కలకత్తా కాళీ సాక్షిగా కుటుంబ, కులపార్టీలన్నీ మరోసారి తమబలం చూపిద్దామని బయల్దేరాయి. పోయినవాళ్లంతా ప్రధాని అభ్యర్థులే. ఈ ‘కప్పల తక్కెడ’ను ‘తప్పుడు తడకల కూటమి’గా భావించి జనం నవ్వుకుంటున్నారు. ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీశాడని’ వ్యంగంగా చెప్పినట్లు తన సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని చంద్రబాబు అక్కడకెళ్లి చెప్పిన ఓ ‘ఆణిముత్యం’పై సోషల్‌మీడియా పండుగ చేసుకుంది. ‘ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు బిజెపి వారు కొంటున్నారు’ అన్నాడు. వేదికపై ఉన్న ఫరూఖ్‌ అబ్దుల్లా, శరద్‌యాదవ్‌ లాంటి వాళ్లకు ఇదొక గొప్ప నైతిక సూత్రంగా అనిపించి ఉండవచ్చు. ప్రపంచంలోని అన్నింటినీ మొదట తానే సృష్టించానని చెప్పుకొనే చంద్రబాబు ‘ఎమ్మెల్యేల వైస్రాయి బీభత్సకాండ’ గురించి మాత్రం నోరు మెదపరు!? బాబు మొదట అధికారంలోకి వచ్చిందే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అన్న విషయ విస్మరిస్తే ఎలా? దానిని వారసత్వ సంపదలాగా ఈ రోజుకూ కొనసాగిస్తున్నారు. 20కిపైగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను తన చంకనబెట్టుకొని చంద్రబాబు ఇంత బాగా అబద్దాలు చెబితే ఉత్తరభారతం వాళ్లకు తెలియకపోవచ్చుగానీ, ఇన్ని అసత్య డైలాగులను తెలుగు ప్రజలు విని ‘నీవు మనిషివా? బాలకృష్ణవా?’ అని ప్రశ్నిస్తే ఆయనేం చేస్తాడు?
ఇక బోఫోర్స్‌ కుంభకోణం నోట్లో నాని నాని శరద్‌యాదవ్‌ ‘బోఫోర్స్‌’ అని యధాలాపంగా చెప్పేయడం ఈ సభలో హైలైట్‌ జోక్‌. మాయవతి, సోనియా, రాహుల్‌లు రాకుండా తమ ప్రతినిధులను పంపారు. అంటే ఇదంతా మమతా బెనర్జీ తాను ప్రధాని గద్దిపైకి ఎక్కాలని చేస్తుందని భావించే మాయా, రాహుల్‌లు రాలేదని మీడియా చెవులు కొరుక్కొంది. ఇక్కడ తండ్రిలా నల్లద్దాలు పెట్టుకోకుండా వచ్చిన స్టాలిన్‌ బాబు చెన్నైలో ‘రాహుల్‌ భావిప్రధాని’ అన్న మాట కలకత్తాలో అనలేదు. ‘బహుశా! మమత తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ పేరు చెప్తే బాగుండదని అనుకున్నాడా? లేక తన మనసులో ఇంకేమైనా ఉందా! ఇక ఎక్కడ అధికార బెల్లం ఉంటే అక్కడ వాలిపోయే ఫరూఖ్‌ అబ్దుల్లాను ఎవరు పట్టించుకొన్నారు? ఇందులో కన్పించిన మరో గొప్పనేతలు హార్దిక్‌పటేల్‌, యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, శతుఘ్న్‌సిన్హా, జిగ్నేశ్‌ మేవానీ వంటి ధీరులు. వారందరి మధ్యలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ బాబుగారు, శరద్‌పవార్‌లు కూర్చొంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే. దగ్గు తుమ్ముల కేజ్రీవాల్‌ ‘పాకిస్తాన్‌ నాశనం కాకుండా ఉండాలంటే మోదీ, షాలను మరోసారి అధికారంలోకి రానివ్వద్దు’ అన్నాడు. రాహుల్‌ సందేశం మోసుకొని వచ్చిన అభిషేక్‌ మనుసింఘ్వీ మరోసారి కాంగ్రెస్‌ భజన చేసి రాహుల్‌గాంధీ అష్టోత్తరం చదివి వెళ్లిపోయాడు. రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి మరీ పాలన కొనసాగిస్తున్న కుమారుస్వామి, దేవేగౌడలు తమను కాంగ్రెస్‌ ఎలా వంచిస్తున్నదో చెప్పేందుకు వచ్చినట్లు అనిపించింది. వాళ్లంతా కలవగానే మహాఘట బంధన్‌ సర్కార్‌ కర్ణాట ప్రభుత్వానికి అన్నలాగే ఉంటుందేమో అనిపించిందట కొంతమందికి. ఇదంతా చూసి బిత్తరపోయిన జనాలను అదేరోజు ప్రధాని ఇచ్చిన పంచ్‌డైలాగ్‌ దిమ్మతిరిగేట్టు చేసింది. ‘నన్ను ఒక్కడిని కొట్టేందుకు కుటుంబ పార్టీల దోపిడీదారులంతా ఒక్కటయ్యారు’ అన్నమాట జనాన్ని కొత్త ఆలోచనవైపు తీసుకెళ్లింది. ‘ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనమ్‌’ అన్నట్లు ‘నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు’ అన్పించింది.
ఈ దేశ మెజార్టీ పజ్రలారా! ఒక్కసారి.. ప్లీజ్‌..!!
‘వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయాయి. క్రైస్తవులపై, ముస్లింలపై, దళితులపై దాడులు పెరిగాయి’ అంటూ చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత? ఈ దేశానికి ఈ ప్రభుత్వ హయాంలో దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి కాలేదా? దక్షిణ భారతం నుండి ఒకరిని ఉపరాష్ట్రపతి పదవి వరించింది ఎవరి హయాంలో ? డా|| అబ్దుల్‌కలాం లాంటి ముస్లిం మేధావిని రాష్ట్రపతి పీఠంలో కూర్చోబెట్టిన ఘనత ఎవరిది ? ఇవన్నీ విస్మరించి గాలివాటం ప్రచారంలో మెజార్టీ ప్రజలను కులాలుగా విభజించి పాలిస్తున్నది ఎవరు? కులాలవారీగా, కుటుంబాల వారీగా రాష్ట్రాలను పంచుకొని తమ అధికారం కాపాడు కోవడానికి ఈ దేశాన్ని వంచిస్తున్నది ఎవరు? మైనార్టీలను, తమ కులాలను ఒక్కటి చేసి అధికారం పొందాలనుకుంటున్న గుంపు ఎవరిది? ఈ దేశాన్ని అందరూ పాలించవచ్చుగానీ మెజార్టీ భావజాలం ఉండే వ్యక్తులు పాలించ కూడదా? ‘ఈ దేశపు మొదటి ముద్ద ముస్లింలదే’ అని ఆనాడు సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పదవిలో ఉండి ప్రకటిస్తే అది గొప్ప సెక్యులరిజమా!? మెజార్టీ ప్రజలారా! గమనించండి ప్లీజ్‌..!
దాదాపు ఈ దేశంలో వెయ్యేళ్ల పాటు హిందువు లను మైనార్టీలే పాలించారు. ఎన్నో నిర్బంధాలను, అణచివేతలను తట్టుకొని ఇక్కడి మెజార్టీ ప్రజలు తమ సంప్రదాయాలను కాపాడుకున్నారు. తమ చరిత్రను మసిబారనీయకుండా ఉంచే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఇక్కడ మెజారిటీలైన హిందువుల పరిస్థితి పాకిస్తాన్‌లోని హిందువుల కన్నా గొప్పగా ఏం లేదు. రాజకీయ వ్యవస్థలోని లోపాల కారణంగా ఓటుబ్యాంకు రాజకీయాలు మొద లయ్యాయి. జిన్నా కారణంగా బలైన హిందువులు విభజన సమయంలో నరకం చూశారు. 10 లక్షల మంది మరణించారు, 20 లక్షల మంది నిరాశ్రయు లయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో, కాశ్మీర్‌లో, కేరళలో హిందువులు మైనారిటీలైనప్పటికీ మెజారిటీ కిందే లెక్క. ఈ మెజార్టీల గురించి మాట్లాడిన వారంతా ఈ దేశంలో మతతత్వ వాదులు! ఇక్కడున్న మైనార్టీలను గుర్తిస్తూ ఎంత బాగా మాట్లాడితే అంత గొప్పవాళ్లు..!! మెజార్టీ ప్రజలారా! గమనించండి ప్లీజ్‌..!
ఏ దేశమైనా తన అస్తిత్వాన్ని అక్కడి మెజార్టీ ఆధారంగా చెప్పుకొంటుంది. కానీ ఇక్కడ మెజార్టీ ప్రజలను ‘కుల సంఘాలు’గా చేసి ఆడుతున్న వింత నాటకం ఒక రకంగా భవిష్యత్తులో మెజార్టీ ప్రజల దుస్థితిని తెలియజేస్తున్నది. మెజార్టీ ప్రజలను అభిమానించే వ్యక్తులు ఈ దేశాన్ని పాలించవద్దు అనే రాజకీయ సంకేతాలు ఇక్కడి హిందూమనోభావా లను దెబ్బతీయడమే గాక ఆందోళన కలిగిస్తున్నాయి. నకిలీ లౌకికవాద ముసుగేసుకున్న పార్టీలు జాతీయ వాదులపై ఎంత కక్షగట్టాయో మన సాంస్కృతిక సంస్థలను చూస్తే అర్థం అవుతుంది. ఈ దేశం వదలి ఎక్కడికీ వెళ్లలేని మెజార్టీలు ఈ దేశాన్ని ప్రేమించడం నేరమా? ‘హిందువులను గురించి మాట్లాడ్డం అపచారం’ అనే రీతిలో జరుగుతున్న దుష్ప్రచారం గమనించండి. మెజార్టీ ప్రజలారా! ప్లీజ్‌..!
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
28 జనవరి : 03 ఫిబ్రవరి - 2019
సంపుటి : 71, సంచిక : 13


ఇవాళ భారతదేశంలో విపక్షం గోబెల్స్‌ ప్రచారాన్ని, విధానాన్ని మనసా వాచా నమ్ముతున్నట్టు కనిపిస్తున్నది.గోబెల్స్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రచార శాఖ మంత్రి అన్న విషయం తెలిసిందే. అబద్ధాన్ని నిజం చేసే విన్యాసాలలో అతడు సిద్ధహస్తుడని చరిత్ర ప్రసిద్ధికెక్కాడు. హిట్లర్‌ తన ఆత్మకథ ‘మెయిన్‌కాంఫ్‌’లో ఇంకో ముఖ్య విషయం రాశారు. తనకు ఇబ్బందులు ఏర్పడినప్పుడల్లా ‘దేశం ప్రమాదంలో పడింది’ అని నమ్మించే ప్రయత్నం చేసేవాడట. ఇప్పుడు రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్షాలు ఈ హిట్లర్‌ పాలసీని నూటికి నూరుశాతం అమలు చేస్తున్నాయి.
నిప్పుకు చెదలు పట్టించాలని..
నీళ్లను విషంతో కలుషితం చేయాలని..
ఆకాశంలోని సూర్యుడిపై దుమ్మెత్తిపోయాలని..
మర్రిచెట్టు మొదట్లో మాటుబెట్టి అంటించాలని..!
ఇటువంటి సాధ్యంకాని అనేక కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2004-14 మధ్యకాలంలో సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం చేయని కుంభకోణం లేదు. జరుపని అవినీతి లేదు. ఆనాడు కాబూలా బ్రూనీ వంటి ఇటాలియన్ల సామ్రాజ్యం భారత్‌లో నడిచింది. ఓ లెక్క ప్రకారం 30 శాతానికి పైగా నకిలీనోట్లను పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఈ దేశ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి తమ చీకటిపనులు చక్కబెట్టుకున్నది. గోకుల్‌ చాట్‌, ముంబై దాడులు యథేచ్ఛÛగా జరిపిన తీవ్రవాదులు ఈ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేశారు. డా||సుబ్రహ్మణ్య స్వామి పరిశోధనల ప్రకారం యూపిఏ ప్రభుత్వంలో 60వేల కోట్లు రాజా, 15 వేల కోట్లు కరుణానిధి కుటుంబం, 5 వేల కోట్లు చిదంబరం కుటుంబం, 36వేల కోట్లు సోనియా గాంధీ కుటుంబం వెనకేసుకున్నాయి. 2012లో యూపీఏ ప్రభుత్వం ఉండగానే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక స్కాం వెలుగుచూసింది. రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడిపే సోనియాగాంధీ, ఆమె కొడుకు రాహుల్‌, వారి ముఖ్య అనుచరులపై కేసు నమోదు అయ్యింది. భూమ్యాకాశాలను ఏకం చేసిన మహా స్కాంలు ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి.
మరోవైపు రాజరిక వ్యవస్థను తలపిస్తూ ఈ దేశానికి తామే దిక్కు అన్నట్లు నెహ్రూ-గాంధీ కుటుంబం వ్యవహరిస్తూ వచ్చింది. వారి మార్గంలోనే దేశం మొత్తం దాదాపు అన్ని రాష్ట్రాలను ఏదో ఒక కుటుంబం పాలించే సంస్కృతిని నెహ్రూ కుటుంబం ప్రవేశపెట్టింది. దాంతో ఇవాళ కుటుంబ పాలన కూకటి వ్రేళ్ల క్రింద ప్రజాస్వామ్యం చిక్కుకుని రోధిస్తున్నది. అలాగే అవినీతిని చట్టబద్ధం చేసి నాయ కులంతా జైళ్లకు వెళ్లడం షరామామూలు అయిపోయి సామాన్య ప్రజల్లోకి ఈ ‘జాడ్యం’ అంటురోగంలా వ్యాప్తి చెందింది. రాజకీయాలు సేవకన్నా ధన సంపాదనకే ముఖ్యంగా వాడుకునే స్థితిని కాంగ్రెస్‌, దాని సంస్కృతి నుండి పుట్టిన ప్రాంతీయ పార్టీలు స్థిరీకృతం చేసాయి. ఆశ్రిత పక్షపాతంతో, బంధు ప్రీతితో దేశాన్ని నింపేసి ప్రజాసామ్య విలువలకు పాడెగట్టారు.
ఈ అంటురోగాలతోపాటు ‘బుజ్జగింపు’ అనే మహమ్మారిని ఈ దేశంపై వదలి గంపగుత్తగా ఓట్లు పొంది అధికార మత్తులో తులతూగడం పార్టీలకు ఒక అలవాటుగా మారింది. దీని దుష్పరిణామం ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిందంటే దిగ్విజయ్‌సింగ్‌ లాంటి కాంగ్రెస్‌ నాయకుడు ‘ఒసామా జీ’ అని తీవ్రవాదులను సంబోధించే వరకు వెళ్లింది. అలాగే బాట్లా హౌజ్‌ ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాదులు చనిపోతే ‘సోనియాగాంధి రాత్రంతా నిద్రపోకుండా వెక్కి వెక్కి ఏడ్చింది’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడించే స్థితికి వెళ్లింది.
ఇలాంటి దుస్థితినుండి ఈ దేశాన్ని కాపాడేందుకు దేశ ప్రజల్లో 2014కు ముందు ఓ ‘నిశ్శబ్ద విప్లవం’ వచ్చింది. సామాన్యుడి నుండి మాన్యులని పిలవబడే వాళ్ల వరకు మోదీని ఈ దేశ కాపాలాదారుగా చేద్దామనుకొన్నారు. అంతే..! దేశం ఓ భరతమాత ముద్దుబిడ్డను అక్కున చేర్చుకొంది.
వికసించిన కమలం మోదీ
గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 27 ఫిబ్రవరి 2002 నాడు 59 మంది హిందూ భక్తులను సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణంగా ఓ మతోన్మాదమూక పెట్రోలు పోసి తగులబెట్టింది. దాంతో మతఘర్షణలు చెలరేగి ఇరు వర్గాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గోద్రా ఘటనను సెక్యులర్‌ శక్తులు ఖండించిన కారణంగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైయ్యారు. కానీ ఇదంతా మోదీపై నెట్టి ఆయనను ‘ముస్లిం వ్యతిరేకి’గా చిత్రీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గోబెల్స్‌ ప్రచారం మొదలుపెట్టారు. కానీ నరేంద్రమోదీ తన పని తాను చేసుకొంటూ గుజరాత్‌ను ఒక ఆదర్శ అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం మోదీని అనేక విషమ పరీక్షలకు గురిచేసింది. అనేక విధాలుగా ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి చిరాకు కలిగించింది. అయినా ‘ధీరుల్‌ విఘ్న నిహన్యమానులగుచున్‌’ అన్నట్లుగా మోదీ రాచమార్గంలో వెళ్లిపోయాడు. ఈ బురదను త్రోసివేస్తూ కమలంగా వికసించి 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, మునుపెన్నడూ లేనివిధంగా పార్లమెంటునే దేవాలయంగా భావించి నతమస్తకుడయ్యాడు.
దుష్ప్రచారం షూరూ…!?
మోదీ ప్రధాని కానేకాడు అని కొందరు! అయితే ఈ దేశంలో సెక్యులరిజం బ్రతుకదు అని మరికొందరు..!! ఇలా బురద జల్లుతుండగానే అనంతమూర్తి అనే కన్నడ సాహిత్యవేత్త ‘మోదీ ప్రధాని అయితే నేను ఈ దేశం విడిచి వెళ్లిపోతా’ అన్నాడు. దురదృష్టవశాత్తూ ఆయన తర్వాత ఆయన ఈ లోకాన్నే విడిచివెళ్లాడు. ఓవైపు రాజకీయశక్తులు, మరోవైపు మతోన్మాదశక్తులు, సెక్యులర్‌ ముసుగేసుకున్న కుహన లౌకికవాదులు, కమ్యూనిస్టులు, అందరూ మోదీని ఈ దేశ గద్దెపై చూడడం ఇష్టంలేక నీచమైన విమర్శలకు దిగారు. ఆఖరుకు మణిశంకర్‌ అయ్యర్‌, దిగ్విజయ్‌సింగ్‌ లాంటివారు పాకిస్తాన్‌తో కలిసి ‘మోదీని దించేస్తాం’ అని ప్రకటించారు.
2014 నుండి ఇటీవల వరకు మణిశంకర్‌ అయ్యర్‌, దిగ్విజయ్‌సింగ్‌, రాజ్‌ బబ్బర్‌, శశిథరూర్‌, జిగ్నేష్‌ మేవానీ, కె.నారాయణ, బాలకృష్ణ… వంటి వాళ్లు ఈ దేశ ప్రధాని అని కూడా చూడకుండా సంస్కార రహితంగా తిట్లకు పాల్పడ్డారు. 2014లో ప్రభుత్వం ఏర్పడ్డాక మోదీని బోనులో నిలబెట్టేందుకు ప్రతిపక్షాలకు, మోదీ వ్యతిరేకులకు ఏ విషయం దొరకలేదు. అమెరికా వెళ్లకుండా అంతర్జాతీయ శక్తులతో కలిసి కుట్ర చేసి వీసా రాకుండా చేసిన వాళ్ల కళ్లముందే – అదే అమెరికా రెడ్‌ కార్ఫెట్‌ వేసి పిలవడం ఈ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. అలాగే సర్జికల్‌ స్ట్రైక్‌, డోక్లాం ఘటనలను కూడా మోదీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. వివిధ దేశాలకు పర్యటనలకు వెళ్లి ఈ దేశ గౌరవం మరింత పెంచాడు. అంతర్జాతీయ స్థాయిలో మనదేశ ప్రధాని పదవి విలువ పెరిగిపోయింది. ఇందులో కొన్ని ముందూవెనుకా జరిగినా మోదీ వ్యతిరేక శక్తులకు తమ భవిష్యత్తు కన్పించింది.
కొత్త కత్తులకు పదును..!
అప్పుడప్పుడు దేశ నాయకులు ప్రజల అంచనాలను మించి పని చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా చేయాలని ఆశిస్తాం. మోదీ విషయంలో అలాగే జరిగింది. గతంలో మన్మోహన్‌ సింగ్‌ను బాగా గమనించిన ఈ దేశ మధ్యతరగతి వర్గం మోదీపై ఎక్కువ ఆశలు పెట్టుకొంది. అవినీతి జరుగకుండా, వ్యవస్థల ప్రక్షాళన చేయడం మోదీ పనితనం. కానీ తాయిలాలకు అలవాటుపడిన జనానికి వెంట వెంటనే ఆయని పనితనం ఫలితాలు కన్పించలేదు. అయినా అతణ్ణి ఈ దేశం నమ్మింది. నరేంద్రమోదీ ప్రధాని పదవిలోకి వచ్చాక మతపరమైన ప్రసంగాలు చేస్తే ఆయనపై దుమ్మెత్తి పోసేవారు. అది గ్రహించిన ప్రధానిని ఆచితూచి మాట్లాడడం అనవసర వ్యవహారాల్లో మంత్రులను, పార్టీ నాయకులకు జోక్యం లేకుండా చేయడం ఓ క్రమశిక్షణగా పెట్టుకొన్నారు. ఈ లోపు కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలయ్యింది. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏకే ఆంటోనీతో ఓ కమిటీ వేసింది. ఆయన నిర్మొహమాటంగా ‘కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ వ్యతిరేకతను” బట్ట బయలు చేసాడు. దాంతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, కుహనా లౌకిక వాద కుటుంబ పార్టీలు ‘మైనార్టీ వాదం’ ప్రక్కకు పెట్టాయి. ఎందుకంటే వాళ్లు ఎంతలా మైనార్టీలను బుజ్జగిస్తే వెంటనే మెజార్టీ ప్రజలు మోదీవైపు నిలబడడం మొదలు పెట్టారు. కాబట్టి కుహనా లౌకిక వాద శక్తుల కొత్త అస్త్రం సిద్ధం చేసుకొన్నాయి.
2016లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల అనే విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే దానిని కేంద్రానికి, మోదీకి ఆపాదించి దుష్ప్రచారం మొదలుపెట్టారు. కమ్యూనిస్టులు లాల్‌-నీల్‌ జెండాపేరుతో క్రొత్త అస్త్రం సృష్టించి తమ వంధిమాగధ మీడియా ద్వారా రోహిత్‌ దళితుడని ప్రచారం చేసారు. ఇక కేజ్రీవాల్‌, రాహుల్‌, ఏచూరి వంటి మోదీ ఆగర్భ శత్రువుల గుంపు హైద్రాబాద్‌లో వాలిపోయి మోదీపై, భారతీయ జనతాపార్టీపై కులవాద అస్త్రం ప్రయోగం చేసారు. నిజం నిద్రలేవకముందే అబద్ధం అరవై దేశాలు తిరిగిందన్నట్లు మోదీ వ్యతిరేక మీడియా దేశంలో కులవాదంపై పెద్ద ఎత్తున రచ్చ చేసింది. ఈలోపు పార్లమెంటులో స్మృతీ ఇరానీ దస్తావేదుల ఆధారంగా ఇవన్నీ కడగేసి, దుమ్ము దులిపింది. ఈ అబద్ధం ప్రచారంలో ఉండగానే ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి దళితుడే కాడని తేలింది. కానీ ఈ శక్తులకు ఇక్కడే మజా దొరికింది.
మోదీని పాలనలో ఎదుర్కోవడం కన్నా దుష్ప్రచారంతో ఎదుర్కోవడం చాలా సులభం అని వారు గ్రహించారు. వాళ్లందరిని హిట్లర్‌ ఆవహించాడు. అందుకే పూటకో అబద్ధం. దీనికి బ్రిటీష్‌ అనలిటికా అనే విదేశీ సంస్థను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి కాంగ్రెస్‌ పార్టీ ఉపయోగించుకొంటున్నట్లు రిపబ్లిక్‌ జాతీయ న్యూస్‌ ఛానల్‌ ఆధారాలతో బయటపెట్టింది. ఎక్కడ ఎలాంటి చిన్నపాటి స్థానిక ఘర్షణ జరిగినా దానిని అంతర్జా తీయ సమస్యంగా చేయడం, ప్రతివిషయానికి కుల, మతం రంగు అంటించి బురద చల్లడం మొదలు పెట్టారు. స్థానికంగా జరిగే ప్రతిఘటనను చిలువలు పలువలు చేసి దానిపై ప్రధాని స్పందించాలని కోరడం, లేదంటే ఆ మనపై దుష్ప్రచారం చేయడంలో వారు విజయవంతం అయ్యారు. నేరాలు, హత్యలు, గోహింస, దానిపై ప్రతిఘటన, స్థానిక మత ఘర్షణలు.. ఇలా ప్రతి వాటిని ఏదోరకంగా మోదీపైకి నెట్టడం అలవాటుగా పెట్టుకొన్నారు.
గతంలో వాజ్‌పేయి, అద్వాణీలు జీవిత పర్యంతం పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్‌ మంచిపని చేస్తే చక్కగా సహకరించారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో సోనియా, రాహుల్‌, ఖర్గే ఏనాడూ పార్లమెంట్‌ను నడవనివ్వ లేదు. చర్చలు జరిగితే వాళ్ల జాతకాలు చెప్పి మోదీ కడిగివేస్తాడని భయం. ఈ లోపు 2018 ఫిబ్రవరిలో చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థంతో ఎన్డీయే నుండి బయటకు వచ్చి ఈ గ్యాంగులో చేరాడు. ప్రత్యేక ¬దా అనేది ఒక నెపం మాత్రమే. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థలో అధిక సంపన్నుల్లో సోనియా తర్వాత చంద్రబాబు అని చెప్తారు. ఆయన తన యావశ్శక్తిని మోదీపై బురద జల్లేందుకు ఉపయోగిస్తున్నారు.
దుష్ప్రచారం ఒక రాజకీయ అస్త్రం..!
పరిపాలనపై చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. సిద్ధాంతాల మాటున యుద్ధం చేసే కమ్యూ నిస్టులు ఈ దేశంలో అవసాన దశలో ఉన్నారు. కానీ వారు తయారుచేసిన వ్యవస్థీకృత సిబ్బంది సాంస్కృతిక రంగంలో, మేధోరంగంలో ఇప్పటికీ బలంగా ఉంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏం చేయకున్నా ‘కాషాయీకరణ’ ముద్రవేసి అపఖ్యాతిపాలు చేసారు. అందుకే మోదీ ఈ దఫాలో అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ దేశంలో ఏదో మూలన జరిగే సంఘటనకు కులం, మతం రంగురుద్ది ఇంకో వైపున జరిగే ఎన్నికలకు వాడుకోవడం మొదలు పెట్టారు. అక్కడా దుష్ప్రచారమే ఆయుధం..!?
2014లో సాధారణ ఎన్నికల్లో మోదీ విజయం తర్వాత ఢిల్లీ, బిహార్‌ తప్ప 2018 డిసెంబర్‌ వరకు అన్ని ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తూ వచ్చింది. అన్నాహజారే ముసుగులో వచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్‌లో ఇప్పుడు చంద్రబాబులా మిడిసిపడి మోదీకి సముఉజ్జీనని బోల్తాపడ్డాడు. ఈ లోపు నితీశ్‌ కుమార్‌ను మోదీని నిలువరించే వ్యక్తిగా సెక్యులర్‌ గ్యాంగ్‌ ఎక్స్‌పోజ్‌ చేసింది. లాలూ లాంటి అవినీతిపరునితో నీతీశ్‌ ఉండలేక తిరిగి మోదీ చెంతకు చేరాడు. ఇలా దేశంలో వచ్చే ఎన్నికల ముందైనా ఓ యుద్ధ వాతావరణం సృష్టించి ‘దుష్ప్రచారం’ చేయడం వెనుక శక్తులు ఎవరున్నారు….?
దేశం కోసం ప్రాణం ఇచ్చే ధీరుడు…!
భారతికి ఎందరో ఋషులు తపస్సు చేస్తే దొరికిన బాంధవుడు..!!
ఫకీరులా అన్నీ అర్పించిన ప్రియభారత పుత్రుడు..!
చక్రంలా భారత రాజకీయాలను తిప్పుతున్న నరేంద్రుడు..!!
దుష్ప్రచారపు సుడిగుండాల నుండి
పుట్టుకొచ్చిన దేశభక్తుడు.. !
విషపు కత్తుల వలయంలో చిక్కుకొన్నా
దేశమే ముందని చెప్పేన మోదీపై యుద్ధం ఎందుకు..?


ఏనాడూ లేనివిధంగా మోదీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు బహిరంగ విమర్శలకు దిగడం ఓ వింత. అదీ నేరుగా చెప్పకుండా ప్రభుత్వం వైపు వేలు చూపించేవిధంగా ఆరోపణలు చేయడం. జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ఈ ప్రెస్‌మీట్‌లో జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను దోషిగా చూపిస్తూ ఈయన వెనుక ఎన్డీయే ఉందన్న సంకేతం ఇచ్చారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తన పదవీవిరమణ లోపు రామమందిరంపై తీర్పు ఇస్తాడని తెలిసే ఇలాంటి తెరవెనుక కుట్రను రచించి అమలు చేసారని విజ్ఞుల అభిప్రాయం.
ఆఖరుకు కర్ణాటక ఎన్నికల తర్వాత అర్థరాత్రి తలుపులు తీయించింది కూడా ఈ భయాందోళనలకు గురిచేసే కదా! తర్వాత జస్టిస్‌ దీపక మిశ్రాపై కాంగ్రెస్‌ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని చూసింది. అంతెందుకు! ఇటీవల కపిల్‌ సిబ్బల్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు 2019 ఎన్నికల వరకు రామమందిరం ఇష్యూ వద్దని సుప్రీంకోర్టును బ్లాక్‌మెయిల్‌ చేస్తే, రాజీవ్‌ ధావన్‌ అనే న్యాయవాది బ్లాక్‌మెయిల్‌ చేసి లలిత్‌ అనే ఒక న్యాయమూర్తిని ధర్మాసనం నుండి తప్పుకొనేటట్లు చేశాడు. ఇలా న్యాయ వ్యవస్థను కులం, మతం, పక్షపాతం అంటూ వాడుకుంటున్న వారే మోదీని అపఖ్యాతి చేసేందుకు న్యాయ వ్యవస్థపై బురద జల్లుతున్నారు.

దుష్ప్రచారం వెనుక..

ఢిల్లీ ఎన్నికలు రాగానే చర్చిలపై దాడులంటూ మొదలు పెట్టిన ఈ గ్యాంగు అవి అయిపోగానే మిన్నకుండిపోవడం మనం చూసాం. అలాగే అసహనం పేరుతో అవార్డు వాపసీ గ్యాంగ్‌ తమకు పూర్వం ఇచ్చిన అవార్డులను వాపసు ఇస్తుంటే వాళ్లకు ఇన్ని అవార్డులు వచ్చాయా? అని అప్పుడు తెలిసింది. సాహిత్య అకాడమీ ఇచ్చిన 39 మంది తమ అవార్డులను వాపస్‌ ఇచ్చారు. ఉదయ్‌ ప్రకాశ్‌, అశోక్‌ వాజ్‌పేయి, క్రిష్ణశోబ్టీ, మంగళ్‌దేశ్‌ దర్బల్‌, కాశీనాథ్‌ సింగ్‌, రాజేశ్‌ జోషి వంటి హిందీ రచయితలు మొదలుకొని కాత్యాయనీ విద్మహే వంటి తెలుగు రచయిత్రులు ఇందులో ఉన్నారు. అఖ్లాఖ్‌ హత్య తర్వాత కొందరు గౌరీ లంకేశ్‌ హత్య తర్వాత మరికొందరు అవార్డు వెనక్కి ఇచ్చి మోదీపై దుష్ప్రచారంలో భాగస్వాములయ్యారు. 2017 సెప్టెంబర్‌ 5న గౌరీలంకేశ్‌ అనే జర్నలిస్ట్‌ను ఎవరో చంపారు. ఇది ఖండనీయం. కానీ ఆమె మరణించిన 15 నిమిషాల్లోనే ఒకవర్గం మేధావులు సీఐడీ దర్యాప్తు సంస్థల్లా కొందరు వ్యక్తులను, కొన్ని సంస్థలను దీనికి బాధ్యులను చేస్తూ మాట్లాడారు. ఆమె శ్రద్ధాంజలి సభను న్యూఢిల్లీ ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో పెట్టారు. గౌతమ్‌ లాహడీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన డి.రాజా, కన్హయ్య కుమార్‌ పాల్గొన్నారు. దీని ఆర్గనైజ్‌ చేసింది లెఫ్ట్‌వింగ్‌ మీడియా గ్రూప్‌. కర్ణాటకలో జరిగిన హత్యను ఢిల్లీకి చేర్చి మోదీపై బురదజల్లి తర్వాత రాబోయే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చడం ఆనాడు వీరి ఉద్దేశం.

రోజుకో అస్త్రం

 ఉన్నావ్‌, కథువాలలో జరిగిన రేప్‌లపై మోదీని దోషిని చేసేందుకు పదవీవిరమణ పొందిన ఐఏఎస్‌ అధికారులతో మరో ప్రోగ్రాం చేసారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగిన నేరాలను మోదీకి ఆపాదించాలంటే జాతీయ మీడియా దానిని చూపించాలి. కాబట్టి ఏఎస్‌పి అంబ్రేష్‌, వప్పల బాలచంద్రన్‌, చంద్రశేఖర్‌ బాలకృష్ణన్‌, ప్రదీప్‌ భట్టాచార్య వంటి 49 మంది మాజీ ఐఎఎస్‌లు మోదీకి లేఖ రాయడం వెనుక అసలు ఉద్దేశం దుష్ప్రచారమే.
 2017 ఆగష్టులో పదవీ విరమణ చేసి పోతూపోతూ ‘అసహనం’ అంటూ పదవి నుండి దిగిన హమీద్‌ అన్సారీ రెండురాళ్లు వేసాడు. ఏనాడూ పన్నెత్తి మాట అనని మోదీని దోషిగా చూపించాలని అమీర్‌ఖాన్‌ అనే నటుడు, హమీద్‌ అన్సారీ మొదలుకొని మానవ హక్కుల సంఘాల చేతిలో తోలుబొమ్మ అయిన నషీరుద్దీన్‌ షా వరకు ఇదే బాపతు.
 చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నంత వరకు మోదీ ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడిన ప్రధానమంత్రి మీడియా, ఆయన భాజపాకు దూరం కాగానే ప్లేట్‌ మార్చాయి. రోజూ ప్రధాని అని కూడా చూడకుండా తెలుగు మీడియా చేస్తున్న ‘మానహననం’ ఇంతా అంతా కాదు. ఇదంతా దుష్ప్రచార కుట్రలో భాగమే.
 ఇటీవల సుప్రీంకోర్టునుప్రయోగించి తమకనుకూల వాదనలు చేసి ఏదో ఒక ఆర్డర్‌ను తెచ్చి దాంట్లో ప్రభుత్వాన్ని దోషిగా మార్చడం కపిల్‌ సిబ్బాల్‌, ప్రశాంత్‌ భూషణ్‌ వంటి న్యాయవాదులు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని సవరించాలని కపిల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే సందర్భంలో కోర్టు ఇచ్చిన డైరక్షన్లు ప్రభుత్వానికి ఆపాదించి మోదీని ‘దళిత వ్యతిరేకి’గా ముద్ర వేయాలని చూసారు.
 కథువాలో ఓ ముస్లిం అమ్మాయిని రేప్‌ చేసారనే కథనం ఎక్కువ ప్రచారం చేసి దానికీ మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సబబు? అలా అంటే చంద్రబాబు పాలించే దాచేపల్లి మొదలుకొని కేజ్రీవాల్‌ పాలించే ఢిల్లీ ఎన్నోచోట్ల జరిగే సంఘటనలను కులమో, మతమో అద్దితే ఆయా పార్టీల నాయకులు బాధ్యత వహిస్తారా?
 యూపీలోని కైరానా, సారంగపూర్‌ వంటి చోట్ల మతఘర్షణలకు మోదీ, బీజేపీ కారకులని కలర్‌ ఇవ్వడం వెనుక దురద్దేశాలు లేవా?
 కర్ణాటకకు చెందిన అనంత కుమార్‌ హెగ్డే రాజ్యాంగ సమీక్ష జరగాలని అంటే వెంటనే కాంగ్రెస్‌, కమ్యూనిష్టు శక్తులు భాజపా మోదీ నేతృత్వంలో రాజ్యాంగం రద్దు చేస్తుంది’ అని ప్రచారం చేస్తారు. మరి 110కి పైగా రాజ్యాంగ సవరణలు చేసినవారు గతంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినట్లా? తప్పుడు వ్యాఖ్యానాలతో దుమ్మెత్తి పోయడమే దీని వెనుక రహస్యం.
 ఇటీవల అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్‌ మతం పేరుతో విభజించి లక్షలాది మంది ఊచకోతకు కారణమైన మహమ్మదాలీ జిన్నా ఫోటోను పెట్టారు. 30.4.2018 నాడు సతీశ్‌ గౌతమ్‌ అనే భాజపా నాయకుడు ఉపకులపతికి ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత ఈ ఇష్యూలోూవీఖూఖ కుూదీహూకి ఘర్షణ తలెత్తింది. కానీ ఈ ఘర్షణలకు, ఈ అసహనానికి కారణం మోదీ అంటారు ఎర్రన్నలు. అంటే వాళ్లు ఎలాంటి దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డా ఏమీ అనకూడదన్నమాట.
 కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌ వంటి వామపక్ష విద్యార్థి నేతలు ఆజాదీ పేరుతో విశ్వవిద్యాలయాల్లో యాకూబ్‌ మెమెన్‌ను కీర్తిస్తారు. బుర్హాన్‌ వానీ అనే తీవ్రవాదికి నివాళులు అర్పిస్తారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. వాళ్లను ఏమైనా అంటే మోదీ నియంత అనీ, భావస్వేచ్ఛ మాకు లేదని ప్రచారం చేస్తారు?
 ఇక ఎల్లో మీడియా ఇటీవల ఉత్తర-దక్షిణభారతం అనీ, ఫెడరల్‌ స్ఫూర్తి అంటూ కేంద్రాన్ని మోదీని నిందిస్తూ రోజుకో వంట వండి వార్చుతుంది. అవినీతిపరులైన వ్యాపార నాయకులపై ఐటిదాడులు జరిగితే మోదీ తెలుగువారి ఆత్మగౌరవంపై దెబ్బకొడుతున్నాడని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ‘ఆఖరుకు’ సిబిఐకి ఎన్‌ఐఏకు రాష్ట్రాల్లో సహకరించం’ అని తెలుగుదేశం ప్రభుత్వం వాదిస్తుంది.

ఇక ఇటీవల కాంలో రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై రాహుల్‌ అనేక అబద్ధాలతో దుష్ప్రచారాలతో దూసుకు పోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల అత్యంత గౌరవిస్తున్న యశ్వంత్‌ సిన్హా లాంటివాళ్లు సుప్రీంకోర్టులో దీనిపై వ్యాజ్యం వేశారు. కోర్టు దీనిలో ఎలాంటి వ్యూహాత్మక కుంభకోణం లేదు అన్నది. అయినా ఈ దేశ ప్రతిపక్షనాయకుడు ఎలాంటి ఆధారాలు లేకుండా పదేపదే ‘గోబెల్స్‌’ను ఆవహించుకొని మాట్లాడుతున్నాడు. అసలు అంబానీ కుటుంబం మోదీ నాలుగేళ్ల పాలనలోకి శ్రీమంతులయ్యారా? గతంలో సోనియా యూపీఏ ప్రభుత్వం 5800 కోట్ల ఢిల్లీ విమానా శ్రయం లైన్‌ను అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చింది? ఇన్నేళ్లలో హెచ్‌ఎఎల్‌ను ఎందుకు అభివృద్ధి పరచలేదు. ప్రధాని నేరుగా కూర్చొని మాట్లాడుతాడా? దీనికి ఓ పద్ధతి ఉందా? బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్నప్పుడు ఎయిర్‌టెల్‌, ఐడియా, రెలియన్స్‌, వోడాఫోన్‌లకు అనుమతి ఎందుకు ఇచ్చారో చెప్పగలరా? 1963 నుండి 2013 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెహ్రూ కాలంలోనే రక్షణ రంగంలో జీపుల కుంభకోణం జరిగింది. రాజీవ్‌ గాంధీ బోఫోర్స్‌ శతఘ్నుల కుంభకోణంలో నేరుగా సోనియానే పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదంతా వదిలిపెట్టి, ఎలాంటి కుటుంబం, బ్యాంక్‌ ఖాతాలు లేని మోదీపై బురదజల్లే దుష్ప్రచారం మూడు రాష్ట్రాల్లో బోటీబోటీ మెజార్టీతో గెలిపించి ఉండవచ్చు కానీ సత్యం?


రాజస్థాన్‌లో గుజ్జర్లను, మహారాష్ట్రలో మరాఠాలను, హరియాణాలో జాట్లను, ఆంధ్రలో కాపులను, తెలంగాణలో ముస్లింలను, గుజరాత్‌లో పటీదార్లను రిజర్వేషన్ల పేరుతో రెచ్చగొడుతూ వారి మనస్సుల్లో మోదీపై భారతీయ జనతా పార్టీపై విషం నింపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 60 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ, దానితోక పార్టీలు ఏనాడూ ఈ విషయంపై మాట్లాడలేదు. కానీ వారి ప్రయోజనాల కోసం రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కేంద్రాన్ని బోనులో ఎక్కించడం వెనుక పెద్ద కుట్ర ఉంది. వాళ్లు ఎంచుకొన్న లక్ష్యం పూర్తయినా, కాకున్నా దుష్ప్రచారం జరిగితే చాలు.

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ చోక్సి, లలిత్‌ మోదీలను మోదీ తయారు చేసాడా? వాళ్లకు బ్యాంక్‌ అప్పులు ఇచ్చింది ఎవరు? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2008 వరకు మన బ్యాంక్‌లు 18 లక్షల కోట్లు అప్పులు ఇస్తే, యూపీఏ పాలనలో 2008 నుండి 2013 వరకు కేవలం ఆరేళ్లలో 34లక్షల కోట్ల ఋణం ప్రభుత్వం ఇచ్చింది. ఎగవేతదారులకు బ్యాంక్‌ తలుపులను బార్లా తెరచిన వారే నీతులు చెప్తూ మోదీపై దుష్ప్రచారం చేయడం కుట్ర కాదా?


**********************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి * 
జాగృతి : వారపత్రిక 
21 : 27 : జనవరి - 2019
సంపుటి : 71, సంచిక : 12



‘శత్రువును జయించాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు; దుష్ప్రచారం చేస్తే సరిపోతుంది’ అన్న సూత్రం కొన్ని రాజకీయ పక్షాలకు బాగా వంటబట్టింది. దేశంలో సరికొత్త అనుమానాలను పుట్టించి ప్రజల్లో ఆందోళన కలిగించడం రాజకీయ వ్యూహం. కానీ, ప్రజాస్వామ్యం పరువు బజారున పడుతోందన్న విషయాన్ని వీళ్లు విస్మరించారు. వాళ్లకు అధికారం తప్ప దేశం అవసరం లేదు. ఎలాంటి ధ్వంసరచన చేసైనా గద్దెనెక్కడం అధికార దాహార్తుల అసలు లక్ష్యం. 

రెండురోజుల క్రితం సైబర్ హ్యాకర్ సయ్యద్ షుజా అనే కొత్తపాత్రను కొందరు నేతలు తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంల (ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల)ను ట్యాంపరింగ్ చేసి భాజపా అధికారంలోకి వచ్చిందన్నది సయ్యద్ ఆరోపణ. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా గెలవడానికి కారణం ఇదే అని కూడా ఆరోపణ చేశాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేంద్రాల నుంచి ఈవీఎంలను తక్కువ పౌనఃపున్యం ఉన్న సిగ్నల్స్ ద్వారా హ్యాక్ చేశారని అతను ఆరోపణ చేశాడు. 3 జూన్ 2014న మరణించిన భాజపా నేత గోపీనాధ్ ముండే, 2 ఏప్రిల్ 2016న మరణించిన ఎన్‌ఐఏలో కీలక అధికారి తంజీల్ అహ్మద్, 5 సెప్టెంబర్ 2017న మరణించిన గౌరీ లంకేశ్ హత్యలను కూడా దీనికి జోడించారు. ముండేకు ఈ రహస్యాలు తెలిసినందువల్లే చంపేశారని, ఆయన హత్యపై దర్యాప్తు చేసినందువల్లనే తంజీల్ అహ్మద్‌ను ఆగంతకులు అంతం చేశారని, ఈ ట్యాంపరింగ్‌పై కథనాలు రాసినందువల్లనే జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను చంపారని ఓ కొత్త కథ అల్లి కేంద్రంపై ప్రజలకు అనుమానం కలిగేలా దుష్ప్రచారం మొదలుపెట్టారు.

గతంలో వాజపేయి ప్రభుత్వంలో వ్యవహార దక్షుడైన భాజపా కీలకనేత ప్రమోద్ మహజన్‌ను ఎవరు చంపించారు? జీఎంసీ బాలయోగి, ఎర్రన్నాయుడులను వివిధ ప్రమాదాల్లో ఎవరు హత్య చేయించారు? వీళ్లంతా తమకు భవిష్యత్తులో పోటీగా నిలుస్తారని చంపించారా? గొప్ప నాయకుడైన నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణంపై ఈరోజుకూ స్పష్టత ఎందుకులేదు? అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మరణంపై వేసిన జేపీసీ రిపోర్టు ఎందుకు బయటకు రాలేదు? వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని ఎవరు, ఎందుకు చంపించారని విచారణ చేశారా? ప్రతి మరణాన్ని ఏదో ఒక కోణంలో చూపించి దుష్ప్రచారం చేయాలంటే వాళ్లను ఎవరూ ఆపలేరు; కానీ అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా! ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై కథనాలు రాద్దామనుకున్న గౌరీ లంకేశ్ నడిపే పత్రిక, ఆమె వ్యాసాలు దేశాన్ని మొత్తం ప్రభావితం చేసే అంత గొప్పగా ఉన్నాయా? కర్నాటకలో రచయిత్రి, జర్నలిస్టు అయిన గౌరీ లంకేశ్ ఒకవేళ ఆమె ట్యాంపరింగ్‌పై పరిశోధన చేసినందుకే చంపేశారని ఇపు డు చెబుతున్నారు. కానీ ఆమె మరణించిన సందర్భంలో ఇంకేవో కారణాలు చెప్పారు కదా? ‘మా చచ్చిపోయిన గేదె పగిలిపోయి న కుండెడు పాలు ఇచ్చేది’ అని చెప్పే సామెతలా ఉంది కథ. ఎక్కడో మారుమూల ప్రాంతంలోని రచయిత్రిని హత్య చేసేట్టయితే, ఢిల్లీలో కూర్చొని రోజూ మోదీపై వ్యతిరేక కథనాలకు ఆజ్యం పోస్తున్న రచయితలను, జర్నలిస్టులను ఎందుకు వదలిపెడతారు? గౌరీ లంకేశ్ మరణించినపుడు కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇపుడు అదే మూసలో కొలువుదీరిన జెడిఎస్ కుమారస్వామి ప్రభుత్వం ఉంది కదా! ఈ రెండూ మోదీకి తీవ్ర వ్యతిరేక ప్రభుత్వాలే కదా! మరెందుకు గట్టి పరిశోధన చేసి దోషులను పట్టుకోలేదు?


బీఈఎల్, ఈసీఐఎల్ అనే ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అ త్యంత గోప్యంగా, భద్రత మధ్య ఈవీఎంలు తయారవుతాయి. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో ‘హాల్’కు ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదన్న వాళ్లే బీఈఎల్, ఈసీఐఎల్ పనితీరుపై వేలెత్తి చూపుతున్నారు. ఇంకో విశేషమేమిటంటే- సయ్యద్ తాను హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో పనిచేసిన సైబర్ నిపుణుడని చెప్పుకొన్నాడు. కానీ రెండు రోజుల క్రితం ఈసీఐఎల్ ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో ‘మేం రికార్డులన్నీ తనిఖీ చేసాం. అలాంటి వ్యక్తి 2009-14 మధ్య గానీ అంతకుముందుగానీ మాతో పనిచేయలేదు’ అని స్పష్టం చేసింది. అయినా తన ముఖమే చూపంచకుండా, లండన్‌లో సయ్యద్ ప్రెస్‌మీట్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటన అంతా భారత్‌లో జరిగితే విదేశాల్లో ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక రహస్యం ఏమిటి? సైబర్ హ్యాకర్ మాటలకు ఈ దేశ ప్రభుత్వాలపై ప్రభావం పడేంత బలహీనంగా మన ప్రజాస్వామ్యం, మన ఆలోచనలు ఉన్నాయా? రాఫెల్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండానే పత్రికా కథనాలతో దుష్ప్రచారం కొనసాగించినట్లే ఇదీ ఒక మానసిక వికృత క్రీడగా అన్పించడం లేదా?

ఇక ఈ స్క్రీన్‌ప్లేలో మరో గొప్ప అంశం ఉంది. రామమందిరం కేసును 2019 వరకూ విచారణ జరపడానికి వీల్లేదని సుప్రీం కోర్టును బ్లాక్‌మెయిల్ చేసి వాయిదా వేయించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ షుజా ప్రెస్‌మీట్‌కు వెళ్లాడు. యూపీఏ ప్రభుత్వంలో ఇతన న్యాయ, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈవీఎంలను భాజపా హ్యాక్ చేయిస్తుంటే అప్పుడు ఐటీ మంత్రిగా ఈయన ఏం చేస్తున్నాడు? 2017లో జరిగిన 5 రాష్ట్రాల రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఎన్నికల కమీషన్ ఢిల్లీలో అన్ని పార్టీల ప్రతినిధును ఆహ్వానించి ‘ఈవీఎంలను ట్యాం పర్ చేసి చూపించండి’ అంటూ సవాల్ చేసింది. కానీ ఆ కార్యక్రమానికి సీపియం, ఎన్సీపి నేతలు మాత్రమే వెళ్లి వాటి పనితీరు పరిశీలించి వచ్చాయి. ఈసీ సమావేశం ఢిల్లీలో పెడితే వెళ్లని పార్టీలు, 2019లో ఓడిపోవడానికిముందే ఓ కొత్త దారి వెతుక్కుంటున్నాయని విశే్లషకుల భావన. లండన్ వెళ్లి సైబర్ హ్యాకర్ల మాటలు శ్రద్ధగా వింటారు గానీ, ఢిల్లీలో ఈసీ పిలిస్తే వెళ్లరు!? 2004-2018 మధ్య ఈవీఎంలను ఉపయోగించగా కొన్ని పార్టీలు విజయం సాధించాయి. మరోసారి ఓడిపోయాయి. ఓడితే ట్యాంపరింగ్ జరిగినట్లు, గెలిస్తే ప్రజావిజయమా? 2014లో ఈవీఎంల ద్వారా గెలిచిన, సాంకేతికతకు ఆద్యుడైన చంద్రబాబు కూడా వీటిపై అనుమానాలను వ్యక్తం చేయడం విచిత్రం.

ఇటీవల కోల్‌కతలో సమావేశం జరిపిన 22 చిన్నా చితకా పార్టీల ప్రతినిధిగా మమతా బెనర్జీ ఈ విషయమై అభిషేక్ మను సంఘ్వీ, అఖిలేశ్ యాదవ్, సతీశ్ చంద్రమిశ్రా, అరవింద్ కేజ్రీవాల్‌లతో ఓ కమిటీ వేసింది. 2018 మేలో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యాలెట్ బాక్సులను నీళ్లలో పడేయడం మమత మరిచిపోయి మళ్లీ బ్యాలెట్ బాక్స్‌లు కావాలంటోంది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ‘ఈవీఎంలు వద్దు’ అనే కమిటీలో సభ్యుడు. ఇతణ్ణి భాజపా వారే గెలిపించారా? ఆ తర్వాత బిహార్ ఎన్నికల్లో- మోదీకి దీటైన నాయకుడు అని ప్రచారం పొందిన నితీశ్‌కుమార్‌ను భాజపానే గెలిపించిందా? మోదీని, భాజపాను తీవ్రంగా ద్వేషించే లాలూ పార్టీని ట్యాంపరింగ్‌తో బీజేపీ వాళ్లు గెలిపించారా? ఇటీవల పూల్పూర్, గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ-బిఎస్పీ కూటమిని ట్యాంపరింగ్ ద్వారా గెలిపించారా? నెలక్రితం జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ట్యాంపరింగ్ ద్వారానే గెలిచిందా? 2010లో ఈవీఎంల పనితీరుపై కమిటీ వేసిన కాంగ్రెస్ 2014 వరకు ఏం చేసింది? 2014 వరకు సాంకేతిక పరిజ్ఞానం అంతా తనచేతిలోనే పెట్టుకొన్న కపిల్ సిబాల్ ఇపుడు ఈ కొత్త నాటకానికి ఎందుకు తెరతీసారో తెలియదు.

కొత్తకోణంతో విషప్రచారం చేసిన షుజా,సిబాల్‌లు వ్యవస్థలను ఇంతలా అపహాస్యం చేయడం విడ్డూరం. ప్రతి సంఘటనకూ హైదరాబాద్‌కు లింక్ వున్నట్లే ఈ ఘటనకూ ఇక్కడి భాజపా నాయకుడు జి.కిషన్‌రెడ్డిని జోడించారు. హ్యాకర్ షుజాను మరో 13మందిని ఉప్పల్ గెస్ట్‌హౌజ్‌కు పిలిపించిన కిషన్‌రెడ్డి 11మందిని అక్కడే చంపించాడట! దానికి హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించి వాళ్ల ఆ లెక్కలో కలిపేసాడట! ఎంత ఆశ్చర్యం! ‘పాతబస్తీలోకి రాయలసీమ గూండాలను తీసుకువచ్చి నా ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు మా పార్టీ నాయకులే కుట్ర చేశార’ని సాక్షాత్తూ అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రకటించాడు. ఈ అలవాటున్న కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ కిషన్‌రెడ్డి పేరుతో కొత్త డ్రామాను ఆడించేందుకు షుజాను ఉసిగొల్పాడు. అసలు ఈ సయ్యద్ షుజా ఎవరో విచారణ వేగంగా చేయాలి.

హైదరాబాద్ షాదన్ కళాశాలలో బిటెక్, ఆర్‌ఎఫ్ చేశానని చెప్పే షుజా అక్కడ చదవలేదని ఆ విద్యా సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. తన తండ్రి యూసుఫ్ అహ్మద్ సయ్యద్ బీహెచ్‌ఈఎల్‌లో పనిచేశాడని, తమ కుటుంబాన్ని గృహదహనంతో చంపారని షుజా ఆరోపణ. కానీ అలాంటిది జరగలేదని ఫైర్ రిపోర్ట్స్, పోలీసులు పత్రికల్లో ప్రకటించారు. ఇలాంటి కట్టుకథలతో ఘర్షణ వాతావరణానికి తెరతీస్తున్న హ్యాకర్లు, సయ్యద్ వెనకున్న పార్టీలు, సంస్థలను నిర్దాక్షిణ్యంగా కట్టడి చేయకపోతే అబద్ధం అరవైసార్లు చుట్టివచ్చే ప్రమాదం వుంది. 37 ఏళ్ల సయ్యద్ షుజా చెప్పేదానిని నమ్మించే ప్రయత్నం చేస్తున్న 125 ఏళ్ల కాంగ్రెస్‌ను ఏమనాలి?

ఇవన్నీ వింటుంటే- ఈ ‘క్రైమ్‌స్టోరీ’లో తెలుగు నాయక రచయితలెవరో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆరోపణల్లో అసత్యాల్లో ఇక్కడి పేర్లు, వాతావరణం ఈకథలో ప్రతిబింబించింది కాబట్టి దీనిపై తక్షణ దర్యాప్తు వెంటనే పూర్తికావాలి. ‘ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్’కు చెందిన ఆశిష్ రే ఆహ్వానం మేరకు లండన్ వెళ్లానంటున్న కపిల్ సిబాల్ పాత్రపై, ఆయన వెనకున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా పాత్రలపై విచారణ జరగాలని భాజపా కోరుతున్నది.
‘దేశాన్ని కాపాడిన సర్జికల్ స్ట్రైక్‌పై సాక్ష్యం అడిగిన కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలతో దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నవారిని మాత్రం సాక్ష్యాలు అడగడం లేదు’’ అని భాజపా అంటున్నది.

అభూత కల్పనలతో, అసత్య ఆరోపణలతో సాగుతున్న ‘ఎన్నికల జూదం’ ఎలాంటి ఫలితం ఇస్తుందో చెప్పలేం కానీ మనపై మనకు నమ్మకాన్ని మాత్రం సన్నగిల్లేట్లు చేస్తున్నది. సాక్ష్యం లేకుండా అబద్ధాలను ప్రచారం చేసే ఈ ట్రెండ్ ఇంకెంత కాలం?


*****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి * 
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *



అణు విజ్ఞానం, గ్రహణాలు, కృష్ణబిల సిద్ధాంతం, ఖనిజ విజ్ఞానం, పాదరస ఔషధాలు, రాశిచక్రాలు, చెక్కుచెదరని లోహస్తంభ నిర్మాణం, స్ట్రింగ్‌ థియరీ, బిగ్‌బ్యాంగ్‌ థియరీ... ఇలా చెప్పుకుంటూపోతే భారతీయులు వేలు పెట్టని విద్య లేదు. అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయులు ఈ విషయాలను వాళ్ల కాలానికి తగినట్లుగా ఆచరణలో పెట్టారు. ఇప్పుడు గొప్ప విజ్ఞాన దేశాలుగా చెప్పేవి పుట్టని కాలంలోనే ఇలాంటి తొలి అడుగు వేసిన భారతీయ విజ్ఞాన వేత్తలను గుర్తించేదాకా మనకు పోరాటం తప్పదు.

ఆవు దూడలు దారివెంట నడుస్తున్నాయి. ఈ రెండు ఎక్కడివి? ఎవరివి? అని దారినపోయే దానయ్య పక్కనే నడుస్తున్న ఓ పెద్దాయనను అడిగాడు. ఆవు ఎక్కడిదో తెలియదు కానీ దూడ గురించి బాగా తెలుసు అన్నాడు. దానితో ఆగకుండా నాకు ఆవు నచ్చదు కానీ దూడ మాత్రం చాలా ఇష్టం. ఈ దూడ మాత్రం ఆవుదే! అన్నాట్ట. సరిగ్గా మన బుద్ధిజీవుల్లో కూడా ఇలాంటి పక్షపాతపు డైలాగులే రోజుకు పది పుడుతుంటాయి. ఈ దేశం మాదే అంటారు కానీ ఈ దేశంలో పుట్టిన సంస్కృతిని అంగీకరించరు!

ఈ మేధావులు రోజుకు పదిసార్లు పాశ్చాత్యుల గ్లోబలైజేషన్‌ను తిడతారు కాని వారి వైజ్ఞానిక ఆవిష్కరణలు చూపించి మన దేశ వైజ్ఞానిక పరంపరను నిందిస్తారు. ‘అన్ని వేదాల్లోనే ఉన్నాయష’ అని వేదాలను వెక్కిరించేవారు మనకు సంస్కర్తలుగా కొలువుదీరారు. ఈ భావవైరుధ్యం పక్కనపెట్టి నిజంగా ప్రపంచం బట్టలు కట్టని రోజే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో నిశితంగా చూడవచ్చు.

అణుబాంబు విస్ఫోటనం చూసి దాని అంతరార్థాన్ని భగవద్గీతలో (11/12, 11/32) శ్లోకాలలో చెప్పిన రాబర్ట్ జ్యూలియస్‌ వోపన్‌ హామర్‌ గురించి ఎంత మందికి తెలుసు! 16 జూలై 1945లో మాన్‌హట్టన్‌ ప్రాజెక్ట్‌లో ప్రముఖంగా పనిచేసి అణుబాంబు పరీక్షల అనుభవాన్ని గీతాతత్వంతో అన్వయించుకున్న ఈ పాశ్చాత్య శాస్త్రవేత్త భగవద్గీత గొప్పతనాన్ని తన జీవిత చరిత్రలో నమోదు చేసుకొన్నాడు. 

క్రీ.శ. 1543లో మొదటి సారి ‘సౌరవ్యవస్థకు సూర్యుడు కేంద్రంగా ఉంటే గ్రహాలన్నీ, భూమితో సహా అతని చుట్టూ తిరుగుతున్నాయి’ అని కోపర్నికస్‌ చెప్పకముందే, నవగ్రహాల మధ్యలో సూర్యుణ్ణి పెట్టి ఆరాధించే మన హైందవ దేవాలయ సంస్కృతి మరెంత గొప్పదో చూడండి. ఛార్లెస్ డార్విన్‌ జీవ పరిణామ వాదాన్ని వివరించాడు. దానికి ఆధునిక కాలంలో విశేష ప్రాచుర్యం ఉందని మనకు తెలుసు. కానీ పంతజలి మహర్షి తన ఆత్మ యోగ సిద్ధాంతం ద్వారా ‘మానవ జీవ పరిణామవాదం’ అందించాడు. మనిషి ప్రవృత్తులను యోగ విద్య ద్వారా దివ్యంగా మార్చే అపూర్వ సిద్ధాంతాన్ని పునఃస్థాపన చేశాడు. పశువులా జీవించే మనిషిని దివ్య మానవుడిగా ఎదిగించే రహస్యం మనకు అందించాడు. 

గురుత్వాకర్షణ సిద్ధాంతం – ఆపిల్‌ – న్యూటన్‌ కథ వినగానే, భూమ్యాకర్షణ సిద్ధాంతం అని చదవగానే మనం యురేకా! అంటూ పరుగులు పెడతాం, కానీ క్రీ.శ. 505లో జీవించిన వరాహమిహిరుడు తన ‘పంచసిద్ధాంతి’ అనే గ్రంథంలో ‘భూతలంలోని ఏ భాగంలో అయినా... అన్ని జ్వాలలు పైకెగుస్తాయి. పైకి వేసిన వస్తువు కిందకు పడుతుంది’ అని స్పష్టంగా చెప్పాడు. అలాగే బ్రహ్మగుప్తుడు (క్రీ.శ 591) భాస్కరాచార్యుడు (క్రీ.శ1114) ఇదే విషయాన్ని దృఢపరిచారు.

ఇదంతా సైన్సు కాదా? అలాగే గణితశాస్త్రంలోని అంక గణితం, రేఖాగణితం, బీజ గణితం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం కలగలిపి మన ప్రాచీనులు అభివృద్ధి చేశారు. వేదకల్ప సూత్రాల్లోని శుల్భసూత్రాలు, యజ్ఞవేదికల నిర్మాణాల విషయాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు చక్రీయ చతుర్భుజ విస్తీర్ణాన్ని, దాని వికర్ణాన్ని కనుగొనడంలో విశేషకృషి చేశాడు. శూన్యాంశం (సున్న) వర్గమూలం (స్క్వేర్‌ రూట్‌) ఘనమూలం (క్యూబ్ రూట్‌)లను భారతీయులే కనుగొని ప్రపంచంలోనే మొదటి గణిత విప్లవం సృష్టించారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.2587 రోజులు పడుతుందని తన ఖచ్చితమైన గణితంతో చెప్పిన భాస్కరాచార్యుడు ఎంత గొప్ప గణితవేత్త. 1962లో మురళీ మనోహర్‌ జోషి ఉత్తరప్రదేశ్‌ పాఠ్యాంశ నిర్ణాయక కమిటీ ముందు బోధాయనుని ప్రమేయం గురించి చెప్తే, అందరూ వ్యతిరేకించారు. అప్పడు జోషి, ఎడ్వర్డ్ టెల్లర్‌కు సంబంధించిన ‘సింప్లిసిటీ ఎండ్‌ ద సైన్సు’ పుస్తకం ముందు పెట్టి ఆయనే పేర్కొన్న బోధాయన ప్రమేయం మూలాలను చూపించాడు. ఈ ఎడ్వర్డ్ టెల్లర్‌ హైడ్రోజన్‌ బాంబు తయారీలో పాత్రధారి. నోబెల్‌ బహుమతి గెల్చుకొన్న విజేత. పైథాగరస్‌ పేర్కొన్న ప్రమేయాలకు బోధాయనుడి సూత్రాలే మూలం అన్నాడు. అదే విషయాన్ని తర్కబద్ధంగా వాళ్ల ముందు పెడితే చివరికి దానికి ‘పైథాగరస్‌ బోధాయన ప్రమేయంగా’ పేరు పెట్టారట! ఎంత విచిత్రం!!

రసవిద్య మన దేశంలో ఎంతో ప్రాచీనమైంది. నాగార్జునుడిని గొప్ప రసవిద్య తెలిసిన వ్యక్తిగా ప్రాచీన రసాయన గ్రంథాలు పేర్కొన్నాయి. రాగి, సీసం, బంగారం, తుత్తునాగం, వెండి వంటి వాటిని శుద్ధి చేసే విధానం ఈ దేశంలో అత్యంత ప్రాచీన కాలంలోనే ఉందని దాదాపు 50 ప్రాచీన రసగ్రంథాలు తెలియజేస్తున్నాయి. రస విద్య ద్వారా సప్త ధాతువుల్లో ఓజస్సు తగ్గకుండా ఎలా ఉండాలో మనవాళ్లు విశేష పరిశోధన చేశారు. ఆచార్య నాగార్జునుడి మార్గంలోనే ఐజక్‌ న్యూటన్‌ పరిశోధనలు చేసి రసవిద్య అంతు చూడాలనుకొన్నాడు. తన సహచర పరిశోధక మిత్రుడు రాబర్ట్ బోయల్‌తో కలిసి భారతీయ రసవిద్య ఆధారంగానే హేమ తారక విద్యను తెలుసుకోవాలనుకొన్నా మిత్రుడు మరణించడం, పెంపుడు కుక్క కొవ్వత్తిని తినడం ఆ ప్రయోగశాల బుగ్గిపాలయిందని చెప్తారు. న్యూటన్‌ రసవాదంపై చేసిన అంశాలు ఇప్పటికీ డీకోడ్‌ చేయలేకపోతున్నారని అనేక గ్రంథాలు ఆధారం ఇస్తున్నాయి. వేల యేళ్లనాడే అనేకానేక పరిశోధనలకు నెలవైన భారత రసాయన విద్య ఎందుకు మధ్యలో లుప్తమైందో ఆలోచించాలి!

కాంతి వేగాన్ని క్రీ.శ. 1675లో రోమర్‌ లెక్కించాడని చెప్తారు. కాని భారతీయ ప్రాచీనమైన ఋగ్వేదానికి సాయణాచార్యులు 14వ శతాబ్దంలోనే భాష్యం రాశారు. వారు కాంతి వేగం గురించి వ్యాఖ్యానిస్తూ ‘అర నిమిషానికి 2202 యోజనాల దూరం ప్రయాణించు ఓ కాంతి కిరణమా! నీకు నమస్కారం’ అంటారు. ఇదే విషయాన్ని 20వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు మెకీల్‌సన్స్, మోర్లే కాంతి వేగాన్ని సెకనుకు 1,86,300 మైళ్లు అని పేర్కొన్నారు. సాయణులు చెప్పిన విషయాన్ని క్రీ.శ. 1890లో మాక్స్ ముల్లర్‌ సంకలనం చేసిన ‘ఋగ్వేదం’ అనే ఆంగ్ల గ్రంథంలో కూడా ప్రస్తావించారు.

అనంతమైన కాలగణనను అరచేయిలో చెప్పే పంచాంగ, జ్యోతిష విజ్ఞానం వదిలి పెట్టి చిలక శాస్త్రాల జోస్యాలకు అలవాటుపడిన మనకు మన ప్రాచీనుల పరిజ్ఞానం ఎలా అర్థం అవుతుంది? సంస్కృతంలో కాలగణనకు చెప్పే ‘హోర’ హవర్‌ గా మారడం ఎలా సాధ్యమయిందో తెలిస్తే మన ప్రాచీనుల కాల చక్రం నేడు గ్రహించగల్గుతాం. మన చుట్టూ నడయాడిన బాలరాజు మహర్షి గొప్పతనాన్ని ఎవరో జర్మన్‌ వాళ్లు చెప్పాక గాని మనకు తెలిసిరాలేదు. ‘ఔషధం కాని మొక్కలేదు’ అన్న ఆయన సూత్రం ప్రకారం మన ప్రాచీన వైద్య గ్రంథాలలో 1,50,000 ఔషధ మొక్కల వివరాలున్నాయంటే మనం నమ్మగలమా! ప్రాచీన కాలంలోనే మరుగుజ్జు వృక్షాలను (బోన్సాయ్‌ మొక్కలు) గురించి చరకుడు తన చరక సంహితలో ‘వామన తను వృక్షాది విద్య’ ప్రత్యేక ప్రకరణంలో పేర్కొన్నాడు. ఆచరణలో పెట్టాడు. స్త్రీ అండాన్ని, పురుషుని శుక్రకణాన్ని టెస్ట్ ట్యూబ్‌లో కలుపుతారు. ఫలదీకరణం జరిపి పిండాన్ని స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. ఇది ఆధునిక కాలంలో జరుగుతున్న ప్రక్రియ. ఐదు వేల యేళ్ల క్రితమే వ్యాస మహర్షి గాంధారి గర్భంలోని పిండాన్ని నూటొక్క కుండల్లో ప్రవేశపెట్టి కౌరవ సంతానోత్పత్తికి ఆద్యుడయ్యాడు. గర్భ మార్పిడి, వీర్య దానం వంటి విషయాలను పిండోత్పత్తి శాస్త్రంగా ఆనాడు అభివృద్ధి పరిచారు. ఇది ఎందరికి తెలుసు?

లింగమార్పిడి, మంత్ర తంత్రాలు, అంతరిక్ష విహారం, ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం, ప్రాచీన అణు విజ్ఞానం, గ్రహణాలు, కృష్ణబిల సిద్ధాంతం, పంచభూతాల పరిజ్ఞానం, నేలలో దాగిన ఖనిజ విజ్ఞానం, పాదరస ఔషధాలు, రాశిచక్రాలు, నవగ్రహ విజ్ఞానం, విజువల్‌ చలనం, విశ్వ పరిజ్ఞానం, చెక్కుచెదరని లోహస్తంభ నిర్మాణం, భూతద్దాల తయారీ, తాళపత్రాలను గ్రంథాలకు వాడడం, నగర నిర్మాణం, అద్భుతమైన సంస్కృత భాష, సంఖ్యామానం, స్ట్రింగ్‌ థియరీ, బిగ్‌ బ్యాంగ్‌ థియరీ, శబ్దంలోని మర్మం, రూపంలోని రహస్యం, భారద్వాజ వైమానిక శాస్త్రం, నౌకా నిర్మాణం, వ్యవసాయ విజ్ఞానం, క్రీడలు, అవధానం, కవిత్వం, భారతంలోని యుద్ధ నైపుణ్యాలు, స్వరాలతో సంగీత శాస్త్రం, శిల్పం, నృత్యకళ, చిత్రలేఖనం, సాముద్రికం, కామశాస్త్రం, మంత్రం, వాస్తు, ఋషుల శాంతి దృక్పథం, అర్థ, న్యాయశాస్త్రాలు... ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయులు వేలు పెట్టని విద్య లేదు. అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయులు ఈ విషయాలను వాళ్ల కాలానికి తగినట్లుగా ఆచరణలో పెట్టారు. ఇప్పుడు గొప్ప విజ్ఞాన దేశాలుగా చెప్పేవి పుట్టని కాలంలోనే ఇలాంటి తొలి అడుగు వేసిన భారతీయ విజ్ఞాన వేత్తలను గుర్తించేదాకా మనకు పోరాటం తప్పదు.

సైన్సు అనగానే తామే దాని టేకేదార్లమని ప్రగల్భాలు పలికే వాళ్లు సైన్సు వల్ల జరిగే అభివృద్ధిని వ్యతిరేకిస్తారు. సైన్సు అంటే బ్యూరెట్టు, పిప్పెట్టు, ప్రయోగశాల అని మాత్రమే భావించి మాట్లాడే అజ్ఞాన వేదికలకు చెప్పలేక పోవచ్చు కాని సమతుల్య మనస్సుతో అధ్యయనం చేసే వాళ్లను ఆహ్వానించవచ్చు. సైన్సు అంటే అధ్యయనానికి, ప్రయోగానికి ఓ ప్రక్రియ. అంతేకాని అదో జడ పదార్థం కాదు. ఏమీ తెలియకుండానే ప్రాచీన భారతీయులు ఇన్ని ప్రక్రియలకు సంబంధించిన ఊహలు చేయగలిగారు. భారతీయులకు ఎన్ని విద్యలు తెలిసినా మనం ఎక్కడి నుండి వచ్చాం? మనం ఎవరం? మనం ఎక్కడికి వెళ్లాం? అన్న మూడు ప్రశ్నల చుట్టే తమ శాస్త్రాలను తిప్పుకొన్నారు. ఉత్తర కొరియా, పాకిస్థాన్‌లలాగా అణు బాంబులను చేతిలో పట్టుకొని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడలేదు. అలాంటి మహోన్నత భారత వారసత్వాన్ని అనుసరించి డా. ఏ.పి.జే. అబ్దుల్‌ కలాం కూడా భారతీయ అణు విజ్ఞానం మన రక్షణకే గాని ఇతరులపై ప్రయోగానికి కాదు అన్నాడు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ తన చివరి ముప్పై ఏళ్ళలో సాధించిన సాపేక్షతా సిద్ధాంతం ప్రపంచానికి కొత్త వెలుగైనా మానవ జీవన మూల్యాలను చెప్పే భారతీయ తత్వ శాస్త్రాలవైపు మొగ్గు చూపాడు. అందుకే సున్నాను కనుగొన్న భారతీయులకు ప్రపంచం ఋణపడి ఉందన్నాడు ఐన్‌స్టీన్‌. వాస్తవాలు తెలుసుకోకుండా కుయుక్తులతో కాలం గడిపే బుద్ధిజీవులు సమతుల్యమైన మనస్సుతో అధ్యయనం చేస్తారని ఆశిద్దాం.

*******************************
✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
ఎడిటోరియల్ :  వ్యాసం :  ఆంధ్రజ్యోతి 



‘‘కుండను చూస్తున్న వ్యక్తి తాను కుండకన్నా వేరుగా భావించినట్లే శరీరాన్ని చూసి దానికన్నా నేను వేరు అనే భావన కలిగి ఉండాలి’’ అని తత్వవేత్త అష్టావక్రుడు చెప్పాడు. ఇదే సత్యాన్ని వశిష్ఠుడు తన విశిష్టమైన యోగం ద్వారా శ్రీరామునికి అందించాడు. ఈజ్ఞాన పరంపర ఉపనిషత్తుల ద్వారా యోగ శాస్త్రం ద్వారా, తత్త్వశాస్త్రం ద్వారా లోకానికి అందింపబడింది. అలాంటి తత్త్వ దృష్టిని అందుకొని మన కళ్లముందు నడిచే గురుతత్వంగా ఆత్మసాక్షాత్కార శాస్త్రాన్ని అందిస్తున్న గురువులు శ్రీశ్రీ గెంటేల రమణులు..!

1963 జూలై 17న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, గెంటేల నరసింహారావు పుణ్యదంపతులకు జన్మించారు. గొప్ప సద్గురువుగా పేరొందిన శ్రీ సద్గురు శివానందమూర్తిగారి మార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక జీవనంలో పూర్ణత్వం సాధించారు. దేశ విదేశాల్లో ఆధ్యాత్మికతను వ్యాప్తిచేసి బలుసుపాడులోని వారి పూర్వీకుల వ్యవసాయ క్షేత్రానే్న ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్ముఖమైన యోగసాధనతో భక్తులమధ్య ప్రేమూర్తిగా వెలుగొందుతూ ప్రబోధం, వౌనం రెండూ ఏక కాలంలో ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఒక ఊరి కథ పేరుతో అందించిన ఆత్మకథలో నమక చమకాల వైవిష్ట్యాన్ని ఆవిష్కరించారు. శ్రీమణీయం, గీతాసారం, అష్టావక్రగీ, సత్యము-అవగాహన, సత్యదర్శనం పేరుతో వారు అందించిన పుస్తకావళి వారి అంతర్ముఖీనమైన ఆత్మజ్ఞానం వెల్లడిస్తున్నాయి.


జిడ్డు కృష్ణమూర్తి-రమణమహర్షి తత్వంలోని వర్తమాన ఆధ్యాత్మిక విద్యను ఆకళింపు చేసుకొన్న వారు లోకానికి తమ బోధ ద్వారా సూక్ష్మంగా అందిస్తున్నారు. 1996లో బలుసుపాడులో సద్గురు శివానందమూర్తిగారి విగ్రహ స్థాపన చేసి ఆశ్రమాన్ని సుసంపన్న ఆత్మక్షేత్రంగా మలచి ‘గురుధామ్’ అనే పేరు పెట్టుకొన్నారు. దేశాన్ని -దైవాన్ని సమానంగా ప్రేమించే శివానందమూర్తిగారి అడుగుజాడల్లో వేలాదిమందికి అక్కడ ఆధ్యాత్మిక వికాసం కలుగుతున్నది. దీనితోపాటు వారి పరిభాషలోనే చెప్పాలంటే ‘‘చెట్టు చేమ, చీమ, దోమ, పశువు, పక్షీ, నీరూ, నింగీ, నేల, ఆకాశం అన్నీ పరమేశ్వర శక్తిని వ్యక్తీకరించే రూపాలే. పదాలన్నీ ఆయనే. అంతా శివపదమే’’ అన్నట్లు దేశాన్ని దైవంగా ప్రేమించాలని చెప్తారు.

మనం చాలాసార్లు గతించిన గురువులే గొప్పవాళ్లు అంటుంటాం. మన కళ్లమందు నడిచే మహాత్ములను గుర్తించం. మన కాలంలో జీవిస్తున్న అద్భుతమైన ఆత్మజ్ఞాని వెంటరమణులు! వారి ఆత్మజ్ఞానం అంతా ప్రేమతత్వమే! వ్రేలికున్న ఉంగరంలా, ముంజేతికున్న కంకణంలా, కంఠాభరణంలా మనలోనే వున్న ఆత్మ విద్యను మరిచిపోయి ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. 

అలాంటివాళ్లను స్వస్వరూపానుసంధానం కలిగించి ‘నీవు ఎవరు?’ అన్న సత్యాన్ని శ్రీ వెంకటరమణులు ప్రబోధిస్తారు. సారవంతమైన నేలలో విత్తనాలు పారేసినా మొలచినట్లు వారి సన్నిధిలో అలా కూర్చుంటే చాలు ఆత్మతత్వం అవగతం అవడం మొదలవుతుంది. దృష్టి వున్నా గ్రుడ్డివారిలా ప్రవర్తించే వాళ్లకు వెంకటరమణులు ఒక దారిదీపం. వారి ప్రబోధానుసారం వెళ్లడం మొదలుపెడితే మాయా ప్రంచంలోని వస్తువుల అసలు రహస్యం తెలుసుకొని సత్యదర్శనం చేస్తాం. వేగంగా వీచే గాలివల్ల మేఘాలు మాయమై ఆకాశం నిర్మలమైనట్లు మనలోని దుర్గుణాలు పటాపంచలవుతాయి.

కుతర్కం లేని ఆధ్యాత్మిక స్వచ్ఛత వారి ప్రబోధం నిండా ఉంటుంది. బురదలో దొర్లాడుచూ అమృతకలశాన్ని వదలిపెట్టినట్లు ఈ రోజు మనుషులు ఆత్మ విద్యను విస్మరించి వెర్రెత్తిన శునకాల్లా సంచరిస్తున్నారు. అలాంటివారికొరకు గురువుగా వెంకటరమణులు ప్రేమతత్వం, సూక్ష్మబుద్ధి, వౌనసాధన, ఆత్మ విద్యాప్రబోధం అనే త్రివిధమైన బోధాధికార అర్హతలను అందించి విజ్ఞులుగా తయారుచేస్తున్నారు.

కర్పూరం తన సుగంధం అందించినట్లు వారు తమ తపోశక్తిని ఎల్లడెలా వ్యాపింపజేస్తూ బ్రహ్మజ్ఞానమగ్నులై ఉన్నారు. వెంకటరమణులు శరీర ధ్యాసను వదలిపెట్టి జాగ్రదవస్థలో కూడా నిర్వికారులుగా ఆత్మజ్ఞానం ప్రబోధిస్తున్నారు. పాదరసం అగ్నిలో పడినా దహించని విధంగా ఆయన సంసారంలో వుండి సత్సంగం వదల్లేదు. ‘‘సన్యాసంలో ఉండి నియమంగా ఉండడం కాదయ్యా; సంసారంలో వుండి నిష్ఠగా ఉండడం నేర్చుకో’’ అని ఓ తత్వవేత్త చెప్పినట్లు శ్రీ వేంకటరమణులు సంసార భౌతికంగా తన చుట్టూ పెట్టుకొనే సత్య వివేచన చేస్తున్నారు. శ్రీ లాహిరీ మహాశయునిలా సంసారంలో ఉంటూనే ఓంకార జ్ఞానం లోకానికి అందిస్తున్నారు. రమణ మహర్షిలా శబ్దాలమధ్య నిశ్శబ్దాన్ని సాధించారు. పిల్లగాలులు మఱ్ఱివృక్షాన్ని ఏమీ చేయనట్లు ఈ లౌకిక బంధాలేవీ ఆయనను ఆటంకపరచలేదు. బ్రహ్మజ్ఞానమగ్నమైన రమణుల సాధనను చుట్టుప్రక్కనున్న విషయ వాసనలు అణువంత కూడా చలింపజేయలేదు.

నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయన్నట్లు, గోవులు ఇతరుల కొరకే పాలు ఇస్తాయన్నట్లు, వృక్షాలు పరులకోసమే ఫలించినట్లు వారి ఆత్మజ్ఞాన సంపదంతా తనవద్దకు వచ్చినవారి జ్ఞాన తృష్ణను తీర్చడానికే వినియోగిస్తున్నారు. చెప్పులు వేసుకొని తిరిగేవాడికి భూమి అంతా చర్మంతో కప్పబడినట్లు అనిపిస్తుంది. మనస్సు మొత్తం బ్రహ్మజ్ఞానంతో నిండితే లోకమంతా పరబ్రహ్మ స్వరూపంగా కనిపిస్తుంది. ఇపుడు వెంకటరమణుల స్థితి అది. అందుకే వారు తన స్వగ్రామంలోని ప్రతి ఘటనలో శివతత్వాన్ని దర్శించారు. ప్రతి విషయంలో ఆత్మ దృష్టిని ప్రదర్శించారు. ‘‘నూర్పుడి చేసి ఉంచిన ధాన్యపు రాశులు పొలాల్లో ఏర్పాటుచేసిన కళ్లాలను చూస్తుంటే నమఃఉర్వర్యాయ చ ఖల్యాయచ’’ అన్న శ్లోకం స్ఫురించింది. ఉర్వర్యాయచ -్భమియందున్న స్వామికి, ఖల్యాచ -్భమిపై వున్న ధాన్యపు రాశిగా వున్న స్వామికి నమస్కారం’’ అన్న దాన్ని ఇంకా వివరిస్తూ ‘‘పంటను పండించే భూమికి, ధాన్యం నూర్పిడి జరిగే ప్రదేశంగా ఉన్న దైవస్మరణలో కార్యకారణాలుగా వున్న శివస్మరణే కన్పించింది’’ అంటారు.

అలులు లేని సముద్రంలా ఉండే ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ ప్రేమమయమై వుంటుంది. వెంకటరమణులు నిత్యసంతోషిగా ఉంటూ గాలిలేనిచోట వున్న దీపంలాగా వారి మనస్సును స్థిరపరచుకొని ఆధ్యాత్మిక ప్రబోధనం చేస్తున్నారు. వర్తమాన విషయాలపై ఆసక్తి లేకుండా, భావిజీవితంపై ఆశ లేకుండా, గడిచిన అనవసర విషయాలను స్మరించకుండా అనన్య చింతనతో భగవద్ధ్యానం చేస్తుంటారు. ఆయన ఆలోచనాలోచనాలకు అందించిన ఆత్మగత విషయాలను పుస్తక రూపంలో, సత్సంగం రూపంలో ప్రతి గురువారం , ప్రతి ఆదివారం ఉదయం వేళ జిజ్ఞాసులకు అందిస్తున్నారు.

రమణులు రంగు రంగుల వస్త్రాలు ధరించకుండా, దండకమండలాలు లేకుండా, గండపెండేరాలు తొడగకుండా రుషిలా జీవించుకుంటూ ఆధ్యాత్మిక బీజ వ్యాప్తి చేస్తున్నారు. వెంకటరమణుల శాంతమైన మృదుస్వభావం, స్థిరమైన సద్గుణాలు, శీలంతో కూడిన పవిత్ర జీవనం వారివద్దకొచ్చే వారి ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గాలు. అనేక వృక్షాల మధ్య కల్పవృక్షంలా శోభిల్లే ఆ గురుమూర్తి నిర్గుణ తత్వానికి సగుణ సాకార జీవనానికి వారధిలా భాసిల్లుతున్నారు.

అద్దం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనలో ఎదుటివారి ముఖాన్ని చూపించినట్లు వెంకటరమణులు తమ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుసరణ ద్వారానే ముముక్షువు కావలసిన జ్ఞానతత్వం నిర్దేశిస్తారు. ఎవరికి ఏ సమయంలో ఎంత మోతాదులో ఆధ్యాత్మిక పరిజ్ఞానం అందించాలో ఆయనకు తెలుసు. ఏనుగు ఒకే తొండం ఎలాగ గాలినీ, నీటినీ స్వీకరిస్తుందో మనకున్న ఒక్క మనసే ఆధ్యాత్మిక, లౌకిక జీవనాలను రెంటినీ కొనసాగిస్తుంది. నిజానికి అవి రెండూ విడిగా లేవు. సాధకులు తమ సాధనద్వారా కఠోర శ్రమ చేసి ఫలితాలను సాధిస్తారు. సామాన్యులు అది చేయలేరు అని వెంకటరమణులు బోధిస్తారు. అందుకోసం రమణ మహర్షి వంటివారు సామాన్యులకు జీవనంలోని విషయాల్లోనుండే సిద్ధంగా వుండే దైవానుభవాన్ని తెలియజేసే అద్భుత విచారణామార్గాన్ని అందించారని చెప్తారు.

విచారణామార్గంలో సాధన అంటే సత్యశోధననే అంటారు వెంకటరమణులు. ఈ విచారణ ఒకరకంగా జ్ఞానయోగ సాధన. అలా చేస్తూపోయాక మన ప్రమేయం లేదని తెలియడమే అంతరార్థమని అంటారు. ముక్తి మన సహజ లక్షణం అంటారు వెంకటరమణులు. దానికి ఓ అద్భుతమైన ఉపమానం చెప్తారు. చెట్టునీడలో వున్న మనిషి కావాలని నీడ నుండి బయటకు వచ్చి ఎండ వేడిని అనుభవించి, విశ్వప్రయత్నం చేసి మళ్లీ నీడలోకి రాగానే సంతోషంతో ‘‘అమ్మయ్యా, ఇప్పటికైనా నీడని చేరుకున్నాను’’ అన్నట్లే ఇది అంటారు.
ఇలా అఖండమైన ఆత్మజ్ఞానంతో ప్రబోధ ప్రవాహంతో కొనసాగుతున్నారు. మనం చూడని రమణమహర్షి, మెహర్‌బాబా, లాహిరి మహాశయునిలా ఎన్నో చెప్పుకొంటాం. మన కళ్లముందు నడుస్తున్న ఆత్మజ్ఞాని శ్రీ గెంటేల వెంకట రమణులు. ఎవరు నిరంజనుడైన నిర్గుణ పరబ్రహ్మను గూర్చి చింతిస్తారో వారే సద్గురువులని శ్రీ సమర్థ రామదాస స్వామి చెప్పినట్లు అలాంటి గొప్ప సద్గురువు శ్రీ గెంటేల వెంకటరమణులు. వారి ఆధ్యాత్మిక ఫ్రబోధనం అనుసరణీయం. వారి అపార తపోజీవనం అమృతతుల్యం.

*********************************
✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ధర్మభూమి : ఆంధ్రభూమి 


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మరణించడానికి పదిరోజుల ముందు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి రోజుల్లో తాను విడుదల చేసిన ఓ క్యాసెట్టుకు ‘జామాతా దశమగ్రహం’ అని పేరు కూడా పెట్టారు. మరణించడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో- ‘1994 ఎన్నికల ముందే కొంతమంది కాంగ్రెస్ నాయకులతో చంద్రబాబు సంప్రదింపులు జరపడమేగాక, మా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డబ్బు పంపిణీ చేశారు.. తెలుగుదేశం పార్టీకి 140 మేరకు మాత్రమే సీట్లు లభిస్తే తనవర్గం ఎమ్మెల్యేలతో పార్టీనుండి బయటపడి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవిని బేరమాడి సాధించాలనేదే అతని ఉద్దేశమని తర్వాత తెలిసింది’ అన్నారు. ఆరోపణల్లా కాకుండా ఎన్టీఆర్ ఏకపక్షంగా చెప్పిన మాటలివి. ఈరోజు తెదేపా అధినేత అయిన చంద్రబాబు, ఎన్టీఆర్ వారసులమని పూటకు వందసార్లు చెప్పే బాలకృష్ణ, లోకేశ్ కూడా ఎన్టీఆర్‌ను- నటనా కౌశలంలోగాని, రాజకీయ చాతుర్యంలోగాని గొప్పగా పొగిడేస్తుంటారు. ఎన్టీఆర్ గొప్పవాడా? ఆయన చెప్పిన మాటలు గొప్పవా? అన్నది ఈ వీరవిధేయులు ఇప్పుడు తేల్చాలి.

ఆనాటి నుండి అధికారం కోసం తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌తో కలవాలని చంద్రబాబు పడ్డ తపనను ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పారు. కానీ, ఇటీవల మోదీ పుణ్యాన చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరడం జరిగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరి నుండి ‘కేంద్రంపై యుద్ధం’ పేరుతో చంద్రబాబు ప్రతిరోజూ నరేంద్ర మోదీని తన అనుచర గణంతో తిట్టిస్తున్నాడు, తిడుతున్నాడు. లేని శత్రువుతో యుద్ధం చేయడం చంద్రబాబుకు ఆదినుండి అలవాటే. ఒకప్పుడు లక్ష్మీపార్వతి అనే లేని శత్రువుపై యుద్ధం చేసి విజయం సాధించాడు. తనకు అపుడు అవసరమైన ఆయుధాలుగా దగ్గుబాటిని, హరికృష్ణను ఉపయోగించుకున్నాడు. తనకు ఇష్టం లేనివాళ్లను ఎలా బయటకు పంపాలో, తనకు ఇష్టమైన వాళ్లను ఎలా దగ్గరకు తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఉపేంద్ర, జానారెడ్డి, చింతా మోహన్, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముద్రగడ పద్మనాభం, దగ్గుబాటి, హరికృష్ణ వంటి హేమాహేమీలను పొమ్మనకుండా ఆయన ఎలా పొగబెట్టించాడో తెలుగుదేశం పార్టీ చరిత్ర చదివితే ఎవరికైనా తెలుస్తుంది. సరిగ్గా ఇనే్నళ్లకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి బలంలేని భాజపాను, మోదీని విలన్లుగా చూపిస్తూ ఆంధ్ర ప్రజల మనస్సుల్లో విద్వేషం నింపాడు.

ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయానికి అది పరిపక్వత పొంది బాబు కాంగ్రెస్‌తో జతగట్టాడు. కర్నాటక ఎన్నికల తర్వాత భారత రాజకీయాలకు తానే దిక్సూచినని, అన్ని పార్టీలనూ తా నే ఒకే వేదికపైకి తెచ్చానని చెప్పాడు. నిజానికి బాబు తో కలవడం కాంగ్రెస్‌కు ఇష్టం వుందో లేదో కొన్నాళ్లయితే విహెచ్ లాంటి నేతలు ఎలాగూ చెబుతారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో తప్ప మిగతా రెండు రాష్ట్రాల్లో దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా ఉంది. ఇక మరోవైపు బిఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్లతో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు నిద్రపట్టడం లేదు. 

ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ,బిఎస్పీ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ను దూరం పెట్టినా వినయంగా రాహుల్ గాంధీ వారి పొత్తును స్వాగతించాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేని స్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో తేజస్వీ, బెంగాల్‌లో మమత కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లిస్తారో చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా బాబు కారణమైనా, ఆంధ్రా లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు ఇస్తాడో తెలిస్తే ఆ రెండు పార్టీల మధ్య ‘ఫెవికాల్ బంధం’ ఎంతటిదో తెలిసిపోతుంది.

చంద్రబాబు రాజకీయ పాఠశాలలో పిహెచ్‌డి చేసిన కేసీఆర్ కనుమ రోజున కేటీఆర్‌ను వైకాపా అధినేత జగన్ దగ్గరకు పంపి చర్చలకు తెరతీయడంతో రేపటి తెలుగు రాజకీయాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే. గత పది నెలలుగా మోదీ, కేసీఆర్, జగన్, పవన్ అంటూ రోజూ ఒకే పల్లవితో పాట పాడితే కొంత భాగానికి తథాస్తు దేవతలు ఆశీర్వాదం ఇచ్చారు. ఇదంతా చంద్రబాబుకు అసహనం, అశుభానే్న కలిగించేవే.

లేని శత్రువులతో యుద్ధం చేసిన ప్రతిసారీ బాబుదే విజయం. కానీ వై.ఎస్., కేసీఆర్, మోదీలను అలాంటి దృష్టితో చూడకూడదు. గతంలో వైఎస్ చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరం పెట్టాడు. ఆ సమయంలో కేసీఆర్ కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా చంద్రబాబును అధికారం నుండి దూరం పెట్టేందుకు వ్యూహం చేశాడు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు తన చుట్టూ ఉన్నవాళ్ళలో కన్పించిన మొదటి శత్రువు చంద్రబాబే. దానితో తెలివిగా ‘ఓటుకు నోటు కేసు’ను బాగా ఉపయోగించుకోవడమే గాక చంద్రబాబు ఛాయలు తెలంగాణ ప్రజలపై ఉండకూడదని సిద్ధాంతపరమైన వ్యూహంతో దెబ్బగొట్టాడు. ప్రభుత్వ పనితీరు, పరిపాలనా దక్షత చంద్రబాబు స్వంతం కాదని నిరూపించే ప్రయత్నమే మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలు.

ఈ క్రమంలో గుణాత్మక మార్పుతో దేశాన్ని ఏకం చేస్తానంటున్న కేసీఆర్ రా జకీయ రణనీతి చంద్రబాబు అవునన్నా కాదన్నా ఆయనను నిలువరించడమే. ఈ పరిణామాలను ముందే ఊహించిన బాబు సహనం కోల్పోయి మోదీని అకారణంగా తిట్టడం మొదలుపెట్టాడు. కల్లు త్రాగించిన కోతికి నిప్పు తొక్కించి దయ్యం పట్టినట్లు, తేలు కరిచినట్లు ప్రధాన స్రవంతి తెలుగు మీడియాను మోదీపైకి ఉసిగొల్పాడు. తెలుగు జాతి పేరుతో, ఉత్తర - దక్షిణ వాదం పేరుతో, సమాఖ్య స్ఫూర్తి పేరుతో రోజూ అడ్డగోలు వాదనలు చేస్తున్న ఓ వర్గం మీడియా ఇప్పటికైనా దీనికి తెరదించకపోతే విద్వేషాలు పెరిగే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రులుగా పనిచేసినపుడు లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని రైల్వే ప్రాజెక్టులు ఇచ్చారో చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి బాబు మాట్లాడితే మంచిది. బాబ్లీ ప్రాజెక్టు, అల్మట్టి ప్రాజెక్టుల ఎత్తు పెంచి దిగువకు నీళ్లురాకుండా చేసిన మహారాష్ట్ర, కర్నాటక నాయకుల చేత క్షమాపణ చెప్పించి ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడాలి. ఐటీ మాత్రమే అన్నం పెడుతుంది, మిగతాదంతా దండుగ అని ప్రపంచానికి చాటిన మహానేతలు, తెలుగు భాష గురించి చెప్తే ప్రజలు వింటారు. రోజూ ఉత్తరాది నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దక్షిణాదిపై పెత్తనం గురించి ప్రజలకు చెప్పాలి. ఏనాడూ ప్రజలను కలవకుండా తమకు తామే రాజ కుటుంబీకులమనుకునే సోనియా, రాహుల్ గాంధీల అహంకారం గురించి మాట్లాడి తర్వాత మోదీ నిరంకుశత్వం గురించి ప్రజలకు వివరించాలి. కామన్‌వెల్త్, బొగ్గు, 2జీ, 3జీ, అగస్టా వెస్ట్‌ల్యాండ్, అండర్సన్.. వంటి కుంభకోణాలను గురించి మొదట వివరణ ఇచ్చి రాఫెల్ గురించి ప్రశ్నించాలి. ఏ వ్యవస్థలను ఉపయోగించుకొని ఈ అరవై ఏళ్లు పాలన జరిగిందో మొదట ఓ శే్వతపత్రం ప్రకటించి ఇపుడు నీరుగారుతున్న వ్యవస్థలను గురించి చర్చ మొదలుపెట్టాలి. ఇవన్నీ గాలికి వదలిపెట్టిన చంద్రబాబు ఒకే దెబ్బతో మోదీ, జగన్, పవన్‌లను కొట్టాలనుకుంటే- మొత్తానికి ‘సీన్’ రివర్సవుతుంది!

ఆంధ్రప్రదేశ్ రాజధానికి ‘అమరావతి’ అని పేరు పెట్టడం, బౌద్ధాన్ని గొప్పగా చూపించడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. వై.ఎస్.జగన్‌కు ఓటు బ్యాంకుగా వున్న దళితులను తనవైపు తిప్పుకోవడమే గాక, జపాన్, సింగపూర్ దేశాలను ఆకర్షించడం, రాజధాని పేరుతో చేసిన ‘నీళ్లుకారే’ నిర్మాణాల గురించి జగన్, కేసీఆర్‌లు చెప్పడం, కేంద్రం ఇచ్చిన డబ్బులు, వాటిని ఖర్చుపెట్టిన వైనం గురించి ఇపుడిపుడే ప్రజలకు నిజం తెలుస్తుంది.

 రాజధాని భూముల వెనుక జరిగిన ల్యాండ్ పుల్లింగ్ పెద్ద కుంభకోణం అని ప్రతిపక్షాలు ఆరోపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. రేపు మళ్లీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వస్తే అక్కడ పెట్టుబడులు పెట్టిన నాయకుల పరిస్థితి ఏంటి? అని తెలుగుదేశం వర్గాలే అసంతృప్తితో లోలోపల రగులుతున్నాయి. ఇదంతా ముందే గ్రహించిన మోదీ మెల్లమెల్లగా అన్నిదారులు మూసేశాడు. అది తెదేపా నేతలకు ఇంకా అర్థం కావడం లేదు. ఈవిషయాలను గ్రహించిన వ్యాపారవేత్తలైన ఎంపీలు మురళీమోహన్, సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటివారు కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారు. తాడూ బొంగరం లేని ఎంపీ శివప్రసాద్ లాంటి నాయకులు ఇవన్నీ తెలియక రోజూ ప్రధానిని దూషిస్తూ పగటి వేషాలేస్తున్నారు. మిగతా ఎంపీలంతా ఈ వింత వేషాలను చూసి సరదాగా నవ్వుకొంటున్నారు.

అభద్రతాభావంతో రోజూ మీడియా సమావేశం పెట్టి తన అస్తిత్వం ప్రకటిస్తున్న చంద్రబాబుపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నట్లు ప్రతిపక్షాలు గ్రహించాయి. తిత్లీ, హుదూద్ తుపాన్లు వచ్చినపుడు సీఎంగా విశేష సేవ చేశానని చంద్రబాబు చెప్పడం ప్రచారంలో అతి అని కేటీఆర్ అన్నాడు. సీఎంగా అధికారంలో ఉన్నవారు తప్ప ఇంకొకరు అలాంటి సేవ చేయలేరు కదా? మరోవైపు చంద్రబాబుతో వేలు విడిచిన చుట్టరికం వున్న కమ్యూనిస్టులు పవన్‌ను మెల్లగా తెదేపా వైపు మళ్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పాదయాత్రతో మంచి ఊపులో వున్న జగన్‌ను కేసీఆర్ దగ్గరకు లాక్కోవడం బాబుకు అపశకునం. ఇన్ని సంఘర్షణల మధ్య ‘పార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’గా చెప్పుకొంటున్న చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలతో అందరికీ శత్రువు అవుతున్నాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఛాంపియన్‌గా నిల్చిన కేసీఆర్‌ను ఇపుడు మోదీ సహా మమత, మాయా, అఖిలేశ్, జగన్, నవీన్ పట్నాయక్‌లు నమ్ముతున్నారు. ఇదంతా చంద్రబాబుకు చిరాకు కలిగిస్తున్నది. ఎన్నికలు దగ్గరవుతున్నవేళ బాబును ఎల్లప్పుడూ కాపాడుతున్న మీడియా, ధనం, జ్యుడీషియరీ కుల వర్గాలు, తెలుగు జాతి సెంటిమెంట్, లేని శత్రువులు.. వీటిలో ఏది గడ్డిపరకలా అందుతుందో చూడాలి. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ‘‘ఆపరేషన్ ఎన్టీఆర్ డిమాలిషన్’’ ఫలితాలు వెంటాడుతున్నట్లే ఉన్నాయి. మరోసారి అదే ప్రశ్న- ఎన్టీఆర్ గొప్పా! ఆయన అభిప్రాయాలు గొప్పా!

*****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి * 
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *


సెక్యులర్‌ రాజనీతి వ్యవస్థలో అన్ని ఆయు ధాలూ ఉన్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష, దక్షిణ-ఉత్తర, ఆర్య-ద్రావిడ. ఇలా ఎన్నో విధ్వంసకర ఆయుధాలు ఆ గుంపు ప్రయోగిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు సెక్యులర్‌ ముసుగులో బ్రతికే అన్ని రాజకీయ వ్యవస్థలకు వేర్లు బలంగా ఉన్నాయి. ముందునుండి కళా, సాహిత్యం, పాత్రికేయ, మేధారంగంలో వాళ్లకు ‘రేడిమేడ్‌ సిలబస్‌’ ఉంది. కానీ జాతీయవాద దృక్పథం ఉన్న వారికి దీని లోతుపాతులు తెలియదు. ఒక అస్త్రాన్ని ఎదుర్కొనే లోపుగా వారిపై మరో అస్త్రం వచ్చిపడుతోంది. ఈ తికమక గందరగోళ పరిస్థితుల్లో లేకలేక సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన కేంద్ర జాతీయవాద ప్రభుత్వం ఇప్పుడు దుష్ప్రచారాల దుమ్ములో కూరుకుపోతోంటే జాతీయవాదులకు ఆందోళన కలుగుతోంది. ముఖ్యంగా భాజపాను అజేయశక్తిగా అన్ని రాష్ట్రాల్లో నిలబెట్టిన మోదీ, షాలను టార్గెట్‌ చేస్తూ జరుగుతున్న తెలు%
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
14 : 20 : జనవరి - 2019
సంపుటి : 71, సంచిక : 11