మన వేదాంతమంతా రెండు పదాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి మమకారం, రెండోది అహంకారం. ఈ రెండూ మనిషి చుట్టూ చేరడమే సంసారం. దీన్నే మాయ అని పిలిచారు. ఆ మాయ ఏడుస్తున్న చంటి పిల్లాడిలాంటిది. చంకలోకి ఎక్కదు. క్రింద నిలబడదు. ఈ మాయారూపమైన అహంకారం మనిషి నుంచి దూరమైతే అతనిలో వ్యక్తమయ్యేది ఓంకారమే. 

అహంకారాన్ని అణచివేసే శక్తి ఓంకారానికి ఉంది. ఓంకారం పరమాత్మ స్వరూపంగా చెప్పబడింది. ఈ రెండింటిలో ఏదైనా ఒక దానికే మనలో స్థానం ఉంది. అహంకారమనే మాయా సంసారం దాటాలంటే సంస్కారం కావాలి. అది మనిషిని ప్రభావితం చేసినప్పుడు అహంకారం దూరం అవుతుంది. రెండు రూపాయల విలువ చేసే ఇనుముకు సంస్కరిస్తే వందల రూపాయల విలువ చేసే వస్తువుగా మారుతుంది. ఖర్చు లేకుండా పొందేది సంస్కారం.

సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే
కావ్యామృత రసాస్వాదః సంగమస్సజ్జనైస్సహ

సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు కాస్తుంటాయి. మొదటిది కావ్యామృత రసాపానం, రెండోది సజ్జనుల సాంగత్యం అని హితోపదేశం తెలిపింది. అత్యద్భుత జ్ఞాన సముద్రాన్ని అందించిన రుషులకు కృతజ్ఞత తెలిపి, రుషి రుణం తీర్చుకోవడానికి గ్రంథపఠనం చేయాలి. ఆ గ్రంథాల సారాంశాన్ని మనసు నిండా నింపుకోవడానికి సజ్జన సాంగత్యం చేయాలి. ఈ రెండింటివల్ల చంచలమైన మనస్సు స్థిరీకృతమై మనల్ని సత్యం వైపు నడిపిస్తాయి. లేదంటే సమయపేదరికంతో బాధపడుతున్న మనుషులంతా బాహ్యమైన వినోదకార్యక్రమాల్లో జీవిస్తా రు. 

ఇవాళ ఆధ్యాత్మికత కూడా వినోదాత్మకంగా మారడం దురదృష్టకరం. దేవునిలో వినోదం ఉండాలి గాని వినోదం లో, ఆడంబరంలో దేవుడు ఉండకూడదు. ఇటీవల ఆరాధనలు, పూజలు, బాహ్యాండర వినోదంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. అందువల్ల అంతర్గత శుద్ధికి ఆస్కారం ఉండదు. వినోదం చుట్టూ తిరిగే మనసు పొందే ఫలితం కోరికలేగాని ఇంకోటి కానేరదు. అందుకే గీతాచార్యుడు

ధ్యాయతో విషయాన్పుంసః స్సంగస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ర్కోధో భిజాయతే

అన్నారు. ఇంద్రియ విషయాలను ఎప్పుడూ చింతించే మనిషికి ఆ విషయాలపట్ల ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. వాటివల్ల కోపం వస్తుంది. 

వినోదం ఇంద్రియసుఖాలకు సంబంధించింది. అది లౌకికమైంది. మనం చేసే ఆధ్యాత్మిక సాధన అలౌకికమైంది. మన కోరికలు సంసార రూపం కాబట్టి అవీ లౌకికమే. దాని వల్ల మనం పొందేవి లౌకిక ఫలితాలే ఈ లౌకిక జీవనమే సంసారానికి మరో రూపం. 

అది సంస్కారంగా రూపొందేందుకే సాధన. గాలితిత్తులు ఎలాగైతే ఎంత ఇనుమునైనా మంటల్లో కరిగిస్తాయో అలాగే సంస్కార సాధన ఎంత దుర్మార్గుడినైనా సాధుపురుషులను చేస్తుంది. అందుకే సంస్కారం మనలోని సంసారాన్ని దూరం చేస్తుంది.

********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి