హైదరాబాద్‌లో ప్రముఖ మిఠాయి వ్యాపారస్తుడైన జి.పుల్లారెడ్డి దగ్గరకు ఓసారి కొందరు వ్యక్తులు దేవాలయ నిర్మాణానికి చందా కోసమనివచ్చారట. వచ్చినవారు అరవై మందికి పైగా ఉన్నారట. వెంటనే పుల్లారెడ్డి- ‘నేను చందా ఇస్తాను సరే.. మరి మీ దేవాలయంపై ఎవరైనా దాడికి దిగితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించడంతో వాళ్ళు కంగుతిని వౌనంగా నిల్చున్నారట. దాంతో ఆగ్రహించిన పుల్లారెడ్డి ‘దేవాలయంపై ఎవరైనా దాడికి పూనుకుంటే ఎదురు తిరుగుతాం అని కూడా మీరు చెప్పడం లేదు. నేను చందా ఇవ్వను’ అన్నారట. నిజమే! మనం ఎన్నో కొత్త దేవాలయాలు కడుతున్నాం. వాటిని నిర్వహించే క్రమంలో ఎవరికివారు గీతలు గీసుకొని ‘భక్త కులాల కుంపటి’ పెట్టుకొని వేరుపడుతున్నాం. మన దేశంలో బౌద్ధ, జైనాల ప్రభావంతో వైదిక ధర్మానికి జరిగిన నష్టాన్ని, నానావిధ పరిమళ పుష్పాల ఆరాధన వల్ల విజభజించబడిన మనస్తత్వాన్ని ఏకత్వ మార్గంలో నడిపించేందుకు ఆదిశంకరులు గొప్ప ప్రయత్నమే చేశారు. ఇటీవల వివిధ దేవతల, గురువుల ఆరాధన చేసేవాళ్లు ప్రత్యేకమైన వర్గంగా మారిపోయి మన మూల సంస్కృతిని విస్మరిస్తున్నారు.

విస్తృతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువుల దగ్గరకు, సంస్థల కార్యక్రమాలకు రాజకీయ నాయకులు పార్టీ భేదం లేకుండా వెళ్లి పాల్గొంటున్నారు. ఆ సంస్థలకు, ఆలయాలకు లేదా తమ అవసరాలకు ఉపయోగించుకొన్న గురువులకు, బాబాలకు ఏదైనా విపత్తు వస్తే మాత్రం ‘సెక్యులరిజం’ వ్రత కంకణం చూపిస్తూ తప్పించుకొంటున్నారు. హిందూ ధర్మానికి మూలస్తంభమైన ఆలయ వ్యవస్థ నాశనం అవుతున్నా పాలకులెవరూ పట్టించుకోవడం లేదు. పుష్కరాలను కూడా ‘ఆధ్యాత్మిక వినోదాత్మక ఈవెంట్’గా మార్చగల రాజకీయ, బ్యూరోక్రసీ వ్యవస్థ ఉన్న దేశం మనది! ‘అది కూడా చేయపోతే ఏం చేస్తాం’ అని సరిపెట్టుకోగల హిందూ జాతి మనది.

విజయవాడలో పుష్కరాల పేరిట దేవాలయాలను కూల్చినా దిక్కులేదు. విఐపీల సేవలో తరిస్తూ వున్న అధికార గణం, తొక్కిసలాటలో పుష్కర భక్తులు ప్రాణాలు పొగొట్టుకున్నా పట్టించుకొన్న పాపాన పోలేదు. ఇక ఏ పుణ్యక్షేత్రంలో చూసినా భక్తులకు తీవ్ర ప్రయాస తప్ప ఇంకేం లేదు. అధికారంలో వున్నవాళ్ల బంధుగణానికి సేవ చేయడంలో మునిగిపోయే అధికార గణం భక్తుల సౌకర్యాల విషయంలో అంత సీరియస్‌గా లేదన్నది నిజం. ఆలయాలకు ఆదాయం బాగానే ఉన్నా అరకొర వసతులతో ఆ అయిదు గంటలు అలాగే భక్తులు కాలం గడిపి అన్నీ మర్చిపోతారన్న సూత్రం అధికారులకు, నాయకులకు బాగా తెలుసు. అలనాడు నియంత హిట్లర్ అందరిముందూ ఓ కోడిని తెచ్చి ఈకలు పీకుతుంటే అది విలవిలలాడిపోయిందట. వెంట నే ఆ కోడికి కొన్ని గింజలు వేస్తే అది ఈకలు పీకిన విషయం మరచిపోయి ప రుగులెత్తుకొని పోయి తి న్నదట. అలాగే హిందూ సమాజం దైవ సన్నిధిలోకి వెళ్లాక అప్పటిదాకా పడిన కష్టాలన్నీ దైవ దర్శనం తర్వాత అన్నీ మరచిపోయి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా పేరుమోసిన పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు కిమ్మనకుండా ఉండిపోవడం ఆశ్చర్యం. నేతలతోపాటు స్వాములు కూడా ఇటీవల వీఐపీలుగా మారిపోయారు. ఇక ఇవన్నీ ప్రశ్నించాల్సిన ప్రధాన స్రవంతి మీడియా అధినేతలు, ఆయా సంస్థల వాళ్లు, ఆఖరుకు స్థానిక విలేఖరులు కూడా రాజకీయ నాయకుల్లా బ్రేక్ దర్శనాలు చేసుకుంటున్నారు.

ఈ అవలక్షణాలకు తోడు వివిధ క్షేత్రాల్లో చిరు వ్యాపారస్తులు కొన్ని కొత్త సంప్రదాయాలను సృష్టిస్తున్నారు. నదీతీరాల్లో ఉన్న దేవాలయాల్లో కొబ్బరికాయ, కొన్ని పూలు, ఏవో ఆకులు కలిపి అందంగా అలంకరించి నదుల్లో వదిలేయాలని ఈ షాపులవాళ్లే భక్తులకు బోధిస్తున్నారు. ఆధ్యాత్మిక తత్వ మూలాలు తెలియనివాళ్లు కొన్ని అవసరం లేని పదార్థాలను నీటిలో వదులుతూ నదులను కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నారు. ఉదాహరణకు గాణుగపురం ఓ గొప్ప దత్తక్షేత్రం. అక్కడ సరైన వసతులు లేనందున వేలాదిమంది భక్తులు ఎక్కడంటే అక్కడ రోడ్లపైన, నదీ తీరంలో, నది పక్కన మల మూత్ర విసర్జన చేస్తున్నారు. ఆలయ కమిటీ ఏమీ పట్టించుకోవట్లేదు. భీమ, అమరజ నదులు కాలుష్యంతో నిండిపోయి వైతరణీ నదిని తలపిస్తున్నాయి.

తెలంగాణలోని కొండగట్టులో ఆలయ పరిసరాలను భక్తులే అపరిశుభ్రం చేస్తున్నారు. గుడికి ఆదాయం పెంచే ఆలోచన తప్ప రెండవ ధ్యాస లేని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దేవుని ముందు అందరూ సమానమన్న ప్రాతిపదిక వదిలేసి డబ్బుతో దేవుని కొలిచే మార్గానికి తెరతీస్తున్నారు. ఇదంతా కేవలం ఫలానా దేవాలయం అని మాత్రమే కాదు. అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి. ఒక్క తిరుమలలో మాత్రం పరిశుభ్రతకు గొప్ప ప్రాధాన్యం ఉంది. కానీ అక్కడ అన్య మతస్థులు ఉద్యోగులుగా అధికారం చలాయిస్తున్నారు. అపుడపుడు మత మార్పిడి ముఠాలు అధికారులకు పట్టుబడినా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అందువల్ల ఇవి పునరావృతం అవుతూనే వున్నాయి.

దేవాలయాల పోషణకు హుండీలు, టిక్కెట్లు ఉండొచ్చని వాదించే వాళ్లూ ఉన్నారు. కానీ ఆ ఆదాయం దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు, దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలి. ఈవిషయంపై కులా ల వారీగా విభజించబడిన మనం సామూహిక శక్తి  కేంద్రాలైన దేవాలయాల సమస్యలపై స్పందించడం మానేశాం. దైవభక్తి ప్రేరణకు, ధర్మ ప్రచారానికి కేంద్రాలుగా వున్న ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న వైనంపై తక్షణ చర్యలు అవసరం. ఎన్నో దేవాలయాలకు ఇచ్చిన మాన్యాలు పరాధీనమై, కబ్జా కోరల్లో కకావికలమవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. ఆలయం కేవలం శబ్దబ్రహ్మ ఉపాసనా కేంద్రం మాత్రమే కాదు; సామాజిక విజ్ఞాన శోధనా కేంద్రాలుగా మార్చాలన్న ఆలోచన లేదు. ఆలయాలు ఉద్యోగులను బతికించే ఉపాధి కేంద్రాలు మాత్రమే కాదు, ధార్మిక వ్యాప్తికి మూలసూత్రాలు. వీటిపై అవగాహన లేనివారు, భక్తిలేని వారు అధికారులుగా ఉండడంవల్ల ఈ విధమైన పరిశోధన, కొత్త ఆలోచనలకు స్థానం లేకుండా పోయింది. ఆలయ బోర్డుల్లో కులాల వారీగా, వర్గాల వారీగా, పెట్టుబడిదారులను చేర్చి ఆలయ వ్యవస్థను వాళ్ల స్వంత ఎస్టేటులుగా మార్చేస్తున్నారు. భక్తులకు అరకొర సౌకర్యాలపై, తమకు పూర్తి స్థాయి మర్యాదలపై మాత్రమే చర్చలు, నిర్ణయాలు చేసే ఇలాంటి ధార్మిక మండళ్లు హిందూ ధర్మవ్యాప్తికి శాపాలు.

దేవాలయాల నిర్వహణ విషయంలో నాయకులవి, అధికారులవి ఎన్ని తప్పులున్నాయో పేరుమోసిన స్వామీజీల నిర్లిప్తత కూడా అంతే తప్పు. హిందూ దేవాలయ వ్యవస్థను ముస్లిం పాలకులు ప్రత్యక్షంగా ధ్వంసం చేస్తే ఆంగ్లేయ పాలకులు ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ‘రిలిజియన్ ఎండోమెంట్ యాక్ట్-1863’ను తెచ్చారు. దాని కొనసాగింపుగా ‘ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మాదాయ దేవాదాయ సంస్థల చట్టం-1966’ అమలులోకి వచ్చాక మొదట కొంత నిబద్ధతతో ప్రభుత్వ పెద్దలు ఆలోచించారు. కానీ ఆ తర్వాత వచ్చిన నాయకులు స్వాములకు, పీఠాధిపతులకు ఓ పాద నమస్కారం పడేసి తమకు అనుకూలంగా నిబంధనలను మార్చుతూ వ్యవస్థను ధ్వంసం చేస్తూ వచ్చారు. ఎవరైనా ఎదురుతిరిగితే ప్రభుత్వాధినేతలు వారిని అపఖ్యాతిపాలు చేశారు.

తిరుమలలో వేయికాళ్ల మండపం నిర్మాణం విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిదండి చినజీయర్ స్వామికి ఎన్ని విభేదాలు వచ్చాయో మనకు తెలుసు. దేవాలయ పాలక మండళ్లలో పైనుండి కింది దాకా రాజకీయ నిరుద్యోగులను నియమిస్తూ థార్మిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. కొన్ని ప్రయివేట్ సంస్థల అధ్యయనం ప్రకారం అనంతపురం జిల్లా కస్సాపురం ఆంజనేయస్వామి దేవాలయ భూమి 444 ఎకరాలు వుంటే అందులో 157 ఎకరాల భూమిని 1957లో అమ్మేసారు. భద్రాద్రి ఆలయానికి చెందిన పురుషోత్తమపట్నం సర్వే నెం.15లోని 917 ఎకరాల భూమిలో 12 ఎకరాలు సిస్టర్ మొగిలి మరియమ్మకు ఎకరాకు 1,25,000 చొప్పున 1998లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అమ్మగా అక్కడ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు వెలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, అనంతపురం మొత్తం ఏడు జిల్లాల్లో ఆలయ భూములు 1,12,806 ఎకరాలు ఉంటే ఇందులో ప్రభుత్వం 8 వేల ఎకరాలకుపైగా కారుచౌకగా అమ్ముకొంది. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 210 ఎకరాలు చౌకగా ప్రభుత్వం అమ్ముకొన్నా ఆనాడు అడిగే నాథుడు లేడు. ఈ కబ్జాకోరులే ఇపుడు విఐపీలుగా చెలామణి అవుతున్నారు. వాళ్లందరి దర్శనాల కోసం సామాన్య భక్తులను శ్రీశైలం, తిరుపతి దేవస్థానాల్లో సైతం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో తిరుపతిలో ఏకంగా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం మొదలైనా, వకుళమాత ఆలయం చుట్టూ విధ్వంసం జరిగినా పట్టించుకోలేదు. యాదాద్రి, వేములవాడ వంటి దేవాలయాలను ఆధునీకరించి ఓ కొత్త చరిత్ర సృష్టించాలనుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అవి పూర్తయితే చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ ఆలయ భూములను కబ్జా కోరల నుండి విడిపించి పరిశుభ్రత విషయంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెడితే ఆయన చేపట్టిన ‘ఆపరేషన్ టెంపుల్’ విజయవంతవౌతుంది. ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ, ఇతర పార్టీలన్న తరతమ భేదం లేకుండా కబ్జా చేసిన దేవాలయ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించాలి.

ఆలయాలను ఆదాయం తెచ్చే మద్యం షాపుల వేలంలా కాకుండా, పిక్నిక్ స్పాట్‌ల్లా కాకుండా ధార్మిక స్థలాలుగానే భావించాలి. నిజాయితీ, నిబద్ధతగల వ్యక్తులను దేవదాయ శాఖలో ఉంచాలి. అపుడే ప్రతి ఆలయం ధార్మిక కేంద్రంగా పరిఢవిల్లుతుంది. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే 30/87 లాంటి చట్టాలను సవరణ చేసుకోకపోతే గుడులు, గోపురాలు కునారిల్లడం ఖాయం. భక్తులు కూడా తాము సందర్శకులం మాత్రమే అని భావిస్తే ఇదంతా ఇతరశక్తుల చేతుల్లోకి పోతుంది.

అదికాకుండా ‘ఏ రోజు కారోజు రైల్వే ప్రయాణికుల్లా’ దేవాలయాలను సందర్శిస్తే మనది అనుకున్న అస్తిత్వం మంటగలవడం ఖాయం. అతి పెద్ద ధార్మిక మతం గల దేశంగా ఉన్నాగానీ కులతత్వం, స్వాభిమానం, పార్టీ విధేయత ఊబిలో కూరుకుపోతున్న మనం దేవాలయాలను రక్షించుకోకపోతే మరో చారిత్రక తప్పిదం చేసినవాళ్లం అవుతాం.

************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి *
* ఆంధ్రభూమి : భాస్కర వాణి *
కొక్కొరో ... క్కో ...


***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
24 : 30 : డిశంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 08ఆపరేషన్ థియేటర్లో రోగి కళ్లు తెరవగానే వై ద్యుడు- ‘ఓ శుభవార్త ఉంది, ఓ దుర్వార్త ఉంది- రెండింటిలో ఏది ముందు చెప్పమంటావ్?’ అని అడిగాడట. మొదట దుర్వార్తనే చెప్పండని ఆ రోగి కోరాడట. ‘నీ రెండు కాళ్లు మోకాళ్ల వరకు పాడైనందున ఆపరేషన్ చేసి తొలగించాం! ఇదే దుర్వార్త’ అన్నాడు డాక్టర్. ‘శుభవార్త ఏంటా?’ అని ఎదురు చూస్తున్నట్లు రోగి చూపులను గమనించి- ‘నీ చెప్పులను పక్కనున్న పేషంట్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతకు అమ్ముతావ్?’ అన్నాట్ట డాక్టర్. కాళ్లు పోయినందుకు బాధపడాలా? చెప్పులు అమ్మకానికి వచ్చినందుకు సంతోషపడాలా...?


సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతాపార్టీ కార్యకర్తల మానసిక స్థితి ఆపరేషన్ అయిన ఆ రోగి లాగానే ఉంది. వ్యూహాత్మక తప్పిదాల వల్ల తమ పార్టీ స్థితి నానాటికీ దిగజారడం ఆ కార్యకర్తలను నిస్తేజానికి గురి చేస్తున్నది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పాగావేయడానికి అనువుగా ఉన్న మొదటి స్థానం తెలంగాణ. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల్లో భాజపాకు తీవ్ర నిరాశే మిగిలింది. పార్టీలో అగ్రనేతలనుకునే వారు ఓటమి చెందడం బాధ కలిగించినా, క్రిందిస్థాయి కార్యకర్తల్లో దీనికంతటికీ కారణం ఆ అగ్రనేతలే అన్న కసి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. భాజపా గనుక పూర్తిస్థాయిలో పనిచేసి ఉండి ఉంటే తెరాస విజయానికి బ్రేకులు పడేవి అని చాలామంది అభిప్రాయం. చివరి 15 రోజుల్లో చేసిన ప్రచారం 3 నెలల ముందు నుండే వ్యూహాత్మకంగా చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు అన్నది సర్వేసర్వత్రా వినిపిస్తున్నమాట. లేకలేక దొరికిన అవకాశాన్ని గాజుగ్లాసును జారవిడిచినట్లు విడుచుకున్నారని జాతీయవాదుల బాధ. అనునిత్యం అకారణంగా మోదీని తిగుతున్న చంద్రబాబు గ్రూప్ ఓడినందుకు సంతోషించాలా? మరోసారి కేసీఆర్ గెలిచినందుకు బాధపడాలా? అన్నది భాజపా కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు.

తెలంగాణలో ఈరోజుకూ మతపరమైన ఉద్రేకం ఉంది. ఇక్కడి మెజార్టీ ప్రజలను ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, అతని బంటు కాశీం రజ్వీ పెట్టిన బాధల గాయాలను ఎవరూ చెరపలేరు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో గానీ, ఆ తర్వాత వచ్చిన మలి ఉద్యమంలో గానీ తెలంగాణ భాజపా నాయకుల పాత్ర తక్కువేం కాదు. 1997లోనే అందరికన్నా ముందు ‘కాకినాడ తీర్మానం’ చేసి తెలంగాణకు అనుకూలంగా భాజపా వ్యవహరించింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ‘చంద్రబాబు అండ్ కో’ వెంకయ్య నాయుడి ద్వారా దానిని నీరుగార్చిందని కొందరు పార్టీ పెద్దలు చెప్తారు. 

2000 సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ మలి ఉద్యమంలో భారతీయ జనతాపార్టీ గణనీయమైన పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది. ఈ తొందరపాటులో ఎం. వెం కయ్యనాయుడు చేసిన ‘ప్ర త్యేక హోదా పాపం’ ఇప్పు డు భాజపాకు ఉరితాడులా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత భాజపా- తెదేపాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుండి తెలుగులోని ప్రధాన స్రవంతి మీడియా భాజపాను రోజూ విలన్‌గా చూపిస్తున్నది. చంద్రబాబు, కేసీఆర్, కేటీఆర్‌లను ‘గారు’ అని సంబోధిస్తున్న టీవీ యాంకర్లు ప్రధాని మోదీని ఏకవచనంతో సంబోధిస్తూ అనరాని మాటలంటున్నారు. 

ఇక విశే్లషకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా టీవీ చర్చలకు వచ్చిన వారి నోటికి దండం పెట్టాలి. విచిత్రం ఏమిటంటే తెలంగాణకు సంబంధం లేని ప్రత్యేక హోదాను ఇక్కడ చూపిస్తూ రోజూ కథనాలుగా, విశే్లషణలుగా చూపిస్తూ అడ్డగోలుగా మాట్లాడటం షరామామూలైంది. జరుగుతున్నా తెలంగాణ భాజపా నేతలు వౌన మునుల్లా ఆ కార్యక్రమాలను ఆనందంగా వీక్షించడం తప్ప చేసిందేమీ లేదు. టీవీ చర్చలకు వెళ్తున్న శ్రీ్ధర్‌రెడ్డి, రఘునందన్, కృష్ణసాగర్, ఏనుగుల రాకేశ్, ప్రేమేందర్‌రెడ్డి తప్ప మిగతా వాళ్ల గొంతులో బలం లేదు. ప్రజలు రోజూ టీవీ చానళ్లు చూస్తారన్న సత్యాన్ని భాజపా విస్మరించింది. ఆర్‌ఎస్‌ఎస్ బౌద్ధిక్‌లు విని ఓట్లు వేయరు. సాధారణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు టీవీలు, పత్రికలు చూస్తారు. నిన్న మొన్న రాజకీయం మొదలుపెట్టిన ‘జనసేన’ అధినేత పవన్‌కల్యాణ్ ఓ టీవీ ఛానల్‌ను కొనేసి, సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నా తెలంగాణ భాజపా నాయకులకు ఆ ధ్యాసే లేదు!

కేరళ, అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి, పోరాటాలు చేసి పార్టీని విస్తరిస్తున్నారు. కానీ తెలంగాణ భాజపా ముఖ్యులకు అలాంటి ఉద్యమాలపై అవగాహన ఉండదు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే శంషాబాద్ ఏయిర్‌పోర్ట్ నుండి వాళ్లకు కన్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, వారి మన్నన పొంది ఓ ప్రెస్‌మీట్, ఓ శంకుస్థాపనో చేయించి గౌరవంగా పంపించడంవల్ల ఓట్లు పడతాయని అనుకోవడం అమాయకత్వమే. వాళ్లను తెలుగు ప్రజలు ఎవరు పట్టించుకొంటారు? కేంద్రమంత్రులకు రాష్ట్రాలకు రప్పించడం వల్ల పార్టీ అభివృద్ధికి, సైద్ధాంతిక బలానికి ఊతం ఇవ్వాలి తప్ప అదేదో ‘వినోద కార్యక్రమం’ అనుకుంటే అజ్ఞానమే.

ఈ ఐదు ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా తెగించి చేసిన పోరాటం ఒక్కటీ లేదు. తెలుగు రా ష్ట్రాల్లో గోవధ తీవ్రంగా జరుగుతున్నా ఒక్క రాజాసింగ్ తప్ప ఇంకొకరు మాట్లాడిన పాపాన పోలేదు. అద్భుతమైన జాతీయ విలువలున్న కార్యకర్తలను నిర్మించే సరస్వతీ శిశు మందిరాలు ఆర్థిక పరిస్థితుల వల్ల అతలా కుతలం అవుతున్నా ఒక్కనాడు వాటివైపు ఏ భాజపా నాయకుడు కనె్నత్తి చూడలేదు. వామపక్ష విద్యార్థి సంఘాల చేతిలో ప్రాణాలు కోల్పోతూ కూడా ఆ రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ నిలిచి గెలిచింది. ఇప్పుడు భాజపాలో ఉన్న చాలామంది ఆ సంస్థ నుంచి వచ్చినవారే. ఇప్పుడు తెదేపా, తెరాసల్లో ఏబీవీపీ పునాదులపై ఎదిగిన నేతలూ ఉన్నారు. ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలను, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని వామపక్ష వాదులు కబ్జా చేసినా అడిగే దిక్కులేదు. నేడు విద్యార్థి సంఘాల్లో కులవాదం రెచ్చగొడుతున్న ఆచార్యులకు అడ్డూ అదుపూ లేదు. గురుకులాలను కులాల వారీగా ఏర్పరచి కులవాదం వాళ్లలో నూరిపోస్తున్న తీరుతో మరో పదేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఇంకో కొత్త సమస్య రాబోతోంది. వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కులతత్వంతో బయటకు వస్తే సమాజంలో సంఘర్షణ ఏర్పడడం ఖాయం. ఇవన్నీ కూలంకశంగా ఆలోచించి సమాజంలో సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు జాతీయవాదులుగా మీ యోగదానం ఏంటని అడిగితే, చెప్పేందుకు భాజపా నాయకత్వం చేసిన చింతన ఏంటి? ‘ఇన్‌స్టంట్’ నాయకులను అరువుదెచ్చుకొని, అదీ 15 రోజులముందు టిక్కెట్లు కేటాయించి ‘యుద్ధం చేయ్..’ అంటూ ఎన్నికల కురుక్షేత్రంలోకి పంపడం ఎలాంటి వ్యూహం!?

రోజురోజుకూ తెలంగాణ రాష్ట్ర పాలనలో పెరుగుతున్న మజ్లిస్ జోక్యంపై జాతీయవాదుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. పాతబస్తీలోని రియాసత్‌నగర్‌లో నవంబర్ 24న అక్బరుద్దీన్ ఓవైసీ ‘ఇందిరాగాంధీనే దారుస్సలాంకు వచ్చింది.. ప్రతి ముఖ్యమంత్రి మాముందు తలవంచాడు’ అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది యువకులు మోదీ పట్ల అభిమానం పెంచుకున్నా దానిని ఓటు బ్యాంక్‌గా భాజపా మార్చుకోలేకపోతుంది. 22 లక్షల సభ్యత్వం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా, తాజా ఎన్నికల్లో 14 లక్షల ఓట్లను మాత్రమే భాజపా పొందగలిగిందంటే కారణం ఎవరు? ఉద్దేశ పూర్వకంగా హైద్రాబాద్ నగరంలో ఓట్ల తొలగింపు జరుగుతున్నా భాజపా దానిపై దృష్టి పెట్టలేదు. సంఘ పరివార్‌లోని ఇతర క్షేత్రాల సభ్యుల పేర్లు కూడా నాయకత్వానికి తెలియకపోవడం విడ్డూరం. కనీసం సర్పంచ్, జెడ్పీటీసీలకు వచ్చే ఓట్లు కూడా రాని వారు ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్లకు పోటీపడ్డారంటే అందుకు- పార్టీ ఫండ్, పేరు ఇబ్బడిముబ్బడిగా వస్తుందనే ఆశ కాదా? టిక్కెట్ల కేటాయింపు, పరిశీలన నిష్పక్షపాతంగా జరుపకుండా, అభిప్రాయ సేకరణ లాంఛనంగా చేసి ఓటమి వైపు తీసుకెళ్లడం వ్యూహాత్మక తప్పిదం కాదా?

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని కరెంట్ విషయంలో తప్పుదారి పట్టించిందెవరు? కరెంట్ విషయంలోనే కేసీఆర్ మోదీని తీవ్రంగా తిట్టడం నిజం కాదా? అద్భుతమైన రెండు ప్రసంగాలు చేసిన మోదీని ఈ విషయంలో బోను ఎక్కేలా చేసింది ఎవరు? టిక్కెట్ల కేటాయింపు మొదలుకొని ప్రచార వ్యూహాల వరకు తప్పుల మీద తప్పులు చేసి నేతలు అగాధంలో పడడం కార్యకర్తలను నిరాశకు గురిచేయడం కాదా? తెరాస తిరస్కరించిన బాబూ మోహన్, బొడిగె శోభలకు టిక్కెట్లివ్వడం ఓ గొప్ప వ్యూహమా? అంతకన్నా గొప్ప లీడర్లు తెలంగాణలో ఇంకెవరూ లేరా? మాజీ నక్సల్స్‌కు టిక్కెట్లు ఎలా కేటాయిస్తారు? ఒకప్పుడు వామపక్ష సంఘాల చేతిలో మరణించారని చెప్పే సామ జగన్మోహన్‌రెడ్డి, చంద్రారెడ్డి వంటి వాళ్ల ఆత్మలు ఘోషించవా? విచిత్రం ఏమిటంటే మొద్దు నిద్రలో ఉన్న ఈ మద గజానికి మేతవేస్తూ పెంచుతున్న జాతీయవాద ‘మావటి’ నియంత్రించలేకపోవడం మరో రకమైన ఆశ్చర్యం. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మోదీ వైపు జరుగుతున్న శత్రు మూకలకు కళ్లెం వేయకపోతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయవాద ప్రభుత్వానికి సంకటం తప్పదు. ఇప్పటికైనా తప్పులను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కాకపోతే అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడి భాజపా జీవం పోసినట్లు అవుతుంది. ఓటమి కారణాలను ‘వాస్తులోపాల పైకి, బాత్రూమ్ నిర్మాణాల పైకి నెట్టకుండా ’ నిజాయితీతో సహృదయంతో జాతీయ వాదాన్ని నిలబెడితేనే తెలంగాణలో భాజపాకు మనుగడ. లేదంటే- ‘రాజ్యాంతే నరకం ధృవమ్'.

************************************
డాక్టర్. పి. భాస్కర యోగి *
* ఆంధ్రభూమి : భాస్కర వాణి *
*శుక్రవారం : డిసెంబర్ : 21 : 2018*

ఒక గొప్ప సన్యాసి తన శిష్యుడిని వేదాంతం నేర్చుకోవడానికి జనకచక్రవర్తి వద్దకు పంపాడు. ఆ శిష్యుడు.. అంతా తనకే తెలుసు అనే అహంకారంలో ఉన్నాడు. ‘ఈ జనకుడి నుంచి నేనేం నేర్చుకుంటాను’ అనే ధీమాతో ఉన్నాడు. అందుకే జనకుడి వద్దకు వెళ్లి ఒక తాళపత్రంపై.. ‘నేను వచ్చాను’ అని రాసి పంపాడు. దానిని చూసిన జనకుడు నవ్వుకొని ఆ తాళపత్రాన్ని వెనక్కి తప్పి.. ‘నేను చచ్చాక రండి’ అని రాసి పంపాడు. ఇక్కడ ‘నేను చచ్చాక’ అంటే జనకుడి మరణం కాదు. ‘నేను’ అనే అహం వదిలాక రావాలని దాని అర్థం. మనుషులంతే ‘నేను’ అనే అహం చుట్టే పరిభ్రమిస్తూ అసలు సత్యం విస్మరిస్తారు. అందుకే అష్టావక్రుడు ఈ ‘నేను’ను గురించి చెప్తూ..

దేహాభిమాన పాశేన చిరంబద్ధో సి పుత్రక
బోధో హం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ

..అన్నాడు. ‘‘ఓ రాజా, ‘నేను దేహం’ అనే అభిమానంతో నీవు బంధింపబడ్డావు. ‘నేను’ అనే ఈ బంధం నుంచి విడివడడానికి జ్ఞానమనే ఖడ్గంతో భేదించు’’ అని దీని అర్థం. ‘నేను’ అనే అహంకారానికి ప్రాయశ్చిత్తం లేదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దాన్ని వదిలిపెట్టకుండా జ్ఞానం కలగదు కాబట్టే జ్ఞానవేత్తలంతా.. ‘నేను’ను వదలడమే ఆధ్యాత్మిక మార్గంలో ప్రాథమిక పరిజ్ఞానంగా చెబుతారు. నేను అనే భావాన్ని అన్ని విధాల రూపాల్లో వదిలిపెట్టడమే ముక్తి కలగడానికి దారిగా మారుతుందని ఆదిశంకరులు చెప్పారు. నిజానికి ఆధ్యాత్మిక సోపానంలో పైకి వెళ్లే కొద్దీ నీరుల్లిపాయను ఒలిచిన కొద్దీ లోపల ఏమీ మిగలకుండా శూన్యం ఏర్పడినట్లుగానే.. నేనును వదిలేస్తే పరాత్పరుడైన పరమాత్మను పొందుతాం.

ఇక, ఈ అహంకారంతో జంటగా ఉండేది మమకారం. నాది అనే భావన వల్లనే తీవ్రమైన ఆశలపాశాలతో బంధింపబడతాం. ఎండమావుల్లాంటి ఆశల వెంబడి పరుగెత్తి, పరుగెత్తి అలసి సొలసి చింతలో మునిగిపోతాం. దానివల్ల అశాంతికి లోనై సుఖం లేకుండా జీవిస్తాం. అనేకమైన చింతనల్లో మునిగిపోయి జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం. పరుగెత్తే మనసుకు ఇంధనం ఈ ‘నాది’ అనే మమకార భావనే. అది గానుగెద్దు ప్రయాణంలా ఉంటుంది. గానుగ తిప్పేందుకు కట్టిన ఎద్దు.. ‘రోజూ నేను వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తాను’ అనుకున్నట్లే ఈ మమకారం చుట్టూ తిరిగేవారి పరిస్థితి అలాగే ఉంటుంది.

బురదలో తిరిగే రాజహంస కూడా మలినం అయినట్లుగా ఈ మమకారంలో పడిన మనిషి జీవితం అంతే. సరోవరం పక్కనున్న బురదగుంటలో పొర్లాడే వరాహంలా సత్యదర్శనం చేయలేం. మమకార బంధం ఆవరిస్తే వివేకం కోల్పోతాం. దానివల్లనే కదా ఆధునిక జీవనంలో మనుషులు పరుగులెత్తే జీవనం కొనసాగిస్తూ అశాంతిగా జీవిస్తున్నారు. ఈ సుడిగుండం నుంచి మానవులను రక్షించేది ధ్యానం, యోగం. అది పూర్తిగా అంతఃకరణకు సంబంధించినది. మనోమాలిన్యాలను కడిగివేసే యోగంలోకి వెళ్లినప్పుడు నిశ్చలమైన సరస్సులో మెరిసే వెండినాణెంలా మనకు మనమే కనిపిస్తాం.


********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
కొక్కొరో ... క్కో ...


***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
17 : 23 : డిశంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 07తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ విధ్వంసాన్ని తేలిగ్గా తనకు అనుకూలంగా మలచుకోగల నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. విచిత్రమో, విధి నిర్ణయమో చెప్పలేం గాని ప్రతీ విధ్వంసం తర్వాత లాభపడేది ఆయనే. కుప్పకూలిన కోటగోడల్లో శిథిలాల మధ్య కూర్చొని ఏడ్చేవాళ్లు ఏడుస్తుంటే దానినుండి ‘పసుపుపచ్చని’ మొక్కలను పుట్టించడం ఆయన ఘనత. అప్పట్లో ఎన్టీఆర్ ఇంకో ఆరునెలలు బతికుంటే ఏం జరిగేదో ఊహంచలేం. కానీ ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబీకుల కన్నా ఎక్కువ లాభపడింది మాత్రం ‘నారా’ వారే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే ఆంధ్రాలో వాలిపోయి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే వేడిని పుట్టించి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసి, ఇంకెప్పుడూ కోలుకోకుండా చేసి పీఠం ఎక్కిన సమర్ధుడు చంద్రబాబు. ఆయన 2014లో ఏపీలో కాంగ్రెస్‌ను అధఃపాతాళానికి తొక్కేసి, 2018లో తెలంగాణ కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాడు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ‘ఉత్తర కుమారులు’ ఇకనైనా గ్రహిస్తారో లేదో తెలియదు!


ఇక, కొంగర కలాన్ సభ తర్వాత తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల కొంత వ్యతిరేకత ఉందన్నది అక్షరాలా సత్యం. రాహుల్ గాంధీతో సరూర్‌నగర్‌లో సభ పెట్టించి తెలంగాణలో ‘కాక’ పుట్టించిందీ నిజం. పొత్తుల పేరుతో టీడిపితో కూటమి ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌కు ‘రాజశ్యామలయాగ’ ఫలితం అందివచ్చింది. అప్పటివరకు కేసీఆర్‌కు కాంగ్రెస్‌లోని ఛోటామోటా నాయకులను ఎలా టార్గెట్ చేయాలో అర్థం కాని సంకట స్థితి. ఎప్పుడైతే బాబు వస్తున్నాడని కేసీఆర్ తెలుసుకొన్నాడో- తెలివిగా వనపర్తి సభలో ‘‘అడుక్కుంటే మేం నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం గదా, చంద్రబాబు ద్రోహి’’లాంటి పదాలు వాడి జనాన్ని రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ‘రాజశ్యామల యాగం’చేసి బయటకి వచ్చాక తిట్లన్నీ మానేసి, తెలంగాణ ప్రజల ఉద్వేగాన్ని మెల్లమెల్లగా కదిలించాడు. యాగం తర్వాత ఖమ్మం సభలో కేసీఆర్ తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన 30 లేఖలను ప్రజలకు చూపించడంతో కథ తిరగబడింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తిట్లులేకుండా తననుతాను సజ్జనుడిగా, అమాయకుడిగా, తెలంగాణ లెజెండ్‌గా, తెలంగాణ రక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకొన్నాడు. ప్రజల యాసలో తన పథకాల గొప్పతనం గురించి చెప్పుకొంటూ, సరైన వ్యూహాన్ని కేసీఆర్ అవలంబించాడు.మరోవైపు చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసాక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ద్వారపాలకులయ్యారు. నేరుగా అశోక్ గెహ్లాట్ లాంటి సీనియర్ నేత చంద్రబాబును అమరావతిలో కలిసి తెలంగాణ ఎన్నికలపై చర్చిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కక్కలేక మింగలేక బిక్కమొఖం వేసారు.
మొదట్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ‘రాను’ అన్న చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలన్నీ చక్కబెట్టేట్లుగా పోజులిచ్చాడు. దాంతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఇదొక మంచి పరిణామంలా కన్పించి ఇక్కడి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడకుండా బాబుతోనే వ్యూహరచన చేయడం మొదలుపెట్టారు. ఒక సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో దించి అక్కడి కులాల మధ్య విభజన వచ్చేట్లుగా బాబు ప్రయత్నించాడు. ఇనే్నళ్ల తెలంగాణ ఉద్యమంలో గానీ, తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక గానీ ఏరోజు ఆంధ్రా ప్రాంత ప్రజలపై దాడులు జరుగలేదు. అలాంటిది హైద్రాబాద్ నగరంలో ఆంధ్రా ప్రాంతం వారు నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించడం, విస్తృతంగా ప్రచారం చేయడంతో మిగతా తెలంగాణ ప్రాంతంలో అలజడి మొదలయ్యింది. ‘మేం తలచుకుంటే ఆంధ్ర వలసవాదుల వోట్లు మీకు పడకుండా చేస్తాం..’ అని నాలుగైదు నెలల క్రితం తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్న మాటలను చంద్రబాబు నిజం చేస్తాడా? అనే ఆందోళన తెలంగాణ జనంలో మొదలైంది. దాదాపు 17 సీట్లల్లో ఇలాంటి ‘విభజన వాదం’ పనిచేస్తే, మిగతా తెలంగాణలోని సీట్లలో తెరాసకు సీట్లు తగ్గితే ఎలా? అని తెలంగాణ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆఖరుకు తెరాస ప్రభుత్వంపై కోపంగా ఉన్న ఉద్యోగులు కూడా తెరాసను గెలిపించకపోతే తమ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని ఆలోచించారు. కాబట్టే పోస్టల్ బ్యాలెట్లు సింహభాగం తెరాసకే దక్కాయి.చంద్రబాబు ప్రచారం ప్రారంభించాక- తెదేపా ముఖ్య కార్యకర్తలు డబ్బు సంచులతో పట్టుబడడం, ఆంధ్రా ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణలో పోలీసులకు చిక్కడం ఇక్కడి ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. చంద్రబాబు, ఆయన మంత్రులు డబ్బు, కులం, ప్రాంత విభజన వంటి అంశాలతో తెలంగాణను ముంచుతున్నారని కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది. కాంగ్రెస్ పెద్దలకు ‘ఏపీలో పొత్తు ఉండద’ని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేసినా చెవికెక్కలేదు. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం తెలంగాణ ప్రాంతం చంద్రబాబు గుప్పిట్లోకి పోతుందన్న సంకేతం వెళ్లింది. రాహుల్ గాంధీని సభలో కూర్చోబెట్టి ఫ్లెక్సీలో రాజీవ్, ఎన్టీఆర్ ఫొటోలుపెట్టి చంద్రబాబు హైద్రాబాద్‌ను తానే సృష్టించానని చెప్తుంటే ఆసక్తిగావిన్న రాహుల్ అమాయకపు చూపులు కాంగ్రెస్ బేలతనాన్ని బయటపెట్టాయి. తెలంగాణకు చెం దిన పి.వి.నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టి.అంజ య్య లాంటి నాయకుల ఫొటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో మచ్చుకైనా లేవు. కమ్మ, కాపు, రాయలసీమ రెడ్డి వర్గాల అంతర్గత పోరు గ్రేటర్ హైదరాబాద్‌లో తెలుగుదేశానికి చెక్ పెట్టింది.కేసీఆర్‌పై చంద్రబాబు చేసిన విమర్శలు ‘అరిగిపోయిన రికార్డుల’ మాదిరి ప్రజలకు వినిపించాయి. దీనికితోడు ఇక్కడి ప్రధాన స్రవంతి మీడియా అంతా ఒక్కసారిగా చంద్రబాబును ఆకాశానికెత్తడం కోసం ‘తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్’ మధ్యనుండాల్సిన ఎన్నికలను ‘కేసీఆర్ వర్సెస్ ఆంధ్రా పెత్తనం, బాబు వ్యూహం’ అన్నట్లుగా చేసిన అతి ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ స్వయంకృతాపరాధం. దీనికితోడు అకారణంగా ప్రధాని మోదీపై పదే పదే ద్వేషం ప్రదర్శిస్తున్న బాబు కాంగ్రెస్‌తో కలిసి భాజపాను నాశనం చేస్తానన్న ప్రకటనలు కూడా అతిగా మారాయి. దీంతో భాజపాలోని కింది స్థాయి కార్యకర్తలు కేసీఆర్ గెలిచినా సరే కానీ- బాబుతో జతకట్టిన కాంగ్రెస్‌ను ఓడించాలని కారుకు ఓటేసారు. అన్ని పార్టీల సభలకు జనం వచ్చినా అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, రైతులు, పింఛన్‌దారులు మూకుమ్మడిగా కేసీఆర్ వైపు మొగ్గుజూపడానికి కారణం చంద్రబాబు సారధ్యంలో నడిచే కాంగ్రెస్ వస్తే సంక్షేమ పథకాలన్నీ పోతాయేమో అని భయపడడం. ఇక్కడి ఉద్యోగవర్గాల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ వైపు మళ్లింది. లేకపోతే కాంగ్రెస్‌లోని మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్ప అందరు సిట్టింగులు, హేమాహేమీలు ఓడిపోవటం ఏమిటి? తెరాస అభ్యర్థుల్లో దాదాపు 35 మంది పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ- ప్రజలు కేసీఆర్‌నే చూసారు కానీ అభ్యర్థుల గురించి ఆలోచించలేదు. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ అభ్యర్థులంతా తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుకు మద్దతిస్తున్నట్లు భావించారు. నిశ్శబ్ద విప్లవంలా కాంగ్రెస్‌కు ఓటేద్దామనుకొన్న వారు సైతం- కాంగ్రెస్‌ను బాబు చేతుల్లోపెట్టి ఆ పార్టీ నేతలు దిక్కులు చూడడం జీర్ణించుకోలేకపోయారు.ఇక గద్దర్ లాంటి వ్యక్తి ఇనే్నళ్లు ఎందరో అమరుల సమాధుల దగ్గర లాల్ సలాం చెప్పి చంద్రబాబును కౌగిలించుకోవడం ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేదు. సాత్వికుడిగా పేరున్న ఆచార్య కోదండరాంపై వ్యక్తిగతంగా ఈరోజుకూ గౌరవం ఉన్నా చంద్రబాబు ప్రక్కన కూర్చొని చేతులూపడం ఇక్కడి విజ్ఞులను ఆలోచనల్లో పడేసాయి. మోదీని గద్దెదించుతాం అన్న సీపీఐ నేతలు ఒక్కసారిగా చంద్రబాబును ఇంద్రుడని పొగుడుతుంటే ఇదంతా కేసీఆర్‌పై యుద్ధమే కదా..! అని ఇక్కడి ప్రజలు భావించారు. ఇలా అందివచ్చిన అవకాశాన్ని వదులుకొన్న కాంగ్రెస్‌కు చంద్రబాబు శాపంగా మారగా, కేసీఆర్‌కు వరంగా మారిపోయాడు. ‘కర్ణుడి చావుకు కారణాలెన్నో’ అని భారతం చెబితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబే కారణం అన్నది సుస్పష్టం. త్వరలోనే వీహెచ్ లాంటివారు దీన్ని కుండబద్దలు కొడతారు కూడా! అభివృద్ధి- వెనుకుబాటుతనం అనే అంశాలపై జరగాల్సిన చర్చ ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగంగా మార్చిన అదృశ్యశక్తుల పట్ల కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల తగిన ఫలితాన్ని అనుభవించింది. మూడు రాష్ట్రాల్లో గెలిచిన ఆనందం కన్నా తెలంగాణలో దారుణ పరాభవం కాంగ్రెస్‌కు చేదు జ్ఞాపకమే.


***************************************
✍✍-డాక్టర్. పి. భాస్కర యోగి 
భాస్కరవాణి : ఆంధ్రభూమి 


కొక్కొరో ... క్కో ...
స్వార్థ సిద్ధాంతం !


కాలడి నుండి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసి ఆదిశంకరులు అద్వైతం అనే సిద్ధాంతాన్ని అందిస్తే.. అంతే స్థాయిలో శ్రీమద్రామానుజులు, మధ్వాచార్యులు, నింబార్కులు.. ఎంతో అవలోకనం చేసి సిద్ధాంతాలను ఆవిష్కరించారు.
ఆధునిక కాలంలో ఐన్‌స్టీన్‌, ఆర్కెమిడీస్‌ అనేక సైన్సు సిద్ధాంతాలను ఆవిష్కరించారు. ఇలా మనదేశంలో అనేక సిద్ధాంతాలను కాచివడబోసి, సంసారాలు వదిలిపెట్టి, బ్రహ్మచారులుగా ఉండి కొత్త కొత్త పద్ధతులను లోకానికి అందించారు. కానీ ఇటీవల స్వార్థ రాజకీయ నాయకులు మాత్రం రాత్రికి రాత్రి తమ కుయుక్తులతో, మొద్దుబారిన మేధస్సుతో ఓ అద్భుతమైన సిద్ధాంతం ఆవిష్కరించారు. వీరి మెదడు ముందు గౌతమ బుద్దుడు, గురునానక్‌, శ్రీకృష్ణుడు, గోరఖ్‌నాథ్‌ వంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా చేతులెత్తెయ్యాల్సిందే!
అలాగే దేశాన్ని ఉర్రూతలూగించిన గాంధీ, బోసు, భగత్‌సింగ్‌, తిలక్‌, అంబేద్కర్‌, డాక్టర్జీ వంటి వారు సైతం వాళ్లను చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. మరి తమ మేధోమథనంతో కనుగొన్న కొత్త సిద్ధాంతం ఏంటో తెలిస్తే మన కళ్లు బైర్లు కమ్మాల్సిందే; దానిపేరే ‘స్వార్థపరత్వం.’
లేకపోతే ‘నావెన్నులో తూటాలు దింపాడని తల్లడిల్లిపోయి పాటలు రాసి పంచెగట్టి ఎగిరి దుంకిన మావోయిస్ట్‌ సాంస్కృతిక సారథి ‘గద్దర్‌’ చంద్రబాబు కడుపులో తలబెట్టడం ఏమిటి? ‘ప్రపంచ బ్యాంక్‌ జీతగాడు’ అని గొంతెత్తి అరచిన కమ్యూనిస్టులు బాబుగారి పక్కన నిలబడి ఫోటోలు దిగుతుంటే మన గుండె ఆగాల్సిందే.
రాజీవ్‌గాంధీ టి.అంజయ్యను, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఎన్టీఆర్‌ను అవమానిస్తే ఆ అవమానాగ్నిలోంచి పుట్టుకొచ్చిన ‘తెలుగుదేశం పార్టీ’ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ను వ్యతిరేకించింది. అది అన్నగారి జమానాలోని తెలుగుదేశం. కానీ ఇప్పుడు దేశాన్ని తలక్రిందులు చేయగల, ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను పెట్టిన అపర కులీకుత్‌బ్‌షా చంద్రబాబు సారథ్యంలో నడిచే తెలుగుదేశం కదా! ఈ అవమానాల చిట్టాను అమరావతి అనే కొత్త నగరం పునాదుల్లో దాచిపెట్టి మొన్న రాహుల్‌గాంధీ ప్రక్కన గజమాలలో దూరి ఫోటో దిగేందుకు పడ్డపాట్లు చూస్తే.. అబ్బ! చా! అనిపిస్తుంది. రాజీవ్‌గాంధీకే టెక్నాలజీ గురించి చెప్పానన్న బాబు రాహుల్‌గాంధీతో కరచాలనం చేసేందుకు, అతని ముందు పెద్దరికం ప్రదర్శించేందుకు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ముక్కుమీద వేసుకొన్న వేలుకూడా కిందకు సిగ్గుతో జారిపోతున్నది.
ప్రపంచాన్నే ఏకం చేస్తాం అనే కమ్యూనిస్టు సురవరం సుధాకర్‌రెడ్డి ముష్టి మూడుసీట్ల కోసం దేబిరిస్తూ ప్రజాకూటమి వేదికపై నిలబడి ‘మోదీని దించేస్తాం’ అని ప్రకటిస్తుంటే కలికాలం ఇంత అద్భుతంగా నడుస్తుందా! అనిపిస్తోంది. ఇక 125 సంవత్సరాల క్రితం పుట్టి ‘మేం లేకపోతే సూర్యచంద్రులకే వెలుగు లేదు’ అని మాట్లాడే కాంగ్రెసు పార్టీ మోదీ, కేసీఆర్‌లను కొట్టేందుకు కోదండరాం లాంటి ‘పాలిట్రిక్స్‌’ తెలియని పొలిటికల్‌ శాస్త్రవేత్తను వెంబటి పెట్టుకోవడం వల్లనే కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందని అనిపిస్తున్నది!?
మానవ హక్కుల సంఘాలలో మరిగిమరిగి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో కరిగి కరిగి, తెలంగాణ ఉద్యమంతో తెగ ఊగిన కోదండరాం గుప్పెడు సీట్లకోసం గాంధీభవన్‌ మొదలుకొని టెన్‌ జనపథ్‌ వరకు తిరిగితిరిగి కేసీఆర్‌తో వెళ్లలేక, కాంగ్రెస్‌తో వేగలేగ బాధపడడం కలియుగ విచిత్రం!!?
ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారం మోదీ, షాలు తన్నుకుపోతే కర్ణాటక కంఠీరవుడైన దేవగౌడతో పొత్తు సరిగ్గా లేకున్నా బయటకు చెప్పుకోలేకపోతుంది కాంగ్రెస్‌. ఇన్నాళ్లు అమ్మగారు రాజమాత సోనియా సేవలో తరించే బంట్లు మొత్తం ఎలాగైనా పరువు దక్కించుకోవాలని పరుగు పరుగున తెలంగాణలో వాలిపోయారు. ఇక దీంతో పాటు ‘చారిత్రక కలయిక’ అంటూ చంద్రబాబు – రాహుల్‌ కలయికను తెలుగు పచ్చళ్లు రోట్లో వేసి దంచి తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటే చప్పరించలేక మనం చచ్చిపోవడం కూడా కలియుగ విచిత్రాల్లో భాగమే!
నేను గెలిస్తే..!
నేను గెలిస్తే చుక్కల్లో చంద్రుణ్ణి ఒక్కణ్ణి రహస్యంగా మీ ఇళ్లలోకి తెస్తాను. నేను గెలిస్తే సూర్యుణ్ణి సుద్దముక్కలా చేసి బడుగు పిల్లలకు బలపంగా ఇస్తాను. నేను గెలిస్తే గోదావరిని ఆంధ్రాకు వెళ్లకుండా అడ్డుట్టవేసి మీ ఇంటి నల్లా పైపులోకి పంపిస్తాను. నేను గెలిస్తే కృష్ణానదీ ప్రవాహాన్ని చుక్క కూడా క్రిందకు పోనివ్వకుండా విజయవాడలోనే కొత్త పసుపు పచ్చ సముద్రాన్ని సృష్టిస్తాను. వీలైతే దానికి ‘చంద్రన్న సముద్రం’ అని పేరు పెడతాను. నేను గెలిస్తే దేశంలో ఎలాంటి పన్నులు లేకుండా చేసి దేశంలోని డబ్బును స్విట్జర్లాండ్‌కు తరలిస్తాను. నేను గెలిస్తే ఐటి, ఈడి, సిబిఐలను రద్దుచేసి సీఎం రమేశ్‌ను, సుజనాచౌదరిలను చుట్టాల్లా చూసుకుంటాను. నేను గెలిస్తే ఏ సిఎంనైనా నాకాళ్ల దగ్గర మోకరిల్ల జేస్తాను. నేను గెలిస్తే అర్జంటుగా అర్ధరాత్రి మతోన్మాదంపై యుద్ధం చేసి ప్రగతిశీల అభ్యుదయ సెక్యులర్‌ వ్యవస్థలను సృష్టించి సామాజిక న్యాయంతో సంపదను అందరికీ పంచేస్తా. వీలైతే మాకినేని బసవ పున్నయ్య భవనం, సుందరయ్య విజ్ఞానం కేంద్రం అమ్మేసి దేశంలోని పేదసాదలందరికీ సంపద పంపిణీ చేసి మార్క్స్‌ రాజ్యాన్ని స్థాపిస్తా. నేను గెలిస్తే మా పీఠం మాత్రం అలాగే అట్టిపెట్టుకొని బహుజన లెప్ట్‌ భావాలు గల వాళ్లను ఎమ్మెల్యేలుగా చేసి మాయవతి – మార్క్స్‌ సిద్ధాంతంతో సరికొత్త ‘మాయా సామ్రాజ్యం’ నిర్మిస్తాను. నేను గెలిస్తే పీడనలేని, దొరల పాలనలేని సామాజిక తెలంగాణ సాధిస్తాను. నేను గెలిస్తే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు ఇచ్చినా, నా అంత గొప్పవాడు ఈ దేశ రాజకీయాల్లో ఎవరూ లేరని చెప్పే బాబుగారి పాదాల దగ్గర భరతునిలా ఉండి పాలిస్తా.
ఇవన్నీ విన్న ఓటరు.. ఇన్ని చెప్పారు ‘ఈ దేశాన్ని కాపాడుతా’ అని ఒక్కరు చెప్పలేదే ! అని బాధపడి, భరతమాతను మనసులో ప్రార్థించి ఓటు వేయడానికి బయలుదేరాడు..!!***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
10 : 16 : డిశంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 06‘‘ఓ అణుశాస్తవ్రేత్తగా మూడో ప్రపంచ యు ద్ధంలో ఏం జరుగుతుందో చెప్పండి’’- అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దానికి ‘‘మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం నన్ను అడగకండి? నాలుగో ప్రపంచ యుద్ధం గురించి మాత్రం చెప్పగలను’’ అని అన్నాట్ట ఆయన. ఇదేంటని పాత్రికేయుడు నోరెళ్లబెడితే- ‘‘నాలుగో ప్రపంచ యుద్ధం ఎప్పటికీ జరగదు.. మూడవ ప్రపంచయుద్ధమే ఆఖరి యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజకీయవేత్తలంతా ఆఖరి ప్రపంచ యుద్ధం కోసం అన్నీ సిద్ధం చేస్తూనే ఉన్నారు’’ అన్నాడట ఐన్‌స్టీన్.

నేటి రాజకీయాల్లో జరుగుతున్న దుస్సంఘటనలు, దురాలోచనలు చూస్తుంటే మనం కూడా అలాంటి ప్రమాదంలోకి నెట్టబడుతున్నామా? అనే భయమేస్తుంది. ఉదాహరణకు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలను చూడండి. కొత్తకొత్త పొత్తుల వంటలు వండి వార్చినా, రాత్రికి రాత్రి పార్టీలు మారి టిక్కెట్టు సంపాదించినా, ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారినా ప్రజలు వాళ్లను అంగీకరిస్తున్నారు! ఇదే మన ప్రజాస్వామ్యానికి పట్టిన మాయరోగం.

స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశంలో కుటుంబ పాలనకు నాంది పడింది. మోతీలాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసిన విజ్ఞులలో ఒకరు. ఆయన వారసత్వంతో గాంధీ చాటున జవహర్‌లాల్ నెహ్రూ గద్దెపై కూర్చొన్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో రాజకీయవేత్తలు ఈ దేశ రాజకీయ యవనికపై ఉన్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభభాయి పటేల్ వంటి కాకలుదీరిన యోధానుయోధులు ప్రధాని పదవిని సమర్ధవంతంగా నిర్వహించగలిగిన వారే. వీళ్లందరి కన్నా ముందే నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ కొంత భారతదేశానికి తన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ద్వారా స్వాతంత్య్రం ప్రకటించి నెహ్రూ కన్నా ముందే ఈ దేశ ప్రధాని అయ్యాడు. కానీ, మహాత్మా గాంధీ అండదండలు పుష్కలంగా సంపాదించిన నెహ్రూ తన ప్రధాని పీఠాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. నెహ్రూ అనంతరం ఎందరో రాజకీయ దురంధరులను కాదని ఇందిర అధికారం చేపట్టగా, ఆ వారసత్వ పరంపర నేడు రాహుల్ గాంధీ వరకు నాలుగో తరం కొనసాగుతున్నది. వారసత్వ వృక్షానికి ఫలించిన రాహుల్ గాంధీ ఇపుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తాడట!?

పెద్ద ప్రజావిప్లవం వచ్చిన తర్వాత తెలంగాణ కూడా ఇలాంటి కబంధహస్తాల్లోకే వెళ్లిందని ఇపుడు అన్ని పార్టీలవారు విమర్శిస్తున్నారు. సబ్బండ వర్ణాల ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇపుడు ఓ కుటుంబం చేతిలో చిక్కిందంటే- ఈ దేశంలో ఆదర్శం ఎవరు? ఉద్యమనేతగా కేసీఆర్ పోరాటాన్ని గుర్తించి 2014 ఎన్నికల్లో ప్రజలు ఓసారి అధికారం ఇచ్చారు. కేసీఆర్ చెబుతున్నట్లు వ్యవస్థల్ని అర్థం చేసుకొనేందుకు ఈ నాలుగేళ్లు సరిపోయింది.. ఇపుడు అభివృద్ధి జరిగి తీరుతుంది చూ డండి అని చెప్పడం ఈ ఎన్నికల సమయానికి ప్రజలు జీర్ణించుకుంటారా? లేదా? అన్నది చూడాలి. మన దేశంలో ప్రజలకు అభివృద్ధి కన్నా భావోద్వేగాలు ఎక్కువ. ఈ విషయం ఒకే పాఠశాలలో చదువుకున్న ‘ఇద్దరు చంద్రుల’కు తెలుసు. అందుకే ఇపుడు తెలంగాణ రాజకీయాలు తలక్రిందులయ్యాయి. అందుకే ఇపుడు ఎన్నో కలియుగ వింతలను మనం చూస్తున్నాం.

‘నా వెన్నుపూసలో బులెట్ దింపింది చంద్రబాబే , ఎన్‌కౌంటర్ల పేరుతో నక్సలైట్లను పొట్టనబెట్టుక్నొవాడు చంద్రబాబు’- అని ఎన్నోసార్లు చెప్పిన ప్రజాగాయకుడు గద్దర్ ఇప్పుడు చంద్రబాబు కడుపులో తలపెట్టి తల్లడిల్లిపోతే ఇది కలియుగ విచిత్రం కాక ఇంకేమిటి? రాహుల్‌ను కూడా ఆలింగనం చేసుకున్నాడు గద్దర్. ఇనే్నళ్లు పీడిత, తాడిత, బహుజన రాజ్యం, మార్క్స్ రాజ్యం, మావోరాజ్యం కావాలన్న గద్దర్ ఇప్పుడు రాహుల్ రాజ్యం కావాలంటున్నాడు! ఓ జాతీయ పార్టీ నాలుగుతరాలు పాలించినా ఈ దేశంలోని సమస్యలు గద్దర్ భుజం మీది గొంగడిలా అలాగే ఉన్నాయి. దీనికి కారణం ఏ పార్టీ? ఏ కుటుంబం? ఏ రాజకీయ వారసత్వం? 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ‘నక్సలైట్లు అసలు సిసలైన దేశభక్తులు’ అన్నాడు. 1989లో చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చినపుడు నక్సలైట్ల పట్ల ఉదాసీన వైఖరి చూపాడు. అలిపిరి ఘటన తర్వాత ఆనాటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి- ‘చంద్రబాబును మించిన నక్సలైట్ లేడు’ అన్నాడు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి నక్సలైట్లపట్ల మొదట కొంత సానుభూతి చూపి ఆ తర్వాత కఠినంగా వ్యవహరించాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ‘నక్సలైట్ల ఎజెండాను మేం అమలు చేస్తాం’ అని ప్రకటించాడు. అధికారంలోకి రాగానే ఈ స్టేట్‌మెంట్లు అన్నీ తలక్రిందులయ్యాయి. ఇప్పుడు విచిత్రంగా గద్దర్ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చే వ్యక్తిగా మారడం కలియుగ విచిత్రం!

ఇక తెరాస వెంబడి ఉన్న మజ్లిస్ పార్టీది మరో కథ. కేసీఆర్ ‘మజ్లిస్ మాకు గొప్ప రాజకీయ భాగస్వామి’అని ప్రకటిస్తే మజ్లిస్ వైఖరి మరోలా ఉంది. కర్ణాటకలో కుమారస్వామిలా తాను ముఖ్యమంత్రిని అవుతానని, ఇప్పటివరకూ అందరు సీఎంలు కేసీఆర్ సహా మా పాదాల చెంత తలవంచారని అక్బర్ ప్రకటించాడు. భాజపాను నిలువరించాలంటే కేసీఆర్‌ను, భాజపాను కలువనివ్వకూడదనే తాము టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నామని కూడా ఓవైసీ ప్రకటించాడు. దీంతో హిం దువుల్లో కలవరం మొదలయ్యింది.

మజ్లీస్ గురించి కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. ఇనే్నళ్లూ తమవెంట తిరిగినప్పుడు గొప్ప ‘ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ’గా కన్పించిన మజ్లీస్ ఇప్పుడు కాంగ్రెస్‌కు మతతత్వవాదిగా కన్పిస్తోంది. మజ్లిస్‌ను ఇన్నాళ్లు పెంచి పోషించిన కాంగ్రెస్ ఓవైపు ముస్లిం లీగ్ పార్టీని చంకనెత్తుకునే మరోవైపు ఓవైసీ బ్రదర్స్‌పై యుద్ధానికి తలపడడం మరో విచిత్రం. 

కేసీఆర్ మజ్లిస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల హిందూ యువకుల ఓట్లకు తెరాస దూరం అయినట్లే. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన మజ్లిస్‌ను కేసీఆర్ ఒకప్పుడు ‘పాతబస్తీలోని పిడికెడంత పార్టీ’ అన్నాడు. ఇపుడు మాకు వాళ్లను మంచిన మిత్రులు లేరు అంటున్నాడు. ‘బంగారు ముద్ద’అని పాగిడించుకున్న కోదండరాం కేసీఆర్‌కు బద్ధశత్రువయ్యాడు. ఆ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ తన పాత తెలివితేటలు ప్రయోగించి ఎక్కడుంచాలో అక్కడుంచింది. ఆచార్యుడు రాజకీయాల్లోకి వస్తేగానీ ఈ తత్వం బోధపడడంలేదు. నల్లపుప్రహ్లాద్ వంటివారు గాని, ఇటీవల టీజెఎస్ వీడి వెళ్లిపోయిన ప్రొ.జ్యోత్స్న, రచనారెడ్డిల వ్యాఖ్యలు చూస్తే రేపు కోదండరాం పరిస్థితి కాంగ్రెస్‌లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇవన్నీ రాజకీయ చిత్ర విచిత్రాలే!

వెనుకటికి ఒకడు తల్లిని చంపి కోర్టుకు వెళ్లాడట. నీకు ఉరిశిక్ష వేస్తాం అని జడ్జి అంటే ‘తల్లిలేనివాణ్ణి కనికరించండి’ అన్నాట్ట. ఇటీవల చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూసి ప్రత్యర్థులు చెబుతున్న నానో కథ ఇది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకన్నా కేసీఆర్‌కు పెద్దశత్రువు చంద్రబాబే. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన నాయకుడు భారతదేశంలో చంద్రబాబు ఒక్కడే. తన బలం, బలహీనత గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే తన వ్యక్తిత్వాన్ని వెంటనే మార్చుకోగలడు. అదే ఆయన రాజకీయ మనుగడకు కారణం. అనేకమార్లు ‘యూ టర్న్’ తీసుకోవడం ఆయనకు కలిసొచ్చింది. లేని శత్రుత్వాన్ని, మిత్రత్వాన్ని సృష్టించి తనకు కావలసింది సాధించుకోవడం బాబు నైజం అని విశే్లషకులు చెప్తారు. అందుకే ఎన్టీఆర్ లాంటి మహా నటుడు... ‘హి ఈజ్ బెటర్ యాక్టర్ దేన్ మీ’ అన్నాడు. ఈ చరిత్ర తెలిసినవారు ఇపుడు చంద్రబాబు కాంగ్రెస్ కండువా వేసుకొని రాహుల్ ప్రక్కన గజమాల సరిచేసుకొని ఫొటో దిగుతుంటే పెద్దగా ఆశ్చర్యపడడం లేదు.

బురదనుండి మాత్రమే ‘కమలం’ వికసించే కాస్మిక్ నియమం ఉందని ఓ తత్త్వవేత్త చెప్పాడు. ఈ కుటుంబ పాలన, కులవాదం, మతతత్త్వం, అవకాశవాదం, స్వార్థ రాజకీయం, ఊసరవెల్లి బుద్ధులు, ఆశ్రీత పక్షపాతం, అవినీతి వంటివన్నీ మనముందు కదలాడుతున్న పార్టీలు సృష్టించినవే. ఇదంతా బురద రాజకీయమే. మనం ఈ బురదలో మునిగిపోకుండా, ఆ బురద నుండే కమలాలను వికసింపజేయాలి. కమలాల విత్తనాలు ఒక అద్భుతం. అవి బురదను సైతం అందమైన పుష్పంగా మారుస్తాయి. ఇదే ఈనాడు తెలంగాణ ఓటరు గ్రహించాల్సిన సూత్రం.

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 
మనిషి హృదయంతో చేసే ఆరాధన ప్రేమ. బాహ్యచేష్టలన్నీ కర్మారాధనగా చేస్తాం. హృదయంతో ప్రేమించడమే ధ్యానం, ప్రార్థన, యోగం. సగుణారాధనలో మన భక్తి అంతా కర్మకాండలా కనిపిస్తుంది. కానీ నిర్గుణారాధన తత్వం అందులో ఇమిడి ఉంది. షోడశోపచార పూజలో కూడా ధ్యానం ఉంటుంది. ఇదంతా భక్తితత్వం అర్థమయినప్పుడు మాత్రమే సాధ్యం. దురదృష్టం ఏమిటంటే.. వస్తు ప్రేమకు అలవాటు పడిన మనుషులు అంతఃకరణాన్ని గుర్తించలేకపోతున్నారు. అందువల్ల వస్తువులతో చేసే అన్ని బాహ్యాడంబరాలకూ ప్రాధాన్యం ఇస్తుంటారు.
అదే మేలిరకం అనుకొని అందులోనే మునిగి అంతర్తత్వాన్ని విస్మరిస్తారు. నిజానికి భగవంతుడు ఆనంద స్వరూపుడు. ప్రేమస్వరూపుడు. కానీ చలనచిత్రాలు చూసీచూసీ స్త్రీ, పురుషుల మధ్య ఉండేదే ప్రేమ అనే భావన చాలామందిలో స్థిరపడిపోతుంది. కానీ ప్రేమకు ఎన్నో రూపాలుంటాయి. పేర్లు ఉంటాయి. స్త్రీ, పురుషుల పరస్పర ప్రేమ మోహం. ధనం, ఆస్తులపై ఉండే ప్రేమ లోభం. పుత్రపౌత్రాదులపై ఉండే ప్రేమ వాత్సల్యం. దేహంపై ఉండే ప్రేమ అభిమానం. దీనప్రాణులపై ఉండే ప్రేమ దయ. వస్తువులపై ప్రేమ మమకారం. మన సమానులపై ఉండే ప్రేమ మైత్రి, స్నేహం. సత్పురుషులపై ఉండే ప్రేమ సత్సంగం. పెద్దలపై ఉండే ప్రేమ గౌరవం. భగవంతునిపైనా గురువుపైనా ఉండే ప్రేమ భక్తి. ఇలా మన మహర్షులు ప్రేమను రకరకాలుగా వర్గీకరించారు. అందుకే నారదుడు ‘స్వాతస్మిన్‌ పరమ ప్రేమ రూపా’ అన్నాడు.
ఆ పరమేశ్వరునిపై సంపూర్ణ ప్రేమ భక్తి అని స్పష్టం చేశాడు. ఆ ప్రేమనే సగుణతత్వంలో ఆరాధనగా, నిర్గుణభావంలో ధ్యానంగా మారుతుంది. ఈ రెండింటి మధ్య సూక్ష్మత తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవనంలోని ప్రథమపాఠం. దీన్ని గ్రహించలేని వ్యక్తులు శిక్షణార్థుల్లా మెల్లమెల్లగా సాకారతత్వం నుంచి నిరాకార తత్వం వైపు వెళ్లాలని పెద్దలు ప్రబోధించారు. హృదయం నిండా ప్రేమతత్వం ఉన్నప్పుడు సృష్టిలోని విషయమంతా ప్రేమమయంగా గోచరిస్తుంది. దృష్టిలో భేదం ఉంటుందిగానీ సృష్టిలో భేదం లేదని స్పష్టమవుతుంది. దానిని సాధించే సాధన హృదయాంతర్గమైన పరమాత్మ స్వరూపమే. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి మనమూ ఆనందమయులమై హృదయం నిండా ప్రేమను నింపుకొని ఆ పరమాత్మతో ఏకత్వం పొందాలి. నువ్వుల్లో నూనెలాగా, పాలల్లో నెయ్యిలాగా, పుష్పాల్లో సుగంధం లాగా, ఫలంలో రసంలాగా, కట్టెలో అగ్నిలాగా.. మనలో దాగి ఉన్న ఆత్మరూపంలోని ప్రేమే పరమాత్మతో ఏకత్వం సాధిస్తుంది. అలాంటి ప్రేమతత్వ సాధనే ఆధ్యాత్మికతకు, భక్తికి పరిపూర్ణత.

********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*
కొక్కొరో ... క్కో ...
కాకిపిల్ల కాకికి ముద్దు….!

రాజకీయ నాయకులు తమ వారసులను కాస్త కలర్‌ ఇచ్చి జనాలపై రుద్దేస్తున్నారు. ఈ వారసత్వ రాజకీయాలకు మూలమైన గాంధీ నెహ్రూ కుటుంబాల సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఇప్పటికీ దేశంలో కాకలు తీరిన రాజకీయ నాయకులు ఎందరో కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ రాహుల్‌ గాంధీని చూస్తే వారికి ఎనలేని భక్తి ప్రపత్తులు గుర్తుకొస్తాయి. నిజానికి ప్రణబ్‌ ముఖర్జీ లాంటి రాజకీయవేత్త దగ్గర లేని లక్షణం ఏమిటి? రాహుల్‌ గాంధీ దగ్గరున్న ఐస్కాంత క్షేత్రం ఏమిటి? నిజానికి మనం ఇలాంటి రాజకీయ క్రీడలకు అలవాటుపడ్డాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొన్ని కుటుంబాలు లేకుంటే మనం బ్రతకలేము అన్న దుస్థితికి దిగజారిపోయాం. దీనికే ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడిగి అందంగా అట్ట వేసి లోకానికి చూపిస్తున్నాము. ఇదే వరస ఇటీవల కాలంలో సినిమా లోకంలో కూడా పరివ్యాప్తం అయింది. దర్శకులు నిర్మాతలు ఎంతో డబ్బు పెట్టి నిర్మించే సినిమాలు మా సంతానం తోటి నిర్మించుకుంటే బాగుంటుందని తలంచి వాళ్ల కొడుకులు ఎంత బాగా లేకున్నా హీరోలను చేసేస్తు న్నారు. విచిత్రమేమిటంటే కూతుర్లని హీరోయిన్లు చేయడం లేదు. ఇక్కడ స్త్రీవాదం తలకిందులైంది.!? వీలైతే వాళ్లను రాజకీయ నాయకురాళ్లుగా మారుస్తున్నారు. ఈ జాడ్యం వ్యాపార రంగంలోకి చేరింది. అసలు వ్యాపారం మొత్తం చూసే వ్యక్తులు వేరే ఉంటారు కానీ వ్యాపారానికి అధినేత్రిగానో అధినేతగానో వారి సంతానం ఉంటుంది. ఇదంతా వారసత్వ జబ్బు.
తండ్రులు రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యే లోపల తమ కొడుకులను పీఠాలపై కెక్కించి హాయిగా కన్నుమూస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. జవహర్లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇలా తెరపైకి వచ్చిన వారే. వారి మార్గాన్ని అనుసరించి దేశం నిండా కుటుంబ రాబందులు వాలిపోయాయి. ఇప్పుడు వారి కుటుంబాల వేర్లు బ్రిటీష్‌ వాళ్లపై చేసిన పోరాటం కన్నా ఎక్కువయి, పీకి పారేయలేనంత లోతులో ఉన్నాయి. రాష్ట్రానికి ఓ కుటుంబం లేదా రెండు కుటుంబాలు ఆధునిక రాజకుటుంబాలుగా మారిపోయి వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ఏమైనా అంటే మా కుటుంబాలు త్యాగం చేశారు అంటారు. రాజ్యాంగమా నీకు ఇంత దుస్థితి వాటిల్లింది కద!?
తెలుగునాట చంద్రబాబు కెసిఆర్‌ ఇద్దరూ ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు ప్రతినిధులుగా ఉన్నారు. నిజానికి ఎన్టీఆర్‌ పార్టీ వారసత్వాన్ని అమాంతం మింగేసి చంద్రబాబు గద్దెనెక్కాడు. కేసీఆర్‌ సొంత ప్రతిభ మీదే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు వారసత్వాన్ని తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాడు. అయితే రాజకీయం కూడా వ్యాపారం లాగా నిలదొక్కుకున్న వాళ్లకు మాత్రమే సహాయ పడుతుంది. కేటీఆర్‌, కవిత, హరీష్‌, సంతోష్‌ అలా
నిలదొక్కు కుంటారేమో వేచిచూడాలి. మరోవైపు ఆంధ్రాలో జగన్‌ ఈ వారసత్వ
రాజకీయ వక్షానికి పుట్టిన ఫలమే. ఇక చంద్రబాబు తన 40 ఏళ్ల ఇండస్ట్రీ పరిజ్ఞానం ఉపయోగించి సొంత దర్శ కత్వంలో లోకేష్‌ అనే మహారాజకీయ నాయకుని ఆంధ్రప్రదేశ్‌ మీద వదిలాడు. ఈయన తెలుగు కన్నా ఇంగ్లీష్‌ బాగా మాట్లాడుతాడు. !? ఎందు కంటే తెలుగువారి ఆత్మగౌరవానికి లోకేష్‌ ప్రతీక. కోట్లాదిమంది తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా తనను తాను చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి ఇంగ్లీష్‌ తెలుగు బ్రాండును మనకందించి నందుకు ఎంతో ధన్యులం. ఇదే కోవలో హరికష్ణ కూతురుగా ఇటీవల కొత్త వారసత్వ నాయకురాలు రాజకీయ రంగప్రవేశం చేసి ఏకంగా కూకట్‌పల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడింది. ఈమె గెలవవచ్చు, మంత్రి కూడా కావచ్చు. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం, ప్రాంతం అన్నీ చూసి చంద్రబాబు ఆమెను రాజకీయాల్లోకి దింపాడు. ఇందులో విచిత్రమేమి టంటే ఆమె నందమూరి ఇంటి నుంచి చుండ్రు వారి ఇంటికి కోడలిగా వెళ్ళింది. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెను నందమూరి సుహాసినిగా పేర్కొనడంలో ఆంతర్యమేమిటో తెలుసుకోవాలంటే కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత అంతరార్థం తెలియాల్సిందే !
వింత కాక మరేమిటి ?
మొన్నీ మధ్య కాంగ్రెస్‌వాళ్లు కంగారు పడకుండా చేసిన మొదటి సభ మేడ్చల్‌లో జరిగింది. దాంట్లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌’గా 14 ఎన్నికలలో తన సొంత పార్టీని ఓడించుకున్న రాహుల్‌గాంధీ నిలవడం విచిత్రం. ఇక హనుమంతరావు లాంటి పరమ భక్తులంతా కలిసి సోనియమ్మను ‘తెలంగాణ తల్లి’గా మైమరపింప చేశారు. ఇప్పటికే కాకలుదీరిన కాంగ్రెస్‌ నాయకుడు పి.శంకర్‌రావు సోనియాకు ఏకంగా గుడే కట్టిస్తానని మొదలుపెట్టాడు. మరి ఇప్పటికే కేసీఆర్‌ ‘తెలంగాణ తల్లి’ ని సృష్టించాడు. ఇక ఎప్పుడు అవసరమైతే అప్పుడు పలికేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చంద్రబాబు లాంటివాళ్లకు ‘తెలుగు తల్లి’ ఉండనే ఉంది. ఈ కొత్త తల్లుల సృష్టికర్తలంతా కలిసి భారతీయులందరికీ తల్లైన ‘భారతమాత’ను విస్మరించడం విడ్డూరం.
మేడ్చల్‌ సభలో పెద్ద పెద్ద వీర తిలకాలతో సోనియా, రాహుల్‌ కన్పించారు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ‘ఎప్పుడూ బొట్టు పెట్టని సోనియాగాంధీ మోదీ దెబ్బకు బొట్టుపెట్టక తప్పని పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్‌ చేశారు.
గుజరాత్‌, కర్నాటక ఎన్నికల్లో రాహుల్‌ జంధ్యం ధరించి తాను శివభక్తుడని ప్రకటించు కున్నాడు. సుబ్రహ్మణ్యస్వామి లాంటివారు ముద్దుగా పిలుచుకునే రాహుల్‌ ప్రిన్సీ ఇలా హఠాత్తుగా హిందువు అవ్వడం ఒక విధంగా సంచలనమే. ఇదంతా ఎలా జరిగింది అన్నదే ఇప్పటి ప్రశ్న.
ఇక తెలంగాణ గడ్డ మీద కాలుపెట్టిన సోనియా ఆంధ్రాకు ప్యాకేజి కేటాయిస్తుందా ? అసలు ఏం మునిగిపోయిందని సోనియా కడుపు తరుక్కుపోయింది ? సమైక్యాంధ్రలో నెలనెలకు మూటలు ముట్టేవని, ఇప్పుడు అవి అందట్లేదనా ? అని టిఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. ఇదే ప్రశ్నను ‘దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, వాటిని సరిచేస్తానని బయల్దేరిన చంద్రబాబుని భాజపా అడిగితే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. అయినా 12 వందల మంది ప్రాణాలు తీసుకున్న తర్వాత ఇచ్చిన తెలంగాణకు సోనియా తల్లి అవడం, ఏనాడూ తెలుగు గురించి పట్టించుకోని చంద్రబాబు ‘తెలుగు తల్లి’, ‘ఆత్మగౌరవం’ అనడం వింతగాక మరేమిటి ?
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
02 : 03 డిశంబర్  - 2018
సంపుటి : 71, సంచిక : 05
అనాగరిక, అరాఛక పీడిత ప్రాంతంగా భారత్‌ను అభివర్ణించే ఉదారవాద, మత నిరపేక్షవాదులు, వామపక్షాలు, మత మార్పిడి కుట్రదారులు ఈ దేశంపై తెలివిగా యుద్ధం చేస్తున్నారు. వారు ఓ పథకం ప్రకారం భారతీయతను, దాని మూల సంస్కృతిని వ్యతిరేకిస్తున్నారు’- అంటూ ప్రముఖ పాశ్చాత్య భారతీయ రచయిత రాజీవ్ మల్హోత్రా చెప్పింది అక్షర సత్యం. ఇపుడు దేశ రాజకీయాలను చూస్తుంటే ఇదంతా చాపకింద నీరులా కన్పించకుండా భారత విధ్వంసానికి ఎలా కుట్ర జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

మనదేశంలో క్రీ.శ.712 తర్వాత హిందూరాజుల పాలనకు ముగింపు జరిగిందనే చెప్పవచ్చు. మధ్య మధ్యలో కొన్ని సామ్రాజ్యాలు, కొందరు హిందూ రాజులను మినహాయిస్తే మిగిలిన పాలనంతా విదేశీ భావజాలంతో జరిగిందే. దానికి అలవాటుపడిన మన మేధోవర్గాలు ఆధునిక కాలంలో ‘సెక్యులరిజం’ అనే అందమైన ముసుగు తొడిగి ‘‘గంగా జమునా తహజీబ్’’ అంటున్నాయి. నిజానికి ‘సెక్యులరిజం’ అనే పదం పాశ్చాత్య అర్థంలో మన దేశానికి వచ్చినా ఇక్కడ దానికి సరికొత్త పరిభాష సృష్టించారు. ఇపుడు దేశంలో ‘సెక్యులరిజం’ అంటే మత నిరపేక్షగల రాజ్యం అని గానీ, అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని గానీ ఎవరూ చెప్పరు. మెజారిటీలను తిడుతూ మైనారిటీలను సంతుష్టిచేయడమే సెక్యులరిజం అని ఈ దేశ మేధోవర్గాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీలు పుట్టించిన కొత్త అర్థం.

ప్రధాని నరేంద్ర మోదీని తక్షణం గద్దె దింపాలని కలలు గంటున్న వారందరిదీ రాజకీయ వైరం అనుకుంటే శుద్ధ తప్పు. రాజకీయంగా ఎవరు గద్దెమీదున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ మోదీ గద్దెమీదుంటే ఈ దేశ ‘మెజారిటీ ప్రజల జాతీయత’ అందరిపైనా పెత్తనం చేస్తున్నట్లు భావించాలి. లేదంటే ఈ దేశ సూడో సెక్యులర్ గ్యాంగ్ అరచి గోల చేసి ఈ విషయాన్ని ఢంకా భాజాయించి, మత తత్త్వ పార్టీ గద్దెనేలుతోందని ప్రపంచానికి చాటుతుంది. మోదీని, భాజపాను, దాని వెనుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను సిద్ధాంతపరంగా వ్యతిరేకించే కమ్యూనిస్టు వర్గాలు ఈ విషయంపై ‘ఎంతైనా చూసుకుందాం’ అంటూ సవాల్ విసురుతాయి. 

ఇపుడు రాజకీయపరంగా కమ్యూనిస్టుల ‘గ్రాఫ్’ పాతాళంలో ఉన్నందున ఆ పార్టీని ఆశ్రయించిన మేధో వర్గం కాంగ్రెస్ పంచన చేరి మోదీపై విషం చిమ్మే ప్రయత్నంలో వుంది. ఇటీవల ‘రిపబ్లిక్ టీవీ’ రహస్య విశే్లషణ ప్రకారం 68 మంది ప్రసిద్ధ పాత్రికేయులకు, బ్యూరోక్రాట్లకు భారీగా డబ్బులు చెల్లించి మోదీపై దుష్ప్రచారం చెయ్యాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంబ్రిడ్జి అనలటికా అనే సంస్థ ద్వారా ఆ పథకం అమలు జరిగేట్లు ఒప్పందం జరిగిందని సదరు టీవీ బయటపెట్టింది. వీరిలో నిత్యం మోదీపై దుమ్మెత్తిపోసే శేఖర్ గుప్తా, మైథిలీ శరణ్, ప్రణయ్ జేమ్స్ రాయ్, ఆకార్ పటేల్, పరాంజయ్ గుహ, హర్షమందర్, రాజ్‌దీప్ సర్దేశాయ్, విక్రం చంద్ర, ప్రొ. సజ్జాద్, బర్ఖాదత్, యోగేంద్ర యాదవ్, టి.ఎన్.శ్రీనిరాఘవన్, కరణ్ థాపర్ వంటి ప్రముఖ పాత్రికేయులు ఉన్నారు.

వీళ్లందరూ దేశంలో మతతత్వం పెచ్చరిల్లిందని, భావ స్వేచ్ఛ లేదని, వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని నిత్య స్తోత్రం చదువుతారు. ముస్లిం మైనారిటీలకు రక్షణ లేదని వారిలో అభద్రతా భావం కల్పిస్తారు. నిజానికి రోజూ టీవీలముందు కూర్చొని, పత్రికలలో వ్యాసాలు రాసేవారు మోదీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ‘రైట్‌వింగ్’ వారితో నింపేసారని అసత్యాలు చెప్తుంటారు. కానీ అది పచ్చి అబద్ధం. నెహ్రూ కాలం నుండి దేశంలో కళా, సాహిత్య పాత్రికేయ, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష వర్గాలదే పైచేయి. ఈరోజుకూ అది కొనసాగుతూనే వుంది.

2019లో మళ్లీ మోదీ గెలిచినా ఈ వ్యవస్థలను ప్రక్షాళన చేయకపోతే భారతీయ జనతా పార్టీ మేధోవర్గం దెబ్బలు కాయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయని కొన్ని సాంస్కృతిక తప్పిదాలు ఎన్టీయే జాతీయవాద ప్రభుత్వం చేసింది. జాతీయ భావజాల వ్యతిరేకులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నట్లు నిజంగా వ్యవస్థలను మత తత్వ వాదులతో నింపేశారా?

అలా అయితే అద్వానీని బాబ్రీ మసీదు కట్టడం కూల్చాక ‘రక్తపిపాసి’ అని సంపాదకీయం రాసిన ఓ పత్రికా ప్రముఖుడికి ‘పద్మ విభూషణ్’ బిరుదు ఎలా వచ్చింది? చంద్రబాబుకు, వెంకయ్యనాయుడుకు సన్నిహితంగా వుండే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మరోసారి ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ చేసినా- ‘పద్మభూషణ్’ ఇచ్చింది ఏ ప్రభుత్వం? ఇపుడు కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరి చేతుల్లో వుంది? సైన్స్ కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్ ఎవరి అదుపులో ఉన్నాయి? తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓల్గా, పసునూరి రవీందర్, పింగళి చైతన్య, డా శివారెడ్డి.. వంటివారు ఏ భావజాలానికి చెందారని అవార్డులు ఇచ్చారు? వీళ్లందరి వెనుక ఏ శక్తులున్నాయని ప్రశ్నిస్తే ఎవరైనా చెప్పగలరా? ఇది రాష్టభ్రక్తి ప్రబోధించే జాతీయవాదులు చేసారా?

మోదీని తిట్టేందుకు ఇదంతా పథకం ప్రకారం జరిగే డ్రామా మాత్రమే కాదు. జాతీయ భావజాలాన్ని మోదీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే విస్తృత ప్రణాళిక ఇది! నిజానికి మోదీ ప్రభుత్వం వచ్చాక అక్రమ స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) కట్టడి జరిగింది. దాంతో మత మార్పిడి సంఘాలకు, వారికి పరోక్షంగా సహాయం చేసే శక్తుల ఆర్థిక వనరులపై దెబ్బపడింది. పాశ్చాత్య ప్రభుత్వాల వ్యాపార సామ్రాజ్య విస్తరణకు తోడ్పడే ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులకు, దానిని లోకానికి అందించే ప్రసార మాధ్యమాలకు కంటగింపు అయ్యింది. భారతీయతను రెచ్చగొట్టి భారత్‌ను విభజించి అస్థిరపరచి, బలహీనపరిచే శక్తులకు మోదీ ఒక అనకొండలా కన్పిస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడ మత సంతుష్టీకరణ రాజకీయాలు తలక్రిందులవుతాయి కాబట్టి మోదీని ఎలాగైనా నిలువరించాలనే ప్రయత్నం జరుగుతుంది.

భారతీయులు బానిసత్వం ద్వారా పోగొట్టుకున్న మూలతత్త్వాన్ని తిరిగి పొందకుండా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రకు ఈ దేశ మేధోవర్గం సహకరిస్తున్నది. బ్రాహ్మణీయ శక్తులపై పోరాటం పేరుతో ఇటీవల కులవాదం పెచ్చుమీరుతున్నది. నిజానికి మోదీ కుల పరంగా బ్రాహ్మణుడు కాకపోయినా బహుజనవాద రాజకీయాలు చేసే పార్టీలు, మేధావులు బహుజనుడైన ఆయనను వ్యతిరేకిస్తారు. ధనవంతులపై, భూస్వామ్య, ఫ్యూడలిస్టులపై యుద్ధం చేస్తాం అని చెప్పే కమ్యూనిస్టులు, మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ మోదీపై రణం చేస్తాం అంటారు. నిజానికి మోదీ నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు!? పాకిస్తాన్ తీవ్రవాద నాయకుడు హఫీజ్ సరుూద్‌ను, హైదరాబాద్‌లోని మజ్లిస్ పార్టీని, కేరళలోని ముస్లింలీగ్ మోదీని వ్యతిరేకిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మొదలుకొని డీఎంకే నాయకుడు స్టాలిన్ వరకు అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు మోదీని వ్యతిరేకిస్తారు. జాన్ దయాల్ మొదలుకొని రాబర్ట్ వాద్రా వరకు అందరూ మోదీని గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇదంతా కేవలం ‘రాజకీయ ఉష్ణోగ్రత’ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. వీళ్లందరికీ కావాల్సింది ఇంకేదో ఉంది!? అదే ఇపుడు గుర్తించాలి. హిందూ నేపథ్యం వున్న రాజకీయం నడవకూడదన్నది ఈ చర్చలో తేలిన విషయం.

నిజానికి ఈ దేశంలో హిందుత్వం కనుమరుగైన మరుసటి రోజు సెక్యులరిజం పాతాళానికి తొక్కేయబడుతుంది. ఈ విషయం గ్రహించిన ముస్లిం మేధావులు ఎం దరో ఉన్నారు. మహమ్మద్ కరీం చాంగ్లా, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ అలాంటి కోవలోని వారే. మహ్మద్ హమీద్ అన్సారీ పూర్తి మత స్వేచ్ఛతో ఈ దేశ ఉపరాష్టప్రతిగా ఉండొచ్చు. పదవి నుండి దిగిపోయాక ఈ దేశంలో మైనారిటీలకు భద్రత లేదని వ్యాఖ్యానం చేయవచ్చు. ఇది కూడా సెక్యులరిజంలోని భాగమే. కానీ ఈ దేశంలో హిందూ నేపథ్యం ఉన్న వ్యక్తి ప్రధానిగా ఉండడం సెక్యులరిజానికి ప్రమాదం. ప్రతి రాష్ట్రంలో రెండు కుటుంబాలు ప్రాంతీయ పార్టీలు పెట్టి రాష్ట్రాలను ఆక్రమించుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణ! బ్రహ్మచారిగా దేశానికి తన జీవితాన్ని మోదీ అంకితం చేయడం నియంతృత్వం!?

నాలుగు తరాలు ఈ దేశాన్ని పాలించడం త్యాగం! నాలుగున్నరేళ్లు అవిశ్రాంతంగా పనిచేస్తూ పరిపాలించడం ఏకచక్రాధిపత్యం!! పది తరాలకు సరిపోయే ఆస్తులను సంపాదించడం పారదర్శకమైన, నీతివంతమైన పాలన! తన కుటుంబాన్ని దగ్గరగా కూడా తీయకపోవడం రాజ్యాంగ విధ్వంసం!? పరాయి దేశాధినేతల ముందు చేతులు కట్టుకుని నిల్చోవడం, వౌనంగా ఉండడం మహా మేధావితనం! చైనా అధ్యక్షుణ్ణి సబర్మతీ ఆశ్రమం ఆరుగుమీద కూర్చోబెట్టడం బానిసత్వం! పనె్నండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇవ్వడం తల్లితనం! అన్ని రాష్ట్రాలకూ ఒకేలా న్యాయం చేస్తాననడం నిరంకురశత్వం! తలలు పరాయి దేశం వాళ్లు నరికి బహుమతిగా పంపిస్తే దాని గురించి నోరు తెరువకుండా ఉండడం సౌభ్రాతృత్వం! తీవ్రవాదం ఇంట్లోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేస్తే అది చేతగానితనం!? ఇఫ్తార్ విందుల్లో టోపీలు ధరించడం సెక్యులరిజం! ఎవరి సంప్రదాయాలు వారు పాటిస్తూ మన మతాన్ని అభిమానిస్తూ పరాయి మతాన్ని గౌరవించాలని చెప్పడం మతతత్వం!? ఒక మతం వాళ్లకు ఈ దేశంలోని సంపదలో మొదటి ముద్ద అని చెప్పడం సెక్యులరిజం! అందరూ ఒకే జాతి అని చెప్పడం మతతత్వం!?

ఇలాంటి దౌర్భాగ్యపు విభజనల వల్ల, సంకుచిత మనస్తత్వాల వల్ల జాతీయ భావజాలాన్ని కాళ్లకింద వేసి తొక్కాలని చూసే శక్తులు మోదీని గద్దెనుండి దింపాలని చూస్తున్నాయి. వాళ్ల ప్రయోజనం రాజకీయ అధికార మార్పిడి కానే కాదు. మతోన్మాదంతో భయపెట్టాలనుకునేవాళ్లు, మత మార్పిడిని నిరాటంకంగా కొనసాగించేవాళ్లు, కులం కుళ్లును ఇతరులపై చల్లేవాళ్లు, చైనా, రష్యా, సిద్ధాంతాలను తలపై మోసేవాళ్లు ఓ పథకం ప్రకారం మోదీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇప్పటికైనా సత్యాసత్యాలు గ్రహించకపోతే మరో చారిత్రక తప్పిదం మన ఖాతాలో పడుతుంది. జాతీయవాదులు రాజసూయయాగంలా రాష్ట్రాలను గెలుచుకుంటూపోవడం ఎంత ముఖ్యమో సాంస్కృతిక విధ్వంసాన్ని అంతే వేగంగా ఎదుర్కోవాలి. లేదంటే మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదు.

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి