కుఛ్ ఆర్జూ నహీహై, హై ఆర్జూతో యహ్ హై
రఖ్‌దే కోరుూ జరాసీ ఖాక్ వతన్‌కీ కఫ్‌న్‌మే

నాకు ఇతరమైన ఏ కోరికా లేదు; ఉన్నదల్లా ఒక్కటే. నా శవాన్ని కప్పే వస్త్రం (కఫన్)లో ఎవరైనా కొద్దిగా నా దేశపు మట్టిని పెడితే చాలు.

ఇంత గొప్ప త్యాగబుద్ధితో ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన అష్ఫాఖుల్లాఖాన్ తనను ఉరితీసే చివరి రోజుల్లో అన్నమాటలు ఇవి. ఒక దేశభక్తుడు ఈ దేశం కోసం అంతగా తపించి స్వాతంత్య్రం సంపాదించేందుకు తనను తాను అర్పించుకొన్నాడు. 

ఈ రోజు మనం దేశం కోసం ప్రాణాలు వదలాల్సిన అవసరం లేదు. కనీసం ఎవరి ఓటు హక్కును వాళ్లు వినియోగించుకొని దేశానికి సుస్థిర, అవినీతి లేని, స్వార్థబుద్ధి లేని వ్యక్తులను ఎన్నుకొంటే అదే పదివేలు.

‘‘నా ప్రజలకు ఓటుహక్కు వజ్రాయుధం నేను ఇచ్చాను. దానితో వారి భవిష్యత్తు వారే నిర్ణయించుకోగలరు’’ అని డా బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటల్లో అంతరార్థం ఇదే. ఈ దేశంలో ‘‘స్వాతంత్య్రం వచ్చాక కొన్నాళ్లు నియంతృత్వ పాలన ఉండాలి’’ అని నేతాజీ సుభాస్ చంద్రబోస్ లాంటి వీరయోధులు ప్రతిపాదించారు. 

వెయ్యేళ్ల బానిసత్వం కారణంగా ఈ దేశం కూసాలు కదిలిపోయాయి. ఈ దేశ వౌలిక భావనలు పలుచన అయ్యాయి. ఈ దేశానికి కావలసిన ఆలోచనలు కొరవడ్డాయి. ఆకలిగొన్న మనిషి ముందు అమృతం పెడితే అది తినాలో, త్రాగాలో తెలియని దుస్థితి. సరిగ్గా మనకు ‘ప్రజాస్వామ్యం’ అనే అమృతం ఎలా ఉపయోగించుకోవాలో తెలియని దుస్థితి.

 ఉదాహరణకు గతంలో హైదరాబాద్ నగరంలో జిహెచ్‌యంసి ఎన్నికలు జరిగితే అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. నగరం నిండా చదువుకున్న వాళ్లే. అయినా వాళ్ల పరిజ్ఞానం అంతా పత్రికలు చదివి, టీవీలు చూడడం వరకే. ఈ మహానగర జీవులకు ఓటేయడానికి బద్ధకం. 

ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా కదా మన సుపరిపాలనను కోరుకొనేది. మరి నగరం నిండా వున్న బుద్ధి జీవులు ఓటు వేయడానికి ఎందుకు జంకుతున్నారు? నిజంగా ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రతి పౌరునికీ ఓటు హక్కు తప్పనిసరి చేయాలి. 

అస్తవ్యస్తంగా వున్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణ కవచంలాంటి ఓటు హక్కును అన్ని వర్గాలతో వినియోగింపజేసినపుడే రాజ్యాంగ రక్షణ జరిగి తీరుతుంది.
కొందరు ఓ విచిత్రమైన వాదన చేస్తారు. 

ఎన్నికల్లో నిలబడినవాళ్లలో అందరూ అలాగే ఉన్నారు! ఎవరికి మేం ఓటు వేయాలి? అంటుంటారు. పోనీ మీరు ఓటు వేయనంత మాత్రాన ఎన్నికలు ఆగిపోయాయా? గ్రామాల్లో నుండి వచ్చి నగరంలో కూలీలుగా స్థిరపడినవాళ్లు, చిన్న చిన్న గల్లీ లీడర్లతో ప్రభావితం అయ్యే బస్తీ ఓటర్లు, కులాలుగా కలిసున్న గుంపున్న, మతపరమైన చైతన్యంతో ఓటువేసే వాళ్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఇపుడు అక్షరాస్యులైన ఓటర్లు సాధించింది ఏమిటి? ఈ వర్గాలు ఎక్కువగా వివిధ ప్రలోభాలకు ప్రభావితం అవుతున్నవారే. వాళ్లు ఎన్నుకున్న వాళ్ల మనసుకు నచ్చిన ‘ఆ మూర్ఖ నాయకుడే’ కదా వాళ్లను, వీళ్లను పాలించేది. 

మనం ఔనన్నా, కాదన్నా ఎన్నికవుతున్న నాయకులే మన నెత్తిన ఎక్కి పాలిస్తున్న మాట వాస్తవం. ఇది గమనించకుండా ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ఓ సుపీరియారిటీ అనుకోవడం తెలివితక్కువతనం.

‘‘నోరు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు- గుర్తుంచుకోండి’’ అని రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. రాజ్యాంగం సాధించిన ఓటు హక్కును నిరాకరించడం నోరులేని మేకల్లా జీవించడమే. 

సూపర్ మార్కెట్‌కు వెళ్లి వారంలో పాడైపోయే వస్తువును కొనేందుకు దాని నాణ్యత, మన్నికను గురించి వందసార్లు విచారించి ఖరీదు చేసేవాళ్లు ఐదేళ్లు మనల్ని పాలించే వ్యక్తుల మంచి చెడ్డల గురించి ఆలోచించలేరా? పూర్వం స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో విలువలు గల వ్యక్తులు రాజకీయాల్లో పోటీ చేసారు. వాళ్ల వెంబడి గౌరవంతో తిరిగే ధనికులు కొన్నాళ్లకు ‘వీళ్ల వెంబడి నేను ఎందుకు తిరగాలి; నేను పోటీ చేస్తాను’ అంటూ ఎన్నికల్లోకి దిగారు. ఈ ధనికులు తమ అధికార సుస్థిరతకు వాళ్ల వెంబడి కొందరు నేర చరిత్ర వున్న గుండాలు, రౌడీలను త్రిప్పుకున్నారు. 

ఇంకొన్ని సంవత్సరాలకు ఈ రౌడీలకు, గుండాలకు వీళ్ల వెంబడి మేము ఎందుకు ఉండాలి; మేం కూడా ఎన్నికల్లో నిలబడతాం’ అన్న ఆలోచన కలిగింది. ఇపుడు సింహభాగం రాజకీయ వ్యవస్థ ఇదే స్థితిలో వుంది. ఆఖరుకు అన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నిస్సహాయత ప్రకటించింది. 

మరి రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటుచేసుకొన్న రాజకీయ పార్టీలకు ఈ విషయంపై స్వీయ నియంత్రణ ఎందుకు లేదు?! ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వాళ్లకు బాధ్యత లేదా? అవినీతి, వంశపాలన, దౌర్జన్యం, ఆశ్రీత పక్షపాతం వంటి దుర్లక్షణాలకు నాయకులు ఎంత కారకులో ఓటువేయని వారు కూడా అంతే బాధ్యులు. 

ఈ రోజు రాజకీయాల్లో కులం, ధనం, బలగం, పార్టీ అనేవి చతురంగ బలాలు. అందుకోసం అందరూ అనేక వ్యూహాలు చేస్తున్నారు. వీటిని అధిగమించేందుకు ఏదో పెద్ద ఉద్యమం వస్తే తప్ప ఇవి అనకొండల్లా కదలట్లేదు. ఈ డెబ్భై ఏళ్లనుండి ఇలాంటి జాడ్యాలు ముదిరి పాకానపడి ఎవరూ కదల్చలేనంత హీన స్థితికి దిగజారాయి. 

ముఖ్యంగా ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. దానివల్ల దేశం మొత్తం ఓ నిశ్శబ్ద విప్లవం మొదలై 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. 

రాజకీయ దురంధరులైన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు లాంటి కొండల్ని త్రవ్వేసి తెలంగాణ సెంటిమెంటు రగిలిపోయింది. వీళ్ల కుల, పార్టీ, మందబలం, ధనబలాలను తుత్తునియలు చేస్తూ తెలంగాణ అస్తిత్వం ప్రొద్దుపొడిచింది. ఇదంతా ఒక రాజకీయాల సయ్యాట మాత్రమే కాదు. 

వాళ్లకున్న ఈ చతురంగ బలాలను ఎదుర్కోవాలంటే గంగా ప్రవాహంలా సెంటిమెంట్ వచ్చింది. అన్నిచోట్ల ఇలాంటివి పేరుకుపోయినప్పుడల్లా సెంటిమెంట్లు లేస్తున్నాయి. అవే ఈ అధికారాలను కూలదోస్తున్నాయి. 

ఇది మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ క్రీడలు. అక్రమంగా ధనార్జన చేసిన వ్యక్తులు, కుటుంబాలు, కొన్ని కులాలు తమ బలగర్వంతో స్వారీ చేస్తున్నపుడు ప్రజా చైతన్యం వెల్లివిరుస్తుంది. దాని ఫలితాలే బ్రహ్మచారి నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, సర్వసంగ పరిత్యాగి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినా అందులోని రహస్యం ఇదే. 

దేశానికి బ్రహ్మచారులను, సర్వసంగ పరిత్యాగులను ఇంకెంతమందిని సృష్టిస్తాం? ఇందులో నాగరికులైన ప్రజలకు ఎలాంటి బాధ్యత లేదా? సింహం జూలు పట్టి దానినోట్లో చెయ్యి పెట్టే శక్తి మనం ఓటు హక్కు ద్వారా మనం సాధించవచ్చు. 

రాజకీయం ఓ బురద అని ప్రతివాడూ అనుకుంటే ఆ బురదలో పొర్లాడగలిగినవారే దాని మకిలిని అంటించుకుంటున్నారు. వాళ్లే బురదనుండి వచ్చిన కమలాల్లాగా ఫోజులిస్తున్నారు!? ఎంత ఆశ్చర్యం!

గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి నాయకుడూ మా పార్టీ ఇలా చేసింది, అలా చేసింది అంటున్నారు. కానీ వారు వ్యక్తిగతంగా ఏం చేసారో ఎవరూ చెప్పరు. 

రాజకీయాల్లో సర్వస్వం పోగొట్టుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు లాంటివాళ్లు ఈనాటి నాయకుల లక్షల కోట్ల అవినీతి చూస్తే గుండె ఆగి చచ్చిపోయేవారు. 

బారిష్టర్ చదువును బట్టలో గట్టి బంగాళాఖాతంలో విసిరేసి ఈ దేశ సామాన్యుడిలా జీవిస్తాను. బాపూజీ నేషనల్ హెరాల్డ్‌ను అప్పనంగా అమ్ముకోవడానికి కృత్రిమ భాగస్వాములను సృష్టించిన వాళ్లను చూస్తే ఉరి వేసుకొని చావాల్సిందే! 

‘‘కులం పునాదులమీద మీరు ఏదైనా నిర్మించాలనుకొంటే అది పగిలి ముక్కలు గావడం ఖాయం. అట్టిదేదీ ఒక సంపూర్ణ నిర్మాణంగా ఉండజాలదు’’- అన్న డా బాబా సాహెబ్ ఈ రోజు జరుగుతున్న కులం కుళ్లు రాజకీయాలను చూసివుంటే అసహ్యించుకొనేవాడు! 

శవాలపై చల్లిన చిల్లర ఏరి విశ్వవిద్యాలయం స్థాపించిన మాలవ్యా ఈ దేశాన్ని నిండా ముంచి పోయిన మాల్యా, నీరవ్ మోడీలను చూస్తే అగ్నిలో దూకేస్తాడు. 

ఇన్ని మన కళ్లముందు జరుగుతున్నా ఓట్లు వేయకుండా ఇళ్లలో క్రికెట్ మ్యాచ్‌లు చూసే దుస్థితిని చూసి రాజ్యాంగమే తనంతకు తాను ఆత్మహత్య చేసుకుంటుందేమో!

విజ్ఞులైనవాళ్లు అనుకునే వ్యక్తులు ఈ జాడ్యాన్ని వదలి ఓటు అనే వజ్రాయుధం ధరించాలి. లేదంటే కుల, మతాల గుంపులు, నిరక్షరకుక్షులు, స్వార్థవక్తులు, అధికార మదాంధులు తమ స్వప్రయోజనాలకోసం ఓట్ల దాడి చేస్తారు. 

ఓటు వేసేవాళ్లు నిర్భీతిగా శేషేంద్ర చెప్పినట్లు ‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు; తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగుదు, పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు, నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు, కాని కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’’ అన్నట్లు ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్య సౌధం బలోపేతం అవుతుంది’’. 

పని చేయనివాడికీ తిండి తినే హక్కు లేదన్నట్లు ఓటు హక్కును వినియోగించుకోలేని వ్యక్తులకు ఈ దేశ మంచి చెడ్డల గురించి మాట్లాడే హక్కు లేదన్నది అక్షరసత్యం.


*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰


నిజం నిద్రలేచేవరకు అబద్ధం అరవైసార్లు ఆకాశాన్ని చుట్టి వస్తుందని సామెత. ఇటీవల కాలంలో భారతీయ జనతాపార్టీ అలాంటి ఆత్మరక్షణలో పడుతుంటే ఈ సామెత ప్రయోగం ఇక్కడ సరిగ్గా సరిపోతున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనేక ఆరోపణలు చేస్తున్నా వాటికి శాస్త్రీయంగా మెరుపులాగా జవాబు ఇవ్వలేకపోతున్నది బీజేపీ. 2014 తర్వాత మోడీ అధికారంలోకి వచ్చాక వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.
నోట్లరద్దు, జీయస్టీ లాంటి సంస్కరణలు చేసినా ఆ దేశంలోని పౌరులు అతను ఏది చేసినా ఈ దేశానికి మంచే చేస్తాడని ఈ రోజుకూ విశ్వసిస్తున్నారు.1977  మార్చిలో ఎమెర్జెన్సీ తర్వాత  ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అవశేషంగా మిగిలింది. దాదాపు అన్ని లోక్‌సభ స్థానాల్లో నాలుగుపార్టీల జనతాకూటమి గెలిచింది. ఆ తర్వాత 2014లో ఒకే పార్టీ అక్కడ  అన్ని సీట్లు గెలిచిదంటే  అది మోడీ, షాల ప్రతిభనే.
మోడీ అధికారంలోకి రావద్దని రాజకీయంగా కాంగ్రెస్ ఎంతగా కోరుకున్నదో, అదే స్థాయిలో సూడో సెక్యులర్ పార్టీలన్నీ బహిరంగంగా వ్యతిరేకించాయి. ఇక్కడ మోడీ వ్యతిరేకత అన్నది రాజకీయంగా అనుకుంటే పొరపాటే. మోడీ వ్యతిరేక గళంలో జాతీయవాద వ్యతిరేకధోరణి ఉంది. అందుకే దేశంలోని ప్రభుత్వం యొక్క నీతివంతమైన పాలన కన్నా కులం, మతం అన్న అంశాలకే చర్చలు పరిమితమయ్యాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక ఎన్జీవోల ఇబ్బడి ముబ్బడి నిధులపై ఆంక్షలు, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి సారించింది. దాంతో మత మార్పిడిలు చేసే సంస్థలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దాంతో ఆ సంస్థలన్నీ మోడీపై అప్రతిహతంగా దుష్ప్రచారం మొదలు పెట్టాయి. 
అఖ్లాఖ్ హత్య, రోహిత్ వేముల ఆత్మహత్య, అవార్డు వాపసీ, కులవర్గాలపై దాడులు, వివిధ రాష్ట్రాల్లో కొత్త రిజర్వేషన్ల ప్రతిపాదనలు, ఉద్యమాలు, కథువా అత్యాచార ఘటన... వంటివి చర్చలోకి వచ్చాయి. ఇవన్నీ సెంటిమెంట్లు, కులమత ఉద్రేకాలను పెంచడం కోసం అనుకొందాం. కానీ పాలనాపరంగా జీయస్టీ, నోట్లరద్దు లాంటి సంస్కరణలు మనకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు కలిగించేవే. కానీ మోడీటీమ్ ఇటీవల వీటన్నిటిపై జరుగుతున్న దుష్పరిణామాలు, దుష్ప్రచారాలను అరికట్టలేకపోతున్నది. 
దళితులపై దాడుల విషయం వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్నాయి. అదంతా బీజేపీ లేదా వారి సిద్ధాంత సారూప్యమున్న సంస్థలు చేస్తున్నాయన్న ప్రతిపక్షాల వాదనను బలంగా ఎదుర్కోలేకపోతే 2019లో జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఎదుర్కొంటారు? ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 4 కోట్ల 14 లక్షలు. అలాగే జనాభా ప్రకారం పంజాబ్‌లో 32 శాతం దళితులున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో 66 లోక్‌సభ సీట్లలో దళిత ఓటర్ల ప్రభావం ఉండబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా దళితులపై జరిగే వ్యక్తిగత స్థాయి సంఘటనలు కూడా నరేంద్రమోడీ ప్రక్కన ఉండే చేయించాడన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ఇంత పేలవంగా సమాధానం ఇస్తే ఎలా? అతి ఎక్కువ దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలో ఈ విషయంపై మాట్లాడేందుకు వారిని ఎవరు నిలువరిస్తున్నారు? హద్దులు మీరిన క్రమశిక్షణ కూడా అప్పుడపుడు హానికారకమవుతుంది అనడానికి ఇది ఉదాహరణ. 
 నోట్లరద్దు తర్వాత బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టకుండా కేంద్రప్రభుత్వం చేస్తున్న తాత్సారం మధ్యతరగతి వర్గాల్లో ప్రభావం చూపనుంది.  ఏటియం మిషన్ల పనితీరు అందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే ప్రమాదం ఉంది. అలాగే పెట్రోధరలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వంపై కోపం తెప్పించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. కనీసం రాష్ట్రాలు ఈ విషయంపై అనుసరిస్తున్న దుర్మార్గాన్ని బట్టబయలు చేయలేకపోవడం ఒకరకంగా ఆత్మరక్షణలో పడడమే. యూపిఏ హయాంలో 150 రూపాయల దాకా ఉన్న కందిపప్పు ధర ఈ రోజు 70 ఉన్నా అది జనాలకు పట్టడం లేదు.
దేశీయ భావజాలం ఉన్న బీజేపీ ప్రభుత్వం స్వదేశీ చమురు నిక్షేపాల అన్వేషణ విషయంలో శ్రద్ధ చూపాలి. దేశంలోని కొత్త చమురు, సహజ వాయునిక్షేపాలను అన్వేషించే ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వేగవంతం చేయాలి. పారదీప్, మంగళూరు, కొచ్చి రిఫైనరీల శుద్ధి సామర్థ్యం ఇప్పటికే విస్తరణ జరిగి ఉంది. అలాగే రాజస్థాన్‌లో బార్మేర్‌లో ఏర్పాటు చేయాలనుకున్న రిఫైనరీని తక్షణ ప్రాజెక్ట్‌గా చేపట్టాలి. సామాన్యులపై భారంవేసి దాచిపెట్టి, దాచిపెట్టి రాష్ట్రాల ఖజానాలు నింపితే వాళ్ళు తమ పార్టీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో వాజ్‌పేయి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొని కూడా స్వర్ణచతుర్భుజి, ఆర్థిక ప్రగతి, సర్వశిక్షా అభియాన్ వంటి విస్త్రృత ప్రాజెక్ట్‌లు చేపట్టారు. ఇదంతా వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వంలో చేసారు కాబట్టి మోడీకున్న పూర్తి మెజారిటీని ఉపయోగించి తక్షణ చర్యలు చేపట్టి కొన్ని దీర్ఘకాలిక పనులు చేపట్టాలి. 
మేకిన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, ఉజ్జల పథకం వంటి పథకాలకన్నా ఈ దేశ మీడియాకు భావోద్వేగాల పంట పండాలి. కావున బీజేపీ ఎప్పటి నుండో అమలు చేయాలనుకున్న 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిరం విషయంలో వెంటనే ముందుకు పోవాలి. 1980 దశకంలో లాల్‌కృష్ణా అద్వాణీ చేసిన రథయాత్ర తీవ్ర సంచలనం రేపి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హిందువులను ఐక్యం చేసింది. ఆ తర్వాత బీజేపీ ఎదుగుతూ వచ్చింది. రామమందిరం ముందుకు జరుగలేదు. చర్చల ద్వారా ఇప్పటివరకు అయోధ్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు. కావున పార్లమెంట్ ద్వారా చట్టం చేస్తే రాహుల్ కర్ణాటకలో, గుజరాత్‌లో తిరిగిన గుళ్ళు, మొక్కులు, మానస సరోవరయాత్ర విశేషాలు, జంధ్యం ధరించిన శివభక్తి అన్నీ బయటపడతాయి. అలాగే ఇటీవల పరిణామాల్లో యూపీలో యోగి, రాజ్యసభలో వెంకయ్య, రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాధ్ కోవింద్ లాంటి దేశభక్తుల ఆధ్వర్యంలో ఈ పని జరిగితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మెజార్టీ  మైనార్టీ విభజన రాజకీయాలు వద్దనే అన్నిశక్తుల భండారం బయట పడటమేగాక మోడీ ఈ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలబడతారు. మోడీ అధికారానికి మూలమైన జాతీయవాద స్పృహను డా॥ సుబ్రహ్మణ్య స్వామిలాంటి వారు ఎప్పుడూ సజీవంగా ఉంచుతున్నా సంస్థాగతంగా తప్ప పెద్దగా మద్దతు దొరకడం లేదు. 
2014లో మోడీ అధికారం చేపట్టాక విదేశాల్లో మనదేశ కీర్తి ఘనంగా పెరిగిందన్నది నిజం. కానీ కాశ్మీర్‌లో జరుగుతున్న కల్లోలాలను కూకటి వ్రేళ్ళతో పీకేస్తే  చరిత్రలో అదొక  మైలురాయిగా మిగిలిపోతుంది. ఇటీవల పాకిస్తాన్ కాశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్‌వనీ పేరుతో స్టాంప్ విడుదల చేసి మన దేశాన్ని రెచ్చగొట్టింది. మనం కూడా పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కావాలని పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ప్రజలకు మద్దతుగా నిలబడాలి. ఈ విషయాలను అంతర్జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తున్న తారఖ్‌ఫతే లాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. కాశ్మీర్‌లో పండిట్ల పునరాగమనానికి చర్యలు చేపట్టాలి. సింధునదీ జలాల ఒప్పందాన్ని పునఃపరిశీలించి పాకిస్తాన్ ఆగడాలకు ముకుత్రాడు వేయాలి. 
అలాగే జీయస్టీ ద్వారా ఎక్కువమందిని టాక్స్ పేయర్స్‌గా మార్చడం గొప్పవిజయమే. కానీ ఆ పన్నులను పేదప్రజలకు ఎలా పంచుతున్నారో వివరించాలి. అలా చేయకుండి ఆర్థిక క్రమశిక్షణను హద్దులు మీరి చేసి మితిమీరిన నిరాడంబరత్వంతో ప్రచారం చేయకపోతే మోడీకి ఇబ్బందులే. జీయస్టీవల్ల చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయని ప్రతిపక్షాలు, వ్యతిరేకమీడియా గొంతెత్తి గోబెల్స్‌లా అరుస్తుంటే సరైన వ్యూహంతో ఎదుర్కోకపోతే ఎలా? అలాగే జాతీయవాద భావజాలానికి మీడియా సపోర్ట్ తక్కువగా ఉంది. జీన్యూస్, రిపబ్లిక్‌లు జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తున్న రాష్ట్రాల స్థాయిలో బీజేపీ మీడియాను ఉపయోగించుకోవడం లేదు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రస్థాయిలో మీడియా సంస్థల అధినేతలు పార్టీ పెద్దలను ఉపయోగించుకుంటూ తమ పరిశ్రమలు నడుపుకుంటూ బీజేపీపై విషం కక్కుతున్నారు. 
ఇక పొత్తులు, రాజకీయ అవసరాలు జరుపుకుంటూ పోతూ దానికి సరైన వ్యూహాత్మక వివరణ ఇవ్వకపోతే అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై విధ్వంసం జరిగాక దానిని పునరుద్ధరించుకోవాలా! పార్టీ నిర్మాణం చేయాలా? అన్న వ్యూహం లేకపోతే చేతిలోని గాజుబొమ్మ జారి పగిలిపోతే చేసేది ఏమీ ఉండదు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా, ఇతర పార్టీల్లోని బలమైన రెబల్ అభ్యర్థులను లాగేందుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదన్నది సర్వేసర్వత్ర వినిపిస్తున్న విమర్శ.
లేకలేక కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తే దానిని నిలబెట్టే ప్రయత్నం వ్యూహాత్మకంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాకాకుండా మొదటమొదటనే నోట్లరద్దు, జీయస్టీ లాంటి పెద్ద సంస్కరణలు నెత్తికి ఎత్తుకున్నారు. అలాగే జమిలి ఎన్నికలనే ఇంకో సంస్కరణకు తెరతీయడం సాహసమే అవుతుంది. “మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినండి.. నిజం! కాలమే వారికి సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అవి అంతర్గతంగా ఉండే శక్తులు” అని ఓ విజ్ఞుడు చెప్పింది నిజం. కానీ రాజకీయం రంగులరాట్నంలా గిర్రున తిరిగి పోతుంటే మౌనం అన్నిటికీ సమాధానం కాదు. మాయకులయందు మాయకుడై ప్రవర్తించాలన్న  నీతి చంద్రిక వాక్యం బీజేపీ నేతలు గమనిస్తే మంచిది. 
*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి
మంగళవారం : సెప్టెంబర్ : 25 : 2018
భారతీయ జాతీజవాదాన్ని చాటాలి : రామ్ మాధవ్ 












**************************************
  డాక్టర్‌. పి. భాస్కర యోగి
24 - 09 - 2018 : సోమవారం 



ఓ ప్రసిద్ధ దేవాలయంలో అద్దాల మండపం ఉంది. మధ్యలో ఉన్న ఊయలలో దేవుని విగ్రహం ఉంది. దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ అద్దాల మండప దర్శనం ఓ విశేషం. ఓ రోజు ఎలాగో కుక్క ఒకటి ఆ మండపంలోకి ప్రవేశించింది. చుట్టూ గోడలకున్న అద్దాల్లో అనేక కుక్కలు దానికి కన్పించాయి. వాటిని చూసి మొరగడం ప్రారంభించింది. అవన్నీ నిజమైన కుక్కలనీ, తనపై పడతాయని భ్రమించి అద్దాలపైకి దూకింది. అద్దాలు పగిలిపోయి దాని మూతి చిట్లి గాయాలయ్యాయి. జ్ఞానం ఉన్న మనుషులు అందులో ప్రవేశించి తమ రూపాలు ఎన్ని కన్పించినా భ్రాంతి చెందలేదు. కుక్కకు తన స్వరూపంలోని మర్మం తెలియనందు వల్ల అద్దాల్లోని కుక్కలపైకి దూకింది. అలాగే మనుషుల్లో జ్ఞానికున్న విశేష పరిజ్ఞానం అతనిలో ప్రబోధం కలిగిస్తుంది. దీనినే ఎరుక అని శాస్త్రకారులు చెప్తూ వచ్చారు.

ఎవరికైతే ఈ ప్రబోధం కలగదో వారు లోకంలోని విషయవాసనలు శాశ్వతమని, గొప్పవని అనుకుంటుంటారు. ప్రతి వ్యక్తీ తన బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం చూస్తారు. గడచిపోయిన బాల్యం, యవ్వనం ఎక్కడికి పోయిందని ఎవరూ ప్రశ్నించుకోరు. బాల్యంలోనే ఆ వ్యక్తి తనకు తెలియకుండానే మాయమవుతారు. యవ్వనం లభిస్తుంది. బాల్యం, యవ్వనం గుర్తులుగానే ఉంటాయి. వృద్ధాప్యం వస్తుంది. అలాగే ఆత్మీయులు చనిపోయినప్పుడు వారి పాంచభౌతిక శరీరాన్ని ముందు పెట్టుకుని రోదిస్తారు. నిజంగా ఈ శరీరం శాశ్వతమే అయితే అది అక్కడే ఉన్నా ఎందుకు రోదిస్తున్నారు? ఇక్కడే వేదాంత విజ్ఞానం మొదలవుతుంది.

"నాహం ప్రకాశస్సర్వస్య యోగ మాయా సమావృతః
మూఢోయం నాభి జానాతిలోకో మామజమవ్యయమ్‌"

‘‘నేను యోగమాయతో కప్పబడి ఉంటాను. సమస్త ప్రజలకు ప్రకాశించేవాడిని కాను. ఆత్మజ్ఞానం లేనివారు జన్మరహితమైన, నాశరహితమైన నన్ను తెలుసుకోలేరు’’ అన్న శ్రీకృష్ణుని ఆత్మజ్ఞానాన్ని ప్రబోధం ఉన్నవారు మాత్రమే గ్రహిస్తారు. అదిలేని వారు అన్ని దిక్కులకూ పరుగెడుతూ అహంకార ప్రదర్శన చేస్తారు. ఆ ఎరుక ఉన్నవారు స్వస్వరూపాన్ని గ్రహించి దుఃఖం లేని వారుగా ఉంటారు. శుకమహర్షిలా నిర్వికార, నిర్విమోహంగా జీవిస్తారు. అంతెందుకు! ఆధునిక కాలంలో.. రమణమహర్షి భయంకరమైన కేన్సర్‌ బారిన పడ్డారు. ఆ వ్యాధి తన శరీరాన్ని చిత్రవధ చేసినా ఆయన కంగారుపడలేదు. మృత్యుద్వారం వద్ద నిలబడ్డా ఆయనలో ఏ మార్పూ కలగలేదు. మృత్యువు శరీరానికి వచ్చిన నాశనంగా భావించే స్థితిలో ఆయన ఉన్నారు. మృత్యువును, శరీరాన్ని కూడా బయట నిలబడి చూసే సాక్షీభూతుడుగా రమణులు ఉన్నాడు. ఆ స్వస్వరూపానుసంధానం కనీసం భౌతిక జీవనంలో కలిగినా మనుషుల్లో వెంపర్లాట తగ్గి దుఃఖనాశనం అవుతుంది.


********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి 
నాపై సానుభూతి కురిపించండి ప్లీజ్ 
*********************************
– డా|| పి.భాస్కర యోగి
 జాగృతి : వారపత్రిక 
24 - 30 : సెప్టెంబర్ : 2018



‘ప్రతీది గంగా తీరం నుండి మాకు వచ్చింది’’ అని పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్ వాల్టేర్ అం టాడు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతీయ సంస్కృతి ముందు ఉంటుంది. 

గ్రీకు, రోమన్ నాగరికతలు క్రైస్తవ మత విస్తృతి తర్వాత కనుమరుగైపోయాయి. ఆసియాఖండ దీపంగా పేరొందిన బౌద్ధతత్త్వం ఇస్లాం దండయాత్రల తర్వాత నామమాత్రంగా మిగిలింది. రెండు వేల ఏళ్లలో అన్ని బాధలను తట్టుకొని నిలబడినవి భారతీయ, చైనా సంస్కృతులే. మన దేశంలో 700 ఏళ్ళు ఇస్లాం పాలన, 200 ఏళ్లు బ్రిటీషు వారి రూపంలో క్రైస్తవ పాలన సాగినా ఇక్కడి సాంస్కృతిక పునాదులను పూర్తిగా మార్చలేకపోయారు. దీనికి కారణం ఏమిటన్నది ఇవాళ ప్రపంచం ముందున్న ప్రశ్న!

ఇపుడు అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలు వాటి మూల సంస్కృతి కోల్పోయి వ్యాపార, వాణిజ్య రూపంగా కన్పిస్తున్నా, వాటి అంతర్గత ప్రవాహంలో క్రైస్తవం ఉంది. ఆప్ఘన్ చుట్టూ వున్న గాంధార స్థానంలో ఇస్లాం రాజ్యమేలుతుంది. భారత్‌లోని 135 కోట్ల జనాభా ప్రపంచంలోని 650 కోట్ల జనాభాలో అతి పెద్ద భాగం. ఇది ప్రపంచ మానవ వనరే గాకుండా మార్కెట్టుగా కూడా ఉపయోగపడాలనే వాణిజ్య మతరాజ్యాల లక్ష్యం. అందుకే దీనిని మార్కెట్ మాయాజాలంలో ముంచాలంటే ఏం చేయాలని ఆలోచించిన ఈ మత వాణిజ్యవేత్తలు ఇక్కడికి ‘హిట్‌మాన్’లను పంపించారు. వీళ్ల దెబ్బకు సోవియట్ రష్యానే ముక్కలుగా అయిపోయింది. ఇలా విడగొట్టాలని సిఐఏకు చెందిన గూఢచారులు పనిచేస్తున్నట్లు ఎన్నో వార్తలొచ్చాయి. రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్ బహిరంగంగానే చెప్పారు. సోవియట్ రష్యా తర్వాత వీరి లక్ష్యం భారత్, చైనాలే. చైనా కఠినమైన నియంతృత్వ విధానాలు అవలంబించడంతో ఈ కుట్రలకు సందు దొరకట్లేదు. కానీ భారత్‌లో మితిమీరిన స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం ఉన్నందున ఇది ప్రథమ లక్ష్యం అయ్యింది. 

పాశ్చాత్య క్రైస్తవ వాణిజ్య విస్తరణ కోసం ఒకవైపు ప్రయత్నం జరుగుతుంటే, వెయ్యేళ్లు పాలించినా మేం ఈ దేశాన్ని పూర్తిగా ఆక్రమించలేకపోయాం అని ప్రపంచ ఇస్లామిక శక్తులు మరోవైపు చూస్తున్నాయి.

ఈ క్రమంలో దేశంలోని విభజన శక్తులను ఈ వ్యవస్థలే పెంచి పోషిస్తున్నాయి. ఈ దేశాన్ని పట్టుకోవాలంటే ఈ సంస్కృతి విధ్వంసం కావాలన్నదే వారి ఆలోచన. ఇక్కడి మెజారిటీ ప్రజల అలవాట్లను మార్చితే మార్కెట్‌ను విస్తరింపజేసుకోవచ్చని వారు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, దుస్తులు, పని సంస్కృతి, పండుగల్లో మార్పులు.. 

ఇలా కొత్త కొత్త మా ర్కెట్లు సృష్టించినపుడే ఇది సాధ్యం అవుతుంది. ఉదాహరణకు ఇక్కడ లేని ‘బర్త్‌డే పార్టీ’లను అలవాటు చేసారు. దాంతో కేక్‌లు కోయడం, అందులో కలిపే తినాలనిపించే ‘పదార్థాల’ అమ్మకం పెరిగింది. ఇక్కడి సినిమా నటులు విదేశాలకు వెళ్లి హాఫ్ కట్ గౌనులు తొడుక్కోవడం చూసివస్తే ఇక్కడి చలన చి త్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో అవే వేసుకోవడం మనకు నిత్య దృశ్యాలే. అది చూ సేందుకు ఇక్కడి యువకులు టీవీలకు అతుక్కుంటే- వాళ్ల వాణిజ్య ప్రకటనలు మెదళ్లలో నిక్షిప్తం అవుతాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల 24 గంటలూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. 

ఇదంతా మెల్ల మెల్లగా యువకుల్లో లైంగిక ఉద్రేకాలకు కారణం అవుతోంది. ఇలా సాంస్కృతిక ధ్వంసం వల్ల వాణిజ్య జీవనంలోకి మనల్ని లాగడమే అసలు కథ ప్రారంభం అవుతుంది. తనదికాని పరాయి సంస్కృతివైపు మనిషి మళ్లాలంటే ఏం చేయాలి? సాంస్కృతిక విధ్వంసం జరగాలి. అందుకు ఈ దేశ మూల సంస్కృతికి ఆధారమైన నమ్మకాలపై దాడి జరగాలి. దీనికోసం ఎంచుకొన్న గొప్ప మార్గమే ‘అర్బన్ నక్సలిజం’!

వీరంతా మహానగరాల్లో మావోయిస్టులు, ఒకాయన రచయితగా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన యం.యం.కల్గురి. ఈయన శివలింగాలపై మూత్రం పోస్తానని అంటాడు. దీనికి బసవేశ్వరుణ్ణి అడ్డుపెట్టుకొంటాడు. 

రంగనాయకమ్మ లాంటి పేరుమోసిన రచయిత్రి రామాయణ విషవృక్షం రాస్తుంది! భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి వారు భాషాశాస్తవ్రేత్తలుగా నటిస్తూ తెలుగు భాషను ఎందుకూ కొరగాకుండా చేసారు. కంచె ఐలయ్య లాంటివారు కులాల మధ్య సంఘర్షణను రెచ్చగొడుతారు. దళిత ఫ్రీడం నెట్‌వర్క్ పేరుతో ఉన్న సంస్థ ఇతనికి అండగా ఉంటుంది. 

ఈ విషయం రాజీవ్ మల్హోత్రా తన ‘బ్రేకింగ్ ఇండియా’లో వివరించాడు. సీపీఎంకు అనుబంధంగా పనిచేసే జన విజ్ఞాన వేదిక నాస్తికత్వాన్ని నడిపిస్తుంది. మావోయిస్టు వాదనలను వినిపించే గొంతుకలు కేంద్ర సాహిత్య అకాడమీలో తమ స్థానం పదిలం చేసుకొన్నాయి. 

చరిత్ర పేరుతో వెండి డోనిగల్, దొమిల్లా థాపర్, సతీశ్ చంద్ర లాటివారు ఈ దేశపు అసలు చరిత్రను మరుగుపరిచి స్వాభిమానం లేకుండా చేస్తారు. రచయితలుగా అరుంధతీ రాయ్, అర్బన్ సుఖియా, బిపిన్ చంద్ర వంటివారు రోజూ ప్రతీకాత్మక శక్తులకు మద్దతునిస్తారు. 

గాంధేయవాద ముసుగేసుకొన్న రామచంద్ర గుహలాంటి వారు కొత్త కొత్త చారిత్రక వివాదాలకు ‘ముగింపు’ ఇస్తారు. మేధా పాట్కర్ లాంటివాళ్లు రోజూ ఆందోళనలతో వార్తల్లో ఉంటారు. దాదాపు 10 ఏళ్లు నడిచిన నర్మదా బచావ్ ఆందోళనను- మెడలో బంగారు గొలుసు కూడా లేని మేధాపాట్కర్ ఎలా నడిపింది? స్వామి అగ్నివేశ్ లాంటి వారు ఆర్య సమాజం ముసుగులో బజార్లోకి వచ్చి హిందూ దేవీ దేవతలను దూషిస్తారు. 

జాన్ దయాల్ వంటి క్రైస్తవ ఎన్జీవో నాయకులు ఈ దేశంలో విద్యుత్ ప్రాజెక్టులను ఆపగలరు. ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్ వంటివారు విద్యా ర్థి నాయకుల ముసుగులో ‘ఆజాదీ’ కావాలని నినదిస్తారు. 

రాజ్‌దీప్ సర్దేశాయి, బర్ఖాదత్ వంటివారు జర్నలిస్టుల రూపంలో జాతీయ వాదంపై యుద్ధం చేస్తుంటారు. వరవరరావు లాంటివారు కవిగా, గద్దర్‌లాంటి వారు కళాకారుడిగా, సుధా భరద్వాజ్ లాంటివారు మానవ హక్కుల కార్యకర్తగా, ప్రశాంత్ భూషణ్ షబ్నం లోన్ వంటివారు న్యాయవాదులుగా తన కార్యక్రమాలు కొనసాగిస్తారు. 

ఇక విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన జి.యన్.సాయిబాబా వంటి విద్యావేత్తలు యూనివర్సిటీల్లో ఈ భావవ్యాప్తి కొనసాగిస్తారు.

ఈ మహానుభావులంతా తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎన్జీవోలు తోడ్పాటును అందిస్తాయి. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్జీవో నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించాడు. అప్పటినుండి గిలాగిలా కొట్టుకుంటున్న ఈ స్వయం ప్రకటిత మేధావులు మోదీపై అకారణ ద్వేషం పెంచుకొన్నారు. 

మైనారిటీలకు సెక్యులరిజం పేరుతో మద్దతు ఇస్తే అది వికటించి ‘మెజారిటీ వర్సెస్ మైనారిటీ’గా మారుతుందని భయభ్రాంతులకు గురైన వీరు కులం కార్డును అందుకొన్నారు. దాని పర్యవసానమే రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని ఇపుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. 

31 డిసెంబర్ 2017 నాటికి బీమా కోరేగావ్ యుద్ధ విజయానికి 200 ఏళ్లు అయ్యింది. 1 జనవరి 1818న జరిగిన ఆ కదనంలో మహర్లు పీష్వాలను ఓడించారు. దీనిని బట్టి ఈ దేశంలో దళితులు ఎంత యోధులో మనకు తెలుస్తుంది. కానీ దళితుల అణచివేత జరుగుతోందని ఈ గ్యాంగే ప్రచారం చేస్తుంది. 

జస్టిస్ పార్టీ అవశేషమైన జాస్తి చలమేశ్వర్ అనే న్యాయమూర్తి భారత చరిత్రలో మొదటిసారి ప్రజల ముందుకు వచ్చి- సుప్రీం కోర్టులో అన్యాయం జరుగుతోందనగానే సెక్యులర్ ముఠాలు, నాయకులు కేంద్రంపై ఒంటికాలినెత్తారు. 

మోదీపై హత్యకు కుట్ర కేసులో అనుమానితులకు సుప్రీం కోర్టు అనుకూలంగా మాట్లాడితే- అది ప్రజాస్వామ్య విజయం అంటున్నారు.

నక్సలైట్లు అడవుల్లో గన్నులు పట్టుకొని చేసిన విధ్వంసంతో సమతూకంగా ఈ మహానగర మావోయిస్టులు పెన్నులతో మెదళ్లలో విషం నింపుతున్నారు. 

ఈ అరెస్టులను, విచారణను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ నిందించడం, ‘వేయి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్ర చేయడమే’. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, మన్మోహన్ సింగ్ వంటి కాంగ్రెస్ పెద్దలు ఇదే నక్సలైట్ విధానాలను గురించి ఏం మాట్లాడారో రికార్డులు తిరగేస్తే బాగుంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ కదా 128 నిషేధిత సంస్థల్లో ఈ గ్రూపును పెట్టింది?

విచారణ చేస్తే కదా నిజానిజాలు తెలిసేది? ఈ దేశంలో అవకాశవాదం కోసం ఏదైనా మాట్లాడుతారు. వందలమంది ప్రాణాలను బలిగొన్న యాకూబ్ మెమెన్‌కు అనేక సంవత్సరాల విచారణ తర్వాత ఉరిశిక్ష విధిస్తే దానిని రద్దుచేయాలని అర్ధరాత్రి వేళ సుప్రీం కోర్టు తలుపు తట్టేవాళ్లు- మిర్యాలగూడలో మారుతీరావును అర్జెంట్‌గా చంపాలంటారు? 

చట్టాన్ని, దర్యాప్తు సంస్థలను గౌరవించడం అంటే సామాన్యులకు అర్థం కావడం లేదు. భీమా కోరేగావ్ అల్లర్ల తర్వాత ఎల్గార్ పరిషత్ చేసిన చర్యలపై ఆర్నెళ్లు విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు అయిదుగురిని అదుపులోకి తీసుకొంటే అదేదో ప్రజాస్వామ్యం నాశనం అయినా మిలిట్రీ పాలన వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సబబు? ఒకవేళ వాళ్లు అందులో పాల్గొనకపోతే మంచిదే కదా? అయితే వాళ్లను అరెస్టు చేయడమే మహానేరంగా మీడియా సంస్థలు గోల చేయడం బాగాలేదు. 

అయినా ఈ రోజు నీతిమంతుడైన ప్రధాని మరణం కన్నా ఈ బుద్ధిజీవుల నిర్బంధమే ఘోరంగా కన్పించడం విశేషం!?
నిజానికి మావోయిస్టుల్లో ఎక్కువమంది బహుజన కులాలవారే ఎందుకు మరణిస్తున్నారు. 

అగ్రకుల మేధావులంతా హాయిగా పట్టణాల్లో కూర్చుని సాధ్యం కాని సిద్ధాంతాలను యువకుల మెదళ్లలోకి ఎక్కించి తుపాకులిచ్చి పంపిస్తారు. 

సత్యమూర్తి ఎందుకు బయటకు వచ్చాడో చెప్పగలరా? అర్బన్ నక్సల్స్ ముద్రపడిన ఈ మేధావుల కుమారులు, అల్లుళ్లు, కూతుళ్లు ఉన్నత ఉద్యోగాలు సంపాదించడం నిజం కాదా? కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎవరు పెత్తందార్లో చెప్పగలరా? మొన్నటికి మొన్న సుప్రీం ఐకోర్టు అవకాశం వస్తే ఇంటికి వచ్చిన వరవరరావును కుటుంబ సభ్యులంతా ఎదురేగి కౌగిలించుకొన్నపుడు ఆయనలో ఎంతో భావోద్వేగం కన్పించింది. 

అలాగే దళిత, బహుజన బిడ్డలు ఉద్యమంలోకి వెళ్లి తల్లిదండ్రులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరుకాలేని స్థితిలో వాళ్లకు ఎంత బాధ కలిగి వుంటుంది? ప్రాణాలు పోగొట్టుకున్న దళిత, బీసీ కులస్థులు పోలీసులు కావచ్చు, మావోలు కావచ్చు. వాళ్లకు కుటుంబ సభ్యులు ఉన్నారని విస్మరిస్తే ఎలా? వరవరరావు లాంటి భావోద్వేగం గల కవికి, మేధావికి చేసే వినతి- ఇన్నాళ్లకు నీతిగల ఓ ప్రధాని బీసీ కులం నుంచి వచ్చాడు..

 ఆయనపై మేధో ఉగ్రవాదం వద్దు. ఒకవేళ ఈ మేధావులకు సంబంధం లేకపోతే అలాంటి కుట్ర జరుగకపోతే అంతకన్నా గొప్ప విషయం ఇంకేమీ ఉండదు.

*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

ఆహ్వానం 
''ఫోర్త్ ఎస్టేట్'' పుస్తకావిష్కరణ 












********************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
24 - 09 - 2018 : సోమవారం 


తెలంగాణ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 
''ఒక నియంత తలవంచిన రోజు'' పుస్తకావిష్కరణ 








************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
07- 08 - 2018 



ఒక గండుపిల్లి ఎలుక వెంబడి పడింది. అది రంధ్రంలోంచి బయటకు వచ్చిన ఎలుకను వేటాడింది. అది ఎలాగోలాగ తప్పించుకొని మళ్ళీ కన్నం దగ్గరకు చేరింది. పిల్లికి దొరకకుండా కన్నంలోకి దూరుదామంటే లోపల పాము చేరింది. లోపలకు పోతే పాము, బయట ఉంటే పిల్లి....!? ఆ తర్వాత కథ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేడి ఇలాగే ఉంది. ఎన్నికలు డిసెంబర్‌లో జరిగితే పిల్లిగండం....! మేలో జరిగితే పాముగండం....! ఇదొక నర్మగర్భమైన కథ.
గత నెలలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “ప్రగతి నివేదన సభ” తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవుటర్ రింగు రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు తీసేసి కొంగర్ కలాన్‌లో సభ జరిపి లోకాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకున్న కేసీఆర్ ఎందుకో వ్యూహాత్మక తప్పిదం చేసాడని అందరూ భావిస్తున్నారు. నిజానికి ఎలాగూ ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకొన్నపుడు అదే రోజు లక్షలాది ప్రజల ముందు ప్రకటిస్తే ఇంకా బాగుండేది. కనీసం కేబినెట్‌కైనా తెలియకుండా కేవలం ఒక సీఎం నిర్ణయం తీసుకోవడం తప్పుడు సంకేతాలను ఇచ్చింది. ఎలాగూ వారంలోపు చేస్తున్నపుడు ఆ రోజు ప్రజలతో ‘ఔను’ అనిపించి అక్కడి నుండే కేసీఆర్ నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్తే అదొక చరిత్రగా మిగిలేది.
సర్వసాధారణంగా కేసీఆర్ మాట్లాడే పంచ్‌లు, పిట్టకథలు, తెలంగాణ భాషారీతులు, విసుర్లు, వ్యంగ్యాస్త్రాలు ఆ రోజు లేకపోవడం ఆయన 57 నిముషాల ప్రసంగాన్ని చప్పగా చేశాయి. ఆ తర్వాత ప్రతిపక్షాలు కేసీఆర్‌పై చేసిన వ్యతిరేక ప్రచారం బాగా పేలింది. ఇన్ని వందల కోట్లు పెట్టి సభచేసి ఏమీ కొత్తదనం లేదనే ‘నెగిటివ్ అప్రోచ్’ ప్రతిపక్షాలు బాగా ప్రజలవద్దకు చేర్చగలిగాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాక ఆనాడు నాయకులంతా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోనే ఉన్నారు. ఇంత గండర గండపార్టీలను కాదని ఉద్యమ ఆకాంక్షకోసం కొందరు కేసీఆర్ వెంట నడిచారు. అలాగే ప్రభుత్వాలకు భయపడకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థులను రోడ్ల మీదకు తెచ్చాయి.
ఉస్మానియా విద్యార్థులైతే ఏకంగా ప్రాణాలే బలిపెట్టారు. ఉద్యోగవర్గాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన మేలు ఏవీ లేవని ఉద్యోగుల అభిప్రాయం. కేవలం కొందరు సంఘనాయకులకు లాభం జరిగిందని ఈ రోజు వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లు చూస్తే అర్థం అవుతుంది. వీటిన్నిటికి తోడు 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేద్దామనుకొన్న కేసిఆర్‌కు అదికూడా ఇబ్బందికరంగానే మారింది. రెండు మూడు రోజులు మౌనం పాటించిన అధికారపార్టీలో వలస నాయకులు టిక్కెట్లు రాకపోవడంతో తెరమీదకు వచ్చారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న వీళ్ళంతా తమిళనాడు తరహాలో దండాలు పెడతారనుకుంటే ఇలా ఎదురు తిరగడం టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమే. కానీ కాంగ్రెస్‌లో కూడా ఇలా టిక్కెట్లు రాని బ్యాచ్ పెద్దదే ఉండడం వల్ల రేపు ఎన్నికల ఫలితాలను ఈ అంశాలే నిర్ధారిస్తాయి.
కాంగ్రెస్ కూడా ఉత్సాహంగానే ఉన్నా వాళ్ళకూ ఓ గండం వచ్చి పడింది. కేసీఆర్‌ను దెబ్బకొట్టాలంటే టీడీపీతో పాటు సీపీఐ, టిజెఎస్ ను కలుపుకొని మహాకూటమి ఏర్పాటుచేయడం వల్ల కాంగ్రెస్ గెలిచే సీట్లను కూడా త్యాగం చేయాల్సివస్తుంది. ఎందుకంటే కోదండరాం, రావుల, ఎల్.రమణ వంటి 20 మంది ముఖ్యనేతలను ఎన్నికల్లో నిలబెట్టాలంటే కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు రావు.  జగ్గారెడ్డి అరెస్టు, రగిలిపోతున్న ఉద్యోగులు, కేసీఆర్ నియంతృత్వం, కాంగ్రెస్ ప్రచారానికి బాగానే ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలను, ప్రచారాన్ని కాంగ్రెస్ తట్టుకుంటేనే భవిష్యత్తు. కోదండరాం లాంటి వాళ్ళ ‘సున్నిత ప్రవచనాలు’ కేసీఆర్‌ను ‘ఢీకొట్టలేకపోయినా’ అది నెగెటివ్ ప్రచారం క్రింద మారి కాంగ్రెస్‌కు లాభిస్తుంది. ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసే కమ్యూనిష్టు పార్టీలకు ఇదొక సంబరం. 
ఇక ఇపుడు మోడీని మోదేయాలనుకున్న చంద్రబాబు కేసీఆర్‌పై పరోక్ష యుద్ధం ప్రకటించి కాంగ్రెస్‌కు సంతోషం కలిగిస్తున్నాడు. 2010లో తెలంగాణలో తీవ్ర ఉద్యమం జరుగుతుంటే దాన్ని దెబ్బతీయడానికి, తన క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పోరాటం చేస్తానని వెళ్ళాడు. ఆనాడు రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బాబుపై కేసులు పెట్టింది. న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరిస్తూ కోర్టుకు వెళ్ళని బాబుకు అరెస్ట్‌వారెంట్ వచ్చింది.  కానీ బాబ్లీకేసు వారెంట్ న్యాయస్థాన పరిధిలో జరుగుతున్నా దానికి మోడీని బాధ్యుడిగా చేసి సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడం మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళందరికీ అర్థం అయ్యింది. కోర్టులకు హాజరుకాకపోతే న్యాయస్థానాలు ఊయలలోకి వేసి ఊపాలా? దీనిని తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటే అదికూడా తెరాసకు లాభమే.  నిజానికి తెలంగాణలో తెలుగుదేశం నాయకులకు వ్యక్తిగతంగా పేరున్నా అది పార్టీ బ్రాండ్‌లోకి మారి నష్టంగా మారుతుంది.
తెలంగాణలో బీజేపీకు ముందు నుండి ప్రత్యేక క్యాడర్ ఉంది. కావున ఈ నెల 15న పాలమూరు జరిగిన ‘శంఖారావం’ ఆ పార్టీ నాయకులు కూడా ఊహించని విధంగా సక్సెస్ అయింది. ఈ సారి ఆచారి, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, డా॥కె.లక్ష్మణ్ చక్కగా మాట్లాడి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రాజాసింగ్ వేదిక మీదకు రాగానే జనం కేరింతలు అతని అవసరం పార్టీకి ఎంత ఉందో సూచిస్తున్నది. రాజకీయాల్లోకి రావాలని ఉవ్వీళ్ళూరుతున్న పరిపూర్ణానందను ఎందుకో బీజేపీ అంగీకరించలేదు. బహుశా! ఆయన ఆంధ్రాప్రాంతానికి చెందడం వల్ల, తెలంగాణలో ప్రాంతీయ భావోద్వేగాలకు ఎప్పుడూ స్థానం ఉన్నందున అది సాధ్యం కాకపోవచ్చు.
తెలంగాణ బీజేపీకు అద్భుత అవకాశం ఉంది. నిజానికి అప్రతిహతంగా ముందుకు వెళ్ళే కేసీఆర్‌ను మహబూబ్‌నగర్‌లో మెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచంద్రరావు నిలబెట్టి దెబ్బతీసింది బీజేపీనే. ఇపుడు పొత్తుల గోల లేని ఏకైక పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఒకవేళ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటగలిగితే ‘కింగ్‌మేకర్’ అవుతుందని సర్వేసర్వత్ర వినిపిస్తున్న మాట. 50 మంది ఇప్పటికీ నియోజక వర్గాల్లో బాగా పనిచేస్తున్న వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి, మిగతా 69 మంది ఇతర పార్టీల అసంతృప్తుల్లో నిజాయితీపరులైన సమర్థులకు టికెట్లు ఇచ్చి గెలిపిస్తే రేపు తెలంగాణ రాజకీయం మారనుంది. బీజేపీ వ్యూహం ఏంటో ఇంకా తెలియదు. 
తెలంగాణలో పుట్టిన ఈ ఎన్నికల వేడి ఢిల్లీవరకు తాకే ప్రమాదం, ప్రమోదం రెండూ ఉన్నాయి కాబట్టి రెండు జాతీయపార్టీలకు ఇది కీలకం. అలాగే 17 పార్టీలను ఏకం చేస్తానని చెప్పే బాబుకు ‘ఇది కూడా నేనే సాధించా’ అనడానికి పనికి వచ్చే ఆయుధం ఇది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగి బీజేపీ, కాంగ్రెస్ రహిత పాలనకు నాంది పలుకుతా అంటున్న కేసీఆర్‌కూ కీలకం. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. కాబట్టి రాహుల్‌కు ఇది మరో అగ్ని పరీక్ష. 
ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోతే ‘కాంగ్రెస్ ముక్తభారత్’ అనడానికి మోడీకి మరో కలికితురాయి. ఇక చూడాలి ఇది రణమో! రావణ కాష్టమో!!
*******************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి

గాలికిపోయే పిలుపు పిండి కృష్ణార్పణం..! 


*********************************
– డా|| పి.భాస్కర యోగి
 జాగృతి : వారపత్రిక 
17 - 23 : సెప్టెంబర్ : 2018


పాటిల్ నారాయణరెడ్డిగారు వినాయక చవితి నాటి చంద్రదర్శనంను వివరిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించాడు. “చంద్రుడు తన మార్గమందు భూమిచుట్టూ చుట్టునపుడు  ఒక దినమందు (24 గంటలందు) సుమారు 12 డిగ్రీలంత సంచ రించును. ఈ 12 డిగ్రీలంత సంచరించుకాలాన్నే ఒక తిథి అందురు. ఇప్పుడు పాడ్యమి మొదలు 12 డిగ్రీల నుంచి ప్రారంభమైన పౌర్ణమి దినానికి 180 డిగ్రీలు, అమావాస్య దినానికి 360 డిగ్రీలు సంచరించును. చంద్రుడు చతుర్దశి దినాన్ని 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీలంత సంచరించును. చంద్రుడు ఈ కోణంలో ఉన్నపుడు భూమిపై ఉన్న మానవుని మనస్సుమీద చెడ్డ ప్రభావంను చూపును.
“చంద్రమా మనసోజాతః శ్చక్షఃసూర్యో అజాయత..” అని పురుష సూక్తం చెప్పును. ఈ కాలమందు అనగా చతుర్దశినాడు అర్థాత్ చంద్రుడు 36 డిగ్రీల నుంచి 46 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు చంద్రుని దర్శించిన చంద్రుని నుంచి బహిర్గతమగు కిరణాలు (కాస్మిక్ రేస్) చంద్రుని ఆకర్షణశక్తి మానవుని మనస్సు మీద అల్ప ప్రమాణంగా సూటిగా ప్రభావం చూపును. మనస్సుకు ఒక విధంగా ఉత్సాహం తక్కువగును. ఎప్పుడైతే ఉత్సాహం తక్కువగునో అప్పుడు ఏ విధమైన నిర్ణయాన్ని సరిగ్గా చేయుటకు బుద్ధి ప్రచోదనం కాక తప్పు చేయవచ్చును. అందుచేత అపవాదులు వినవలసి వస్తుంది. ఈ దృష్టిచే చతుర్దశి దినాన చంద్రుని చూచుట నిషేధించినారు.
చంద్రుడు మనస్సు మీద ఏ విధంగా ప్రభావంను ప్రసరించును. అనుదానిని మనం ఇంకా లోతుగా చూద్దాం.. పౌర్ణమి లేక అమావాస్య రోజున చంద్రుడు, భూమికి కేంద్రానికి (108 డిగ్రీకి) వచ్చినప్పుడు మానసికంగా దుర్భలులైన వారికి ఎక్కువ ఉద్రేకం కలుగును. దీనిని ఈనాటి మానసిక రోగచికిత్స నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. అందుచేతనే చంద్రుడు ‘మనఃకారకుడు’ అన్నారు. పౌర్ణమి లేక అమావాస్య రోజులలో చంద్రుని ప్రాబల్యం ఎక్కువ ఉన్నంత చతుర్దశి నాడు ఉండదు కాని తక్కువ స్థాయిలో మాత్రముండును. ఇది కోణపు వ్యత్యాసంతో అగును. ఇప్పుడు మనకు చతుర్దశి దినాన చంద్రుని దర్శించిన ఆలోచనాశక్తి తక్కువ అగునని దీంతో విదితమవుతున్నది. దీనిని గమనించి పరీక్షించిన బాగా తెలుస్తుంది.
ఇక ప్రతి పక్షములందు(శుక్ల  కృష్ణ)ను చంద్రుడు సంచరించునపుడు, బహుళ చతుర్దశి దినాన చంద్రుని దర్శించుట నిషేధించలేదు. కేవలం శుద్ధ చతుర్దశి రోజున మాత్రమే ఎందుకు నిషేధించారు. బహుళ చతుర్దశి రోజున 108 డిగ్రీకి వచ్చి, అక్కడ నుంచి బహుళంనందు, 192, 204 డిగ్రీలు. ఇలా 12 డిగ్రీలు ఎక్కువగుచూ చతుర్దశి నూడా 216 డిగ్రీల నుంచి 226 డిగ్రీల యందు సంచరించు (చుండు)ను, దీనిని మనం చాలా ముఖ్యంగా గమనించాలి. అయినా చతుర్థి తిథిని రక్తతిథి అని పరిగణించి, జ్యోతిషమందు ఈ దినాలలో శుభ కార్యాలను చేయకూడదని చెప్పారు. చతుర్థి తిథికి యముడు ‘అధిదేవత’ అన్నారు. ఈ కారణాల చేత కూడా ఈ తిథి యందు శుభకార్యాలను నిషేధించారు.
ప్రతి శుద్ధపక్షపు చతుర్దశి దినాన్న చంద్రుని చూడకూడదని ఎందుకు నిషేధించలేదు? కేవలం వినాయక చతర్దశి రోజన మాత్రం ఎందుకు నిషేధించారు? ఇతర మాసాల శుక్లపక్షాల చతుర్దశి దినాన చంద్రుని ప్రభావముండదా? దీనికి ఉత్తరం శ్యమంతకోపాఖ్యానమునందున్నది. కన్యామాసమందు అనగా సూర్యుడు కన్యారాశి యందు ఉన్నప్పుడు భాద్రపద శుద్ధ చతుర్దశి దినాన చంద్రుని చూడకూడదని నిషేధించారు. ఎందుకని ఈ రోజున చంద్రుని ప్రభావం మంచిది కాదు? కన్యామాసమందు మాత్రమే ఎందుకు చెప్పారు? ఈ రాశియందు సూర్యుడు తులారాశికి పోవుచుండుట, ఈ కాలమందు చంద్రుడు భూమికి 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు సంచరించునప్పుడు అతని ప్రభావం ఎక్కువ చెడ్డ పరిణామకారియని మహర్షులు నిర్ధారించారు.
ఖగోళశాస్త్ర ప్రకారం చంద్రుని శక్తి, కాంతి సూర్యుని నుంచే జరుగును. ప్రభావితమగును. దీనిని గమనించాలి. ఎప్పుడైతే సూర్యునిశక్తి తక్కువగునో అప్పుడు అది చంద్రుని మీద కూడా వచ్చి తీరును. ఇక్కడ నీచ అనగా సూర్యుడు భూమికి కొంత దూరాన ఉండును. మేషరాశియందు సూర్యుడు భూమికి సమీపాన ఉండుటచే వేడి  తాపం ఎక్కువ. ఎండాకాలం మొదలగును. తులారాశి యందుండునప్పుడు చలి మొదలగును. గ్రహాల చలనాలచే ఈ విధంగా వ్యత్యాసం అగుట ప్రకృతి నియమం. ఇంతేకాదు చతుర్దశి తిథికి యముడు అధిదేవత అని చెప్పబడింది. అందుచే ఈ దినాన చంద్రుని చూడకూడదు అన్నారు.
చంద్రుని నేరుగా చూడకుండా ఉన్నప్పటికి అతని ప్రభావం మనస్సుపై నుండగా అని ప్రశ్నించవచ్చును. చంద్రుని ప్రభావం ఎల్లకాలం మానవుని మనస్సు మీద ఉండును. కాని ఈ ప్రభావం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంనందుండునపుడు వేరు వేరు రీతుల్లో ఉండును. అంతేగాక చంద్రుడు ఏ నక్షత్రమునందుండునో ఆ నక్షత్రపు ప్రభావం కూడా మానవుని మనస్సు మీద తప్పక పడుతుంది. ఇటువంటి చంద్రుని చూచుటచే చంద్రుని నుంచి బహిర్గతమగుచుండు కిరణాల మూలంగా మెదడు మీద నేరుగా ప్రభావం చూపి మనస్సు మీద కూడా దీని పరిణామముండును” అని చెప్పారు. చవితినాటి చంద్రదర్శనం వల్ల కలిగే ఖగోళ గణాంకాలు ఇవి. అందుకే మన ఋషులు ఇది ఒక ఆచారంగా మార్చారు.
********************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధ్యాత్మికం : విజయక్రాంతి



గజాననం భూతగణాది సేవితం
కపిత్థ జంబూఫల సారభక్షకం
ఉమాసుతం శోక వినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం॥
వినాయకుడు తంత్రశాస్త్రపరంగా ‘ఉచ్ఛిష్టగణపతి’ రూపంలో పూజింపబడుతున్నాడు. అలాగే తంత్ర శాస్త్రాల్లో ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే త్రిశక్తుల అధిపతిగా త్రికోణ మధ్యగతుడిగా వర్ణించబడ్డాడు. అందుకే ‘ముత్తుస్వామిదీక్షితులు’ ‘వాతాపిగణపతింభజే’ అన్న కీర్తనలో వినాయకుణ్ణి త్రికోణమధ్యగతుడిగా వర్ణించాడు. పల్లవుల రాజధాని అయిన కాంచీపురంలో పల్లవచక్రవర్తుల్లో ప్రసిద్ధుడైన నరసింహవర్మ కర్ణాటకలోని ‘బాదామి’గా పిలువబడే ‘వాతాపి’ని ముట్టడించి అక్కడి పాలకుడైన పులకేశిని జయించి నరసింహవర్మ ఈ వినాయక మందిర నిర్మాణం చేశానట్టు చెబుతారు. అలాగే హంపిలో శిథిల దేవాలయాల్లో కొన్ని పెద్ద వినాయక విగ్రహాలు కన్పిస్తాయి. 
వినాయకుడు యోగశాస్త్రంలో చెప్పబడే షట్చక్రాల అధిదేవతల్లో ఒకరిగా కన్పిస్తాడు. ‘మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి’. “త్వం మూలాధార స్థితోసి నిత్యమ్‌” అని గణపతిని యోగశాస్త్రాలు వర్ణించాయి. గణపతిని యోగపద్ధతి ద్వారా పూజిస్తే ఎలాంటి ధనలాభం పొందుతామో ఆర్.పద్మావతి ఈ విధంగా వివరించారు. “నాగగణపతి బీజాక్షరంతోనే యోగి మూలాధారంను చైతన్యవంత మొనర్చడం ద్వారా కుండలనీశక్తి ఒక్కసారి బుసలు కొట్టిన పాములాగా పైకిలేచి ఇడ, పింగళ, మధ్యనున్న సుషమ్న నాడిలో సంచారం చేస్తూ షట్చక్రాలను ఛేదిస్తూ ‘సహస్రారం’ చేరుతుంది. ఈ కుండలినీ శక్తిని మేల్కొల్పుట వలన యోగికి సిద్ధి కలుగుతుంది.
మనస్సుకు పైనున్న బుద్ధి కూడా మేల్కొంటుంది. ఈ సిద్ధి, బుద్ధి  ఇడ, పింగళ అనేవి జంటనాడులుగా సుషమ్న నాడీద్వారంలో నివసించే గణపతిని చేరుతాయి. సిద్ధి, బుద్ధులను గణపతిపత్నులని అందుకే అంటారు. గణపతి బ్రహ్మచారిగానే నిలిచి ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మంలో చరించే యోగసిద్ధికీ, సుషమ్న నాడిలో సంచారం చేసే గణపతి చైతన్యమే యోగసిద్ధులకూ మూలాధారం. దీనిని ‘లం’ పృథివీ తత్వాత్మికాయై దగ్గర, ‘ఓం లం గణపతియేనమః’ అని గణపతి ఉపనిషత్తు ప్రారంభించడంలోనూ గమనించవచ్చునని పెద్దలు అంటారు. గజాననుడు మంగళ దైవతం కాబట్టి ప్రతి కార్యానికి ముందు గజానన పూజ ఆచారమైంది.
తన్ను కొలిచేవారి శత్రువుల్ని సంహరిస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు. యుద్ధాలు, కరువులు మొదలగు బాధలు లేకుండా చేస్తాడు. సంతానాన్ని ప్రసాదిస్తాడు. సకల సంపదలు సమకూరుస్తాడు. భార్యాభర్తల నడుమ అనుకూలతను ప్రదర్శిస్తాడు. వర్తకులకు వ్యవసాయదారులకు సహాయం చేస్తాడు” అని విశ్లేషించాడు.
వినాయకుడిని విద్యాదేవతగా కూడా పూజిస్తారు. చవితినాడు విగ్రహాలు నెలకొల్పి విద్యార్థులు తమ పుస్తకాలు స్వామి ముందుంచి ‘గుంజీలు’ తీస్తారు. దీనివెనుక కారణం ఆలోచిస్తే, సామవేదజ్ఞులు ఈ చవితినాడే ఉపాకర్మ ఆచరిస్తారు. మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో యుధిష్ఠిరుడు గణపతిని పూజించాడు. వినాయకోత్పత్తి, వినాయక వ్రతాన్ని వివిధ పురాణాల్లో చూస్తాం.
వినాయకోత్పత్తి
గజాసురుడి సంహారానంతరం శివుడు కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతిదేవి అభ్యంగన స్నానమాచరిస్తూ నలుగు పిండితో ఓ బాలుని బొమ్మను చేసి, ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి బయట కాపలాగా ఉంచి ‘తాను స్నానం చేసి తిరిగి వచ్చేవరకు ఎవరినీ లోనికి రానివ్వద్దు’ అని ఆదేశించింది. ఈ లోపల శివుడు లోనికి వెళ్లబోగా, బాలుడు ఆయన్ని అడ్డుకొన్నాడు. తన ఇంట్లోకి తననే రానివ్వలేదనే ఆగ్రహంతో శివుడు బాలుని శిరస్సును ఖండించాడు. స్నానం చేసి బయటకి వచ్చిన పార్వతి ఈ దృశ్యం చూసి హతాశురాలయ్యింది.
భార్య దుఃఖాన్ని చూసి చలించిన శివుడు, బాలుణ్ణి బతికించుటకు ఉత్తరదిశగా తల ఉంచి నిద్రించే ఏ ప్రాణి శిరస్సునైనా తీసుకురండని పరిచారకులను ఆదేశించాడు. వారు వెతుకుతూ వెళ్లగా, ఏనుగు మాత్రమే అలా కనిపించింది. దీని శిరస్సును తీసుకురాగా శివుడు ఆ బాలుని మొండానికి అతికించాడు. (పురాణాల్లో సర్జరీ (శస్త్రచికిత్స) చేసిన మొదటి వ్యక్తిగా శివుడు కనిపిస్తాడు). గజముఖంతో జీవించిన ఆ బాలుడు ‘గజాననుడు’ అయ్యాడు. ఇతడు ‘అనింద్యుడు’ అను ఎలుకను వాహనంగా చేసుకొన్నాడు. కొంతకాలానికి సోదరుడు కుమారస్వామి జన్మించాడు. ఇతడు మహా బలశాలి. అతని వాహనం నెమలి. 
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు.. పరమేశ్వరుని సేవించి విఘ్నాలకొక అధిపతి ఎవరని అడుగగా..  గజాననుడు, కుమారస్వామి ఇరువురూ అధిపత్యాన్ని కోరగా.. అంత “మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి మాధిపత్యంబొసగుదు”అని మహేశ్వరుడు అనగా గజాననుడు తండ్రిని సమీపించి ప్రణమిల్లి తన అసమర్థతను తెల్పి తగునుపాయం తెలుపమని కోరగా “సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషుస్నాతో భవతి పుత్రక!” నారాయణ మంత్రంను జపించిన మాత్రంన మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చు వాడగుననగా! గజాననుడు నత్యంతభక్తితో ఆ మంత్రాన్ని తల్లిదండ్రులకు మూడు ప్రదక్షిణలు చేసేను.
కుమారస్వామి ఎంత వేగంతో ఎక్కడికి వెళ్లిన గజాననుడు తన కంటే ముందుగా స్నానం చేసి కుమారస్వామికి ఎదురువస్తూ కనిపించాడు. దానికి ఆశ్చర్యపోయిన కుమారస్వామి గర్వం పోయి గణాధిపత్యాన్ని అన్న అయిన గజాననుడికే ఇమ్మని ప్రార్ధించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుకి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆరోజు విఘ్నేశ్వరుడికి తనకిష్టమైన పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు..
సమర్పించి పూజించగా విఘ్నేశ్వరడు వాటిని భుజించి కొన్ని తన వాహనానికి ఇచ్చి మందగమనాన్న సూర్యాస్తమయానికి కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయలేక అవస్థ పడుతున్న గణపతిని చూసిన చంద్రుడు నవ్వగా, అంత రాజ దృష్టి సోకిన రాలుగూడ నుగ్గగునను సామెత నిజమగునట్లు పొట్ట పగిలి అందులోని కుడుములు తదితర ఆహారం బయట పడెను. అంత పార్వతి శోకించి చంద్ను జూచి, “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచినవారు పాపాత్ములై నీలిపనిందల పాలవుతారు అని శపించెను. 
ఋషి పత్నులకు నీలాపనిందలు
ఆ సమయాన సప్తమహర్షులు యజ్ఞం చేసి తమ భార్యాలతో హోమ గుండ ప్రదక్షిణ చేస్తూండగా అగ్ని దేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంబున అశక్తుడూ క్షణించకుండగా అది గ్రహించిన అగ్ని భార్య అయిన స్వాహాదేవి  అరుంధతీ రూపం తప్ప తక్ని ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రణయంబు చేయ ఋషులద్దానిని కనుగొని అగ్నిదేవునితో ఉన్న వారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడిచారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వీరికి ఇటువంటి నీలాపనింద కలిగినది. 
అని దేవతలు మునులు, ఋషిపత్నుల పరమేష్ఠికి తెలుపగా సర్వజ్ఞుడగుటచే అగ్ని హోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపం దాల్చి వచ్చారని తెల్పి సప్తఋషులను సమాధాన పరచి వారితో కలసి బ్రహ్మ కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించెను.అంత దేవాదులు “ఓ పార్వతీ దేవీ! నీవు పెట్టిన శాపం లోకానంతటికి కీడు కలుగుతుంది. కనుక దానిని ఉపసంహరించుకోమ్మని ప్రార్ధింపగా, పార్వతి సంతుష్టురాలై కుమారుని చూసి ముద్దాడి ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూడరాదు అని శాపానికి సవరణ చేసేను.
కొంతకాలం తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భాద్రపద చతుర్థిన గోష్ఠనమున పాలు పిదుకుతూ పాలలో చంద్రుడిని చూచి తనకు ఎట్టి నీలాపనిందలు కలుగునో అని అనుకోన్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్య వరంతో రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే శమంతకమణిని పొందగా.. శ్రీకృష్ణుడు సత్రాజిత్తునిని రాజ్య ప్రజల కోసం ఆ మణిని అడుగగా కుడదన్న ఊరకున్నాడు. సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ప్రసేనుండు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళగా ఆ మణిని చూసి ఒక సింహం మాంసం అని భ్రమించి అతనిని చంపగా, దానిని చూసి భల్లూకం దానిని చంపి ఆ మణిని తీసుకువెళ్ళి తన కూతురైన జాంబవతికి ఇవ్వగా..మరునాడు ప్రసేనుడి మృతిని తెలుసుకుని కృష్ణుడే ఆ మణికోసం తన తమ్ముడిని చంపాడని చాటాడు.
ఆ రోజు చంద్రుడిని చూడటం వల్ల నింద వచ్చిందని కృష్ణుడు ఆ మణి కోసం వెతకగా అది జాంబవతి వద్ద ఉండటం చూసి ఆ మణిని తీసుకుంటుండగా అది చూసి భల్లూకం కృష్ణునిపై దూకి ముష్టిఘాత యుద్ధం చేసి క్షీణుడై  ఆలోచన చేయగా కృష్ణుడు ఎవరో కాదు త్రేతాయుగ రాముడని తెలుసుకుని  తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి,  శమంతక మణిని ఇచ్చి పంపెను. కృష్ణుడు మణిని సత్రాజిత్తుకు ఇవ్వగా సత్రాజిత్తు తన తప్పును క్షమించమని తన కమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేసేను. అంత దేవాదులు, మునులు మీరు సమర్ధులు కనుక నీలాపనింద మాపుకొన్నారు. మాకేమి గతి అని ప్రార్ధింపగా ఆనాడు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సున దాల్చువరికి నీలాపనింద ఉండదు.అని చెప్పగా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధిన గణేషుని పూజ జరుపుకుంటూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు.   
కపర్ది గణేశవ్రతం
గణపతిని అనేక విధాలుగా అర్చించే విధానం ఉంది. శివపార్వతులు, చతురంగం ఆడి మనస్పర్థలు పొందారు. శివప్రసన్నం కోసం పార్వతి ‘కపర్ది గణేశవ్రతం’ ఆచరించింది. శ్రావణ శు॥ చతుర్థి నుండి భాద్రపద శు॥ చతుర్థి వరకు ఏకభుక్తంతో గణేశుణ్ణి అర్చించే వ్రతం ఇది. సాధారణంగా అందరూ ఆచరిస్తున్నది. భాద్రపద శు॥ చవితి నాటి సిద్ధి వినాయక వ్రతం.
వినాయకుడు ప్రకృతి దేవుడు
ప్రతి పండుగ నుండి ఏదో కొంత ‘ప్రాకృతిక జ్ఞానం’ సంపాదిస్తాం. వినాయకుడి పండుగలో చాలా అంశాలు మనదేశ వ్యవసాయ రంగానికి ప్రతీకలుగా కన్పిస్తాయి. అసలు వినాయకుడి రూపం గమనిస్తే  ఆయన చెవులను ‘శూర్పకర్ణాలు’ అంటారు. చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. రైతులు నూర్పిళ్లకు ఉపయోగించే చేటల్లాగా ఉంటాయన్నమాట. వినాయకుడి పొట్ట ధాన్యపు నిల్వల్ని ఈ గాదెల్లోనే నిల్వ ఉంచేవారు. గణేశుడి తొండమే దున్నుటకు ఉపయోగించే ‘నాగలి’లా ఉంటుంది. అలాగే పొట్టకు గట్టిన ‘నాగబంధం’  ధాన్యపుగాదెను ఎలుకల నుండి రక్షించే ఉపాయంగా కన్పిస్తుంది. ఎలుకలు సాధారణంగా పంటలను పాడుచేస్తాయి. అలాంటి ఎలుక (మూషిక)ను తన వాహనంగా చేసుకోవడం వల్ల వినాయకుడు పంట రక్షకుడయ్యాడని,  అలాగే ఈ గణేషుడు మెక్సికోలోని ధాన్యదేవతను, టాంగాదీవుల్లోని ఆలోఆలో దేవతను, గ్రీసుల డెమెటర్‌ను, రోమనుల కెరెస్ దేవతను పోలి ఉన్నాడని కూడా బి.ఎ. గుప్తా పేర్కొన్నారు.
ఏకవింశతి (21) పత్రాలు.. 
పర్యావరణం - ఆయుర్వేదం
శివుణ్ణి బిల్వదళాలతో, లక్ష్మీదేవిని కమలాలతో, విష్ణువును తులసితో, హనుమంతుణి తమలపాకులతో పూజించడం ప్రశస్తం, ఏదైనా పత్రం, పుష్పం  అన్నట్లుగా దేవతలను పూజించే సంప్రదాయం మనకుంది. వినాయకుణ్ణి మాత్రం 21 రకాల పత్రాలతో పూజించడం ప్రత్యేకం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు పంచభూతాలు, పంచప్రాణాలు, ప్రాణం మొత్తం కలిసి 21. వీటి గొప్పతనం ఇందులో కన్పిస్తుంది. అలాగే ఎలాంటి మసాలాలు లేని నైవేద్యం ఉండ్రాళ్లు, కుడుములు గణపతికి ఇష్టమైనవి.
అని మనం వినాయక వ్రతంలో చెప్తాం. 21 రకాల పత్రాలు ప్రకృతి సిద్ధమై, ఔషధ గుణాలు కల్గినవి. వీటన్నిటికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. అంతేగాకుండా మనం వీటి సేకరణ చేసేటప్పుడు మన పిల్లల్ని మన వెంట తీసుకెళ్తే ప్రకృతి తత్వం  ఆయుర్వేద విశిష్టత వాళ్లు తెలుసుకుంటారు. పర్యావరణ విజ్ఞానం వాళ్లకి కల్గించిన వాళ్లమవుతాం.
ఈ 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఈ ఆకుల వల్లే తగ్గే రోగాలను చూస్తే వాటి ప్రాముఖ్యత ఎంతో తెలుస్తుంది. కాబట్టి ‘ఆకుల ఔషధ విజ్ఞానం’ తెలుపబడింది. ఈ రోజు సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి అనేక రకాల చెట్ల ఆకులను గుంటలో వేసి మురగబెట్టి, ఆకులను ఎరువుగా మార్చడానికి వానపాములను వదలి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు.  వినాయక పూజలో వీటిని ఉపయోగించి చెరువులో వేయడం వల్ల నీరు ‘ఔషధీకృతం’ అవుతుంది.
రైతులు చెరువుల్లో నీరు తగ్గాక అందులోని మట్టిని పొలాల్లోకి ఎరువుగా తీసుకువెళ్తారు. దానివల్ల పంటలు బాగా పండుతాయి. పూర్వం రసాయన ఎరువుల వాడకం ఉండేది కాదు. అందువల్ల ఆరోగ్యం బాగా ఉండేది. ఆయా చెరువుల్లోని, నదుల్లోని నీటిని వ్యవసాయరంగానికి ఉపయోగించడం వల్ల పంటలు బాగా పండేవి. ఇలా వినాయక చవితి వల్ల పర్యావరణం కూడా కాపాడబడుతుంది. అలాగే చెరువుల్లో కొట్టుకు వచ్చిన మట్టితో పూడిక చేరుతుంది. మట్టితో వినాయకుణ్ణి చేయడానికి చెరువు మట్టిని తీసి మళ్లీ అందులోనే గణేశ నిమజ్జనం చేస్తే ఆ మట్టి గణపతి కరిగి చెఱువు మట్టిని ఎరువుగా మారుస్తుంది.
గరికీ పత్రం
దీనిని “దూర్వాయుగ్మం’ అంటారు. పశువులు బాగా మేస్తాయి. అవి అంత బలవర్ధకంగా ఉండడానికి కారణం ఈ గరికనే. ఇది వినాయకపూజలో ప్రశస్తంగా వాడుతారు. మూత్ర సంబంధ వ్యాధుల నుండి రక్షణకు పచ్చడి  చేసుకొని తినాలి.
బిల్వపత్రం
 త్రిదళం... త్రిగుణాకారం అని శివుణ్ణి పూజించే ప్రశస్తమైన పత్రం ఇది. బంక విరోచనాలకు మందుగా ఇది వాడుతారు. దీనిని ‘మారేడు’ అంటారు. చక్కెరవ్యాధి తగ్గడం కోసం రోజూ రెండు లేదా మూడు ఆకులను నమిలి ఆ రసాన్ని తాగాలి.
దత్తూర పత్రం 
ఉమ్మెత్త అని పిలుస్తారు. నల్ల ఉమ్మెత్త ఆయుర్వేదంలో ఔషదంగా వాడతారు. ఆకులను కాపడం చేసి వాపులకు పెడితే వాపు తగ్గుతుంది. లైంగిక వ్యాధుల నివారణకు, వ్రణాలు, గడ్డల నివారణకు బాగా పనిచేస్తుంది. మానసిక రోగాల నివారణకు జుట్టును తీసేసి ఆకులరసంతో 2 నెలలు రోజూ మర్ధన చేయాలి.
అర్కపత్రం
దీనిని జిల్లేడు అంటారు. ఇందులో రెండు రకాలు, శ్వేతార్క కలపతో గణపతిని చేసి పూజించే సంప్రదాయం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా వాడే ఔషధం. లేకుంటే ప్రమాదానికి అవకాశం ఉంది. ఏ జాతికి చెందిన జిల్లేడు అయినా పాలు తీసి పసుపుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖం రంగు మారుతుంది.
దేవదారు పత్రం 
ప్రసిద్ధమైన ఈ వృక్షం ఆకులు, పుష్పాలు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. మాను నుండి తయారు చేసిన నూనెను వేడినీళ్లలో వేసుకొని స్నానం చేయాలి. ఇది శ్వాసకోస వ్యాధులను దూరం చేస్తుంది.
చూత పత్రం 
దీనిని ‘మామిడి’ (మ్యాంగిఫెరా ఇండియా) అంటాం. బ్యాక్టీరియాలను, దోమలు మొదలైన క్రిమికీటకాలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాయనే ఉద్దేశంతో ద్వారాలకు అలంకరణ పేరుతో కడతారు. మామిడి చిగురులో ఉప్పు కలిపి వేడిచేసి పూతగా, కాళ్లపగుళ్లపై రాయాలని గృహవైద్యం.
కరవీర పత్రం
దీనిని ‘గన్నేరు ఆకు’ అంటారు. గడ్డలకు మందుగా దీని పాలను వాడుతారు. జ్వరం తగ్గడానికి ఏ జాతి గన్నేరు ఆకులనైనా కొమ్మ తుంచి పాలు లేకుండా ఒక తడి గుడ్డతో శరీరానికి కట్టుకోవాలి.
విష్ణుక్రాంత పత్రం
దీనిని ‘అవిసె’ అంటారు. చిన్న మొక్కగా ఉంటుంది. రొమ్మువ్యాధులు, ఉబ్బసం తగ్గించే స్వభావం దీనికి ఉంది. తామర, రక్తదోషం ఉన్నవాళ్లు ఆకుల్ని నిమ్మరసంతో నూరి తామర (గజ్జి) ఉన్నచోట పూయాలి.
అర్జున పత్రం 
మద్దిచెట్టును ‘అర్జునవృక్షం’ అంటారు. నల్లమద్దిని కలపగా ఉపయోగిస్తారు. తెల్లమద్ది, నల్లమద్దిని మేహ రోగాలకు మందుగా వాడుతారు. తెలుపు, ఎరుపు జాతిలో ఏ ఆకునైనా వృణాలు (పుండ్లు) ఉన్న ప్రాంతంలో కట్టువేయాలి.
అశ్వత్థ పత్రం 
ఇది దేవతా వృక్షం. రావి ఆకు అని కూడా అంటారు. అధికంగా ఉదజనిని విడుదల చేసే వృక్షం. ఎండిన రావికర్రలను నేతితో కాల్చి ఆ భస్మం రోజూ తేనెతో స్వీకరిస్తే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి.
బృహతీపత్రం
దీనిని ‘వాకుడు ఆకు’ అని పిలుస్తారు. కొందరు ‘నేలమునగ’ అని కూడా చెప్పారు. ముళ్లుగా ఉండే ఈ చెట్టు హృద్రోగాలను తగ్గించి వీర్యవృద్ధిని కలిగిస్తుంది. ఈ ఆకును నీటితో కలిపి నూరుకొని సేవిస్తే మూలశంక, దగ్గు, మలబద్దకం తగ్గిస్తుంది.
మాచీపత్రం 
సాధారణంగా ‘మాచిపత్రం’ అంటారు. దద్దుర్లు, వ్రణాలు తగ్గించడానికి తోడ్పడుతుంది. ఆకును తడిపి కళ్లమీద ఉంచుకోవాలి. పసుపు నూనెతో కలిపి ఒంటికి పూసుకుంటారు. నేత్రవ్యాధులను, చర్మవ్యాధులు తగ్గిస్తుంది.
గండకీ పత్రం
దీనిని వినాయక పత్రం అని పిలుస్తారు.
మరువక పత్రం
దీనిని ‘మరువం’ అని అంటారు. ఇది వేడి నీటిలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన పోతుంది.
సింధూర పత్రం
‘వావిలాకు’ అంటారు. ఈ ఆకును నీటిలో మరగబెట్టి స్నానం చేస్తే నొప్పులకు, రోగాలకు ఇది మంచి ఔషదం.
జాజి పత్రం
జాజికాయ బాలవైద్యానికి, పైత్య రోగాలకు ఔషధం. నోటి దుర్వాసన పోవడానికి ఆకులను వెన్నలో కలిపి నూరి పండ్లు తోముకోవాలి.
బదరీ పత్రం
ఇది రేగు పత్రం. జీర్ణకోశ వ్యాధులను, రక్తదోషాలను తగ్గించే ఫలం ఇది. బాల్యంలో వ్యాధుల నివారణ.
శమీపత్రం
జమ్మిచెట్టు ప్రాశస్త్యం తెలిసిందే. కుష్ఠు, అవాంచిత రోమాల నివారణకు ఈ ఆకుల పసరు ఆయా శీర భాగాల్లో పై పూతగా పూయాలి.
దాడిమి పత్రం 
నోటి పూతలకు, ఏలికపాముల, దగ్గు, ఉబ్బసం నివారి స్తుంది. ఆకులకు నూనెరుద్ది వేడిచేసి వాపు ఉన్న చోట కట్టాలి.
అపామార్గ పత్రం 
దీనిని ఉత్తరేణి అని పిలుస్తారు. దీని వేరుతో దంతధావనం చేస్తే పంటి రోగాలు దరికిరావు. బ్రష్ + పేస్ట్ అవసరం ఉండదు.

********************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధ్యాత్మికం : విజయక్రాంతి