యోగమంటే.. భగవంతునితో కలవడం. పరమాత్మతో జీవాత్మ లయం కావడం అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. చిత్తవృత్తులను నిరోధింపజేసేది యోగమని పతంజలి చెప్పాడు. అన్ని విద్యల్లోకీ యోగ విద్య గొప్పదని శివసంహిత, ఘేరండ సంహిత చెప్పాయి. శరీర భ్రాంతిని వదిలిపెట్టి శాంతిని పొంది దైవత్వం వైపు నడిచేలా మానవులకు మార్గదర్శనం చేసేది యోగం. 

కానీ.. ఇప్పుడు యోగాను ఫిట్‌నెస్‌ ఫీట్‌గా చేసి సమాజంలోకి వదిలిపెట్టాం. యోగాను ఒక మార్కెట్‌గా మార్చేశాం. ఇప్పుడు యోగం పేరుతో మనం చేస్తున్నది అష్టాంగ యోగంలోని ప్రాణాయామ, ఆసనాలనే రెండు భాగాలు. ఇవి యోగ విద్యను గ్రహించేందుకు శరీరాన్ని సంసిద్ధం చేసే ప్రక్రియలు. శరీరంపై అభిమానాన్ని వదిలిపెట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే పంచకోశాలను ఒకదాని తర్వాత మరొకటిగా దైవత్వం వైపు నడిపించే మెట్లు. అందుకే.. ‘పంచకోశాంతర స్థితా’ అంటూ అమ్మవారికి పరమాత్మతత్వం ఆపాదించి స్తుతించాం.
 
ఇంతకీ యోగమంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? దానివల్ల ఉపయోగాలేంటి? అంటే.. ఎన్నడూ నశించని పరమాత్మను ఆధారం చేసుకొని సాగే మహత్తర స్థితే యోగం. శివుడు పార్వతికి హఠయోగం చెప్పగా.. శ్రీ హిరణ్యగర్భుడు యాజ్ఞవల్క్య మహర్షికి బ్రహ్మయోగోపదేశం చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖంగా ‘నారాయణ యోగం’ బోధించాడు. ఈ మూడూ ఇప్పుడు లోకంలో పరివ్యాప్తమై ఉన్న యోగవిద్యలు. ఇవి మనుషుల్ని తరింపజేసే గొప్ప సాధనలు. 

వీటినే ఆధునిక కాలంలో ఎందరో యోగులు మనకు అందించారు. శ్రీరామకృష్ణులు, త్రిలింగస్వామి, స్వామి వివేకానంద, పరమహంస యోగానంద వంటి మహనీయులు ఈ విద్యను ఆధునిక కాలానికి అందించారు. యోగం మనుషులకు యమనియమాలతో సత్ప్రవర్తన నేర్పిస్తుంది. ఆసన ప్రాణాయామాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి స్థితులతో పరంవైపు నడిపిస్తుంది. ‘నీటి చుక్క సముద్రంలో ఉన్నంత వరకే ఉనికిని కలిగి ఉంటుంది. సముద్రం నుండి వేరుపడితే ఆవిరై నశిస్తుంది. అలాగే జీవుడు పరమాత్మలో కలిసి ఉన్నంతవరకు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.’ అన్నారు శ్రీరామకృష్ణులు. కాబట్టి మానవుడు నిరంతరం తన పనుల్లో మునిగి ఉన్నప్పటికీ దైవస్మరణ వదలకుండా ఆనందమయుడై ఉండాలి. అందుకు యోగం ఒక గొప్ప మార్గం.
 
వేదాన్త శ్రవణం కుర్యాన్మననం చోపపత్తిభిః
యోగేనాభ్యసనం నిత్యం తతో దర్శన మాత్మనః
(పద్మపురాణం)
వేదాంత విషయాలను శ్రవణం చేసేవాణ్ని స్థిరంగా మనసుతో దర్శిస్తూ, నిత్యం యోగం చేసే వారికి ఆత్మదర్శనం లభిస్తుంది అన్న శాస్త్ర వాక్యం నిత్యసత్యం. ఆత్మజ్ఞానానికి యోగమే మార్గం.

**************************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 04 - 11 - 2019 : సోమవారం*

‘అత్త పగులగొడితే పాతకుండ.. కోడలు పగులగొడితే కొత్తకుండ’ అన్నట్టు ఈ దేశంలో సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు అన్నింటినీ సూత్రీకరిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దానికి ముందు స్థానికంగా జరిగే దాడులకు దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తారు.

 ఈ దేశంలో ఇపుడు కూడా వామపక్ష శక్తుల ప్రభావం బలంగా కొన్నిచోట్ల కన్పిస్తూంది. అధికారం దృష్ట్యా కేరళ, ప్రభావం దృష్ట్యా మీడియా, కుత్సిత మేధోవర్గం దృష్ట్యా జెఎన్‌యూ.. కేరళను వదిలేస్తే ఈ రెండు చోట్లా ప్రబలంగా ఉన్న సూడో సెక్యులర్ శక్తులు హిందువులను బోనులో ఎక్కించేందుకు ఎప్పుడూ పోటీపడతాయి. వాళ్లు మైనారిటీలపై జరిగే దాడులను, స్థానిక గొడవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతారు. 

దానికి ‘మాబ్ లించింగ్’ లాంటి అందమైన పేర్లు పెడతారు. అలాగని, మైనారిటీలపై దాడులు జరగాలని కాదు. కానీ అదే మెజారిటీ ప్రజలపై జరిగే దాడులను వార్తగా కూడా వేసేందుకు ఇష్టపడరు. అదృష్టవశాత్తూ ‘సోషల్ మీడియా’ ఉన్నందున ఈ రోజు చాలా సమాచారం బయటకు వస్తున్నది. 

లేకపోతే ‘వాళ్లు చెప్పిందే వార్త.. మునిగిందే గంగ’ అన్న చందంగా ఉండేది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో హిందూ మహాసభకు చెందిన కమలేశ్ తివారీని దారుణంగా హత్యచేశారు. దానిపై ఏ మీడియా చర్చించలేదు; ఎక్కడా కొవ్వొత్తుల ర్యాలీ జరగలేదు. ధిక్కార గళాలు, ‘అవార్డు వాపసీ గ్యాంగు’ స్పందించలేదు. మేధావులు ప్రధానికి లేఖలు రాయలేదు. ఎవరూ కవిత్వం, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వెలువరించలేదు. దానికి కారణం అతడు హిందూ సంస్థకు చెందినవాడు కాబట్టి!

ఈనెలలో బెంగాల్‌లో ఓ ఆరెస్సెస్ కుటుంబాన్ని మొత్తం దారుణంగా మట్టుబెట్టారు. అయినా వాళ్ల హృదయం కరుగలేదు. అది కవితారూపం దాల్చలేదు. ఏ అఖ్లాఖ్, పెహలూఖాన్ మరణాలపై, కథువా అత్యాచారంపై దేశవ్యాప్త సంచలనం సృష్టించారో, యం. యం.కల్బుర్గి, పన్సారే, గౌరీ లంకేశ్ మరణాలపై రాద్ధాంతం చేశారో వాళ్లు ‘కమలేశ్ తివారీ’ హత్యను కనీసం ఖండించలేదు.

 తివారీ ఒక మతప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతనిపై ఫత్వాలు, రివార్డులు జారీ అయ్యాయి. పోనీ ఈ దేశంలో ప్రవక్తలపై, దేవుళ్లపై ఏ మతం వాళ్లూ ఒక్క మాట మాట్లాడలేదా? అక్బరుద్దీన్ ఓవైసీ ఏకంగా శ్రీరాముడిపై ఎన్ని నిందలు చేస్తూ ప్రసంగం చేశాడు? జకీర్ నాయక్ వినాయకుడిపై, ఇతర దేవతలపై ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు? ఏకంగా ఓ రచయిత్రి రామాయణ విషవృక్షమే రాసింది. 

ఓ అపరమేధావి దేవుళ్లను కించపరుస్తూ పుస్తకాలు ప్రచురించాడు! మరి ఏ హిందువూ వారిపై దాడి చేయలేదే? అంతెందుకు, ఈ దేశాన్ని ‘జహిలియ్యా’గా (చీకటి నేలగా) అంధకారం లో వున్న సమాజంగా ఇక్కడి ప్రజలను కాఫిర్లుగా అభివర్ణిస్తే మెజారిటీలు ఏనాడైనా తిరగబడ్డారా? ఈ కాఫిర్‌లు ‘ఉమ్మా’లో భాగం ఎన్నటికీ కాలేరని ఇతర మతాల గ్రంథాలు మనల్ని విగ్రహరాధకులుగా తిట్టిపోస్తున్నాయి కదా! ‘గంగ జమున తహెజీబ్’ గురించి ఈ దేశ సెక్యులర్ శక్తులు కదా మాట్లాడేది. 

వారికి ‘సంక్లిష్ట సంస్కృతి’ లేదా ‘ఉమ్మడి సంస్కృతి’ అన్న అంశంపై నిజంగా నమ్మకమే ఉంటే ఈ మత గ్రంథాల్లో విగ్రహారాధకులపై వున్న వ్యాఖ్యల గురించి ఏనాడైనా ఒక్క అక్షరం రాశారా? 18వ శతాబ్దానికి చెందిన షావల్లీ ఉల్లా, 19వ శతాబ్దికి చెందిన సయ్యద్ అహ్మద్ బరౌల్వీ, అబ్దుల్ అజీబ్, టుట్‌మిర్ వంటి ఇస్లాం మత పండితులు ఏనాడూ తమ పుస్తకాల్లో హిందూ ముస్లింలు ఒక జాతిగా కలిసి బ్రతకాలని ఏనాడూ కోరుకోలేదు. వీరంతా ముస్లిం ప్రత్యేక జాతి (క్వాం, అవాం) అనే కదా చెబుతున్నది. 

ఈ వంద ఏళ్లలోనే ఈ పరిస్థితి వుంటే మహమ్మద్‌బిన్ కాశిం, గజనీ ఘోరీ, బాబర్‌ల నుండి ఏం ఆశిస్తారు? దాని ప్రభావమే కదా ఇవాళ ఐసిస్ లాంటి మత ఉగ్రవాదంపై ప్రపంచమే యుద్ధం చేయాల్సి వస్తోంది. దాని కొనసాగింపే కమలేశ్ తివారీ హత్య.

అలవికాని సిలబస్ వల్ల జాతీయవాద సంస్థలు కూడా ఈ సన్నటి పొరను గుర్తించలేకపోతున్నాయి. ప్రజలను చైతన్యపర్చాల్సిన మీడియాను, సాహిత్యాన్ని, సాంస్కృక రంగాన్ని వామపక్షాల చేతిలో పెట్టి కేవలం ‘రాజకీయాధికారం’తో కత్తి తిప్పడం దీర్ఘకాలికంగా నష్టం కలిగిస్తుంది. ఈ దేశానికి నెహ్రూ మొదటి ప్రధాని కావడంతో వామపక్ష వర్గాల పంట పండింది. 1969లో కాంగ్రెస్ చీలిపోయి ఇందర ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 

చాలామంది పి.వి.నరసింహారావుది మొదటి మైనారిటీ ప్రభుత్వం అనుకుంటారు కానీ మైనారిటీలో పడిన మొదటి మైనార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీదే. ఆ సమయంలో ఆమె సిపిఐ మీద ఎక్కువగా ఆధారపడింది. కాంగ్రెస్ (ఒ) సీపిఎం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం సిపిఐ, డిఎంకెల సహకారంతో గట్టెక్కింది. ఆ తర్వాత 1971 ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని లాభపడింది. దాంతో వామపక్ష మేధో వర్గానికి ‘్భరత సాంస్కృతిక రంగం’ బార్లా తలుపులు తెరచింది. 

నెహ్రూ కాలంలో కాంగ్రెస్ ముసుగులో, గాంధేయవాద ముసుగులో వున్న కమ్యూనిస్టు గుంపు ఇందిర కాలంలో బరితెగించి అన్ని రంగాలనూ దురాక్రమణ చేసింది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతున్నది. దాని ప్రభావం వల్లనే గౌరీ లంకేశ్ హత్యకు వచ్చిన ప్రాచుర్యం కమలేశ్ తివారీ హత్యకు రాలేదు. పెహలూఖాన్ హత్యపై జరిగిన అల్లరి హైదరాబాద్‌లో బిర్జు మాదిగ చచ్చిపోతే జరగదు. కథువా అత్యాచారంపై జరిగిన వ్యాఖ్యానం ప్రతిరోజూ జరుగుతన్న ‘లక జీహాద్’పై ఎక్కడా జరగదు!

ముఖ్యంగా మీడియా మేధోరంగం పేరుతో ‘వామపక్ష పాత్ర దృష్టి’ ఇటీవల మరీ ఎక్కువైంది. అందుకే ‘కాలాపానీ’ శిక్ష అనుభవించి స్వాతంత్య్రం కోసం అహరహం శ్రమించిన వీర సావర్కరుకు ‘భారతరత్న’ ఇవ్వాలంటే ఈ దేశంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, పిడికెడుమంది మేధావుల ముసుగులో ఆయనపై విషం చిమ్ముతున్నారు. గతంలో సీతారాం ఏచూరి, మణిశంకర్ అయ్యర్ వంటి వాళ్లు వీర సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాలని అనగానే ఈ శక్తులన్నీ నిద్రలేచి, పడగ విప్పి బుసలు కొడుతున్నాయి. చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేసిన రొమిల్లా థాపర్ నుండి రామచంద్ర గుహ వరకు అందరూ దోషులే. రాంప్రసాద్ బిస్మల్, వాసుదేవ బలవంత్ ఫడ్కే, అనంత లక్ష్మణ్ కన్హారే, థింగ్రా, గురుతేజ్ బహదూర్, బాజీప్రభు, ఉద్ధం సింగ్ వంటి వీరుల చరిత్రకు సమాధి కట్టిన శక్తులే ఈ రోజు బుజ్జగింపు డాన్సులు చేస్తున్నాయి. ఇదంతా సంతుష్టీకరణలో భాగం. ఈ ‘సంతుష్టీకరణ’ విధానం మార్చుకోకుంటే ‘సెక్యులరిజం’ మనడం కష్టం. అన్ని మతాలనూ సమానంగా గౌరవించాల్సిన ‘సెక్యులర్ భావన’ కొందరిని బుజ్జగిస్తూ, మరికొందరిని వంచనతో ద్వేషిస్తూ ‘సవతితల్లి ప్రేమ’ చూపించడం ఆత్మవంచన తప్ప ఇంకేమీ కాదు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*01-11-2019 : సోమవారం*ప్రపంచంలో చాలా జాతులు, మతాలు, దేశాలు, సంస్కృతులు బానిసత్వంలో పదేళ్ల నుండి వం ద సంవత్సరాలు ఉంటే వాటి అస్తిత్వం కోల్పోయాయి. రెండు భిన్నమైన భాషలు గల ప్రజలు 50 ఏళ్ళు కలిసి ఉండలేకపోయారు. పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లే ఇందు కు ఉదాహరణ. రాజకీయ సామాజిక ఉద్యమాలు జరిగిన తర్వాత మరికొన్ని దేశాలు తమ అస్తిత్వం వదిలేసుకోవలసి వచ్చింది. 

బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తిగల రష్యా ఎన్ని ముక్కలైందో మనకు తెలుసు. కానీ ప్రతి వంద కిలోమీటరుకు ఓ భాష, కొత్త ఆహారం, భిన్న వస్తధ్రారణ, అలవాట్లు ఉన్న భారత్ మాత్రమే ఇన్ని సంక్షోభాలను తట్టుకొని నిలవగలిగింది. పంజాబ్‌లో సిక్కు, తమిళనాడులోని లుంగీ ధరించే వ్యక్తి.. ఇద్దరూ తినే ఆహారం, వేషభాషలు అన్నీ భిన్నమైనవే. కానీ ఇద్దరూ ‘మేం భారతీయులం’ అంటూ గర్వంగా చెప్తారు. నరనరాల్లో ప్రవహించే ‘సాంస్కృతిక జాతీయవాద భావనే’ దానికి కారణం.

భారత్ కేవలం భౌగోళిక సరిహద్దుల మధ్య వున్న ‘్భభాగం’ మాత్రమే కాదు, భౌగోళిక ప్రాదేశిక సరిహద్దుల మధ్య వున్న బంధం కన్నా ఒక దేశానికి వున్న చారిత్రక బంధం గొప్పది. ఆ చారిత్రక సంబంధం కన్నా సంస్కృతి గొప్పది. ఆ సంస్కృతిని మించింది ధర్మం. దానికన్నా బలమైన శక్తిగలది ఆధ్యాత్మికత. 

ఈ ఆధ్యాత్మిక వారసత్వమే భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టింది. ఈ విషయమై అనేక విధాలుగా పరిశోధించిన సుధాంశు త్రివేది చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల వాళ్లంతా భారత్‌లో తమ సంప్రదాయాలను, సంస్కృతులను అధ్యయనం చేసేందుకు రావాల్సిందే’’ అన్న ప్రాచీన శ్లోకం అంతరార్థం అదే. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రెండు మసీదుల్లో రెండవది మన దేశంలోని మలబారు తీరంలో కట్టించడం ఆ కోణంలో అధ్యయనం చేయాల్సిందే. 

ప్రపంచంలో క్రైస్త వం కళ్లుతెరవకముందే ఇక్కడ అలాంటి మతానికే స్థానం ఇచ్చింది భారత జాతి. బౌద్ధాన్ని ప్రపంచంలో చాలా దేశాలకు పంపి గొప్ప తాత్విక జ్ఞానం అందించింది భారత్. అంతేగాదు పార్సీలు తమ దేశంలో అత్యాచారాలకు గురై, నిరాశ్రయులై ఇక్కడికి వస్తే వాళ్లను కన్నబిడ్డల్లా కడుపున పెట్టుకుంది. అలాగే కొందరు యూదులు భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 

యూదుల కోసం ‘ఇజ్రాయిల్’ ఏర్పడిన తర్వాత ‘మమ్మల్ని అత్యాచారం చేయని ఏకైక జాతి భారతజాతి’ అని వారు పేర్కొన్నారు. ఏ దేశంపై దండెత్తని దేశం భారతదేశం, ఎవ్వరినీ మత మార్పిడి చేయని జాతి హిందూ జాతి. మతపరంగా మనుషుల జనాభా పెంచి ‘రాజకీయ ప్రాదేశిక అస్తిత్వం సంపాదించాలని’ భారత్ అనుకోకపోవడమే ‘విశ్వగురు’ స్థానానికి ప్రధానమైన అర్హత.

భారతీయ సంస్కృతి పునాదులు భౌగోళిక సరిహద్దుల వల్ల నిర్ణయించబడలేదు. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఒకటైన ‘సింధు నాగరికత’ సింధు నది పరీవాహక ప్రాంతంలో జరిగింది. కానీ ప్రస్తుతం సింధునది భారత్‌లో లేదు. అయినా మన జాతీయగీతంలో ‘సింధు’కు స్థానం ఉంది. 

అలాగే ‘గాంధార్’ ఆప్ఘనిస్తాన్‌లో వుంది. అది ఇపుడు భారత్‌లో లేదు. కానీ భారత్‌లో గాంధారి కథకు స్థానం ఉంది. ‘నన్‌కానా సాహెబ్’ ప్రస్తుతం భారత్‌లో లేదు. కానీ గురునానక్‌కు, సిక్కు మతానికి ఇక్కడే స్థానం ఉంది. బౌద్ధం వారసత్వం అందుకొన్న దలైలామా ఈ దేశంలో లేడు. కానీ ఆయనకు ఈ దేశంలో గౌరవం వుంది. బమియాన్‌లో బౌద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను చూసి ఈ దేశ హిందువులు బాధపడ్డారు.

అలాగే ఈ దేశం నుండి ఇతర దేశాలకు వెళ్లినవారు ఇక్కడి సాంస్కృతిక ధారను ఇతర జాతులకు చాలా గొప్పగా అందించారు. కానీ వాళ్ల మూలతత్వాన్ని ధ్వంసం చేయలేదు. కంబోడియాకు వెళ్లిన కంబుఋషి వాళ్లకు మన సంస్కృతిని పంచి ఇచ్చాడు కానీ కంబోడియాను, వారి సంస్కృతిని ధ్వంసం చేయలేదు. కానీ అదే వాస్కోడిగామా, కొలంబస్‌లను గమనిస్తే వాళ్లు అడిగిడినచోట మూల జాతులను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. 

ఇవాళ మానవ హక్కులను గురించి ఇంతగా గొంతు చించుకునే అమెరికా- కొలంబస్ వెళ్లిన తర్వాత అక్కడి ‘రెడ్ ఇండియన్లను’ ఊచకోత కోసిన వైనాన్ని ప్రశ్నిస్తే ఏం చెబుతుంది? వాస్కోడిగామా ప్రయత్నం ఇక్కడ పాక్షికంగానే నెరవేరింది. బలం-్ధనం అనే రెండు ఆయుధాలు ఉపయోగించి ప్రపంచమంతా మత మార్పిడి సాగింది. కానీ అన్ని మతాల, జాతుల చేత అత్యాచారం చేయబడిన భారత్‌లో ఇంత జరిగినా మూల సంస్కృతి ధ్వంసం కాకపోవడానికి కారణం ఈ సాంస్కృతిక జాతీయవాదమే కారణం.

అందుకే మెకాలే మానసపుత్రులు, మార్క్స్ మానసపుత్రులు సుమారు రెండు శతాబ్దాలుగా ఈ సాంస్కృతిక విధ్వంసం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని నిర్మాణం అత్యద్భుతంగా ఉన్నందున ఎవరి వల్లా అది సాధ్యం కావడం లేదు. 

శత్రువు భౌతికంగా దేవాలయాలను ధ్వంసం చేస్తే ఇక్కడివాళ్ళు ‘దేహో దేవాలయ ప్రోక్తః’ అంటారు. శివభక్తులు అమర్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు, కాశీ నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల వరకు ఎక్కడైనా తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు. పోనీ విష్ణ్భుక్తులు ఎలా? జగన్నాథ మందిరం నుండి మధుర వరకు ఎక్కడైనా మొదలుపెట్టవచ్చు. 

అయోధ్య నుండి తిరుమల వరకు, ఇంకాస్త కిందకు వెళ్తే గురువయ్యూరు వరకు అంతా విష్ణుమయం. లేదు.. మేం అమ్మవారిని అర్చిస్తాం అనుకుంటే వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు, ముంబాదేవి నుండి కామాఖ్య వరకు అంతా అమ్మవారి పాదముద్రలే. ఈ దేశంలో అద్వైత ప్రచారం చేసిన శంకరుడు పుట్టింది కేరళలోని కాలడిలో. ఆయన మందిరం శ్రీనగర్‌లో కన్పిస్తుంది. శంకరుడు సమాధి పొందింది ఉత్తరాఖండ్‌లో! ఎంత విచిత్రం!?

ఇలా దేశాన్ని కలిపే ఓ ఆధ్యాత్మిక ధార ఈ దేశంలో ఉంది. అది ఈ దేశంలో నదీనదుల్లో, దేవాలయాల్లో, భాషల్లో, ఆహారంలో, వేషభాషల్లో.. అన్నింటా పరచుకొని ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన మెసపటోమియా, హరప్పా, టర్కీ, గ్రీకు, ఈజిప్ట్, మాయ సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. 

కానీ అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడిన భారతీయ సంస్కృతిని ఎన్నిరకాల వ్యక్తులు వచ్చినా ధ్వంసం చేయలేకపోయారు. దానికి మూలకారణం సాంస్కృతిక జాతీయవాదమే. ఇంత ఎగసిపడే చైనాను భారత్ ఎలా కట్టడి చేసిందో బీజింగ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసిన ‘హుషీ’ చెప్పిన మాటలతో ముగిద్దాం.

"India has culturally dominated and controlled more than two thousand years without sending single soldier across the border''.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*25-10-2019 : సోమవారం*
మన ధర్మంలో ప్రతిరోజూ పండగే. ప్రత్యేకించి ప్రతి మాసంలో ఏదో ఒక పెద్ద పండుగ వస్తూనే ఉంటుంది. ఈ పండుగలన్నీ కేవలం మనం ఆనందించడానికి కాదు.. మనకు నూతనోత్సాహాన్ని కలిగిస్తూనే జ్ఞాన మార్గంవైపు తీసుకెళ్లేవి. కానీ, ఇటీవలికాలంలో మనం పండుగలను కేవలం వినోద కార్యక్రమాల స్థాయికి దిగజార్చడం కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. దీనికి ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో.. పండుగలను ఆచరించడం వెనుక ఉన్న మూల భావనను పూర్తిగా కోల్పోతాం. సంసార సంబంధమైన దుఃఖం నుండి తరింపజేసేందుకు విద్వాంసులు చేసే కార్యక్రమానికే ఉత్సవం అని పేరు అని ఆగమాలు నిర్వచిస్తున్నాయి. కానీ మనం పండుగలకు, ఉత్సవాలకున్న సజీవ లక్షణాన్ని ధ్వంసం చేసి వాటి అంతరార్థాల్ని మరుస్తున్నాం.
 
పర్వదినాల సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ఊరేగింపుల్లో భాగంగా ఆయా దేవతా మూర్తులు వాహనాలపై వెళ్తున్నప్పుడు ఆ యాత్రను అనుసరించడం, స్తోత్రం చేయడం, కీర్తించడం, నృత్య గీతాలతో ఆనందాన్ని వ్యక్తపరచడం ‘అపవర్గ సాధకం’ అని ఆగమ శాస్త్రం తెలిపింది. అంటే మోక్షసాధన అని అర్థం. ఆ పరమాత్మను మనసు నిండా నిలుపుకొని అలాంటి సేవల్లో పాల్గొంటేనే ఇది సాధ్యం. కానీ, ఈ విషయం ఈ రోజు ఎవరికీ తెలియదు.

 భక్తులకే కాక అందరికీ ఇబ్బంది కలిగించే మైక్‌ సెట్లను ఉపయోగించడం, చెవులు బద్దలయ్యేలా సినిమా పాటలు పెట్టడం, కళ్లకు తీవ్ర హాని కలిగించే డిస్కో లైట్లను వెలిగించి ఆర్పుతుండడం, నృత్యాల పేరుతో అశ్లీల కదలికలతో గెంతులు వేయడం వంటి చర్యలతో పాపం మూటకట్టుకుంటున్నారు. షోడశోపచారాల్లో నృత్యం, గీతం కూడా భాగమేగానీ.. ఇలా కాదు. గణపతి ఉత్సవాలు, దేవీ నవరాత్రుల్లో చాలా మంది చేస్తున్నది ఇదే పని.
 
ఈ పర్వదినాల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించిన అతి కొద్దిమంది మాత్రమే సంప్రదాయం ప్రకారం, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఆ వేడుకలను నిర్వహిస్తున్నారు. అలాగే.. చిన్న చిన్న జన సమూహాలుండే కాలనీల్లో ఎక్కువ విగ్రహాలు పెట్టడం వల్ల సమాజంలోని ఏకత్వ భావనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పూర్వం దసరా లాంటి పండుగలు ఊరి ప్రజలంతా కలసి సామూహికంగా జరుపుకోవడం ద్వారా కలిసి ఉన్నామనే భావన పొందేవారు. ఆ కాలంలో డబ్బు కొరత ఉన్నా ఆనందానికి లోటు ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఆనందం తగ్గిపోయి అహంకారం పెరిగిపోయింది. కులాలవారీగా వేడుకలు నిర్వహిస్తూ దేవుడికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. ఇలా కృతకమైన ప్లాస్టిక్‌ జీవితాన్ని మన ఉత్సవాల్లో ప్రదర్శిస్తే ఇక భవిష్యత్తరాలకు మనం నేర్పగలిగేది ఏమీ ఉండదు.

**********************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 21 - 10 - 2019 : సోమవారం*

‘‘ఈ ఎన్నికల్లో మనం పోరాడింది ఒక పార్టీతో కాదు.. నిష్పాక్షిక వ్యవస్థలుగా మనం కీర్తించుకుంటున్న సంస్థలన్నింటినీ విపక్షాలపైకి ఎక్కుపెట్టారు.. అన్ని వ్యవస్థలనూ భాజపా, ఆరెస్సెస్ పూర్తిగా ఆక్రమించి ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచాయి’’-అంటూ గత వారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కాడి’ కిందపడేసి వెళ్లిపోయాడు. దీన్ని కొందరు ‘త్యాగం’గా చిత్రీకరిస్తే, మరికొందరు ‘వ్యూ హం’గా చెప్తున్నారు. 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని అర్ధాంతరంగా అనాథను చేసి రాహుల్ వెళ్లిపోయారని ఢిల్లీలో గాంధీ - నెహ్రూ కుటుంబ వీరాభిమానులు నిరసన తెలపగా, మరికొందరు నాయకులు రాజీనామాల బాట పట్టారు.


1885 ఏవో హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్‌ను స్వాతంత్య్ర సమరంలో అందరూ ఆదరించారు. డబ్ల్యూ.సి.బెనర్జీ నుండి రాహుల్ గాంధీ వరకు ఎందరో నేతలు ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు. గోపాలకృష్ణ గోఖలే, మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ, పట్ట్భా, ఇందిర, సంజీవరెడ్డి, కాసు, నిజలింగప్ప, సంజీవయ్య, శంకర్ దయాళ్ శర్మ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా, రాహుల్ వంటివారెందరో ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రచారకర్తగా వచ్చాక రెండు లోక్‌సభలు (2014, 2019) ఘోర పరాజయం ఎదురుకాగా, 41 అసెంబ్లీ ఎన్నికల్లో 33సార్లు ఆ పార్టీ ఓటమి చెందింది. 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైంది. అయినా గాంధీ-నెహ్రూ కుటుంబ భజన బృందాలు రాహుల్‌ను ‘త్యాగమూర్తి’గానే కీర్తిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ‘కామరాజ్ ప్లాన్’గా రాహుల్ రాజీనామాను కీర్తికిరీటంగా మార్చేస్తున్నాయి. రాహుల్‌కున్న రాజకీయ అపరిపక్వతను గురించి చెప్పలేని వంధిమాగదులు, పదవి లేకుండా బతకలేని వృద్ధ జంబూకాలు కాంగ్రెస్ పార్టీ పతనాన్ని అడ్డుకోలేకపోతున్నారు. 

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ప్రధాన పాత్రధారుడైన మోతీలాల్ వోరా లాంటి వీరవిధేయులు, కరడుగట్టిన మతతత్వవాదులైన గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్ లాంటివాళ్లతో కోటరీ నిర్మించుకొని, ముస్లిం సంతుష్టీకరణ నుండి బయటపడకుండా బాల్య చాపల్యం ప్రదర్శించే రాహుల్ అధ్యక్షతన పార్టీ ఎలా నిలదొక్కుకుంటుంది? దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ లాంటివాళ్లకు అప్పజెప్పినా రాహుల్ కన్నా గొప్పగా బ్యాటింగ్ చేస్తారు. కానీ కుటుంబ ఆరాధనకు కాంగ్రెస్ నాయకులు అలవాటు పడ్డారు. ఆ జబ్బును దేశం నిండా అంటించారు. అందుకే రాష్ట్రానికో కుటుంబం రాజ్యమేలుతోంది. కేటీఆర్‌లా స్వయం ప్రతిభ ఉంటే ఫర్వాలేదు కానీ, లోకేశ్, రాహుల్ లాంటి వాళ్లను ప్రజలు తిరస్కరించారు. రాజకీయాలు సినిమాల్లాగా ‘ఫేషియల్’ చేసుకొని నటించేవి కావు.

రాహుల్ ఫెయిల్యూర్ అంతా ‘అవగాహన లేమి’. రోహిత్ వేముల ఆత్మహత్యను నరేంద్ర మోదీపైకి నెట్టేందుకు చేసిన ప్రయత్నం మొదలుకొని గబ్బర్ సింగ్ టాక్స్ అనే పదం ఉపయోగించేవరకు అన్నీ వ్యూహాత్మక తప్పిదాలే. రహస్యంగా ముస్లిం వౌల్వీలను కలిసి, బయట ‘జంధ్యం’ దాల్చిన బ్రాహ్మణుడని చెప్పడం వల్ల ఏ సంకేతం రాహుల్ ఇచ్చాడో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్పలేరు. చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నాయకుల మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం పొందాడు. చివరకు నిందంతా ఆరెస్సెస్‌పై వేసి అస్త్ర సన్యాసం చేయడం మ రో తప్పిదం! గతంలో ఎం దరో కాంగ్రెస్ నేతలు ఆరెస్సెస్‌ను అభిమానించేవారు. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తే చెప్పాలి గానీ ఏమీ లేకుండా దిగ్విజయ్ సింగ్‌లా మాట్లాడితే ఎలా?

కాంగ్రెస్ వాదులైన పి.వి.నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీని భాజపా ఎందుకు వాడుకుంటుందో ఇప్పటికీ కాంగ్రెస్‌కు సోయిలేదు. సర్దార్ పటేల్, నేతాజీల్లోని దేశభక్తిని కాంగ్రెస్ ఇప్పటికీ కనిపెట్టలేదు. వౌలానా అబుల్ కలాంకు కాంగ్రెస్‌లో వున్న గౌరవం నేతాజీ, పటేల్‌కు ఎందుకు ఉండదో వారికి అర్థం కాదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థులను రెచ్చగొట్టే సల్మాన్ ఖుర్షీద్‌కు వున్న ప్రాధాన్యత దేశాన్ని ప్రేమించే కరణ్‌సింగ్‌కు ఉండదు. స్వాతంత్య్రం కన్నా ముందు గాంధీని, నేతాజీలను అభిమానించిన కాంగ్రెస్, స్వాతంత్య్రానంతరం నెహ్రూను ఆరాధించడం మొదలుపెట్టింది. నెహ్రూ సంతుష్టీకరణ విధానాన్ని ఆదర్శంగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రాధాన్యమైన ఎన్నో విషయాల్లో రాజీపడింది. నెహ్రూ కాలంలో కమ్యూనిస్టులు గోడదూకి ఇందులోకి చేరి, తమ వామపక్ష భావాలను పరిపాలనలో ప్రవేశపెట్టిన చైనా, రష్యా వారసులు కాంగ్రెస్‌ను శాపగ్రస్తం చేశారు. కృష్ణమీనన్ మొదలుకొని పి.చిదంబరం వరకూ అంతా ఆ బ్యాచే.

ఇదంతా వదిలేసేసి ఆరెస్సెస్‌పై నాలుగు రాళ్లేసి వెళ్లిన రాహుల్‌ను చూస్తే జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేం. గతంలో సోనియాగాంధీ అధ్యక్షురాలయ్యాక ఈ ‘సంతుష్టీకరణ’ కాంగ్రెస్‌లో విశృంఖలమైంది. ఆఖరుకు ‘మతహింస బిల్లు’ తెచ్చి హిందువులను అణచివేయాలనే దురాలోచన వచ్చింది. రాజేంద్రకుమార్ సచార్ కమిటీ పేరుతో ‘మైనార్టీ సంతుష్టీకరణ’ ఈ దేశ హిందువుల్లో లోలోపల ఆగ్రహవేశాలు రగిల్చింది. దాని పర్యవసానమే గుజరాత్‌లో ‘గోద్రా ఘటన’, అనంతర అల్లర్లు. మతహింస బిల్లు, సచార్ కమిటీ నివేదిక కన్నా ముందే గుజరాత్ అల్లర్లు జరిగాయి. సంతుష్టీకరణను హిందువులు హర్షించడం లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ గ్రహించలేదని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. తామంతా సమానంగా ఉండాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ హద్దులు మీరిన సంతుష్టీకరణ వెయ్యేళ్ల ‘హిందూ బానిసత్వం’పై కారం చల్లాయి. దానిని అడ్డుకొనే విరాట్ రూపమే మోదీ అవతారం.

ఆరెస్సెస్‌తో రాహుల్ ఎందుకు యుద్ధం చేయాలి? ఈ దేశంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్‌కు ఆరెస్సెస్ అవసరం ఎంత వుందో ఈ సంఘటన చెబుతుంది. 1921లో రాజద్రోహం కేసుపై బ్రిటీషువారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవ్ రావ్ హెడ్గేవార్‌ని నిర్బంధించింది. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని ఓ సంవత్సరం కఠిన కారాగారశిక్ష విధించింది. అదే జైలులో ఖిలాఫత్ ఆందోళనలో పాల్గొన్న ఇమానుల్లా ఖాన్ ఉన్నాడు. ఖాన్ ఉదయానే్న అందరూ నిద్రిస్తున్న వేళ బిగ్గరగా ఖురాన్ చదివేవాడు. ఎవరు చెప్పినా కావాలని మరింతగా బిగ్గరగా పఠించేవాడు. హెడ్గేవార్ సలహాతో ఖైదీగా వున్న రాధామోహన్ అనే ఆర్య సమాజ కార్యకర్త మరుసటి రోజునుండి రామాయణం బిగ్గరగా చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు గానీ ఇమానుల్లా ఖాన్‌కు తత్త్వం బోధపడలేదు. మరుసటిరోజు నుండి ఖాన్ లోలోపల ఖురాన్ పఠించేవాడు. ఇదే ఆరెస్సెస్ తత్త్వం. ఇటీవల కలకత్తా వీధుల్లో హనుమాన్ చాలీసా పారాయణం ఎందు కు మొదలయ్యింది? కలకత్తా నగరం భారీ ట్రాఫిక్ వుండే నగరం. అక్కడ మమత ప్రభుత్వ అండతో ఒక మతం వారు రోడ్లపై ప్రార్థనలు చేస్తున్నారు. అయినా ఓట్ల కోసం అదేదో తామే దగ్గరుండి జరపాల్సిన కార్యక్రమంలా మమత ప్రభుత్వం కొనసాగించింది. ఈ సంతుష్టీకరణకు వ్యతిరేకంగా ‘చాలీసా’ మొదలయ్యింది. స్వాతంత్య్రం రాక ముందూ వెనుకా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలపై ఇంత ప్రేమ చూపిస్తే రాజేంద్ర సచార్ కమిటీ మళ్లీ ఎందుకు వేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందడంలేదో ఆ మత పెద్దలు ఆలోచించాలి?

కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికైనా ‘సంతుష్టీకరణ’ వదలిపెట్టి ‘అందరూ ఒకే దేశ పౌరుల’ని గుర్తించాలి. అలాగే పార్టీని త్యాగగుణంగల కార్యకర్తలతో నింపే పనిచేయాలి. సైద్ధాంతిక నిబద్ధత గల రాం మాధవ్ లాంటి ఒక్క వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా చూపగలదా? ఆరెస్సెస్‌ను నిందించేముందు అందులోని ‘ప్రచారక్’ల్లోని త్యాగం ఒక్క కాంగ్రెస్ కార్యకర్తల్లో నింపగలరా? సాధారణమైన ఆరెస్సెస్‌లో ఓ పెద్దాయన మరణిస్తే, ముందున్న టెంట్‌లో సామాన్యుల్లా కూర్చొనే మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ లాంటి నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకులు ఎంతమంది? ఎండ్రకాయల్లా ఒకరినొకరు లాక్కొనే సంస్కృతి నుండి కాంగ్రెస్‌ను ఎవరు కాపాడాలి? ఏళ్లనుండి పదవులు వెలగబెట్టి, ధన సంపాదన చేసి, అధికారం పోగానే అవతలి పార్టీ తలుపు తట్టేవారు, శల్యసారథ్యంలో తమ కడుపున పుట్టే పిల్లలని తామే చంపుకునేవారిపై ఎవరు కొరడా ఝుళిపించాలి? కటిక దరిద్రంలో పుట్టిన నరేంద్ర మోదీనైనా, బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టిన అమిత్ షానైనా సిద్ధాంత బలంతో నియంత్రించగల శక్తి ఆరెస్సెస్‌లో ఉంది. అందుకే 56 ఏళ్ళ రాజకీయ జీవితంలో అధికారం అనుభవించింది స్వల్పమే అయినా సిద్ధాంతానికి కట్టుమడిన వాజపేయి లాంటి వ్యక్తిని ఈ డెబ్భై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చూపించగలదా?

హిందీ కూడా సరిగ్గా రాని ఓ ప్రచారక్‌ను అస్సాం పంపిస్తే మారు మాట్లాడకుండా వెళ్లి, అయిదేళ్లలో హిందీతోపాటు అస్సామీ కూడా అతను నేర్చుకుంటాడు. రాహుల్ ఇనే్నళ్లలో ఏం నేర్చుకున్నాడో రాజకీయ పండితులే విశే్లషించలేకపోతున్నారు. ఈరోజుకూ ఎన్నో ఘనమైన కార్యక్రమాలు చేసే ఆరెస్సెస్, భాజపా కార్యకర్తలు, నాయకులు తమ పేర్లు కూడా బయటకు తెలియనివ్వరు. కాంగ్రెస్ పార్టీ నుండి అలాంటి పునాదిరాళ్లను ఊహించగలమా? రాహుల్ ఇంకా ‘తెలియని వ్యాఖ్య’ చేస్తూ వెళ్లిపోయాడు. దేశమంతా ఆరెస్సెస్‌తో నిండిపోయిందా? అలా అయితే చారిత్రక కాంగ్రెస్, మీడియా, కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర ఎన్నో ప్రభుత్వ సంస్థలు కాంగ్రెస్- కమ్యూనిస్టులతో ఎందుకు నిండి ఉన్నాయి? 

జాతీయవాదానికి ఆయువుపట్టైన మహాభారతంలోని మహిళా పాత్రను (ద్రౌపదిని) అవమానించిన వ్యక్తి మోదీ ప్రభుత్వం నుంచి ‘పద్మ’ అవార్డు ఎలా పొందుతాడు? వారానికోసారి మోదిని పత్రికల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే ఓ పత్రికా రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎలా వశపరచుకొంటాడు? మొన్నటివరకున్న మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం ఇచ్చే ‘కబీర్ సమ్మాన్’ పురస్కారం నక్సల్స్‌ను సమర్థించే కె.శివారెడ్డి ఎలా పొందుతాడు? వామపక్ష వాదాన్ని భుజాలపై మోసే ప్రణయ్ రాయ్, రాజ్‌దీప్ సర్దేశాయ్‌లు తమ ప్రాపకాన్ని ఎలా సాగిస్తున్నారు? ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. ప్రభుత్వం దేశ భద్రత, సమానత్వం, జాతీయవాదం వంటి అంశాలపైనే కేంద్రీకృతం అయ్యేట్లు ఆరెస్సెస్ చూస్తోంది. కానీ రాహుల్ గాంధీ రాజకీయాలకు అడ్డుచక్రం వేసే పని ఆరెస్సెస్‌ది కాదు. ఇదేదీ గ్రహించకుండా సంఘ్‌ను తిడితే కొన్ని వర్గాల ఓట్లు గంపగుత్తగా పొందవచ్చని రాహుల్ భావిస్తే అది ఆయన రాజకీయ అనుభవ శూన్యతే. ఇప్పటికైనా ఎ.కె.ఆంటోనీ ఇచ్చిన రహస్య అంతర్గత నివేదికను కాంగ్రెస్ పఠిస్తే అదే పార్టీకి శ్రీరామరక్ష. లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత నిజమవుతుంది.
********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*12-07-2019 : సోమవారం*
సీతమ్మ వారి పుట్టిల్లు ఇపుడు నేపాల్‌లోని జనకపురి. జనకపురి-అయోధ్యల మధ్య ఓ గొప్ప సాంస్కృతిక బంధం ఉండేది. సీతమ్మ వారి తల్లిగారింటి నుండి కొన్ని అణాలు కానుకల రూపంలో నేపాల్ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చేవి. ఆ కానుకలు పంపేటపుడు మందీ మార్బలంతో, గొప్ప ఊరేగింపుతో అక్కడివారు పంపితే స్వయంగా అయోధ్య ప్రాంతంలోని ఫైజాబాద్ కలెక్టర్ స్వయంగా వెళ్లి ఎదుర్కొని వాటిని తెచ్చేవారు. అవి అందుకొనేందుకు ఏర్పాటుచేసే కార్యక్రమానికి కూడా బోలెడు ధనం ఖర్చు అయ్యేది. 

తరాల తరబడి నేపాల్- భారత్‌ల మధ్య ఉన్న సాంస్కృతిక బంధంగా ఈ కార్యక్రమాన్ని ఇరుప్రాంతాలు చూసేవి కానీ రెండు, మూడు అణాల కోసం అయ్యే ఖర్చుగా భావించేవారు కాదు. నలభయ్యవ దశకంలో ఫైజాబాద్ కలెక్టరుకు ఇదొక వింతగా అనిపించింది. రెండు, మూడు అణాల కోసం ఇంత ఖర్చు, ఇంత ఊరేగింపు అవసరమా? అనుకొని ప్రభుత్వానికి నివేదించి ఈ సంప్రదాయాన్ని ఆపేయించాడు.

ఇక్కడ మనం ఆలోచించాల్సింది ‘డబ్బు ఖర్చు’ కాదు, అది సెంటిమెంట్. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్నీ ఆలోచించే స్థితికి దిగజారాం. రామమందిరం అయోధ్యలో నిర్మించాలనే విషయంలో కూడా ఈ ధోరణే సెక్యులర్ ప్రభుత్వాలు అనుసరించాయి. ఈనెల 16తో ఓ సుదీర్ఘ వ్యాజ్యమైన ‘రామజన్మభూమి’ వివాదంలో వాదనలు ముగిసి, సుప్రీం కోర్టు తీర్పు కోసం సిద్ధంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 17న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందుతున్నందున ఈలోపే తీర్పు వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు.

క్రీ.శ.712లో మహమ్మద్ బిన్ కాశీం తర్వాత అనేకమంది ముస్లిం రాజ్యస్థాపన భావనతో ఈ దేశంలోకి చొరబాటుదారులుగా వచ్చారు. మహమ్మద్ ఘజనీ, ఘోరీ, నాదిర్షా, తైమూర్లాంగ్, బాబర్.. అంతా ఈ దేశాన్ని ‘జహిలియ్యా’ (అంధకారంలో వున్న సమాజం)గా భావించి దండెత్తిన చొరబాటుదారులే. క్రీ.శ.1025 నుండి 1707 దాకా ఇస్లామిక్ శక్తులే ఈ దేశాన్ని పాలించాయి.

 అందులో ఒక్క దారాషికోను మినహాయిస్తే మిగతా వాళ్ళంతా మతోన్మాద చురకత్తులే. మహమ్మద్ బిన్ కాశీం, ఘోరీ, గజనీ, 1938లో తైమూర్లంగ్, 1526లో బాబర్, 1739లో నాదిర్షా, 1756లో అహ్మద్ షా అబ్దాలీ.. వీళ్ళంతా ఈ దేశంలో కాఫిర్లు అయిన హిందువులను ఖతం చేయాలని వచ్చినవారే. ఈ దురాక్రమణదారులంతా సుమారు 30వేలకుపైగా హిందూ దేవాలయాలను కూల్చివేశారు. కాఫిర్లు పూజించే విగ్రహాలను ధ్వంసం చేసి ‘ఇస్లామిక్ స్టేట్’ నిర్మాణమే వాళ్ళందరి లక్ష్యం.

ఈ క్రమంలో క్రీ.శ. 15 28లో బాబర్ సేనాని మీర్ బాకీ అయోధ్యలో రామమందిరాన్ని కూల్చివేశాడు. క్రీ.శ. 11.12.1670 శ్రీకృష్ణజన్మభూ మి కూల్చిన రోజు, క్రీ.శ.1669 ఆగస్టు కాశీ విశ్వనాథాలయం కూల్చినరోజు, క్రీ.శ.1667 సెప్టెంబర్ 3న ఢిల్లీ కాశీ ఆలయం కూల్చిన రోజు. ఇలా హిందువులు ఈ దేశంలో ‘బ్లాక్ డే’లు జరపాలంటే సంవత్సరంలోని 365 రోజులూ చాలవు. దీనినే 1999లో 101 ఏళ్ల వయసుల్సో మరణించిన నిరాద్ సీ చౌదురి తన ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్‌నోన్ ఇండియన్’ (1951)లో చేసిన వ్యాఖ్యలు, తదనంతరం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (18 జూలై 1993)లో చేసిన ముఖాముఖి గమనించదగినవి. 

1992లో బాబ్రీ కట్టడం విధ్వంసం తర్వాత ఈ ఆక్స్‌ఫర్డ్ మేధావి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపదగినవే గాక, భారత అజ్ఞాత చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ‘మసీదు విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు ముస్లింలకు ఏ మాత్రం హక్కు లేదు. క్రీ.శ.1000 తర్వాత కతియవార్ నుంచి బిహార్ వరకు హిమాలయాల నుండి వింధ్య వరకు ప్రతి హిందూ మందిరాన్ని విధ్వంసం చేశారు. ఆత్మగౌరవం వున్న ఏ జాతీ దీన్ని క్షమించదు’’ అన్నారు. అందుకే హిందువులు ఆ మందిరం కూల్చినప్పటినుండి తిరగబడ్డారు. ఎన్నో యుద్ధాలు చేశారు. వేలాదిమంది బలిదానం చేశారు.

1986లో ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల విడాకుల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సుప్రీం కోర్టు తీర్పును అవమానించింది. ఈ సంతుష్టీకరణ విధానం దేశ ప్రజల్లో ఓ రకమైన అంతర్గత అగ్నిజ్వాలను రగిల్చింది. దానిని చల్లబర్చాలనే మరో సంతుష్టీకరణకు రాజీవ్ ప్రభుత్వం తెరతీసింది. రామమందిరం తాళాలు తెరిచింది. ఆ తర్వాత అయోధ్యపై భాజపా నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ చేపట్టిన ‘సోమనాథ్- అయోధ్య రథయాత్ర’ దేశాన్ని స్వాభిమానంతో నింపింది. 

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం బహుశా మహాభారత యుద్ధం తర్వాత ఇదే కావచ్చు. అయోధ్య ఉద్యమం భారతీయ రాజకీయాల ముఖచిత్రం మార్చివేసింది. భారతదేశంలో హిందువుల ఆరాధ్యస్థలాలైన సోమనాథ్, కాశీ, మధుర, అయోధ్యల్లో దురాక్రమణ జరిపి మసీదులు నిర్మించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజేంద్రబాబు, కె.ఎం.మున్షీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కృషితో సోమనాథ్ మందిర నిర్మాణం జరిగింది. మిగిలిన బానిస చిహ్నాలను కూడా అదే ఊపులో నిర్మించి ఉంటే ఈ రోజు సమస్యలే ఉండేవి కావు.

నిజానికి బాబర్ ఈ దే శంలో పుట్టలేదు, ఇక్కడ చావలేదు. కానీ శ్రీరాముడు ఈ దేశ ప్రజల ఆరాధ్య దైవం. ‘రాముడు’ అన్న ఒక్క సబ్జక్టు తమిళంలో కంబను, ఉత్తరభారతంలో గో స్వామి తులసీదాసును, తెలుగులో అనేక రామకథలకు.. ఆఖరికి కేరళలో ఎచ్చుతచ్చన్ రామకథకు ఆధారం అయ్యింది. వీళ్లందరికీ వాల్మీకి రామాయణం మూలం. మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు మొదలుకొని రామచిలుక.. రామఫలం అనేవరకు రామశబ్దం ప్రసరించింది. అయోధ్య హిందువుల ప్రముఖ తీర్థమని బ్రహ్మపురాణం (4.4.91) చెప్పింది. క్రీ.శ.1574లో ఇదే అయోధ్యలో రామచరిత మానస్ రచింపబడింది. 

6 డిసెంబర్ 1992 నాడు అక్రమంగా కట్టిన బాబర్ స్మృతిని తొలగించాక అందులో కమలం పువ్వు, రాతిస్తంభాలపై హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఇంకెన్నో చారిత్రక ఆధారాలు లభించాయి. భారత పురాతత్వ శాస్తవ్రేత్తల తవ్వకాల్లో అనేక ఆధారాలు అది హిందూ దేవాలయం అని నిర్థారించాయి. బాబర్ సరయు నదిని దాటినట్లు ‘బాబర్ నామా’లో అతడే చెప్పుకొన్నాడు. ఎందరో విదేశీ చరిత్రకారులు, రచయితలు రాసిన పుస్తకాల్లో అది హిందూ నిర్మాణం అని నిరూపిస్తున్నాయి. సుమారు 265 మందిర అవశేషాలు అందులో లభించాయి. కార్నల్ మార్టిన్ రాసిన రాతల్లోనూ ఈ సత్యం నిరూపించబడింది. 

అక్కడ లభించిన శిలాశాసనం (4.28 మీటర్లు/35 సెంటీమీటర్లు పొడవుగలది) ఆధారంగా ఫైజాబాద్ గజిట్ తిజనినిని 1905 పుటలో 172-73 హెచ్‌ఆర్ నేవిల్ అనే ఐసిఎస్ అధికారి అది హిందువుల పూజనీయ స్థలం అని, బాబర్ దానిని ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఇంత చరిత్ర, ఆధారాలున్న రామమందిరం హిందువుల ఆత్మాభిమానం కాదా? విదేశాలనుండి వచ్చిన బాబర్ అనే దురాక్రమణదారుడు ఈ దేశ ముస్లింలకు ఆత్మగౌరవం అని చెప్పగలరా? నిజానికి ఇప్పటికీ ముస్లింలు రోడ్లపై కూడా ప్రార్థనలు చేస్తారు. మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసిన బిలాల్ మసీదును కూల్చి ఇతర అవసరాలకు వాడుతున్నారు.

1955 నుండి ఎన్నో మత సంబంధమైన స్థలాలను సౌదీ ప్రభుత్వం రద్దుచేసి ఇతర అవసరాలకు వాడుతున్నది. కాబట్టి ప్రార్థన స్థలం ఎక్కడైనా ఉండవచ్చని డా సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు వాదిస్తున్నారు. హిందువులు దేవాలయ ప్రతిష్ఠను అనేక ఆచారాలు- సంప్రదాయాలతో చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ జరుగని విగ్రహాన్ని హిందువులు పూజించరు. మంత్రాల ద్వారా విగ్రహాల్లోకి దేవతా శక్తిని నింపిన తర్వాతనే పూజలు చేస్తారు. అందువల్ల మందిరం ఇంకోచోటకు తరలించడం సాధ్యం కాదు.

ఈ దేశంలో మైనారిటీల కోసం హిందువులు ఎన్నో త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మందిరం అక్కడే నిర్మించేందుకు సహకరించి ఉంటే నిజంగానే ఈ దేశంలో ‘సెక్యులరిజం’ ఉందని నమ్మేవారు. కానీ వెయ్యేళ్లనుండి హిందువుల భుజాలపై ఎక్కి నడవడం నేర్చుకున్న కొందరు నేతలు ఈరోజుకూ హిందువులను కాఫిర్లుగానే చూస్తున్నారు. దానికి ఈ దేశంలో కమ్యూనిస్టు గ్రూపు, చరిత్రకారులు, మేధావుల పేర్లతో వత్తాసు పలకడం, కొన్ని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలు పరిస్థితిని మరింతగా ఉద్రిక్తం చేశాయి. 

కేంద్రంలో వీపీ సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలనుకొన్నా ఈ శక్తులే ఓటుబ్యాంకు పేరుతో బెదిరించాయి. ఇపుడు పరిస్థితి మారింది. ఇటీవల 370 ఆర్టికల్ రద్దయినపుడు ఈ దేశాన్ని భగ్గున మండిస్తామన్నవాళ్లే, అది జరిగాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇపుడు ఈ దేశంలోని సాధారణ మైనారిటీలు రాజకీయాలకతీతంగా మతోన్మాద నాయకుల మాటలు ప్రక్కనపెట్టి రామమందిరం తీర్పు ఎలా వచ్చినా ఉదారంగా సహకరిస్తే అది చరిత్రాత్మకమవుతుంది. లేదంటే ప్రతి భారతీయుడికి అంతరాంతరాల్లో ఏమి జరుగుతుందో తెలుసు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*18-10-2019 : సోమవారం*

ఒకప్పుడు దేశంలో ప్రఖ్యాతి చెందిన ‘బ్లిట్జ్’ పత్రికలో విచిత్రమైన ద్వంద్వవైఖరి ఉండేది. ఆ పత్రిక ఆనాటి కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టేది. ఆ రోజుల్లో అది ఎక్కువ సర్క్యులేషన్ వున్న పత్రిక. ఓ వైపు కాంగ్రెస్‌ను తిడుతూ జవహర్‌లాల్ నెహ్రూపై అపార ప్రేమను కురిపించేది. నెహ్రూతోపాటు ఆయన క్యాబినెట్‌లోని కృష్ణమీనన్ లాంటి ప్రచ్ఛన్న కమ్యూనిస్టులను భుజాన మోసేది.

 కృష్ణమీనన్ పూర్వాశ్రమంలో కమ్యూనిస్టుగా ఉండి, అక్కడుంటే అధికారం దక్కదని నెహ్రూ కూడా తన జాతి పక్షేనని కాంగ్రెస్‌లో దూకేడు. 1957 నుండి 1962 వరకు కీలకమైన రక్షణ శాఖను చేపట్టి చైనా యుద్ధంలో మనం భూభాగం కోల్పోయేందుకు పరోక్షంగా సహకరించి, తన సైద్ధాంతిక భక్తిని చాటుకొన్నాడు. బ్లిట్జ్ పత్రిక నెహ్రూ, కృష్ణమీనన్‌లతోపాటు సీపీఐకి బాకాలూదేది. అందుకే ఆ రోజుల్లో ‘సీపీఐని నెహ్రూ బొత్తంలోని గులాబీ పుష్పం’గా అభివర్ణించేవారు.

తాజాగా తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక సందర్భంగా తెరాస సీపీఐ మద్దతు కోరింది. ఇతరులకు ఛాన్స్ ఇవ్వవద్దన్న ఏకైక లక్ష్యంతో తెరాస ఇలా కోరడం రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు. మరి సిపిఐ రోజూ వల్లెవేసే సిద్ధాంత నిబద్ధత, కట్టుబాటు ఎక్కడ వదిలేసింది? అసలు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు అసలు సిద్ధాంతపరమైన క్రమశిక్షణ ఉందా? అవకాశవాదం ఎర్రరక్తంలో కలగలిసిపోయి ఉండడం వెనుక మతలబు ఏమిటన్నది ఈ రోజు జరగాల్సిన చర్చ. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు’ అన్న ఓ దిక్కుమాలిన సిద్ధాంతాన్ని సృష్టించిందే కమ్యూనిస్టు పార్టీలు; దాని అనుబంధ మేధోవర్గం. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించి డబ్బు, అధికారం రంగం మీదకు తెచ్చిన సంప్రదాయ పార్టీలు ఒకవైపు వుంటే, ఈ రెండూ లేనట్టు కన్పించే కమ్యూనిస్టు పార్టీ అంతకన్నా ఎక్కువ చేసింది. 

లేకపోతే ప్రజల షేర్లతో ఏర్పాటైన ఓ టీవీ చానల్ రాత్రికి రాత్రి ఎందుకు అమ్ముకున్నారో ఇప్పటి వరకు సీపీఎం నేతలు బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం చెప్పారా? ఓ పత్రికను గంపగుత్తగా అమ్మేసిన విషయం నారాయణనో, చాడ వెంకటరెడ్డో ప్రజల ముందు చెప్పారా? 20 రాష్ట్రాల్లో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి ఈరోజుకూ తెలుగునాట ఓ పత్రికకు, టీవీ చానల్‌కు టికాణా లేదు.

 భుజానికి సంచులు వేసుకొని తిరిగే బి.వి.రాఘవులు పార్టీకి ఈ మాధ్యమాల నిర్వహణకు డబ్బులెక్కడివి? తమ సిద్ధాంత సారూప్యత వున్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించి తద్వారా పరోక్ష లబ్ధి పొంది సిద్ధాంత విస్తృతి చేయడమే కమ్యూనిష్టుల లక్ష్యం. ఇటీవల డిఎంకె నుండి సిపిఎం డబ్బులు తీసుకున్న విషయంపై పెద్ద చర్చే జరిగింది. ఆఖరుకు సీతారాం ఏచూరి వివరణ ఇవ్వాల్సివచ్చింది. అయినా డిఎంకె నాయకులు దానిపై స్పందించలేదు.

తెలుగు నాట జస్టిస్ పార్టీ భావజాలాన్ని ఎప్పుడూ సజీవంగా ఉంచేందుకు అప్పుడపుడు పుట్టుకొచ్చే చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడం, వాళ్లను ధ్వంసం చేసి వదలిపెట్టడం కమ్యూనిస్టులకు నిత్యకృత్యమైంది. ఇటీవల జనసేన పార్టీతో పొత్తే అందుకు ఉదాహరణ. బూర్జువాలు, భూస్వామ్య పార్టీలని విమర్శించే కమ్యూనిస్టులు అదే పార్టీల పల్లకీ మోయడం కొత్తేమీ కాదు. అయితే వాళ్లు తోకపార్టీలుగా మారినా ప్రచార ప్రసార, మేధోవర్గంలో కమ్యూనిస్టు గుంపు పెద్ద సంఖ్యలో ఉంది. 

టిఆర్‌ఎస్ అధినేతను నియంతగా అభివర్ణించిన నారాయణ, వెంకటరెడ్డిలు తెరాస ఎంపీ కేకే పిలవగానే సరే అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎంత భావదారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఆంధ్ర ప్రాంతం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కమ్యూనిస్టు పార్టీ 63 శాసనసభా స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో విజయం సాధించి 16.46 శాతం ఓట్లు పొందింది. 

అంతేగాకుండా వారు ఇచ్చిన మద్దతుతో 8 మంది ఇండిపెండెంట్లు, 10 మంది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే ఒకప్పుడు తెలంగాణలో పిడిఎఫ్ పేరుతో 45 స్థానాలకు కమ్యూనిస్టులు పోటీ చేసి 32 స్థానాలను గెలిచి 26.62 శాతం ఓట్లు పొందారు. అదే ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు పొందాడు. 

తదనంతరం కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలను ప్రజలు మెల్లమెల్లగా అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. 1955లో 168 స్థానాల్లో పోటీ చేసిన సిపిఐ 15 స్థానాలకు పడిపోవడం చూడవచ్చు. సోవియట్ యూనియన్‌పై వున్న ప్రేమ వారికి భారత్‌పై లేదని కాంగ్రెస్ ప్రజల ముందు పెట్టిన వాదం నెగ్గింది. 1957లో తెలంగాణలో సిపిఐ 44 స్థానాలకు అభ్యర్థులను పెట్టి 22 స్థానాలు గెలిచింది. 1962లో తెలంగాణలో 18 స్థానాల్లో విజయం సాధించింది. కేవలం నల్లగొండ జిల్లాలోనే 9 స్థానాలు పొందింది. 

1967లో 103 స్థానాలకు పోటీ చేసి 10 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత అవకాశవాదం అప్రతిహతంగా కొనసాగింది. అనంతరకాలంలో ఇందిరమ్మ విధించిన ఎమర్జెన్సీని సమర్థించింది. 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొంది. 1977 తర్వాత కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించింది. ‘ఇదొక చారిత్రక తప్పిదం’ అంటూ లెంపలేసుకొంది. 1978లో 6 స్థానాలు గెలిచింది. 1983లో ఎన్టీఆర్ రాగానే అతనితో కలవడానికి ఉత్సాహపడ్డా అది సాధ్యం కాలేదు. 1985 సిపిఐ టిడిపితో కలిసింది. తర్వాత ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మార్చింది. ఇక సిపిఎం ట్రాక్ రికార్డు ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు.

ఇలా ఈ దేశంలో అవకాశవాద రాజకీయాలను సిద్ధాంతీకరించిన కమ్యూనిస్టు పార్టీలు ఏనాడూ రాజకీయ క్రమశిక్షణ పాటించలేదు. సంప్రదాయ పార్టీలు అధికారం, ధనం సంపాదిస్తారనే కమ్యూనిస్టులు రంగులు మార్చిడంలో వారి కన్నా సిద్ధహస్తులు. స్వాతంత్రానికి ముందు దేశ విభజనను సమర్థించి మతోన్మాద ముస్లిం లీగ్‌కు మద్దతు పలికిన వాళ్లే రోజూ ‘మతోన్మాదం’ అంటూ రాజకీయాలను దిగజార్చారు.

 వీళ్లకు భారత్ గొప్పతనం ఎప్పుడూ కన్పించదు. మొన్నటికి మొన్న చంద్రయాన్-2 ప్రయోగం జరిగితే విమర్శలు ఎలా చేశారో చూశాం. కానీ 1957 అక్టోబర్‌లో సోవియట్ యూనియన్ విజయవంతంగా ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘స్ఫుత్నిక్’ సఫలమైతే ఆనాటి కమ్యూనిస్టు నాయకులు నంబూద్రిపాద్, కృష్ణమీనన్, మగ్దూం మొహియొద్దీన్‌లు చేసిన ఆనందోత్సావాలను చరిత్ర మరువదు. 1956 అక్టోబర్‌లో హంగెరీపై సోవియట్ సైన్యాలు దాడిచేసి అక్కడి నాయకుడు ఇమ్రీనాగీని అరెస్టు చేసి ఉరితీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. 

కానీ ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం రెండు నెలల గృహ నిర్బంధం విధిస్తే అదొక గొప్ప నేరమైనట్లే గగ్గోలు పెడుతున్నారు. ఇపుడు చైనాలో ముస్లింలపై ఘోరమైన అణచివేత సాగుతున్నా నోరువిప్పని కమ్యూనిస్టులు ఇక్కడ ఏమీ జరుగకున్నా స్థానిక గొడవలను మత కోణంలో చూపిస్తూ ఇక్కడి మెజారిటీ - మైనారిటీల మధ్య అగ్గి రాజేస్తున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు ఏదైనా తప్పు చేసి తప్పించుకునేందుకు తమను భారత్‌మాతాకీ జై, జై శ్రీరామ్ అనమన్నారని చెబుతూ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి మూకదాడులంటూ పేరుపెట్టిన అర్బన్ నక్సల్స్ నానాయాగీ చేస్తున్నారు.

 దానికి స్వేచ్ఛ, సమానత్వం అన్న కలర్ ఇచ్చే మేధోవర్గం నేపథ్యం అంతా ఈ ఎర్ర రంగు పార్టీనే. గద్దెదించడం తమ సిద్ధాంతం అన్నట్లు ప్రవర్తించే కమ్యూనిస్టులు ఈ దేశంలో నెహ్రూను తప్ప అందరి పట్లా అలాం టి వైఖరి ప్రదర్శించినవారే. విచిత్రమేమిటంటే, స్టాలిన్ కాలం నాటి చార్లెస్ బిర్బాల్ చెప్పిన ‘రీడర్స్ గైడ్ టు మార్క్సిస్ట్ క్లాసిక్స్’ అధ్యయానికి బదులుగా తమ్మినేని వీరభద్రం, నారాయణల జీవితచరిత్రలు రాసి చదివిస్తే సరిపోతుంది! ఎందుకంటే వాళ్లే రేపు కేసిఆర్‌ను తిట్టకపోతే ఒట్టు!!


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*11-10-2019 : సోమవారం*