ఒక గండుపిల్లి ఎలుక వెంబడి పడింది. అది రంధ్రంలోంచి బయటకు వచ్చిన ఎలుకను వేటాడింది. అది ఎలాగోలాగ తప్పించుకొని మళ్ళీ కన్నం దగ్గరకు చేరింది. పిల్లికి దొరకకుండా కన్నంలోకి దూరుదామంటే లోపల పాము చేరింది. లోపలకు పోతే పాము, బయట ఉంటే పిల్లి....!? ఆ తర్వాత కథ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేడి ఇలాగే ఉంది. ఎన్నికలు డిసెంబర్‌లో జరిగితే పిల్లిగండం....! మేలో జరిగితే పాముగండం....! ఇదొక నర్మగర్భమైన కథ.
గత నెలలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “ప్రగతి నివేదన సభ” తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవుటర్ రింగు రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు తీసేసి కొంగర్ కలాన్‌లో సభ జరిపి లోకాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకున్న కేసీఆర్ ఎందుకో వ్యూహాత్మక తప్పిదం చేసాడని అందరూ భావిస్తున్నారు. నిజానికి ఎలాగూ ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకొన్నపుడు అదే రోజు లక్షలాది ప్రజల ముందు ప్రకటిస్తే ఇంకా బాగుండేది. కనీసం కేబినెట్‌కైనా తెలియకుండా కేవలం ఒక సీఎం నిర్ణయం తీసుకోవడం తప్పుడు సంకేతాలను ఇచ్చింది. ఎలాగూ వారంలోపు చేస్తున్నపుడు ఆ రోజు ప్రజలతో ‘ఔను’ అనిపించి అక్కడి నుండే కేసీఆర్ నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్తే అదొక చరిత్రగా మిగిలేది.
సర్వసాధారణంగా కేసీఆర్ మాట్లాడే పంచ్‌లు, పిట్టకథలు, తెలంగాణ భాషారీతులు, విసుర్లు, వ్యంగ్యాస్త్రాలు ఆ రోజు లేకపోవడం ఆయన 57 నిముషాల ప్రసంగాన్ని చప్పగా చేశాయి. ఆ తర్వాత ప్రతిపక్షాలు కేసీఆర్‌పై చేసిన వ్యతిరేక ప్రచారం బాగా పేలింది. ఇన్ని వందల కోట్లు పెట్టి సభచేసి ఏమీ కొత్తదనం లేదనే ‘నెగిటివ్ అప్రోచ్’ ప్రతిపక్షాలు బాగా ప్రజలవద్దకు చేర్చగలిగాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాక ఆనాడు నాయకులంతా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోనే ఉన్నారు. ఇంత గండర గండపార్టీలను కాదని ఉద్యమ ఆకాంక్షకోసం కొందరు కేసీఆర్ వెంట నడిచారు. అలాగే ప్రభుత్వాలకు భయపడకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థులను రోడ్ల మీదకు తెచ్చాయి.
ఉస్మానియా విద్యార్థులైతే ఏకంగా ప్రాణాలే బలిపెట్టారు. ఉద్యోగవర్గాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన మేలు ఏవీ లేవని ఉద్యోగుల అభిప్రాయం. కేవలం కొందరు సంఘనాయకులకు లాభం జరిగిందని ఈ రోజు వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లు చూస్తే అర్థం అవుతుంది. వీటిన్నిటికి తోడు 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేద్దామనుకొన్న కేసిఆర్‌కు అదికూడా ఇబ్బందికరంగానే మారింది. రెండు మూడు రోజులు మౌనం పాటించిన అధికారపార్టీలో వలస నాయకులు టిక్కెట్లు రాకపోవడంతో తెరమీదకు వచ్చారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న వీళ్ళంతా తమిళనాడు తరహాలో దండాలు పెడతారనుకుంటే ఇలా ఎదురు తిరగడం టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమే. కానీ కాంగ్రెస్‌లో కూడా ఇలా టిక్కెట్లు రాని బ్యాచ్ పెద్దదే ఉండడం వల్ల రేపు ఎన్నికల ఫలితాలను ఈ అంశాలే నిర్ధారిస్తాయి.
కాంగ్రెస్ కూడా ఉత్సాహంగానే ఉన్నా వాళ్ళకూ ఓ గండం వచ్చి పడింది. కేసీఆర్‌ను దెబ్బకొట్టాలంటే టీడీపీతో పాటు సీపీఐ, టిజెఎస్ ను కలుపుకొని మహాకూటమి ఏర్పాటుచేయడం వల్ల కాంగ్రెస్ గెలిచే సీట్లను కూడా త్యాగం చేయాల్సివస్తుంది. ఎందుకంటే కోదండరాం, రావుల, ఎల్.రమణ వంటి 20 మంది ముఖ్యనేతలను ఎన్నికల్లో నిలబెట్టాలంటే కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు రావు.  జగ్గారెడ్డి అరెస్టు, రగిలిపోతున్న ఉద్యోగులు, కేసీఆర్ నియంతృత్వం, కాంగ్రెస్ ప్రచారానికి బాగానే ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలను, ప్రచారాన్ని కాంగ్రెస్ తట్టుకుంటేనే భవిష్యత్తు. కోదండరాం లాంటి వాళ్ళ ‘సున్నిత ప్రవచనాలు’ కేసీఆర్‌ను ‘ఢీకొట్టలేకపోయినా’ అది నెగెటివ్ ప్రచారం క్రింద మారి కాంగ్రెస్‌కు లాభిస్తుంది. ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసే కమ్యూనిష్టు పార్టీలకు ఇదొక సంబరం. 
ఇక ఇపుడు మోడీని మోదేయాలనుకున్న చంద్రబాబు కేసీఆర్‌పై పరోక్ష యుద్ధం ప్రకటించి కాంగ్రెస్‌కు సంతోషం కలిగిస్తున్నాడు. 2010లో తెలంగాణలో తీవ్ర ఉద్యమం జరుగుతుంటే దాన్ని దెబ్బతీయడానికి, తన క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పోరాటం చేస్తానని వెళ్ళాడు. ఆనాడు రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బాబుపై కేసులు పెట్టింది. న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరిస్తూ కోర్టుకు వెళ్ళని బాబుకు అరెస్ట్‌వారెంట్ వచ్చింది.  కానీ బాబ్లీకేసు వారెంట్ న్యాయస్థాన పరిధిలో జరుగుతున్నా దానికి మోడీని బాధ్యుడిగా చేసి సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడం మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళందరికీ అర్థం అయ్యింది. కోర్టులకు హాజరుకాకపోతే న్యాయస్థానాలు ఊయలలోకి వేసి ఊపాలా? దీనిని తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటే అదికూడా తెరాసకు లాభమే.  నిజానికి తెలంగాణలో తెలుగుదేశం నాయకులకు వ్యక్తిగతంగా పేరున్నా అది పార్టీ బ్రాండ్‌లోకి మారి నష్టంగా మారుతుంది.
తెలంగాణలో బీజేపీకు ముందు నుండి ప్రత్యేక క్యాడర్ ఉంది. కావున ఈ నెల 15న పాలమూరు జరిగిన ‘శంఖారావం’ ఆ పార్టీ నాయకులు కూడా ఊహించని విధంగా సక్సెస్ అయింది. ఈ సారి ఆచారి, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, డా॥కె.లక్ష్మణ్ చక్కగా మాట్లాడి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రాజాసింగ్ వేదిక మీదకు రాగానే జనం కేరింతలు అతని అవసరం పార్టీకి ఎంత ఉందో సూచిస్తున్నది. రాజకీయాల్లోకి రావాలని ఉవ్వీళ్ళూరుతున్న పరిపూర్ణానందను ఎందుకో బీజేపీ అంగీకరించలేదు. బహుశా! ఆయన ఆంధ్రాప్రాంతానికి చెందడం వల్ల, తెలంగాణలో ప్రాంతీయ భావోద్వేగాలకు ఎప్పుడూ స్థానం ఉన్నందున అది సాధ్యం కాకపోవచ్చు.
తెలంగాణ బీజేపీకు అద్భుత అవకాశం ఉంది. నిజానికి అప్రతిహతంగా ముందుకు వెళ్ళే కేసీఆర్‌ను మహబూబ్‌నగర్‌లో మెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచంద్రరావు నిలబెట్టి దెబ్బతీసింది బీజేపీనే. ఇపుడు పొత్తుల గోల లేని ఏకైక పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఒకవేళ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటగలిగితే ‘కింగ్‌మేకర్’ అవుతుందని సర్వేసర్వత్ర వినిపిస్తున్న మాట. 50 మంది ఇప్పటికీ నియోజక వర్గాల్లో బాగా పనిచేస్తున్న వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి, మిగతా 69 మంది ఇతర పార్టీల అసంతృప్తుల్లో నిజాయితీపరులైన సమర్థులకు టికెట్లు ఇచ్చి గెలిపిస్తే రేపు తెలంగాణ రాజకీయం మారనుంది. బీజేపీ వ్యూహం ఏంటో ఇంకా తెలియదు. 
తెలంగాణలో పుట్టిన ఈ ఎన్నికల వేడి ఢిల్లీవరకు తాకే ప్రమాదం, ప్రమోదం రెండూ ఉన్నాయి కాబట్టి రెండు జాతీయపార్టీలకు ఇది కీలకం. అలాగే 17 పార్టీలను ఏకం చేస్తానని చెప్పే బాబుకు ‘ఇది కూడా నేనే సాధించా’ అనడానికి పనికి వచ్చే ఆయుధం ఇది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగి బీజేపీ, కాంగ్రెస్ రహిత పాలనకు నాంది పలుకుతా అంటున్న కేసీఆర్‌కూ కీలకం. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. కాబట్టి రాహుల్‌కు ఇది మరో అగ్ని పరీక్ష. 
ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోతే ‘కాంగ్రెస్ ముక్తభారత్’ అనడానికి మోడీకి మరో కలికితురాయి. ఇక చూడాలి ఇది రణమో! రావణ కాష్టమో!!
*******************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి