శివరామదీక్షితుల అచల సిద్ధాంతాన్ని తేటతెలుగులోకి దింపిన మహనీయుడు కృష్ణప్రభువు. యక్షగానాలు, వీధి బాగోతాల్లోని కందార్థాలకు జీవం పోసి, వేదాంత విషయాలు చెప్పేందుకు అడుగువేయడం గొప్ప సాహసమే. వేదాంత, తాత్విక విషయాలు సంస్కృతంలో మాత్రమే చెప్పాలన్న నియమాల్ని తోసిపుచ్చి, వృత్తపద్యాల్లో, సంస్కృత శబ్దాలతో చెప్పినపుడు దానినే గొప్ప విషయంగా పరిశోధకులు చెప్తారు. అలాంటిది వీధి బాగోతాలలోని ఒకానొక కందార్థాన్ని ఉపయోగించి గహనమైన వేదాంత విషయాలు చెప్పడం కృష్ణప్రభువుకే చెల్లింది.
కం॥ శివరామదీక్షితుల శి
ష్యవరుండప్పయ్య మంత్రి యతనిశిష్యడీ
భువిపరశురామ వంశో
ద్భవ సీతారాములతని భక్తూడసుమ్మీ!
తద్బోధప్రయుక్తూడసుమ్మీ
స్థవనీయులగు మీరు త్సాహాముతో
యీగాథ వినుడీ ! నే కందార్థములచే
వినిపింతు భక్తూడసుమ్మీ తద్బోధప్రయుక్తూడసుమ్మీ!॥
అంటూ.. తమ గురుపరంపరను స్మరిస్తూ, తాను తెలుగు సాహిత్యంలో కందార్థాలు అనే పేరుతో ఓ ప్రక్రియకు జీవంపోసి ఆధ్యాత్మిక భావజాలాన్ని కొత్తపం థాలో నడిపిన మహనీయుడు భాగవతుల కృష్ణప్రభువు. ఇతడు 1792 అక్టోబర్ 7న జానకమ్మ, నారాయణదాసు దంపతులకు నేటి యాదాద్రి క్షేత్రం పక్కనున్న కొలనుపాకలో జన్మించాడు. వీరిది హరికథల కుటుంబం కావడం వల్ల నారాయణదాసు సహజంగానే పండితుడయ్యాడు. ఈ దాసుగారి ప్రథమ సంతానం కృష్ణదాసు. కృష్ణదాసు మొదట భద్రాచల రామభక్తుడు. ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యులు వరుసగా కాలధర్మం చెందగా, వైరాగ్యం పొంది ఏక్‌తార, చిటికెలు చేత బట్టి పాదయాత్రగా భద్రాచలం వెళ్లాడు. అక్కడ బుచ్చి వెంకమ్మ అనే భక్తురాలు ఆయనకు తారసపడి ‘నాయనా.. కాలవశంగా జరిగినదానికి చింతించడం నిజమై న వేదాంతి లక్షణం కాదు. పల్నాడులోని ఎర్రగొండపాలెంలో శివరామదీక్షితుల శిష్యడైన కంబలూరి అప్పబ్రహ్మం గారి శిష్యడు పరశురాముల సీతారామస్వామి ఉన్నారు. వారిని దర్శిస్తే నీకు కావలసిన ఆధ్యాత్మిక బోధ సంపూర్ణమవుతుంద’ని చెప్పింది.
శివరామదీక్షితులు (క్రీ.శ. 1690-1791) తెలుగునాట ‘అచల సిద్ధాంతా’నికి జీవం పోసిన గొప్ప గురువరేణ్యుడు. ఆయన నల్లగొండ జిల్లాలోని సంస్థాన నారాయణపురంలో జన్మించాడు. ‘శ్రీమద్బృహద్వాశిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షితీయం’ అనే గ్రంథం రచించి, ఆధ్యాత్మిక లోకంలో గొప్ప సంచలనం కలిగించా డు. సంస్కరణ దృష్టితో నిజమైన ఆధ్యాత్మికవాదంగా ‘అచల సిద్ధాంతం’ పేరుతో లోకంలోకి తెచ్చినవాడు. ఆయన చేసిన ఈ పెనుమార్పు ఎర్రగొండపాలెంవరకు పాకింది. అక్కడి కంబలూరి అప్పయ్య మంత్రి, పరశురాముల సీతారాములను ప్రభావితం చేసింది. స్త్రీ, పురుష కులభేదం లేని ఆధ్యాత్మికమార్గం అచలం. అలాం టి అచలసిద్ధాంతం పరశురాముల సీతారాముల నుంచి స్వీకరించిన కృష్ణప్రభువు హైదరాబాద్‌కు వచ్చి, పెద్దమహరాజ్‌గంజ్ కేంద్రంగా తన ఆధ్యాత్మిక ప్రచారం మొదలుపెట్టాడు. కృష్ణప్రభువు ఆనాడు హైదరాబాద్‌లోని ఎందరో అధికారులను, గొప్పవ్యక్తులను తనవైపు ఆకర్షించాడు. కృష్ణదాసు ఆధ్యాత్మిక కీర్తనలను, శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధనిర్గుణతత్వకందార్థాలు, క్షరాక్షరోపాది ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు, సదృష్టాంత స్వప్రకాశిక, జాలమాంబకు ఉపదేశించిన ద్వాదశబోధలు అనే నాలుగుకృతులు ఇంకా ఎన్నో రచించాడు. అందులో ‘శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు’ ఓ కొత్త సాహిత్యప్రక్రియకు పునరుజ్జీవం కలిగించాడు. కృష్ణదాసు తర్వాత ఎందరో వీటిని అనుసరించారు. పెద్ద కందపద్యంలా ఉండే ఈ కందార్థం భజనలు, యక్షగానాలు, బయలాటలు, అన్ని కళారంగాల్లోకి ప్రవేశించింది. అయితే కృష్ణప్రభువు వల్ల ఇది ఆధ్యాత్మిక విషయ పరిపుష్టికి బాగా ఉపయోగపడింది. కృష్ణదాసు తర్వాత కృష్ణప్రభువుగా మారిపోయాడు.
292 కందార్థాలు రాసి, వారే స్వయంగా 110 కందార్థాలకు వ్యాఖ్యానం కూడా చేయడం విశేషం. 1865 నాటికే ‘శుద్ధ నిర్గుణ కందార్థాలు’ రచన పూర్తి అయినట్లు తెలుస్తున్నది.
కం॥ పుట్టుట గిట్టుట లేకను
పుట్టే గిట్టేటి యెరుక పోడి మెరుగకన్
చట్టువలెకదల కుండును
బట్టబయల్ యిట్టిదెరిగి భావింపదగునూ
యెరుక లేక సేవింప దగునూ
వట్టియాశలచాత పట్టూబడకను
యీ గుట్టూ దేశికునోటగట్టీగ దెలుసూక
భావింప దగునూ యెరుకలేక సేవింపదగునూ॥
శిష్యా! జనన మరణములు లేనిది బయలు, జనన మరణములు గలది ఎఱుక. బయలు ఎరుకను ఎరుగక, (చట్టు) పర్వతంలాగా కదలక మెదలక ఉన్నది. ఈ కదిలే, మెదిలే ఎఱుకవల్ల పరిపూర్ణం ఎరిగి సేవించాలి. వృథా ఆశలను పొందకుం డా ఈ రహస్యం దేశికుని ద్వారా పొందాలి. ఇది అచలం మూల సిద్ధాంతంగా కృష్ణప్రభువు తేటతెలుగులో చెప్పిన వేదాంతం. సంస్కృత శ్లోకాలకు మాత్రమే పరిమితమైన మన ధర్మాన్ని సామాన్యులైన పామరులకు దరిచేర్చే భాషకు కృష్ణప్రభువు బాటలు వేశాడు. అచల మార్గంలో ఈ కందార్థ సాహిత్యానికి గొప్ప స్థానం ఉంది.
‘కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి’ అని శ్రీనాథుడే చెప్పాడు. అంతకుముందే అధర్వణవేదం (8-9-25) యక్ష శబ్దం పరమాత్మ వాచకంగా చెప్పింది. అలాగే యక్షులను బౌద్ధ సారస్వతం నీతిప్రవర్తకులుగా పేర్కొంది. వేదప్రమాణాలను తరచి చూస్తే ‘యక్షగానం’ ‘పరబ్రహ్మ కీర్తనం’గా భావించాల్సి వస్తుంది. యక్షగానం అంటే రాగ లయలతో కూడిన తాళాత్మకమైన దైవకీర్తనగా పరిశోధకుల అభిప్రాయం. యక్షులు అంటేనే కీర్తించేవారని అర్థం. ఇతిహాసాలు వారిని శైల జలవనదేవతలుగా పేర్కొన్నాయి. ఈ యక్షగానాలు తెలంగాణ ప్రాం తంలో కొత్తపుంతలు తొక్కాయి. మత, రాజకీయ పరిస్థితులను లక్ష్యపెట్టకుండా గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యాయి. క్రీ.శ.1326 తర్వాత వచ్చిన క్రీడాభిరామం వీధినాటకంగా నిలిచిపోయింది. దాన్ని వీధి భాగవతంగా ఇక్కడి కళాకారులు ఆడిపాడుకున్నారు. ఇలా ఏ రూపక ప్రదర్శన అయినా ‘బాగోతం ఆడటం’ అన్న పదబంధంగా మారిపోయింది. పాల్కురికి సోమనాథుడు, చరిగొండ ధర్మన్న వంటి తెలంగాణ కవులు తమ కావ్యాల్లో యక్షగానం గురించి పేర్కొన్నారు. మొత్తానికి తెలంగాణలో యక్షగానం ‘వీధి బాగోతం’గా రూపు సంతరించుకొన్నది. ఎందరో పరిశోధకుల ఆధారాలను బట్టి 1568 ప్రాంతానికి చెందిన కందుకూరి రుద్రకవి రచించిన ‘సుగ్రీవవిజయం’ మొట్టమొదటి యక్షగానంగా నిర్ధారింపబడింది. తెలంగాణలోని భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి, గ్రామీణ ప్రాంతాల ప్రజల కాలక్షేపానికి, పౌరాణిక విషయ పరిజ్ఞానానికి ‘వీధి బాగోతం’ ఒక సాధనమైంది.
యక్షగానంలోని అనేక విషయాలు గానయోగ్యంగా మార్చుకొని ‘వీధిబాగోతం’ లోకి వచ్చాయి. అలాగే భద్రాచల రామదాసు (1620-1684) వంటి వాగ్గేయకారుడు యక్షగానాల బాణీల్లోనే అనేక కీర్తనలు రచించాడు. అలా ఎందరో ఈ యక్షగానంలోని ప్రజారంజక విషయాలను కొత్తమార్గాలలో నడిపించారు. ఈ క్రమంలో యక్షగానాల్లోని కందార్థ దర్వులను భాగవతుల కృష్ణప్రభువు స్వీకరించి, అచల సిద్ధాంతం మొత్తం 292 కందార్థాలుగా రచించి కొత్త బాట వేశాడు.
శివరామదీక్షితుల అచల సిద్ధాంతాన్ని తేటతెలుగులోకి దింపిన మహనీయుడు కృష్ణప్రభువు. యక్షగానాలు, వీధి బాగోతాల్లోని కందార్థాలకు జీవం పోసి, వేదాంత విషయాలు చెప్పేందుకు అడుగువేయడం గొప్ప సాహసమే. వేదాంత, తాత్విక విషయాలు సంస్కృతంలో మాత్రమే చెప్పాలన్న నియమాల్ని తోసిపుచ్చి, వృత్తపద్యాల్లో, సంస్కృత శబ్దాలతో చెప్పినపుడు దానినే గొప్ప విషయంగా పరిశోధకులు చెప్తారు. అలాంటిది వీధి బాగోతాలలోని ఒకానొక కందార్థాన్ని ఉపయోగించి గహనమైన వేదాంత విషయాలు చెప్పడం కృష్ణప్రభువుకే చెల్లింది. బహుశా ప్రజలభాష ను రక్షించే క్రమంలో, గ్రామీణులకు అర్థమయ్యే మాధ్యమంగా ఆయన దాన్ని ఎంచుకొని ఉండవచ్చు.
కృష్ణప్రభువు ఇంటిపేరు భాగవతులవారు కావడంవల్ల కచ్చితంగా వారి పూర్వీకులు భాగవతాలు నేర్పించే గురువులుగానో, భాగవత ప్రవచనం చేసే పండితులుగానో ఉండిఉంటారు. వారి చరిత్రనుబట్టి వారు హరికథలు చెప్పేవారని తెలుస్తుం ది. హరికథ కూడా సంస్కృత శ్లోకాలు, కీర్తనలు, గీతాలతో నడుస్తుంది. కానీ కృష్ణప్రభువులు యక్షగానాలు, వీధిబాగోతాల కందార్థదర్వులతో వేదాంతం చెప్పడం జనం భాషలో విషయాన్ని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకే. అచలమార్గంలో వచ్చిన ఈ కందార్థాల భావాన్ని అర్థం చేసుకుని ఎందరో పదకవులు పుట్టుకొచ్చారు. వారు అచలాన్ని తమ తత్వాలనిండా నింపి సంకీర్తన సాహిత్యాన్ని కూడా పరిపుష్టి చేశా రు. ఇప్పటికీ భజన పాటల మధ్యలో విరామంగా భాగవతుల కృష్ణదాసు విరచిత కందార్థాలు చదవడం ఒక సంప్రదాయంగా మారింది.
‘కందం రాసిన వాడే కవి; పందిని కొట్టినవాడే బంటు’ అన్నది తెలుగుసామెత. అన్ని పద్యాల్లో చిన్నగా కన్పించేది కందపద్యం. కానీ నియమాలు ఎక్కువ. అలాగే అడవిపంది క్రూరజంతువు కాకున్నా వేటగాళ్లకు దానిని చంపడం ఓ సాహసం. కందం రాయడం కూడా సాహసమే మరి! అలాంటి కందం గానయోగ్యంగా కూడా ఉంటుంది.
బద్దెన రచించిన ‘సుమతీ శతకం’ ఎంత ప్రాచుర్యం పొందిందో మనకు తెలుసు. సంస్కృతంలోని ‘ఆర్యేతివృత్తం’ కందంగా తెలుగులోకి వచ్చిందని చెప్తారు. అయి నా మనం కందాన్ని వృత్తఛందస్సులో చేర్చకుండా, దేశీ ఛందస్సులో భాగంగానే పరిగణిస్తున్నాం. ఈ కందపద్యం యక్షగానాల్లో సమున్నత గౌరవం పొందింది. గానయోగ్యమైన కందాన్ని ఈ యక్షగానకర్తలు ప్రార్థన నుంచి మంగళాంతం వరకు ఎక్కడంటే అక్కడ ప్రయోగించారు.
రెండవ, నాలుగవ పాదంలోని గణంలోని చివరున్న గురువు రాగాలాపనకు పనికివస్తుంది. ఈ కందానికి రాగ లయ తాళాలున్న దర్వు కలుస్తుంది. అందువల్ల దానికి మరింత ఊపువచ్చి, పాడుకునేందుకు మరిం త బాగా ఉపయోగపడుతుంది. కందంలోని ద్వితీయార్థమైన నాల్గవ పాదంలోని యతి స్థానం దగ్గర నుంచి మూడు లేదా నాలుగు పాదాల రాగమాలిక కందాన్ని అనుసరిస్తుంది. ఈ కందం, దర్వు రెండూ కలిసి కందార్థంగా మారిపోయింది. యతి స్థానం దగ్గరనుంచి మొదలైన దర్వు, కందంలోని కొంచెం భాగాన్ని ఒక పాదంగా, తర్వాత రెండు పాదాలను పరిశీలిస్తే.. 18 నుంచి 24 మాత్రల ప్రయో గం జరిగిందనిపిస్తుంది. దర్వులను జనరంజకత్వం కోసం కృష్ణ ప్రభువు కూడా కుదింపు, పొడిగింపు చేశారు. అయితే ఇదంతా కృష్ణదాసు కవిత్వంలో అంత నియతంగా లేదు. ఆయన విషయానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. దర్వు ప్రారంభమైన మొదటి పాదంలో 22 మాత్రలు, రెండో పాదంలో 20 మాత్రలు, మూడో భాగంలో 18 మాత్రలు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. కొన్ని కందార్థాల్లో దర్వులు ఎక్కువ మాత్రలతో, మరికొన్ని తక్కువ మాత్రలలో ఉన్నాయి. బహుశా! వారు విషయాన్ని బట్టి నిడివిని పెంచుకున్నట్లు, తగ్గించినట్లు అనిపిస్తున్నది.
కృష్ణదాసుగారు స్వేచ్ఛగా కొన్నిపదాలను ప్రయోగించారు. అలాగే కొన్నిచోట్ల గణాలు కూడా కుదరడంలేదు. యతిప్రాసలు అక్కడక్కడ గతితప్పాయి. కృష్ణదాసు తర్వాత అనేకమంది దీన్ని ఎత్తిరాసుకున్న వారు, పరిశోధన జ్ఞానంలేనివారు ‘ఉచ్చారణ దోషాలను’ అలాగే కొనసాగించారు. అంతేగాక ఈ స్వల్ప దోషాలున్న కందార్థాలే లక్షలాది మందికి కంఠపాఠంగా ఉన్నాయి. అందువల్ల వీటిని సవరించేందుకు ఎవరూ సాహసం చేయలేదు. కందపద్యం పైన ఏర్పడిన దర్వును తాను చెప్పే వేదాంతానికి మాధ్యమంగా కృష్ణప్రభువు భావించాడు.
సంగీతశాస్త్రంలో దర్వుకు ఇంకొక రకమైన ఉపయోగం ఉంది. శృంగార రసం సంగీతంలో ప్రధానంగా చేసుకొని రాసేది దర్వు. దర్వులో పల్లవి, అనుపల్లవి, చరణాలు అనేవి త్రిధావిభక్తమై ఉంటాయి. దర్వు తక్కువ చరణాలతో ఒకే ధాతుశైలి లో ఉంటుంది. తిల్లాన దర్వు, ప్రవేశ దర్వు, సంవాద దర్వు, స్వగత దర్వు, జక్కిణ దర్వు అని ఐదు విధాలుగా ఉంటుందని సంగీతవేత్తలు చెబుతారు. ఈ దర్వులు రాసిన ప్రముఖ పదకర్తల్లో ముత్తుస్వామి దీక్షితులు, త్యాగయ్య, సుబ్బరాయ దీక్షితులు వంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ ఐదింటిలో సంవాద దర్వులను యక్షగానాలు, వీధిబాగోతకర్తలు స్వీకరించగా, భాగవతుల కృష్ణ ప్రభువు స్వగత దర్వుగా స్వీకరించాడని చెప్పవచ్చు. ఈ కందార్థాలే కాకుండా సీసార్థాలు, గీతార్థా లు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉత్పల మాలార్థం కూడా ఉండటం విశేషం.
కందపద్యం పరిమాణంలో చిన్నది అవడంవల్ల విషయపుష్టికి అవకాశం తక్కు వ. కాబట్టి కందార్థాల్లో ఎక్కువ విషయాన్ని చెప్పాలనుకోవడం సహజమే. అధిక మాత్రలవల్ల పాడుకొనేందుకు ఊపువస్తుంది. కందార్థాల్లో చాలాచోట్ల హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులుగా, దీర్ఘాచ్చులు హ్రస్వాలుగా మారిన సందర్భం కనిపిస్తుం ది.ఈ సాగదీయడం, విరవడం అనేది లయ కోసం మాత్రమే. అలాగే అశ్లీలాలు ధ్వనించకుండా జాగ్రత్త వహించేందుకూ ఈ విరుపులు పనికి వచ్చాయి. శబ్ద పరిజ్ఞానం లేనివాళ్లలో ఈ విరుపులు విపరీతార్థాలకు కూడా దారితీస్తాయి.
తెలుగు ప్రాంతంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత స్థానం కృష్ణప్రభువు రచించిన కందార్థాలదే. అచల మతబోధకుల్లో ఈ కందార్థాల పాదు ఎంతగట్టిగా నిలబడిందంటే, అచలం గురించి ఏది చెప్పాలన్నా, ఈ కందార్థంలోనే చెప్పాలన్నంతగా రూఢైపోయింది. అలాంటి కందార్థసాహిత్యానికి బీజావాపనం చేసిన ఆధ్యాత్మికవేత్త కృష్ణదాసు. అచ్చతెలుగు భాషకు, తెలంగాణ పలుకుబడులకు, నుడికారాలకు పట్టంగట్టాడు.
తల్లావఝ్జుల జాలమాంబ వంటి స్త్రీమూర్తిని శిష్యురాలిగా చేసుకొన్నాడు. అంతేగాక ఆమెను తత్వాలు, మంగళారతులు రచించే విధంగా తీర్చిదిద్దాడు. ‘గురునకు మంగళమనరమ్మా’ అన్న ప్రసిద్ధ మంగళారతిపాట జాలమాంబదే. అలాగే నాడు నిజాం ప్రభుత్వంలో ఉన్నతపదవుల్లో ఉన్న పీల్ఖానా లక్ష్మణదేశికులు, పీల్ఖాన శంకరప్రభువులకు ఉపదేశమిచ్చి వారిని గొప్ప గురువులుగా తీర్చిదిద్దాడు. అచల సిద్ధాంతాన్ని కృష్ణప్రభువు మార్గంలో సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత, భారలింగప్రభువు, వెలివర్తి రామదాసు, శేషమాంబ వంటి గురువులెందరో తమ యోగదానం చేశారు.
నిరక్షరాస్యులైన వారిలో వేదాంతజ్ఞానం కలిగించిన అచలగురువులకు, తత్వకవులకు భాగవతుల కృష్ణప్రభువు దిక్సూచిగా నిలిచాడు. శివరామదీక్షితుల సిద్ధాంతాలను అందించడంలో కృష్ణప్రభువు అతని శిష్యపరంపర సఫలీకృతం అయ్యిం ది. తెలుగు ప్రాంతంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత స్థానం కృష్ణప్రభువు రచించిన కందార్థాలదే. అచల మతబోధకుల్లో ఈ కందార్థాల పాదు ఎంతగట్టిగా నిలబడిందంటే, అచలం గురించి ఏది చెప్పాలన్నా, ఈ కందార్థంలోనే చెప్పాలన్నంతగా రూఢైపోయింది. అలాంటి కందార్థసాహిత్యానికి బీజావాపనం చేసిన ఆధ్యాత్మికవేత్త కృష్ణదాసు. అచ్చతెలుగు భాషకు, తెలంగాణ పలుకుబడులకు, నుడికారాలకు పట్టంగట్టాడు. కృష్ణప్రభువు 1876లో దేహత్యాగం చేశాడు. వారి భౌతికశరీరాన్ని బేగంపేటలో సమాధి చేశారు. విమానాశ్రయ నిర్మాణంలో కృష్ణప్రభువు సమాధి చెదిరిపోయింది. శివరామదీక్షితుల అచలసిద్ధాంత రహస్యాలను తెలంగా ణ ప్రాంతంలో మాట్లాడే భాషా సుగంధాన్ని అద్ది, తెలుగు సాహితీ దర్బారులో ‘కందార్థాలకు’ పట్టాభిషేకం చేసిన వాడు కృష్ణప్రభువు.
************************** ********
డాక్టర్. పి. భాస్కర యోగి
డాక్టర్. పి. భాస్కర యోగి
నమస్తే తెలంగాణ : సోమవారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి