చాలా సినిమాల్లో ఓ హాస్య నటుడు ‘నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటుంటాడు. అది ఇటీవల తెలుగు దేశం వారికి ‘జాతీయం’గా మారి పోయింది. ముఖ్యంగా ఇపుడు చంద్ర బాబు పూటకోసారి ‘నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మనిషిని. నాకున్న రాజకీయ అనుభవం ఈ దేశంలో మోదీతో సహా ఎవరికీ లేదు’ అంటున్నాడు. ఆఖరుకు మొన్న చిన్న పిల్లలతో జ్ఞానభేరీ సభ పెట్టి అక్కడ కూడా ఢంకా బజాయించాడు.

మనల్ని గురించి ఇతరులు ఎవరైనా పొగిడితే ఆనందంగా ఉంటుంది. కానీ ఎవరికివారే నేను తిప్పిన చక్రాలు చూడండ¬ అని చెప్తే లేనిపోని అనుమానాలూ వస్తాయి. ‘ఇటువైపుకు పోవద్దు’ అని ఎక్కడైనా బోర్టు పెట్టండి. అటువైపు మళ్ళికూడా చూడని వాళ్ళంతా ఆ వైపుకే పోతారు. అలాగే నేను ‘ఇంత పోటుగాణ్ణి’ అని పదిసార్లు చెప్తే అనుమానం వెంటనే మొదలవుతుంది.

నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో చంద్రబాబు ఘనకార్యాలు నిజంగా చేసినవి కొన్ని ఉన్నా వాటిని పదేపదే చెప్పుకోవడం ఇటీవల ప్రజలకు విసుగు పుట్టిస్తోంది. ఢిల్లీలో జనతాపార్టీల చక్రాలు ఊడిపోయాక ఈ సైకిల్‌ చక్రం తిరిగింది నిజమే. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌తో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ ముందు వంగి వంగి దండాలు పెడుతోంది. దీనిని ఎన్టీఆర్‌ స్వర్గం నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ‘ఔరా! నా కరకమలములచే స్థాపించబడి కాంగ్రెస్‌ దుర్నీతిపై దునుమాడుటకు పుట్టిన నా తెలుగుదేశం నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో పడి నలిగిపోతున్నదే’ అని ఆయన ఓ డైలాగ్‌ కూడా చెప్పి ఉంటాడు. ఇంత గొప్పగా ఊదరగొడుతున్న చంద్రబాబు అనుభవం వైఎస్‌ ముందు ఎందుకు అష్టవంకర్లు పోయింది? చంద్రబాబు తిప్పిన చక్రాలు కేసీఆర్‌ కారు కింద ఎందుకు నలిగిపోయాయి? పట్టపగలే ఓటుకు నోటు కేసులో కొట్టుకొని మూటా ముల్లె పట్టుకొని అమరావతికి మొట్టమొదటే ఎందుకు పోయినట్టు? పోనీ ఈ బాబుగారి వల్ల కేంద్రంలో పొద్దు పొడిచిన దేవేగౌడ, గుజ్రాల్‌ వంటి మహామహిమాన్వితులైన ప్రధానులు ఈ దేశంలో చేసిన ఘనకార్యాలు ఎన్నో లెక్కగట్టి చెప్పగలరా? ఇవన్నీ వదిలిపెట్టి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నాలు అరిగేలా ఎన్నిసార్లు చెప్పినా అది అపహాస్యమే అవుతుంది!
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి