మనిషి శరీరం రక్తం, మాంసం, ఎముకలు, మజ్జతో ఏర్పఢింది. అవన్నీ ఆహారం చేత నిర్మించబడతాయి. సరైన ఆహారం గ్రహిస్తేనే దేహం ఎదుగుదల చక్కగా వుంటుంది. దేహాంతర్గతంగా ‘ఆత్మ’వసిస్తుంది. ఆత్మశుద్ధిగా ఉండి, పరమాత్మ ఉపాసన చేయాలంటే శుద్ధ సాత్విక ఆహారాన్ని శరీరం స్వీకరించాలి. పూర్వయుగాల్లో వేదఋషులు అడవుల్లో కందమూలాలు, ఫలాలు తింటూ తపస్సు చేశారంటే అందులోని అంతరార్థం ఏమిటి? ఆహారానికి తపస్సుకు ఏమిటి సంబంధం? ఇలా తర్కించుకుంటూపోతే విషయం అవగతమవుతుంది.

‘‘ద్వౌభాగౌ పూరయే దన్నైః
తోయేనైకం ప్రపూరయేత్
వాయోః సంచరణార్థాయ
చతుర్థ మవశేషయేత్’’ (అభియుక్తం)

కడుపు రెండు భాగములు అన్నంచేత, ఒక భాగం జలం చేత నింపుకొని, మిగిలిన భాగం వాయు సంచారం కొరకు వదలిపెట్టాలి. ఎంత రుచికరమైన పదార్థమైనా ‘్భక్తాయాసం’ పనికిరాదు. ఎక్కువ తినడంవల్ల సాధకుడు నిద్రమత్తులోకి జారుకొనే ప్రమాదం ఉంది.
కాబట్టి సాత్త్వికాహారం గ్రహించని శరీరం, మనస్సు చంచలత్వాన్ని పొందుతాయి. చంచలత్వాన్ని పొందిన మనస్సు పరమాత్మోపాసన చేయలేదు.

‘‘పుష్టం సుమధురం స్నిగ్ధం గవ్యం ధాతు ప్రపోషణమ్
మనోభిలషితం యోగ్యం యోగీ భోజన మాచరేత్’’

దేహానికి పుష్టినిచ్చేవి, మధురమైనవి, మృదువుగా ఉండేవి, ఆవుపాలు మొదలగునవి వాటితో కూడి ఉండేవి. మనస్సుకు ప్రియమైనవి, ధాతువును పోషించే యోగ్యమైన ఆహారాన్ని యోగసాధకులు భుజించాలి.
జీర్ణం తొందరగా జరిగే పళ్లు, కూరగాయలు, అపక్వాహారం శరీరానికి మంచిని కలుగజేస్తాయి. జీర్ణాశయాన్ని ఇబ్బంది పెట్టవు. మాంసం మొదలైన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తొందరగా జీర్ణం కాకుండా జీర్ణాశయానికి, పేగులకు ఇబ్బంది కలుగజేస్తాయి.
అలాగే జంతువులను చంపి తినడంవల్ల హింస జరుగుతుంది. హింస జరిగినపుడు ఆ చనిపోయిన జంతువుల ‘ఘోష’ మరణ సమయంలో అవి విడుదల చేసే ప్రమాదకర రసాయనాలు మనల్ని ఆవరించే ఉంటాయి. అందువల్ల మన మనస్సు, శరీరం ఏదోరకంగా దాని ప్రభావానికి లోనవుతుంది. కావున సాధకులు శుద్ధ సాత్విక ఆహారం గ్రహించే ప్రయత్నం చేయాలి.

*************************************************
     డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ బుధవారం 卐 మే 09 卐 2018 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి