కొక్కొరో ... క్కో ...


***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
17 : 23 : డిశంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 07తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ విధ్వంసాన్ని తేలిగ్గా తనకు అనుకూలంగా మలచుకోగల నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. విచిత్రమో, విధి నిర్ణయమో చెప్పలేం గాని ప్రతీ విధ్వంసం తర్వాత లాభపడేది ఆయనే. కుప్పకూలిన కోటగోడల్లో శిథిలాల మధ్య కూర్చొని ఏడ్చేవాళ్లు ఏడుస్తుంటే దానినుండి ‘పసుపుపచ్చని’ మొక్కలను పుట్టించడం ఆయన ఘనత. అప్పట్లో ఎన్టీఆర్ ఇంకో ఆరునెలలు బతికుంటే ఏం జరిగేదో ఊహంచలేం. కానీ ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబీకుల కన్నా ఎక్కువ లాభపడింది మాత్రం ‘నారా’ వారే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే ఆంధ్రాలో వాలిపోయి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే వేడిని పుట్టించి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసి, ఇంకెప్పుడూ కోలుకోకుండా చేసి పీఠం ఎక్కిన సమర్ధుడు చంద్రబాబు. ఆయన 2014లో ఏపీలో కాంగ్రెస్‌ను అధఃపాతాళానికి తొక్కేసి, 2018లో తెలంగాణ కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాడు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ‘ఉత్తర కుమారులు’ ఇకనైనా గ్రహిస్తారో లేదో తెలియదు!


ఇక, కొంగర కలాన్ సభ తర్వాత తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల కొంత వ్యతిరేకత ఉందన్నది అక్షరాలా సత్యం. రాహుల్ గాంధీతో సరూర్‌నగర్‌లో సభ పెట్టించి తెలంగాణలో ‘కాక’ పుట్టించిందీ నిజం. పొత్తుల పేరుతో టీడిపితో కూటమి ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌కు ‘రాజశ్యామలయాగ’ ఫలితం అందివచ్చింది. అప్పటివరకు కేసీఆర్‌కు కాంగ్రెస్‌లోని ఛోటామోటా నాయకులను ఎలా టార్గెట్ చేయాలో అర్థం కాని సంకట స్థితి. ఎప్పుడైతే బాబు వస్తున్నాడని కేసీఆర్ తెలుసుకొన్నాడో- తెలివిగా వనపర్తి సభలో ‘‘అడుక్కుంటే మేం నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం గదా, చంద్రబాబు ద్రోహి’’లాంటి పదాలు వాడి జనాన్ని రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ‘రాజశ్యామల యాగం’చేసి బయటకి వచ్చాక తిట్లన్నీ మానేసి, తెలంగాణ ప్రజల ఉద్వేగాన్ని మెల్లమెల్లగా కదిలించాడు. యాగం తర్వాత ఖమ్మం సభలో కేసీఆర్ తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన 30 లేఖలను ప్రజలకు చూపించడంతో కథ తిరగబడింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తిట్లులేకుండా తననుతాను సజ్జనుడిగా, అమాయకుడిగా, తెలంగాణ లెజెండ్‌గా, తెలంగాణ రక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకొన్నాడు. ప్రజల యాసలో తన పథకాల గొప్పతనం గురించి చెప్పుకొంటూ, సరైన వ్యూహాన్ని కేసీఆర్ అవలంబించాడు.మరోవైపు చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసాక, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ద్వారపాలకులయ్యారు. నేరుగా అశోక్ గెహ్లాట్ లాంటి సీనియర్ నేత చంద్రబాబును అమరావతిలో కలిసి తెలంగాణ ఎన్నికలపై చర్చిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కక్కలేక మింగలేక బిక్కమొఖం వేసారు.
మొదట్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ‘రాను’ అన్న చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలన్నీ చక్కబెట్టేట్లుగా పోజులిచ్చాడు. దాంతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఇదొక మంచి పరిణామంలా కన్పించి ఇక్కడి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడకుండా బాబుతోనే వ్యూహరచన చేయడం మొదలుపెట్టారు. ఒక సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో దించి అక్కడి కులాల మధ్య విభజన వచ్చేట్లుగా బాబు ప్రయత్నించాడు. ఇనే్నళ్ల తెలంగాణ ఉద్యమంలో గానీ, తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక గానీ ఏరోజు ఆంధ్రా ప్రాంత ప్రజలపై దాడులు జరుగలేదు. అలాంటిది హైద్రాబాద్ నగరంలో ఆంధ్రా ప్రాంతం వారు నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించడం, విస్తృతంగా ప్రచారం చేయడంతో మిగతా తెలంగాణ ప్రాంతంలో అలజడి మొదలయ్యింది. ‘మేం తలచుకుంటే ఆంధ్ర వలసవాదుల వోట్లు మీకు పడకుండా చేస్తాం..’ అని నాలుగైదు నెలల క్రితం తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్న మాటలను చంద్రబాబు నిజం చేస్తాడా? అనే ఆందోళన తెలంగాణ జనంలో మొదలైంది. దాదాపు 17 సీట్లల్లో ఇలాంటి ‘విభజన వాదం’ పనిచేస్తే, మిగతా తెలంగాణలోని సీట్లలో తెరాసకు సీట్లు తగ్గితే ఎలా? అని తెలంగాణ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆఖరుకు తెరాస ప్రభుత్వంపై కోపంగా ఉన్న ఉద్యోగులు కూడా తెరాసను గెలిపించకపోతే తమ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని ఆలోచించారు. కాబట్టే పోస్టల్ బ్యాలెట్లు సింహభాగం తెరాసకే దక్కాయి.చంద్రబాబు ప్రచారం ప్రారంభించాక- తెదేపా ముఖ్య కార్యకర్తలు డబ్బు సంచులతో పట్టుబడడం, ఆంధ్రా ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణలో పోలీసులకు చిక్కడం ఇక్కడి ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. చంద్రబాబు, ఆయన మంత్రులు డబ్బు, కులం, ప్రాంత విభజన వంటి అంశాలతో తెలంగాణను ముంచుతున్నారని కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది. కాంగ్రెస్ పెద్దలకు ‘ఏపీలో పొత్తు ఉండద’ని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేసినా చెవికెక్కలేదు. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం తెలంగాణ ప్రాంతం చంద్రబాబు గుప్పిట్లోకి పోతుందన్న సంకేతం వెళ్లింది. రాహుల్ గాంధీని సభలో కూర్చోబెట్టి ఫ్లెక్సీలో రాజీవ్, ఎన్టీఆర్ ఫొటోలుపెట్టి చంద్రబాబు హైద్రాబాద్‌ను తానే సృష్టించానని చెప్తుంటే ఆసక్తిగావిన్న రాహుల్ అమాయకపు చూపులు కాంగ్రెస్ బేలతనాన్ని బయటపెట్టాయి. తెలంగాణకు చెం దిన పి.వి.నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టి.అంజ య్య లాంటి నాయకుల ఫొటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో మచ్చుకైనా లేవు. కమ్మ, కాపు, రాయలసీమ రెడ్డి వర్గాల అంతర్గత పోరు గ్రేటర్ హైదరాబాద్‌లో తెలుగుదేశానికి చెక్ పెట్టింది.కేసీఆర్‌పై చంద్రబాబు చేసిన విమర్శలు ‘అరిగిపోయిన రికార్డుల’ మాదిరి ప్రజలకు వినిపించాయి. దీనికితోడు ఇక్కడి ప్రధాన స్రవంతి మీడియా అంతా ఒక్కసారిగా చంద్రబాబును ఆకాశానికెత్తడం కోసం ‘తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్’ మధ్యనుండాల్సిన ఎన్నికలను ‘కేసీఆర్ వర్సెస్ ఆంధ్రా పెత్తనం, బాబు వ్యూహం’ అన్నట్లుగా చేసిన అతి ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ స్వయంకృతాపరాధం. దీనికితోడు అకారణంగా ప్రధాని మోదీపై పదే పదే ద్వేషం ప్రదర్శిస్తున్న బాబు కాంగ్రెస్‌తో కలిసి భాజపాను నాశనం చేస్తానన్న ప్రకటనలు కూడా అతిగా మారాయి. దీంతో భాజపాలోని కింది స్థాయి కార్యకర్తలు కేసీఆర్ గెలిచినా సరే కానీ- బాబుతో జతకట్టిన కాంగ్రెస్‌ను ఓడించాలని కారుకు ఓటేసారు. అన్ని పార్టీల సభలకు జనం వచ్చినా అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, రైతులు, పింఛన్‌దారులు మూకుమ్మడిగా కేసీఆర్ వైపు మొగ్గుజూపడానికి కారణం చంద్రబాబు సారధ్యంలో నడిచే కాంగ్రెస్ వస్తే సంక్షేమ పథకాలన్నీ పోతాయేమో అని భయపడడం. ఇక్కడి ఉద్యోగవర్గాల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ వైపు మళ్లింది. లేకపోతే కాంగ్రెస్‌లోని మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్ప అందరు సిట్టింగులు, హేమాహేమీలు ఓడిపోవటం ఏమిటి? తెరాస అభ్యర్థుల్లో దాదాపు 35 మంది పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ- ప్రజలు కేసీఆర్‌నే చూసారు కానీ అభ్యర్థుల గురించి ఆలోచించలేదు. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ అభ్యర్థులంతా తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుకు మద్దతిస్తున్నట్లు భావించారు. నిశ్శబ్ద విప్లవంలా కాంగ్రెస్‌కు ఓటేద్దామనుకొన్న వారు సైతం- కాంగ్రెస్‌ను బాబు చేతుల్లోపెట్టి ఆ పార్టీ నేతలు దిక్కులు చూడడం జీర్ణించుకోలేకపోయారు.ఇక గద్దర్ లాంటి వ్యక్తి ఇనే్నళ్లు ఎందరో అమరుల సమాధుల దగ్గర లాల్ సలాం చెప్పి చంద్రబాబును కౌగిలించుకోవడం ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేదు. సాత్వికుడిగా పేరున్న ఆచార్య కోదండరాంపై వ్యక్తిగతంగా ఈరోజుకూ గౌరవం ఉన్నా చంద్రబాబు ప్రక్కన కూర్చొని చేతులూపడం ఇక్కడి విజ్ఞులను ఆలోచనల్లో పడేసాయి. మోదీని గద్దెదించుతాం అన్న సీపీఐ నేతలు ఒక్కసారిగా చంద్రబాబును ఇంద్రుడని పొగుడుతుంటే ఇదంతా కేసీఆర్‌పై యుద్ధమే కదా..! అని ఇక్కడి ప్రజలు భావించారు. ఇలా అందివచ్చిన అవకాశాన్ని వదులుకొన్న కాంగ్రెస్‌కు చంద్రబాబు శాపంగా మారగా, కేసీఆర్‌కు వరంగా మారిపోయాడు. ‘కర్ణుడి చావుకు కారణాలెన్నో’ అని భారతం చెబితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబే కారణం అన్నది సుస్పష్టం. త్వరలోనే వీహెచ్ లాంటివారు దీన్ని కుండబద్దలు కొడతారు కూడా! అభివృద్ధి- వెనుకుబాటుతనం అనే అంశాలపై జరగాల్సిన చర్చ ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగంగా మార్చిన అదృశ్యశక్తుల పట్ల కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల తగిన ఫలితాన్ని అనుభవించింది. మూడు రాష్ట్రాల్లో గెలిచిన ఆనందం కన్నా తెలంగాణలో దారుణ పరాభవం కాంగ్రెస్‌కు చేదు జ్ఞాపకమే.


***************************************
✍✍-డాక్టర్. పి. భాస్కర యోగి 
భాస్కరవాణి : ఆంధ్రభూమి 


కొక్కొరో ... క్కో ...


***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
10 : 16 : డిశంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 06‘‘ఓ అణుశాస్తవ్రేత్తగా మూడో ప్రపంచ యు ద్ధంలో ఏం జరుగుతుందో చెప్పండి’’- అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దానికి ‘‘మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం నన్ను అడగకండి? నాలుగో ప్రపంచ యుద్ధం గురించి మాత్రం చెప్పగలను’’ అని అన్నాట్ట ఆయన. ఇదేంటని పాత్రికేయుడు నోరెళ్లబెడితే- ‘‘నాలుగో ప్రపంచ యుద్ధం ఎప్పటికీ జరగదు.. మూడవ ప్రపంచయుద్ధమే ఆఖరి యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజకీయవేత్తలంతా ఆఖరి ప్రపంచ యుద్ధం కోసం అన్నీ సిద్ధం చేస్తూనే ఉన్నారు’’ అన్నాడట ఐన్‌స్టీన్.

నేటి రాజకీయాల్లో జరుగుతున్న దుస్సంఘటనలు, దురాలోచనలు చూస్తుంటే మనం కూడా అలాంటి ప్రమాదంలోకి నెట్టబడుతున్నామా? అనే భయమేస్తుంది. ఉదాహరణకు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలను చూడండి. కొత్తకొత్త పొత్తుల వంటలు వండి వార్చినా, రాత్రికి రాత్రి పార్టీలు మారి టిక్కెట్టు సంపాదించినా, ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారినా ప్రజలు వాళ్లను అంగీకరిస్తున్నారు! ఇదే మన ప్రజాస్వామ్యానికి పట్టిన మాయరోగం.

స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశంలో కుటుంబ పాలనకు నాంది పడింది. మోతీలాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసిన విజ్ఞులలో ఒకరు. ఆయన వారసత్వంతో గాంధీ చాటున జవహర్‌లాల్ నెహ్రూ గద్దెపై కూర్చొన్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో రాజకీయవేత్తలు ఈ దేశ రాజకీయ యవనికపై ఉన్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభభాయి పటేల్ వంటి కాకలుదీరిన యోధానుయోధులు ప్రధాని పదవిని సమర్ధవంతంగా నిర్వహించగలిగిన వారే. వీళ్లందరి కన్నా ముందే నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ కొంత భారతదేశానికి తన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ద్వారా స్వాతంత్య్రం ప్రకటించి నెహ్రూ కన్నా ముందే ఈ దేశ ప్రధాని అయ్యాడు. కానీ, మహాత్మా గాంధీ అండదండలు పుష్కలంగా సంపాదించిన నెహ్రూ తన ప్రధాని పీఠాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. నెహ్రూ అనంతరం ఎందరో రాజకీయ దురంధరులను కాదని ఇందిర అధికారం చేపట్టగా, ఆ వారసత్వ పరంపర నేడు రాహుల్ గాంధీ వరకు నాలుగో తరం కొనసాగుతున్నది. వారసత్వ వృక్షానికి ఫలించిన రాహుల్ గాంధీ ఇపుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తాడట!?

పెద్ద ప్రజావిప్లవం వచ్చిన తర్వాత తెలంగాణ కూడా ఇలాంటి కబంధహస్తాల్లోకే వెళ్లిందని ఇపుడు అన్ని పార్టీలవారు విమర్శిస్తున్నారు. సబ్బండ వర్ణాల ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇపుడు ఓ కుటుంబం చేతిలో చిక్కిందంటే- ఈ దేశంలో ఆదర్శం ఎవరు? ఉద్యమనేతగా కేసీఆర్ పోరాటాన్ని గుర్తించి 2014 ఎన్నికల్లో ప్రజలు ఓసారి అధికారం ఇచ్చారు. కేసీఆర్ చెబుతున్నట్లు వ్యవస్థల్ని అర్థం చేసుకొనేందుకు ఈ నాలుగేళ్లు సరిపోయింది.. ఇపుడు అభివృద్ధి జరిగి తీరుతుంది చూ డండి అని చెప్పడం ఈ ఎన్నికల సమయానికి ప్రజలు జీర్ణించుకుంటారా? లేదా? అన్నది చూడాలి. మన దేశంలో ప్రజలకు అభివృద్ధి కన్నా భావోద్వేగాలు ఎక్కువ. ఈ విషయం ఒకే పాఠశాలలో చదువుకున్న ‘ఇద్దరు చంద్రుల’కు తెలుసు. అందుకే ఇపుడు తెలంగాణ రాజకీయాలు తలక్రిందులయ్యాయి. అందుకే ఇపుడు ఎన్నో కలియుగ వింతలను మనం చూస్తున్నాం.

‘నా వెన్నుపూసలో బులెట్ దింపింది చంద్రబాబే , ఎన్‌కౌంటర్ల పేరుతో నక్సలైట్లను పొట్టనబెట్టుక్నొవాడు చంద్రబాబు’- అని ఎన్నోసార్లు చెప్పిన ప్రజాగాయకుడు గద్దర్ ఇప్పుడు చంద్రబాబు కడుపులో తలపెట్టి తల్లడిల్లిపోతే ఇది కలియుగ విచిత్రం కాక ఇంకేమిటి? రాహుల్‌ను కూడా ఆలింగనం చేసుకున్నాడు గద్దర్. ఇనే్నళ్లు పీడిత, తాడిత, బహుజన రాజ్యం, మార్క్స్ రాజ్యం, మావోరాజ్యం కావాలన్న గద్దర్ ఇప్పుడు రాహుల్ రాజ్యం కావాలంటున్నాడు! ఓ జాతీయ పార్టీ నాలుగుతరాలు పాలించినా ఈ దేశంలోని సమస్యలు గద్దర్ భుజం మీది గొంగడిలా అలాగే ఉన్నాయి. దీనికి కారణం ఏ పార్టీ? ఏ కుటుంబం? ఏ రాజకీయ వారసత్వం? 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ‘నక్సలైట్లు అసలు సిసలైన దేశభక్తులు’ అన్నాడు. 1989లో చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చినపుడు నక్సలైట్ల పట్ల ఉదాసీన వైఖరి చూపాడు. అలిపిరి ఘటన తర్వాత ఆనాటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి- ‘చంద్రబాబును మించిన నక్సలైట్ లేడు’ అన్నాడు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి నక్సలైట్లపట్ల మొదట కొంత సానుభూతి చూపి ఆ తర్వాత కఠినంగా వ్యవహరించాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ‘నక్సలైట్ల ఎజెండాను మేం అమలు చేస్తాం’ అని ప్రకటించాడు. అధికారంలోకి రాగానే ఈ స్టేట్‌మెంట్లు అన్నీ తలక్రిందులయ్యాయి. ఇప్పుడు విచిత్రంగా గద్దర్ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చే వ్యక్తిగా మారడం కలియుగ విచిత్రం!

ఇక తెరాస వెంబడి ఉన్న మజ్లిస్ పార్టీది మరో కథ. కేసీఆర్ ‘మజ్లిస్ మాకు గొప్ప రాజకీయ భాగస్వామి’అని ప్రకటిస్తే మజ్లిస్ వైఖరి మరోలా ఉంది. కర్ణాటకలో కుమారస్వామిలా తాను ముఖ్యమంత్రిని అవుతానని, ఇప్పటివరకూ అందరు సీఎంలు కేసీఆర్ సహా మా పాదాల చెంత తలవంచారని అక్బర్ ప్రకటించాడు. భాజపాను నిలువరించాలంటే కేసీఆర్‌ను, భాజపాను కలువనివ్వకూడదనే తాము టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నామని కూడా ఓవైసీ ప్రకటించాడు. దీంతో హిం దువుల్లో కలవరం మొదలయ్యింది.

మజ్లీస్ గురించి కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. ఇనే్నళ్లూ తమవెంట తిరిగినప్పుడు గొప్ప ‘ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ’గా కన్పించిన మజ్లీస్ ఇప్పుడు కాంగ్రెస్‌కు మతతత్వవాదిగా కన్పిస్తోంది. మజ్లిస్‌ను ఇన్నాళ్లు పెంచి పోషించిన కాంగ్రెస్ ఓవైపు ముస్లిం లీగ్ పార్టీని చంకనెత్తుకునే మరోవైపు ఓవైసీ బ్రదర్స్‌పై యుద్ధానికి తలపడడం మరో విచిత్రం. 

కేసీఆర్ మజ్లిస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల హిందూ యువకుల ఓట్లకు తెరాస దూరం అయినట్లే. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన మజ్లిస్‌ను కేసీఆర్ ఒకప్పుడు ‘పాతబస్తీలోని పిడికెడంత పార్టీ’ అన్నాడు. ఇపుడు మాకు వాళ్లను మంచిన మిత్రులు లేరు అంటున్నాడు. ‘బంగారు ముద్ద’అని పాగిడించుకున్న కోదండరాం కేసీఆర్‌కు బద్ధశత్రువయ్యాడు. ఆ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ తన పాత తెలివితేటలు ప్రయోగించి ఎక్కడుంచాలో అక్కడుంచింది. ఆచార్యుడు రాజకీయాల్లోకి వస్తేగానీ ఈ తత్వం బోధపడడంలేదు. నల్లపుప్రహ్లాద్ వంటివారు గాని, ఇటీవల టీజెఎస్ వీడి వెళ్లిపోయిన ప్రొ.జ్యోత్స్న, రచనారెడ్డిల వ్యాఖ్యలు చూస్తే రేపు కోదండరాం పరిస్థితి కాంగ్రెస్‌లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇవన్నీ రాజకీయ చిత్ర విచిత్రాలే!

వెనుకటికి ఒకడు తల్లిని చంపి కోర్టుకు వెళ్లాడట. నీకు ఉరిశిక్ష వేస్తాం అని జడ్జి అంటే ‘తల్లిలేనివాణ్ణి కనికరించండి’ అన్నాట్ట. ఇటీవల చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూసి ప్రత్యర్థులు చెబుతున్న నానో కథ ఇది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకన్నా కేసీఆర్‌కు పెద్దశత్రువు చంద్రబాబే. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన నాయకుడు భారతదేశంలో చంద్రబాబు ఒక్కడే. తన బలం, బలహీనత గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే తన వ్యక్తిత్వాన్ని వెంటనే మార్చుకోగలడు. అదే ఆయన రాజకీయ మనుగడకు కారణం. అనేకమార్లు ‘యూ టర్న్’ తీసుకోవడం ఆయనకు కలిసొచ్చింది. లేని శత్రుత్వాన్ని, మిత్రత్వాన్ని సృష్టించి తనకు కావలసింది సాధించుకోవడం బాబు నైజం అని విశే్లషకులు చెప్తారు. అందుకే ఎన్టీఆర్ లాంటి మహా నటుడు... ‘హి ఈజ్ బెటర్ యాక్టర్ దేన్ మీ’ అన్నాడు. ఈ చరిత్ర తెలిసినవారు ఇపుడు చంద్రబాబు కాంగ్రెస్ కండువా వేసుకొని రాహుల్ ప్రక్కన గజమాల సరిచేసుకొని ఫొటో దిగుతుంటే పెద్దగా ఆశ్చర్యపడడం లేదు.

బురదనుండి మాత్రమే ‘కమలం’ వికసించే కాస్మిక్ నియమం ఉందని ఓ తత్త్వవేత్త చెప్పాడు. ఈ కుటుంబ పాలన, కులవాదం, మతతత్త్వం, అవకాశవాదం, స్వార్థ రాజకీయం, ఊసరవెల్లి బుద్ధులు, ఆశ్రీత పక్షపాతం, అవినీతి వంటివన్నీ మనముందు కదలాడుతున్న పార్టీలు సృష్టించినవే. ఇదంతా బురద రాజకీయమే. మనం ఈ బురదలో మునిగిపోకుండా, ఆ బురద నుండే కమలాలను వికసింపజేయాలి. కమలాల విత్తనాలు ఒక అద్భుతం. అవి బురదను సైతం అందమైన పుష్పంగా మారుస్తాయి. ఇదే ఈనాడు తెలంగాణ ఓటరు గ్రహించాల్సిన సూత్రం.

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 
మనిషి హృదయంతో చేసే ఆరాధన ప్రేమ. బాహ్యచేష్టలన్నీ కర్మారాధనగా చేస్తాం. హృదయంతో ప్రేమించడమే ధ్యానం, ప్రార్థన, యోగం. సగుణారాధనలో మన భక్తి అంతా కర్మకాండలా కనిపిస్తుంది. కానీ నిర్గుణారాధన తత్వం అందులో ఇమిడి ఉంది. షోడశోపచార పూజలో కూడా ధ్యానం ఉంటుంది. ఇదంతా భక్తితత్వం అర్థమయినప్పుడు మాత్రమే సాధ్యం. దురదృష్టం ఏమిటంటే.. వస్తు ప్రేమకు అలవాటు పడిన మనుషులు అంతఃకరణాన్ని గుర్తించలేకపోతున్నారు. అందువల్ల వస్తువులతో చేసే అన్ని బాహ్యాడంబరాలకూ ప్రాధాన్యం ఇస్తుంటారు.
అదే మేలిరకం అనుకొని అందులోనే మునిగి అంతర్తత్వాన్ని విస్మరిస్తారు. నిజానికి భగవంతుడు ఆనంద స్వరూపుడు. ప్రేమస్వరూపుడు. కానీ చలనచిత్రాలు చూసీచూసీ స్త్రీ, పురుషుల మధ్య ఉండేదే ప్రేమ అనే భావన చాలామందిలో స్థిరపడిపోతుంది. కానీ ప్రేమకు ఎన్నో రూపాలుంటాయి. పేర్లు ఉంటాయి. స్త్రీ, పురుషుల పరస్పర ప్రేమ మోహం. ధనం, ఆస్తులపై ఉండే ప్రేమ లోభం. పుత్రపౌత్రాదులపై ఉండే ప్రేమ వాత్సల్యం. దేహంపై ఉండే ప్రేమ అభిమానం. దీనప్రాణులపై ఉండే ప్రేమ దయ. వస్తువులపై ప్రేమ మమకారం. మన సమానులపై ఉండే ప్రేమ మైత్రి, స్నేహం. సత్పురుషులపై ఉండే ప్రేమ సత్సంగం. పెద్దలపై ఉండే ప్రేమ గౌరవం. భగవంతునిపైనా గురువుపైనా ఉండే ప్రేమ భక్తి. ఇలా మన మహర్షులు ప్రేమను రకరకాలుగా వర్గీకరించారు. అందుకే నారదుడు ‘స్వాతస్మిన్‌ పరమ ప్రేమ రూపా’ అన్నాడు.
ఆ పరమేశ్వరునిపై సంపూర్ణ ప్రేమ భక్తి అని స్పష్టం చేశాడు. ఆ ప్రేమనే సగుణతత్వంలో ఆరాధనగా, నిర్గుణభావంలో ధ్యానంగా మారుతుంది. ఈ రెండింటి మధ్య సూక్ష్మత తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవనంలోని ప్రథమపాఠం. దీన్ని గ్రహించలేని వ్యక్తులు శిక్షణార్థుల్లా మెల్లమెల్లగా సాకారతత్వం నుంచి నిరాకార తత్వం వైపు వెళ్లాలని పెద్దలు ప్రబోధించారు. హృదయం నిండా ప్రేమతత్వం ఉన్నప్పుడు సృష్టిలోని విషయమంతా ప్రేమమయంగా గోచరిస్తుంది. దృష్టిలో భేదం ఉంటుందిగానీ సృష్టిలో భేదం లేదని స్పష్టమవుతుంది. దానిని సాధించే సాధన హృదయాంతర్గమైన పరమాత్మ స్వరూపమే. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి మనమూ ఆనందమయులమై హృదయం నిండా ప్రేమను నింపుకొని ఆ పరమాత్మతో ఏకత్వం పొందాలి. నువ్వుల్లో నూనెలాగా, పాలల్లో నెయ్యిలాగా, పుష్పాల్లో సుగంధం లాగా, ఫలంలో రసంలాగా, కట్టెలో అగ్నిలాగా.. మనలో దాగి ఉన్న ఆత్మరూపంలోని ప్రేమే పరమాత్మతో ఏకత్వం సాధిస్తుంది. అలాంటి ప్రేమతత్వ సాధనే ఆధ్యాత్మికతకు, భక్తికి పరిపూర్ణత.

********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*