అనుభవం లేకుండా సాధువుగా మారిన వ్యక్తి ‘కోపాన్ని జయంచడం ఎలా’ అనే అంశంపై బోధిస్తున్నాడు. జనంలోంచి ఒక సాధారణ వ్యక్తి లేచి ‘అసలు కోపం అంటే ఏమిటి స్వామీ’ అని ప్రశ్నించాడు. సాధువు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో అతడు అలాగే నిలబడి తన ప్రశ్నను పదేపదే అడగసాగాడు. దీంతో బోధకుడికి కోపం వచ్చి ఆసనం నుంచి లేచి వెళ్లి అతడి చెంపపై ఒక్క దెబ్బ కొట్టాడు. ‘ఇదే స్వామీ కోపం అంటే’ అన్నాడా సామాన్యుడు. వస్తువు ఏమిటో తెలిస్తే దాన్ని జయించడం తెలుస్తుందని ఆ సాధువుకు బోధించాడు.
 
ఆ సాధువులాగానే మనలో చాలామంది శాస్త్ర పఠనం చేస్తారుగానీ.. నిత్యజీవితంలో ఆచరణలో పాటించడం నేర్చుకోరు. ఆచరణ లేని పఠనం, అధ్యయనం.. గాడిద గంధపు చెక్కలు మోయడంలాంటిదే. త్రికరణాల్లో ‘కర్మ’ను చివరగా పెట్టింది అందుకే. మనస్సు, వాక్కుల్లో ఏముంటుందో కర్మలో కూడా అదే ఉండాలి. 

ఈ రోజుల్లో మనకు మోయలేనంత జ్ఞానం ఉందిగానీ.. ఆవగింజంత కూడా ఆచరణ లేదు. పూర్వం గ్రంథాలు, ముద్రణ సౌకర్యం లేనప్పుడు జ్ఞానానికి పరిమితులు విధించుకుని తెలిసిన కొద్దిపాటి విషయాన్నే ఆచరణలో చూపించేవారు. ఇప్పుడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోలేనంత జ్ఞానం లభ్యమవుతోంది. సౌలభ్యం, సౌకర్యం పెరిగిందని సంతోషపడాలా? రవ్వంత కూడా ఆచరణసాధ్యం కావట్లేదని బాధపడాలా? ప్రతివారూ తమ వాట్సాప్‌ సందేశాన్ని ఇతరులకు పంపించాలని తపిస్తున్నారుగానీ.. ఆచరణ వైపు అడుగు వేయట్లేదు. అందుకే వేమన..
 
స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే
సంశయంబు చెడదు సాధకునకు
చిత్రదీపమున చీకటిజెడనట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
 
..అన్నారు. అందమైన చిత్తరువులో ఉన్న దీపం వల్ల చీకటి తొలగిపోనట్లే.. స్వానుభవం లేకుండా ఏ సంశయం తొలగిపోదని దీని అర్థం. ఆధ్యాత్మిక జీవనంలో ఆచరణకు చాలా ప్రాముఖ్యం ఉంది. అది సాధ్యం కాకపోతే శాస్త్రగ్రంథాల వెలుగు మనపైన ఎంత పడినా.. కింద చీకటే ఉంటుంది. కాబట్టి విషయపరిజ్ఞానంతోపాటు ఆచరణపైనా ఆధ్యాత్మికవాదులు దృష్టిసారించాలి. ఎంత దర ఉన్న విత్తనమైనా తారురోడ్డుపై వేస్తే మొలవదు కదా? విత్తనం మొలకెత్తేందుకు అనుకూలంగా భూమి ఉంటే చాలు. మనం ఎలా పడేసినా అది మొలకెత్తుతుంది. అలాగే తెలుసుకున్న మంచి విషయాన్ని ఆచరణలో పెడితేనే మనం ఎదిగేందుకు అవకాశం ఉంది.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
*13 - 01 - 2020 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి