‘శత్రువును జయించాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు; దుష్ప్రచారం చేస్తే సరిపోతుంది’ అన్న సూత్రం కొన్ని రాజకీయ పక్షాలకు బాగా వంటబట్టింది. దేశంలో సరికొత్త అనుమానాలను పుట్టించి ప్రజల్లో ఆందోళన కలిగించడం రాజకీయ వ్యూహం. కానీ, ప్రజాస్వామ్యం పరువు బజారున పడుతోందన్న విషయాన్ని వీళ్లు విస్మరించారు. వాళ్లకు అధికారం తప్ప దేశం అవసరం లేదు. ఎలాంటి ధ్వంసరచన చేసైనా గద్దెనెక్కడం అధికార దాహార్తుల అసలు లక్ష్యం. 

రెండురోజుల క్రితం సైబర్ హ్యాకర్ సయ్యద్ షుజా అనే కొత్తపాత్రను కొందరు నేతలు తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంల (ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల)ను ట్యాంపరింగ్ చేసి భాజపా అధికారంలోకి వచ్చిందన్నది సయ్యద్ ఆరోపణ. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా గెలవడానికి కారణం ఇదే అని కూడా ఆరోపణ చేశాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేంద్రాల నుంచి ఈవీఎంలను తక్కువ పౌనఃపున్యం ఉన్న సిగ్నల్స్ ద్వారా హ్యాక్ చేశారని అతను ఆరోపణ చేశాడు. 3 జూన్ 2014న మరణించిన భాజపా నేత గోపీనాధ్ ముండే, 2 ఏప్రిల్ 2016న మరణించిన ఎన్‌ఐఏలో కీలక అధికారి తంజీల్ అహ్మద్, 5 సెప్టెంబర్ 2017న మరణించిన గౌరీ లంకేశ్ హత్యలను కూడా దీనికి జోడించారు. ముండేకు ఈ రహస్యాలు తెలిసినందువల్లే చంపేశారని, ఆయన హత్యపై దర్యాప్తు చేసినందువల్లనే తంజీల్ అహ్మద్‌ను ఆగంతకులు అంతం చేశారని, ఈ ట్యాంపరింగ్‌పై కథనాలు రాసినందువల్లనే జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను చంపారని ఓ కొత్త కథ అల్లి కేంద్రంపై ప్రజలకు అనుమానం కలిగేలా దుష్ప్రచారం మొదలుపెట్టారు.

గతంలో వాజపేయి ప్రభుత్వంలో వ్యవహార దక్షుడైన భాజపా కీలకనేత ప్రమోద్ మహజన్‌ను ఎవరు చంపించారు? జీఎంసీ బాలయోగి, ఎర్రన్నాయుడులను వివిధ ప్రమాదాల్లో ఎవరు హత్య చేయించారు? వీళ్లంతా తమకు భవిష్యత్తులో పోటీగా నిలుస్తారని చంపించారా? గొప్ప నాయకుడైన నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణంపై ఈరోజుకూ స్పష్టత ఎందుకులేదు? అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మరణంపై వేసిన జేపీసీ రిపోర్టు ఎందుకు బయటకు రాలేదు? వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని ఎవరు, ఎందుకు చంపించారని విచారణ చేశారా? ప్రతి మరణాన్ని ఏదో ఒక కోణంలో చూపించి దుష్ప్రచారం చేయాలంటే వాళ్లను ఎవరూ ఆపలేరు; కానీ అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా! ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై కథనాలు రాద్దామనుకున్న గౌరీ లంకేశ్ నడిపే పత్రిక, ఆమె వ్యాసాలు దేశాన్ని మొత్తం ప్రభావితం చేసే అంత గొప్పగా ఉన్నాయా? కర్నాటకలో రచయిత్రి, జర్నలిస్టు అయిన గౌరీ లంకేశ్ ఒకవేళ ఆమె ట్యాంపరింగ్‌పై పరిశోధన చేసినందుకే చంపేశారని ఇపు డు చెబుతున్నారు. కానీ ఆమె మరణించిన సందర్భంలో ఇంకేవో కారణాలు చెప్పారు కదా? ‘మా చచ్చిపోయిన గేదె పగిలిపోయి న కుండెడు పాలు ఇచ్చేది’ అని చెప్పే సామెతలా ఉంది కథ. ఎక్కడో మారుమూల ప్రాంతంలోని రచయిత్రిని హత్య చేసేట్టయితే, ఢిల్లీలో కూర్చొని రోజూ మోదీపై వ్యతిరేక కథనాలకు ఆజ్యం పోస్తున్న రచయితలను, జర్నలిస్టులను ఎందుకు వదలిపెడతారు? గౌరీ లంకేశ్ మరణించినపుడు కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇపుడు అదే మూసలో కొలువుదీరిన జెడిఎస్ కుమారస్వామి ప్రభుత్వం ఉంది కదా! ఈ రెండూ మోదీకి తీవ్ర వ్యతిరేక ప్రభుత్వాలే కదా! మరెందుకు గట్టి పరిశోధన చేసి దోషులను పట్టుకోలేదు?


బీఈఎల్, ఈసీఐఎల్ అనే ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అ త్యంత గోప్యంగా, భద్రత మధ్య ఈవీఎంలు తయారవుతాయి. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో ‘హాల్’కు ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదన్న వాళ్లే బీఈఎల్, ఈసీఐఎల్ పనితీరుపై వేలెత్తి చూపుతున్నారు. ఇంకో విశేషమేమిటంటే- సయ్యద్ తాను హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో పనిచేసిన సైబర్ నిపుణుడని చెప్పుకొన్నాడు. కానీ రెండు రోజుల క్రితం ఈసీఐఎల్ ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో ‘మేం రికార్డులన్నీ తనిఖీ చేసాం. అలాంటి వ్యక్తి 2009-14 మధ్య గానీ అంతకుముందుగానీ మాతో పనిచేయలేదు’ అని స్పష్టం చేసింది. అయినా తన ముఖమే చూపంచకుండా, లండన్‌లో సయ్యద్ ప్రెస్‌మీట్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటన అంతా భారత్‌లో జరిగితే విదేశాల్లో ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక రహస్యం ఏమిటి? సైబర్ హ్యాకర్ మాటలకు ఈ దేశ ప్రభుత్వాలపై ప్రభావం పడేంత బలహీనంగా మన ప్రజాస్వామ్యం, మన ఆలోచనలు ఉన్నాయా? రాఫెల్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండానే పత్రికా కథనాలతో దుష్ప్రచారం కొనసాగించినట్లే ఇదీ ఒక మానసిక వికృత క్రీడగా అన్పించడం లేదా?

ఇక ఈ స్క్రీన్‌ప్లేలో మరో గొప్ప అంశం ఉంది. రామమందిరం కేసును 2019 వరకూ విచారణ జరపడానికి వీల్లేదని సుప్రీం కోర్టును బ్లాక్‌మెయిల్ చేసి వాయిదా వేయించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ షుజా ప్రెస్‌మీట్‌కు వెళ్లాడు. యూపీఏ ప్రభుత్వంలో ఇతన న్యాయ, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈవీఎంలను భాజపా హ్యాక్ చేయిస్తుంటే అప్పుడు ఐటీ మంత్రిగా ఈయన ఏం చేస్తున్నాడు? 2017లో జరిగిన 5 రాష్ట్రాల రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఎన్నికల కమీషన్ ఢిల్లీలో అన్ని పార్టీల ప్రతినిధును ఆహ్వానించి ‘ఈవీఎంలను ట్యాం పర్ చేసి చూపించండి’ అంటూ సవాల్ చేసింది. కానీ ఆ కార్యక్రమానికి సీపియం, ఎన్సీపి నేతలు మాత్రమే వెళ్లి వాటి పనితీరు పరిశీలించి వచ్చాయి. ఈసీ సమావేశం ఢిల్లీలో పెడితే వెళ్లని పార్టీలు, 2019లో ఓడిపోవడానికిముందే ఓ కొత్త దారి వెతుక్కుంటున్నాయని విశే్లషకుల భావన. లండన్ వెళ్లి సైబర్ హ్యాకర్ల మాటలు శ్రద్ధగా వింటారు గానీ, ఢిల్లీలో ఈసీ పిలిస్తే వెళ్లరు!? 2004-2018 మధ్య ఈవీఎంలను ఉపయోగించగా కొన్ని పార్టీలు విజయం సాధించాయి. మరోసారి ఓడిపోయాయి. ఓడితే ట్యాంపరింగ్ జరిగినట్లు, గెలిస్తే ప్రజావిజయమా? 2014లో ఈవీఎంల ద్వారా గెలిచిన, సాంకేతికతకు ఆద్యుడైన చంద్రబాబు కూడా వీటిపై అనుమానాలను వ్యక్తం చేయడం విచిత్రం.

ఇటీవల కోల్‌కతలో సమావేశం జరిపిన 22 చిన్నా చితకా పార్టీల ప్రతినిధిగా మమతా బెనర్జీ ఈ విషయమై అభిషేక్ మను సంఘ్వీ, అఖిలేశ్ యాదవ్, సతీశ్ చంద్రమిశ్రా, అరవింద్ కేజ్రీవాల్‌లతో ఓ కమిటీ వేసింది. 2018 మేలో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యాలెట్ బాక్సులను నీళ్లలో పడేయడం మమత మరిచిపోయి మళ్లీ బ్యాలెట్ బాక్స్‌లు కావాలంటోంది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ‘ఈవీఎంలు వద్దు’ అనే కమిటీలో సభ్యుడు. ఇతణ్ణి భాజపా వారే గెలిపించారా? ఆ తర్వాత బిహార్ ఎన్నికల్లో- మోదీకి దీటైన నాయకుడు అని ప్రచారం పొందిన నితీశ్‌కుమార్‌ను భాజపానే గెలిపించిందా? మోదీని, భాజపాను తీవ్రంగా ద్వేషించే లాలూ పార్టీని ట్యాంపరింగ్‌తో బీజేపీ వాళ్లు గెలిపించారా? ఇటీవల పూల్పూర్, గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ-బిఎస్పీ కూటమిని ట్యాంపరింగ్ ద్వారా గెలిపించారా? నెలక్రితం జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ట్యాంపరింగ్ ద్వారానే గెలిచిందా? 2010లో ఈవీఎంల పనితీరుపై కమిటీ వేసిన కాంగ్రెస్ 2014 వరకు ఏం చేసింది? 2014 వరకు సాంకేతిక పరిజ్ఞానం అంతా తనచేతిలోనే పెట్టుకొన్న కపిల్ సిబాల్ ఇపుడు ఈ కొత్త నాటకానికి ఎందుకు తెరతీసారో తెలియదు.

కొత్తకోణంతో విషప్రచారం చేసిన షుజా,సిబాల్‌లు వ్యవస్థలను ఇంతలా అపహాస్యం చేయడం విడ్డూరం. ప్రతి సంఘటనకూ హైదరాబాద్‌కు లింక్ వున్నట్లే ఈ ఘటనకూ ఇక్కడి భాజపా నాయకుడు జి.కిషన్‌రెడ్డిని జోడించారు. హ్యాకర్ షుజాను మరో 13మందిని ఉప్పల్ గెస్ట్‌హౌజ్‌కు పిలిపించిన కిషన్‌రెడ్డి 11మందిని అక్కడే చంపించాడట! దానికి హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించి వాళ్ల ఆ లెక్కలో కలిపేసాడట! ఎంత ఆశ్చర్యం! ‘పాతబస్తీలోకి రాయలసీమ గూండాలను తీసుకువచ్చి నా ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు మా పార్టీ నాయకులే కుట్ర చేశార’ని సాక్షాత్తూ అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రకటించాడు. ఈ అలవాటున్న కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ కిషన్‌రెడ్డి పేరుతో కొత్త డ్రామాను ఆడించేందుకు షుజాను ఉసిగొల్పాడు. అసలు ఈ సయ్యద్ షుజా ఎవరో విచారణ వేగంగా చేయాలి.

హైదరాబాద్ షాదన్ కళాశాలలో బిటెక్, ఆర్‌ఎఫ్ చేశానని చెప్పే షుజా అక్కడ చదవలేదని ఆ విద్యా సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. తన తండ్రి యూసుఫ్ అహ్మద్ సయ్యద్ బీహెచ్‌ఈఎల్‌లో పనిచేశాడని, తమ కుటుంబాన్ని గృహదహనంతో చంపారని షుజా ఆరోపణ. కానీ అలాంటిది జరగలేదని ఫైర్ రిపోర్ట్స్, పోలీసులు పత్రికల్లో ప్రకటించారు. ఇలాంటి కట్టుకథలతో ఘర్షణ వాతావరణానికి తెరతీస్తున్న హ్యాకర్లు, సయ్యద్ వెనకున్న పార్టీలు, సంస్థలను నిర్దాక్షిణ్యంగా కట్టడి చేయకపోతే అబద్ధం అరవైసార్లు చుట్టివచ్చే ప్రమాదం వుంది. 37 ఏళ్ల సయ్యద్ షుజా చెప్పేదానిని నమ్మించే ప్రయత్నం చేస్తున్న 125 ఏళ్ల కాంగ్రెస్‌ను ఏమనాలి?

ఇవన్నీ వింటుంటే- ఈ ‘క్రైమ్‌స్టోరీ’లో తెలుగు నాయక రచయితలెవరో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆరోపణల్లో అసత్యాల్లో ఇక్కడి పేర్లు, వాతావరణం ఈకథలో ప్రతిబింబించింది కాబట్టి దీనిపై తక్షణ దర్యాప్తు వెంటనే పూర్తికావాలి. ‘ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్’కు చెందిన ఆశిష్ రే ఆహ్వానం మేరకు లండన్ వెళ్లానంటున్న కపిల్ సిబాల్ పాత్రపై, ఆయన వెనకున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా పాత్రలపై విచారణ జరగాలని భాజపా కోరుతున్నది.
‘దేశాన్ని కాపాడిన సర్జికల్ స్ట్రైక్‌పై సాక్ష్యం అడిగిన కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలతో దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నవారిని మాత్రం సాక్ష్యాలు అడగడం లేదు’’ అని భాజపా అంటున్నది.

అభూత కల్పనలతో, అసత్య ఆరోపణలతో సాగుతున్న ‘ఎన్నికల జూదం’ ఎలాంటి ఫలితం ఇస్తుందో చెప్పలేం కానీ మనపై మనకు నమ్మకాన్ని మాత్రం సన్నగిల్లేట్లు చేస్తున్నది. సాక్ష్యం లేకుండా అబద్ధాలను ప్రచారం చేసే ఈ ట్రెండ్ ఇంకెంత కాలం?


*****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి * 
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి