వయసును బట్టి మనిషి ఆలోచనల్లో తీవ్రతలు, ఉద్వేగాలు, ఆవేశాలు, ఆనందాలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. అందుకే బాల్యం, యవ్వనం వృద్ధాప్యం వంటి శారీరక స్థితులను మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది. కుటుంబం, పెద్దరికం, సమాజం వంటివి వ్యక్తులను నియంత్రిస్తూ ఉంటాయి. 

స్వీయ నియంత్రణ కోల్పోతున్న మనుషులు.. పశు ప్రవర్తన వైపు అడుగులు వేస్తున్నారు. దీన్ని రూపుమాపి.. దైవత్వానికి మరల్చే మహత్తర ప్రక్రియ ఆధ్యాత్మికత. ఈ విషయం అర్థం చేసుకోకుండా.. ఆధ్యాత్మికతను మతానికి, ఆత్మకు పరిమితం చేస్తూ.. అసలు విషయాన్ని వదిలేస్తున్నాం. నిజానికి సనాతన ధర్మం ఆధ్యాత్మికతను జీవన విధానంగా మార్చింది. కుటుంబమే మనకు మొదటి సమాజం. అమ్మే మొదటి గురువు. అందుకే ‘అమ్మ మొదటి దైవం’ అన్నారు.
 
ఉపాఽధ్యాయాన్‌ దశాచార్య ఆచార్యాణాం శతం పితా
సహస్రంతు పిత్రూన్‌ మాతా గౌరవేణాతిరిచ్యతే
 
అనే మనుధర్మ సూక్తి ప్రకారం.. ఉపాధ్యాయుడికంటే ఆచార్యుడుపది రెట్లు అధికంగా, ఆచార్యుడికంటే తండ్రి వంద రెట్లు అధికంగా.. తండ్రికంటే తల్లి వేయి రెట్లు అధికంగా గౌరవనీయురాలు. అందుకే అమ్మను ‘‘మాతా నిర్మాతా భవతి’’ అన్నారు. కలిగిన సంతానం పురుషుడైనా, స్ర్తీ అయినా అమ్మ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 

తల్లి ఒక సాంచె (కమ్మచ్చి) లాంటిది. ఆ మూసలో ఎలాంటి భావాలుంటే.. పిల్లలు అలాగే తయారవుతారు. తల్లిని గౌరవించే పుత్రుడు.. సమాజంలోని స్త్రీలందరినీ గౌరవిస్తారు. కానీ, ఈరోజు తల్లి ఒడిలో పెరిగే పిల్లలకన్నా, హాస్టళ్లలో ఉండేవారే ఎక్కువ. దానివల్ల విద్యార్థులకు కుటుంబంలోని అనురాగం తెలియడంలేదు. అలాగే ఆడ సంతానం వద్దనుకొని చాలామంది భ్రూణహత్యలు చేస్తున్నారు. దాంతో సామాజిక అసమతుల్యత ఏర్పడుతోంది. దానివల్ల మగవారిని పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత పెరుగుతోంది.
 
అంతేకాదు.. అక్క, చెళ్లెళ్ల అనురాగానికి కూడా మగవారికి అవకాశం లేకుండాపోతోంది. దాంతో స్ర్తీ తత్వం, ఆమెలోని సున్నితత్వం, సరళత్వం, నిర్ణయ సాధికారతను గుర్తించలేకపోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్ర్తీ ఔనత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. దీనికి తోడు మూడేళ్ల వయసు నుంచే.. పిల్లల్ని హాస్టళ్లకు పంపుతున్నారు. వాడికి ముప్ఫై ఏళ్లు రాగానే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు చేరుస్తున్నాడు. ఇదే కర్మఫలం. 

అనేక విషయాల పట్ల తనలోని శక్తిని ప్రకటించే యువకుడు కేవలం చదువుకే పరిమితమవ్వడం వల్ల మిగిలిపోయిన అంతర్గత శక్తిని చెడ్డపనులకు కేటాయిస్తున్నాడు. తల్లితండ్రులు, గురువులకన్నా బలమైన మాధ్యమాలు అతడిని ప్రభావితం చేస్తున్నాయి. వీటి నుంచి మనసును నియంత్రణలో ఉంచకపోతే జరిగే అనర్థాలను మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై గీతలో శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా చెప్పారు.
 
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాద్బుద్ధినాశా బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి
 
క్రోధం వల్ల వ్యామోహం, దానివల్ల స్మృతి నాశనం, తద్వారా జ్ఞానశక్తి ధ్వంసం అవుతుంది. బుద్ధి నశిస్తే మనిషి తన స్థితి నుండి పతనం అవుతాడు. కాబట్టి మనస్సు నిర్మలంగా ఉంటేనే మనం బాగుంటాం.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 30 - 12 - 2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి