భాగవతంలో ప్రసిద్ధమైన గజేంద్రమోక్షం కథ తెలియని వారుండరు. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి మొసలితో పోరాడినా దాని నుండి విముక్తి పొందలేక అనేక విధాలుగా పరమాత్మను ప్రార్థిస్తాడు. 

గజేంద్రుడి ఈ స్తుతులు దాదాపుగా.. మహాభారతంలో ద్రౌపదీ వస్ర్తాపహరణం సమయంలో ద్రౌపది చేసినంత ఆర్తితో కన్పిస్తాయి. పరమాత్మ లీలలను విభూతులను గజరాజు స్తుతిస్తూ

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలన్‌
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడోలేడో

దేవుడు దీనులలో, పరమయోగుల హృదయాల్లో, అన్నిదిశల్లో (అంతటా వ్యాపించి విష్ణువుగా) ఉన్నాడు అంటారు. కానీ, ఈ కలడని (ఉన్నాడని) అనే పరమాత్మ ఉన్నాడా! లేడా! అని ప్రశ్నించినట్లు ఈ కథను చూస్తాం. 

నిజానికి.. సంసార విషవృక్షంపై ఎక్కి కూర్చున్న మనుషులు అందులోని సత్సంగం, శాస్త్ర పరిజ్ఞానం అనే మధుర ఫలాలను అనుభవించకుండా నిత్యదుఃఖంలో పడి పరమాత్మను విస్మరిస్తున్నారు. భౌతికమైన విషయాలపట్ల చూపే ప్రేమలో వందో వంతు అయినా దేవుని పై ఉంచుతున్నారా? వ్యక్తి తన జీవితంలో అందుకోలేని ఊహల్లో, చిన్నచిన్న వస్తువులచుట్టూ తిరుగుతుంటాడు.

తన జీవన చక్రానికి వెనకా ముందూ ఉన్న తత్వ సారాన్ని మాత్రం విస్మరిస్తాడు. అందుకే ఆ తత్వానికి మూల స్వరూపమైన చక్రాధారి ఉనికిని గురించి ఆలోచించకుండా జీవితం కొనసాగిస్తాడు. ప్రకృతి పురుషుల ఏకత్వానికి ప్రతీకనే ఈ సృష్టి. దాని నిర్మాతే పరమాత్మ. అలాంటి సృష్టికర్తకు కృతజ్ఞతగా మనం ఏం సమర్పించాలి? ఆయన అస్తిత్వాన్ని ఆరాధించడమే యోగం.

ఆయన గుణ, లీల, నామ విభూతులను బాహ్యమైన పూజ, స్తోత్ర, నామ సంకీర్తనల ద్వారా ఆరాధిస్తూనే అంతర్ముఖులమై తత్వోపాసన చేయాలి. అది పరమాత్మ ఉనికిని హృదయంలో నింపుకోవడమే. అంతా తానే అయినప్పుడు జీవాత్మ అస్తిత్వం కూడా అందులోనే సమ్మిళితమై ఉంటుంది. 

కుండ, చిప్ప, పిడత, బాన.. ఇలా మట్టి పాత్రల రూపాలను బట్టి పేర్లు వేర్వేరుగా ఉంటాయి. కానీ వాటి తయారీకి మూలమైన మట్టి మాత్రం ఒక్కటే, అలాగే జీవులకు ఆధారభూతమైన పరమాత్మ ఉన్నాడనే తత్వం తెలుసుకోవడమే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకు మూలమైన ‘కలడు’.. ఉన్నాడు అనుకోవడమే అసలైన యోగం.

********************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి