తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మరణించడానికి పదిరోజుల ముందు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి రోజుల్లో తాను విడుదల చేసిన ఓ క్యాసెట్టుకు ‘జామాతా దశమగ్రహం’ అని పేరు కూడా పెట్టారు. మరణించడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో- ‘1994 ఎన్నికల ముందే కొంతమంది కాంగ్రెస్ నాయకులతో చంద్రబాబు సంప్రదింపులు జరపడమేగాక, మా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డబ్బు పంపిణీ చేశారు.. తెలుగుదేశం పార్టీకి 140 మేరకు మాత్రమే సీట్లు లభిస్తే తనవర్గం ఎమ్మెల్యేలతో పార్టీనుండి బయటపడి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవిని బేరమాడి సాధించాలనేదే అతని ఉద్దేశమని తర్వాత తెలిసింది’ అన్నారు. ఆరోపణల్లా కాకుండా ఎన్టీఆర్ ఏకపక్షంగా చెప్పిన మాటలివి. ఈరోజు తెదేపా అధినేత అయిన చంద్రబాబు, ఎన్టీఆర్ వారసులమని పూటకు వందసార్లు చెప్పే బాలకృష్ణ, లోకేశ్ కూడా ఎన్టీఆర్‌ను- నటనా కౌశలంలోగాని, రాజకీయ చాతుర్యంలోగాని గొప్పగా పొగిడేస్తుంటారు. ఎన్టీఆర్ గొప్పవాడా? ఆయన చెప్పిన మాటలు గొప్పవా? అన్నది ఈ వీరవిధేయులు ఇప్పుడు తేల్చాలి.

ఆనాటి నుండి అధికారం కోసం తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌తో కలవాలని చంద్రబాబు పడ్డ తపనను ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పారు. కానీ, ఇటీవల మోదీ పుణ్యాన చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరడం జరిగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరి నుండి ‘కేంద్రంపై యుద్ధం’ పేరుతో చంద్రబాబు ప్రతిరోజూ నరేంద్ర మోదీని తన అనుచర గణంతో తిట్టిస్తున్నాడు, తిడుతున్నాడు. లేని శత్రువుతో యుద్ధం చేయడం చంద్రబాబుకు ఆదినుండి అలవాటే. ఒకప్పుడు లక్ష్మీపార్వతి అనే లేని శత్రువుపై యుద్ధం చేసి విజయం సాధించాడు. తనకు అపుడు అవసరమైన ఆయుధాలుగా దగ్గుబాటిని, హరికృష్ణను ఉపయోగించుకున్నాడు. తనకు ఇష్టం లేనివాళ్లను ఎలా బయటకు పంపాలో, తనకు ఇష్టమైన వాళ్లను ఎలా దగ్గరకు తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఉపేంద్ర, జానారెడ్డి, చింతా మోహన్, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముద్రగడ పద్మనాభం, దగ్గుబాటి, హరికృష్ణ వంటి హేమాహేమీలను పొమ్మనకుండా ఆయన ఎలా పొగబెట్టించాడో తెలుగుదేశం పార్టీ చరిత్ర చదివితే ఎవరికైనా తెలుస్తుంది. సరిగ్గా ఇనే్నళ్లకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి బలంలేని భాజపాను, మోదీని విలన్లుగా చూపిస్తూ ఆంధ్ర ప్రజల మనస్సుల్లో విద్వేషం నింపాడు.

ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయానికి అది పరిపక్వత పొంది బాబు కాంగ్రెస్‌తో జతగట్టాడు. కర్నాటక ఎన్నికల తర్వాత భారత రాజకీయాలకు తానే దిక్సూచినని, అన్ని పార్టీలనూ తా నే ఒకే వేదికపైకి తెచ్చానని చెప్పాడు. నిజానికి బాబు తో కలవడం కాంగ్రెస్‌కు ఇష్టం వుందో లేదో కొన్నాళ్లయితే విహెచ్ లాంటి నేతలు ఎలాగూ చెబుతారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఒక్క ఛత్తీస్‌గఢ్‌లో తప్ప మిగతా రెండు రాష్ట్రాల్లో దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా ఉంది. ఇక మరోవైపు బిఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్లతో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు నిద్రపట్టడం లేదు. 

ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ,బిఎస్పీ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ను దూరం పెట్టినా వినయంగా రాహుల్ గాంధీ వారి పొత్తును స్వాగతించాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేని స్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో తేజస్వీ, బెంగాల్‌లో మమత కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లిస్తారో చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా బాబు కారణమైనా, ఆంధ్రా లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు ఇస్తాడో తెలిస్తే ఆ రెండు పార్టీల మధ్య ‘ఫెవికాల్ బంధం’ ఎంతటిదో తెలిసిపోతుంది.

చంద్రబాబు రాజకీయ పాఠశాలలో పిహెచ్‌డి చేసిన కేసీఆర్ కనుమ రోజున కేటీఆర్‌ను వైకాపా అధినేత జగన్ దగ్గరకు పంపి చర్చలకు తెరతీయడంతో రేపటి తెలుగు రాజకీయాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే. గత పది నెలలుగా మోదీ, కేసీఆర్, జగన్, పవన్ అంటూ రోజూ ఒకే పల్లవితో పాట పాడితే కొంత భాగానికి తథాస్తు దేవతలు ఆశీర్వాదం ఇచ్చారు. ఇదంతా చంద్రబాబుకు అసహనం, అశుభానే్న కలిగించేవే.

లేని శత్రువులతో యుద్ధం చేసిన ప్రతిసారీ బాబుదే విజయం. కానీ వై.ఎస్., కేసీఆర్, మోదీలను అలాంటి దృష్టితో చూడకూడదు. గతంలో వైఎస్ చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరం పెట్టాడు. ఆ సమయంలో కేసీఆర్ కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా చంద్రబాబును అధికారం నుండి దూరం పెట్టేందుకు వ్యూహం చేశాడు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు తన చుట్టూ ఉన్నవాళ్ళలో కన్పించిన మొదటి శత్రువు చంద్రబాబే. దానితో తెలివిగా ‘ఓటుకు నోటు కేసు’ను బాగా ఉపయోగించుకోవడమే గాక చంద్రబాబు ఛాయలు తెలంగాణ ప్రజలపై ఉండకూడదని సిద్ధాంతపరమైన వ్యూహంతో దెబ్బగొట్టాడు. ప్రభుత్వ పనితీరు, పరిపాలనా దక్షత చంద్రబాబు స్వంతం కాదని నిరూపించే ప్రయత్నమే మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలు.

ఈ క్రమంలో గుణాత్మక మార్పుతో దేశాన్ని ఏకం చేస్తానంటున్న కేసీఆర్ రా జకీయ రణనీతి చంద్రబాబు అవునన్నా కాదన్నా ఆయనను నిలువరించడమే. ఈ పరిణామాలను ముందే ఊహించిన బాబు సహనం కోల్పోయి మోదీని అకారణంగా తిట్టడం మొదలుపెట్టాడు. కల్లు త్రాగించిన కోతికి నిప్పు తొక్కించి దయ్యం పట్టినట్లు, తేలు కరిచినట్లు ప్రధాన స్రవంతి తెలుగు మీడియాను మోదీపైకి ఉసిగొల్పాడు. తెలుగు జాతి పేరుతో, ఉత్తర - దక్షిణ వాదం పేరుతో, సమాఖ్య స్ఫూర్తి పేరుతో రోజూ అడ్డగోలు వాదనలు చేస్తున్న ఓ వర్గం మీడియా ఇప్పటికైనా దీనికి తెరదించకపోతే విద్వేషాలు పెరిగే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రులుగా పనిచేసినపుడు లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని రైల్వే ప్రాజెక్టులు ఇచ్చారో చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి బాబు మాట్లాడితే మంచిది. బాబ్లీ ప్రాజెక్టు, అల్మట్టి ప్రాజెక్టుల ఎత్తు పెంచి దిగువకు నీళ్లురాకుండా చేసిన మహారాష్ట్ర, కర్నాటక నాయకుల చేత క్షమాపణ చెప్పించి ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడాలి. ఐటీ మాత్రమే అన్నం పెడుతుంది, మిగతాదంతా దండుగ అని ప్రపంచానికి చాటిన మహానేతలు, తెలుగు భాష గురించి చెప్తే ప్రజలు వింటారు. రోజూ ఉత్తరాది నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దక్షిణాదిపై పెత్తనం గురించి ప్రజలకు చెప్పాలి. ఏనాడూ ప్రజలను కలవకుండా తమకు తామే రాజ కుటుంబీకులమనుకునే సోనియా, రాహుల్ గాంధీల అహంకారం గురించి మాట్లాడి తర్వాత మోదీ నిరంకుశత్వం గురించి ప్రజలకు వివరించాలి. కామన్‌వెల్త్, బొగ్గు, 2జీ, 3జీ, అగస్టా వెస్ట్‌ల్యాండ్, అండర్సన్.. వంటి కుంభకోణాలను గురించి మొదట వివరణ ఇచ్చి రాఫెల్ గురించి ప్రశ్నించాలి. ఏ వ్యవస్థలను ఉపయోగించుకొని ఈ అరవై ఏళ్లు పాలన జరిగిందో మొదట ఓ శే్వతపత్రం ప్రకటించి ఇపుడు నీరుగారుతున్న వ్యవస్థలను గురించి చర్చ మొదలుపెట్టాలి. ఇవన్నీ గాలికి వదలిపెట్టిన చంద్రబాబు ఒకే దెబ్బతో మోదీ, జగన్, పవన్‌లను కొట్టాలనుకుంటే- మొత్తానికి ‘సీన్’ రివర్సవుతుంది!

ఆంధ్రప్రదేశ్ రాజధానికి ‘అమరావతి’ అని పేరు పెట్టడం, బౌద్ధాన్ని గొప్పగా చూపించడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. వై.ఎస్.జగన్‌కు ఓటు బ్యాంకుగా వున్న దళితులను తనవైపు తిప్పుకోవడమే గాక, జపాన్, సింగపూర్ దేశాలను ఆకర్షించడం, రాజధాని పేరుతో చేసిన ‘నీళ్లుకారే’ నిర్మాణాల గురించి జగన్, కేసీఆర్‌లు చెప్పడం, కేంద్రం ఇచ్చిన డబ్బులు, వాటిని ఖర్చుపెట్టిన వైనం గురించి ఇపుడిపుడే ప్రజలకు నిజం తెలుస్తుంది.

 రాజధాని భూముల వెనుక జరిగిన ల్యాండ్ పుల్లింగ్ పెద్ద కుంభకోణం అని ప్రతిపక్షాలు ఆరోపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. రేపు మళ్లీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వస్తే అక్కడ పెట్టుబడులు పెట్టిన నాయకుల పరిస్థితి ఏంటి? అని తెలుగుదేశం వర్గాలే అసంతృప్తితో లోలోపల రగులుతున్నాయి. ఇదంతా ముందే గ్రహించిన మోదీ మెల్లమెల్లగా అన్నిదారులు మూసేశాడు. అది తెదేపా నేతలకు ఇంకా అర్థం కావడం లేదు. ఈవిషయాలను గ్రహించిన వ్యాపారవేత్తలైన ఎంపీలు మురళీమోహన్, సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటివారు కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారు. తాడూ బొంగరం లేని ఎంపీ శివప్రసాద్ లాంటి నాయకులు ఇవన్నీ తెలియక రోజూ ప్రధానిని దూషిస్తూ పగటి వేషాలేస్తున్నారు. మిగతా ఎంపీలంతా ఈ వింత వేషాలను చూసి సరదాగా నవ్వుకొంటున్నారు.

అభద్రతాభావంతో రోజూ మీడియా సమావేశం పెట్టి తన అస్తిత్వం ప్రకటిస్తున్న చంద్రబాబుపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నట్లు ప్రతిపక్షాలు గ్రహించాయి. తిత్లీ, హుదూద్ తుపాన్లు వచ్చినపుడు సీఎంగా విశేష సేవ చేశానని చంద్రబాబు చెప్పడం ప్రచారంలో అతి అని కేటీఆర్ అన్నాడు. సీఎంగా అధికారంలో ఉన్నవారు తప్ప ఇంకొకరు అలాంటి సేవ చేయలేరు కదా? మరోవైపు చంద్రబాబుతో వేలు విడిచిన చుట్టరికం వున్న కమ్యూనిస్టులు పవన్‌ను మెల్లగా తెదేపా వైపు మళ్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పాదయాత్రతో మంచి ఊపులో వున్న జగన్‌ను కేసీఆర్ దగ్గరకు లాక్కోవడం బాబుకు అపశకునం. ఇన్ని సంఘర్షణల మధ్య ‘పార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’గా చెప్పుకొంటున్న చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలతో అందరికీ శత్రువు అవుతున్నాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఛాంపియన్‌గా నిల్చిన కేసీఆర్‌ను ఇపుడు మోదీ సహా మమత, మాయా, అఖిలేశ్, జగన్, నవీన్ పట్నాయక్‌లు నమ్ముతున్నారు. ఇదంతా చంద్రబాబుకు చిరాకు కలిగిస్తున్నది. ఎన్నికలు దగ్గరవుతున్నవేళ బాబును ఎల్లప్పుడూ కాపాడుతున్న మీడియా, ధనం, జ్యుడీషియరీ కుల వర్గాలు, తెలుగు జాతి సెంటిమెంట్, లేని శత్రువులు.. వీటిలో ఏది గడ్డిపరకలా అందుతుందో చూడాలి. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ‘‘ఆపరేషన్ ఎన్టీఆర్ డిమాలిషన్’’ ఫలితాలు వెంటాడుతున్నట్లే ఉన్నాయి. మరోసారి అదే ప్రశ్న- ఎన్టీఆర్ గొప్పా! ఆయన అభిప్రాయాలు గొప్పా!

*****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి * 
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి