రెండవసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్కో పనిని చాలా జాగ్రత్తగా పూర్తిచేయడం మొదలుపెట్టింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, అయోధ్య వివాదంపై తీర్పును త్వరితగతిన ఇప్పించడం.. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ప్రతిపక్షాలు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. 

రామమందిరం తీర్పును మాత్రం స్వాగతించగా, కాంగ్రెస్ అధికార పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’ తన అక్కసు వెళ్లగక్కింది. వ్యక్తిగతంగా ఎందరో కాంగ్రెస్ నాయకులు మాత్రం లోలోపల ఈ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ భోగట్టా. ‘తూర్పు బెంగాల్‌లోని హిందూ రక్షణ భారత్‌ను విస్మరించవద్దు. మానవత్వం, స్వలాభం మాత్రమే కాకుండా స్వాతంత్య్రానికి, మేధోవికాసానికి తరాలుగా వారి త్యాగాలు, పడిన బాధలను దృష్టిలో ఉంచుకుంటే అది సముచితం’ అని ఏనాడో డా శ్యామాప్రసాద్ ముఖర్జీ సెలవిచ్చారు. ఇటీవలి వరుస పరిణామాలు వారి ఆత్మకు శాంతి కలిగించి ఉంటాయి.


దేశాన్ని పాలించడం అంటే మనం నాలుగు సరిహద్దులలోపల కూర్చొని రాజభోగాలు అనుభవించడం, శత్రువును కనిపెట్టకుండా, వారి ఎత్తులను అంచనా వేయకుండా చేసే పాలన ఎంత ఘోరంగా ఉంటుందో టిబెట్ విషయంలో నెహ్రూ చేసిన తప్పునుండి మనం గ్రహించవచ్చు. 

బ్రిటీషు పాలన వల్ల అందివచ్చిన అధికారాలను ఉచితంగా, అవగాహన లేకుండా చైనాకు ధారాదత్తం చేసి 1954లో టిబెట్ చైనాలో భాగమని ప్రకటించడం ఘోర తప్పిదం. గ్యాంట్సే యూటుంగ్‌లోని సైనిక స్థావరాలను కోట్లాది విలువైన పోస్టల్, టెలిఫోన్ వ్యవస్థలను అప్పనంగా భారత్ చైనాకు అప్పగించింది. దీంతో 24 అక్టోబర్ 1950న చైనా సైనికులు టిబెట్‌పై దురాక్రమణకు తెగబడ్డారు. 

దీనిని ఆనాటి ప్రముఖ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మంచుకొండల్లో ‘భ్రూణహత్య’ జరిగిందన్నాడు. అలాంటి తప్పే కశ్మీర్ విషయంలో నెహ్రూ బృందం చేసింది. ఇపుడు ఒక్కో ‘మరమ్మతు’ జరుగుతుంటే దేశం ఖుషీగా ఉంది. తమ జీవితకాలంలో 370 రద్దు, రామమందిరం తీర్పు, పౌరసత్వ బిల్లు.. చూస్తామా అనుకున్నవాళ్లు ‘ఇదే జీవిత పరమార్థం’ అంటున్నారు. ఇక ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే మిగిలి ఉంది..!

దేశంలో ఏది జరిగినా ‘ముస్లింలకు వ్యతిరేకం’ అంటూ భ్రమలు కల్పించడం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఓ వర్గం మీడియా వారు పనిగా పెట్టుకున్నారు. పెద్దనోట్ల రద్దు కూడా ముస్లిం వ్యతిరేకం అంటూ వితండవాదం చేశారు. ఇపుడు దిగ్విజయ్‌సింగ్ లాంటి కాంగ్రెస్ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ‘ఈ దేశ ముస్లింల పౌరసత్వంగాని, ఏ దేశ ప్రజల పౌరసత్వం రద్దుచేసేది కాదు. ఈ బిల్లు ఇచ్చేదే కాని లాగేసుకునేది కాదని’ హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇక కమ్యూనిస్టులు, వారి ప్రచార ప్రసార మాధ్యమాలు, తోక మేధావులు యధాలాపంగా ‘ఇది మతాల మధ్య చిచ్చు’ అన్నారు. ముస్లింలకు తనకు తానే ప్రతినిధిగా చెప్పుకొంటున్న ఓవైసీ బిల్లు ప్రతులను చించేశాడు. రెండు రోజుల చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. ఇందులో మాట్లాడిన వారి మాటలు చూస్తుంటే వీళ్లా ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించింది అని నవ్వొచ్చింది.

భారతదేశంలో భారతీయులను వెతుక్కోవాల్సిన దుస్థితి చూస్తే అసహ్యం వేస్తోంది. అసలు ఈ పౌరసత్య సమస్య అస్సాంలో వచ్చింది. ఆ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 9 జిల్లాల్లో బంగ్లాదేశీ చొరబాట్లు ఎక్కువ. ధూబ్రీ 79.67 శాతం, బార్పేట 70.74 శాతం, డారంగ్ 64.34 శాతం, హాలాకాండీ 60.31 శాతం, గోల్పారా 57.52 శాతం, మోరీగావ్ 52.56 శాతం, నాగాల్ 55.36 శాతం, కరీంగంజ్ 56.36 శాతం, భోంగాగావ్ జిల్లాల్లో 50.22 శాతం చొరబాట్లు జరిగినట్లు తేలింది. దాంతో 2012లో అస్సాం సమ్మిశ్రీత, మహాసంగ్ సుప్రీం కోర్టులో దావా వేసింది. ఫలితంగా 17 డిసెంబర్ 1996 నుండి 24 మార్చి 1971 వరకు అస్సాంలోకి వచ్చిన వాళ్లను గుర్తించాలని, ఎన్‌ఆర్‌సి అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ తేదీని పెట్టుకోవడానికి మార్చి 26న బంగ్లాదేశ్ ఏర్పడిందని, ఆ తర్వాత వచ్చినవారిని అక్రమ చొరబాటుదార్లుగా గుర్తించాలన్నది ఉద్దేశం. ఎన్నార్సీ కోసం 31 డిసెంబర్ 2017 నాటికి 3.29 కోట్లమంది అర్జీ పెట్టుకుంటే అందులో 1.90 కోట్లమందికి మాత్రమే అర్హత ఉందంటే మన దేశంలోకి చొరబాట్లు ఎంతలా జరిగాయో ఊహించుకోవచ్చు.

ఈ క్రమం ఇలాగే కొనసాగి రోహింగ్యాలు సహా ఎందరో ఈ దేశంలోకి చొరబడ్డారు. మ యన్మార్ లాంటి చిన్న దేశం వాళ్ల అరాచకాలను భరించలేక బయటకు పంపుతుంటే, ఇక్కడి నాయకులకు మాత్రం వాళ్లపై అమితమైన ప్రేమ. ప్రక్క రాష్ట్రాలవారు ఉద్యోగాలు, నిధులు, నీళ్లు ఎత్తుకుపోతున్నారని వాళ్ల అసెంబ్లీలో తీర్మానాలు చేయించి.. స్థానికతను ముందుకు తెచ్చేవారు ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు. మన పొరుగున వున్న పాక్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అనే మూడు ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల్లో అత్యాచారాలకు గురైన ఆరు మతాల వాళ్లకు స్థానం కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. 

అది సాధారణంగా పౌరసత్వం కోసం ఎవరైనా తస్లీమా నస్రీన్, అద్నాన్ సమీలా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదంతా మామూలుగా జరిగే ప్రక్రియ. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్ పార్టీలు, ముస్లిం లీగ్, ఎంఐఎం లాంటి మత పార్టీలు, సూడో సెక్యులర్ పార్టీలు, ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త మేధావులు, కళాకారులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇంతకన్నా ఆత్మవంచన ఇంకొకటి లేదు.

అందరూ మహమ్మదాలీ జిన్నా మాత్రమే దేశాన్ని మతపరంగా విభజించాలని మొదట కోరాడని అనుకుంటారు. ఇక కాంగ్రెస్ వాళ్లు 1937లోనే సావర్కర్ ‘ద్విజాతి సిద్ధాంతం’ తెచ్చాడని చెప్పారు. నిజానికి సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ దీనికి బీజం వేశాడు. 14 మార్చి 1880 నాడు మీరట్ సభలో సర్ సయ్యద్ మాట్లాడుతూ ‘ముస్లింలు ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే ఆంగ్లేయుల పాలన అవసరం’ అన్నాడు. తాను స్థాపించిన విద్యా సంస్థకు ఆంగ్లేయుల నుండి గ్రాంట్లు పొందడం సయ్యద్ మొదలుపెట్టాడు. 

20వ శాతాబ్దం ప్రారంభంలో కలకత్తా ‘స్వాతంత్య్ర ఉద్యమ కేంద్రం’గా ఉండేది. వైస్రాయి లార్డ్ కర్జన్ ‘స్వాతంత్ర పోరాటం ఆపాలంటే.. బెంగాల్‌ను విభజించాలి’ అన్నాడు. 6 డిసెంబర్ 1904నాడు హాబర్ట్ హాచోప్‌రిస్లే ‘బెంగాల్‌ను విభజిస్తేనే భారత్‌ను ముక్కలు చేయవచ్చు’ అన్నాడు. దీంతో 19 జూలై 1905 నాడు బెంగాల్ విభజన జరిగింది. ఢాకాలో కోటి 80 లక్షల మంది మస్లింలు, కోటి 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. ముస్లిం నాయకుల రహస్య ఒప్పందం వల్ల ముస్లిం జనాభా అధికంగా వున్న బెంగాల్ ముక్కను ఆంగ్లేయులు వారికి అందించారు. 

1906లో వెంటనే ముస్లిం లీగ్ పుట్టింది. 1907లో మింటో మార్లే సంస్కరణల ఫలితంగా ఏ ఎన్నికల్లోనైనా ముస్లింలే ముస్లిం ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కు వచ్చింది. 1939లో జిన్నా 14 సూత్రాలతో ముస్లింల డిమాండ్లు ఆంగ్లేయుల ముందు పెట్టి సాధించుకొన్నాడు. 1930 సైమన్ కమిషన్ రిపోర్టు ముస్లిం లీగ్‌కు మరింత బలం ఇచ్చింది. 

ఈలోపు 112 చోట్ల మత కల్లోలాలు జరిగాయి. 1938లో గులాం హసన్ షా ఖాజ్మీ అనే పాత్రికేయుడు పాకిస్తాన్ పేరుతో పత్రికకు అర్జీ పెట్టుకొన్నాడు. 1933లోనే చౌదరి రహ్మద్ అలీ ‘నౌ అండ్ నెవర్’ అనే బుక్‌లెట్‌లో మొదట పాకిస్తాన్ పేరు ప్రస్తావించాడు. ఈ పరిణామాల తర్వాత 26 జూలై 1947లో జిన్నాగ్యాంగ్ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని కోరారు. అది జరిగిపోయింది, లక్షలాదిమంది శరణార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

1950లో నెహ్రూ-లియాఖత్ ఖాన్‌లమధ్య ఒప్పందం జరిగి 4 సూత్రాలు ప్రవాసుల - ఆస్తుల రక్షణ, మహిళలపై అత్యాచారాలు ఆపడం, వాళ్ల ఆస్తులను అమ్ముకోవడం, బలవంతపు మత మార్పిడి నిరోధం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి. కానీ మతోన్మాదులైన పాక్ పాలకులు తమ దాష్టీకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. విభజన జరిగాక పాకిస్తాన్‌లో వున్న 15 శాతం హిందువులు ఇపుడు 1.5 శాతం అయ్యారు. 2015లో వచ్చిన ఒక నివేదిక ఆధారంగా ఏటా వేయిమంది యువతులు బలవలంతంగా మత మార్పిడికి గురవుతున్నారు. అత్యాచారం, మత మార్పిడి, దేశం నుండి వెళ్లగొట్టడం అనే మూడు సూత్రాలతో అక్కడి మైనారిటీలను తగ్గించారు. 

బంగ్లాదేశ్‌లో 22 శాతం వున్న హిందువులు 0.8 శాతానికి తగ్గారు. ఆప్ఘనిస్తాన్‌లో 1982లో 2.20 లక్షలున్న హిందూ, సిక్కులు ఇపుడు 1350 మంది మాత్రమే మిగిలారు. ఇన్ని అత్యాచారాలు జరిగినా అక్కడున్న మైనారిటీలపై ఆ దేశాలే గాక భారత్ కూడా ఇన్నాళ్లు దయ చూపలేదు. ఇంకా ఇక్కడి పాకిస్తాన్ భక్తులు ఇదే కోరుకొని దేశాన్ని ధర్మసత్రంగా మార్చేయాలనుకొంటే ఈ బిల్లుతో అది భ్రమగానే మిగులుతుంది.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *

***********************************

డాక్టర్ పి. భాస్కర యోగి 

జూన్ 23 : 2018



***********************************

డాక్టర్ పి. భాస్కర యోగి 

డిసెంబర్ 10 : 2018



************************************

డాక్టర్ పి. భాస్కర యోగి 

ఆగష్టు 13 : 2018



********************************

డాక్టర్ పి. భాస్కర యోగి 

సెప్టెంబర్ 29 : 2018





తెలంగాణ సంకీర్తన సాహిత్యం -

డాక్టర్ పి. భాస్కర యోగి 

అక్టోబర్ 14 ; 2019








Kula Tatvam song 

Lyrics : Dr. Bhaskara Yogi 

Singer : Goreti Venkanna


నవంబర్ 20 : 2019



************************************

KCR TALK SHOW ||

Dr P Bhaskara Yogi||

06-12-2019||




మారువేషంలో మారీచుడు మాయలేడిగా వచ్చా డు.. ఆ ‘బంగరు జింక’పై సీత మనసు పడింది. దానిని వేటాడుతూ.. వెంటాడుతూ శ్రీరాముడు పరుగెత్తాడు. మరో వేషంలో మైరావణుడు పర్ణశాల ముందు నిలబడి ‘్భక్షాందేహీ..!’ అన్నాడు. సీత శంకించింది.. అయినా సాధు స్వభావంతో ఆమె ‘లక్ష్మణరేఖ’ దాటింది. అతని అసలు రూపం బయటపడింది. సీత లక్ష్మణరేఖ దాటాక గాని రావణబ్రహ్మ నిజస్వరూపం బయటపడలేదు. 

రావణుడు త్రేతాయుగం నాటి కిడ్నాపర్, రేపిస్ట్. సీతను ఎత్తుకెళ్లాడు. ఆమెను ఎన్నో విధాల భ్రమ పెట్టాడు. ఆమె జంకలేదు. రావణుడి ప్రలోభాలకు భయపడి లొంగలేదు. ఇష్టం లేని స్ర్తిని తాకితే రావణుడి తల వేయి ముక్కలవుతుందని శాపం పెట్టాడు బ్రహ్మ. అందువల్ల అనేక మాయోపాయాలు రావణుడు ప్రయోగించినా ఆమె ధైర్యం కోల్పోలేదు. చివరకు రాముడు కపి సైన్యంతో వచ్చి రావణవధ చేశాడు.

 ‘మృగాళ్లు’ మాయాపాయాలు చేస్తారని, స్ర్తిలు లక్ష్మణరేఖ దాటవద్దని, ధైర్యం కోల్పోవద్దని, రేపిస్ట్‌లకు, హంతకులకు మృత్యుదండన సరైందని ఈ కథ తెలుపుతుంది. ఇపుడు ‘దిశ’ అత్యాచార మరణం దేశ వ్యాప్త సంచలనం అయ్యింది. ఇష్టం లేని అమాయకపు నిర్బలను ఆ నరరూప రాక్షసులు వంచించి హత్య చేశారు. వృత్తి రీత్యా పశువుల స్వభావాన్ని గుర్తించిన ఆ వైద్యురాలు ‘నాలుగు కాళ్ల మృగం’ ఆ నలుగురిలో ఉందని గుర్తించలేకపోయింది.

2012లో నిర్భయ హత్య జరిగింది. 2017లో షబ్నం, దక్షిణ ముంబయికి చెందిన నైనా, 2014లో యూపీలో దివ్య.. ఒకప్పుడు ప్రత్యూష.. ఆ తర్వాత ఆయేషా మీరా.. ఇపుడు దిశ.. ఇలా ఎందరో..! విచిత్రం ఏమిటంటే ఇటీవలి కాలంలో లైంగిక దాడులతో పాటు ప్రేమోన్మాద దాడులూ ఎక్కువయ్యాయి! మనసుపడిన అమ్మాయి ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు, నమ్మించి తీసుకెళ్లి చంపేయడం.. ఇవన్నీ ఎక్కువయ్యాయి. ఇవన్నీ జరిగేందుకు ‘వ్యవస్థకు చిత్తశుద్ధి’ లేకపోవడమే ప్రధాన కారణం. 2017లో ఓ మహిళను ఎనిమిదిమంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. 

బాధితురాలితో పాటు 14 ఏళ్ల ఆమె కొడుకునూ వేధిస్తే 2017 నవంబర్ 14న నిందితులపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు తనకుగల రాజకీయ పలుకుబడితో కేసును వాపస్ తీసుకోవాలని పోలీసులతోనే వేధింపులకు గురిచేస్తే ఆమె ఆ ప్రాంతం వదిలిపోయింది. ‘నేరానికన్నా ఎక్కువగా పోలీసులు మా జీవితాన్ని నరకప్రాయం చేశారు’ అని బాధితురాలు మీడియా ముందు గొల్లుమంది. స్ర్తిని మాతృమూర్తిగా, అపరకాళిగా భావించే మనం బొమ్మగా మార్చి సర్ఫ్‌లకు, సబ్బులకూ, లోదుస్తుల అ మ్మకానికి అడ్వర్టయిజ్‌మెంట్‌గా ఉపయోగించడం మొ దలుపెట్టాక ఆమెలోని ‘అవతారతత్వం’ ఎప్పుడో చంపేశాం.

ఆడపిల్ల వద్దు అనే భావనతో ఇప్పటికే వెయ్యిమంది పురుషులకు 950 మంది స్ర్తిలు కూడా లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పటికే చాలా కులాల్లో విపరీతంగా అమ్మాయిల కొరత వుంది. మగపిల్లలకు పెళ్లిళ్లు అవ్వడం ఎంత కష్టంగా వుందో మ్యాట్రిమోనీల ప్రొఫైల్స్‌పై అధ్యయనం చేస్తే అర్థం అవుతుంది. ‘పురుష’ శబ్దానికి అర్థం తెలియని అజ్ఞానులు ‘ఉద్యోగం పురుష లక్షణం’ అంటే పురుషులు మాత్రమే ఉద్యోగం చేయాలని నిర్దేశిస్తున్నారు. మగపిల్లలు పుట్టడం వంశం నిలబెట్టడం అంటూ ఇంకొందరు ప్రగల్భాలు పలుకుతున్నారు. 

అసలు ఈ దేశంలో ఎంతమంది మగపిల్లలు తమ తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారనే విషయమై సమగ్ర అధ్యయనం చేయాలి. ఇటీవల రెచ్చగొట్టే దుస్తులు ఆడపిల్లలు వేసుకొంటున్నారని అందరం తెగ బాధపడిపోతున్నాం. మగవాళ్లకు మాత్రం అలాటి దుస్తులు వేసుకొనే అధికారం ఎవడిచ్చాడు? అశ్లీలత లేని డ్రెస్సులు ఎవరైనా వేసుకోవచ్చు. గాంధీ, గద్దర్, సల్మాన్‌ఖాన్, పురోహితులు.. ధరించే డ్రెస్సులలో సెన్సార్ లేదు కదా? అసలు ప్రతి సమస్యకు పైపైన జరిగే అధ్యయనం ఇలాగే వుంటుంది. దాని మూలాలు వెతకడం లేదు! ఇక్కడి నుండే సమస్య మొదలవుతుంది.

రాఖీ, టెంపర్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ మహిళల గురించి చెప్పే డైలాగులు బాగుంటాయి. కానీ ‘దిశ అత్యాచారం’ జరిగినపుడు ఆయన బయటకు రాడు. మైండ్ బ్లాక్ చేసే నటుడు మహేశ్‌బాబు, బాహుబలి సెట్టింగులతో కోట్లు సంపాదించిన రాజవౌళి, ప్రజలు ‘మారాజు నీవే’ అంటూ పాటలు పాడితే కొండలు దూకేసిన ప్రభాస్, సెక్స్ సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ, ఆయనను గంటల తరబడి కులపిచ్చి సినిమాలపై ఇంటర్వ్యూలు చేసే యాంకర్లు, ఆడవాళ్ల శక్తిని ‘పట్టుకుంటే పట్టుచీర’తో ధ్వంసం చేస్తున్న మహిళా యాంకర్లు, జీడిబంక సీరియళ్లు తీసే నటులు, దర్శక నిర్మాతలు, ‘ఇరుక్కుపో.. కొరుక్కుపో’ అంటూ పాటలు రాసే మహారచయితలు.. ఇపుడెవరూ కాలు కదిపి బయటకు రారు.

 ఈ సమాజంలో అసలు దోషులు వాళ్లు!? హద్దులు లేని సాంకేతిక పరిజ్ఞానం అందించిన మన అపర కుబేర వ్యా పారస్థులు ఏం తక్కువ తినలేదు. అంబానీ, సుందర్ పిచ్చయ్.. వివిధ టీవీ చా నళ్లు.. ఇలా అందరూ ఈ పాపంలో భాగస్తులే. 2017 లో పోర్న్ సైట్‌లు చూసేవారి సంఖ్య 500 కోట్ల క్లిక్కులు కాగా, 2018 నాటికి అది 3,350 కోట్ల క్లిక్కులకు పెరిగింది. అంటే ఏడాది సగటు తీస్తే రోజుకు 10 కోట్ల వ్యూస్ అన్నమాట. పోర్న్‌హబ్ అత్యధిక వీక్షకుల్లో అమెరికా, యూకే నిలువగా మూడవ స్థానం మన భారతదేశం సంపాదించింది! దీని దారులన్నీ మనకు మన టాలీవుడ్, బాలీవుడ్.. థియేటర్లు అందిచిన ఘనత.. చూపించిన మార్గమే.

ఆడపిల్లలు సాయంత్రం ఆరింటికి ఇంటికి చేరాలనేవాళ్లం.. మగ పిల్లల్ని అర్ధరాత్రి వరకూ రోడ్లపై తిరిగేందుకు ఎందుకు అనుమతించాలి? నైతికత లేని మనకు పోలీస్ వ్యవస్థ కేవలం డ్యూటీ మాత్రమే చేయడం ఆక్షేపణీయం కాదు. అలాగే మన విద్యలో నైతికత ఎంత? ఇళ్లల్లో పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం.

 పోనీ సామాజికంగా మనం బాధ్యతగా ఉంటున్నామా? కుటుంబ సభ్యులంతా కలసి చూసే సినిమాలను మన ఘనతకెక్కిన దర్శకులు చూపిస్తున్నారా? కౌగిలించుకోవడం ఎవరిని ఎవరు కౌగిలించుకోవాలో అర్థం చేసుకోలేనంత పిచ్చిగా- హీరో నాగార్జున ‘బిగ్‌బాస్ షో’లో కౌగిలించుకుంటుంటే రోడ్డుపై వెళ్ళే రోమియో ఇంకేం చేస్తాడు? రోజుకు వందలసార్లు హత్యలు, రేప్‌సీన్లు, ముద్దుసీన్లు, బహిరంగ శోభనాలు మనసారా చూపించి తరింపజేస్తున్న మన మహానటుల నటన ఈ ‘కామపిశాచుల’ మెదళ్లు మొద్దుబార్చి, కళ్లు మూసుకుపోయేటట్లు చేస్తున్నది నిజం కాదా?

చట్టాల పేరుతో మానవీయత లేకుండా ప్రవర్తిస్తున్న మన వ్యవస్థ, ధనబలం, రాజకీయ బలం, కులబలం, ఓటుబలం.. ఇవన్నీ ఈ దారుణాలకు కారణాలు. మృగాళ్లను మార్చే ‘నైతికవిద్య’ ఇపుడు ఆవశ్యకం. మనిషికో పోలీసు పెట్టలేరన్నది నిజం. ఎందుకంటే ఉన్న పోలీసులంతా రాజభోగాల వాకిట్లో ‘కావలికార్లు’ అయ్యారు కదా? ఆపదలో ఉన్న యువతి మొదటిగా చెల్లికి ఫోన్ చేయకుండా పోలీసులకు చేయలేదు. వాళ్లకు భరోసా ఇచ్చే వ్యవస్థను మనం నిర్మించలేదు.

 ‘మగవాళ్లు ఆడవాళ్ల కోసం ఏమీ చేయకున్నా ఫర్వాలేదు.. వాళ్లను ఏమీ చేయకుండా వుంటే అదే పదివేలు’. మనందరికీ పాలు ఇచ్చి పెంచి, ఇంట్లో పాలించేవారు. వాళ్లను వాళ్లు పాలించుకోగలరు. 

అందుకే స్వామీ వివేకానంద ‘‘మహిళల సమస్యలు తీర్చేందుకు మీరెవరు? మీరు దైవాలా! జాగ్రత్త! వారి జోలికి పోకండి’’ అన్న మాటల్లో అర్థం ఇదే. తీవ్రవాదులు బాంబులు పేల్చినపుడు చేసే హడావుడిలా- ఇలాంటి అత్యాచారాలు జరిగినపుడు మనం హడావుడి చేయడం అనే నటన మనమూ అద్భుతంగా చేస్తున్నాం. వ్యవస్థను నైతికంగా మార్చే ప్రయత్నంలో వెనుకబడ్డాం.. అందుకే ‘నిర్భయ’తో ఆగలేదు.. ‘దిశ’ చివరిది కాదు. మగాళ్లూ మృగాలుగా మారకండి.. ప్లీజ్!


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *




  • ‘‘సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః
  • నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే’’ (భ.గీ. 9/14)
‘నా భక్తులు నన్ను ఎల్లప్పుడూ దృఢవ్రతులై ప్రయత్నిస్తూ, భక్తితో నమస్కరిస్తూ, నాయందు చిత్తాన్ని నిలిపి, నన్నే సేవిస్తారు’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కీర్తన వాఙ్మయరూపం. వాక్కు మన దేహంలో అగ్నితత్వం. మనస్సు వాయుతత్వం. అగ్నిదేవుడికి వాయుసఖుడని పేరు. కాబట్టి ఎక్కడ అగ్ని ఉంటే వాయువు కూడా అతనికి తోడుగా ఉంటాడు. నామకీర్తనకు, మనస్సుకు అలాంటి దగ్గరి సంబంధం ఉంది. 

మనం ఏ మాట మాట్లాడుతున్నా అది వాయువు సహాయంగానే జరుగుతుంది. మన మనస్సు వాయుతత్వమే కాబట్టి మనం మాట్లాడేటపుడు మనస్సు కూడా వెంట నిలుస్తుంది. అలాగే ఇష్టమైనవి వింటున్నపుడు గానీ, చదువుతున్నపుడు గానీ అక్కడ మనస్సు కూడా నిలుస్తుంది. ప్రత్యేకించి సంగీతానికి ఆకర్షణ శక్తి స్వతసిద్ధంగానే ఉంది. కాబట్టి ఎంత కఠినతపం చేసినా స్థిరంగా ఉండని మనస్సు సంగీతం దగ్గర నిలిచిపోతుంది. అందువల్ల భగవంతుని చేరేందుకు దారిదీపం వంటిది కీర్తన.
మనస్సు కోతి వంటిది. అది కల్లు తాగింది. దానికి తేలు కరిచింది. పైగా దయ్యం పట్టింది. ఆ తర్వాత నిప్పు తొక్కింది. అంతఃకరణంలోని మనస్సు ఇంత చంచలంగా మన శాస్త్రాలు వర్ణించాయి. అలాంటి మనస్సును అరికట్టి, ఆత్మగా మార్చి, భగవంతుని వైపు ఏకోన్ముఖంగా చేయడమే యోగం. యోగం అభ్యసిస్తే చిత్తవృత్తుల నిరోధం అవుతుందని పతంజలి చెప్పాడు. మన వాళ్లు ఇంకా అనేక ఉపాయాలు సూచించారు. 

దేవుడిని ‘శబ్దబ్రహ్మ’గా చెప్పారు. అది ఆద్యంతాలు లేని సత్యరూపం. ఆ శబ్దం నామంగా మారితే అది స్తోత్రం, కీర్తన అవుతుంది. ఆ శబ్దాన్ని కన్నులు మూసుకొని ధ్వనించగానే రూపం, గుణం, లీల.. అన్నీ దర్శనమిస్తాయి. ఆ శబ్ద బ్రహ్మోపాసన వాదరూపంగా సంగీతజ్ఞులు ఉపాసిస్తే, వేదజ్ఞులు చర్మచక్షువులకతీతంగా దర్శించారు.
 
సంకీర్తనలు యోగానికి దారి చూపిస్తాయి. జీవుడు స్వయంగా నాదబ్రహ్మకు అభివ్యక్తి కాబట్టి ధ్వనితో కూడిన ‘భగవన్నామాలు’ సాధకులపై అప్పటికపుడు ప్రభావం చూపిస్తాయి. షట్చక్రాలు, కుండలి వంటి శక్తులను చైతన్యం చేస్తాయి. ఆ స్థితి ఆనందబ్రహ్మమైనది. అది పొందిన తర్వాత కలిగే అనుభూతిని సమాధిగా యోగులు చెప్తారు. దానిని శాశ్వతంగా నిలబెడితే యోగం. 

సిద్ధత్వం కలిగినపుడు అంతటా, అందరిలోని ఆత్మభావనను నిరంతరం దర్శించాక ఇక సాధనలు ఉండవు. ఆ స్థితే సాధకులుగా మారిపోతుంది. చరాచర భూతాల్లోని తత్వానికి రామ, కృష్ణ, శివ... వంటి నామాలు తారకమంత్రాలు అవుతాయి. శ్రీరామ నామ సాధన చేత హనుమంతుడు వారధి దాటడం అంటే అదే స్థితి. 

మాలదాసరి బ్రహ్మ పిశాచానికి ముక్తి కల్పించడం ఈ నామశక్తి ధారపోయడం వల్ల అని ప్రబోధించే కథలు ఈ తత్వాన్ని మనకు అందించేందుకే. అందుకే ‘భక్తులై స్వస్వరూపం వదిలిన వారు, దైవప్రకృతి గలవారు ఎల్లప్పుడూ కీర్తిస్తూ సేవిస్తారు’ అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి భాగవతంలో ఈ భగవన్నామ మహిమను దృష్టిలో పెట్టుకొనే చెప్పారు.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 01 - 12 - 2019 : సోమవారం*




ట్రినిటాడ్ దేశపు పార్లమెంటు సభ్యుడు శంభునాథ కపిల్‌దేవ్ ఓసారి భారతదేశ పర్యటనకు వచ్చాడు. వాళ్ల దేశంలో హిందువులకు ఎన్నో సమస్యలు ఉండేవి. ముఖ్యంగా ట్రినిటాడ్‌లో షోడశ కర్మలు చేసుకోవాలన్నా అక్కడి హిందువులకు చర్చి మాత్రమే దిక్కవుతుందని శంభునాథ బాధపడి దానికి పరిష్కారం కోసం ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్‌గా వున్న గురూజీని కలుసుకోవాలనుకొన్నాడు. 

అపుడు యం.యస్.గోల్వాల్కర్ (గురూజీ) బెల్గాంలో వుంటే అక్కడికి వెళ్లాడు. ఆ రోజు గురూజీ ఓ సార్వజనికోత్సవంలో పాల్గొనాల్సి వుంది. శంభునాథ కపిల్‌దేవ్‌ని కూడా అందులోకి రమ్మని ఆహ్వానించారు. శంభునాథ తన దేశంలోని హిందువుల పరిస్థితిని వివరించాడు. అంత పెద్ద కార్యక్రమంలో ఆరెస్సెస్ కార్యకర్తల క్రమశిక్షణ, విన్యాసాలు చూసి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు.


ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు అధిపతిగా ఉండి కూడా ఎలాంటి భద్రతా వలయం లేకుండా గురూజీ సాధారణంగా ఉండడం ఆయనకు నచ్చలేదు. ‘గురూజీ.. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అంటూ అప్పుడెప్పుడో జరిగిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యను ప్రస్తావించాడు. అందుకు గురూజీ- ‘కెనడీ భద్రతా వ్యవస్థలో ఏ లోపం లేకపోయినా అతని జీవితకాలం ముగిసింది కదా! ప్రపంచ పరిస్థితుల సంతులనం కోసం రష్యా దురాక్రమణ ప్రవృత్తిని అణచడం, అమెరికాలో నల్ల,తెల్లవారి మధ్య సమన్వయం నిర్మాణం చేయడం ఈ రెండు పనులూ పరమేశ్వరుడు ఆయనకు అప్పగించాడు. 

అవి గొప్పగా చేశాడు. ఇకముందు ఏ సంఘర్షణ జరిగినా ఆయనకు అపకీర్తి జరుగవచ్చు. ఆ అపకీర్తి కలుగవద్దని భగవంతుడు ఆయనను తీసుకెళ్లాడు’’ అని అన్నారు. ఈ తర్కం శంభునాథ్ కపిల్‌దేవ్‌కు బాగా నచ్చింది.

నిజమే..! కొందరు కొన్ని పనులు చేసేందుకే జన్మిస్తారు. ఇపుడు తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన ప్రాంత ప్రజల పోరాట అస్తిత్వం కోసమే జన్మించాడని అనుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్రం రాగానే అధికారం వేరొకరికి అప్పగించి, తాను సాక్షీభూతంగా ఉంటే జాన్ ఎఫ్ కెనడీలా చిరస్థాయిగా కీర్తి పొందేవాడేమో! బహుశా.. ఉద్యమ నాయకుడిగా అలాంటి త్యాగబుద్ధి ఆయనకూ ఉండి ఉండవచ్చు. అందుకే ‘తెలంగాణకు తొలి దళిత ముఖ్యమంత్రి’ ఉండాలని అన్నాడు. మొత్తానికి అందరినీ కలుపుకొనివచ్చి తెలంగాణకు నాయకుడయ్యాడు. 

‘దాచి దాచి దయ్యాల పాలు చేయడమెందుకు?’ అనుకున్నాడో, ఉద్యమాలు, విప్లవాలు జరిగినపుడు ప్రజల్లో క్రమశిక్షణ లోపిస్తుందని అనుకున్నాడో తానే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ అస్తిత్వాన్ని భుజాలపై వేసుకొన్నందున మొదటి దఫాలో ప్రజల్లో ఆయనపై ఎనలేని గౌరవం కలిగింది. కేసీఆర్ ఏదిచేసినా ‘సై’ అన్నట్లు ప్రజలూ సంబరపడ్డారు. అప్పటికే ఉ ద్యమ పార్టీని ‘్ఫక్తు’ రాజకీయ పార్టీగా మారుస్తున్నానని అన్నాడు. తెలంగాణ పు నర్నిర్మాణం కోసం అన్ని పా ర్టీల వాళ్లను ప్రభుత్వంలోకి తీసుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. కొందరు నేతలు మంత్రులు అయ్యారు. ధనిక రాష్ట్రం అంటూ చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేయడం, బోనాలు, బతుకమ్మ నిర్వహణ, యాదాద్రి నిర్మాణం, చండీయాగాలు, కుల భవనాలు, హద్దులు మీరిన సంక్షేమ పథకాలు, మైనారిటీ సంతుష్టీకరణ.. వంటివి చేసినా- ఇవన్నీ ప్రజలు తెలంగాణ అభివృద్ధే అనుకున్నారు.

2018లో శాసనసభ ఎన్నికలకు వెళ్లేనాటికి కేసీఆర్ ‘తెలంగాణ జాతిపిత’ అన్నంతగా ఎదిగిపోయారు. రెండవసారి ఎన్నికలు వచ్చి గెలిచేసరికి ఇవన్నీ తలకిందులయ్యాయి. కేసీఆర్‌పై ఎక్కడో అసంతృప్త వాతావరణం మొదలయ్యింది. ఉద్యమంలో వాడుకొన్న వాళ్లలో చాలామందిని వాడుకొని వదిలేశాడన్న అపప్రధను మూటగట్టుకున్నాడు. 

నిజానికి బాల్క సుమన్, రసమయి, ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్, దేవులపల్లి ప్రభాకర్‌రావు, నందిని సిధారెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య.. వంటివాళ్లకు పదవులు దక్కింది ‘ఉద్యమ కోటా’లోనే. కానీ కాసోజు శంకరమ్మ, కోదండరాం వంటి వాళ్లు బయట కన్పించేసరికి కేసీఆర్ తన చుట్టూ పెట్టుకున్న ఆ ‘అయిదుగురే’ కన్పిస్తున్నారు. ఇపుడు ఆర్థిక మాంద్యమో, ఇంకే కారణమో తెలియదు కానీ- రెండవ దఫా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక కేసీఆర్ కఠినాత్ముడయ్యాడు.

ఉద్యోగస్తులను పూచిక పుల్లల్లా తీసిపారేయడం ఇపుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ అధికారంలో వున్నపుడు (ఇపుడు టీఆర్‌ఎస్‌లో ఉన్న) పెద్ద నాయకులంతా ఆ రెండు పార్టీల్లో వుండి ఉద్యమాన్ని అణచివేస్తుంటే ఆనాడు ఉద్యోగస్తులే కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. మరి ఈ రోజు ఉద్యోగులను కేసీఆర్ చులకన భావంతో తీసిపారేస్తున్నా సంఘ నాయకులంతా మన్నుతిన్న పాముల్లా ఉంటున్నారన్నది క్రింది స్థాయిలో జరుగుతున్న చర్చ. 

ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత కేసీఆర్ మరింతగా అపఖ్యాతి పాలు అయ్యాడన్నది నిజం. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తి మొదటనే కార్మికులను పిలిచి ఒక్కమాట చెబితే వాళ్లేం వినకుండా బెట్టుచేసేవాళ్లు కారు. ఇపుడు జరగాల్సినదంతా జరిగిపోయింది. మామూలు ప్రజలకు- ‘కేసీఆర్‌ను రోజూ కలవాల్సిన’ అవసరం లేదు. కానీ ఇపుడు కేసీఆర్ ‘ఎవరినీ కలవడు’ అనే మాట జనాల్లో వినిపిస్తుంది. అలాగే ఎవ రూ అడగకున్నా అడ్డగోలుగా జిల్లాలను విభజించ డం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు తిట్టిపోస్తున్నారు. 

ప్రజలు ఏదైనా జిల్లా కేంద్రానికి వస్తుంటేనే కదా ఆర్థిక స్థితి ఆ కేంద్రానికి మెరుగుపడేది. ఇపుడు కూతవేటు దూరంలో జిల్లాలు అయ్యేసరికి కలెక్టర్ల పరిస్థితి ‘ఆర్డీవోకు తక్కువ, ఎమ్మార్వోకు ఎక్కువ’ అన్నట్లు అయింది. రెండు జిల్లాలు చేయాల్సిన వాటిని కూడా నాలుగు జిల్లాలుగా విభజన చేయడం అశాస్ర్తియం. ఏ జిల్లాలోనూ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి జరగడం లేదు. మిషన్ భగీరథ వల్ల ఎక్కడి రోడ్లు అక్కడ నాశనం అయ్యాయి. నిధులు లేవంటూ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. 

పాలమూరును విభజించగా నదులు జోగులాంబ జిల్లాకు, అడవులు నాగర్‌కర్నూలు జిల్లాకు, పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాకు వెళ్లి ఇపుడు శతాబ్దాల చరిత్ర వున్న పాలమూరు అస్థిపంజరం అయ్యింది. సంపన్నంగా వున్న రంగారెడ్డి జిల్లాను అర్బన్ మొత్తం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలుగా చేసి వికారాబాద్‌ను అనాథగా మార్చారు. జిల్లాకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా వికారాబాద్‌కు లేదు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే
.
అలాగే ఇపుడు కలకత్తా నగరంలో వలే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లో కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నగరం నడిబొడ్డున కట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. ఓ వైపు డబ్బులు దేనికీ లేవంటూనే వాటికి ఖర్చుపెట్టడం దండగ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. 

నిజానికి వాటిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు బయట మొయినాబాద్ పక్కనో, శంషాబాద్ పక్కనో భారీ నిర్మాణాలు చేపడితే ఆ చుట్టుప్రక్కల 50 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం వుంది. అలాగే ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రోరైల్ వస్తే రవాణాకు ఇబ్బంది ఉండదు. వాయు కాలుష్యం, ట్రాఫిక్ నుండి ప్రజలను బయటపడేసిన వాళ్లవుతారు. ఇప్పటికే శామీర్‌పేట వైపు, రామోజీ ఫిల్మ్ సిటీ వైపు చాలా అభివృద్ధి జరిగింది.  పాలమూరు, వికారాబాద్‌కు జిల్లాల విభజనలో చేసిన అన్యాయం నుంచి ప్రజలకు ఉపశమనం దక్కడమే గాక, కొత్తగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. 

హద్దులు మీరిన సంక్షేమ పథకాలను కొంతైనా తగ్గిస్తే, కేసీఆర్ అనుకొన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. జి ల్లాల విభజన లాగే ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ యుద్ధం చేస్తున్నట్లు బయట ‘సిన్మా’ కన్పిస్తుంది. మనం బయటివారితో యుద్ధం చేస్తే ప్రజలకు సంతోషం కలుగుతుంది. మనపై మనమే యుద్ధం చేస్తే వికటిస్తుంది. కేసీఆర్ కన్నతండ్రిలా ఆలోచించడమే తెలంగాణ ప్రజల ఆకాంక్ష.

**************************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*29-11-2019 : శుక్రవారం*


‘ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నపుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి వి న్నాను. మళ్లీ ఇపుడు వింటున్నా. ఆయన గురించి తెలుసుకొన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆయనపై సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. 

ఇలాంటి అగ్రెస్సివ్ వ్యక్తుల జీవితాలు తెరపైకి రావాలి’.. ఈ ఆణిముత్యాలు పలికిన మహనీయుడు మెగాస్టార్ చిరంజీవి. జార్జిరెడ్డి సినిమా పాట విడుదల చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు చిరంజీవికున్న అజ్ఞానాన్ని, అవకాశవాదాన్ని బయటపెడుతున్నాయి. ‘సైరా’ సినిమా చూశాక ఆయనపై తెలుగు ప్రేక్షకుల్లో పెరిగిన దేశభక్తి అమాంతం మంచులా కరిగిపోయింది. ఆయనే కాదు, ఈ కథానాయకుడి కథను గురించి తెలియని కొంతమంది అమాంబాపతుగాళ్లు ‘ఇదేదో ప్రశ్నించే తత్వం’ అంటూ వరవరరావులా మాట్లాడుతున్నారు!

ఇప్పటికే ఈ మెగాస్టార్ తమ్ముడు పవర్‌స్టార్ ‘పవనిజం’ పేరుతో అర్జెంటీనా వైద్యశాస్త్ర పట్ట్భద్రుడు, బొలీవియా, క్యూబాల్లో కమ్యూనిస్టు సాయుధ పోరాటాల్లో పాల్గొన్న ‘చెగువేరా’ను- తెలుగునాట భగత్‌సింగ్‌ను చంపేసి- యువకుల మోటార్ సైకిళ్ళపై స్టిక్కర్‌గా ఎక్కించేశాడు. ఈ చెగువేరా ఫెడల్ క్యాస్ట్రో మంత్రివర్గం నుండి బయటకొచ్చి ‘కమ్యూనిస్టు విప్లవం’ తీసుకున్నాడు. 

మరి తలాతోకా తెలియకుండా స్టేట్‌మెంట్లు ఇచ్చే నాయకుల్లా, సినిమావాళ్లలా చిరంజీవి ఆ భ్రమల్లో పడి ‘అగ్రెస్సివ్’ పాత్రలు రావాలనడం ‘ఏం సందేశం’ ఇస్తాయో తెలుసుకున్నాడా? మరి అలాంటి అగ్రెస్సివ్ పాత్రలు ఆయుధాలు చేపడితే మీరు హైదరాబాద్‌లో నిర్మించుకున్న స్టూడియోలు, ఆకాశహర్మ్యాలు ఉంటాయా? ఇలాంటివి ప్రోత్సహిస్తే గద్దర్ గానం చేసే అమరవీరులంతా రేపటినుండి హీరోలై కూర్చుంటారు. అపుడు తెలుగునాట కథలకు కొదవుండదు. బహుశా! రాం చరణ్, అల్లు అర్జున్‌లకు కావాలసినంత పని కూడా దొరుకుతుంది.

జార్జిరెడ్డి 15 జనవరి 1947లో క్రైస్తవ మలయాళీ లీలా వర్గీస్, రఘునాథ రెడ్డి (చిత్తూరు జిల్లా) దంపతులకు జన్మించాడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదువు కొనసాగించాడు. అదే అతని రంగస్థలం. 1967-69 మధ్యలో శ్రీకాకుళ సాయుధ పోరాటం ప్రారంభం అయ్యాక, దాని మానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేశారు. ‘మార్క్సిస్ట్ మదర్సా’లా ఇపుడు జేఎన్‌యూ ఎలా తయారైందో- నక్సలైట్లను తయారుచేసే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు మారిన సందర్భం అది. 

ఆ సందర్భంగా సదరు జార్జిరెడ్డి గోదావరి హాస్టల్ పక్కన నికిల్ డస్టర్లు, కత్తులు, బ్లేడ్లు, చువ్వలు.. ఎలా ఉపయోగించాలో విశ్వవిద్యాలయంలో అమాయక విద్యార్థులకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ గుంపునకు కాంగ్రెస్ కమ్యూనిస్టు దత్తపుత్రులైన ఎస్.జైపాల్‌రెడ్డి, కె.వి. రఘనాథరెడ్డి వంటివారు వె న్నుదన్నుగా నిలిచేవారు. జై పాల్‌రెడ్డి ఢిల్లీలో కూర్చొని మొన్నటివరకు కమ్యూనిస్టు శక్తులకు, మావోయిస్టు సానుభూతిపరులైన మేధావులకు, హక్కుల సంఘాలకు ఎలా సహాయం చేసేవాడో జైపాల్‌రెడ్డి మరణానంతరం రాసిన వ్యాసంలో- ఓ ప్రసిద్ధ పౌరహక్కుల సిద్ధాంతకర్త స్మరించుకొన్నాడు. వర్గ శత్రు నిర్మూలనలో ఆనాడు నక్సలైట్లు చేసే పాశవిక చర్యలన్నింటిపైనా జార్జిరెడ్డి పూర్తి విశ్వాసం కలిగి విశ్వవిద్యాలయంలో అలాంటి బీభత్స వాతావరణం సృష్టించాడు.

1970లో యూనివర్సిటీ క్యాంప్‌లో రాయలసీమకు చెందిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను కత్తితో పొడిచాడు. ఉస్మానియా విశ్వవిద్యాయలంలో ఇంత పెద్ద క్రూర సంఘటన అంతకుముందెన్నడూ జరుగలేదు. దాంతో విశ్వవిద్యాలయ విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి వర్గశత్రువులయ్యారు. దాంతో విశ్వవిద్యాలయ పాలక మండలి జార్జిరెడ్డిని ‘రస్టికేట్’ చేయడంతో ఈ వాతావరణం మరింత వేడెక్కింది. నాటి న్యూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సి.సుదర్శన్ అత్యంత శీఘ్ర పైరవీ చేసి జార్జిరెడ్డి రస్టికేషన్‌ను రద్దు చేసేందుకు కృషిచేశాడు. 

దాంతో జార్జిరెడ్డి నాయకుడై కూర్చొని, తన కార్యకలాపాలు మరింతగా విస్తృతపరిచాడు. జార్జిరెడ్డి ఆగడాలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఎదుర్కోవడం మొదలుపెట్టింది. ఇది జీర్ణించుకోలేక జార్జిరెడ్డి ఏబీవీపీ కార్యకర్తలపై విద్వేషం పెంచుకున్నాడు. ఆనాటి ప్రదేశ్ కాంగ్రెస్ జీపులో ఎక్కి జార్జిరెడ్డి, అతని అనుచరులు సాగించిన దమనకాండ అంతా ఇంతా కాదు. ఏబీవీపీ నాయకుడు నరసింహారెడ్డిని కిడ్నాప్ చేసి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వేసి తీవ్రంగా కొట్టారు. 

అలాగే మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావును, నారాయణదాసును తీవ్రంగా గాయపరిచాడు. నారాయణదాసును తీవ్రంగా కొట్టి, అతను మరణించాడని వదిలిపెట్టి పబ్లిక్ గార్డెన్‌లో పడేసి తిరుగుముఖం పట్టారు. ఎంతో ఓపికగా భరించిన జాతీయవాద విద్యార్థులపై జార్జిరెడ్డి తన ముఠాతో తీవ్రంగా దాడులు చేయించాడు. ఇంద్రసేనారెడ్డి, రవీందర్‌రెడ్డిల తలకు తీవ్రంగా రక్తస్రావం అయ్యేంతవరకు చీఫ్ వార్డెన్ ఆఫీసులోనే దాడి చేశారు.

ఆ తర్వాత నాటి సీఎం జలగం వెంగళరావు ఈ నక్సల్స్ గ్యాంగుకు, ఏబీవీపీకి రాజీ కుదిర్చేందుకు ఓ సమావేశం ఏర్పాటుచేస్తే జార్జిరెడ్డితోపాటు ఎస్.జైపాల్‌రెడ్డి కూడా అందులో పాల్గొన్నాడు. వెంగళరావు ఎన్ని సుద్దులు చెప్పినా జార్జిరెడ్డి అపర చెగువేరాలా తన పంథా వదల్లేదు. చివరకు 1972 ఏప్రిల్ 14న జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల సందర్భం గా జార్జిరెడ్డి, అతని వర్గం ఇంజనీరింగ్ హాస్టల్‌పై దాడికి దిగి ఏబీవీపీ విద్యార్థులపై మారణాయుధాలు ప్రయోగించారు. ఈ క్రమంలో జరిగిన పరస్పర దాడిలో జార్జిరెడ్డి మరణించాడు. దీన్ని ఆనాటి వామపక్ష మేధావులు, సంఘాలు తమ పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో ‘మతోన్మాదంపై పోరాటం’ అంటూ కలరింగ్ ఇచ్చాయి.

 జార్జిరెడ్డి సమకాలికులైన వాళ్లెందరో అనంతర కాలంలో ఆయనను హీరోగా తీర్చిదిద్దారు. అతడు పేరుకి ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్త అయినా వామపక్ష అతివాదంతో పనిచేశాడు. అతని మరణాన్ని జైపాల్‌రెడ్డి పెద్ద వివాదంగా మార్చి శవయాత్రను విశ్వవిద్యాలయం గేటు నుండి ఆరెస్సెస్ కార్యాలయం (బర్కత్‌పురా) ముందు తీసుకెళ్లి, అక్కడ ఉద్రిక్తత సృష్టించాడు. ఈ ఘటనలో 9 మంది ఏబీవీపీ సభ్యులతోపాటు 9 మంది విద్యార్థులపై కేసులు నమోదు అయ్యాయి.

175 మంది కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సోషలిస్ట్ పార్టీల ఎంపీలు దీన్ని ఆసరాగా చూపి ఆరెస్సెస్‌పై కుట్ర కేసు పెట్టాలని ఇందిరాగాంధీని వత్తిడి చేశారు. కానీ ఆరు నెలల్లోగానే ట్రయల్ కోర్టు అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత జార్జిరెడ్డి అభిమాన గుంపు చేతిలో ఎందరో జాతీయవాద విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో అన్ని విశ్వవిద్యాలయాలు ‘టెర్రరైజ్’ అయ్యాయి. దీనికి మేధావుల పేరుతో కవులు, లెక్చరర్లు సైద్ధాంతిక భూమిక రచించారు. 

ఆఖరుకు విశ్వవిద్యాలయాల్లో జాతీయ జెండాను కూడా అవమానించడం మొదలుపెట్టారు. జాతీయ పతాకం గౌరవం కాపాడే క్రమంలో 1980 జనవరిలో జరిగిన ఘటన తర్వాత సామా జగన్మోహన్‌రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 1983 వరకు విశ్వవిద్యాలయాల్లో ఈ అరాచకం కొనసాగింది. చివరిగా ఏబీవీపీ నాయకుడు చంద్రారెడ్డి హత్యతో జార్జిరెడ్డి రక్త్ధార ఆగిపోయింది. ఇలాంటి వ్యక్తుల జీవితాలను సినిమాలుగా కులాభిమానంతో తీయడం మొదలుపెడితే కథలకు ఏం కొదవ లేదు. పాక్షికంగా రాజకీయ నాయకుడైన చిరంజీవి ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారో తెలియజేయాలి.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*22-11-2019 : సోమవారం*


తమాదిదేవ మజరం కేచిదాహుశ్శివాభిధమ్‌
కేచిద్విష్ణుం సదాసత్యం బ్రహ్మాణం కేచి దూచిరే

ముసలితనం లేని ఆ ఆది దేవుని కొందరు శివుడని, ఇంకొందరు విష్ణువని అన్నారు. మరికొందరు బ్రహ్మ అని అన్నారు. కానీ సత్య స్వరూపుడైన ఆయన ఒక్కడే అని శాస్త్రార్థం తెలిస్తే.. ఉన్నది దృష్టి భేదం మాత్రమేనని, సృష్టి భేదం కాదని గ్రహిస్తాం. అందుకే మన దేశ సాంస్కృతిక జీవనంలో కూడా అలాంటి నిర్మాణాత్మక దృష్టిని మనం గమనించవచ్చు. 

ఆధునిక ఆవిష్కరణలు చేసినవాళ్లు, విప్లవాలు లేవదీసే గొప్పవారు ఈ భూఖండంపై జన్మించకపోవచ్చు. కానీ ఓ పతంజలి, యాజ్ఞవల్క్యుడు, గోరఖ్‌నాథ్‌, గౌతమబుద్ధుడు, శ్రీరామకృష్ణులు, రమణ మహర్షి, శ్రీకృష్ణుడు.. ఇలా ఎందరో ఈ గడ్డపై జన్మించారు. వీరందరి ప్రబోధాల్లో వైవిధ్యం ఉన్నా వీరి అంతర్గత శక్తిలో సారూప్యం ఉంది. అందుకే ఓ బలమైన సాంస్కృతిక బంధం ప్రజల్లో నిరంతరం జీవనాడిలా చైతన్యం కలిగిస్తున్నది. నదులు, పుష్కరాలు, కుంభమేళాలు, ఆలయాలు, ఉత్సవాలు, పండుగలు, పర్వాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ శకలాలుగా ఉన్న మనస్సుకు సకలేశుని తత్వం ఎఱుకపరిచేవే.

మనం శివభక్తులమైతే అమర్‌నాథ్‌ నుండి రామేశ్వరం వరకూ మన ఆధ్యాత్మిక యాత్రను చేయవచ్చు. లేదు.. ‘నేను అమ్మవారిని అర్చిస్తాను’ అనుకుంటే వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు, ముంబాదేవి నుండి కామాఖ్య వరకు ప్రయాణం చేసి ఆ తల్లిని సేవించవచ్చు. విష్ణు భక్తులమైతే జగన్నాథ్‌ నుండి మథుర వరకు, అయోధ్య నుండి గురువాయూర్‌ వరకూ అన్నీ విష్ణు స్థలాలే. గురు స్థానంలో ఉన్నవారిని గురించి చర్చ చేస్తే కేరళలోని కాలడిలో జన్మించిన ఆదిశంకరులు దేశం నలుమూలలా మఠాలను నిర్మించారు. 

ఆయన మందిరం శ్రీనగర్‌లో ఉంటే, సమాధి స్థలి ఉత్తరాఖండ్‌లో ఉంది. శంకరుడు అందించిన అద్వైతం ఎన్నో అడ్డంకులను తట్టుకొని నిలబడింది. ఈ దేశంలో రామానుజుడికి ఎంత ప్రాధాన్యత ఉందో సంత్‌ రవిదా్‌సకు అంతే ప్రాధాన్యత ఉంది. ఎవరు ఎక్కడ ఏ పూజ చేసినా సంకల్పంలో అన్ని నదుల కలయిక ఉంటుంది.

గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావే జలే స్మిన్‌ సన్నిధింకురు

అంటూ చేతిలోకి నీటిని తీసుకునిఆయా నదుల పేరుతో పిలిచి ‘పుణ్యత్వం’ కలిగిస్తాం. ఈ నదులు దేశంలోని అనేక చోట్ల పారుతన్నా, వాటికి ఏకత్వం కలిగించే సంస్కృతి మనది. పంటనిచ్చే భూమిని, పునీతులను చేసే అగ్నిని, జలాన్నిచ్చే నదిని సూక్తాలతో కృతజ్ఞతతో అర్చిస్తాం. ఈ అపార సాంస్కృతిక ఏకత్వ భావన ఈ దేశంలోని ఆధ్యాత్మిక ఏకత్వానికి, అవిచ్ఛిన్న జ్ఞాన ప్రసారానికి ఆలంబనగా మారింది. సత్యాన్వేషణను పరిశోధించకుండా దర్శించిన తత్వశాస్త్రం వల్లనే ఈ ఏకాత్మ భావన సాధ్యమైంది.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 18 - 11 - 2019 : సోమవారం*


*********************************
*డా. పి. భాస్కర యోగి*
*ఆంధ్రప్రభ : ఆదివారం*
*10 నవంబర్ 2019*


ఈనెల 9వ తేదీన అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెం టనే కొంత సంతోషం, అసహనం, ఆనందం, వ్యతిరేకత.. అన్నీ ఒక్కసారి వ్యక్తం అయ్యాయి. శ్రీరామ సంస్కృతిని ఆరాధించేవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ సహా ఒకరిద్దరు తప్ప- ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. 

కొన్ని ముస్లిం సంస్థలు సుప్రీం తీర్పు పట్ల బాహాటంగా మద్దతు ప్రకటించగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం అగ్నికి ఆజ్యం పోయాలని చూసింది. కాంగ్రెస్ అధికార పత్రికలో వ్యితిరేకంగా తెల్లారేసరికి వ్యాసం రానే వచ్చింది. ఇక సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు, కమ్యూనిస్టులు యథాలాపంగా ‘దేశంలో మతతత్వం పెరిగేందుకు అవకాశం ఉందని’ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇంకొందరు విశే్లషకుల పేరుతో ‘దేశంలో ఆర్థిక మాంద్యం పెరుగుతుంటే ఈ తీర్పు సరైన దిశలో లేదు’ అన్నారు. అంటే తీర్పు బాబ్రీ పక్షం గెలిచి ఉంటే ‘సెక్యులరిజం’ బ్రతికేదని ఉపన్యాసాలు, విశే్లషణలు, వ్యాసాలు రాసేవారా? కాదా?


రామమందిరం తీర్పు బయటి స్తరంలో ఓ ఉద్యమంలా, హిందూ మనోభావాలను గౌరవించినట్లుగా కన్పించడం ఒకవైపు, నిజానికి అంతర్గతంగా ఆలోచిస్తే ఈ దేశంలో ‘సంతుష్టీకరణ’ రాజకీయాలు పరాకాష్ఠకు చేరిన తర్వాత పుట్టుకువచ్చిన ఉద్యమం ఇది. ఇక తెలుగు టీవీల్లో చర్చలు చేసే మేధావులకు ఇంకా సంతుష్టీకరణ జాఢ్యం వదలడం లేదనిపించింది. ఓ వైపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటూనే తమ అక్కసునంతా హిందువులపై వెళ్లగక్కారు. మేధావులు, విశే్లషకులమని ముద్రలు వేసుకొని చర్చలకు వెళ్లి ‘ఎర్ర రాగం’ ఆలపించడం పరిపాటిగా మారిపోయింది. 

ఒకాయన అయితే ఇది ‘హిందుత్వ శక్తులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం’ అన్నాడు. అంటే ఆయన దృష్టిలో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ అని అర్థం. నిజానికి 1528లో మీర్ బాకీ ఆలయం కూల్చి, దానిపై మసీదు నిర్మాణం చేశాక ఎందరో ప్రతిఘటించారు. వాళ్లంతా ఆరెస్సెస్ వాళ్ళేనా? ఆరెస్సెస్ పుట్టింది 1925లో అయితే 1885లో మొదట కేసులు ఎలా ఫైల్ అయ్యాయి? ఈ దేశంలో హిందుత్వ గురించి తలాతోకా తెలియని వాళ్లంతా దూరం నుండే ఏ పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తారు. రావణుడు మరణించాక శ్రీరాముడు లంకను తన హస్తగతం చేసుకొన్నాడా? విభీషణుడిని పట్ట్భాషేకం చేసాడా? 

వాలిని చంపాక కిష్కింధను సుగ్రీవుడికి, అంగదుడికి ఇచ్చాడు కదా? వాలిని శత్రువుగా భావించిన శ్రీరాముడు అదే వాలి కుమారుడైన అంగదుడికి తన దగ్గర స్థానం ఇచ్చాడు కదా? ఇది రామాయణ సంస్కృతి! రామరాజ్య సంస్కృతి!

ఈ దేశ హిందుత్వంలో ఇది నరనరాన జీర్ణించుకుని ఉంది. అందుకే శ్రీకృష్ణుడు హీరో అయినా రాజ్యం పాండవులకిచ్చాడు. గాంధీ రామరాజ్య భావన కలిగి ఉన్నాడు కాబట్టే తాను ముందుండి పోరాడి సంపాదించిన సింహాసనాన్ని నెహ్రూకు ఒక్క నిమిషంలో ధారపోశాడు. మరి అదే గజినీ, ఘోరీ, నాదిర్షా, తైమూర్, బాబర్, ఔరంగజేబుల సంస్కృతి ఏమిటి? జిన్నా ఏం చేశాడు? నిజాం ఏం చేశాడు? కాశీం రజ్వీ ఏం చేశాడు? ఇపుడు పాకిస్తాన్ చరిత్రను అధ్యయనం చేస్తే అది ఏర్పడిన నాటినుండి ఒక్క అధ్యక్షుడైనా గౌరవింపబడ్డాడా? క్రూరమైన దండన, దేశ బహిష్కరణ, కుక్కచావు.. ఇదే కదా!

 అక్కడి మతరాజ్య భావన వాళ్లకు ఇచ్చింది! అదే ఈ దేశంలో ఏపీజే అబ్దుల్ కలాంను ముస్లింల కన్నా హిందువులు ఎక్కువ ప్రేమిస్తారు. హిందుత్వ వాదులు ఈ దేశంలో కలాంకు సమున్నత స్థానం ఇస్తారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల సంతుష్టీకరణకు వ్యతిరేకంగా భాజపా ఇపుడు వటవృక్షం అయ్యింది.
ఇదే రామమందిరం విషయంలో నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హిందువులకు అనుకూలంగా ఉన్నాడని తెలిసి నెహ్రూ అతణ్ణి మందలిస్తూ లేఖ రాస్తాడు. ‘ఈదేశంలో మొదటి ముద్ద ముస్లిం మైనారిటీలదే’ అని మన్మోహన్ సింగ్ బరితెగిస్తాడు. ఇక కమ్యూనిస్టులైతే ‘దాస్ కాపిటల్’ వచనంలాగా హిందూ మతోన్మాదం అంటూ రోజూ పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఉండే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. 

700 ఏళ్ల బానిసత్వంతో హిందువులు విసిగిపోయారు. అలాగే 1906 తర్వాత భారత రాజకీయాల్లో పుట్టుకొచ్చిన సంతుష్టీకరణ, 1947 దేశ విభజన పరిణామాలు అంతర్గత జాతీయ వాదానికి పునాది వేసాయి. రొమిల్లా థాపర్ మొదలుకొని రామచంద్ర గుహ వరకు ఈ దేశ అసలు చరిత్రకు ఎర్రరంగు, ఆకుపచ్చ రంగు రుద్దే ప్రయత్నం చేయడమే. ఆ రెంటినీ తలదనే్న ‘కాషాయరంగు’ ఇపుడు కదంద్రొక్కుతున్నది.

నిజానికి ఇవాళ అల్పసంఖ్యాకులు అని పిలుస్తున్నవారు ఎప్పుడూ పైచేయిగానే ఉన్నా, వారిని ‘ప్రత్యేకమైన వ్యక్తులు’గా చూడడం మొదలుపెట్టాం. నిజానికి ఏ సమాజంలోనైనా ఒక హత్య జరిగితే అది హత్యగా చూడకుండా, నేరంగా పరిగణించకుండా మైనారిటీ అనే సంతుష్టీకరణ 1947 విభజన నుండే ప్రారంభించి ఈ దేశంలో సమానత్వానికి పాతరేసారు. యూరప్‌లో యూదులు, జిప్సీలు, అమెరికాలో నీగ్రోలు, లెబనాన్‌లో ద్రూజ్, మోరోనాయిట్ క్రైస్తవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులు నిజంగా మైనారిటీలు. అక్కడ ఈ అల్ప సముదాయాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయి. 

కానీ ఈ దేశంలో హాయిగా హిందువుల మధ్య సహజీవనం చేస్తున్న ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి సంతుష్టీకరణ మొదలుపెట్టారు. అదే ముస్లింలు మెజారిటీగా వున్న జమ్మూ కశ్మీర్‌లో ఒక్క హిందువు ముఖ్యమంత్రిగా పదవి తీసుకోలేకపోయాడు. అక్కడి నుండి హిందూ పండిట్లు నిర్దాక్షిణ్యంగా అత్యాచారాలకు గురయ్యారు. అందుకే 370 ఆర్టికల్, 35ఎ ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం తొలగించగానే దేశం మొత్తం మద్దతుగా నిలబడింది. అలాగే ‘రామమందిరం’ తీర్పు ఏనాడో వ చ్చేది. 

మరి అంతర్గతంగా అడ్డుకొన్నది ఎవరు? అసలు రామమందిరం వివాదాన్ని క దిలించిందే కాంగ్రెస్ అని ఓవైసీ నెగెటివ్‌గా అంటే, మేమే చేసాం అని కాంగ్రెస్ పాజిటివ్‌గా చెప్తుంది! అలాంటపుడు అద్వానీ ఎందుకు దీన్ని దేశ వ్యాప్త ఉద్యమంగా మలిచాడు? ఇదే పునాదులపై భాజనా సౌధం ఎలా నిర్మింపబడిందో ఒక్క కాంగ్రెస్‌వాది కూడా చెప్పలేడు! కారణం- ‘గాలికి కొట్టుకుపోయే పేలపు పిండి కృష్ణార్పణం’ అంటున్నామని వాళ్ళందరికీ తెలుసు.

నిజానికి 1951 జనగణన ప్రకారం 85 శాతం వున్న హిందువులు, 10 శాతం వున్న ముస్లింల జనాభా 1961లో 84 శాతం హిందువులు, 11 శాతం ముస్లింలుగా మారింది. ఇది క్రమంగా 1981-1991 మధ్యకాలంలో ఇంకా అంతరం పెరిగింది. ఇపుడు హిందువుల సంఖ్య బాగా తగ్గింది. అలాగే ముస్లిం ప్రజా ప్రతినిధులకు మద్దతుగా మతపరమైన సంఘాలను సయ్యద్ షాబుద్దీన్ మొదలుకొని, తస్లీమ్ రహమానీ వరకు అందరూ నడుపుతున్నారు. 

బద్రుద్దీన్ అజ్మల్, ఓవైసీ, ఆజంఖాన్ వంటివారు బహిరంగంగా తమ సముదాయమే ముఖ్యం అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయడం తప్పని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు వాళ్లకు ఏనాడూ హితబోధ చేయదు. ఇదంతా ఇపుడు జాతీయవాదం బలపడేందుకు కారణం అయ్యింది. ఒక దేశంలో నివసించే ప్రజలకు ‘సమానమైన న్యాయం’ లేకుండా కొందరిపై ప్రేమ, మరికొందరిపై ద్వేషం ఎందుకు? అందుకే రామమందిరం తీర్పును భక్తికన్నా భావోద్వేగంగానే ఈ దేశ ప్రజలు చూస్తున్నారన్నది సత్యం.


 ********************************

* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*15-11-2019 : సోమవారం*