ఒకప్పుడు మనదేశంలో ‘గామా’ అనే మల్లయోధుడు ఉండేవాడు. భారతీయ శైలి మల్లయుద్ధంలో అతడు ప్రపంచ విజేత. కానీ అతడు నలభై ఏళ్ల వయసునే మరణించాడు. అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్లనే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. మాంసంతో తయారైన శరీరాన్ని ఉక్కుతో తయారైందని అతడు భావించాడు. తన విజయానికి శృతిమించి శరీరాన్ని బాధపెట్టాడు. 

ఈ పరిణామాల్లో తనను తానే చంపుకున్నాడు. ఇపుడు చంద్రబాబు అమరావతి గురించి చేస్తున్న గందరగోళం చూస్తుంటే ఈ ‘గామా పహిల్వాన్’ గుర్తొస్తున్నాడు. 2018 ఫిబ్రవరి నుండే చంద్రబాబు నెత్తిన ఏలిన నాటి శని కూర్చొన్నాడని అనిపిస్తుంది. ప్రతిదాన్ని అతిగా చేయడం, తర్వాత ఆయన బాధపడడం తప్ప ఇంకేం సాధించడం లేదు. చంద్రబాబును బాగా చదివినవాళ్లలో వైఎస్, కేసీఆర్ పరీక్షలు కూడా పాసయ్యారు. తాజాగా మోదీ, అమిత్‌షా, జగన్ కూడా చదివేసినట్టే కన్పిస్తూ ఉంది. అందులో జగన్ ప్రత్యేక తరగతుల కోసం ‘కేసీఆర్ స్కూల్లో’ కూడా చేరాడు. దాని పరిణామాల్లో భాగమే అమరావతిలో గందరగోళం.

ప్రాచీన కాలంలో శాతవాహనులతో సంబంధం ఉన్నదీ, బౌద్ధంతో ముడివేసుకొన్నదీ అమరావతి. అక్కడి అమరారామం పంచారామాల్లో ఒకటి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీ.శ. 1790 ప్రాంతంలో తన జమిందారీ ఎస్టేట్‌కు ముఖ్యకేంద్రంగా పెట్టుకొన్నాడు. అంతేగాకుండా 2006 జనవరిలో ఇక్కడ కాలచక్ర మహాసమ్మేళనం కూడా జరిగింది. దేశవిదేశాలనుండి బౌద్ధ ప్రముఖులు ఇక్కడకు వచ్చారు. 

ఇక్కడ అమరావతి స్థూపం కూడా ప్రసిద్ధం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు బౌద్ధ దేశాలనుండి పెట్టుబడులు ఆకర్షించాలని, ఇక్కడి దళితుల్లో బౌద్ధం పట్ల వున్న ప్రేమను రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవాలని బాబు ఈ ప్రాంతం ఎన్నుకోవడం ఓ సత్యం. వైయస్సార్ సీపీ ఆరోపించినట్లుగా తన వాళ్లతో భూములు కొనిపిచ్చి దానిచుట్టూ రాజధాని అనే వల అల్లాడని, అందుకే శివరామకృష్ణ కమిటీ నివేదిక త్రొక్కిపెట్టారని, అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి ఆశ్రీత పక్షపాతం ఉందని మరో ఆరోపణ. భుజాన కండువా వేసుకొని ‘తెలుగువారు - దక్షిణాదివారు’ అనే జస్టిస్ పార్టీ మేధావి బ్యాచ్ చేసే హడావుడి ఇంకాస్త అనుమానాలకు తావు ఇచ్చింది. 

జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు మానసికంగా దెబ్బకొట్టే పని నిర్విఘ్నంగా చేస్తున్నాడు. బొత్స సత్యనారాయణతో మంట పెట్టించి ‘రాజధానులు మూడు’ అనేసరికి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నాడు. నిజానికి భౌగోళికంగా పొడవుగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం వుంది. అనంతపూర్, కర్నూల్, శ్రీకాకుళం వంటి జిల్లాలు పాత మహబూబ్‌నగర్ జిల్లాల కన్నా ఘోరంగా ఉన్నాయి. అమరావతిలోని రైతులకు నష్టం జరిగితే వాళ్లకు ఏం చేయాలో సంయమనంతో ఆలోచించాల్సిన పార్టీలు, వారిని మరింత రెచ్చగొడుతున్నాయి. 29 గ్రామాలకు ప్రజల సమస్యను జగన్ కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

సరిగ్గా తెలంగాణ విషయంలో చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలే ప్రదర్శించి బోల్తాపడ్డాడు. అంతెందుకు! 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే హద్దులు మీరిన విమర్శలు చంద్రశేఖరరావుపై చేసి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా దోహదపడ్డాడు. ఆ తర్వాత మోదీ, షాలపై వ్యక్తిగతంగా కక్ష్యగట్టి లేని శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు. ఇపుడు రాజధాని విషయంలో చేస్తున్న ‘అతి’ చంద్రబాబుకే నష్టం కలిగిస్తుంది. ఇపుడు విశాఖపట్నం (ఉత్తరాంధ్ర) కర్నూలు (రాయలసీమ) ప్రజలు కొంత ఆనందంగా ఉన్నారు. మీరు అమరావతిలో రెచ్చిపోయినట్లు వాళ్లూ రెచ్చిపోతే తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కేసీఆర్ సిలబస్‌నే జగన్ అనుసరిస్తున్నట్లు అనిపిస్తున్నది. 

ఈ ఆందోళనకు కారకుడుగా బాబును చూపించి, అమరావతిలోనే రాజధాని పెట్టి, మిగతా ప్రాంతాల ప్రజలను తెలుగుదేశానికి వ్యతిరేకంగా మలచడమే దీర్ఘకాలిక వ్యూహంగా ఉన్నట్లుంది. గతంలో తెలంగాణ ఉద్యమం విషయంలో బాబును రాజకీయంగా కేసీఆర్ ఇలాగే దెబ్బకొట్టారు. ఇవేవీ గమనించకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మరో నష్టం ఖాయం.

ఇక ఈ గేమ్‌లోకి బీజేపీ ఎందుకు ఎంటరయ్యిందో వాళ్లకే తెలీదు. ‘‘ఎల్లమ్మ గుడి కాడ మొల్లాయన శిగం ఊగినట్లు’’ అనేది తెలంగాణలో ప్రసిద్ధ సామెత. ఎల్లమ్మ గుడిముందు వౌల్వీ పూనకం అనేది దీని అర్థం. కన్నా, సుజనా వంటివారి అనవసర జోక్యం పార్టీకి నష్టమేగానీ లాభం లేదు. అసలే అంతంతమాత్రంగా వున్న పార్టీకి చంద్రబాబు అధికారంలో లేని సమయంలో జవసత్వాలు నింపుకోకుండా ఇందులో దూరడం అవివేకం తప్ప ఇంకేం కాదు. 

కుల రాజకీయం కంపుగొట్టే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సునీల్ దేవధర్ తప్పటుడుగులు వేస్తున్నట్లుగా ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు వంటి కరడుగట్టిన భాజపా నాయకులను వదిలిపెట్టి కన్నాను ముందుపెట్టడం ఇపుడు ఇంకో తప్పే అవుతుంది. కన్నా తన ప్రాంతాభిమానంతో రాజధాని విషయంలో చేసే తప్పు రేపు పార్టీని దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తుంది. చంద్రబాబు ప్రయోగించిన పవన్‌కళ్యాణ్‌తో కలిసి నడవడం భాజపాకు శరాఘాతం. అభివృద్ధి నిరోధకులు, ఆంధ్రా కుల పక్షపాతులైన కమ్యూనిస్టులతో అంతర్గతంగా పవన్ కల్యాణ్‌కు సంబంధాలున్నాయి. 

భగత్‌సింగ్‌ను, అల్లూరి సీతారామరాజులను బొందపెట్టి చేగువేరాను తలపై మోసే పవన్‌కళ్యాణ్‌తో సిద్ధాంతపరంగా భాజపా ఎలా సాగుతుంది? తాట తీస్తా.. తోలు తీస్తా అనే మాటలు, చపలత్వంతో, చంచలత్వంతో మాట్లాడే పవన్‌కు అసలు రాజకీయం వచ్చా? ఇక కమ్యూనిస్టులు ఎక్కడుంటే అక్కడ అన్యాయమే అని గుర్తుంచుకోవాలి. 

వారు ధర్నాలు చేస్తున్నారంటే అందులో తప్పక ‘అధర్మం’ వుందని గుడ్డిగా చెప్పేయవచ్చు. ఇంత అన్యాయాలకు, స్వార్థాలకు కారణమైన వ్యవస్థకు మద్దతిచ్చే ‘ఎల్లో మీడియా’ అతినీ ప్రజలు గుర్తించాలి. 1300 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణం కోల్పోయినా రాష్ట్రం ప్రకటించకుండా, కేవలం తమ రాజకీయ స్వార్థంతో హడావుడిగా, ప్రణాళిక లేకుండా విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలోని తులసిరెడ్డి, రఘువీరారెడ్డి అవశేషాలుగా మిగిలారు.

ఇదంతా జగన్ ఆడుతున్న మైండ్ గేమ్. ఇందులో అన్ని పాత్రలూ ఎంటరయ్యాయి. చంద్రబాబు తనకున్న భయాన్ని కప్పిపుచ్చుకొనేందుకు భాజపాతో సహా అందరినీ ఇందులోకి లాగాడు. ప్రజాస్వామ్యంలో పాలన- ప్రతిపక్షాలు కలిసి పనిచేసే సూత్రాన్ని ఈ నాయకులు ఎప్పుడో విస్మరించారు. గతంలో ఈ పార్టీలే జీవో 133 ద్వారా కమిటీ ఏర్పాటుచేశారు. 29,754 మంది రైతుల 33,771 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ క్రింద సేకరించారు. దానికితోడు 19,876 ఎకరాల ప్రభుత్వ భూమినీ కలిపారు. అన్ని పార్టీలు ఆమోదం తెలిపారు. 

సీట్లు మారగానే సీన్ మార్చేస్తున్నారు. ఇందులోకి చంద్రబాబు ఎవరు వద్దన్నా వెళ్తాడు. కానీ ఇతర పార్టీలు వెళ్లడం దురన్యాయం మాత్రమే. స్వయంకృతాపరాధం. ముఖ్యంగా భాజపా ఈ ఆటకు ఎంత దూరం వుంటే అంత మంచిది. చంద్రబాబు మూలాలపై దెబ్బకొట్టే పని జగన్ తెలివిగా చేస్తున్నాడు. ఆ ట్రాప్‌లోకి అందరూ వెళ్లారు. ఇదంతా జగన్-చంద్రబాబు రాజకీయ కైలాస పటంలోని వికృత క్రీడ. ఇది అర్థం చేసుకోకుండా పార్టీలతోపాటు ప్రజలూ దిగితే మన గోతి మనం త్రవ్వుకోవడమే.


*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*



అనుభవం లేకుండా సాధువుగా మారిన వ్యక్తి ‘కోపాన్ని జయంచడం ఎలా’ అనే అంశంపై బోధిస్తున్నాడు. జనంలోంచి ఒక సాధారణ వ్యక్తి లేచి ‘అసలు కోపం అంటే ఏమిటి స్వామీ’ అని ప్రశ్నించాడు. సాధువు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో అతడు అలాగే నిలబడి తన ప్రశ్నను పదేపదే అడగసాగాడు. దీంతో బోధకుడికి కోపం వచ్చి ఆసనం నుంచి లేచి వెళ్లి అతడి చెంపపై ఒక్క దెబ్బ కొట్టాడు. ‘ఇదే స్వామీ కోపం అంటే’ అన్నాడా సామాన్యుడు. వస్తువు ఏమిటో తెలిస్తే దాన్ని జయించడం తెలుస్తుందని ఆ సాధువుకు బోధించాడు.
 
ఆ సాధువులాగానే మనలో చాలామంది శాస్త్ర పఠనం చేస్తారుగానీ.. నిత్యజీవితంలో ఆచరణలో పాటించడం నేర్చుకోరు. ఆచరణ లేని పఠనం, అధ్యయనం.. గాడిద గంధపు చెక్కలు మోయడంలాంటిదే. త్రికరణాల్లో ‘కర్మ’ను చివరగా పెట్టింది అందుకే. మనస్సు, వాక్కుల్లో ఏముంటుందో కర్మలో కూడా అదే ఉండాలి. 

ఈ రోజుల్లో మనకు మోయలేనంత జ్ఞానం ఉందిగానీ.. ఆవగింజంత కూడా ఆచరణ లేదు. పూర్వం గ్రంథాలు, ముద్రణ సౌకర్యం లేనప్పుడు జ్ఞానానికి పరిమితులు విధించుకుని తెలిసిన కొద్దిపాటి విషయాన్నే ఆచరణలో చూపించేవారు. ఇప్పుడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోలేనంత జ్ఞానం లభ్యమవుతోంది. సౌలభ్యం, సౌకర్యం పెరిగిందని సంతోషపడాలా? రవ్వంత కూడా ఆచరణసాధ్యం కావట్లేదని బాధపడాలా? ప్రతివారూ తమ వాట్సాప్‌ సందేశాన్ని ఇతరులకు పంపించాలని తపిస్తున్నారుగానీ.. ఆచరణ వైపు అడుగు వేయట్లేదు. అందుకే వేమన..
 
స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే
సంశయంబు చెడదు సాధకునకు
చిత్రదీపమున చీకటిజెడనట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
 
..అన్నారు. అందమైన చిత్తరువులో ఉన్న దీపం వల్ల చీకటి తొలగిపోనట్లే.. స్వానుభవం లేకుండా ఏ సంశయం తొలగిపోదని దీని అర్థం. ఆధ్యాత్మిక జీవనంలో ఆచరణకు చాలా ప్రాముఖ్యం ఉంది. అది సాధ్యం కాకపోతే శాస్త్రగ్రంథాల వెలుగు మనపైన ఎంత పడినా.. కింద చీకటే ఉంటుంది. కాబట్టి విషయపరిజ్ఞానంతోపాటు ఆచరణపైనా ఆధ్యాత్మికవాదులు దృష్టిసారించాలి. ఎంత దర ఉన్న విత్తనమైనా తారురోడ్డుపై వేస్తే మొలవదు కదా? విత్తనం మొలకెత్తేందుకు అనుకూలంగా భూమి ఉంటే చాలు. మనం ఎలా పడేసినా అది మొలకెత్తుతుంది. అలాగే తెలుసుకున్న మంచి విషయాన్ని ఆచరణలో పెడితేనే మనం ఎదిగేందుకు అవకాశం ఉంది.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*13 - 01 - 2020 : సోమవారం*



‘‘విత్తనాన్ని భూమిలో నాటి దానికి మట్టి, గాలి, నీరు సరిగ్గా అందిస్తే ఆ విత్తనం మట్టిగా మారుతుందా? గాలిగా మారుతుందా!? నీరుగా మారుతుందా? కానే కాదు. అది మొక్క అవుతుంది. తన సొంత పెరుగుదల నియమం ఆధారంగా అది పెరుగుతుంది. గాలినీ, మట్టినీ, నీళ్లను తనలో కలిపేసుకొని, పదార్థంగా మార్చుకొని మొక్కగా ఎదుగుతుంది’’ అంటూ ఎదుగుదల ఎలా ఉండాలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు.

 రెండు రోజుల్లో స్వామీజీ జయంతిని ‘జాతీయ యువదినోత్సవం’గా జరుపుకోబోతున్న సందర్భంలో యువకులంతా మననం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు, అందులో పనిచేసే కొందరు ఆచార్యులు విత్తనాన్ని మట్టిగా మార్చాలనుకొంటున్నారు.

 ఇంకొందరు మేధావులు ఈ విత్తనాన్ని నీరుగా మార్చాలని తీవ్ర యత్నం చేస్తున్నారు. కొన్ని ఎర్ర మెదళ్లు ఇదే విత్తనాన్ని గాలిగా మార్చాలని కుట్ర పన్నుతున్నారు. వాళ్లెవరూ ఈ మూడింటిని జీర్ణం చేసుకొని చెట్టుగా ఎదగమని చెప్పడంలేదు. కొందరికి కులాన్ని, ఇంకొందరికి వర్గ దృక్పథాన్ని, మరికొందరికి మతవాదాన్ని అంటగట్టి భారతీయుడిగా బతకనివ్వడం లేదు. యువకుల మనసుల్లో ఎర్ర విషాన్ని ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు. దీనికంతా కారణం కాంగ్రెస్ - కమ్యూనిస్టుల చీకటి ఒప్పందాల చరిత్ర. అది ఈ రోజు కొత్తది కాదు. నెహ్రూ కాలం నుండి కొనసాగుతున్నది.

ఆగస్టు 1969లో జరిగిన రాష్టప్రతి ఎన్నికలో ఇందిరాగాంధీ ‘ఆత్మప్రబోధం’ ఓటు పేరుతో నీలం సంజీవరెడ్డిని ఓడించి నిమ్మతోటకు పరిమితం చేసి, వి.వి.గిరిగారిని గెలిపించింది. ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ ముక్కలైంది. దాంతో కమ్యూనిష్టులు ఇందిరకు మద్దతుగా నిలిచారు. ఆనాటి ప్రసిద్ధ కమ్యూనిస్టు కుమార మంగళం ఏకంగా కాబినెట్‌లోనే చేరాడు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వామక్షాలకు పట్టపగ్గాలేకుండా పోయాయి. ప్రభుత్వంలో తెరవెనుక ఉంటూ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లాంటి వాటిల్లో చొరబడ్డారు. భారత కార్య నిర్వహణ వ్యవహారాలను తమ చేతిలోకి తీసుకొన్నారు. అలా విద్యావిధానం అందించే ఎన్‌సిఈఆర్‌టిలో స్థానం ఆక్రమించారు. 

సాహిత్యాన్ని నడిపించే కేంద్ర సాహిత్య అకాడమీని ఆక్రమించారు. అలాగే ఈ దేశ చరిత్రను నిర్మించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసిహెచ్‌ఆర్) దీనికంతా ముడిసరుకును అందించే ఓ విద్యా సంస్థ వాళ్లకు కావాల్సి వచ్చింది. దానికోసం మార్క్స్‌ను, మావోను, స్టాలిన్‌ను ఈ దేశ యువకుల బుర్రల్లోకి ఎక్కించేందుకు దేశ రాజధాని నడిబొడ్డున జవహర్‌లాల్ నెహ్రూ (జెఎన్‌యు) ‘మార్కిస్ట్ మదర్సా’గా ఆవిర్భవించింది. ఈ రోజుకూ ఈ సంస్థలన్నీ, ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ కమ్యూనిస్టుల ఆధిపత్యంలోనే ఉన్నాయి. ఇపుడు ఈ కమ్యూనిష్టులు మార్క్స్ సిద్ధాంతంకన్నా ‘షరియాబోల్ష్‌విక్’కు ఎలా ప్రాధాన్యం ఇస్తున్నారో గమనించవచ్చు.

కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలన్నీ ఎప్పుడూ అలజడిని, సంఘర్షణనూ కోరుకొంటాయి. వాళ్లకు ఈ దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు. ఇపుడు పౌరసత్వ సవరణ బిల్లు (సిఏఏ) చట్టంగా రాగానే ఈ దేశంలో అంతర్యుద్ధం సృష్టించి, దేశాన్ని ‘సివిల్ వార్’ వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

 రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు ‘అఫ్జల్‌గురు’ను హీరోగా చిత్రీకరించింది వీళ్లే! కాశ్మీర్‌ను భారత్ నుండి విముక్తి చేయాలని కోరేదీ వీళ్లే! ఇపుడు పౌరసత్వ సవరణ చట్టంపై విశ్వవిద్యాలయాలను, ఇండియా గేట్‌ను, జంతర్‌మంతర్‌ను గందరగోళ పరుస్తున్నదీ వాళ్లే. జెఎన్‌యు, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి వాటిని అశాంతితో రగిలిస్తున్నది ఈ ‘తుక్డే తుక్డే గ్యాంగే’! కన్హయ్య, షెల్హారశీద్, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లు గతంలో చేసిన దేశద్రోహ నినాదాలు ప్రజలు గమనించారు కాబట్టే ఇపుడు ఇంకో క్రొత్త ముఖాన్ని వెలుగులోకి తెచ్చారు. జెఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా అవతారం ఎత్తిన ‘ఆయుషీఘోష్’ సరికొత్త వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది.

వాళ్లకు అండదండగా ఉండే ఎర్రదండు నాయకుడు సీతారాం ఏచూరి లాంటివారు, అమర్త్యసేన్ లాంటి అపర మేధావి, బర్ఖాదత్తా, రాజ్‌దీప్ సర్దేశాయ్ వంటి మీడియా వ్యక్తులు విపరీతమైన ప్రచారం కల్పిస్తారు. ఒక అర్బన్ నక్సల్స్ అంతా వాళ్లకు బాకాలు ఊదుతూ వ్యాసాలు గుప్పిస్తారు. వాళ్ల లక్ష్యం ఈ దేశంలో ‘జాతీయవాదం’ లేకుండా చేయడమే. తల్లిదండ్రులు అనేక కష్టాలకోర్చి తమ పిల్లలను చదువుకోవాలని విశ్వవిద్యాలయాలకు పంపిస్తే ఈ గ్యాంగంతా ఆ పిల్లల మెదళ్లలో విషం ఎక్కిస్తుంది. 

దేశంలోని ఏ ఐఐటి సంస్థల్లో జరగని నిరసనలు అలజడి ఈ విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్లకు ఫండింగ్ చేస్తాయి. అలాగే అంతర్జాతీయ నిధలను విరాళాలుగా ఈ గ్యాంగ్ కొట్టేసి, దేశంలో అగ్గిరాజేస్తూ ఉంటుంది. 2014 నుండి ఈ గ్యాంగ్‌ను వెనుకనుండి నడిపిస్తున్నది అర్బన్ నక్సల్సే. ఇటీవల జాదవ్‌పూర్ యూనివర్సిటీ కూడా ఎర్రదండు కార్యకలాపాలకు వేదికగా మారింది. సరికొత్త పౌర యుద్ధాన్ని సృష్టించి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడమే వీరి పని. చైనా జిన్‌పింగ్‌ను, కొరియా ‘కిమ్’ను హీరోలుగా పూజించేవాళ్లు ఈ దేశంలో స్వేచ్ఛ ఎక్కువై ‘ఆజాదీ’ అంటూ గగ్గోలు పెడతారు. 

దేశాన్ని ముక్కలు చేసేంత ‘స్వేచ్ఛ’ వీళ్లకు కావాలి. అవార్డు వాపసీ, మాబ్‌లిచింగ్, ఘర్‌వాపసీపై దుష్ప్రచారం, రాఫెల్, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, రామమందిరం- ఇలా అన్ని విషయాల్లో వాళ్లు ఫెయిల్ అయ్యారు. ఇపుడు పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోవాలంటూ ముస్లింలలో కొన్ని వర్గాలను ముందు పెట్టి, వెనుకనుండి నిప్పు పెడుతున్నారు. వాళ్లు ఏ సభ పెట్టినా ‘వేదికమీద ఉన్న వాళ్లు ఎక్కువ; క్రింద వున్నవాళ్లు తక్కువ’ అన్నట్లు సాగుతుంటాయి.

 కాబట్టి ముస్లిం రాజకీయ గుంపు వెనకేసుకుంటే సభలు నిండుతాయి. ర్యాలీలు సాగుతాయి అనుకుంటున్నారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ఉడుకు రక్తం ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి గొప్ప ర్యాలీలు తీస్తున్నామని మురిసిపోతున్నారు. గతంలో కన్నా విజ్ఞతతో వున్న ‘హిందూ సమాజం’ నిశ్శబ్దంగా ఏకమవుతున్న సంగతి వాళ్లు మరిచిపోతున్నారు. ఈ కుట్ర వెనుక ఇపుడు అర్బన్ నక్సల్స్ చైతన్యవంతంగా ఉన్నారు.

విద్యార్థులకు చదువునందించాల్సిన విశ్వవిద్యాలయాలు దేశ వ్యతిరేక శక్తులను సృష్టించే కర్మాగారాలుగా మారడం ఆందోళనకరం. 11 ఏప్రిల్ 2010 ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం జెఎన్‌యులోని వామపక్ష విద్యార్థి సంఘాలు ఛత్తీస్‌ఘ్ఢ్‌లో నక్సలైట్ల చేతిలో మరణించిన 76 మంది వీరజవానుల మరణాన్ని ఉత్సవంగా జరుపుకొని ‘్భరత్ ముర్దాబాద్ మావోవాద్ జిందాబాద్’ అనడం మనం చూసాం. ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదు. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు ఈ అర్బన్ నక్సల్స్ వెంట నడిస్తే ముస్లిం సమాజం క్రెడిబులిటీ తగ్గిపోవడం తథ్యం.


*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
నమస్తే! సదా వత్సలే మాతృభూమి...



********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : ఆదివారం*
*05-01-2020  




మధ్యప్రదేశ్‌లోని నీమడ్ ప్రాంతంలో పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన ‘తాంతియా భీల్’ అంటే ఆంగ్లేయులకు వెన్నులో వణుకు పుట్టేది. అలాంటి వీరుడిని నేరుగా జయించడం చేతగాని ఆంగ్లేయులు కుట్రతో మట్టుబెట్టాలని ప్రయత్నించి, అతని ఆనుపానులు తెలుసుకున్నారు. తాంతియా భీల్ ఓ స్ర్తిని తన సోదరిగా భావించేవాడు. బ్రిటీషర్లు ఆమె భర్తను లొంగదీసుకొన్నారు. 

రాఖీ పూర్ణిమ రోజు తాంతియా రాఖీ కట్టించుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. బ్రిటీషువారు ఆమె భర్త గణపత్ ద్వారా మత్తు మందు కలిపిన పాయసాన్ని తాంతియా చేత తాగించారు. అతను స్పృహ తప్పగానే బయట వేచి వున్న ఆంగ్లేయ సైనికులు అతడిని బంధించి జబల్‌పూర్ దగ్గర 1889లో ఉరితీశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని కీ.శే. అనిల్ మాధవ్ దవే తన ‘శివాజీ’ పుస్తకంలో వివరించి, ‘బయటి శత్రువుల కన్నా లోపలి విద్రోహుల వల్లే ఎక్కువ నష్టం కలిగింది..’ అంటూ వ్యాఖ్యానిస్తాడు.


నిజమే..! ఇపుడు దేశంలోని అంతర్గత శత్రువులంతా లేచి కూర్చున్నారు. ముఖ్యంగా సీఏఏ (పౌరసత్వ సవరణ) చట్టం ద్వారా పుడుతున్న అపోహలు దేశాన్ని మతపరంగా విభజిస్తున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు దేశంలోని మెజారిటీ ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతా కారణం హిందువుల అవగాహనా రాహిత్యం. ‘మోదీ, అమిత్ షా ఉన్నారు గదా! మనం ఏం చేయకున్నా ఫరవాలేదనే’ మనస్తత్వం ఆవహించింది. ఇపుడు దేశవ్యాప్తంగా సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రదర్శనలతో హిందువులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ‘పంక్చర్ షాప్’ నడిపే సగటు ముస్లిం మతస్థుడు సులభంగా గ్రహిస్తున్నాడు.

 కానీ తన పక్కన ఏం జరుగుతోందో ఈ దేశంలోని ‘మెజారిటీ మతస్థులు’ తెలుసుకోలేకపోతున్నారు. క్రీ.శ.712లో భారతదేశంలోకి చొరబడిన మహమ్మద్ బిన్ కాశీంకు ఎంత క్లారిటీ ఉందో 1946లో దేశ విభజనకు కారణమైన మహ్మద్ అలీ జిన్నాకు అంతే సులభంగా పరిస్థితులు అర్థం అవుతున్నాయి. ఇపుడు సీఏఏను వ్యతిరేస్తున్న ‘సూడో సెక్యులర్ గ్యాంగం’తా అంతే క్లారిటీగా ఉంది. 

ఏ క్లారిటీ లేని కళ్లు మూసుకొన్న కబోదులు హిందువులు. ఎంతసేపూ మన ఇళ్లలో సాఫ్ట్‌వేర్ సీఈఓలను తయారుచేసి, అమెరికాకు పంపి అక్కడి నుంచి వచ్చే డాలర్లతో ఇక్కడ ‘రెరా’ పరిధిలోకి వచ్చే విల్లాలు కొందామనో, హైదరాబాద్ పక్కనో, విశాఖపట్నం చెంతనో భూములు కొని ఫామ్‌హౌజ్‌లు చేద్దామనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. బీదత్వంలో ఉన్న హిందువులే ఇంతో అంతో ప్రతిఘటిస్తున్నారు. మధ్యతరగతి హిందువులకు ఈమధ్యకాలంలో ఈ ఉన్నతశ్రేణి హిందువులు ఆదర్శంగా మా రి వారి బాటలో వెళ్లాలన్నట్లు దారులు పరుస్తున్నారు. కోటీశ్వరులు చాలామంది పత్రికలు చదవరు! 

కొందరు హిందూ ధనవంతులు మాత్రం పుట్టినరోజు వేడుకలకు, ఇతర ఉత్సవాలకు స్వల్ప దానధర్మాలు చేస్తున్నారు. కానీ ఇతర మతాలవారు తమ సంపాదనలో కొంతభాగం మతపరమైన విషయాలకు అందిస్తున్నారు. హిందువుల్లో అలా చేసేవారు చాలా స్వల్పం. ఇటీవల సిబిఆర్ ప్రసాద్ అనే ధనవంతుడు చాలా పెద్ద మొత్తాన్ని హిందూ సంస్కార కేంద్రమైన శిశుమందర్‌కి దానం ఇవ్వడం ముదావహం. అలాంటివాళ్లు చాలా అరుదు.
హిందూ సమాజానికి ఈ స్పృహ లేదు. దానధర్మాలు చేయకున్నా ఫర్వాలేదు.. కనీసం తన కాళ్ల కింద భూమి ఎందుకు కదులుతోందా? అని ఆలోచించుకోలేకపోతే ఎలా? ఇటీవల బ్రిటన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్కడ నివసించే పాకిస్తాన్ ముస్లింలు, భారత ముస్లింలు ఒకే మాటపై ఉండి లేబర్ పార్టీవైపు నిలబడ్డారు. లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేసిన- ‘370 ఆర్టికల్ నిస్తేజానికి వ్యతిరేకంగా’ తీర్మానం చేయాలని లేబర్ పార్టీతో హామీ తీసుకున్నారు. 

అదృష్టం కొద్దీ అక్కడ కన్జర్వేటివ్ పార్టీ గెలవడంతో వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. ఈ పార్టీ అభ్యర్థి దేవాలయంలో పూజ చేసి ప్రచారం మొదలుపెట్టడం గమనించదగిన విషయం. పాకిస్తాన్ ముస్లింలు కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని సమర్థిస్తే ఫర్వాలేదు కానీ భారత ముస్లింలు ఎందుకు సమర్థిస్తున్నారో తెలిస్తే, ఇపుడు సీఏఏ చట్టాన్ని ఇక్కడి వాళ్లు ఎందుకు వ్యితిరేకిస్తున్నారో అర్థం అవుతుంది. నిజానికి ఈ చట్టం వల్ల ఇక్కడి ముస్లింలకూ ఏ ప్రమాదం లేకున్నా, దీనిపై అపోహలు కలిగించే మేధో వర్గం, మీడియా, సూడో సెక్యులర్ రాజకీయ వ్యవస్థ చాలా చైతన్యవంతగా పనిచేస్తుంది. 

ఉల్లిగడ్డ, టమాటాల ధర తగ్గించాలని దేశవ్యాప్త ఆందోళన చేసే ‘ఎర్ర గ్యాంగు’ దీని వెంబడి ఉంది. వాళ్లకు ఉల్లిధరకూ, తల్లి భారతికి తేడా తెలియదు. వాళ్ల దృష్టిలో దేశంలోకి అక్రమ చొరబాటుదారులు ప్రవేశించడం కన్నా ఉల్లిధర పెరగడమే పెద్ద సమస్య.

డెబ్భై ఏళ్లనుండి దేశ ప్రజలను మభ్యపెట్టి, హిందువులను అణచిపెట్టి ఉంచిన సంతుష్టీకరణ 2014లో ఓ జాతీయవాద ప్రభుత్వాన్ని గెలిపించాయి. ఇదేదో తమ అప్రమత్తత తక్కువై మోదీ గెలిచాడని ఈ శక్తులన్నీ భావించాయి. కానీ 2019లో జాతీయవాద ప్రభుత్వం మళ్లీ గెలవడం, కశ్మీర్ సమస్య, రామమందిరం సమస్య, త్రిపుల్ తలాక్ సమస్యలకు పరిష్కారం అత్యంత సులభంగా నీళ్లు తాగినట్లు చేసే సరికి ఈ శక్తులకు నిద్రపట్టడం లేదు. అంత పెద్ద రామమందిరం ఉద్యమం చేసి ఎంతోమంది హిందువులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

కానీ ఎవ్వరిపైనా ఏ ఒక్కడూ ఒక్క రాయి విసరలేదు. మరి ఈరోజు రాళ్లెందుకు విసురుతున్నారు? ‘ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు’ అన్న నినాదాన్ని గోడలపై రాస్తే తూచ తప్పకుండా పాటించిన హిందువులు ఈ రోజు ఈ దేశంలో ‘మాకు హక్కులు కావాలని’ దేబిరించే పరిస్థితికి దిగజారారు.

‘జై భీం జై మీమ్’ అని నినదించే శక్తులు ఈ దేశంపై విషం చిమ్ముతున్నాయి. షెల్హా రశీద్ లాంటి వ్యక్తులు ‘ముస్లింల కోసం దళితులు తమ రిజర్వేషన్లలో కొంత భాగం ఇవ్వాలని’ అప్పుడే డిమాండ్ పెట్టారు. చంద్రశేఖర్ రావణ్ లాంటి కులతత్వవాది జామా మసీదులో ఎలా దాక్కున్నాడో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ బొమ్మలతో, ప్లకార్డులతో ప్రదర్శనలు జరుపుతున్నవారు ఆయన రచించిన రాజ్యాంగంపై గౌరవం కలిగి ఉన్నారా? పార్లమెంటు ఏదైనా చట్టం చేసాక, దాన్ని రద్దుచేయమని అడగడం రాజ్యాంగ హక్కా? అదీ ఇతర దేశాల్లోని చొరబాటుదారులు తమకు కావాలని డిమాండ్ చేయడం ఏ దేశ చరిత్రలో జరుగకపోవచ్చు. 

దేశ సరిహద్దులను గుర్తించేందుకు 1941 జనాభా లెక్కలు ప్రాతిపదిక అయ్యాయి. 1932 జనాభా లెక్కలు కమ్యూనల్‌గా చేస్తున్నారని కాంగ్రెస్ బహిష్కరించమంటే హిందువులంతా అమాయకంగా బహిష్కరించారు. ము స్లిం నాయకత్వం తమ వర్గాన్ని దగ్గరుండి నమోదు చే యించింది. 1941లో 15 శాతం వున్న షెడ్యూల్డ్ జాతులను లెక్కల్లో నియంత్రించేందుకు ముస్లిం లీగ్ కుట్ర పన్నింది. దీంతో బెంగాల్ జనాభాలో హిందువుల శాతం తగ్గిపోయింది. దాని ఫలితంగా దేశ విభజనలో ఎంతో భూభాగం మనం కోల్పోయేటట్లు చేసింది. ఇప్పటికైనా హిందువులు ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అంటూ చైతన్యం లేకుండా స్వార్థంగా జీవిస్తే మరో స్వాతంత్య్ర సంగ్రామం చెయ్యాల్సి వస్తుంది.. జాగ్రత్త!

*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*


వయసును బట్టి మనిషి ఆలోచనల్లో తీవ్రతలు, ఉద్వేగాలు, ఆవేశాలు, ఆనందాలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. అందుకే బాల్యం, యవ్వనం వృద్ధాప్యం వంటి శారీరక స్థితులను మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది. కుటుంబం, పెద్దరికం, సమాజం వంటివి వ్యక్తులను నియంత్రిస్తూ ఉంటాయి. 

స్వీయ నియంత్రణ కోల్పోతున్న మనుషులు.. పశు ప్రవర్తన వైపు అడుగులు వేస్తున్నారు. దీన్ని రూపుమాపి.. దైవత్వానికి మరల్చే మహత్తర ప్రక్రియ ఆధ్యాత్మికత. ఈ విషయం అర్థం చేసుకోకుండా.. ఆధ్యాత్మికతను మతానికి, ఆత్మకు పరిమితం చేస్తూ.. అసలు విషయాన్ని వదిలేస్తున్నాం. నిజానికి సనాతన ధర్మం ఆధ్యాత్మికతను జీవన విధానంగా మార్చింది. కుటుంబమే మనకు మొదటి సమాజం. అమ్మే మొదటి గురువు. అందుకే ‘అమ్మ మొదటి దైవం’ అన్నారు.
 
ఉపాఽధ్యాయాన్‌ దశాచార్య ఆచార్యాణాం శతం పితా
సహస్రంతు పిత్రూన్‌ మాతా గౌరవేణాతిరిచ్యతే
 
అనే మనుధర్మ సూక్తి ప్రకారం.. ఉపాధ్యాయుడికంటే ఆచార్యుడుపది రెట్లు అధికంగా, ఆచార్యుడికంటే తండ్రి వంద రెట్లు అధికంగా.. తండ్రికంటే తల్లి వేయి రెట్లు అధికంగా గౌరవనీయురాలు. అందుకే అమ్మను ‘‘మాతా నిర్మాతా భవతి’’ అన్నారు. కలిగిన సంతానం పురుషుడైనా, స్ర్తీ అయినా అమ్మ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 

తల్లి ఒక సాంచె (కమ్మచ్చి) లాంటిది. ఆ మూసలో ఎలాంటి భావాలుంటే.. పిల్లలు అలాగే తయారవుతారు. తల్లిని గౌరవించే పుత్రుడు.. సమాజంలోని స్త్రీలందరినీ గౌరవిస్తారు. కానీ, ఈరోజు తల్లి ఒడిలో పెరిగే పిల్లలకన్నా, హాస్టళ్లలో ఉండేవారే ఎక్కువ. దానివల్ల విద్యార్థులకు కుటుంబంలోని అనురాగం తెలియడంలేదు. అలాగే ఆడ సంతానం వద్దనుకొని చాలామంది భ్రూణహత్యలు చేస్తున్నారు. దాంతో సామాజిక అసమతుల్యత ఏర్పడుతోంది. దానివల్ల మగవారిని పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత పెరుగుతోంది.
 
అంతేకాదు.. అక్క, చెళ్లెళ్ల అనురాగానికి కూడా మగవారికి అవకాశం లేకుండాపోతోంది. దాంతో స్ర్తీ తత్వం, ఆమెలోని సున్నితత్వం, సరళత్వం, నిర్ణయ సాధికారతను గుర్తించలేకపోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్ర్తీ ఔనత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. దీనికి తోడు మూడేళ్ల వయసు నుంచే.. పిల్లల్ని హాస్టళ్లకు పంపుతున్నారు. వాడికి ముప్ఫై ఏళ్లు రాగానే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు చేరుస్తున్నాడు. ఇదే కర్మఫలం. 

అనేక విషయాల పట్ల తనలోని శక్తిని ప్రకటించే యువకుడు కేవలం చదువుకే పరిమితమవ్వడం వల్ల మిగిలిపోయిన అంతర్గత శక్తిని చెడ్డపనులకు కేటాయిస్తున్నాడు. తల్లితండ్రులు, గురువులకన్నా బలమైన మాధ్యమాలు అతడిని ప్రభావితం చేస్తున్నాయి. వీటి నుంచి మనసును నియంత్రణలో ఉంచకపోతే జరిగే అనర్థాలను మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై గీతలో శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా చెప్పారు.
 
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాద్బుద్ధినాశా బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి
 
క్రోధం వల్ల వ్యామోహం, దానివల్ల స్మృతి నాశనం, తద్వారా జ్ఞానశక్తి ధ్వంసం అవుతుంది. బుద్ధి నశిస్తే మనిషి తన స్థితి నుండి పతనం అవుతాడు. కాబట్టి మనస్సు నిర్మలంగా ఉంటేనే మనం బాగుంటాం.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 30 - 12 - 2019 : సోమవారం*


ఎంతమంది స్వాతంత్య్రవీరులు తమ ప్రాణాలను బలిపెట్టి ఈ దేశానికి విముక్తి కల్పించారో, వాళ్లంతా ఈ రోజు ఇలాంటి వారికోసమా ‘మేం పోరాటం’ చేసిందని వీరస్వర్గంలో తప్పక బాధపడుతుంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ మెజారిటీ ప్రజలు ‘తమను సమానంగా చూడమని’ అర్థించడం చూడడం సాధ్యం కాదు. ఇపుడు ముస్లింలీగ్ మళ్లీ పురుడు పోసుకుందా అన్నట్లుగా దేశంలో ఆందోళనలు మొదలుపెట్టారు. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, మహమ్మదాలీ జిన్నా ఏక కాలంలో జన్మించి దేశంలో మత రాజకీయం మొదలుపెట్టినట్లు తోస్తున్నది. జోసెఫ్ స్టాలిన్, మావోసేటుంగ్ అర్బన్ నక్సల్స్‌గా అవతారం ఎత్తి దేశంలో లేని అస్థిరతను సృష్టిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.


గత ఏడాది శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేరళలో ఇతర ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. ఒక్క రాయి పోలీసులపై పడలేదు. ఇపుడు ‘రాళ్లవర్షం’ ఎవరు సైతానులనుకొని కురిపిస్తున్నారు? అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో పోయిన ఏడాది క్రింద మహమ్మదాలీ జిన్నా ఫొటో పెట్టి ‘ఖాయిదే ఆజం’ అంటూ రెచ్చిపోయిన మూకలు ఇపుడు మాకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ వాళ్లు తమకు దగ్గరి బంధువులంటూ బజార్లోకి వస్తున్నారు. ప్రార్థనకు - రాజకీయానికి అంతరం పాటించాలని ఆలోచించకుండా ‘్ఢల్లీ జమా మసీదు’ నుండి ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 

జామియా మిలియా విశ్వవిద్యాలయం ఈ బిల్లుపై గెంతులు వేస్తే జెఎన్‌యు విద్యార్థులు అందరినీ రెచ్చగొడుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఆశ్రీత కవులు ఎర్ర కలాలతో విషం కక్కుతున్నారు. అగ్నికి ఆజ్యంలా ‘మహమూద్ పరాచా’ లాంటి వామపక్షవాది డా॥ బాబా సాహెబ్ దృక్కోణం చూపిస్తూ వారిని మరింతగా రెచ్చగొడుతున్నాడు. ఎప్పుడూలేనిది ఈ ఆందోళనకారులు భారత జెండాలను పట్టుకొంటున్నారు; రాజ్యాంగాన్ని తలపై మోస్తున్నారు. 

అది సంతోషపడాల్సిన విషయమే!? కానీ అదే బాబా సాహెబ్ దేశ విభజన నాడు చెప్పిన విషయాలే ఈ రోజు అమలు అవుతుంటే ఈరోజు ఆందోళన ఎందుకు? ‘ఈ దేశపు మొదటి కబళం (ముద్ద) ముస్లిం మైనారిటీలకే చెందుతుంది’ అని నాటి ప్రధాని హోదాలో డా॥ మన్మోహన్ సింగ్ ప్రకటించినపుడు ఈ దేశంలో ఏ హిందువూ బాధపడలేదే? ఎందుకంటే ఈ దేశంలో హిందువుల్లో నిజమైన ‘సెక్యులరిజం’ ఉంది. క్యాబ్ బిల్లు వచ్చాక కొన్ని సూడో సెక్యులర్ పార్టీలు, అర్బన్ నక్సల్స్, వామపక్ష మీడియా ఒక మత వర్గాన్ని రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చి, ఆందోళన చేయిస్తున్నారు కదా! 

ఒకవేళ హిందువులు కూడా అదేవిధంగా రోడ్లపైకి వస్తే, దేశంలో జరిగే పరిణామాలు మనం భరించగలమా? బెంగాల్, కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన హింసకు బాధ్యులెవరు? క్యాబ్ చట్టానికి అనుకూలంగా జరిగే ప్రదర్శనలను తొక్కిపెడుతున్న మీడియా ఆందోళనలను మాత్రం భుజంపై ఎత్తుకుంటున్నది. యూపీలో మాత్రమే ఎందుకు తీవ్ర ఘర్షణ పరిస్థితులు సృష్టిస్తున్నారు? ఎందుకంటే హిందూ జాతీయాభిమానం గల యోగి ఆదిత్యనాథ్ అక్కడ పాలించడం సెక్యులర్ ముద్ర వేసుకొన్న వాళ్లకు ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఆందోళన ప్రత్యేకంగా చేస్తున్నారు. 

అంటే ఈ దేశంలో హిందుత్వ మూలాలున్న వ్యక్తి పరిపాలించడం నేరమా? తీవ్రవాదులకు పరోక్షంగా సహకరించే ఫరూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు గొప్ప సెక్యులర్ సిద్ధాంతంగా ప్రచారం చేసే వాళ్లు హిందూ జాతీయవాదంపై ఎందుకు అంత అక్కసు ప్రదర్శిస్తున్నారు?! బాట్లాహౌజ్ ఎన్‌కౌంటర్ అయ్యాక నాటి సోనియా గాంధీ రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చిందని సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. రాజేంద్ర సచార్ రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చిందని సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు.
రాజేంద్ర సచార్ కమిటీ పేరుతో ‘మత హింస బిల్లు’ హిందువులపై రుద్దేందుకు ప్రయత్నించింది నిజం కాదా? ఈ దేశంలో మైనారిటీలంటే కేవలం ఒక మతం వాళ్లేనా? ఫార్సీలు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు మైనారిటీలు కారా? మన ప్రక్కనున్న మూడు ముస్లిం దేశాలు ‘దార్ - ఉల్ - ఇస్లాం’గా ప్రకటించుకొన్నాక ఇంకెక్కడ అక్కడ సెక్యులరిజం ఉంది. మరి అక్కడున్న ముస్లిమేతరులు ఎంత ఘోరంగా అత్యాచారం చేయబడ్డారో సూడో సెక్యులర్ గ్యాంగ్ చెప్పగలదా? అలాగే పాకిస్తాన్‌లో షియాలు, అహ్మదీయులు అత్యాచారాలకు గురయ్యారు కదా! అని వాదిస్తున్నారు. 

నిజానికి షియాలు ఒకవేళ అత్యాచారానికి, ఇబ్బందులకు గురైతే మరో ముస్లిం దేశమైన, ‘ఇరాన్’కు వెళ్లవచ్చు. అలాగే అహ్మదీయులపై వివక్ష చూపెడితే మరో ప్రక్కనున్న ‘బహ్రెయిన్’ వెళ్లొచ్చు. అదంతా అహ్మదీయులకు నెలవైన స్థలమే కదా? ఈ మూడు దేశాలలో ఒక్క హిందువైనా ఉన్నత పదవులు అధిరోహించాడా? అంతెందుకు, మన దేశంలో ముస్లిం మెజారిటీగా మొన్నటివరకున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిందువు ఒక్క ముఖ్యమంత్రి కాగలిగడా? సెక్యులరిజం పేరుతో గొంతు చించుతున్న ఓవైసీ పార్టీలో ఎంతమంది హిందువులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ముస్లింలీగ్ పార్టీగానీ, ఎఐఎంఐఎంగానీ ఏనాడైనా హిందువుల గురించి నోరు తెరిచి మాట్లాడారా? 

వాళ్లకు తోడు ఈ దేశంలో హిందూ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకొన్న కమ్యూనిస్టులు హిందువులకు వచ్చే ఒక్క ఇబ్బందినైనా ప్రతినిధులుగా ఉండి ఆందోళన చేసారా? సీతారాం ఏచూరి మొదలుకొని బి.వి. రాఘవులు వరకు ప్రతిరోజూ హిందూ మతతత్వంపై యుద్ధం చేస్తాం అంటారు. నిజానికి సెక్యులరిజం అంటే అన్ని మతతత్వాలపై యుద్ధం చేయాలి కానీ కేవలం ఒకరిపైనే ఎందుకు చేస్తారు?! ఈ దేశంలో దేశ విభజన మొదలుకొని క్యాబ్ చట్టం వరకు కమ్యూనిస్టులు ఎప్పుడూ ఈ దేశ వ్యతిరేకతనే ప్రదర్శించారు. పెరియార్, కరుణానిధి తర్వాత ఈ దేశంలో రాష్ట్రానికో కులం, కుటుంబం పాలించడం మొదలుపెట్టారు. వాళ్లకు అధికారం తప్ప ఇంకొకటి పట్టదు. తమ అధికారం కోసం రాష్ట్రానికి ఒక పిల్ల కాంగ్రెస్ ఉద్భవించింది. 

కాంగ్రెస్ ఎలా అయితే కేంద్రంలో కుటుంబ రాజకీయం చేసిందో అలాగే, సంతుష్టీకరణతో తమ అధికారాన్ని నిలబెట్టుకొన్నదో అదేవిధంగా ప్రాంతీయ పార్టీలన్నీ ‘ముస్లిం సంతుష్టీకరణ’ అవలంభించాయి. సావర్కర్ లాంటి దేశభక్తుల నీడలో పుట్టిపెరిగిన బాలా సాహెబ్ థ్రాకే స్థాపించిన శివసేన కూడా ఆయన ఆశయాలకు విరుద్ధంగా అధికారం కోసం ఇటీవల అదే మార్గంలోకి వెళ్లడం హిందువులకు ఆందోళన కలిగించే విషయం. మూడు ముస్లిం దేశాల్లో అత్యాచారాలకు గురైన అక్కడి మైనారిటీలకు గత యూపిఏ ప్రభుత్వం చేసిన లిస్ట్‌కే ఈ బిల్లు మద్దతు పలుకుతుంది.

 ఈ దేశంలోని ఒక్క ‘ముస్లిం మైనార్టీ’కి కూడా దీనివల్ల నష్టం లేకున్నా ఈ అక్కసంతా ఎందుకు?! త్రిపుల్ తలాక్‌పై చట్టం తెచ్చినందుకా? కాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి రద్దుచేసినందుకా? రామమందిరం తీర్పు హిందువులకు సానుకూలమైనందుకా? బహుశా ఇవే మూలకారణం. మెజారిటీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ఆందోళన ఇంకెంతకాలం?

*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*27-12-2019 : శుక్రవారం*


పాకిస్తాన్ తన మిస్సైల్స్‌కు తైమూర్, అబ్దాలీ వంటి నరరూప రాక్షసుల పేర్లు పెట్టుకున్నది. హిందూస్తాన్‌లో విలయ విధ్వంసం సృష్టించిన మహమ్మద్ ఘోరీ పేరును తన క్షిపణులకు నామకరణం చేసింది. అలాగే కాంగ్రెస్‌ను వెనుకనుండి నడిపించే గులాం నబీ ఆజాద్ తన కొడుకుకు ఔరంగజేబు అని పేరు పెట్టుకొన్నాడు. ఈ నబీ కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ నుండి ‘క్యాబ్’ బిల్లుపై రగడ చూసాక ఇంతకన్నా ‘ఇంకేం చూస్తాం’ అనిపిస్తుంది. 

క్యాబ్ బిల్లు చట్టబద్ధంగా పార్లమెంట్‌లో పాస్ అయ్యాక ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అంటూ శివాలెత్తుతున్న సోనియా అండ్ కో సూడో సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్టులు, కొన్ని ఇస్లామిక్ సంస్థలు, పార్టీలు రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరం. అంటే ఇప్పటినుండి ఏ బిల్లు అయినా పార్లమెంట్ ఆమోదించినా, ఆమోదించకున్నా బస్సులను తగులబెట్టి కొన్ని మత విశ్వవిద్యాలయాల్లో ఆందోళన చేసి ఆమోదించుకోవాలని వాళ్లు సందేశం ఇస్తున్నారా? 

4 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు తమ స్వంత స్థలాలను వదలిపెట్టి అత్యాచారాలకు గురై పుట్టకొకరు, చెట్టుకొకరు అయినపుడు ఇదే గులాం నబీ ఆజాద్ ‘దేశ సెక్యులరిజం ప్రమాదంలో పడిందని’ నోరు విప్పదే? అస్సాంలోకి బంగ్లా చొరబాటుదారులు కుప్పలు తెప్పలుగా వచ్చి అక్కడ స్థానికులను ఊచకోత కోస్తుంటే ఇదే కపిల్ సిబ్బల్ కళ్ళు మూసుకున్నాడా? మయన్మార్ నుండి రోహింగ్యాలు వచ్చి అక్కడి స్థానిక హిందువులను చంపి బొంద పెడుతుంటే డిగ్గీరాజా ఎక్కడున్నాడు? 

ఇక ఈ దేశ కమ్యూనిస్టులు కళ్లున్న కబోదులు. వాళ్ల వంధిమాగధ చరిత్రకారులు, రచయితలు ‘తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దే’ కృతజ్ఞతాహీనులు. అసలు ఇపుడు జరుగుతున్న ఆందోళన ‘క్యాబ్’ బిల్లును వ్యతిరేకించేందుకు కాదనిపిస్తుంది. త్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, రామమందిరం తీర్పు.. ఇవన్నీ హిందువులకు సంతోషం కలిగిస్తే ఈ గుంపును రెచ్చగొట్టాయి. అందుకే వీటన్నిటికి సంబంధించిన అక్కసునంతా ఇలా వెళ్లగక్కుతున్నారు. దేశంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో కలుపుకొని సుమారు 300 దాకా ఉన్నాయి. కానీ జెఎన్‌యు, జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి కమ్యూనిస్టు, ముస్లిం ఆధిపత్యం ఉన్నచోట మాత్రమే నిరసనలు ఎందుకు వస్తున్నాయి? అలాగే బెంగాల్, కేరళ, ఢిల్లీ వంటిచోట్ల సూడో సెక్యులర్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. 

అక్కడా హింస చెలరేగింది. అసాంఘిక శక్తులకు పినరయ్ విజయన్ ఆశ్రయం ఇస్తే, మమతా బెనర్జీ ఏకంగా పెద్ద ర్యాలీ తీసింది. ఇక విశ్వవిద్యాలయాల్లో ఉంటున్న విద్యార్థులకన్నా నిరసనల్లో పాల్గొన్నవారి రెండింతలు ఉంటుంది. అంటే బయట శక్తులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నమాట. అలాగే త్వరలో ఎన్నికలు రానున్న ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉండడానికి అక్కడ ‘సంతుష్టీకరణ’ మళ్లీ మొదలైంది. ఈ బుజ్జగింపు రాజకీయాలు మానుకోకపోతే దేశం ఎన్నటికీ అభివృద్ధి చెందదు. ‘అందరూ సమానం అనకుండా కొందరు మాత్రమే సమానం’ అనుకునే ధోరణినుండి సెక్యులర్ పార్టీలు బయటపడకపోతే ‘షా’ విసిరిన వలలో పడ్డట్లే..!


ఈ తుక్డే తుక్డే గ్యాంగుకు భలే ఆశ్చర్యకరమైన ‘లింక్’ ఉంటుంది. కన్హయ్య కుమార్ లాంటివాళ్లు విద్యార్థులను రెచ్చగొడతారు. దిగ్విజయ్‌సింగ్, మమత, కపిల్ సిబాల్ వంటి నాయకులు దీనికి పార్టీల రంగు ఇస్తారు. బర్ఖాదత్తా, సర్దేశాయ్ వంటి మీడియా వ్యక్తులు ఈ విషయాన్ని మార్కెట్ చేస్తారు. సీతారాం ఏచూరి వంటివారు ఈ ఘటనను ‘ప్రజాస్వామ్యం’ అంటూ నమ్మిస్తారు. వాళ్లకు అనుగుణంగా రామచంద్రగుహ, అరుంధతీరాయ్ వంటివాళ్లు నేపథ్యం అల్లుతారు. క్రొత్త బిచ్చగాళ్లుగా సినిమాల్లో వుంటూ సెక్యులరిజం చెప్పే కమల్‌హాసన్, ప్రకాశ్‌రాజ్, ఖుష్బూ వంటి వారు దరువువేస్తారు.

 హిందువులకు సెక్యులరిజం ప్రబోధిస్తూ ఇస్లామిక్, క్రైస్తవ రాజకీయ శక్తులను బలపరిచే తస్లీమా రహమానీ, జాన్ దయాల్ వంటివారు వివిధ మీడియాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ల మాటలు నమ్మి రోడ్లకి వచ్చే వాళ్లను రక్షించేందుకు ‘హక్కుల సంఘాలు’ గన్లు లోడ్ చేసుకుని ఉంటాయి. ఈ ‘మెలోడ్రామా’ను విజయవంతం ఆడించేందుకు ‘ఎర్ర మీడియా’ సరైన రంగస్థలం సృష్టిస్తుంది
.
సాక్ష్యాలు లేకుండా అబద్ధాలు ప్రచారం చేయడం ఇటీవల క్రొత్త ట్రెండ్. విదేశాల్లో సైతం భారత్‌ను అపఖ్యాతిపాలు జేయడం వీళ్లకు చాలా సులువైన పని. 2019 ఎన్నికలకు ముందు ఇదే కపిల్ సిబాల్ లండన్ వెళ్ళి సయ్యద్ షుజా అనే అంతర్జాతీయ హ్యాకర్‌కు ముసుగుతొడిగి ఈ విషయాలపై అసత్యాలు చెప్పించాడు. మన దేశ పౌరసత్వ సవరణ బిల్లుపై ‘అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్‌సీఆర్‌ఎఫ్) ‘తప్పుడు దిశలో వెళ్తున్న ప్రమాదకరమైన మలుపు’గా అభివర్ణిస్తే, దానికి భారత విదేశాంగ శాఖ ఘాటుగా జవాబు ఇచ్చింది. 

ఇంకొందరు అమెరికా ఇలాంటి బిల్లు తెస్తే హిందువుల పరిస్థితి ఏమిటి? భయపెడుతున్నారు. హిందువులు ఎక్కడైనా బాంబుదాడులు, మత హింస చేసారా? అయినా అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలపై ఇక్కడి సెక్యులరి పార్టీలకు అంత ప్రేమెందుకు? ఇక్కడున్న ముస్లింలపై ఈ బిల్లు వెంట్రుకంతైనా ప్రభావం చూపనపుడు ఎందుకు ధర్నా చేయాలి? జంధ్యాలు ధరించడం, స్వాముల చుట్టూ తిరగడం గుజరాత్, కర్ణాటక లాంటి ఎన్నికలు వచ్చినపుడు ఉత్సాహంగా చేసిన రాహుల్ గాంధీ, అతని పార్టీ నిజ స్వరూపం ఇపుడు బయటపడింది!

దేవతల బూతు చిత్రాలను గీసిన ఎం.ఎఫ్. హుస్సేన్‌ను ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వడం నిజమైన సెక్యులరిజమా? సిమి లాంటి ఉగ్రవాద సంస్థల్ని నిషేధిస్తే సోనియా తెగ బాధపడిపోయింది. వాళ్ల తరఫున సల్మాన్ ఖుర్షీద్ వకాల్తా పుచ్చుకొన్నాడు. ఇదంతా సెక్యులరిజమా? తస్లీమా నస్రీన్ లాంటి అంతర్జాతీయ రచయిత్రిని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో దాడిచేస్తే అది సెక్యులరిజమా? ఢాకా నగర నడిబొడ్డులో వున్న ఢాకేశ్వరీ దేవాలయాన్ని వేరేచోటికి తరలించాలని అక్కడి మత సంస్థలు ఆందోళన చేస్తున్నాయి. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వల్లనే ఢాకాకు ఆ పేరు వచ్చిందని, అది ‘బెంగాలీ ప్రైడ్’ అని మమతా బెనర్జీ ఏనాడైనా మాట్లాడిందా? 

ఆప్ఘనిస్తాన్‌లోని ప్రాచీన బమియాన్ బుద్ధుని విగ్రహాలను తాలిబన్లు ఫిరంగులతో కూల్చేస్తుంటే ఒక్క సెక్యులర్ పార్టీ అయినా, ప్రపంచ హక్కుల త సంస్థ అయినా ఒక్క మాట మాట్లాడిందా? బలూచిస్తాన్‌లో లక్షలాది మంది ముస్లింలపై ఘోర అత్యాచారం జరుగుతున్నా, చైనా భూభాగంలో కొన్నిచోట్ల ముస్లింలపై తీవ్ర అణిచివేత జరుగుతున్నా ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ నోరు తెరిచిందా?

 భారత్‌లో ఉంటూ కాశ్మీర్‌పై ‘్భరత్ దురాక్రమణదారు’ అంటూ దుష్ప్రచారం చేసే అరుంధతీ రాయ్ వంటివాళ్లు ఈ దేశ హిందువులపై జరిగిన అత్యాచారాలపై ఏనాడైనా మాట్లాడిందా? ఇలాంటి ‘కుహనా సెక్యులర్ గ్యాంగ్’ చేసే కుట్రలు మోదీ, షా ద్వయానికి తెలియవనుకుంటే అమాయకత్వమే. ఇపుడు దేశం మొత్తం అక్కసును గమనిస్తోంది. ఇప్పటికే కమ్యూనిస్టు, కాంగ్రెస్‌లకు ప్రజలు దూరంగా ఉంటున్నారు అన్న విషయం 2014, 2019 ఎన్నికలు తేల్చినా పట్టించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం తప్ప ఇంకేం జరుగదు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*20-12-2019 : శుక్రవారం*



ఆరోగ్యకారకుడైన సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే పుణ్యకాలం ‘ధనుర్మాసం’. రాత్రి సమయం దీర్ఘంగా ఉంటూ పగటి సమయం తక్కువగా ఉండే శీతాకాలం.. సాయం సంధ్య వేళ మొదలుకొని బ్రాహ్మీ ముహూర్తం వరకూ సాధనకు అనువైన మాసం. గోదాదేవి ఈ మాసంలోనే తన పూల అర్చనలతో, పాశురాలతో విష్ణువును అర్చించింది. ఆధునిక కాలంలో పరమపవిత్రమైన అయ్యప్పదీక్ష సింహభాగం ఈ మాసంలోనే చేస్తారు. ధనూరాశిలో రవి ఉండే ఈ కాలం సౌరమానరీత్యా ‘ధనుర్మాసం’గా పేరొందింది. ఈ రాశిలో మూల-పూర్వాషాఢ-ఉత్తరాషాఢ మొదటిపాదాల నక్షత్రాలు సంచరిస్తాయి. రవి దేహకారకుడు. మనిషి శరీరం, ఆరోగ్యంపై ఆయన ప్రభావం చూపిస్తాడు. పోషణ వస్తువులకు సూర్యుడే శక్తిగా మారతాడు. ధనస్సు రాశిలోని మూలా నక్షత్రం ప్రభావం వల్ల రవి సూక్ష్మతత్వం పొంది ప్రార్థన, పారాయణకు కారణభూతుడవుతాడు. మూల.. కేతు నక్షత్రం కావడం వల్ల మోక్షమార్గానికి దారిపడుతుంది. పూర్వాషాఢ శుక్రుని నక్షత్రం. ఉత్తమత్వాన్ని కలిగించే గ్రహం. అలాగే ఉత్తరాషాఢ సూర్య నక్షత్రం. ఈ మూడూ నిరుతి, విశ్వదేవ, బ్రహ్మ అధిదేవతలుగా కలిగిన నక్షత్రాలు. ఇవన్నీ మనిషి అంతర్ముఖుడు అయ్యేందుకు దోహదపడే కారకాలు. అయితే వీటిని నడిపించే ‘విష్ణుతత్వం’, ఈ మాసానికి మూలకేంద్రం.
 
విష్ణుతత్వ సాధనకు అనుగుణమైన వాతావరణం ఈ మాసంలో ఉండి, సాత్విక శక్తులకు దారిని ఏర్పరుస్తుంది. అందువల్ల ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధి’ అన్నట్లుగా దాని సాధనకు తగినట్లు ఆహార నియమాలను భారతీయ ధర్మ శాస్త్రాలు, ఆయుర్వేదం నిర్దేశించాయి. ఇది విష్ణుప్రీతికర మాసం అయినందున ప్రధానంగా విష్ణువు ఆరాధన ఉంటుంది. ఈ మాసంలో విష్ణు సహస్రనామ, భాగవత పారాయణం చేయడం మంచిది. ఇక.. ధనుర్మాసంలో స్త్రీలు ప్రభాతకాలంలో ముంగిళ్లలో కళ్లాపు జల్లి, ముగ్గులు తీర్చి, వాటి మధ్య ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లు పెడతారు. తమిళ, కేరళ ప్రాంతాల్లో ఆచరించే కాత్యాయనీ వ్రతమే తెలుగు ప్రాంతంలో గొబ్బి పూజగా మారిందని చెప్తారు. ‘‘సుబ్బీ గొబ్బెమ్మా’.. అంటూ యువతులు గొబ్బి తట్టడం ఆచారం. ఈ గొబ్బిళ్లు భూగోళానికి ప్రతీకగా చెప్తారు. పసుపు రంగుల బీరపూల అలంకారం ప్రకృతికి సూచిక. మానవులకు సకల సదుపాయాలు కల్పించే భూదేవిని అర్చించేదే గొబ్బిపూజ. చుట్టూ తిరగడం అంటే భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడమే. అయితే ఈ ధనుర్మాసోత్సవాలు శైవ, వైష్ణవ భేదాలు లేకుండా అనాది నుండి నడుస్తున్నట్లు ఎందరో పరిశోధకులు తేల్చారు.
 
కాబట్టే శైవ, వైష్ణవ సంప్రదాయాల్లో కన్పించే అయ్యప్ప ఆరాధన, శివుని నిర్గుణతత్వం వైపు తీసుకెళ్లే శివరాత్రి ఆరాధనకు ఈ మాసంలోనే బీజం పడుతుంది. ముఖ్యంగా మార్గళివ్రతం ద్వారా గోదాదేవి ఈ మాసంలో ‘విష్ణుతత్వం’ చేపట్టి తన పాశురాల్తో స్వామిని మెప్పించి ఆయనలో ఐక్యం అయ్యింది.
 డాశ్రీశ్రీ పి.భాస్కరయోగి
(నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం)

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 16 - 12 - 2019 : సోమవారం*