పాటిల్ నారాయణరెడ్డిగారు వినాయక చవితి నాటి చంద్రదర్శనంను వివరిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించాడు. “చంద్రుడు తన మార్గమందు భూమిచుట్టూ చుట్టునపుడు  ఒక దినమందు (24 గంటలందు) సుమారు 12 డిగ్రీలంత సంచ రించును. ఈ 12 డిగ్రీలంత సంచరించుకాలాన్నే ఒక తిథి అందురు. ఇప్పుడు పాడ్యమి మొదలు 12 డిగ్రీల నుంచి ప్రారంభమైన పౌర్ణమి దినానికి 180 డిగ్రీలు, అమావాస్య దినానికి 360 డిగ్రీలు సంచరించును. చంద్రుడు చతుర్దశి దినాన్ని 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీలంత సంచరించును. చంద్రుడు ఈ కోణంలో ఉన్నపుడు భూమిపై ఉన్న మానవుని మనస్సుమీద చెడ్డ ప్రభావంను చూపును.
“చంద్రమా మనసోజాతః శ్చక్షఃసూర్యో అజాయత..” అని పురుష సూక్తం చెప్పును. ఈ కాలమందు అనగా చతుర్దశినాడు అర్థాత్ చంద్రుడు 36 డిగ్రీల నుంచి 46 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు చంద్రుని దర్శించిన చంద్రుని నుంచి బహిర్గతమగు కిరణాలు (కాస్మిక్ రేస్) చంద్రుని ఆకర్షణశక్తి మానవుని మనస్సు మీద అల్ప ప్రమాణంగా సూటిగా ప్రభావం చూపును. మనస్సుకు ఒక విధంగా ఉత్సాహం తక్కువగును. ఎప్పుడైతే ఉత్సాహం తక్కువగునో అప్పుడు ఏ విధమైన నిర్ణయాన్ని సరిగ్గా చేయుటకు బుద్ధి ప్రచోదనం కాక తప్పు చేయవచ్చును. అందుచేత అపవాదులు వినవలసి వస్తుంది. ఈ దృష్టిచే చతుర్దశి దినాన చంద్రుని చూచుట నిషేధించినారు.
చంద్రుడు మనస్సు మీద ఏ విధంగా ప్రభావంను ప్రసరించును. అనుదానిని మనం ఇంకా లోతుగా చూద్దాం.. పౌర్ణమి లేక అమావాస్య రోజున చంద్రుడు, భూమికి కేంద్రానికి (108 డిగ్రీకి) వచ్చినప్పుడు మానసికంగా దుర్భలులైన వారికి ఎక్కువ ఉద్రేకం కలుగును. దీనిని ఈనాటి మానసిక రోగచికిత్స నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. అందుచేతనే చంద్రుడు ‘మనఃకారకుడు’ అన్నారు. పౌర్ణమి లేక అమావాస్య రోజులలో చంద్రుని ప్రాబల్యం ఎక్కువ ఉన్నంత చతుర్దశి నాడు ఉండదు కాని తక్కువ స్థాయిలో మాత్రముండును. ఇది కోణపు వ్యత్యాసంతో అగును. ఇప్పుడు మనకు చతుర్దశి దినాన చంద్రుని దర్శించిన ఆలోచనాశక్తి తక్కువ అగునని దీంతో విదితమవుతున్నది. దీనిని గమనించి పరీక్షించిన బాగా తెలుస్తుంది.
ఇక ప్రతి పక్షములందు(శుక్ల  కృష్ణ)ను చంద్రుడు సంచరించునపుడు, బహుళ చతుర్దశి దినాన చంద్రుని దర్శించుట నిషేధించలేదు. కేవలం శుద్ధ చతుర్దశి రోజున మాత్రమే ఎందుకు నిషేధించారు. బహుళ చతుర్దశి రోజున 108 డిగ్రీకి వచ్చి, అక్కడ నుంచి బహుళంనందు, 192, 204 డిగ్రీలు. ఇలా 12 డిగ్రీలు ఎక్కువగుచూ చతుర్దశి నూడా 216 డిగ్రీల నుంచి 226 డిగ్రీల యందు సంచరించు (చుండు)ను, దీనిని మనం చాలా ముఖ్యంగా గమనించాలి. అయినా చతుర్థి తిథిని రక్తతిథి అని పరిగణించి, జ్యోతిషమందు ఈ దినాలలో శుభ కార్యాలను చేయకూడదని చెప్పారు. చతుర్థి తిథికి యముడు ‘అధిదేవత’ అన్నారు. ఈ కారణాల చేత కూడా ఈ తిథి యందు శుభకార్యాలను నిషేధించారు.
ప్రతి శుద్ధపక్షపు చతుర్దశి దినాన్న చంద్రుని చూడకూడదని ఎందుకు నిషేధించలేదు? కేవలం వినాయక చతర్దశి రోజన మాత్రం ఎందుకు నిషేధించారు? ఇతర మాసాల శుక్లపక్షాల చతుర్దశి దినాన చంద్రుని ప్రభావముండదా? దీనికి ఉత్తరం శ్యమంతకోపాఖ్యానమునందున్నది. కన్యామాసమందు అనగా సూర్యుడు కన్యారాశి యందు ఉన్నప్పుడు భాద్రపద శుద్ధ చతుర్దశి దినాన చంద్రుని చూడకూడదని నిషేధించారు. ఎందుకని ఈ రోజున చంద్రుని ప్రభావం మంచిది కాదు? కన్యామాసమందు మాత్రమే ఎందుకు చెప్పారు? ఈ రాశియందు సూర్యుడు తులారాశికి పోవుచుండుట, ఈ కాలమందు చంద్రుడు భూమికి 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు సంచరించునప్పుడు అతని ప్రభావం ఎక్కువ చెడ్డ పరిణామకారియని మహర్షులు నిర్ధారించారు.
ఖగోళశాస్త్ర ప్రకారం చంద్రుని శక్తి, కాంతి సూర్యుని నుంచే జరుగును. ప్రభావితమగును. దీనిని గమనించాలి. ఎప్పుడైతే సూర్యునిశక్తి తక్కువగునో అప్పుడు అది చంద్రుని మీద కూడా వచ్చి తీరును. ఇక్కడ నీచ అనగా సూర్యుడు భూమికి కొంత దూరాన ఉండును. మేషరాశియందు సూర్యుడు భూమికి సమీపాన ఉండుటచే వేడి  తాపం ఎక్కువ. ఎండాకాలం మొదలగును. తులారాశి యందుండునప్పుడు చలి మొదలగును. గ్రహాల చలనాలచే ఈ విధంగా వ్యత్యాసం అగుట ప్రకృతి నియమం. ఇంతేకాదు చతుర్దశి తిథికి యముడు అధిదేవత అని చెప్పబడింది. అందుచే ఈ దినాన చంద్రుని చూడకూడదు అన్నారు.
చంద్రుని నేరుగా చూడకుండా ఉన్నప్పటికి అతని ప్రభావం మనస్సుపై నుండగా అని ప్రశ్నించవచ్చును. చంద్రుని ప్రభావం ఎల్లకాలం మానవుని మనస్సు మీద ఉండును. కాని ఈ ప్రభావం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంనందుండునపుడు వేరు వేరు రీతుల్లో ఉండును. అంతేగాక చంద్రుడు ఏ నక్షత్రమునందుండునో ఆ నక్షత్రపు ప్రభావం కూడా మానవుని మనస్సు మీద తప్పక పడుతుంది. ఇటువంటి చంద్రుని చూచుటచే చంద్రుని నుంచి బహిర్గతమగుచుండు కిరణాల మూలంగా మెదడు మీద నేరుగా ప్రభావం చూపి మనస్సు మీద కూడా దీని పరిణామముండును” అని చెప్పారు. చవితినాటి చంద్రదర్శనం వల్ల కలిగే ఖగోళ గణాంకాలు ఇవి. అందుకే మన ఋషులు ఇది ఒక ఆచారంగా మార్చారు.
********************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధ్యాత్మికం : విజయక్రాంతి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి