సీతమ్మ వారి పుట్టిల్లు ఇపుడు నేపాల్‌లోని జనకపురి. జనకపురి-అయోధ్యల మధ్య ఓ గొప్ప సాంస్కృతిక బంధం ఉండేది. సీతమ్మ వారి తల్లిగారింటి నుండి కొన్ని అణాలు కానుకల రూపంలో నేపాల్ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చేవి. ఆ కానుకలు పంపేటపుడు మందీ మార్బలంతో, గొప్ప ఊరేగింపుతో అక్కడివారు పంపితే స్వయంగా అయోధ్య ప్రాంతంలోని ఫైజాబాద్ కలెక్టర్ స్వయంగా వెళ్లి ఎదుర్కొని వాటిని తెచ్చేవారు. అవి అందుకొనేందుకు ఏర్పాటుచేసే కార్యక్రమానికి కూడా బోలెడు ధనం ఖర్చు అయ్యేది. 

తరాల తరబడి నేపాల్- భారత్‌ల మధ్య ఉన్న సాంస్కృతిక బంధంగా ఈ కార్యక్రమాన్ని ఇరుప్రాంతాలు చూసేవి కానీ రెండు, మూడు అణాల కోసం అయ్యే ఖర్చుగా భావించేవారు కాదు. నలభయ్యవ దశకంలో ఫైజాబాద్ కలెక్టరుకు ఇదొక వింతగా అనిపించింది. రెండు, మూడు అణాల కోసం ఇంత ఖర్చు, ఇంత ఊరేగింపు అవసరమా? అనుకొని ప్రభుత్వానికి నివేదించి ఈ సంప్రదాయాన్ని ఆపేయించాడు.

ఇక్కడ మనం ఆలోచించాల్సింది ‘డబ్బు ఖర్చు’ కాదు, అది సెంటిమెంట్. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్నీ ఆలోచించే స్థితికి దిగజారాం. రామమందిరం అయోధ్యలో నిర్మించాలనే విషయంలో కూడా ఈ ధోరణే సెక్యులర్ ప్రభుత్వాలు అనుసరించాయి. ఈనెల 16తో ఓ సుదీర్ఘ వ్యాజ్యమైన ‘రామజన్మభూమి’ వివాదంలో వాదనలు ముగిసి, సుప్రీం కోర్టు తీర్పు కోసం సిద్ధంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 17న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందుతున్నందున ఈలోపే తీర్పు వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు.

క్రీ.శ.712లో మహమ్మద్ బిన్ కాశీం తర్వాత అనేకమంది ముస్లిం రాజ్యస్థాపన భావనతో ఈ దేశంలోకి చొరబాటుదారులుగా వచ్చారు. మహమ్మద్ ఘజనీ, ఘోరీ, నాదిర్షా, తైమూర్లాంగ్, బాబర్.. అంతా ఈ దేశాన్ని ‘జహిలియ్యా’ (అంధకారంలో వున్న సమాజం)గా భావించి దండెత్తిన చొరబాటుదారులే. క్రీ.శ.1025 నుండి 1707 దాకా ఇస్లామిక్ శక్తులే ఈ దేశాన్ని పాలించాయి.

 అందులో ఒక్క దారాషికోను మినహాయిస్తే మిగతా వాళ్ళంతా మతోన్మాద చురకత్తులే. మహమ్మద్ బిన్ కాశీం, ఘోరీ, గజనీ, 1938లో తైమూర్లంగ్, 1526లో బాబర్, 1739లో నాదిర్షా, 1756లో అహ్మద్ షా అబ్దాలీ.. వీళ్ళంతా ఈ దేశంలో కాఫిర్లు అయిన హిందువులను ఖతం చేయాలని వచ్చినవారే. ఈ దురాక్రమణదారులంతా సుమారు 30వేలకుపైగా హిందూ దేవాలయాలను కూల్చివేశారు. కాఫిర్లు పూజించే విగ్రహాలను ధ్వంసం చేసి ‘ఇస్లామిక్ స్టేట్’ నిర్మాణమే వాళ్ళందరి లక్ష్యం.

ఈ క్రమంలో క్రీ.శ. 15 28లో బాబర్ సేనాని మీర్ బాకీ అయోధ్యలో రామమందిరాన్ని కూల్చివేశాడు. క్రీ.శ. 11.12.1670 శ్రీకృష్ణజన్మభూ మి కూల్చిన రోజు, క్రీ.శ.1669 ఆగస్టు కాశీ విశ్వనాథాలయం కూల్చినరోజు, క్రీ.శ.1667 సెప్టెంబర్ 3న ఢిల్లీ కాశీ ఆలయం కూల్చిన రోజు. ఇలా హిందువులు ఈ దేశంలో ‘బ్లాక్ డే’లు జరపాలంటే సంవత్సరంలోని 365 రోజులూ చాలవు. దీనినే 1999లో 101 ఏళ్ల వయసుల్సో మరణించిన నిరాద్ సీ చౌదురి తన ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్‌నోన్ ఇండియన్’ (1951)లో చేసిన వ్యాఖ్యలు, తదనంతరం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (18 జూలై 1993)లో చేసిన ముఖాముఖి గమనించదగినవి. 

1992లో బాబ్రీ కట్టడం విధ్వంసం తర్వాత ఈ ఆక్స్‌ఫర్డ్ మేధావి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపదగినవే గాక, భారత అజ్ఞాత చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ‘మసీదు విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు ముస్లింలకు ఏ మాత్రం హక్కు లేదు. క్రీ.శ.1000 తర్వాత కతియవార్ నుంచి బిహార్ వరకు హిమాలయాల నుండి వింధ్య వరకు ప్రతి హిందూ మందిరాన్ని విధ్వంసం చేశారు. ఆత్మగౌరవం వున్న ఏ జాతీ దీన్ని క్షమించదు’’ అన్నారు. అందుకే హిందువులు ఆ మందిరం కూల్చినప్పటినుండి తిరగబడ్డారు. ఎన్నో యుద్ధాలు చేశారు. వేలాదిమంది బలిదానం చేశారు.

1986లో ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల విడాకుల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సుప్రీం కోర్టు తీర్పును అవమానించింది. ఈ సంతుష్టీకరణ విధానం దేశ ప్రజల్లో ఓ రకమైన అంతర్గత అగ్నిజ్వాలను రగిల్చింది. దానిని చల్లబర్చాలనే మరో సంతుష్టీకరణకు రాజీవ్ ప్రభుత్వం తెరతీసింది. రామమందిరం తాళాలు తెరిచింది. ఆ తర్వాత అయోధ్యపై భాజపా నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ చేపట్టిన ‘సోమనాథ్- అయోధ్య రథయాత్ర’ దేశాన్ని స్వాభిమానంతో నింపింది. 

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం బహుశా మహాభారత యుద్ధం తర్వాత ఇదే కావచ్చు. అయోధ్య ఉద్యమం భారతీయ రాజకీయాల ముఖచిత్రం మార్చివేసింది. భారతదేశంలో హిందువుల ఆరాధ్యస్థలాలైన సోమనాథ్, కాశీ, మధుర, అయోధ్యల్లో దురాక్రమణ జరిపి మసీదులు నిర్మించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజేంద్రబాబు, కె.ఎం.మున్షీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కృషితో సోమనాథ్ మందిర నిర్మాణం జరిగింది. మిగిలిన బానిస చిహ్నాలను కూడా అదే ఊపులో నిర్మించి ఉంటే ఈ రోజు సమస్యలే ఉండేవి కావు.

నిజానికి బాబర్ ఈ దే శంలో పుట్టలేదు, ఇక్కడ చావలేదు. కానీ శ్రీరాముడు ఈ దేశ ప్రజల ఆరాధ్య దైవం. ‘రాముడు’ అన్న ఒక్క సబ్జక్టు తమిళంలో కంబను, ఉత్తరభారతంలో గో స్వామి తులసీదాసును, తెలుగులో అనేక రామకథలకు.. ఆఖరికి కేరళలో ఎచ్చుతచ్చన్ రామకథకు ఆధారం అయ్యింది. వీళ్లందరికీ వాల్మీకి రామాయణం మూలం. మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు మొదలుకొని రామచిలుక.. రామఫలం అనేవరకు రామశబ్దం ప్రసరించింది. అయోధ్య హిందువుల ప్రముఖ తీర్థమని బ్రహ్మపురాణం (4.4.91) చెప్పింది. క్రీ.శ.1574లో ఇదే అయోధ్యలో రామచరిత మానస్ రచింపబడింది. 

6 డిసెంబర్ 1992 నాడు అక్రమంగా కట్టిన బాబర్ స్మృతిని తొలగించాక అందులో కమలం పువ్వు, రాతిస్తంభాలపై హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఇంకెన్నో చారిత్రక ఆధారాలు లభించాయి. భారత పురాతత్వ శాస్తవ్రేత్తల తవ్వకాల్లో అనేక ఆధారాలు అది హిందూ దేవాలయం అని నిర్థారించాయి. బాబర్ సరయు నదిని దాటినట్లు ‘బాబర్ నామా’లో అతడే చెప్పుకొన్నాడు. ఎందరో విదేశీ చరిత్రకారులు, రచయితలు రాసిన పుస్తకాల్లో అది హిందూ నిర్మాణం అని నిరూపిస్తున్నాయి. సుమారు 265 మందిర అవశేషాలు అందులో లభించాయి. కార్నల్ మార్టిన్ రాసిన రాతల్లోనూ ఈ సత్యం నిరూపించబడింది. 

అక్కడ లభించిన శిలాశాసనం (4.28 మీటర్లు/35 సెంటీమీటర్లు పొడవుగలది) ఆధారంగా ఫైజాబాద్ గజిట్ తిజనినిని 1905 పుటలో 172-73 హెచ్‌ఆర్ నేవిల్ అనే ఐసిఎస్ అధికారి అది హిందువుల పూజనీయ స్థలం అని, బాబర్ దానిని ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఇంత చరిత్ర, ఆధారాలున్న రామమందిరం హిందువుల ఆత్మాభిమానం కాదా? విదేశాలనుండి వచ్చిన బాబర్ అనే దురాక్రమణదారుడు ఈ దేశ ముస్లింలకు ఆత్మగౌరవం అని చెప్పగలరా? నిజానికి ఇప్పటికీ ముస్లింలు రోడ్లపై కూడా ప్రార్థనలు చేస్తారు. మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసిన బిలాల్ మసీదును కూల్చి ఇతర అవసరాలకు వాడుతున్నారు.

1955 నుండి ఎన్నో మత సంబంధమైన స్థలాలను సౌదీ ప్రభుత్వం రద్దుచేసి ఇతర అవసరాలకు వాడుతున్నది. కాబట్టి ప్రార్థన స్థలం ఎక్కడైనా ఉండవచ్చని డా సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు వాదిస్తున్నారు. హిందువులు దేవాలయ ప్రతిష్ఠను అనేక ఆచారాలు- సంప్రదాయాలతో చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ జరుగని విగ్రహాన్ని హిందువులు పూజించరు. మంత్రాల ద్వారా విగ్రహాల్లోకి దేవతా శక్తిని నింపిన తర్వాతనే పూజలు చేస్తారు. అందువల్ల మందిరం ఇంకోచోటకు తరలించడం సాధ్యం కాదు.

ఈ దేశంలో మైనారిటీల కోసం హిందువులు ఎన్నో త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మందిరం అక్కడే నిర్మించేందుకు సహకరించి ఉంటే నిజంగానే ఈ దేశంలో ‘సెక్యులరిజం’ ఉందని నమ్మేవారు. కానీ వెయ్యేళ్లనుండి హిందువుల భుజాలపై ఎక్కి నడవడం నేర్చుకున్న కొందరు నేతలు ఈరోజుకూ హిందువులను కాఫిర్లుగానే చూస్తున్నారు. దానికి ఈ దేశంలో కమ్యూనిస్టు గ్రూపు, చరిత్రకారులు, మేధావుల పేర్లతో వత్తాసు పలకడం, కొన్ని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలు పరిస్థితిని మరింతగా ఉద్రిక్తం చేశాయి. 

కేంద్రంలో వీపీ సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలనుకొన్నా ఈ శక్తులే ఓటుబ్యాంకు పేరుతో బెదిరించాయి. ఇపుడు పరిస్థితి మారింది. ఇటీవల 370 ఆర్టికల్ రద్దయినపుడు ఈ దేశాన్ని భగ్గున మండిస్తామన్నవాళ్లే, అది జరిగాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇపుడు ఈ దేశంలోని సాధారణ మైనారిటీలు రాజకీయాలకతీతంగా మతోన్మాద నాయకుల మాటలు ప్రక్కనపెట్టి రామమందిరం తీర్పు ఎలా వచ్చినా ఉదారంగా సహకరిస్తే అది చరిత్రాత్మకమవుతుంది. లేదంటే ప్రతి భారతీయుడికి అంతరాంతరాల్లో ఏమి జరుగుతుందో తెలుసు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*18-10-2019 : సోమవారం*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి