కాంగ్రెస్ ఫార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నేత ల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. 2014 నుండి కేసీఆర్ వరుస వ్యూహాలతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన కొత్త జవజీవాలను అందించిందని చెప్పలేం గాని సామాన్య కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు కావలసినంత సంతోషం ఇచ్చింది. రాహుల్ తన పర్యటనలో వ్యాపారుల, సంపాదకుల సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత చర్చకు దారితీసినా, సాయంత్రం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి దానిని తన వ్యూహంతో బరువులేకుండా చేసాడు.
రాహుల్ పర్యటనలో ఎక్కువ సమయం ప్రధాని మోదీని తిట్టడానికే వృథా అవడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
నిజానికి ఇప్పుడున్న పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఎదురు కాలేదు. ప్రకాశం పంతులు మొదలుకొని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు రాజకీయాలను అద్భుతంగా పండించినవారే. ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో స్టైల్. 1983లో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించాక కాంగ్రెస్ కోటకు బీటలు వారాయి.
దేశమంతా ఇందిరకు వ్యతిరేక పవనాలు వీచినా తెలుగు రాష్ట్రం మాత్రం ఆమెను గౌరవించింది. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఇక్కడి ముఖ్యమంత్రులను లక్ష్యపెట్టేది కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి కూడా రెండు కారణాలు చెప్తారు. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ అతి కొద్ది నెలల్లోనే కాంగ్రెస్‌కు గట్టిగా ఎదురునిల్చింది. ఎన్టీఆర్‌కు అప్పటికే ఉన్న చరిష్మా, కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు, కొత్త నాయకత్వాల కోసం జనం తహతహ.. ఇవన్నీ కలగలిసి ఎన్టీఆర్‌ను అజేయుడిని చేశాయి.
అప్రతిహతంగా సాగుతున్న కాంగ్రెస్‌కు ఎన్టీఆర్ రూపంలో పెద్ద జట్కానే తగిలింది. అదే కాంగ్రెస్ పాఠశాలలో చదువుతున్న చంద్రబాబు అదనుచూసి ఎన్టీఆర్ పంచన చేరాడు. అప్పటినుండి చాలా రోజుల వరకు ఎన్టీఆర్-కాంగ్రెస్ దోబూచులాట కొనసాగింది. అయినా ఎన్టీఆర్ తన వ్యూహాలతో కాంగ్రెస్‌కు కొత్త తలనెప్పులెన్నో తెచ్చిపెట్టాడు. లక్ష్మీపార్వతి రూపంలో ఎన్టీఆర్ ప్రభావాన్ని తగ్గించే శక్తిని ఎవరు ప్రయోగించారో తెలియదు కానీ తెలుగునాట ఎన్టీఆర్‌ను కూల్చే పనిని చంద్రబాబు పూర్తిచేసి విజయం సాధించాడు. ఎన్టీఆర్ బతికుంటే ఏం జరిగేదో తెలియదు కానీ ఆయన మరణం చంద్రబాబు కలిసొచ్చింది.
చంద్రబాబు ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’గా వ్యవహరిస్తున్నాడని, ఆర్థిక సరళీకరణకు మద్దతుగా నిలుస్తున్నాడని వామపక్షాలు నిందించాయి. ‘మోనార్క్’లా ఉద్యోగులను శాసిస్తాడని, తెలంగాణ అన్న పదం లేకుండా చేస్తున్నాడని ఆందోళన మొదలైంది. బాబు పట్ల తెలంగాణ వైఖరి పెద్ద రహస్య విప్లవానికి దారితీసింది. అది కేసీఆర్ రూపంలో పుట్టుకొచ్చి ఉధృతమైంది.
ఈలోపు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయాలకు తెరతీసింది. దానికి సమాంతరంగా తెలంగాణ మలి దశ ఉద్యమం నడుస్తూ వచ్చింది. దానిని కేసీఆర్ తన నెత్తిన పెట్టుకొని నడిపించాడు. చంద్రబాబు ఊడలు పెరికి వై.ఎస్.అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కొత్త జవజీవాలను పొందడమే కాక అదో ని యంతృత్వంలా మారింది.
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూ డా లెక్కపెట్టనంత తీవ్రతకు వైఎస్ ఆధిపత్యం ఎదిగిం ది. ఇక్కడున్న ప్రాంతీ య పార్టీలను ఎదుర్కోవడంలో వైఎస్ కూడా ప్రాం తీయ పార్టీ నేతలా ప్రవర్తించాడు. అధిష్ఠానం కూడా అంతకుముందు వ్యవహరించినట్లు వైఎస్‌ను తక్కువ చూపుతో చూడలేదు. టిక్కెట్ల కేటాయింపులో తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే అక్కడున్న కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నట్లు మాట్లాడారని, దాంతో వైఎస్ విసురుగా లేచి ఏపి భవన్‌కు వెళ్లిపోతే ఏఐసిసి పెద్దలంతా అతడి వెంట పరుగెత్తారని గుసగుసలు వినిపించాయి. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాక తెలంగాణ ఉద్యమం తిరిగి పుంజుకుంది. ఈ మధ్యలో రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆపద్ధర్మ సీఎంగానే వ్యవహరించాడు గాని కాంగ్రెస్ ఆపదలను తీర్చలేకపోయాడు.
ఆ తర్వాత ఏరి కోరి తెచ్చుకొన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా- రెండు ఘనకార్యాలు చేసి వెళ్లిపోయాడు. తెలంగాణ ఇచ్చే సమయంలో అతడు సీ ఎంగా ఉండడం, దీర్ఘకాలంగా కొనసాగుతున్న మ జ్లిస్-కాంగ్రెస్ స్నేహబంధానికి గండికొట్టడం. అంతేకాదు- ఏ ముఖ్యమంత్రి చేయలేని పని మజ్లిస్‌కు చెమటలు పట్టించడం!
హైదరాబాద్‌లోని మహావీర్ భూముల విషయంలో మజ్లిస్‌తో తలపడడమేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టించడం కిరణ్‌కుమార్‌రెడ్డి రికార్డుగానే చెప్తారు.
స్నేహబంధానికి గండికొట్టడం. అంతేకాదు- ఏ ముఖ్యమంత్రి చేయలేని పని మజ్లిస్‌కు చెమటలు పట్టించడం! హైదరాబాద్‌లోని మహావీర్ భూముల విషయంలో మజ్లిస్‌తో తలపడడమేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టించడం కిరణ్‌కుమార్‌రెడ్డి రికార్డుగానే చెప్తారు.
తెలంగాణ ఏర్పాటు కోసం 1300 మంది ఆత్మహత్యలు చేసుకొన్నా స్పందించని కాంగ్రెస్ అధిష్ఠానం 2014లో తెలంగాణ ఇచ్చి అద్భుతం చేద్దామనుకొన్నది. ఇంతగా బాధపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు సంతోషపడలేదు. తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ మొదట చెప్పినపుడు- నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించింది. అనంతరం కేసీఆర్ స్వంత వ్యూహంతో సరికొత్త రాజకీయం ప్రారంభించాడు.
తెలంగాణను ఇచ్చి, ఆంధ్రా ప్రజలకు ‘ప్రత్యేక హోదా’ తాయిలంతో మభ్యపెట్టాలనుకున్న సోనియా వ్యూహం బెడిసికొట్టింది. కాంగ్రెస్ కోలుకొనే లోపు ఎన్నికలు రానే వచ్చాయి. ఈలోపు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో ఇక్కడ కనీసం కొత్త ఎత్తులు వేయడానికి కూడా వీలు లేక ఆ పార్టీ వెనక్కి తగ్గింది. ఈలోపు కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరిట అన్ని పార్టీల్లోని ముఖ్య వ్యూహకర్తలను తనవైపు తిప్పుకొన్నాడు.
కాంగ్రెస్ కన్నా భిన్నమైన పాలనకు కేసీఆర్ శ్రీకారం చుట్టాడు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు ఎక్కువ కాబట్టి ఏ నిర్ణయమైనా ఓ పట్టాన తేలదు. కానీ కేసీఆర్ ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తాడు కాబట్టి తెరాసలో అతడిదే అంతిమ నిర్ణయం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు దేశంలో సంచలనమే.
ఎన్నో చక్రాలు తిప్పిన చంద్రబాబే కేసీఆర్‌తో పోటీపడలేకపోతున్నాడని విశే్లషకులు అంటున్నారు. అయితే, కేసీఆర్ పథకాల్లో అవినీతి జరిగిందనేది కాం గ్రెస్ ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ అవినీతి చేయకుండా ఒక్క పథకమైనా చేపట్టిందా? ఇక్కడ అజేయుడైన కేసీఆర్ కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్య! సుదీర్ఘ ఉద్యమ అనుభవం గల కేసీఆర్ భిన్నమైన ఆకాంక్షలు తెలిసినవాడనడంలో సందేహం లేదు. కొన్నిసార్లు ఆయన కటువుగా కన్పించినా అతని దయార్ద్ర హృదయం కూడా గొప్పదే అని అంటుంటారు. తన వెంట ఉద్యమం చేసినవారు, కొత్తగా తెరాసలోకి వచ్చినవారూ అందరూ ఆయన పట్ల భయం, భక్తీ రెండూ ప్రదర్శిస్తున్నారు. ఇదే కేసీఆర్ రాజకీయ వ్యూహం!
టీపీసీసీ అధ్యక్షుడిగా కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక బాధ్యతలు చేపట్టిననాడు ఆపద్బాంధవుడే. కానీ ఈ రోజు కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ‘మాస్’గా జనాన్ని ఆకర్షించే శక్తి అతనికి లేదని సొంత పార్టీలోనే గుసగుసలు! కాంగ్రెస్‌లో పూర్వం జి.వెంకటస్వామి, ఉప్పునూతల పురుషో త్తం రెడ్డి, ఎం. సత్యనారాయణ రావు, కేశవరావు, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, వి.హనుమంతరావు బ్యాచ్ ఉండేది. వీళ్లంతా తెలంగాణ నేతలే. వాళ్ళు రోజూ పత్రికల్లో కన్పించి ఏది మాట్లాడినా ఎవరూ సీరియస్‌గా తీసుకొనేవారు కారు.
ఇపుడు కేశవరావు కెసిఆర్ పంచన చేరగా, ఎం.ఎస్ బయటకు రావడం లేదు. హనుమంతరావు రోజూ టీవీల్లో కన్పిస్తాడు. గత ఎన్నికల్లో విహెచ్‌కు డిపాజిట్ దక్కలేదు. గ్రూపు రాజకీయాల్లో ఆరితేరిన డి.శ్రీనివాస్ తెరాసలో చేరినా ఇటీవల కేసీఆర్‌తో బంధం చెడిపోయింది. బీసీ నాయకులుగా కన్పించే మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌లకు రాష్ట్ర రాజకీయం నడిపే శక్తి ఇంకా సమకూరలేదు.
కాంగ్రెస్‌లో ఇటీవల దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ గొంతులు బలంగా వినిపిస్తున్నాయి. అది అధిష్ఠానం వరకు చేరిందో లేదో? షబ్బీర్ అలీ మజ్లిస్ పార్టీ కార్యకర్తలా ఉంటాడని చెప్తారు. జైపాల్‌రెడ్డి అనర్ఘళమైన ఆంగ్లం తప్ప ఇంతవరకు చేసిన ఒక్క ఘనకార్యం లేదని వాళ్ల స్వగ్రామం మాడ్గులకు వెళ్లి అడిగినా చెప్తారు. లేకపోతే ఇష్టానుసారం జైపాల్ మాట్లాడుతున్నాడని, ఆయనకు ‘బాల్య ఖ్యాయల్’ (పిల్లచేష్టలు) వచ్చిందని కెసిఆర్ కడిగేసేవాడేనా? ఈ రోజుకూ కమ్యూనిస్టు పార్టీ పరిభాష మాట్లాడడమే అతని రాజకీయ వెనుకబాటుకు కారణం అంటారు. ఇక జానారెడ్డి సౌమ్యత కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని బద్దలు కొట్టేంత తీవ్రంగా ఉంటుందా? అని అసెంబ్లీ లాబీల్లోనే చెవులు కొరుక్కుంటున్నారు!
ఇక కాంగ్రెస్ కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ రేవంత్‌రెడ్డి అనేది మొన్నటి రాహుల్ సభలో సభికుల చప్పట్లే తెలియజేస్తున్నాయి. కానీ రేవంత్‌ను ఇంకొంచెం సేపు మాట్లాడించాల్సిందని అందరూ అంటున్నారు. నిజానికి రాహుల్ మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. రోజూ అన్ని రాష్ట్రాల్లో చెప్తున్న విషయాలే గాక ఆయన మాట్లాడిన ప్రతి విషయం పరీక్షకు నిలిచిందే. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు తర్వాత నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాడు.
రాఫెల్ యుద్ధ విమానాల గురించి మొన్న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన రాహుల్ సాయంత్రంలోపే ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఆయన చెప్పిన విషయాన్ని తేలికపరిచింది. ‘నేను మాట్లాడితే భూమి బద్దలవుతుంది, నా ముందు నిలబడడానికి మోదీకి అర్హత లేదు..’ అన్న డైలాగులు ప్రజలకు వినడానికి బాగుంటాయి
కానీ మోదీ వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి చేయలేదనే ఈ దేశం నమ్ముతోంది. లేకపోతే నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద ఉద్యమమే రావాల్సింది! రాహుల్ ఉపాధ్యక్షుడుగా ఉన్నా, అధ్యక్షుడుగా ఉన్నా ఒక్క రాష్ట్రంలోనైనా పార్టీని గెలిపించిన పాపాన పోలేదు. ఆయన స్వంతంగా వేసిన ఒక్క రాజకీయ వ్యూహం లేదు. గతంలో కన్నా అతని ‘పర్‌ఫార్మెన్స్’ బాగుందని మురిసిపోవడం కాంగ్రెస్ నేతల వంతు తప్ప- తెలంగాణ ప్రభుత్వాన్ని గడగడలాడించిందేమీ లేదు.
కాంగ్రెస్ శ్రేణులకు ధైర్యం కలిగించాలంటే- కేసీఆర్ పాలనపై విధానపరమైన చర్చకు తెరలేపాల్సింది. కేసీఆర్, మోదీలను ఈ రోజుకూ ప్రజలు ఉత్తమోత్తమమైన రాజకీయ వ్యూహకర్తలుగానే చూస్తున్నారు. మోదీని ఎక్కువ సమయం తిడితే ప్రయోజనం లేదు. అందుకే రేవంత్ లాంటివాళ్లకు మాట్లాడే అవకాశం ఎక్కువ ఇవ్వాల్సిందని సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరిపింది. గతంలో కన్నా వ్యూహకర్తలు కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎక్కువమంది ఉన్నా సరైన వ్యూహం లేని రాహుల్ పర్యటన కార్యకర్తలకు కొంత ఉత్సాహం కలిగించిందే కానీ ఊహించినంత ఊపు తేలేదేని చెప్పాలి.
************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి