవంతుడికి స్థానం లేదు.
అహంకారం మోక్షానికి ప్రతిబంధకం. తాను స్ర్తి, పురుష లింగభేదం చేత కాని, పేద, ధనిక సామ్యం చేతగాని, భేదభావం పాటించని ‘జీవుడు’ అన్న సత్యం మరిచిపోతున్నాడు. గృహస్థుడైన ఒక వ్యక్తి ఇల్లు నిర్మించుకొన్నా, పెళ్లిచేసినా, మరే ఇతర ఘనకార్యం చేసినా ‘నేను చేశాను’ అన్న అహంకార ప్రదర్శన చేస్తున్నాడు. అదే తనకు ఏదైనా కష్టం వస్తే ‘దేవుడే తనకిన్ని కష్టాలు కలిగించాడ’ని దేవుణ్ణి నిందిస్తున్నాడు. నిస్వార్థబుద్ధితో జీవిస్తూ, తను చేసే ప్రతి పనిని భగవంతుడే చేయిస్తున్నాడు అన్న లక్షణం ప్రతివారు ఆచరిస్తే ఋషులే అవుతారు.
భౌతిక వస్తువులపై మనకుండే ప్రేమ లౌకికమైంది. అలౌకిక భావన మనకు కలిగినపుడు ‘ఈశావాస్యమిదం సర్వమ్’ అన్న ఋషి వాక్కు నిజరూపం పొందుతుంది. ఋషివాక్కులోనే కాదు జానపద భజన కీర్తనల కూడా ఇలాంటి సందేశమే కన్పిస్తుంది. మనం ఎంతెంత భౌతిక విషయాల్లో మునిగిపోతే భగవంతునికి అంత దూరమవడం నిజం. ‘‘చుక్కాని లేని నావ బరువయ్యే కొద్దీ ప్రమాద స్థితికి దగ్గరవుతుంది’’ అన్న ఓ మహనీయుని మాటలు నిజం. జనక మహారాజు గొప్ప వేదాంత చక్రవర్తి అని మనందరకు తెలుసు. అష్టావక్ర మహామునినే గురువుగా చేసుకొని ‘అష్టావక్రగీత’ ప్రపంచానికి అందేట్లు చేసిన జిజ్ఞాసువు.
అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలలు నేర్చుకోవడానికి ఓ మహారణ్యంలో తపస్సు చేసుకొనే మునీశ్వరుడు తన శిష్యుడైన యువ సన్యాసిని పంపించాడు. సన్యాసి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చేవరకు జనకుడు రాజసభలో ఉన్నాడు. బయట ద్వారం దగ్గర ఉన్న సేవకులకు ‘నేను వచ్చాను’ అన్న వర్తమానం రాసి ఇచ్చి, లోపలకు పంపించాడు సన్యాసి. జనకుడు అది చూసి వెనకాల నేను చచ్చిన తర్వాత రండి అని తిరుగు టపా పంపించాడు. అంటే ‘నేను అనే అహంకారం చచ్చిన తర్వాత రావచ్చు’ అని దాని అర్థం. సన్యాసికి అమ్మో! జనకుడితో జాగ్రత్తగా వ్యవహరించాలి అని అర్థమయ్యింది. మొత్తానికి లోపలకు ప్రవేశం లభించింది. సాదరంగా ఆహ్వానించాడు జనకుడు. ‘నాయనా! ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. వేదాంతం సంగతి రేపు చూద్దాం’ అని భటులను ఆజ్ఞాపించి భోజనాదులు ఏర్పాటుచేసి, విశ్రాంతి మందిరం చూపించమన్నాడు. సన్యాసికి ఎక్కడలేని వ్యాకులత మొదలయ్యింది. ఇంత రాజభోగాలలో మునిగి తేలే వ్యక్తి నాకు వేదాంతం ప్రబోధిస్తాడా? మా గురువుగారు అనవసరంగా ఈయన దగ్గరకు పంపించాడే అని బాధపడ్డాడు. సరే! ఆయన వేదాంత ప్రతిభ ఏమిటో రేపు చూడొచ్చులే అని విశ్రాంతి మందిరానికి చేరుకున్నాడు. రాజగృహం కాబట్టి ఈ సన్యాసి విశ్రాంతి తీసుకొంటున్న గది పైభాగంలో ఓ కత్తి వ్రేలాడదీసి ఉంది. సరిగ్గా నిద్రపోయే సమయంలో సన్యాసి ఆ కత్తిని చూశాడు. అంతే! తెల్లవార్లూ నిద్రపట్టలేదు. పడుకొంటే ఆ కత్తి తనపై ఎప్పుడు పడుతుందోనని ఆందోళన.
బ్రాహ్మీ ముహూర్తంకన్నా ముందే అంతఃపురం నుండి సన్యాసికి పిలుపు వచ్చింది. జనకుడు సన్యాసిని సాదరంగా ఆహ్వానించాడు. ‘‘నాయనా! మా వనంలో ఉన్న కొలనులో స్నానం చేస్తూ మాట్లాడుకొందాంరా!’’ అన్నాడు. ఇద్దరూ స్నానం చేస్తూ చర్చ మొదలుపెట్టగానే అంతఃపుర భవనం పైభాగంలో పెద్ద అగ్నికీలలు కన్పించాయి. జనకుడు నిశ్చలంగా ఉన్నాడు. కాని సన్యాసి తత్తరపడ్డాడు. వెంటనే ‘మహారాజా! అదిగో మీ భవనాలు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయ్’ అన్నాడు జనకుడు మెల్లగా కళ్లు తెరచి ‘మూరెడు కౌపీనం (గోచీగుడ్డ) ధరించే నీకెందుకయ్యా అగ్నికీలల్లో అంతఃపురం అంటుకోవడం గురించి?’ అని మందలించి, తిరిగి అడవికి ఆ సన్యాసిని పంపిస్తాడు. మనలో హృదయ శైథిల్యం నశించి, భగవంతుని పట్ల ప్రేమ పుట్టనంతవరకు భగవత్తత్వం మనకు అలవడదు. అన్నీ వదలిపెట్టి హిమాలయాలకు వెళ్లినా సంసారం మన మనస్సులో ఉంటే హిమాలయం కూడా రణగొణధ్వనులుండే మన ఇల్లుగా మారిపోతుంది. మన ఇంట్లో ఉన్నా సకారాత్మక దృక్పథం ఉంటే ఆ ఇల్లే హిమాలయంగా మారుతుంది. ఇక వ్యక్తిగా మనల్ని వేదాంతం ఇలా ఉండమని శాసిస్తుంది. 1.ఎప్పుడూ నీళ్లలో ఉండే వరి ఆకును బయటకు తీస్తే ఆకుపై నీరు కన్పించదు. 2.ఎప్పుడూ బురదలో ఉండే కుమ్మరిపురుగు బయటకు వస్తే నీళ్లలో కడిగినట్లుగా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు అలవర్చుకొంటే మనం ఎంత పెద్ద సంసారంలో ఉన్నా అది మనల్ని అంటుకోదు.*

*************************************************

      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి