ప్రస్తుతం దేశంలో సంఘర్షణ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తులు రాజ్యాంగ రక్షణ కవచాన్ని పొందడం కొత్త తరహా ఆలోచనలకు తావిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన “వ్యక్తి భావ స్వేచ్ఛ” దుర్వినియోగం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆఖరికి వ్యక్తి ప్రాణం కన్నా భావ స్వేచ్ఛ ప్రధానమై కూర్చుంది. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దీర్ఘకాల నిష్క్రియాపరత్వం వల్ల నక్సలిజం పుట్టిందో, ఆ కాంగ్రెస్ నాయకుడే ఇవాళ అధికారం కోసం అర్బన్ నక్కల్స్‌కు అండగా నిలుస్తున్నాడు! ఏ పేదవాడి కోసం అర్థరాత్రి తెరచుకోని సుప్రీంకోర్టు తలుపులు ముంబాయి పేలుళ్ళలో దోషిగా తేలిన యాకూబ్ మెమెన్ కోసం అర్ధరాత్రి తెరచుకున్నాయి.
అలాగే ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నిన అనుమానంపై మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన మహానగర మావోయిస్టు మేధావుల గురించి అర్ధరాత్రి సుప్రీం కోర్టు తెరుచుకోబడింది. కనీసం కోర్టు మెట్లు అయినా ఎక్కకుండా కోర్టు నుండి సులభమైన విచారణను ఎదుర్కొనేందుకు ఈ స్వయం ప్రకటిత మేధావులకు అవకాశం దొరికింది. ఆశ్చర్యం ఏమిటంటే సుప్రీంకోర్టు అధికారాలను కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షాల ఆధ్వర్యంలో దుర్వినియోగం జరుగుతోంది అన్నట్టుగా 6 నెలల క్రితం ఇటీవల పదవీ విరమణ పొందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పరోక్ష ఆరోపణలు గుప్పించారు. ఇది ఆసరాగా చేసుకొని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పైనే అభిశంసన తీర్మానం పెట్టడానికి ప్రయత్నం చేశాయి. అప్పుడేమో కోర్టులను కూడా ప్రభావితం చేస్తున్నారని కుప్పలు కుప్పలుగా కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు.
ఇప్పుడేమో సుప్రీంకోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిందని భుజాలు తడుముకుంటున్నారు. అలాగే ఇటీవల ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం పై సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను కేంద్ర ప్రభుత్వంపై మోపి దీనికంతా కారణం మీరే అన్నారు. అదేవిధంగా బీమా కోరేగావ్ యుద్ధం 1 జనవరి 1818లో జరిగితే ఆ యుద్ధంలో మహర్‌లు పీష్వాలను ఓడించారు. దీన్ని బట్టి 200 సంవత్సరాల నాడే దళిత వీరులు మహాయోధులు అని తెలుస్తోంది. కానీ ఈ స్వయం ప్రకటిత మేధావులు వేల ఏళ్ళ నుంచి దళితులను అణచి వేశారని వితండవాదం చేస్తారు. ఇందులో 1980 తర్వాత వచ్చిన నక్సలైట్లను, దాని సిద్ధాంతాలను దండకారణ్యం, నల్లమల నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తీవ్రంగా అణచివేసే క్రమంలో ఎందరో బహుజన బిడ్డలు బలైపోయారు.
కానీ తెలుగు రాష్ట్రాల్లో విప్లవ ఐకాన్‌లుగా చెప్పే వారి కుటుంబాల్లో అందరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ ప్రాపకాన్ని ఉపయోగించే అల్లుళ్ళకు, కొడుకులకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో, ఢిల్లీ జేఎన్టీయూలో ఉద్యోగాలను సంపాదించుకున్నారు. కొందరు జర్నలిస్టులుగా రచయితలుగా స్థిరపడ్డారు. ఇటీవల అరెస్టు తర్వాత సుప్రీంకోర్టు గృహ నిర్భంధానికి అవకాశం ఇస్తే ఇంటికి వచ్చిన వరవరరావును కుటుంబ సభ్యులు కౌగిలించుకొన్నపుడు, ఆయన ముఖం వెలిగిపోయింది. మరి ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టులకు కూడా తల్లిదండ్రులు ఉంటారని ఆయనకు తెలియదా! ఆయన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అడవుల్లో గన్నులు పట్టుకొని పోగొట్టుకున్నది మాత్రం ఈ దేశపు బహుజన పుత్రులే! నంబూద్రిపాద్ నుంచి నారాయణ వరకు కమ్యూనిస్టు నాయకులు, మేధావులంతా ఏ కులాల వాళ్ళో అందరికీ తెలుసు.
శ్రామిక వర్గాలకు మతిలేని గతితార్కిక వాదాన్ని బోధించి అడవుల్లోకి పంపి వీళ్ళంతా నగరాల్లో కడుపులో చల్ల కదలకుండా బతికేస్తున్నారు. నిజానికి ఈ రోజు నేపాల్ నుంచి చత్తీస్‌ఘడ్ వరకు ఉన్న రెడ్ కారిడార్ మాయమైపోయింది. కానీ సిద్ధాంతకర్తలు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో అద్భుతమైన అపార్టుమెంట్‌లో జీవిస్తూ, విశ్వవిద్యాలయ విద్యార్థులను కలుషితం చేస్తున్నారు. ఈ స్వయం ప్రకటిత మేధావులను అరెస్టు చేయడం ఆ తర్వాత గృహ నిర్భంధంలో ఉంచడం చట్టం పని కావచ్చు కానీ దాని వెనుక ఉన్నటువంటి సైద్ధాంతిక భావజాలం మేధోమాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గడ్డాలు పెంచుకుని రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని విదేశీ టూరిస్టుల్లా కనిపించే ఈ అర్బన్ నక్సల్స్ శిష్యులు పత్రికా రంగంలో, విద్యారంగంలో ,సాహిత్య రంగంలో కావలసినంత మంది కనిపిస్తారు.
కావున వీళ్ళు అరెస్టు కాకుముందు నుండే భూమి బ్రద్దలయినంత వేగంగా మీడియా స్పందించింది. వీళ్లేదే చట్టానికి అతీతులు అన్నట్లు మాధ్యమాలు చేసిన ఓవర్‌యాక్షన్ అంతా ఇంతా కాదు. ఓ తెలుగు ఛానల్ అయితే వరవరరావు ప్రమాదకారి అయితే రాజాసింగ్ ప్రమాదకారి కాదా! అంటూ ప్రశ్నించింది. రాజాసింగ్ ఎవరి హత్యకైనా కుట్ర పన్నితే ప్రభుత్వం క్షమిస్తుందా? సాధ్వి ప్రజ్ఞాసింగ్, స్వామి అసీమానంద, కల్నల్ పురోహిత్, దేవేందర్ గుప్తాలను అరెస్ట్ చేసి అక్రమంగా 9 ఏళ్ళు జైళ్ళో పెడితే ఎవరైనా బయటకు వచ్చి నిరసన తెలిపారా? అంతెందుకు కల్బుర్గి, గౌరీలంకేశ్ హత్య కేసుల్లో అనుమానితులుగా సనాతన ధర్మ సంస్థ ప్రతినిధులను అరెస్ట్ చేస్తే ఏ హిందూ సంస్థ అయినా ప్రొటెస్ట్ చేసిందా! వారికి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చిందా?
ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, వెర్నన్ గోన్యాల్‌వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతం నౌ లేఖ, ఫాదర్సాండ్ స్వామి, ఆనంద్ తుంబ్దే ఈ 30 ఏళ్ళ నుండి మావోయిజంను మహా మహా నగరాల్లో సజీవంగా ఉంచుతున్నారని చెప్పవచ్చు. వీళ్ళు వీళ్ళకోసం పెట్టుకున్న అందమైన పేరు మానవ హక్కుల రక్షకులు. మరి రాజ్యాంగం ప్రసాదించిన భావ స్వేచ్ఛ కేవలం కొద్దిమంది రాజ్యాంగ వ్యతిరేకులకు మాత్రమే అన్నట్లుగా వీళ్ళు రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. భావ స్వేచ్ఛ పేరుతో వీరికి ఏదైనా మాట్లాడడానికి అధికారం ఉంటుంది. కానీ ఇతరుల మనోభావాలను వీరు గౌరవించరు! పిడికెడు మందికి ఎన్ని భావాలైనా ఉండవచ్చు. దానికి ఎంతైనా స్వేచ్ఛ ఉండవచ్చు కానీ మెజారిటీ ప్రజలకు మాత్రం ఈ దేశంలో స్వేచ్ఛ ఉండకూడదు.
మతిలేని గతితార్కిక భౌతికవాదాన్ని ప్రవచించే ఈ స్వయం ప్రకటిత మేధావులు ఇతరుల మనోభావాలను రకరకాల రూపాల్లో విమర్శిస్తూ ఉంటారు. వీటికి ప్రశ్నించే గొంతుకలు అని పేరు. వారు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ఎంత పెద్ద వారైనా బజార్లోకి లాగవచ్చు. కానీ వీళ్ల స్వేచ్ఛను వీళ్ల కూతలను రాతలను ఎవరూ అడ్డుకోవద్దు?! అలా అడ్డుకుంటే దేశం ఎమర్జెన్నీలో ఉందని ఫాసిజం ఎక్కువైందని మతతత్వంపై యుద్ధం చేస్తామని ప్రకటిస్తారు. వీళ్ళు తయారు చేసుకున్న కొత్త కొత్త పదాలను మార్క్సిస్టు పరిభాషలో జనంలోకి వదులుతుంటారు. ఫ్యూడల్, భూస్వామ్య ఫాసిస్టు, మతతత్వ, లించింగ్ లాంటి పదాలు అలా పుట్టుకొచ్చినవే. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల అధికారులు ఇళ్ళలోకి రావడం అదేదో పెద్ద మహానేరమైనట్లుగా వీరి వందిమాగధ పత్రికలు, అనుయాయులు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాస్తారు.
ఇటీవల జరిగిన అరెస్టులో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా లేదా? అన్నది చెప్పడానికి కోర్టులు లేవా? పోలీసులు సాక్ష్యాలను టీవీల ముందు పెట్టి విచారణ చేపడితే ఇంక ఈ దేశంలో న్యాయస్థానాలు ఎందుకు? కళాకారులుగా, న్యాయవాదులుగా, పాత్రికేయులుగా, రచయితలుగా చలామణి అవుతూ ప్రచార ప్రసార మాధమాలను సిద్ధాంతాలకు అనుగుణంగా నడిపిస్తున్నారా? లేదా? అయినా భావ స్వేచ్ఛపై ఇంతగా ఉపన్యాసాలు దంచే ఈ గుంపు తమకు వ్యతిరేకమైనటువంటి ఎంత మంది విద్యార్థులను సంఘాల పేరుతో ముద్రవేసి చంపలేదు? తమ సిద్ధాంతానికి వ్యతిరేకం అయినటువంటి వ్యక్తులంటూ ఎంత మందిని పొట్టన పెట్టు కోలేదు.
వాళ్ళు కూడా మీరు నమ్ముకున్న సిద్ధాంతాన్ని వ్యతిరేకించేటటువంటి భావ స్వేచ్ఛ కలిగినవారు అని ఎందుకు గుర్తించలేదు? 1967 మేలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరీ ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనల తర్వాత నక్సలైట్లు సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా అనేక అవతారాల తర్వాత ఏర్పడింది. ప్రజలు చైతన్యవంతం అయ్యే కొద్దీ వీరు చెప్పే బూర్జువా పార్టీలు కూడా ఎంతో కొంత అభివృద్ధి చేయకపోతే మనగలిగే స్థితి లేదు. దాంతో వై.యస్ రాజశేఖర్ రెడ్డి లాంటివారు ఓ వైపు చర్చలకని పిలిచి, మరోవైపు అభివృద్ధి అని చెప్పుకున్నాడు. చంద్రబాబు కాలంలో కూడా నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేస్తూనే అభివృద్ధిపథం అన్నాడు. చత్తీస్‌ఘడ్‌లో రమణ్‌సింగ్ ప్రజాస్వామ్యయుతంగా ఎలా ఎన్నిక అవుతున్నాడో వీరు గమనించారా? అయితే అధికారంలో ఉన్నపుడు, లేనపుడు కొందరు నాయకుల మాటలు వేరుగా ఉంటాయి.
వై.యస్, చంద్రబాబు, రాహుల్ గాంధీలే అందుకు ఉదాహరణ. కానీ నరేంద్రమోడీ జాతీయవాద దృక్పథంపై మావోయిస్టులది ఆజన్మాంతవైరం. అందుకే మోడీని అంతమొందించాలని ప్లాన్ జరిగి ఉండవచ్చు! దండకారణ్యంలో నక్సలైట్లపై పోరాటం నిర్మించిన మహేంద కర్మ ఏ పార్టీ నాయకుడో రాహుల్ గాంధీకి తెలియదా? అరుణ్‌ఫెరేరా, వేర్నాస్ గోన్సాల్వెజ్ 2007లో అరెస్టు అయిన విషయం, గౌతంనేలేఖ 20॥లో, రోనా విల్సన్ 2005లో, వినాయక్ సేన్ 2007లో, 2010లో, జియన్ సాయిబాబా ఎవరి ప్రభుత్వాల్లో అరెస్టు అయ్యారో, కాంగ్రాస్ నాయకులు తెలుసుకుంటే మంచిది.
ఇవన్నీ గమనించకుండా దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని వదరుబోతు తనంతో అరవడం ఆత్మవంచనే. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళకు ఎవరైనా అద్దెకు ఇళ్ళు ఇవ్వాలంటే ఆలోచించేవారు. ఇపుడు వాళ్ళను దేశభక్తులుగా కీర్తిస్తున్నారు. కానీ ఈ అర్బన్ నక్సల్స్‌కు షెల్టర్ ఇవ్వాలంటే జనం వెనుకాముందు ఎందుకవుతున్నారో ఆ మావోబాకాలు చెప్పగలవా? హింసాత్మకమైన జీవనాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారన్న విషయం వీళ్ళు గ్రహించాలి. వీళ్లు తమ వర్గ శత్రువులను చంపితే ప్రజీతీర్పు అంటారు. మరి దేశంలో ప్రజల మన్ననతో కాదా మోడీ విజయం సాధించి గద్దె నెక్కింది? అలాంటి మోడీని అంతమొందించడానికి కుట్ర పన్నడం నిజమో!
కాదో దర్యాప్తు సంస్థలను తేల్చనివ్వరా? వీళ్ళ ముఖాల్లో అమాయకత్వాన్ని చూసి ఈ అర్బన్ నక్సల్స్‌ను శాంతమూర్తులుగా భావించాలా? వీళ్ళు హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదా? ఎన్ని ఉదాహరణలు చెప్పాలి? నక్సలైట్లు చైనా ఛైర్మనే మా ఛైర్మన్ అనలేదా? జోసెఫ్ స్టాలిన్ స్వయంగా తన సహచర విప్లవనాయకులైన రాదెన్, కామనెల్, జీనోవివ్, ఋఖారికలను చంపించలేదా? ఈ దేశంలో నక్సలైట్లు ఇతర పార్టీ నాయకులను, జాతీయ వాద విద్యార్థి సంఘాల నాయకులను క్రూరంగా చంపలేదా? ఇవన్నీ లెక్క తీస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఇలాంటి రక్తచరిత్రకు వన్నెలద్దిన ఈ మేధావుల కుట్రను గురించి ఆరాతీస్తే దేశం అంటుక పోతుందా? వీళ్ళ రచనలు, కార్యాచరణ మావోయిజాన్ని ప్రోత్సహించడం లేదా? ఇవన్నీ మీడియా కళ్ళకు ఆనడం లేదా? ఒక వ్యక్తి విధానాలను చర్చల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకించాలి కానీ చంపేంత దుస్సాహసం అనాగరికమనీ అర్బన్ నక్సల్స్ గ్రహించాలి
*******************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం : విజయక్రాంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి