అధి బ్రిటీషు ప్రభుత్వం అతివాద స్వాతంత్య్రవీరులపై ఉక్కుపాదం మోపుతున్న రోజులు. ఓ కుట్ర కేసులో రాంప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరీ, అష్ఫఖుల్లా ఖాన్‌లను 1927 డిసెంబర్ 19న ఉరితీయాలన్న తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా అష్ఫఖుల్లా తన స్నేహితులకు, కుటుంబానికి- ‘నేను బలిపీఠంపై నిలబడి ఇది రాస్తున్నాననడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఆ ప్రభువు అభీష్టం అదే కాబట్టి. మాతృభూమి కోసం బలివేదికపైన తనను యజ్ఞపశువుగా భావించుకునే వ్యక్తి నిజంగా ఎంతో సౌభాగ్యశాలి’ అని లేఖ రాశాడు. ఇది స్వాతంత్య్రవీరుల నిస్వార్థ త్యాగబుద్ధి. ఈ రోజుకైనా అష్ఫాఖ్ వంటి నిష్కళంక దేశభక్తులను గౌరవించాల్సిందే. ఏపిజె అబ్దుల్ కలాం వంటి మేధావిని, మాతృభూమిపై అనురక్తిగల వాళ్లను ఈ దేశం సదా ఔదలదాల్చాల్సిందే.

కానీ, దురదృష్టవశాత్తూ ఈ దేశ చరిత్రలో బెంగాల్ విభజన తర్వాత మొదలైన సంతుష్టీకరణ రాజకీయాలు రోజురోజుకు అష్టవంకర్లు తిరుగుతూ ఆఖరుకు దేశభద్రతను కూడా పెను ప్రమాదంలో పడేస్తున్నాయి! ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండర’న్న ఓ దిక్కుమాలిన సిద్ధాంతం దేశాన్ని బోనులో నిలబెడుతోంది. దానికి మతం, కులం ఆసరాగా చేసుకోవడం ఎంత ఘోరం!? ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో తాజాగా తెలుగుదేశం పార్టీ జరిపిన మైనారిటీల సభ సంతుష్టీకరణకు పరాకాష్ఠ. ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు సహా స్టేజిమీద, కింద వున్న వాళ్లు టోపీలు ధరించి ఎవరు నిజమైన ముస్లిములో, ఎంతమంది టీడిపి కార్యకర్తలో తెలియకుండా గందరగోళం చేశారు.

ఇక ‘చినబాబు’ లోకేశ్ తన ప్రసంగంలో ‘తరిమి తరిమి కొడతారు’ అంటూ మోదీని, భాజపాను, వైకాపాను, జనసేనను ఓ కొత్త పదం అందుకొన్నారు. గతంలో లోకేశ్ మేనమామ, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా వచ్చీరాని హిందీలో ‘బగారుూ లగే’ అంటూ ధర్మపోరాట సభలో వాచిపోయేట్టుగా తొడగొట్టుకుని ‘డైలాగులు’ విసిరాడు. ఇదేనా ఈ నేతల ప్రజాస్వామ్యం? ప్రతిపక్షాలను తరిమికొట్టండని పిలుపు ఇవ్వడం గొప్ప ప్రజాస్వామ్యం!? మోదీ నోరు తెరవట్లేదని నియంత అంటూ దుష్ప్రచారం చేసే వీళ్లు పార్లమెంటు ముందు ఎన్ని ఎగతాళి వేషాలు వేశారు. సాక్షాత్తూ పార్లమెంటులో ప్రధానిని పట్టుకొని కేశినేని నాని ఎల్కేజీ స్థాయి ఇంగ్లీషులో ‘డ్రామా ఆర్టిస్టు’ అన్నాడు. అది భాజపా నాయకులకు సరిగ్గా అర్థం కాలేదు. కనీసం అదే పార్లమెంటులో కూర్చొన్న విశాఖ భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు లాంటి వారు తన పార్టీ పెద్దలకు వివరించి ఆ ప్రసంగాన్ని అడ్డుకోవాల్సింది. ఇలా ‘చంద్రబాబు అండ్ కో’ మోదీని వ్యతిరేకించాలనే తీవ్రతలో ‘నారా హమారా టీడీపీ హమారా’ అనే సరికొత్త నినాదాలకు తెరతీసింది. మోదీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు తనకు మద్దతు ఇవ్వాలని ముస్లింలకు పిలుపునివ్వడం పరోక్షంగా ఏం సూచిస్తుంది? మోదీపైకి ముస్లింలను ఉసికొల్పడం కాదా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లింల సభల్లో చక్కని ఉర్దూ మాట్లాడతాడు. ఒక్క ఉర్దూ ముక్కరానివారు, ఈ నాలుగేళ్లలో భాజపాతో అంటకాగినన్ని రోజులు ఒక్కనాడు ముస్లింల ఊసు ఎత్తని తెదేపా అధినేత ఇప్పుడు ఎందుకు కొత్త పల్లవి అందుకొన్నాడు? అసలు ముస్లింల ఆధిపత్యం తెలుగుదేశంలో పెరిగితే బాబుగారి కుల మద్దతుదారులు తట్టుకొంటారా? దీని వెనుకున్న సంతుష్టీకరణ రాజకీయం ముస్లింలకు అర్థం కావాలంటే ఆ సభలోని అసలు టోపీలను, నకిలీ టోపీలను వేరు చేస్తే తెలిసేది. మమతా బెనర్జీలా, కేసీఆర్‌లా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయం చేస్తే తాను జాతీయ స్థాయి నాయకుణ్ణి అయిపోతానన్నది చంద్రబాబు ఆలోచన. ఇలాంటి ఆలోచనతోనే బెంగాల్ సీఎం మమత తన రాష్ట్రంలో హిందువుల దుర్గాపూజను, ఊరేగింపులను, శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రలను వ్యతిరేకించింది. అది భాజపాకు మంచి చేస్తుందని హిందూ ఓటు బ్యాంకు ఏకీకృతం అవుతుందని తెలియగానే మళ్లీ ఆమె యూటర్న్ తీసుకుంది. ఈ సందిగ్ధావస్థలో ‘జాతీయ పౌర రిజిస్టర్’ (ఎన్‌ఆర్‌సి)పై రాజకీయం మొదలుపెట్టింది. దేశభద్రతను ప్రమాదంలో పడేసే అక్రమ చొరబాటుదారులపై ప్రేమను కురిపిస్తోంది. ఇదంతా ఎందుకోసం? అధికారం కోసం! మోదీని దెబ్బతీయాలనే కుతంత్రం కోసం!

దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ ఏదో ఒక భావోద్వేగంతో కేంద్రాన్ని దోషిని చేయాలనే ప్రయత్నంలో ఈ దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్టీ స్థాయి నుండి దిగజారి ప్రాంతీయ పార్టీలుగా మారిపోయి మోదీ వ్యతిరేకతనే లక్ష్యంగా మావోయిస్టు మేధావులను కూడా వెనకేసుకొస్తున్నాయి. 

మహానగరాల్లో మావోవాదాన్ని సజీవంగా ఉంచుతూ మేధావులుగా పేరొందిన వరవరరావు, వెర్నన్ గొన్సాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖ, ఫాదర్ స్టాన్ స్వామి, ఆనంద్ తేవ్ తుంబ్డే ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో స్వామి, ఆనంద్ తేవ్ తుంబ్డే తప్ప అందరినీ అరెస్టు చేశారు. వీళ్లను భాజపా కార్యకర్తలు అరెస్టు చేసినట్లు, దేశం ఏదో అగాథంలో పడ్డట్లు కొందరు నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, అరుంధతీ రాయ్, మేధాపాట్కర్, ప్రశాంత్ భూషణ్ వంటి ‘స్వయం ప్రకటిత మేధావులు’ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే వీళ్లను అరెస్టు చేయగా- దేశంలో నియంత పాలన వచ్చిందా? అన్న స్థాయిలో ట్వీట్లు చేశాడు. ఇక సీతారాం ఏచూరి నుండి సురవరం సుధాకర్ రెడ్డి వరకు దేశంలో ఎమర్జెన్సీ వచ్చేసిందని చెప్పుకొచ్చారు. వాళ్లు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కోబాడ్ గాంధీని, జిఎన్ సాయిబాబాను జైలుకు పంపినపుడు దేశంలో స్వర్గ్ధామం ఉండేదా?

ప్రభుత్వ ఏజెన్సీలు తమ పరిశోధన చేయకుండా దేశంలో వామపక్ష మీడియా సంస్థలు, మోదీ వ్యతిరేకులు కలిసి తెల్లారేసరికి ఈ అంశాన్ని సుప్రీం కోర్టుకు చేర్చాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలను కదలించగలిగాయి అంటే వాళ్ల ప్రభావం ప్రభుత్వ నేర పరిశోధక సంస్థలను ముందుకు పోనిస్తాయా?

సుప్రీం కోర్టు ఈ మావోయిస్టు మేధావులను పోలీసుల కస్టడీలో కాకుండా గృహనిర్బంధంలో ఉంచాలని చెప్పడంతో వాళ్ల మేధో ప్రభావం ఏ స్థాయిలో ఉందో, వీళ్ల నెట్‌వర్క్ ఎంత చైతన్యవంతంగా పనిచేస్తుందో విజ్ఞులు ఆలోచించాలి. మోదీ మీది వ్యతిరేకతతో ప్రశాంత్ భూషణ్ లాంటి లాయర్లు వాళ్లకు పరోక్షంగా సహాయపడి సుప్రీం కోర్టు వరకు ఈ కేసును గంటల్లో తీసుకెళ్తున్నారు. ఈ గ్యాంగే ఆరు నెలల క్రితం జస్టిస్ చలమేశ్వర్‌ను రంగంలోకి దింపి నర్మగర్భ వ్యాఖ్యలు చేయించి కేంద్రానిది నియంతృత్వం అన్నట్టుగా దేశానికి తెలిపే ప్రయత్నం చేసాయి. ఈ గుంపే ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేస్తే- దాన్నీ కేంద్రాన్ని, మోదీని అపఖ్యాతిపాలు చేయడానికి ఉపయోగించుకొన్నాయి. 

కర్ణాటక విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాయి. అంటే తమకు అనుకూలమైతే రాజ్యాంగ పరిరక్షణ అంటూ జబ్బలు చరుస్తారు. తమకు వ్యతిరేకం అయితే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను తమ ఆధీనంలో ఉం చుకొంది అంటారు! ఇదేం నీతి?

దీనికంతా మూలమైన 1818 జనవరి 1న జరిగిన భీమా కోరేగావ్ యుద్ధంలో మహర్లు పీష్వాలను ఓడించారు. అంటే 200 ఏళ్ల క్రితమే దళితులు గొప్ప యోధులన్నమాట. ఇది అందరు ఒప్పుకోవాల్సిన సత్యం. కానీ ఈ స్వయం ప్రకటిత మిషనరీ మేధావులు, ఎర్రరంగుతో నీలాన్ని కలుషితం చేయాలనుకొన్నవారు ఏళ్లనుండి దళితులను ఈ దేశంలో అణచివేసారంటారు. వందల ఏళ్ల క్రితం నాటి ఘటనలకు కూడా మోదీనే బాధ్యుడు అంటారేమో! ఓట్లకోసం దంచుతున్న ఈ ‘కులం మసాలా’ సంతుష్టీకరణను ఏ స్థాయికి దిగజార్చిందో చూడవచ్చు. కొన్నిచోట్ల మతం, మరికొన్నిచోట్ల కులం, ఇంకోచోట ప్రాంతం.. ఇలా ఎన్ని వంటకాలైనా వీళ్ల అక్షయపాత్ర నుం డి పుట్టుకొస్తునే వుంటాయి!

అసలు భాజపా పాలిత రాష్ట్రాల్లోనే ఈ అలజడి ఎవరు రేపుతున్నారు. నిజానికి మోదీని రాజీవ్ తరహాలో మట్టుబెట్టాలనే ఆలోచన నిజంగా జరిగిందా? అన్న అంశంపై లోతైన పరిశోధన ప్రభుత్వ ఏజెన్సీలను చేయకుండా నిరోధించడమే ఈ మేధో ఉగ్రవాదం అసలు లక్ష్యం అని విశే్లషకుల అభిప్రాయం. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపిఏ)ను ఎత్తేసి, సీబిఐని, ఎన్‌ఐఏని రద్దుచేస్తే పోలా? నేర పరిశోధక సంస్థల కన్నా ముందే కులం, మతం రంగు పులుముతూ దేశద్రోహాన్ని చట్టబద్ధం చేసే ఈ అల్లరి రేపు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సహిస్తుందా? ఇవేవీ ఆలోచించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా దేశం నడిస్తే మనం అతి త్వరలోనే చర్చిల్ చెప్పినట్టు అంతర్యుద్ధాలతో జాతిగా నశించడం ఖాయం. మోదీని, భారతీయ జనతా పార్టీని విధానాల పరంగా వ్యతిరేకించకుండా వ్యక్తిగత వ్యతిరేకత ప్రదర్శిస్తున్న సంకుచిత మనస్తత్వాలు ఈ దేశ రాజకీయాలకు ఏ లక్ష్యం నిర్దేశించనున్నాయి!?

 ఈ దేశం కోసం తమ రక్తాన్ని మట్టిలో రంగరించి తిలకం ధరించిన వీరుల బలిదానాలు, వారి ఆత్మల ఆర్తనాదాలూ శూన్యంలో కలిసిపోవలసిందేనా? మన దృక్కోణంలో ఓటు మాత్రమే విలువైనదా? ఈ తెంపరితనం, అబద్ధాల అల్లికలు ఇంకెన్నాళ్లు? వెయ్యేళ్ల బానిసత్వపు ఛాయల నుండి పుట్టిన ఈ సంతుష్టీకరణ మనల్ని ఎలాంటి అధోగతికి తీసుకుపోతుందో?

******************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి