మన దేశంలో వేదాంతాన్ని బ్రహ్మపదార్థంగా చెప్తారు. బ్రహ్మను గురించి చేసే చర్చను ‘బ్రహ్మజ్ఞానం’గా చెప్తారు. ఉపనిషత్తుల్లో, బ్రహ్మ సూత్రాల్లో జరిగిన ‘జ్ఞానచర్చ’ను సామాన్య జనంలోకి తీసుకెళ్లేందుకు ఎందరో తత్వ కవులుద్భవించారు. కుల భేదం లేకుండా అందరి కోసం తత్వాలను అందించారు. సంప్రదాయంలోని గహనమైన వేదాంతాన్ని అలతిఅలతి పదాలతో అరటిపండు వలిచి అందించినట్లు మరోపాయగా తత్వకవులు నిలబెట్టారు.
 
నేత్రద్వారమునందు వెలిగెడి
సూత్రధారునిగానలేకను
క్షేత్రములకు పోదురేమన్నా...

తనలోన యున్నా తత్వమెవరు తరచిగనరన్నా
పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఫలము లేదన్న
తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే
తారతమ్యము తరచిగనరన్నా...

అంటాడు తత్వకవి. అంటే క్షేత్రాలకు వెళ్లొద్దని కాదు. జ్ఞానస్థాయులను గుర్తెరగాలని అర్థం. అంతర్దర్శనం చేయాలని సూచన. పంచభూతాల ద్వారా ఏర్పడిన ఈ సృష్టిని సాంఖ్యంగా తత్వకవులు చెప్పుకొన్నారు. ప్రకృతి నుండే ఉద్భవించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు త్రిగుణాలు జోడించి, పంచేంద్రియాలతో సమన్వయపరిచి సాంఖ్యతత్వం వ్యాప్తి చేశారు. శరీరం అశాశ్వతమని, ఆత్మ శాశ్వతమని నిరూపించి మోహనిర్మూలన చేసారు. శివరామ దీక్షితులవంటి తాత్వికులు మరో అడుగు ముందుకు వేసి ఆత్మ భావనకన్నా అతీతంగా వెళ్లారు.
 
దేహం శాశ్వతం అనుకునే అజ్ఞాని జీవితాంతం లేదా ఓ పది జన్మలకు సరిపడే సంపదను మూటగట్టుకొంటున్నాడు. ఇదే అజ్ఞానంతో పదవులు, మోహం, ధనం, కుటుంబం, కులం, ప్రాంతం, వంటి భేదాలతో దేవుడిని కూడా సంకుచితం చేస్తున్నాడు. వేదాంత చింతన లేకపోవడం వల్ల శాశ్వతమైన, ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాడు. ఆనంద స్వరూపుడైన పరమాత్మను వదలిపెట్టి అశాంతికి మారుపేరైన జీవనం గడుపుతున్నాడు.
 
శరీరాన్ని రోగాల పుట్టగా మార్చుకొని దేహాన్ని వైద్యులకు అప్పజెప్పి దేహాన్ని మందులతో నింపుతున్నాడు. ఇహపర సుఖాల ఇంగితజ్ఞానం లేకుండా అటు దేహాన్ని, ఇటు ఆత్మనూ రెంటినీ విస్మరిస్తున్నాడు. ఈ లోటును గమనించిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శివరామ దీక్షితులు, వేమన వంటి తత్వజ్ఞానులు తత్వాలను అందించారు. వేమన వంటి కవులు తత్వాన్ని పద్యాల్లో ఒడిసిపట్టారు. భక్తి వాదాన్ని, ముక్తివాదాన్ని ప్రజలకు చేరువ చేసి నిరక్షరాస్యులను, విద్యా గంధంలేని వాళ్లను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. జీవితాన్ని ఒక లక్ష్యంతో నడుపుతూ నిత్య జీవితంలోని అన్ని పనులను సజావుగా చేసుకుంటూ ఆశను వదలిపెట్టారు. నిరాడంబరంగా, నిర్వికారంగా జీవించారు. ఇది వారు దర్శించిన తత్వం. అందరూ అనుసరించాల్సిన తత్వం.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*29- 07 - 2019 : సోమవారం*ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ- ‘‘మనం ఎన్నో క్రిమికీటకాలను చంపుతున్నాం కదా! దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అన్నాడట. ‘‘యుద్ధాల పేరుతో సాటి మనిషిని చంపేవారు ఇంత సున్నితంగా ఎలా ఆలోచించగలుగుతారు? స్వయంగా మీరే ఆ పని చేయకున్నా, అలాంటి చర్యలకు అనేక విధాలా సహకరించే మీరు క్రిమికీటకాల గురించి ఎంత బాధపడిపోతున్నారండీ? ఏం ప్రశ్నలు వేస్తారండీ బాబూ?’’ అంటూ ముఖం మీద కొట్టినట్లు చెప్పారట.

అలాంటి అమాం బాపతు గ్యాంగ్ మళ్లీ కూనిరాగాలు తీయడం మొదలుపెట్టింది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం తర్వాత రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం, మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ శరణుజొచ్చడం, చక్రం తిప్పే చంద్రబాబు చతికిలపడడం, వామపక్షాల ఎడతెగని పోరాటం, సమాజ్‌వాదీ పార్టీకి ఆయువు పట్టయిన ఆజం ఖాన్‌పై 27 కేసులు నమోదు కావడం, మాయావతి బంధువుల ఆర్థిక మూలాలపై దెబ్బపడడం.. ఇలా ప్రతిపక్షాలు తలోదారిలో- దిక్కుతోచకుండా ఉన్న తరుణంలో మేధావులు, కళాకారుల పేరుతో ‘అసహనం-2’ నాటకానికి మళ్లీ తెరలేచింది. 

ఎన్టీయే-1 అధికారంలో ఉన్నపుడు అవార్డులు వాపసు ఇచ్చినట్లే ఇపుడు కళాకారులు, మేధావులు, సామాజిక కార్యకర్తల పేరుతో 49 మంది ప్రముఖుల పేరుతో ప్రధానికి ఓ లేఖ రాశారు. ఆ లేఖరాసిన వాళ్ళల్లో అనురాగ్ కశ్యప్, శుభా ముద్గల్, కేతన్ మెహతా, అపర్ణా సేన్, మణిరత్నం, వినాయక్ సేన్, రామచంద్ర గుహ, కొంకణ్ సేన్ శర్మ, ఆదూర్ గోపాలకృష్ణన్, శ్యాం బెనగల్, ఆశిష్ నంది, నటి రేవతి మొదలైనవారు ఉన్నారు.

‘ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2016లో దళితులకు వ్యతిరేకంగా 840 ఘటనలు జరిగాయని, 2009-2018 మధ్య 254 ఘటనలు జరిగితే, 2014 మే తర్వాత ఇందులో 90 శాతం జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 2009 నుండి 2018 వరకూ మతం పేరుతో 62 శాతం ముస్లింలపై దాడి జరిగిందని, ‘జై శ్రీరామ్’ ఓ అరాచక నినాదంగా మారిందని, ఇంత జరుగుతున్నా మోదీ నిష్క్రియగా ఉన్నారన్నది లేఖలోని సారాంశం. అయితే 2019 ఎన్నికలలో మోదీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేని ఈ మేధావులు జూన్ నుండే ఇలాంటి కుత్సిత వ్యాఖ్యానాలకు తెరతీశారు.

బెంగాల్‌లో జాతీయ భావాలను అణచివేసినా ఏనాడూ నోరు విప్పని తిరోగమన ఆర్థికవేత్త అమర్త్య సేన్- ‘బెంగాల్‌లో జైశ్రీరాం నినాదానికి చోటులేద’న్నాడు. వీళ్ళు దేశంలో భావస్వేచ్ఛను రక్షించే ‘టేకేదార్లు’. అలాగే ఓ వారం కిందట సంగీత నాటక అకాడమీ కన్నడ నాటక ప్రయోక్త అయిన ఎస్.రఘునందన్‌కు అవార్డు ప్రకటిస్తే ‘ఈ అసహనం దేశానికి అపకారం’ అంటూ దాన్ని తిరస్కరించారు. ‘‘నా దేశంలోని ధర్మపరులకు ఇలా అన్యాయం జరుగుతున్నపుడు సంగీత నాటక అవార్డును నేను అంగీకరించలేనని అన్నాడు. ఆయన ఇంకో అడుగు ముందుకు వేసి మేధావులు, సామాజిక కార్యకర్తలు జైళ్ళల్లో మగ్గిపోతున్నారంటూ తెగ బాధపడిపోయాడు. ఆయన ఎవరి గురించి బాధపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రధానికి లేఖ రాసినవాళ్ళలో అపర్ణా సేన్ ‘శారదా చిట్‌ఫండ్’ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలో విచారణ ఎదుర్కొన్న వ్యక్తి. సామాజిక కార్యకర్తలుగా, మేధావులుగా, టీవీ చర్చల్లో విశే్లషకులుగా చలామణి అయ్యేవాళ్లలో అర్బన్ నక్సల్సే ఎక్కువ. అలాంటి కేసులో అరెస్టు అయి 15 ఏప్రిల్ 2011నుండి సుప్రీం కోర్టు బెయిల్‌పై వున్న వినాయక్ సేన్ ఒకరు. ఇతను యూపీఏ అధికారంలో వున్నపుడే మావోయిస్టుల మేధావిగా అరెస్టు చేయబడ్డాడు. ఈ మహామేధావి ఇపుడు సామాజిక కార్యకర్త పేరుతో ఈ లేఖపై సంతకం చేశాడు. వీళ్లంతా కలిసి ఈ దేశంలోని హిందువులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నిష్క్రియాపరత్వానికి జీవం పోస్తున్నారు. దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇపుడే కాదు ఎప్పుడైనా ఎవరూ ఎవరిమీదా దాడి చేయరాదు. అదికాకుండా మతపరంగా ఐక్యతగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్‌కు ప్రయత్నం చేస్తున్నారు.

గత కొనే్నళ్లుగా ముస్లింలకు దళితులను జతచేయడం వెనుక వున్న రహస్యాలను ఛేదించాలి. ‘జై మీమ్ జై భీమ్’ అనే నినాదాన్ని మజ్లిస్ ఎంపీ ఓవైసీ పార్లమెంటులో అనకముందునుండే దేశంలో ఓ ప్రయత్నం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఓ వర్గం వారిపై స్థానిక పరిస్థితుల ఆధారంగా జరిగే ప్రతిఘటనకు మతం రంగు పులుముతున్నారు. అఖ్లాఖ్ హత్య, పెహలూఖాన్ వంటి వారిపై జరిగే హత్యల గురించి దేశమంతా అందరికీ తెలుస్తుంది. కానీ వినాయక్ ప్రకాశ్, రవి పూజారి, వరంగల్ సత్యనారాయణ పూజారి, చందన్ గుప్తా, రూప్‌త్యాగి, బిర్జు మాదిగ వంటి హిందువుల హత్యలు మీడియాకు, పోలీసులకు, ఈ మేధావులకు ఎందుకు పట్టదన్నదే ఇపుడు ఉదయిస్తున్న ప్రశ్న!

అనుమానాస్పదంగా మరణించిన బిర్జు మాదిగ, ప్రతాప్‌గఢ్‌లో చంపబడిన వినాయక్ ప్రకాశ్ దళితులన్న విషయం ఈ గ్యాంగ్‌లో ఎవరికి తెలుసు? వీళ్లను ఎవరు చంపారో చెప్పగలరా? ఇదేనా ‘జై భీం జై మీమ్’కు అర్థం. వాళ్ల హత్యల ప్రస్తావన వచ్చినపుడు రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ ఎందుకు ప్రశ్నించాడు? పార్లమెంటులో ఓవైసీ ఎందుకు వకాల్తా పుచ్చుకోడు? రామచంద్ర గుహ ఎందుకు చరిత్రతో జోడించి చెప్పడు? భావస్వేచ్ఛ, మాబ్ అంచింగ్ అంటూ దుష్ప్రచారం చేసేవాళ్లు తమను తాము గొప్ప సెక్యులరిస్టులుగా భావిస్తారు. 

వాళ్ల రచనల్లో హిందుత్వకు, జాతీయవాదానికి ఎందుకు స్థానం ఉండదు? ఇందులో కొందరిది చీప్ పాపులారిటీ కూడా ఓ ఎత్తుగడ. వాళ్లకు అవార్డులిస్తే ఎవరు పట్టించుకుంటారు? దాన్ని వాపస్ ఇస్తూ, నరేంద్ర మోదీని తిడితే అది దేశ వ్యాప్త ప్రచారం అవుతుంది. వారి భావస్వేచ్చ ప్రకారం ఆజం ఖాన్ ఎన్ని భూ ఆక్రమణలు చేసినా ఏమీ అనరాదు. అదీ పేద ముస్లిం రైతులను మోసం చేసినా సరే. జవహర్ యూనివర్సిటీ-రాంపూర్ విషయంలోనే రైతులు ఆజంఖాన్‌పై గవర్నర్ రాంలాల్‌కు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇపుడు ఆజంఖాన్‌పై చట్టం చర్యలు తీసుకుంటే అది ముస్లింలపై దాడిగా, మాయావతి సమీప బంధువుల అక్రమాస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంటే దానిని దళితులపై దాడిగా చిత్రీకరిస్తారు. రాహుల్, సోనియాలు నేషనల్ హెరాల్డ్ కేసుల్లో బెయిల్‌పై ఉంటే దానిని సెక్యులరిజంపై దాడిగా అభివర్ణిస్తారు. ఆరోపణలపై జైల్లో వున్న వరవరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబా నిర్బంధాన్ని భావస్వేచ్ఛకు సంకెళ్ళుగా చెప్పే ‘ఎర్ర’మెదళ్లను ఎవడు బాగుచేయాలి?

తెలుగునాట ఈ మేధావులు ఓ కొత్త స్టంట్‌కు తెరలేపారు. ఎవరు అవునన్నా కాదన్నా వారు అవార్డులు దక్కించుకుంటూనే ఉన్నారు. కేంద్రం ఆధారంగా నడిచే సంస్థల్లో పదవులు పొందుతూనే ఉన్నారు. కరడుగట్టిన కమ్యూనిస్టులు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చుట్టూ తిరుగుతూ తమ ప్రాపకం నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గోరాశాస్ర్తి శత జయంతి వేడుకే అందుకు ఉదాహరణ. జాతీయవాదాన్ని నిండుగా గర్భీకరించుకున్న ఉపరాష్ట్రపతి కి అందరూ ఒక్కటే. కానీ ఈ అవకాశవాద విజ్ఞులు ఆయనను కేంద్రంగా చేసుకొని తమ పేరు నిలబెట్టుకుంటున్నారు.

 వాళ్లే అవసరమైతే ఈ పేరును వాపస్ చేసి తమ నిరసన తెలియజేస్తారు. అందుకే ఈ దేశంలో డెబ్బై ఏళ్ళనుండి జాతీయవాదులకు జరిగిన అన్యాయం అంత ఇంతా కాదు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం, జాతీయవాద సంస్థలు- ‘సూడో సెక్యులర్, అవార్డు వాపస్ గ్యాంగ్’లకు పదవులు, పురస్కారాలు ఇవ్వడం మానుకోవాలి. ఈ దేశంలోని కొంతమంది జాతీయవాదులనైనా గుర్తించాలి. ఎందుకంటే భవిష్యత్తులో వా పసు ఇవ్వడానికైనా అవార్డు ఉండాలి కదా! లేకపోతే సూడో సెక్యులర్ మేధావులు జాతీయవాదాన్ని సహించరు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయభావాన్ని జీర్ణించుకోలేక ఒక మతాన్ని టార్గెట్ చేసిన శక్తులు, విదేశీ శక్తుల ప్రోత్సాహంతో కుట్రలు చేస్తున్నాయి. ఇపుడు దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉంది- ఒక్క హిందువులకు తప్ప.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *


ఈ దేశంలో గత డెబ్బయి ఏళ్ళ నుండి ‘లెఫ్ట్ లిబరల్ మీడియా’ ప్రజల మేధస్సును పాలిస్తోంది. వాళ్ళు చెప్పిందే వార్త. కానీ నేడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, సోషల్ మీడియా అవతారం విస్తృతంగా, విశృంఖలంగా కొనసాగుతున్నది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్.. వంటివి ఇపుడు జనం చేతిలోకి వెళ్లాయి. గతంలో గొప్ప జర్నలిస్టులుగా ‘తాతాచార్ల ముద్ర’ వేసుకొన్న కొందరు మేధావుల అభిప్రాయమే సమాజ అభిప్రాయంగా చలామణి అయ్యేది. 

కానీ ఇపుడు ‘సోషల్ మీడియా’ వల్ల ప్రతివారూ రచయితలు, వ్యాఖ్యాతలు, విమర్శకులు అయ్యారు. అయితే దీని హద్దులు దీనికున్నా, విస్తృత ప్రచారం, ఉద్వేగాలు, ఉద్దేశాలతో సోషల్ మీడియా ప్రజలను ప్రభావితం చేస్తున్నమాట వాస్తవం. గత వారం ఓ ఆసక్తికర సంఘటన అనేక కొత్త వివాదాలకు కారణమైంది. ఇటీవల సామాజిక మాధ్యమాలు అభిప్రాయాలకు, దూషణ పర్వాలకు వేదికలుగా మారుతున్నాయి. తమకిష్టమైన నాయకులను ఎవరైనా అకారణ ద్వేషంతో దూషిస్తే తట్టుకోలేకపోవడం అందరికీ తెలిసిందే. 

ఆ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్‌ను 19 ఏళ్ళ హిందూ యువతి రిచాభారతి పటేల్ ‘షేర్’ చేసింది. ఈ యువతి జార్ఖండ్‌లోని రాంచీ దగ్గరున్న పిటోరియా ప్రాంతానికి చెందింది. ఆమె ‘షేర్’ చేసిన పోస్టు పవిత్ర ఖురాన్‌ను విమర్శించే విధంగా వుందని పిటోరియా అంజుమన్ ఇస్లామియా అనే సంస్థ కోర్టుకు వెళ్లింది. రాంచీ సివిల్ కోర్టు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మనీష్ కుమార్ ఆమెకు బెయిల్ ఇచ్చే సందర్భంలో పెట్టిన ఓ షరతు ఇపుడు రాజకీయంగా దుమారం రేపుతున్నది. రిచా భారతి ఓ మతానికి వ్యతిరేకంగా పోస్ట్‌ను ‘షేర్’ చేసినందున ఆమెకు బెయిల్ ఇవ్వాలంటే జరిమానాతోపాటుగా 5 ఖురాన్ ప్రతులను పంచాలని మెజిస్ట్రేట్ షరతు పెట్టాడు. 15 రోజుల్లోగా ఖురాన్ ప్రతులను కొని, అందులో ఒకటి పిటోరియా అంజుమన్ ఇస్లామియాకు, మరో 4 ప్రతులు రాంచీ పరిసర ప్రాంతాల్లోని గ్రంథాలయాలకు వితరణ చేసి రశీదులను కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశించాడు. 

ఆ అమ్మాయి మాత్రం తాను రెండు రోజుల జైలుశిక్షను అనుభవిస్తానే తప్ప ఖురాన్ ప్రతులను పంచలేనని కోర్టుకు చెప్పింది. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్తానన్నది. ఓ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనే ఉద్దేశంతో ఆ యువతికి న్యాయాధికారి అ లాంటి షరతు పెట్టి ఉండవచ్చు. కానీ ఇపుడు దేశంలోని ‘హిందీ బెల్టు’లో ఇది పెద్ద చర్చకు దారితీసింది.

సోషల్ మీడియాలోని వ్యాఖ్యలకు శిక్షలు వేయడం మొదలుపెడితే ఈ దేశ అధికార యంత్రాంగం మొత్తం అందులోనే నిమగ్నం కావాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. భారీ జనాభా వున్న ఈ దేశంలో చర్య జరిపేవారు సంయమనం పాటించాలి. చర్య జరిపే వర్గాలు ప్రతిచర్యను ఓర్చుకోవు. అక్కడే ‘సంతుష్టీకరణ’ మొదలైంది. దానికే ‘లౌకికవాదం’ అనే ముద్దుపేరు తగిలించి ఇన్నాళ్లూ పబ్బం గడిపారు. ఇపుడు తిరుగుబాటు మొదలై ప్రతి చర్య చేసేసరికి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ దేశ హిందువులు వౌనంగా వుండాలనే ఉదార భావనను ఆదర్శంగా స్వీకరించాలని కుహనా లౌకికవాదుల ఆశ. డెబ్బయి ఏళ్ళ నుండి అది ఓ ఆదర్శంలా, పవిత్ర కార్యంలా కొనసాగించారు. 

ఇటీవల రాజకీయ మార్పుల వల్ల జాతీయభావం ఉన్నవాళ్లు నోరుతెరిచి మాట్లాడ్డం లుటియన్ మీడియాకు, మేధో ఉగ్రవాదులకు రుచించడం లేదు. ఇలాంటి బెయిల్ షరతులు రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా సెక్యులరిజం అమలులో వి కృత దశ. ‘రాముడికి ఎంతమంది తండ్రులని అర్థం వచ్చేటట్లుగా మాట్లాడిన ఓ రాజకీయ పార్టీ నేతకు రామాయణం చేతికిచ్చి దాన్ని క్షుణ్ణంగా చదవాలని ఆదేశిస్తే అమలు జరుగుతుందా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతడు చదివేందుకు సిద్ధపడినా ‘్ఫత్వాలు’ జారీ చేయకుండా అడ్డుకొంటారా? హిందూ దేవుళ్లను నిందిస్తూ, ఇతిహాస, పురాణాలను దూషిస్తూ రచనలు చేసే మేధో ఉగ్రవాదులకు ఆయా హిందూ గ్రంథాలను చదవమనో, దేవాలయాలకు వెళ్లి సేవ చేయాలనో ఆదేశిస్తే వారిలోని ‘నాస్తిక, హేతువాద, కుల వాద, మార్క్స్‌వాద, మావోవాద, ద్రావిడవాద..’ పవిత్రతకు భంగం కలగదా?

హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ మత మార్పిడులు చేస్తున్న ముఠా నాయకులకు ఇది వర్తింపజేస్తే అపుడు ఇదే గ్యాంగ్ ‘్భరతదేశ సెక్యులరిజం’ నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టదా? తన తండ్రి లంకేశ్ మరణిస్తే, వారి వీరశైవ సంప్రదాయం ప్రకారం అక్కడి వాళ్లెవరో అతని మెడలో లింగం, నొసట విభూతి పూస్తే తీవ్రంగా ప్రతిఘటించి వాటిని తొలగించిన గౌరీ లంకేశ్ అనే రచయిత్రి చేష్టలను గొప్ప సెక్యులరిజంగా భావిస్తాం. 

విభూతి, లింగధారణను ద్వేషిస్తూ బసవేశ్వరుని పేరుతో హిందూ మతంపై దుమ్మెత్తిపోయడం విచిత్రమైన లౌకికవాదం! ‘మతోరుభగన్’ (వన్ పార్ట్ విమెన్) పేరుతో పుస్తకం రాసి తమిళనాడులో పెరుమాళ్ అనే రచయిత హిందూ ధర్మాన్ని తీవ్రంగా అవమానపరిస్తే అతని చేతికి కంబ రామాయణం ఇచ్చి, దాన్ని దేశమంతా తిరిగి చెప్పాలని ఎవరైనా డిమాండ్ చేస్తే మన దేశ సెక్యులర్ పాతివ్రత్యానికి ఎంత భంగం వాటిల్లేదో? శివలింగాలపై మూత్రం పోస్తానని చెప్పిన గొప్ప రచయిత యం.యం.కల్బుర్గి నెత్తిన నాలుగు రోజులు శివలింగం పెట్టి కన్నడ ప్రాంతం అంతా తిప్పివుంటే మన లౌకికవాద సిద్ధాంత నిరూపణ ఇంకా జరిగేది కదా? ఉగాది రోజున పంచాంగాన్ని అవమానిస్తూ డిబేట్స్ పెట్టడం, దసరారోజు అమ్మవారిని దూషిస్తూ ‘షో’లు చేసే తెలుగు టీవీ చానళ్ళకు పంచాంగాలను నెత్తినపెట్టి అమ్ముకొని రమ్మంటే మన సెక్యులర్ మేధావులు గుండె ఆగి చచ్చేవారు కదా? అయితే ఈ దేశంలో హిందువులను, హిందు గ్రంథాలను తిట్టే అపరిమిత అధికారం ఎవరికైనా వుంది అని చెప్పే హక్కే- వికృత సెక్యులరిజం! 

ఒకవేళ రిచా భారతి మాదిరి హిందువులను, హిందూ గ్రంథాలను తిట్టేవారికి జ్ఞానోదయం కలిగించేందుకు ఇలాంటి శిక్షలు వేయడం మొదలుపెడితే గీతాప్రెస్ వాళ్ల రామాయణ, భారత, పౌరాణిక గ్రంథాలకు కావలసినంత గిరాకీ. ఎందుకంటే అంత బురద రోజూ హిందుత్వపై చల్లుతారు. మేధావులుగా ముసుగేసుకున్న వాళ్లే కాకుండా ఎందరో నాయకులూ ఇలాంటి నోటి దురద ఉన్నవారే. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో లౌకికవాదం అంటే ఒక మతాన్ని సంతుష్టీకరణ చేయడం!

చైనాను మనసారా పొగిడేవారే ఈ దేశంలో హిందువులపై యుద్ధం చేస్తామంటారు. 2013, 2014 సంవత్సరాల్లో ఉరుంక్వే, కుమ్మింగ్ అనే చైనాలోని ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన చేసి, వారి బాధలను అంతర్జాతీయ సమాజానికి తెలిపారు. 2015లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముస్లింలపై కఠిన చర్యలకు ఉపక్రమించి పుస్తక దుకాణాల నుండి ఖురాన్, ఇతర ఇస్లాం గ్రంథాలను తొలగింపజేశాడు. హన్ చైనీయులకు, వాఘర్ ముస్లింల మధ్య సంప్రదాయ ఘర్షణలు జరిగితే చైనా ప్రభుత్వం గడ్డాలు పెంచడంపై, బురఖాలు ధరించడంపై తీవ్ర ఆంక్షలు విధించింది. 

భారత్‌లో మెజారిటీ హిందువులకు రాజ్యాంగం చెప్పని శిక్షలు విధిస్తున్నా, ఇక్కడ లౌకికవాదం ప్రమాదంలో ఉందని ప్రచారం చేస్తారు. చైనా తన జాతీయతను కాపాడేందుకు అక్కడి కొందరు జాతి వ్యతిరేక శక్తులను నిరోధిస్తే గొప్ప చర్యగా, ఆదర్శంగా ఇక్కడి సూడో సెక్యులర్ శక్తులు అభివర్ణిస్తాయి. ఇక్కడ లౌకికవాదం పేరుతో దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాలకు మద్దతుగా ఇవే శక్తులు నిలబడడం విడ్డూరం. రిచా భారతి ఫేస్‌బుక్ పోస్ట్‌మీద వివాదం ఈ రోహింగ్యా ముస్లింలదే. ఈ ‘వికృత సెక్యులరిజం’ తారుమారవకపోతే ప్రతిచోటా రిచా భారతి లాంటి యువతీ యువకులు తిరగబడతుతూనే ఉంటారు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *


‘‘ఈ ఎన్నికల్లో మనం పోరాడింది ఒక పార్టీతో కాదు.. నిష్పాక్షిక వ్యవస్థలుగా మనం కీర్తించుకుంటున్న సంస్థలన్నింటినీ విపక్షాలపైకి ఎక్కుపెట్టారు.. అన్ని వ్యవస్థలనూ భాజపా, ఆరెస్సెస్ పూర్తిగా ఆక్రమించి ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచాయి’’-అంటూ గత వారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కాడి’ కిందపడేసి వెళ్లిపోయాడు. దీన్ని కొందరు ‘త్యాగం’గా చిత్రీకరిస్తే, మరికొందరు ‘వ్యూ హం’గా చెప్తున్నారు. 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని అర్ధాంతరంగా అనాథను చేసి రాహుల్ వెళ్లిపోయారని ఢిల్లీలో గాంధీ - నెహ్రూ కుటుంబ వీరాభిమానులు నిరసన తెలపగా, మరికొందరు నాయకులు రాజీనామాల బాట పట్టారు.

1885 ఏవో హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్‌ను స్వాతంత్య్ర సమరంలో అందరూ ఆదరించారు. డబ్ల్యూ.సి.బెనర్జీ నుండి రాహుల్ గాంధీ వరకు ఎందరో నేతలు ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు. గోపాలకృష్ణ గోఖలే, మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ, పట్ట్భా, ఇందిర, సంజీవరెడ్డి, కాసు, నిజలింగప్ప, సంజీవయ్య, శంకర్ దయాళ్ శర్మ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా, రాహుల్ వంటివారెందరో ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రచారకర్తగా వచ్చాక రెండు లోక్‌సభలు (2014, 2019) ఘోర పరాజయం ఎదురుకాగా, 41 అసెంబ్లీ ఎన్నికల్లో 33సార్లు ఆ పార్టీ ఓటమి చెందింది. 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైంది. అయినా గాంధీ-నెహ్రూ కుటుంబ భజన బృందాలు రాహుల్‌ను ‘త్యాగమూర్తి’గానే కీర్తిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ‘కామరాజ్ ప్లాన్’గా రాహుల్ రాజీనామాను కీర్తికిరీటంగా మార్చేస్తున్నాయి. రాహుల్‌కున్న రాజకీయ అపరిపక్వతను గురించి చెప్పలేని వంధిమాగదులు, పదవి లేకుండా బతకలేని వృద్ధ జంబూకాలు కాంగ్రెస్ పార్టీ పతనాన్ని అడ్డుకోలేకపోతున్నారు. 

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ప్రధాన పాత్రధారుడైన మోతీలాల్ వోరా లాంటి వీరవిధేయులు, కరడుగట్టిన మతతత్వవాదులైన గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్ లాంటివాళ్లతో కోటరీ నిర్మించుకొని, ముస్లిం సంతుష్టీకరణ నుండి బయటపడకుండా బాల్య చాపల్యం ప్రదర్శించే రాహుల్ అధ్యక్షతన పార్టీ ఎలా నిలదొక్కుకుంటుంది? దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ లాంటివాళ్లకు అప్పజెప్పినా రాహుల్ కన్నా గొప్పగా బ్యాటింగ్ చేస్తారు. కానీ కుటుంబ ఆరాధనకు కాంగ్రెస్ నాయకులు అలవాటు పడ్డారు. ఆ జబ్బును దేశం నిండా అంటించారు. అందుకే రాష్ట్రానికో కుటుంబం రాజ్యమేలుతోంది. కేటీఆర్‌లా స్వయం ప్రతిభ ఉంటే ఫర్వాలేదు కానీ, లోకేశ్, రాహుల్ లాంటి వాళ్లను ప్రజలు తిరస్కరించారు. రాజకీయాలు సినిమాల్లాగా ‘ఫేషియల్’ చేసుకొని నటించేవి కావు.

రాహుల్ ఫెయిల్యూర్ అంతా ‘అవగాహన లేమి’. రోహిత్ వేముల ఆత్మహత్యను నరేంద్ర మోదీపైకి నెట్టేందుకు చేసిన ప్రయత్నం మొదలుకొని గబ్బర్ సింగ్ టాక్స్ అనే పదం ఉపయోగించేవరకు అన్నీ వ్యూహాత్మక తప్పిదాలే. రహస్యంగా ముస్లిం వౌల్వీలను కలిసి, బయట ‘జంధ్యం’ దాల్చిన బ్రాహ్మణుడని చెప్పడం వల్ల ఏ సంకేతం రాహుల్ ఇచ్చాడో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్పలేరు. చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నాయకుల మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం పొందాడు. చివరకు నిందంతా ఆరెస్సెస్‌పై వేసి అస్త్ర సన్యాసం చేయడం మ రో తప్పిదం! గతంలో ఎం దరో కాంగ్రెస్ నేతలు ఆరెస్సెస్‌ను అభిమానించేవారు. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తే చెప్పాలి గానీ ఏమీ లేకుండా దిగ్విజయ్ సింగ్‌లా మాట్లాడితే ఎలా?

కాంగ్రెస్ వాదులైన పి.వి.నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీని భాజపా ఎందుకు వాడుకుంటుందో ఇప్పటికీ కాంగ్రెస్‌కు సోయిలేదు. సర్దార్ పటేల్, నేతాజీల్లోని దేశభక్తిని కాంగ్రెస్ ఇప్పటికీ కనిపెట్టలేదు. వౌలానా అబుల్ కలాంకు కాంగ్రెస్‌లో వున్న గౌరవం నేతాజీ, పటేల్‌కు ఎందుకు ఉండదో వారికి అర్థం కాదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థులను రెచ్చగొట్టే సల్మాన్ ఖుర్షీద్‌కు వున్న ప్రాధాన్యత దేశాన్ని ప్రేమించే కరణ్‌సింగ్‌కు ఉండదు. స్వాతంత్య్రం కన్నా ముందు గాంధీని, నేతాజీలను అభిమానించిన కాంగ్రెస్, స్వాతంత్య్రానంతరం నెహ్రూను ఆరాధించడం మొదలుపెట్టింది. నెహ్రూ సంతుష్టీకరణ విధానాన్ని ఆదర్శంగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రాధాన్యమైన ఎన్నో విషయాల్లో రాజీపడింది. నెహ్రూ కాలంలో కమ్యూనిస్టులు గోడదూకి ఇందులోకి చేరి, తమ వామపక్ష భావాలను పరిపాలనలో ప్రవేశపెట్టిన చైనా, రష్యా వారసులు కాంగ్రెస్‌ను శాపగ్రస్తం చేశారు. కృష్ణమీనన్ మొదలుకొని పి.చిదంబరం వరకూ అంతా ఆ బ్యాచే.

ఇదంతా వదిలేసేసి ఆరెస్సెస్‌పై నాలుగు రాళ్లేసి వెళ్లిన రాహుల్‌ను చూస్తే జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేం. గతంలో సోనియాగాంధీ అధ్యక్షురాలయ్యాక ఈ ‘సంతుష్టీకరణ’ కాంగ్రెస్‌లో విశృంఖలమైంది. ఆఖరుకు ‘మతహింస బిల్లు’ తెచ్చి హిందువులను అణచివేయాలనే దురాలోచన వచ్చింది. రాజేంద్రకుమార్ సచార్ కమిటీ పేరుతో ‘మైనార్టీ సంతుష్టీకరణ’ ఈ దేశ హిందువుల్లో లోలోపల ఆగ్రహవేశాలు రగిల్చింది. దాని పర్యవసానమే గుజరాత్‌లో ‘గోద్రా ఘటన’, అనంతర అల్లర్లు. మతహింస బిల్లు, సచార్ కమిటీ నివేదిక కన్నా ముందే గుజరాత్ అల్లర్లు జరిగాయి. సంతుష్టీకరణను హిందువులు హర్షించడం లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ గ్రహించలేదని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. తామంతా సమానంగా ఉండాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ హద్దులు మీరిన సంతుష్టీకరణ వెయ్యేళ్ల ‘హిందూ బానిసత్వం’పై కారం చల్లాయి. దానిని అడ్డుకొనే విరాట్ రూపమే మోదీ అవతారం.

ఆరెస్సెస్‌తో రాహుల్ ఎందుకు యుద్ధం చేయాలి? ఈ దేశంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్‌కు ఆరెస్సెస్ అవసరం ఎంత వుందో ఈ సంఘటన చెబుతుంది. 1921లో రాజద్రోహం కేసుపై బ్రిటీషువారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవ్ రావ్ హెడ్గేవార్‌ని నిర్బంధించింది. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని ఓ సంవత్సరం కఠిన కారాగారశిక్ష విధించింది. అదే జైలులో ఖిలాఫత్ ఆందోళనలో పాల్గొన్న ఇమానుల్లా ఖాన్ ఉన్నాడు. ఖాన్ ఉదయానే్న అందరూ నిద్రిస్తున్న వేళ బిగ్గరగా ఖురాన్ చదివేవాడు. ఎవరు చెప్పినా కావాలని మరింతగా బిగ్గరగా పఠించేవాడు. హెడ్గేవార్ సలహాతో ఖైదీగా వున్న రాధామోహన్ అనే ఆర్య సమాజ కార్యకర్త మరుసటి రోజునుండి రామాయణం బిగ్గరగా చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు గానీ ఇమానుల్లా ఖాన్‌కు తత్త్వం బోధపడలేదు. మరుసటిరోజు నుండి ఖాన్ లోలోపల ఖురాన్ పఠించేవాడు. ఇదే ఆరెస్సెస్ తత్త్వం. ఇటీవల కలకత్తా వీధుల్లో హనుమాన్ చాలీసా పారాయణం ఎందు కు మొదలయ్యింది?

 కలకత్తా నగరం భారీ ట్రాఫిక్ వుండే నగరం. అక్కడ మమత ప్రభుత్వ అండతో ఒక మతం వారు రోడ్లపై ప్రార్థనలు చేస్తున్నారు. అయినా ఓట్ల కోసం అదేదో తామే దగ్గరుండి జరపాల్సిన కార్యక్రమంలా మమత ప్రభుత్వం కొనసాగించింది. ఈ సంతుష్టీకరణకు వ్యతిరేకంగా ‘చాలీసా’ మొదలయ్యింది. స్వాతంత్య్రం రాక ముందూ వెనుకా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలపై ఇంత ప్రేమ చూపిస్తే రాజేంద్ర సచార్ కమిటీ మళ్లీ ఎందుకు వేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందడంలేదో ఆ మత పెద్దలు ఆలోచించాలి?
కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికైనా ‘సంతుష్టీకరణ’ వదలిపెట్టి ‘అందరూ ఒకే దేశ పౌరుల’ని గుర్తించాలి. అలాగే పార్టీని త్యాగగుణంగల కార్యకర్తలతో నింపే పనిచేయాలి. 

సైద్ధాంతిక నిబద్ధత గల రాం మాధవ్ లాంటి ఒక్క వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా చూపగలదా? ఆరెస్సెస్‌ను నిందించేముందు అందులోని ‘ప్రచారక్’ల్లోని త్యాగం ఒక్క కాంగ్రెస్ కార్యకర్తల్లో నింపగలరా? సాధారణమైన ఆరెస్సెస్‌లో ఓ పెద్దాయన మరణిస్తే, ముందున్న టెంట్‌లో సామాన్యుల్లా కూర్చొనే మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ లాంటి నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకులు ఎంతమంది? ఎండ్రకాయల్లా ఒకరినొకరు లాక్కొనే సంస్కృతి నుండి కాంగ్రెస్‌ను ఎవరు కాపాడాలి? ఏళ్లనుండి పదవులు వెలగబెట్టి, ధన సంపాదన చేసి, అధికారం పోగానే అవతలి పార్టీ తలుపు తట్టేవారు, శల్యసారథ్యంలో తమ కడుపున పుట్టే పిల్లలని తామే చంపుకునేవారిపై ఎవరు కొరడా ఝుళిపించాలి? కటిక దరిద్రంలో పుట్టిన నరేంద్ర మోదీనైనా, బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టిన అమిత్ షానైనా సిద్ధాంత బలంతో నియంత్రించగల శక్తి ఆరెస్సెస్‌లో ఉంది. అందుకే 56 ఏళ్ళ రాజకీయ జీవితంలో అధికారం అనుభవించింది స్వల్పమే అయినా సిద్ధాంతానికి కట్టుమడిన వాజపేయి లాంటి వ్యక్తిని ఈ డెబ్భై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చూపించగలదా?

హిందీ కూడా సరిగ్గా రాని ఓ ప్రచారక్‌ను అస్సాం పంపిస్తే మారు మాట్లాడకుండా వెళ్లి, అయిదేళ్లలో హిందీతోపాటు అస్సామీ కూడా అతను నేర్చుకుంటాడు. రాహుల్ ఇనే్నళ్లలో ఏం నేర్చుకున్నాడో రాజకీయ పండితులే విశే్లషించలేకపోతున్నారు. ఈరోజుకూ ఎన్నో ఘనమైన కార్యక్రమాలు చేసే ఆరెస్సెస్, భాజపా కార్యకర్తలు, నాయకులు తమ పేర్లు కూడా బయటకు తెలియనివ్వరు. కాంగ్రెస్ పార్టీ నుండి అలాంటి పునాదిరాళ్లను ఊహించగలమా? రాహుల్ ఇంకా ‘తెలియని వ్యాఖ్య’ చేస్తూ వెళ్లిపోయాడు. దేశమంతా ఆరెస్సెస్‌తో నిండిపోయిందా? అలా అయితే చారిత్రక కాంగ్రెస్, మీడియా, కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర ఎన్నో ప్రభుత్వ సంస్థలు కాంగ్రెస్- కమ్యూనిస్టులతో ఎందుకు నిండి ఉన్నాయి? జాతీయవాదానికి ఆయువుపట్టైన మహాభారతంలోని మహిళా పాత్రను (ద్రౌపదిని) అవమానించిన వ్యక్తి మోదీ ప్రభుత్వం నుంచి ‘పద్మ’ అవార్డు ఎలా పొందుతాడు? వారానికోసారి మోదిని పత్రికల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే ఓ పత్రికా రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎలా వశపరచుకొంటాడు? మొన్నటివరకున్న మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం ఇచ్చే ‘కబీర్ సమ్మాన్’ పురస్కారం నక్సల్స్‌ను సమర్థించే కె.శివారెడ్డి ఎలా పొందుతాడు? 

వామపక్ష వాదాన్ని భుజాలపై మోసే ప్రణయ్ రాయ్, రాజ్‌దీప్ సర్దేశాయ్‌లు తమ ప్రాపకాన్ని ఎలా సాగిస్తున్నారు? ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. ప్రభుత్వం దేశ భద్రత, సమానత్వం, జాతీయవాదం వంటి అంశాలపైనే కేంద్రీకృతం అయ్యేట్లు ఆరెస్సెస్ చూస్తోంది. కానీ రాహుల్ గాంధీ రాజకీయాలకు అడ్డుచక్రం వేసే పని ఆరెస్సెస్‌ది కాదు. ఇదేదీ గ్రహించకుండా సంఘ్‌ను తిడితే కొన్ని వర్గాల ఓట్లు గంపగుత్తగా పొందవచ్చని రాహుల్ భావిస్తే అది ఆయన రాజకీయ అనుభవ శూన్యతే. ఇప్పటికైనా ఎ.కె.ఆంటోనీ ఇచ్చిన రహస్య అంతర్గత నివేదికను కాంగ్రెస్ పఠిస్తే అదే పార్టీకి శ్రీరామరక్ష. లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత నిజమవుతుంది.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*13-07-2019 : శుక్రవారం*


‘‘రాజకీయ వేదికపై ఆక్రమించుకొన్న స్వార్థపరుల గుంపునుండి మన పార్టీని వేరుగా ప్రజలు భావించగలగాలి. పదవులను చేజిక్కించుకోవడమే మన లక్ష్యంగా వారు భావించకూడదు. మనది కొన్ని విలువల, సూత్రాలపై ఆధారపడి వున్న రాజకీయ పార్టీగా వారు గుర్తించాలి. పదవులు, హోదాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉన్మాదంగా ఎగబడేవారికి భాజపాలో స్థానం లేదు. మాకు సంబంధించినంత వరకు మేము ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం సాగించేందుకు కృతనిశ్చయులమై ఉన్నాం’’- ఈ మాటలన్నది భారతీయ జనతా పార్టీని తన భుజస్కంధాలపై మోసుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడైన అటల్ బిహారీ వాజపేయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తర్వాత భాజపా తిరుగులేని శక్తిగా అవతరించగానే ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధినేత అమిత్ షాలు ఒక్కో రాష్ట్రంలో జైత్రయాత్ర మొదలుపెట్టారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తప్ప అన్ని రాష్ట్రాల్లో భాజపా తన ప్రాతినిధ్యం నిలుపుకొన్నది.

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత రెండవ గేటు తెలంగాణలో తెరిచినట్లు స్పష్టం అవుతున్నది. తెలంగాణలో 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడంవల్ల భాజపా శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిన మాట వాస్తవం. అప్రతిహతంగా సాగుతున్న టిఆర్‌ఎస్‌ను గతంలోనే మహబూమ్‌నగర్‌లో భాజపా ఎదుర్కొన్నది. ఎస్.డి.ఇబ్రహీంను భాజపాకు చెందిన యెన్నం శ్రీనివాసరెడ్డి ఓడించాడు. దేవీప్రసాద్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచందర్‌రావు పరాజయం పాలుజేశాడు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె కవితనే ఓడించేసరికి భాజపా నాయకుల్లో సమరోత్సాహం, ఇతర పార్టీల నేతలకు ఆశలు చిగురిస్తున్నాయి. అంతేగాకుండా రేపు ప్రారంభమయ్యే భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోదీ వారణాసిలో ప్రారంభించనుండగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించి ఆ కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. ఇదంతా రేపు పార్టీని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా మలిచేందుకు చేస్తున్న ఏర్పాటుగా చెప్పవచ్చు.

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం 17 సెప్టెంబర్ 1948న విముక్తి కలిగింది. ఈమధ్యలో ఇక్కడి హిందువుల విమోచన పోరాటం స్వా తంత్య్ర పోరాటం కన్నా ఎక్కువైందిగా చెప్పవచ్చు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మతతత్వం, రజాకార్ల మతోన్మాదం కలగలిసిపోయి తెలంగాణ రక్తసిక్తమైంది. ఆ రజాకార్ల మరో రూపమే మజ్లిస్ పార్టీ అని భాజపా ఎప్పుడూ ఆరోపిస్తుంటుంది. అలాంటి మజ్లిస్‌తో చెట్టపట్టాలేసుకుంటూ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు తలొగ్గుతూ వచ్చాయి. ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే వాళ్లకు ఎదురొడ్డి నిలబడ్డాడు. 

తెరాస అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ సాధించే క్రమంలో మజ్లిస్ పార్టీ తెలంగాణాను వ్యతిరేకిస్తే ‘పాతబస్తీలో నీది పిడికెడు పార్టీ’ అంటూ గట్టిగానే బదులిచ్చాడు. 2014లో తెలంగాణ వచ్చాక ‘హిందూ-ముస్లిం’ల మధ్య పొరపొచ్చాలు రాష్ట్భ్రావృద్ధికి మంచివి కావన్న ఒక సదుద్దేశం కేసీఆర్ మనసులో ఉండొచ్చు. దానివల్ల మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీని అక్కున చేర్చుకున్నాడు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ఆశలు, బడ్జెట్‌లో మైనారిటీలకు పెద్దపీట, రంజాన్‌లో ఘనమైన ఇఫ్తార్లు, మహమూద్ అలీకి హోంమంత్రి లాంటి పనులు- కాంగ్రెస్‌ను మించి ‘సంతుష్టీకరణ’అనేది ఇక్కడి హిందువుల్లో కొంత మెరమెర మొదలైంది. 

ఇప్పటికీ హైదరాబాద్‌లో హిందువులకు అభద్రత ఉందని చాలామంది చెప్తుంటారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కో-ఆప్షన్ మెంబర్లు చాలామంది మైనారిటీలే ఎందుకయ్యారని సోషల్ మీడియా కోడై కూసింది. జెడ్పీటీసీ స్థాయి పదవులను అప్పనంగా మైనారిటీలకు కట్టబెడుతున్నారని చాలామంది టిఆర్‌ఎస్ నాయకులే గొణుక్కున్నారు. మహమూద్ అలీ తెలంగాణ హోంమంత్రిగా వున్నా అతను సాత్వికుడే గాక ‘గంగ జమునా తహెజీబ్’కు సరిపోవచ్చు. కానీ అతనిపై ఓవైసీ ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు. మజ్లిస్‌కు పట్టు ఉన్న ప్రాంతంలో దళితులపై దాడి జరిగితే అంతగా ప్రచారం కాదు. మైనారిటీలపై ఎవరైనా దాడి చేశారంటే అది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని జనం గమనిస్తున్నారు.

నిజానికి కెసిఆర్‌కు మజ్లిస్ విషయాల్లో ఎలాంటి సంబంధం లేకున్నా దాని ప్రభావం టిఆర్‌ఎస్‌పై పడే అవకాశం వుంది. హిందుత్వ ఆచరణలో కేసిఆర్‌ను మించి దేశంలో ఏ నాయకుడూ లేడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ మందిరం కట్టాక, ప్రభుత్వ సొమ్ముతో యాదాద్రిని నిర్మిస్తున్నది కెసీఆరే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ‘హిందుగాళ్ళు బొందుగాళ్లు’ అన్న ఒక్క మాట ఉత్తర తెలంగాణ అంతటా ప్రభావం చూపించింది. ఆఖరుకు కవిత, వినోద్‌కుమార్ లాంటి టిఆర్‌ఎస్ అగ్ర నాయకులు సామాన్యులైన ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ చేతిలో మట్టిగరిచారు. దీంతో ఇపుడు కాంగ్రెస్, తెదేపా నాయకులు, కెసీఆర్‌పై కోపం వున్నవాళ్లంతా భాజపావైపు చూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనర్దన్, ఇనగాల పెద్దిరెడ్డి వంటివారు భాజపావైపు అడుగులు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం చాలావుంది. రేపు చంద్రబాబుతో వున్న బంధాలు తెగితే రేవంత్‌రెడ్డి కూడా భాజపాలోకి రావచ్చు. త్రిపుర, అస్సాంలలో ఇతర పార్టీల నేతలతో భాజపా తన ఫార్ములా ప్రయోగం చేసింది. తెలంగాణలో ఆ కొరత ఏమీ లేదు. ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపిలో పనిచేసిన ఎందరో ఇతర పార్టీల్లో ఉన్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ‘చెల్లెలికి ఎక్కువ- అక్క కు తక్కువ’ అన్నట్లు అ య్యింది. రాహుల్ అస్త్ర సన్యాసం చేసి, రాబోయే అ సెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. భాజపా 2023 నాటికి అయోధ్యలో రామాలయ నిర్మాణం లాంటి బృహత్తర కార్యక్రమం మొదలుపెడితే ప్రతిపక్షాల ఐదేళ్ళ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే. రేపుఎస్పీ, బిఎస్పీ వంటి పార్టీలు ఎన్‌డిఏలో చేరినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆపరేషన్ మొదలైంది. మునుపటిలా చక్రం తిప్పడం చంద్రబాబుకు సాధ్యం కాదు. కమ్యూనిస్టులు ఓటమిని సమీక్షించుకొనే సరికి మరో ఎన్నికలు వస్తున్నాయి. కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో భాజపా చెప్పుకోదగిన స్థాయిలోవుంది. ఇది 2024 ఎన్నికల్లో భాజపాకు లాభం చేకూర్చేదే. మన దేశంలో రాజకీయంగా ‘సెంటిమెంట్’ ఎంత బలమైందో తెలియనిది కాదు. తెలంగాణ సెంటిమెంట్ ముందు యూపిఏ ప్రభుత్వం సాగిలపడింది. అలాగే ఇక్కడ సంతుష్టీకరణ విధానమే భాజపాకు బలం. 

బోఫోర్స్ స్కామ్ రాజీవ్ గాంధీకి ఎంత అప్రదిష్ట కలిగించిందో, షాబానో కేసులో ఆయన అవలంబించిన సంతుష్టీకరణ విధానం అంతకన్నా ఎక్కువ పతనానికి కారణమైంది. తెలంగాణలో భాజపాకు ఏ రాష్ట్రంలో లేని విధంగా నక్సలైట్లతో పోరాడిన చరిత్ర ఉంది. సైద్ధాంతికంగా విశ్వవిద్యాలయాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలకు ఎదురొడ్డి నిల్చింది ఏబీవీపీ విద్యార్థులే. 1970 దశకంలో ఓయూలో తీవ్రంగా ప్రవర్తించిన జార్జిరెడ్డి లాంటి వామపక్ష విద్యార్థి నాయకుడిని నిలువరించారు. కె.వి.రఘునాథరెడ్డి, యస్.జైపాల్‌రెడ్డి వంటి నాయకులను ఎదురించారు. వరవరరావు, బాలగోపాల్, కొడవగంటి కుటుంబరావు, త్రిపురనేని మధుసూదన్‌రావు వంటి అధ్యాపక మేధావులను నిలువరించారు. 1973లో ఆనాడు నగర ఏబివిపి కార్యదర్శిగా వున్న ఎన్.ఇంద్రసేనారెడ్డిని కత్తులతో పొడిచారు. 1975లో ఏబివిపి కార్యకర్త ఎం.పుల్లారెడ్డిపై రివాల్వర్ పేలింది. 1974లో నక్సల్స్‌ను ఎదిరించినందుకు ఏబీవీపీకి చెందిన రాజు, బ్రహ్మం, భాస్కరరరావు, ఇ.రామ్మోహన్‌రావులను తీవ్రంగా కొట్టారు. 1981లో ఏబివిపి కార్యకర్త ఏచూరి శ్రీనివాస్‌ను హత్యచేశారు. ఆనాడు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో కమ్యూనిస్టు రాజ్యం సాగుతుండేది. 26 జనవరి 1980 నాడు కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ జాతీయ పతాకం ఎగరేస్తుంటే ఓ రాడికల్ విద్యార్థి జెండాను కాల్చేందుకు ప్రయత్నిస్తే అక్కడే ఏబివిపి నాయకుడు సామా జగన్‌మోహన్‌రెడ్డి పతాకాన్ని విడిపించి ఎగరేసి ‘్భరత్‌మాతాకీ జై’ అంటూ నినదించాడు. 

ఈ కేసు నడుస్తుండగా 1982 ఏప్రిల్ 29న కోర్టునుండి వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని నక్సల్స్ దారుణంగా చంపారు. ఏబీవీపీ నేతల్లో ఎంతోమంది నక్సల్స్ బాధితులే. వీరిలో కొందరు ప్రాణాలు పోగొట్టుకోగా, ఇంకొందరు తమ సర్వస్వం కోల్పోయారు. 1986లో ప్రస్తుత భాజపా జాతీయనేత పి.మురళీధర్‌రావు ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అలాగే రామచంద్రరావు..! పాతబస్తీలో అల్లర్లకు ఎదురొడ్డి నిల్చిన టైగర్ నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి అజేయులు,అమరులు. ఇదంతా భాజపాకు తెలంగాణలో వున్న చరిత్ర.
ఆర్‌ఎస్‌ఎస్ శాఖలో సంస్థాగతంగా బలంగా కన్పించినా సమయం ఇచ్చేవారు తగ్గిపోయారు. ఏబివిపి పరిస్థితి ఘోరంగా ఉంది. ఇవన్నీ సరిచేసుకుంటే కార్యకర్తల నిర్మాణం జరుగుతుంది. 

బలంగా, నిజాయితీగా వున్న నాయకులను పార్టీలకు ఆహ్వానించి వారిని ఉన్న నాలుగు గ్రూపుల్లో చేర్చుకోకుండా పార్టీని ఏకోన్ముఖంగా నడిపించాలి. బలంగా వాదన వినిపిస్తున్న వారిని విస్మరించవద్దు. కేసిఆర్‌లా మేధావులను, సిద్ధాంతవేత్తలను, కవులను గుర్తించాలి. కొన్ని ప్రచార, ప్రసార మాధ్యమాల విషపు రాతల్ని, కూతల్ని నిలువరించేలా ప్రణాళిక ఉండాలి. కాంగ్రెస్ కల్చర్ నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కేసిఆర్‌లా ‘తన - పర’ అనే రాజకీయ వైఖరితో స్పష్టంగా ఉండాలి. తన వెంట నడిచి, సిద్ధాంతం వున్న వాళ్లను కెసిఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో కొందరికైనా మంచి గుర్తింపు ఇచ్చాడు. ‘జాతీయవాద భావజాలం’ వున్న వ్యక్తులను భాజపా రాష్ట్ర నాయకత్వం గుర్తించడంలేదనే ఆరోపణ ఉంది. చుక్కా రామయ్య, ప్రొ.కోదండరాం వంటి వామపక్ష భావజాలం వున్న వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం మానుకోవాలి. పంచెగట్టుకున్న వాళ్లంతా జాతీయవాదులే అనుకోవడంవల్ల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటివారు ఆంధ్రా నాయకుల సందుల్లోకి దూరుతున్నారు. మరోవైపు జాస్తి చలమేశ్వర్ లాంటివారు మోదీని దోషిగా నిలబెట్టేందుకు చూస్తున్నారు. అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. రఘునందన్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, రావుల శ్రీ్ధర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి వంటివారిని మరింత ప్రోత్సహించాలి. 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికన్నా ఉత్తమంగా బ్యాటింగ్ చేస్తున్న డా. లక్ష్మణ్‌కు వెన్నుదన్నుగా నిలవాలి. ఇతర పార్టీలనుండి వచ్చేవాళ్లను కలుపుకుపోవాలి. కేంద్ర మంత్రిగా వుంటూ సమర్థుడైన కిషన్‌రెడ్డిని వినియోగించుకోవాలి. సంఘ్‌ను విస్మరించవద్దు. ఇంద్రసేనా, దత్తాత్రేయ, చింతల, ఎన్‌ఎస్‌ఎస్ సేవలను వినియోగించుకుంటూనే రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను రంగంలోకి దింపాలి. పరివార సంస్థల నిర్వహణలో వున్నవారి పేర్లు కూడా తెలియని అజ్ఞానంలో భాజపా నాయకులు ఉండకూడదు. శాంతకుమార్ లాంటి వ్యక్తులను కాపాడుకోవాలి. పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. అప్పుడే ‘అంధేగా ఛటేగా.. సూరజ్ నికలేగా.. జార్ కమల్ ఖిలేగా..’ అన్న వాజపేయి మాటలు నిజం అవుతాయి.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*05-07-2019 : శుక్రవారం*


ఓ కపట భక్తుడు తిరుమలలో స్వామిని ప్రార్ధిస్తూ.. ‘‘వచ్చే ఏడాదిలోగా ఉచితంగా ఇల్లు లభిస్తే.. ఆ ఇంటిని అమ్మగా వచ్చిన ధనమంతా హుండీలో వేస్తా’’ అని వేడుకున్నాడట. వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో అతడి కోరిక సిద్ధించింది. అయితే.. ఆ కపట భక్తుడు ఇంటి ధరను రూపాయిగా.. తాను పెంచుకున్న పిల్లి ధరను ముప్ఫైలక్షలుగా నిర్ణయించి, రెంటినీ కలిపి అమ్మేస్తానని బేరం పెట్టాడు. ఇల్లు అమ్ముడుపోయాక.. ఒక రూపాయిని హుండీలో వేశాడు. ఆపద సమయాల్లో భక్తుల మనస్తత్వానికి ఈ చిన్న కథ అద్దం పట్టినా.. దాని వెనక ఎన్నో ఆలోచనలున్నాయి.


‘‘బూటకుండు శివపూజ చేసిన బుద్ధిమంతుడగునా
కాడిగట్టి ఘనకళ్లెము చేసినా గాడ్దె గుర్రమగునా
మనసు నిల్వకను భజన చేసినా మనిషి భక్తుడగునా
కనక పర్వతమునెక్కి కూసినా కాకి కోకిలగునా’’
అంటాడు సంకీర్తన కవి వేపూరు హనుమద్దాసు. అపరితమైన ఆశతో.. మనసునిండా విషం నింపుకొని చేసే సాధన, పూజ, భక్తి, ఆరాధన అన్నీ వృథాప్రయాసే. పాము సగం మింగిన కప్ప కూడా.. తన ముందు నుంచి వెళ్లే పురుగును మింగేందుకు ప్రయత్నించినట్లుంటుంది మన ప్రయత్నం. అందుకే.. సంపదలు, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, శత్రువుల మీద పైచేయి.. ఇలా అన్ని విజయాలు మనకే దక్కాలని దేవుళ్లను ప్రార్థిస్తుంటాం. మన కోరికలు నెరవేరగానే.. దేవుడిని విస్మరిస్తాం. విజయాలను మన ఖాతాలో వేసుకుని, ఆపదలను దేవుడిపైకి నెట్టేస్తాం. బాల్యావస్థలో మహాత్ములు జీవిస్తారంటారు. చిన్నపిల్లలను జననమరణాలు.. సుఖదుఃఖాలు కదిలించవు. అలా జీవించడం సాధ్యం కానివారంతా.. రోజూ ఆపద మొక్కులతో దేవుళ్లను బిజీ చేసేస్తారు. జలుబు తగ్గాలని.. ఆలస్యంగా వెళ్లినా బస్సు మిస్సవ్వకూడదనే చిన్నచిన్న కోర్కెలకు దేవుడు లేడని గుర్తించాలి. అర్థంపర్థం లేని కోరికల చిట్టాలను దేవుడి ముందు పెట్టడానికి గుడికి వెళ్లడం.. ఏదో కార్యాలయానికి వెళ్లినట్లుంటుందే తప్ప.. దేవాలయానికి కాదు.
‘‘అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనమ్‌
దేహాంతేన తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే’’

‘‘ఓ పార్వతీ వల్లభా! దైన్యంలేని జీవితాన్ని, అనాయాస మరణాన్ని, ఆ తర్వాత నీలో సాయుజ్యాన్ని నాకు అనుగ్రహింపు’’ అని వేడుకోవాలే తప్ప.. రోజూ అనేక మొక్కులు మొక్కి.. అవి సిద్ధించగానే దేవుడిని మరవడం అజ్ఞానం. ‘ఆపద మొక్కులు సంపద మరుపులు’ అన్న అజ్ఞానంలో ఉండడం తగదు.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*01- 07 - 2019 : సోమవారం*
కండపట్టి ఉండే కొన్ని జంతువులు క్రూర జంతువుల నుండి తప్పించుకునేందుకు అప్పుడపుడు వలసపోతుంటాయి. పరిస్థితులు చక్కబడగానే తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. కొన్ని పక్షుల్లో, జంతువుల్లో తల్లే స్వయంగా సురక్షిత ప్రదేశంలో పిల్లల్ని ఉంచి అనుకూల పరిస్థితులు వచ్చాక వాటిని తిరిగి తెచ్చుకుంటుంది. ఇపుడు ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీలోకి వలసవస్తున్న కొందరిని చూశాక ఈ ‘పర్యావరణ జంతుశాస్త్రం’ గుర్తుకొస్తున్నది.

ఇటీవలి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వం ఇపుడు ఎదురులేకుండా సాగుతున్నది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు తిరగకముందే సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్, గరికపాటి రాంమోహనరావు, సీఎం రమేష్ అనే నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులు ఏకంగా తమ పార్టీ పక్షాన్ని భాజపాలో విలీనం చేశారు. ఎన్నికల ముందు ఇంగ్లీషు, తెలుగు టీవీ చానళ్లలో మోదీని, అమిత్‌షాను, భాజపాను బండమూతులు తిట్టిన తెలుగుదేశం నాయకుడు లంకా దినకర్ భాజపా తీర్థం పుచ్చుకున్నాడు. ఇపుడు ఆంధ్రాలో తెలుగుదేశం వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు భాజపా తలుపులు తడుతున్నది వాస్తవం. ఇదంతా భాజపాను, మోదీని బలపరచడానికా? పరోక్షంగా చంద్రబాబును రక్షించడానికా? అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న!

దేశం మొత్తమీద మోదీని ఘోరంగా అవమానపరిచింది ఏపీ తెదేపా నాయకులే. ప్రధానిని బూతులు తి ట్టడం, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల వస్తే రాళ్లు వేయించడం, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలు ధరించడం, రాష్ట్రానికి మోదీ రావద్దని హోర్డింగులు.. ఇలాంటి దారుణాలు ఏ రాష్ట్ర నాయకులు చేయలేదు. ఇ దంతా చేసినవాళ్లే ఇపుడు భాజపా కార్యాలయం ముందు ‘క్యూ’ కట్టడం ఆశ్చర్యం వేస్తుంది. సైకాలజీలో చెప్పే ‘స్టాక్‌హోం సిండ్రోమ్’ అనే పదం గురొస్తుంది. రేప్ చేసినవాడిని పెళ్లిచేసుకుంటాననడం, దెబ్బలు కొట్టినవాడినే గొప్పవాడని స్నేహం చేయడం, తండ్రిని హత్యచేసినవాళ్లను కోర్టులు శిక్షలువేసినా క్షమిస్తాననడం.. ఇలాంటి లక్షణాలను ‘స్టాక్‌హోం సిండ్రోం’ అంటారు. 

అస్సాంలో, త్రిపురలో, బెంగాల్‌లో ఇతర పార్టీల నాయకులు వచ్చి భాజపాను అధికారంలోకి తెచ్చారు. కానీ ఆంధ్రాలో వచ్చే వలస నాయకులతో భాజపా జాగ్రత్తగా ఉండాలి. ఇదేం కొత్త ప్రయోగం కాదు. గతంలో ఎన్నోసార్లు చేసి గంపగుత్తగా తెదేపాకి లాభం కలిగించే వ్యూహం ఇందులో వుంటుంది. ముఖ్యంగా జస్టిస్ పార్టీ ఆనవాళ్లు, అవశేషాలు ఈ రోజుకూ తెలుగుదేశంలో ఉన్నాయి. ఆఖరుకు అవి కమ్యూనిస్టులను నిండా ముంచాయి. రేపు ఆంధ్రాలో భాజపా పరిస్థితి అలా కాకుండా చూసుకోవాలి.

ప్రకాశం పంతులు లాంటి త్యాగధనుడిని నిర్వీర్యం చేసిందెవరు? పొట్టి శ్రీరాములును ఆత్మహత్య చేసుకున్నంత పనిచేసి త్యాగంగా చిత్రీకరించి లాభపడిందెవరు? భారతీయ జనతా పార్టీకి నష్టం చేసే తెలుగు మీడియాలోని సింహభాగం సృష్టికర్తలెవరు? నిన్నమొన్నటివరకు మోదీని విలన్‌గా మార్చి ఆంధ్రాలో భాజపా ఓట్లను 0.8శాతానికి దిగజార్చిందెవరు? దేశమంతా మోదీ గాలి వీస్తే ఆంధ్రలో భాజపాకు ఒక్క ఎంపీ సీటు ఎందుకు రాలేదు? ఎన్నికల ఫలితాలు వచ్చే ముందురోజు వరకు కాలికి బలపం కట్టుకొని మో దీని నిలువరించేందుకు ప్రయత్నం చేసిందెవరు? ఇపుడు భాజపాలో చేరిన సీఎం రమేశ్, సుజనా చౌదరిల వ్యాపారాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలనకు వస్తుంటే- తెలుగువారి ఆత్మగౌరవానికి భంగకరంగా చిత్రీకరించింది ఎవరు? ఇంతో అంతో విశ్వసనీయత వున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని భాజపాలోకి రానీయకుండా అడ్డుకున్న అదృశ్య శక్తి ఎవరు? ఆ శక్తులే ఇపుడు భాజపాలో చేరి వేదికలపై ఉన్నతాసనాలపై కూర్చుంటే, పార్టీ కోసం ప్రాణాలిచ్చే సోము వీర్రాజు లాంటివారి పరిస్థితి ఏంటి? తెదేపాలో కొందరు నేతలు జగన్ బ్యాటింగ్ నుండి తప్పించుకునేందుకు భాజపా గూట్లో దాక్కొంటున్నారా? పార్టీని పటిష్టపరిచేందుకు తోడ్పడతారా? అన్నది భాజపా అధినాయకత్వం గ్రహించాలి.

రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్య నాయుడు ప్రత్యే క హోదా కోసం చేసిన హడావుడి వల్ల ఆంధ్రలో భాజపాను సులువుగా ‘విలన్’ చేశారు. అది ఆనాడు సదుద్దేశంతో చేసినా, భాజపా మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వున్న ‘స్పెషల్ స్టేటస్’ అనే పదం ఇపుడు చర్చగా మారింది. దానిని ఇంకా పూడ్చుకోకముందే మళ్లీ ఇలాంటి అవకాశవాదులను పార్టీలోకి ఆహ్వానిస్తే కింది స్థాయి కార్యకర్తల మనోభావాలకు గౌరవం ఎలా దక్కుతుంది? ఇప్పటికే భాజపాలో తెదేపా అనుకూల ‘స్లీపర్ సెల్’ ఒకటి బలంగా ఉంది!

ఒకవైపు భాజపా కోసం సోము వీర్రాజు యుద్ధం చేస్తుంటే, మరోవైపు కంభంపాటి హరిబాబు వౌనంగా ఉంటాడు. పైడికొండల మాణిక్యాలరావు సాత్వికంగా వున్న భాజపా మూల సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తి. అతను తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే కామినేని శ్రీనివాస్ పనె్నత్తి తెదేపా వాళ్లను ఒక్క మాటా అనడు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై తిరగుబడితే అతనికి ఓ వర్గం మద్దతు ఇవ్వదు. సర్వానంద్ సోనోవాల్, ముకుల్‌రాయ్ లాంటి వ్యక్తులను ఆహ్వానిస్తే లాభం ఉంటుంది. కానీ దాచుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి వచ్చే వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. గంటా శ్రీనివాసరావు లాంటివారు వస్తే ఆహ్వానించాలి. అతని రాజకీయ ప్రతిభ రికార్డుగా ఉంది. అంతేకాని రాజకీయ స్వార్థం కోసం, వ్యాపారాల రక్షణ కోసం వచ్చేవాళ్లను ఓ కంట కనిపెట్టాలి. ఇక్కడ విధ్వంసం చేసి, చంద్రబాబు కాళ్లదగ్గరకు వెళ్లేవారిని చేర్చుకోకున్నా మంచిదే. ఎందుకంటే విష్ణువర్థన్‌రెడ్డి లాంటివారు హోరాహరీ తలపడిన లంకా దినకర్‌తో సంసారం ఎట్లా?! కావూరి, ముద్రగడ, దగ్గుబాటి, కృష్ణంరాజు.. వంటివాళ్లు భాజపాలో చేరి ఇపుడు ఎక్కడున్నారు? అంతెందుకు, పురేందేశ్వరికి తన తండ్రి స్థాపించిన టిడిపి ముఖ్యమా? తానున్న భాజపా ముఖ్యమా? ఏది నిర్ణయం!?

1969లో తెలంగాణ ఉద్యమాన్ని సర్వనాశనం చేసి కాంగ్రెస్‌తో ములాఖత్ అయిన చెన్నారెడ్డి, తన వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను బలిపెట్టిన నీలం సంజీవరెడ్డి, కులం కోణంలో పార్టీ పెట్టి- ఇంకో పార్టీ పుట్టిముంచిన చిరంజీవి, అదే ప్రయోగం చేసి వికటించిన పవన్‌కల్యాణ్.. ఇదంతా చరిత్ర. 1969లో రెండుగా విడిపోయిన కాంగ్రెస్ వల్ల లాభపడిన నీలం సంజీవరెడ్డి 1977 ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక పోటీ లేకుండా రాష్టప్రతి అయ్యారు. చరణ్‌సింగ్ వెన్నుపోటు రాజకీయాలకు 1979 జూలైలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బలయ్యింది. ఎన్టీఆర్‌ను చంద్రబాబు నట్టేట ముంచాడు. 

ఇలాంటి వెన్నుపోటుదారులతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్లది శల్య సారథ్యం (ప్రక్కనే వుండి ప్రాణం తీస్తారు). తమ సిద్ధాంతాలు చెల్లనపుడు ప్రక్క గుంపులో కలిసిపోయి వెన్నులో బల్లెం దింపుతారు. 1996 మేలో కేంద్రంలో భాజపా ఆధిపత్యంలో ప్రభు త్వం ఏర్పడ్డాక ప్రభుత్వం 13 రోజులకే పడిపోయినా- ఈ ఎన్నికల ముందునుండే వలసలు మొదలయ్యాయి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, బాలకొండయ్య, పరకాల ప్రభాకర్, యస్బీపి సత్యనారాయణరావు, చుండ్రు శ్రీహరిరావు, ముద్రగడ పద్మనాభం, కె.వి.ఆర్.చౌదరి, జితేందర్‌రెడ్డి, ఆళ్వార్ దాస్, గంగుల ప్రతాపరెడ్డి, వెంకటస్వామి, ఎన్.వెంకటేశ్వర చౌదరి, ఎ.వనజాక్షి, సురేంద్రరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రామమునిరెడ్డి, యు.వి.కృష్ణంరాజు, జమున, నరేశ్, కమాలుద్దీన్, డేగా నరసింహారెడ్డి.. వంటివారు భాజపా తీర్థం పుచ్చుకున్నవారే. ఇపుడు వీళ్లలో ఎంతమంది మిగిలారు? ఈ ప్రయోగం జనసంఘ్ కాలం నుండి భాజపా చేస్తూనే ఉంది. కానీ ఈ ప్రయోగం తెలుగుదేశం బలపడేందుకు బాగా ఉపయోగపడింది. 

బెంగాల్, త్రిపురలాగా కార్యకర్తల్లో సైద్ధాంతిక స్థైర్యాన్ని నింపి దానికి తగిన నాయకుడిని సృష్టించాలి. ఇంకా వీలైతే ఏబీవీపీ సైద్ధాంతిక బలం ఉండి ఇతర పార్టీల్లో వున్న నాయకులను తిరిగి తెచ్చుకోవాలి. పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, టి.జి.వెంకటేశ్, చంగల్రాయుడు, గంగుల ప్రతాపరెడ్డి, దేవేందర్ గౌడ్ వంటివారు ఏబీవీపీ నేపథ్యం వున్నవారే. స్వతంత్ర భారతంలో మజ్లిస్‌కు ముకుతాడు వేసిన ఏకైక ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వంటివాళ్లవల్ల పార్టీకి ఊపువస్తుంది. పరోక్షంగా చంద్రబాబుకు లాభం చేసే వలస గ్యాంగుల పట్ల అధిష్ఠానం జాగ్రత్తగా వ్యవహరించకపోతే పాత చరిత్రే పునరావృతం అవుతుంది.

భాజపాలోని ‘తెదేపా స్లీపర్ సెల్’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడూ పార్టీని ఎదగనీయలేదు. తెలంగాణలో వున్న పరిస్థితులకు ఏనాడో ఇక్కడ భాజపా అధికారంలోకి రావాల్సింది. విభజన జరిగాక ఈ స్లీపర్ సెల్ అవతారం స్పష్టంగా కనిపిస్తున్నది. తమ సిద్ధాంతాన్ని నెగ్గించుకోవడం కోసం ఒకపుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వేషం ధరించారు. కమ్యూనిస్టు భావజాలం వున్న కృష్ణమీనన్ 1954లో కేంద్ర క్యాబినేట్‌లో చేరి 1957 నుండి 1962 వరకు కీలకమైన రక్షణ శాఖను చేపట్టి మన భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేశాడు. 1964 తర్వాత అనేకమంది కమ్యూనిస్టులు ఈ దేశంలో తమ పప్పులు ఉడకవని కాంగ్రెస్ ముసుగేసుకున్నారు.

 రజనీ పటేల్ అనే కమ్యూనిస్టు నాయకుడు బాంబే కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు. ఆర్కే ఖాదిల్కర్, నందినీ శతపతి, డి.పి.్ఛటోపాధ్యాయ, నూరుల్ హసన్, కె.వి.రఘువీరారెడ్డి, ధర్మవీర్‌సిన్హా, అర్జున్ అరోరా, చింతామణి పాణిగ్రాహి, బహుగుణ, పి.చిదంబరం, కె.ఆర్.గణేశ్.. వంటివారు కాంగ్రెస్ ముసుగులోని కమ్యూనిస్టులు. కమ్యూనిస్టు భావజాలంతో నడిచే బ్లిట్జ్ లాంటి పత్రికలు ఆనాడు కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే, నెహ్రూను, కృష్ణమీనన్‌ను ఆకాశానికి ఎత్తేవి. ఇపుడు తెలుగునాట కూడా మీడియాది ఇలాంటి వైఖరే. ఈ వైరుధ్యాలు గమనించకుండా ‘ఆంధ్రా రాజకీయం’ ముందుకుపోతే భవిష్యత్తులో భాజపా 2019 ఎన్నికల ముందు సంవత్సరం పాటు ఎదుర్కొన్న ఇబ్బందులే ఎదుర్కోవడం ఖాయం.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*28 - 06 - 2019 : శుక్రవారం*

పదసంకీర్తన సాహిత్య సదస్సు ********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
‘రాజదండం మట్టిగరిచినపుడు ధర్మదండం దానిని ఉద్ధరిస్తుంది’ అనే మాటను ఓ గొప్ప తత్త్వవేత్త చెప్పాడు. హిందూ ధర్మం ధార్మిక లక్షణాలను పుణికిపుచ్చుకొన్నది. అందుకే శ్రీరాముడిని ధర్మస్వరూపంగా, గోవును ధర్మ స్వరూపంగా చెప్తూ వచ్చారు. దేనివల్ల సమాజానికి ఆధ్యాత్మిక ప్రవేశం కలుగుతుందో అదంతా ధర్మమే. ఈ ధర్మ స్వరూపానే్న కొందరు ‘హిందుత్వ’ అంటారు. 

ఇంకొందరు సనాతన, వైదిక, ఆర్య.. వంటి పేర్లతో పిలుస్తారు. హిందుత్వకున్న గొప్ప గుణం రాజకీయాలకు అతీతంగా గొరవింపబడడం. అందుకే మన రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎన్నిసార్లు ఇఫ్తార్ విందుల్లో టోపీలు ధరించినా, లౌకికవాదాన్ని వల్లించినా వ్యక్తిగత జీవితంలో జరిగే ‘తంతు’లో వైదిక భావన నుండి తప్పించుకోలేరు. అదే అబ్రహామిక్ మతాల్లో రాజకీయం, మతం రెండూ కలగాపులగమై ఉంటాయి. హిందుత్వ నుండి రాజకీయం విడదీయడం చాలా సులువు. అందుకే చాలామంది నేతలు రోజూ హిందువుగా జీవిస్తూనే ‘హిందుత్వ’ను తిట్టగలరు! ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పునాదుల్లో హైందవానికి ఆధ్యాత్మికతకు- హిందుత్వానికి మధ్య జ్ఞానం అనే పెద్ద అడ్డుగోడ ఉంది. అందువల్లనే పదవుల రీత్యా ఎంత గొప్పవారైనా మహాత్ములను, పీఠాధిపతులను, స్వామీజీలను చూసినపుడు నేతలు మోకరిల్లుతారు. దాన్ని తక్కువతనంగా భావించకూడదు. అది వారి వినయానికి నిదర్శనం. ఇస్లాం, క్రైస్తవాల్లో స్వాముల్లాంటి మత గురువులుండరు కానీ ముల్లాలు, పాస్టర్లు మత గురువులే. 

హైందవంలో ఒక వ్యక్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తే హైందవేతర మత గురువులు గల్లీకొకరు తమ మతాన్ని నూరిపోస్తారు. దానిని ఎవరూ ప్రశ్నించరు. కానీ హిందూ గురువుల్లో ఎవరో ఒకరు నాయకులకు సన్నిహితంగా ఉంటే అదేదో అంతర్జాతీయ నేరంగా ప్రచారం చేస్తారు. అసదొద్దీన్ ఓవైసీ ఏటా రంజాన్ నెల చివరి శుక్రవారం హైదరాబాద్ మక్కా మసీదులో ముస్లింలను ఉద్దేశించి చేసే ప్రసంగం గొప్ప లౌకికవాదం! అదే హిందూ నాయకులు ఎక్కడైనా రాజకీయంగా మతాన్ని వాడుకుంటే మతతత్వం! ఇదీ ఈ దేశంలో వ్యాఖ్యానం. ఇందుకు భిన్నంగా ఇటీవల ప్రజలను ప్రభావితం చేసే స్వాములు రాజకీయాలకు దగ్గరగా ఉండడం కొందరు జీర్ణించుకోరు. హిందూమతానికి స్వామీజీలు ధర్మ ప్రబోధం మాత్రమే చేయాలా? అన్నది ఇవాళ్టి కొత్త ప్రశ్న.

ఇటీవల విశాఖ శ్రీశారాదాపీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రకు పట్ట్భాషేకం చేసేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసిఆర్, జగన్‌లు వెళ్లడం, స్వామి స్వరూపానందేంద్ర చేసిన వ్యాఖ్యలు, చర్యలపై కొందరు విమర్శలు మొదలుపెట్టారు. ‘అగ్నిసాక్షిగా చెబుతున్నా జగన్ నా ఆత్మ. కెసిఆర్ అపర మేధావి. వీరిద్దరి పాలన మరో పదిహేనేళ్ళు సాగాలి’ అన్న శారదా పీఠాధిపతి ప్రసంగం రాజకీయంగా కొందరికి ఇబ్బంది కలిగింది.

స్వరూపానందేంద్ర మొదటి నుండి కల్మషం లేకుండా, మనస్సులో భయం లేకండా మాట్లాడడం అలవరచుకొన్నారు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చింది. క్రీడాకారిణి పి.వి.సింధును సత్కరించినా, టీవీ చానళ్ళ భావదారిద్య్రాన్ని ప్రశ్నించినా, రాజకీ య నాయకులను గద్దెనెక్కించడం కోసం రాజశ్యామల యాగం చేసినా, సినిమా నటుల వరుస మరణాలను ఆపేందుకు దైవ సన్నిధానంలో యాగం చేసినా, మతమార్పిడి నిరోధాలకు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినా ఆయన ప్రత్యేకమే. ఇందులో కొన్ని వివాదాస్పదంగా అనిపించినా అతనిలో సహజత్వం అందరికీ నచ్చుతుంది. స్వాములు ఆశీర్వాదం కోసం, ప్రవచనాల కోసం కాదు ధర్మరక్షణకు కూడా అంకితం అవ్వాలన్నది క్రొత్త ట్రెండ్. ధీరేంద్ర బ్రహ్మచారి వంటివాళ్లను ఇందిరా గాంధీ గురువుగా స్వీకరించగా, కాంగ్రెస్ పార్టీ రామ్‌దేవ్ బాబాపై దాడి చేసింది. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో యూపిఏ ప్రభుత్వం ఆయనపై తీవ్రాగ్రహం ప్రదర్శించింది. సహజంగానే రామ్‌దేవ్ నరేంద్ర మోదీకి అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారు.

కంచి పీఠాధిపతి సహా శంకర పీఠాధిపతులంతా కాస్త భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గురువుగా చెప్పే శంకరాచార్య పీఠాధిపతి స్వరూపానంద కాంగ్రెస్‌కు మద్దతుగా భాజపాను విమర్శించేవారు. స్వామి అగ్నివేశ్ పేరుకు కాషాయం కట్టినా కమ్యూనిస్టులకు గురుతుల్యుడు. రామ్‌విలాస్ వేదాంతి, సాధ్వి ఉమాభారతి, సాధ్వి నిరంజన్ జ్యోతి, యోగి ఆదిత్యనాథ్, సాధ్వి ప్రాచీ, సాక్షి మహరాజ్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, సాధ్వి రితంబర వంటివారు భాజపాను ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్నారు. కన్నడ నాట వీర లౌకికులైన దేవెగౌడ, సిద్ధరామయ్య కుటుంబాలు శివస్వాముల మఠాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల చినజీయర్ స్వామికి కేసీఆర్ ఎంత దగ్గరయ్యారో అందరికీ తెలుసు. ఒకప్పుడు కమల్‌నాథ్ ఆశారాం బాపునకు ప్రియశిష్యుడు. ఇదంతా చెప్పడం ఎందుకంటే కేసీఆర్, జగన్‌లు స్వరూపానందేంద్ర దగ్గరకు వెళ్లడాన్ని రాజకీయం చేస్తున్నవారు ఈ చరిత్ర తెలుసుకోవాలి.

క్రీ.శ. 778లో కేరళలోని కాలడిలో జన్మించిన ఆదిశంకరులు చేసింది ధర్మోద్యమమే. బౌద్ధులు, జైనుల్లోని డొల్లతనపు కొన్ని సిద్ధాంతాలను తుత్తునియలు చేసిన లకులీశుడు పాశుపత మత ప్రవర్తకుడైనా మతాన్ని కాపాడాడు. మాధవ విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి దక్షిణ దేశాన్ని కొనే్నళ్ళపాటు ముస్లిం దండయాత్రల నుండి రక్షించారు. సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీని 1674లో హిందూ సామ్రాజ్య పట్ట్భాషేకం చేసేవరకు తన ప్రయత్నం కొనాసాగించాడు. వంగ దేశపు స్కాట్‌గా బ్రిటీషువారితో అభివర్ణింపబడిన బంకించంద్ర ఛటర్జీ సన్యాసుల తిరుగుబాటునే కథగా ‘వందేమాతరం’ రచించాడు. అది ఈ దేశంలో ఎందరో గొప్ప దేశభక్తులకు తారకమంత్రం అయ్యింది. ‘ఆనంద్‌మఠ్’ నవల ఆనాటి ఆధ్యాత్మిక లోకాన్ని ఉర్రూతలూగించింది. అంతెందుకు? అస్పృశ్యతను నివారించేందుకు గాంధీ కన్నా ముందే గొప్పగా పనిచేసిన స్వామి శ్రద్ధానంద 1926 డిసెంబర్ అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది చేతిలో హత్యగావించబడ్డారు. ఇటీవల క్రైస్తవుల ఆగడాలను అడ్డుకొని గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం నింపిన స్వామి లక్ష్మణానందను మావోయిస్టులు- మాత మార్పిడి ముఠాలు కలి సి హత్యచేశారు. ఇలా శంకరుడు మొదలుకొని లక్ష్మణానంద వరకు స్వాములు, మఠాధిపతులు ధర్మం కోసం నిలబడ్డారు. ప్రతి సమయంలో ఎవరో ఒకరు నాయకులకు గైడ్ చేయకపోతే ధర్మాగ్లాని జరిగే ప్రమాదముంది. ఎందుకంటే నాయకుల అధికారం కన్నా ఇంకేదీ ఎక్కువ కాదనే భ్రమ ‘అధికారం’లో ఉంటుంది. అది తొలగించి వారిలో ఆధ్యాత్మిక భావన కలిగించే పని స్వామీజీలది.

అద్వైతమూర్తి సచ్చినందేంద్ర సరస్వతి సంప్రదాయంలో నుండి స్వరూపానందేంద్ర కూడా ‘రాజ్యంతే నరకం ధృవం’ అన్న మాటనుండి నాయకులను తప్పించవచ్చు. అయితే పీఠాధిపతులు కూడా దీనికున్న పరిధులు గమనించాలి. ఆలింగనాలు, ముద్దులు, ఆత్మలు.. ఇవి కాకుండా చేసే ప్రబోధం అందరినీ అంగీకరింపజేస్తుంది. అలాగే నాయకులు స్వాములను వాడుకున్న సందర్భాలను మనం విస్మరించరాదు. ఆశారాం బాపు పాదాల చుట్టూ చాలామంది కాంగ్రెస్ నాయకులు తిరిగారు. కానీ ఆయన సోనియా గాంధీని బహిరంగంగా విమర్శించాక వ్యవహారం తలక్రిందులైంది. హర్యానా-పంజాబ్‌లో అరెస్టయిన ‘రాం-రహీం’ బాబాను చాలామంది వాడుకొని వదిలేశారు. అందువల్ల ఆధ్యాత్మికతకూ- రాజకీయాలకున్న దళసరి పొరను మఠాధిపతులు గమనించాలి.

సత్యసాయిబాబా దేహాంతం విషయంలోని నాటకాలు ఎవరి దర్శకత్వమో ఈనాటికీ తెలియదు. జయలలిత-కంచి స్వామికీ మధ్య వచ్చిన విభేదాలు, వాటి ఫలితాలు ఎంత తీవ్రమైనవో హిందూ సమాజం చవిచూసింది. ఇటీవలి కాలంలో ఆస్తులు మఠాలకు పెరగడం కూడా స్వామీజీలకు సమాజానికి ఎంత లాభమో, దాని వెనుక ప్రమాదం కూడా అదే స్థాయిలో ఉంది. అలాగే సమాజంలోని మెజారిటీ ప్రజలను విస్మరిస్తే అడిగే దిక్కు లేకుండా పోవడమే స్వామీజీల రంగప్రవేశంగా చెప్పవచ్చు. సద్గురు శివానందమూర్తి లాంటి మహనీయుడు 2014కు ముందు నరేంద్ర మోదీ లాంటి దేశభక్తుడు ఈ దేశ ప్రధానిగా కావాలని తపించాడు. ఎందరో అనుయాయులున్నా ఒక సహచర భక్తుడితో వారణాసి వెళ్లి అక్కడ తపస్సునంతా ధారపోసి వచ్చాడు. ఆ తర్వాతే ఆయన దేహత్యాగం చేశాడు. వైఎస్ జగన్‌ను గెలిపించేందుకు ‘నేను సంకల్పం చేశా’ అని స్వరూపానందేంద్ర అంటున్నారు. 

జగన్‌ను కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్లి చేసిన ఓ పూజా కార్యక్రమం మతమార్పిడి కోసం శుద్ధీకరణ అనే ప్రచారం బాగా జరిగి, అది ఎన్నికల్లో హిందువులు, భాజపా ఓట్లను జగన్‌కు మళ్లించింది. పుష్కరాల సందర్భంలో నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు పాలనలో గుళ్లు కూలగొట్టడం గురించి ఆంధ్రాలో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో స్వరూపానందేంద్ర ప్రతిఘటించాడు. 2014 కన్నా ముందులాగా వైయస్ జగన్ మెస్సయ్యలా శిలువ మోయడం తగ్గించాడు. ఇదంతా స్వరూపానందేంద్ర చేసిన హైందవీకరణ అనడంలో సందేహం లేదు. కానీ రాజకీయాల్లో ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మికమంతా రాజకీయం కాకూడదు అన్న విషయం విస్మరించవద్దు.

ఎందుకంటే రమణ మహర్షి దగ్గరకు నాటి భారత రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చినా, ఆయన మామూలుగానే స్పందించారు. ‘రాష్ట్రపతి గారు మిమ్మల్ని చూస్తానని ఢిల్లీనుండి కబురంపారు’ అంటే ‘నాకు ఆయనతో ఏం పనిలేదే..’ సున్నితంగా తిరస్కరించారు. అయితే అందరూ రమణమహర్షిలా ఉండలేరు. ధర్మరక్షణకు స్వామీజీల అవసరం ఉంది. ఇదే వైఎస్‌ఆర్ ప్రభుత్వం తిరుమలను రెండు కొండలుగా మార్చాలనుకొన్నపుడు ఉద్యమం తారస్థాయికి చేర్చేందుకు ఉడిపి పెజావర్ మఠాధిపతి విశేశ్వర తీర్థులు రావలసివచ్చింది. స్వాములు జోక్యం చేసుకోకపోతే ధర్మం నిలబడదు. విచ్ఛిన్నకర శక్తులను నిలువరించాలంటే దేశం - ధర్మం - దైవం ఈ మూడూ ఏకసూత్రంతో నడపాలి. లేదంటే దేవాలయాలకు, హిందూ సమాజానికి భద్రత ఉండదు. ఇప్పటికీ ఆ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. స్వాములు అమాయకంగా, బాల్యావస్థలో వౌనముద్రాధారులయి, లోకం పోకడ తెలియకుండా మఠాల ఆస్తులు మాత్రమే పెంచితే హిందువులకు జరిగే గ్లానిని ఎవరూ నిరోధించలేరు. కొందరు ఆత్మజ్ఞానులుగా, కొందరు ధర్మరక్షకులుగా ఉండాల్సిందే. ఓ రమణమహర్షిలా, ఓ నిసర్గ దత్తమహారాజ్‌లా కొందరు ఆధ్యాత్మికవేత్తలు జీవించాల్సిందే. 

ఆ పరంపర ఈనాటికీ కొనసాగుతున్నది. మాతా అమృతానందమయి, శ్రీ గెంటేల వెంకటరమణలు ఆ కోవలోనివారే. మరోవైపు ఓ త్రిదండి చినజీయరు స్వామి, స్వరూపానందేంద్ర, పరిపూర్ణానంద ఉండాల్సిందే. రాజు నిరంకుశుడైనపుడు జ్ఞానప్రబోధం చేసేందుకు గురువులు అవసరం. ఎందుకంటే ‘ఆధ్యాత్మిక ప్రబోధం’ రాచరికాన్ని కూడా సున్నితంగా పలుచన చేస్తుంది. అహంకారం తగ్గిస్తుంది. కానీ స్వాములు, పీఠాధిపతులు కూడా జోక్యాన్ని పరిమితంగా ఉంచుకోవాలి. తద్వారా మన సనాతన వైదిక హిందూ ధర్మం శక్తి పెరుగుతుంది.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*21-06-2019 : శుక్రవారం*