‘‘భామినీ పిలువవమ్మ నా స్వామిని పిలువవమ్మ..’’
 
అంటూ వాగ్గేయకారుడు రాకమచర్ల వెంకటదాసు అమ్మవారిని వేడుకొంటాడు. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ అని భక్తరామదాసు వేడుకొన్నాడు. అయ్యవారిని పొందాలంటే అందుకు అమ్మవారే మార్గం. మన నిత్యజీవితంలో కూడా తండ్రితో ఏదైనా పని చేయించాలన్నా పిల్లలు తమ తల్లికే చెప్పుకొంటారు. పురుషునిలోని కాఠిన్య స్వభావం ఆధ్యాత్మిక రంగంలో అడ్డుపడుతుంది. కానీ, స్త్రీలోని సహజ సున్నితత్వం, నిష్కాపట్యం వారికి ఆధ్యాత్మికంగా రాజమార్గమవుతుంది. అలాగే స్త్రీ దేవతలు భక్తులను విశేషంగా కరుణిస్తారు. శ్రీవాణీగిరిజలు మొదలుగా ఎల్లమ్మ, మైసమ్మ, పోలమ్మ, అంకాలమ్మ.. ఇలా ఎన్నో రూపాల్లో ఉన్న ఆ జగన్మాత భక్తులపాలిట కల్పవల్లి. అమ్మవారు కుండలిని రూపంలో మూలాధారంలో సంస్థితమైన శక్తి స్వరూపం. ఆమె షట్చక్ర మార్గంలో ఊర్థ్వగామియైు సహస్రారం వరకూ చేరుకోవడమే జాగృతం. అది ఆధ్యాత్మిక మార్గంలో మహోన్నత స్థితి. దాన్ని పొందినప్పుడు అనుభవించే స్థితే బ్రహ్మానందం.
 
నదిని, భూమిని తల్లిగా భావించడం మనదేశంలో పరంపరగా వచ్చింది. నదులను, భూమిని అమ్మగా భావించడం భుక్తి మార్గం. ఆ రెండూ మన ఆకలిదప్పులు తీర్చేవి. ఇక, చైతన్య రూపంలో ‘జడశక్తిర్జడాత్మికా’గా ఉన్న మాతృస్వభావం మనకు మోక్షమార్గాన్ని అందిస్తుంది. పార్వతిగా శక్తిని, లక్ష్మీ స్వరూపంతో సంపదను, శారదగా విద్యను ఇస్తుంది. దుర్మార్గులపాలిటి దుర్గగా, కాళిగా.. అన్నం పెట్టే అన్నపూర్ణగా.. దుష్ట పశు స్వభావాన్ని మర్దించే మహిషాసుర మర్దినిగా.. ఇలా అనేక రూపాల్లో ఆ జగన్మాత దర్శనమిస్తుంది. భక్తులను అవ్యాజమైన, అపారమైన కరుణతో లాలిస్తుంది. ఈ దేశంలో శాస్త్రసమ్మతమైన శక్త్యారాధన ఏ స్థాయిలో జరుగుతుందో.. శాస్త్రంతో సంబంధం లేకుండా అమ్మను వివిధ దేవతల రూపంలో అంతే ఎక్కువ మంది ఆరాధిస్తారు. ఇదంతా ఆ తల్లిపై ఉండే మాతృప్రేమ.
 
పాశ్చాత్యుడైన క్లెయిటాన్‌ ఆ జగన్మాతను వర్ణిస్తూ.. ‘‘she seems to be a personification of light as the cause of the universe’’ అన్నాడు. ‘‘విశ్వకారణమైన జ్యోతి యొక్క మూర్తిమత్వమే ఆమె అని తోస్తోంది’’ అని దీని అర్థం. నిజమే.. అమ్మే జగతికి వెలుగు.
 
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

**********************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 07 - 10 - 2019 : సోమవారం*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి