తనదికాని పరాయి సంస్కృతి వైపు మనిషి మళ్లాలంటే ఏం చేయాలి? సాంస్కృతిక విధ్వంసం జరగాలి. అందుకు ఈ దేశ మూల సంస్కృతికి ఆధారమైన నమ్మకాలపై దాడి జరగాలి. దీనికోసం ఎంచుకొన్న గొప్ప మార్గమే అర్బన్ నక్సలిజం! ఇపుడు మహానగర మావోయిస్టుల లక్ష్యం కులవాదం. దళిత కులాలు, బహుజనుల ఉద్ధరణకు పాటుపడుతున్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సరే, మరి ఆ దళిత బహుజనుల నాయకత్వాన్ని ఈ మేధావులు అంగీకరిస్తారా?

‘‘ప్రతిదీ గంగాతీరం నుండి మాకు వచ్చింది’’ అని పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్‌ వోల్టేర్‌ అంటాడు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతీయ సంస్కృతి ముందు ఉంటుంది. గ్రీకు, రోమన్‌ నాగరికతలు క్రైస్తవమత విస్తృతి తర్వాత కనుమరుగై పోయాయి. ఆసియా ఖండ దీపంగా పేరొంది పరివ్యాప్తమైన బౌద్ధధర్మం ఇస్లాం దండయాత్రల తర్వాత మాతృ భూమిలో నామమాత్రంగా మిగిలింది. ఈ రెండు వేల యేళ్లలో అన్ని బాధలను తట్టుకొని నిలబడినవి భారతీయ, చైనా సంస్కృతులే. ముఖ్యంగా భారతదేశంలో దాదాపు 700 ఏళ్లు ఇస్లాం పాలన, 200 ఏళ్లు బ్రిటీషు వారి రూపంలో క్రైస్తవ పాలన సాగినా ఇక్కడి సాంస్కృతిక పునాదులు సుస్థిరంగా వున్నాయి. ఏ విదేశీ పాలకులు వాటిని మొత్తంగా మార్చలేకపోయారు. దీనికి కారణం ఏమిటన్నది ఇవాళ ప్రపంచం ముందున్న ప్రశ్న!

ఇప్పుడు అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు తమ మూల సంస్కృతి కోల్పోయి వాటి అంతర్గత ప్రవాహంలా క్రైస్తవం ఉంది. అలాగే ఆఫ్ఘన్ చుట్టూ ఉన్న గాంధార భూమిలో ఇస్లాం రాజ్యమేలుతుంది. భారతదేశంలోని 135 కోట్ల జనాభా ప్రపంచంలోని 650 కోట్ల జనాభాలో అతి పెద్ద భాగం. ఇది ప్రపంచ మానవ వనరే గాకుండా మార్కెట్టుగా కూడా ఉపయోగపడాలనేది వాణిజ్య మత రాజ్యాల లక్ష్యం. అందుకే దీనిని మార్కెట్ మాయజాలంలో ముంచాలంటే ఏంచేయాలని ఆలోచించిన ఈ మత వాణిజ్యవేత్తలు ఇక్కడికి ‘హిట్ మాన్’లను పంపించారు. వీళ్ల దెబ్బకు సోవియట్ రష్యానే ముక్కలైపోయింది. ఈ పుణ్య భూమిని విడగొట్టాలని సిఐఏకు చెందిన గూఢచారులు పని చేస్తున్నట్లు ఎన్నో వార్తలొచ్చాయి. రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్ ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. సోవియట్ రష్యా తర్వాత వీరి లక్ష్యం భారత్, చైనాలే.

అయితే చైనా కఠినమైన నియంతృత్వ విధానాలు అవలంభించడం వల్ల పాశ్చాత్య కుట్రలు ఫలించడం లేదు. కానీ భారతదేశంలో మితిమీరిన స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం ఉన్నందువల్ల ఇది ప్రథమ లక్ష్యం అయింది. పాశ్చాత్య క్రైస్తవ వాణిజ్య విస్తరణ కోసం ఒక వైపు ప్రయత్నం జరుగుతుంటే, వెయ్యేళ్లు పాలించినా మేం ఈ దేశాన్ని పూర్తిగా ఆక్రమించలేక పోయాం అని ప్రపంచ ఇస్లామిక్ శక్తులు మరో వైపు చూస్తున్నాయి.

ఈ క్రమంలో దేశంలోని విభజన శక్తులను ఈ వ్యవస్థలే పెంచిపోషిస్తున్నాయి. ఈ దేశాన్ని పట్టుకోవాలంటే ఈ సంస్కృతి విధ్వంసం జరగాలి. అనేది వారి ఆలోచన. ఇక్కడి మెజార్టీ ప్రజల అలవాట్లను మార్చితే ఇక్కడ మార్కెట్ బాగా చేసుకోవచ్చని వారి కార్యక్రమం మొదలు పెట్టారు. ఇక్కడి కొత్త కొత్త మార్కెట్లు సృష్టించినపుడే ఇది సాధ్యం అవుతుంది. తనదికాని పరాయి సంస్కృతి వైపు మనిషి మళ్లాలంటే ఏం చేయాలి? సాంస్కృతిక విధ్వంసం జరగాలి. అందుకు ఈ దేశ మూల సంస్కృతికి ఆధారమైన నమ్మకాలపై దాడి జరగాలి. దీనికోసం ఎంచుకొన్న గొప్ప మార్గమే అర్బన్ నక్సలిజం!

వరవరరావు లాంటి వారు కవిగా, సుధాభరధ్వాజ్ లాంటివారు మానవహక్కుల కార్యకర్తగా, ప్రశాంత్ భూషణ్, షబ్నంలోన్ వంటివారు న్యాయవాదులుగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇక విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న జి.యన్ సాయిబాబావంటి విద్యా వేత్తలు యూనివర్సిటీల్లో ఈ భావవ్యాప్తి కొనసాగిస్తారు.
ఈ మహానుభావులంతా తమ కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన తోడ్పాటును ఎన్జీవోలు అందిస్తాయి. 2014 లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ఎన్జీవో నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించాడు. అప్పటి నుండి గిలగిలా కొట్టుకొంటున్న ఈ స్వయం ప్రకటిత మేధావులు మోదీపై అకారణ ద్వేషం పెంచుకొన్నారు. మైనార్టీలకు సెక్యులరిజం పేరుతో మద్దతు ఇస్తే అది వికటించి మెజార్టీ వర్సెస్ మైనార్టీగా మారు తుందని భయభ్రాంతులకు గురైన వీరు కులం కార్డును అందుకొన్నారు. దాని పర్యవసానమే రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని ఇపుడు జరుగుతున్న చర్చ.

ఆఖరుకు వేలాది నక్సలైట్లను పొట్టనబెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీకి ఈ అరెస్్టలు నిర్బంధంగా అనిపించడం విచిత్రం!? ఎల్గార్ పరిషత్ ద్వారా ప్రాయోజితమైన భీమా కోరేగావ్ విజయోత్సవం, ఆ తర్వాత జరిగిన అల్లర్లు అనంతరం జరిగిన సోదాలు ఓ కొత్త కోణాన్ని చూపెట్టాయి. కామ్రేడ్ ప్రకాశ్ పేరిట ఉన్న లేఖను రోలా విల్సన్ రాసాడని అందులో ఈ వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతం నవలఖా, అరుణ్ ఫెరీరా, గొంజాల్వెస్, ఆనంద్ తేలుతుంబ్డే, ఫాదర్ స్టాన్ స్వామి పేర్లూ, ఇతరుల పేర్లూ ఉన్నట్లు అధికారవర్గాలు గుర్తించి, ఆరు నెలలు పరిశోధించి అరెస్ట్ చేసారని తెలుస్తున్నది. అయితే వాళ్లు అరెస్్ట కాకముందే దేశంలోని మీడియా అంతా వాళ్లు చట్టానికి అతీతులు అన్నట్లు గగ్గోలు పెట్టింది. ఈ అరడజను మందిని అరెస్ట్ చేయడంతో దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని ప్రచారం మొదలయ్యింది. అసలు ఈ ప్రజాస్వామ్యాన్నే బూటకంగా కొట్టి పారేసే వీళ్లు ప్రజాస్వామ్యంపై నీతులు వల్లిస్తున్నారు. అయినా కోర్టు మెట్లయినా ఎక్కకుండా అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరిపించే వీళ్ల సామర్థ్యం గురించి వింటే వాళ్ల నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది.

ఇదంతా చూస్తుంటే వీళ్లను దర్యాప్తు సంస్థలు విచారించడమే మహానేరం అన్నట్లుంది. సీతారాం ఏచూరి మొదలుకొని హరగోపాల్ వరకు అందరూ పెడుతున్న పెడబొబ్బలు చూస్తే ఈ దేశ జాతీయత ఏ ప్రమాద స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇపుడు మహానగర మావోయిస్టుల లక్ష్యం కులవాదం. దళిత కులాలు, బహుజనుల ఉద్ధరణకు పాటుపడుతున్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సరే, మరి ఆ దళిత బహుజనుల నాయకత్వాన్ని ఈ మేధావులు అంగీకరిస్తారా? ఈనాడున్న మావోయిస్టు పార్టీ ఏ కులాల చేతిలో ఉంది? అంతెందుకు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామన్న కమ్యూనిస్టు పార్టీలో సీతారాం ఏచూరి నుండి బి.వి. రాఘవులు వరకు ఏ కులస్థులో ప్రజలకు చెప్పగలరా?

భద్రతా దళాల చేతిలో హతమైన కింది స్థాయి నక్సలైట్లు ఏ కులం వాళ్ళు? వరవరరావు మొన్న అరెస్ట్ అయి వెనక్కి వచ్చాక కుటుంబ సభ్యులను కౌగిలించుకొన్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషం. అలాగే దళిత, బహుజన కులాల నుండి ఉద్యమంలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల కొరకు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూసి ఉంటారు. నిజంగా ఈ కుట్ర జరిగితే వరవరరావుకు ఓ విజ్ఞప్తి. స్వాతంత్ర్యం వచ్చాక ఇన్నేళ్లకు ఓబిసి, అదీ నిజాయితీపరుడు ఈ దేశానికి ప్రధానిగా వచ్చాడు! ఇక మీ ఇష్టం!

*****************************************

  డాక్టర్. పి. భాస్కర యోగి
ఆంధ్రజ్యోతి : ఎడిటోరియల్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి