దేహం, ఆత్మ రెండూ వేర్వేరుగా మారిపోయి శక్తి ప్రసారం జరిగి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా మారే ప్రదేశమే దేవాలయం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏ తత్వం వ్యాపించి ఉంటుందో దానినే మనం పరబ్రహ్మ అంటాం. అన్నిచోట్లా వ్యాపించిన ఆ తత్వం ఈ విగ్రహంలో కూడా ఉంటుంది కదా! ఆ స్థలం శతాబ్దాల తరబడి మనుషులకు ఆధ్యాత్మిక ఆలంబనగా ఉండాలి. అది విశిష్ట స్థలంగా మారాలి.

అందుకే.. అలా ఆత్మజ్ఞానం కలిగించే క్షేత్రాలనేమనవాళ్లు నదులు, సరస్సుల పక్కన, కొండలపైన ఏకాంత, నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్మించారు. అయితే, పెరుగుతున్న జనాభాతో పాటు వేలంవెర్రి పెరిగింది. ఆలయాలు, విగ్రహాల ప్రాధాన్యత తెలియనివారు దేవాలయాలను కేవల పూజాకేంద్రాలుగా నిర్వహిస్తున్నారు. కానీ.. మనిషి ఆధ్యాత్మికత ముందుకు సాగాలంటే అందుకు ఒక కేంద్రం కావాలి. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితేనే సృష్టి క్రమం నడుస్తుంది. మనిషి విగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడంలోని అంతరార్థం ఇదే.

జీవుడు ఎప్పుడూ దేవుడి చుట్టూ పరిభ్రమించాలనే సందేశం అందులో ఉంది. కుమ్మరి సారెపై పెట్టి తిప్పగానే.. మట్టి తన రూపాన్ని కోల్పోయి అందమైన పాత్రగా మారే ముందు కేంద్రంలో ఏకత్వం పొందుతుంది. అలాగే జీవుడిని ఆధ్యాత్మిక రూపంగా మార్చే శక్తి దేవాలయానికి ఉంది. కానీ దురదృష్టం కొద్దీ ఈనాడు దేవుళ్ల స్థాయిని బట్టి, గుడి స్థాయినిబట్టి పూజార్చనలకు రుసుములు పెట్టుకొనేంత సంకుచితమైపోయాం. ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశాం. నిజానికి.. దేవాలయం అక్షరాస్యులకు తత్వదృష్టిని కలిగించాలి.


పరిజ్ఞానం లేని వాళ్లకు కూడా కేంద్రంగా మారాలి. అజ్ఞానులైనవాళ్లకు నిర్గుణోపాసన సాధ్యం కాదు కాబట్టి సగుణోపాసన అయిన విగ్రహారాధన చెప్పబడింది. నిర్గుణోపాసన అనేది క్రమ క్రమంగా పొందదగిన స్థాయి అని మనం విస్మరిస్తున్నాం.

‘‘దేహో దేవాలయప్రోక్తః’’.. దేహమే దేవాలయం. బహిరాకాశంలో ఉన్న దివ్య పరమాత్మ ఉపాసనే గర్భాలయ స్థితమైన విగ్రహోపాసన. పాదాలు మహాద్వార గోపురాలు, చేతివేళ్లు గోపుర కలశాలు. లింగం ధ్వజం. బొడ్డు బలిపీఠం. హృదయం నంది. దీపం గురువు. శిరస్సు పరమేశ్వర సన్నిధానం. దేహాన్ని దేవాలయంగా భావించి కళ్లు మూసుకొని ధ్యానస్థితులై.. గర్భాలయంలోని స్వామిని మన హృదయాలయంలోకి ఆహ్వానించాలి. కళ్లు తెరిచి ఎదురుగా ఉన్న దేవతా ప్రతిమను చూసి, కళ్లు మూసి అంతర్ముఖులమై మన హృదయంలో నిలుపుకోవాలి.

***********************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 09 - 09 - 2019 : సోమవారం*కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి