ఇన్నాళ్లూ ఛానళ్లు మాత్రమే టీఆర్పీ రేట్ల కోసం పరుగెత్తేవి. ఇపుడు తెలుగు నాట కొన్ని పత్రికలు కూడా ఛానళ్ల అంత వేగంగా పరుగెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, అధిష్ఠానాలు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా చేస్తే బాగుంటుందో కూడా పత్రికలే నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు అంటూ కేసీఆర్ చేస్తున్న హడావుడిని విశ్లేషించలేక, ఊహించలేక  (మింగలేక కక్కలేక అన్న) దుస్థితిలో ఉన్నాయి మాధ్యమాలు!? దీనికొక ప్రధాన కారణం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడు  ఎన్నికలు వచ్చినా నాదే విజయం అని తొడగొడుతున్నాడు. అందుకు అనుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ స్పందిస్తున్నది.
కానీ ‘ఎల్లో మీడియా’కు ప్రీతిపాత్రమైన చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. అందువల్ల బాబు ఇప్పటికిప్పుడు యుద్ధరంగంలోకి దిగే చాన్సులేదు. ఫిబ్రవరిలో ఎన్టీయే నుండి విడిపోయాక నరేంద్రమోడీపై, బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్న బాబు అండ్ కో ఇంకా జగన్‌ను, పవన్ బోనులోకి లాగలేక పోయింది. బంగాళాఖాతంలో ఉన్న బురదనంతాబీజేపీపై చల్లి మోడీని అపఖ్యాతిపాలు చేయడంలో చంద్రబాబు సఫలుడయ్యాడు. దాన్ని తిప్పికొట్టడంలో ఏపీ బీజేపీ విఫల మైన మాట నిజం. గతంలో అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగాక వెంకయ్యనాయుడును అడ్డుపెట్టుకొని వాజ్‌పేయిని ముందస్తు ఎన్నికలకు కాలు దువ్విన చంద్రబాబు ఈ రోజు వెనకడుగు వేయడానికి కారణం ఈ ఆరు నెలలు జగన్ టార్గెట్‌గా దుష్ప్రచారం చేయాలని అనుకోవడం.
రోజూ సభలు, దీక్షలు చేస్తూ మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు. ‘25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మేమే చక్రం తిప్పుతాం’ అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నాడు. ఇక్కడ చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బాగానే పనిచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమే తక్షణ కర్తవ్యం. అది లేకుంటే ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న స్థాయిలో చంద్రబాబు బాకాలు హోరెత్తిస్తున్నాయి. మోడీ ఉంటే హోదా రాదు. అది రావాలంటే మోడీని లేకుండా చేయాలని తెలుగుదేశం పిలుపునిస్తోంది. కానీ ఇవాళ ఆంధ్రా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ హోదా ఎవరికోసం? ప్రజల కోసమా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లను బ్రతికించడానికా? అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి.
అంతర్జాతీయ విమానాశ్రయం కట్టుకోవడం ఏపీకి అవసరం. కానీ ఆ కట్టేపనిని ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కాకుండా ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వానికి అంత ఉత్సాహమెందుకు? ఎయిర్‌పోర్ట్ వరకూ ఓకే. కానీ దానిచుట్టూ వ్యాపార కేంద్రాల అభివృద్ధి పేరుతో పరోక్షంగా పార్టీ రియల్ ఎస్టేట్‌ను ప్రమోట్ చేయాలనుకోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి సుమారు 15 ఏళ్లు పట్టింది. అలాంటిది ఇప్పటికిపుడు కేంద్రం మాకు మయసభలా క్షణాల్లో నిర్మించి ఇవ్వాలని అంటున్నారు. అలాగే నయా రాయ్‌పూర్ ఎలాంటి హోదా లేకుండానే అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పూటగడవదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించింది తెలుగుదేశం పార్టీనే. గతంలో చక్రాలు తిప్పింది నేనే అని చెప్పే బాబు, లాలూ, నితీశ్, మమతలు రైల్వే మంత్రులుగా ఉన్నపుడు ఎన్ని రైల్వే ప్రాజెక్టులు తెచ్చారు. అంతెందుకు! మొన్నటి వరకు విమానయానశాఖ మంత్రిగా ఉన్నపుడు పి.అశోక్‌గజపతిరాజు ఎన్ని కొత్త ఎయిర్‌పోర్ట్‌లు సృష్టించారు? ఈ రోజు ఏపీలో తెలుగుదేశంతో కలవడానికి కాంగ్రెస్ తప్ప ఏపక్షం సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌తో పొత్తును కె.ఇ.కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నలాంటి వారు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ పచ్చ బ్యాచ్‌ను మోసే ఓ పత్రిక ‘పొత్తు వద్దు’ అని నర్మగర్భంగా చెప్పిన మాటలను తెలుగుదేశంలో స్వేచ్ఛ ఎక్కువైందని, ఇది హద్దులు మీరిన ప్రజాస్వామ్యం అంటూ వాళ్లను నియంత్రించాలని వ్యాఖ్యానిస్తున్నది.
ఇవాళ జగన్ ఓటు బ్యాంక్ అలాగే ఉండడం చంద్రబాబు జీర్ణించు కోవడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టుల తోక పట్టకున్నాడా! ఆయన తోక కమ్యూనిస్టులు వదలడం లేదా అన్నది గతితర్కం కన్నా గహనమైన విషయం. పి.డి.అకౌంట్లు, బాండ్ల విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ తెలుగుదేశాన్ని ఢీకొనే అస్త్రాలను ఈ రోజుకూ తయారు చేయలేకపోయింది. దుష్ప్రచారంతో తెలుగుదేశం ముందుంటే ఎల్కేజీ విద్యార్థుల్లా రోజూ టీవీల ముందు వివరణ ఇచ్చుకోవడానికే సమయం సరిపోతుంది.
ఇక తెలంగాణలో కేసీఆర్ దూకుడు, ప్రతిపక్షాల గోకుడు అన్నట్లుగా ఇక్కడి రాజకీయం నడుస్తోంది. నిజానికి టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది వ్యక్తిగతంగా తాము ఈ ఘన కార్యం సాధించామని చెప్పడానికి ఏం లేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజంగా నూటికి నూరుశాతం అమలయితే అద్భుతమే. వీటిని చెప్పుకునే అందరూ ఎన్నికలకు పోవాలి. కానీ ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు తమ ప్రాపకంతో సంపాదించిన ఘనత పెద్దగా ఏమీ లేదు! అయితే కేసీఆర్ రాజకీయ చతురుడు కాబట్టి రాబోయే కాలంలో ప్రతిపక్షాలు కోలుకొని దూకుడు పెంచకముందే ఎన్నికలకు వెళ్లాలని ఆయన ఆలోచన. ముందస్తు ఎన్నికల చర్చకు తెలుగునాట తెర తీసింది కూడా కేసీఆరే.
నిజానికి కేసీఆర్ మదిలో తన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న నమ్మకం బలంగా ఉంది. అలాగే వందకుపైగా సీట్లు వస్తాయని చెప్పడం రాజకీయంగా నాయకులకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి చెప్పే మాటలే. ఇంత అఖండ విజయం సాధిస్తా అనుకోవడం ఎంత అత్యుత్సాహమో కేసీఆర్ చిత్తుగా ఓడిపోతాడని చెప్పడం అంతే అజ్ఞానం. ఒకవైపు మోడీతో సఖ్యతగా ఉంటూనే తన పనులు సాధించుకొంటున్నాడు. మరోవైపు బీజేపీ సమానదూరం అంటూనే చైనాలో సింగపూర్‌లో జరిగే అభివృద్ధి వేగంగా జరుగతుంటే ఈ రెండుపార్టీలు శుద్ధ వేస్టు  అంటాడు. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం ప్రసంగంలో కూడా తెలంగాణ సర్కారు అభివృద్ధి చేసుకోవడానికి పరిణతి ప్రదర్శిస్తోంది అని స్వయంగా ప్రధానే చెప్పడం  కేసీఆర్‌కు మరింత ఊపునిస్తోంది.
కానీ కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నాడనే ప్రచారం ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. ఇటీవల కేసీఆర్ నడుస్తుంటే మంత్రులంతా వంగి వంగి దండాలు పెట్టడం తమిళనాడు రాజకీయాలను గుర్తు తెస్తోందని అంటున్నారు. బహుశా ఉద్యమాలతో కూసాలు కదిలిన పరిపాలనను కాస్త కటువుగా దారిలో పెట్టాలని కేసీఆర్ ఆలోచన కావచ్చు. సచివాలయానికి వెళ్లకపోవ డం, తన మనసులో ఉన్నదే చేయడం ఇలాంటి అపోహలకు తావు ఇచ్చి ఉండవచ్చు. అలాగే జోనల్ విధానంలో భాగంగా వికారాబాద్‌ను జోగులాంబతో కలపడం ఆ ప్రాంత ప్రజల తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నది. ఇసుక, భూదందా, మైనింగ్‌లలో కొందరు, పరుషమైన పనుల్లో, మాటల్లో మరికొందరు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చిక్కుకోవడం కేసీఆర్‌కు కొంత ఇబ్బంది కలిగించేవే. అలాగే ఉద్యోగుల విషయంలో కేసీఆర్ వైఖరి చంద్రబాబు కన్నా తీవ్రంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.
ఇవన్నీ కేసీఆర్ అత్యుత్సాహాన్ని నీరుగార్చేందకు కొంత ఉపయోగపడి ప్రతిపక్షాలకు ఆసరా కలిగిస్తాయి. కానీ రైతుబంధు, రైతు బీమాలు నిజంగా ప్రభుత్వానికి రాజకీయంగా ఊరటనిచ్చేవే. రైతుబంధును సంస్కరిస్తే ఇంకా గొప్ప ఫలితం ఉంటుందని అన్ని చోట్లా వినిపిస్తున్నది. చంద్రబాబు రోజూ మైకు ముందు గంటల తరబడి చర్విత చర్వణంగా చెప్తుంటే జనాలకు బోరుకొడుతుంది. కానీ కేసీఆర్ మంచి ప్రెపరేషన్‌తో అప్పుడ ప్పుడు మీడియా ముందుకు వస్తాడు. పిట్టకథలతో, సామెతలతో, పంచ్‌లతో, సమాచారంతో ఎదుటివారిని డైలమాలో పడేసి వెళ్లిపోతాడు. ఇక చర్చ మళ్లీ కేసీఆర్ బయటకు వచ్చేసరికి కొనసాగుతుంది. ఇవన్నీ కేసీఆర్ బలాబలాలు. ఏమవుతుందో వేచి చూడాలి.
తెలంగాణలో కేసీఆర్ దూకుడుకు సరిసమానంగా నిలబడగల నాయకుడు ఎవరు? నిస్వార్ధ బుద్ధిగల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాధుజీవి. ఆయన కన్నా మెత్తవాడు పెద్దలు జానారెడ్డి. పొన్నం, పొన్నాల, పొంగులేటి, దుద్దిళ్ల, జీవన్, మధుయాష్కీ సాఫ్ట్‌వేర్‌లేగానీ హార్డ్‌వేర్‌లు కాదు. షబ్బీర్ అలీ ఇప్పటికే కేవలం మైనార్టీశాఖ మంత్రిలాగానే మాట్లాడుతాడు. వీహెచ్ కడుపులో ఏం లేకపోయినా ఉన్నదున్నట్లు మాట్లాడినా జనం సీరీయస్‌గా తీసుకోవట్లేదు. కోమటిరెడ్డి మాటల్లో నిజాయితీ ఉంది కానీ పార్టీలో ఆయన ముందటపడటం కష్టం. సంపత్ ఇటీవల ఎందుకో దూకుడు తగ్గించాడు. ఇటీవల పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చాలా బ్యాలెన్స్‌గా, అర్ధవంతంగా మాట్లాడుతున్నాడు. దాసోజ్ శ్రవణ్, అద్దంకి దయాకర్ అద్భుత వాదనా పటిమ ఉన్న నాయకులు. కానీ వాళ్ల గ్రాఫ్ పార్టీలో ఇంకా పెరగలేదు.
పార్టీ వాళ్లను ఇంకా ఉపయోగించుకోవాలి. నిజానికి దిగ్విజయ్, కుంతియాలు చేసేదేం లేదు, అధిష్ఠానం పర్యవేక్షణ కోసం తప్ప.ఎందుకంటే ఇపుడు కేసీఆర్‌లాంటి ఉక్కుపిండాన్ని ఢీకొట్టాలంటే చతురంగబలాలు సమకూర్చు కోవాలి. ధనం, కులం, మీడియా, నాయకులు  ప్రజలు ఇవే ఈనాటి చతురంగ బలాలు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్‌రెడ్డిని ముందు పెట్టకపోతే అనుకున్న ఫలితాలు సాధిస్తామనుకోవడం దుక్కిలో నాగలి దున్నడమే. ఇటీవల జరిగిన రాహుల్ పర్యటనలో రేవంత్ ఇంకొంచెం సేపు మాట్లాడితే వాతావరణం మారేది. పార్టీగా కాంగ్రెస్ మనగలగాలంటే ఎవరు నాయకులుగా ఉన్నా పర్వాలేదు. కానీ అధికారంలోకి రావాలంటే ఓ బాహుబలి ఉండాల్సిందే.
తెలంగాణలో కోదండరాం పెట్టిన పార్టీ పరోక్షంగా కమ్యూనిస్టు విధానాలను లైవ్‌గా ఉంచడమే  తప్ప జనం ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. బీజేపీకు తెలంగాణలో ఎదిగే అవకాశం అందరికన్నా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌కన్నా ఎక్కువ దూసుకుపోవచ్చు. కానీ ఇప్పటకిపుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప స్థానిక నాయకత్వం కదిలే పరిస్థితి లేదు. ఎందుకిలా ఉంది అన్నది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవస రం ఉంది. ఇక కమ్యూనిస్టులు, తెలుగుదేశం మమ్మల్ని ఎవరు కలుపుకుంటారా అని నోరు తెరచి కూర్చున్నాయి. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ది యధాతథ స్థితి.
ముందస్తు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న ఈ రాజకీయం కేంద్రంలో మార్పులు తెస్తుందా! కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకుంటుందా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఫలితాలు కాం గ్రెస్‌కు ఆయువు అయి తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల ఓటమి భాజపాకు బలం అన్నది నిజం.

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి