చరిత్రలో జరిగే చిన్న చిన్న తప్పులు, స్వార్థం దేశాలను బానిసలుగా మార్చిందనే విషయం మనకు సువిదితమే. భారతదేశాన్ని గ్రీకులు ఆక్రమించుకొంటున్న సమయంలో యవనసేనాపతి మినియాండర్ భారత్‌పై దండయాత్ర ప్రకటించి ముందుకు సాగుతున్నాడు. ఆశ్చర్యంగా ఆనాడు భారతీయ సమాజంలోని కొన్ని బౌద్ధ సంఘాలు అతనికి మద్దతు ప్రకటించాయి. ‘బౌద్ధ ధర్మంలోని అనేక విషయాలు నన్ను ఆకర్షించాయి; త్వరలోనే నేను బౌద్ధ మతావలంబనం చేస్తాను’ అని అతను నమ్మబలుకడమే ఈ దుష్ట రాజనీతికి కారణం. అంతేగాకుండా అతడు ఈ దేశంలోని వైదిక ధర్మం ఆచరించే వారితో సంఘర్షణ పడితే మాకెందుకు? “మా మతమే మాకు ముఖ్యం” అని ఆనాడు సంకుచిత మనస్తత్వంతో బౌద్ధులు ఆలోచించారు.

ఈ సంఘటన గుర్తుచేసుకోవడానికి గత పక్షం రోజులుగా భారత రాజకీయాల్లో ‘అస్సాం నాగరికుల గుర్తింపు’ చర్యకు సంబంధం ఉండడమే. ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరుగని ‘రాజకీయ వింత’ మనం మన కాలంలో చూస్తున్నాం. 2500 ఏళ్ల క్రితం సింధు నదికి అవతలివైపు ఇరాన్ వరకు వ్యాపించిన మన సరిహద్దులు ఎలా చెరిగిపోయాయి? హిందూదేశ పర్వతాలను గ్రీకులు ‘పేరోప్నిసస్’ అని పిలిచేవారు. అక్కడి వరకు భారతదేశం వ్యాపించి ఉండేది. నేటి ఆఫ్ఘనిస్తాన్ నాడు గాంధారం కాగా, కాబూలు నదికి ‘కుబా’ అని పేరు. 

ప్రజాస్వామ్యయుతంగా నడిచే గణరాజ్యాల్లో ‘పౌరరాజ్యం’ పెద్దది. అన్నిటికన్నా పెద్దదైన ఆ రాజ్యాన్ని పాలించే రాజును గ్రీకులు ‘పౌరస్’ అని పిలిచేవారు.

బ్రహ్మ దేశమైన బర్మా, కశ్యప దేశమైన కాశ్మీర్, లవుడు పాలించిన లాహోర్, త్రివిష్టపమైన టిబెట్ అన్నీ మనవే. ఎన్నో రాజకీయ కారణాల వల్ల మనం ఎంతో భూభాగం కోల్పోయాం. చివరకు దేశ విభజన జరిగి పాకిస్థాన్‌ను పంచి ఇచ్చాం. ఇది మత దృష్టి కోణంతో ఏర్పడ్డ దేశమే గాని దానికి ఎలాంటి అస్తిత్వం లేదు. 1906 బెంగాల్ విభజన తర్వాత మొదలైన ఈ రాజకీయ ద్యూత క్రీడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తూర్పు బెంగాల్‌లో ఒకప్పుడు బౌద్ధుల జనాభా ఎక్కువ. వారి హద్దులు మీరిన అహింసా వ్రతాచరణ వల్ల అక్కడ ఇస్లాం ప్రవేశించి వారిని మహమ్మదీయులుగా మార్చిన విషయం చారిత్రక సత్యం. దానికి ఆనుకొని ఉన్న అస్సాంపై కూడా ఈ మతతత్వ శక్తుల కన్ను ఏనాటి నుండో ఉంది.

బెంగాల్ విభజన తర్వాత 1911 నుంచే అస్సాం చొరబాట్లను ఎదుర్కొంటూ వచ్చింది. 1931లో జనాభా లెక్కలు జరిగినపుడు ఎఫ్‌సి  ములన్ అనే జనాభా గణాంకాల బ్రిటిషు అధికారి ఓ ప్రకటన చేస్తూ “అస్సాంలో ఇలాగే అక్రమ చొరబాట్లు జరిగితే 90 ఏళ్లలో చిప్‌సాగర్ జిల్లా తప్ప ఇంకో జిల్లాలో మెజారిటీలు స్థానికులుగా ఉండలేరు” అన్నారు. ఈ విషయం అస్సాంలోచాలా కాలం అధ్యయనం చేసిన విశ్లేషకుడు రాకా సుధాకర్ బయటపెట్టారు. అస్సాం ప్రజల అస్తిత్వాన్ని కాపాడేందుకు ఎందరో బలి అయ్యారు. 

ఎందరో కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. ప్రపుల్ల కుమార్ మహంతా లాంటి వారు అలా రాజకీయాల్లోకి వచ్చినవారే. అయితే ఇవాళ దుస్థితి ఏమిటంటే అలాంటి ‘జాతీయ పౌర చిట్టా’ను ప్రదర్శిస్తే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సెక్యులర్ ఛాంపియన్ ప్రైజ్ కొట్టేయడం కోసం మమతా బెనర్జీ అస్సాంలో రక్తపాతం జరుగనుందని హెచ్చరిస్తున్నది. 
అక్రమ చొరబాటుదార్లను మతం వారీగా విభజించిన మరో సెక్యులర్ వస్తాదు పార్టీ తెలుగుదేశం. ఈ విషయంపై పార్లమెంటు ముందు గాంధీ సాక్షిగా ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఎన్‌ఆర్‌సీలో చోటు దొరకని వారంతా ముస్లింలని, అందుకే ఈ వివక్షని స్టేట్‌మెంట్ పాస్ చేసాడు!? ఇక ఈ రాచపుండుకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకం కాదంటూనే అక్రమ చొరబాట్లకు మద్దతిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

  2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి పేను పెత్తనం చేస్తానని సోనియాగాంధీ భుజాలు రాసుకు తిరుగుతున్న మమతను పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధురి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.  2012లో అస్సాం సమ్మిళిత మహాసంఘ్ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది.

17 డిసెంబర్ 2014న సుప్రీంకోర్టు దానికి ఆదేశాలు ఇస్తూ “1 జనవరి 1966 నుంచి 24 మార్చి 1971 వరకు అస్సాంలోకి చొరబడిన వారిని గుర్తిస్తూ, వాళ్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించాలి” అనేది దాని సారాంశం. ఆ ప్రకారంగా ఫిబ్రవరి 2015 నుంచి 31 డిసెంబర్ 2017 వరకు భారత జాతీయ పౌర రిజిష్టర్ నవీకరణ జరిగింది. 10 రోజుల క్రితం ఈ రిజిస్టర్ ప్రకారం 1.9 కోట్ల మంది మాత్రమే భారత నాగరికులుగా నమోదు అయ్యారు. మొత్తం 3.29 కోట్లలో 1.9 కోట్ల మందికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన 16 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంది. అయితే ప్రభుత్వం ఇంకా రెండవ జాబితా కూడా విడుదల చేయనుంది. కానీ ఈలోపు కాంగ్రెస్ ఈ విషయంపై మాట్లాడుతూ 40 లక్షల మంది ముస్లింలు ఈ రిజిస్టర్ వల్ల అనాథలు అవుతారని మతం కార్డు ప్రయోగించారు.
దానికి చాణిక్యుడిని చంపి పుట్టిన అమిత్‌షా రాజ్యసభలో స్పందిస్తూ అందరినీ ఉతికి ఆరేసాడు. 1947లో భారత్ విడిపోయినపుడు తూర్పు పాకిస్థాన్‌లో హిందువుల జనాభా సుమారు 24 శాతం ఉండేది. 

ఇపుడు 7 శాతం కూడా లేదు. అదే భారత్‌లో 1951లో 10.4 శాతంగా ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు 16 శాతానికి పెరిగింది. అస్సాంలో ఐఎమ్‌టీడీ చట్టం ప్రకారం బంగ్లా ముస్లింలు భారత పౌరులవుతున్నారు కానీ అదే కాశ్మీర్‌లో ఉన్న పండిట్లు లక్షలాదిగా వెళ్లిపోగా ఏ భారతీయుడైనా కాశ్మీర్‌లో స్థిరపడే అవకాశం ఉందా? ఇంత దారుణమైన వివక్ష హిందూ నాగరికుల పట్ల కొనసాగుతున్నా ‘ఈ దేశ భూభాగం’ ఎప్పుడూ సారభౌమత్వంతో ఉండాలని కోరుకోవడం తప్పా? హిందువులకు ఈ దేశం తప్ప ఇంకో చోట స్థానం లేదు. కాబట్టి సెక్యులరిజం ముసుగులో జరుగుతున్న నిశ్శబ్ద భారత ఆక్రమణను అడ్డుకోవాల్సిందే!


**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి