ఒకప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ‘జనసంఘ్’లో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక నిబద్ధుడైన కార్యకర్త ఉండేవాడు. ఆయన పేరు దారపనేని కోటేశ్వరరావు. మంచి విద్యావంతుడు. రైతులకు సంబంధించిన అనేక విషయాలు కూలంకషంగా చెప్పగల వ్యక్తి. ఆ జిల్లాలో భాజపా ఎదుగుదలకు అంతగా అవకాశం లేకున్నా, నిబద్ధుడైన కార్యకర్తగా ఆయన నిలబడ్డాడు. ‘కమ్యూనిస్టుల కోట’లో భాజపా సిద్ధాంతాల కోసం పనిచేశాడు. 

ఎన్డీయే ప్రభు త్వం వచ్చాక అతనికి కేంద్రంలో రైతులకు సంబంధించి ఏదైనా సంస్థలో నామినేటెడ్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. ఇంతలో ఏమైందో గానీ ఆ పదవి తెదేపా కార్యకర్తకు దక్కింది. తెదేపా ‘స్లీపర్ సెల్స్’ భాజపాలో పనిచేస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పటికీ ఆంధ్రాలో భాజపా కోలుకోలేని రీతిలో దిగజారింది. దీని వెనుక ఉన్న అదృశ్య శక్తులను ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాజపాను తోక పార్టీగా మార్చిన పాపం ఎవరిది? గత ఎన్నికల్లో చంద్రబాబు కేవలం 2 శాతం ఓట్లతో గెలిచాడు. అపుడు భాజపా, జనసేన తెదేపాతో ఉన్నాయి. ఇపుడు ఏపీలో అధికార పార్టీకి కొత్తగా పెరిగిన మైలేజీ ఏమీ లేదు. కాని చంద్రబాబు భాజపాను విభేదించి ఎన్డీయే నుంచి బయటికి వచ్చాక ఆంధ్రాలో భాజపా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తుందని అందరూ ఊహించారు. గత రెండు నెలల్లో చంద్రబాబు ‘్ధర్మపోరాట దీక్ష’లతో భాజపాను, వ్యక్తిగతంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడ్డాడు. మొదట్లో ఏపీ భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాస్త గట్టిగా, కరుగ్గా చంద్రబాబుని ఎదుర్కొన్నాడు. ప్రసార మాధ్యమాల చర్చల్లో ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి దూకుడు ప్రదర్శించాడు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు రోజువారీగా గణాంకాలతో తెదేపాను ఎండగట్టడం మొదలుపెట్టాడు. దీంతో తెదేపా వర్గాలు కనకమేడల రవీంద్ర, కుటుంబరావులను భాజపాపైకి, జివిఎల్‌పైకి ఎగదోశాయి. ప్రచార ప్రసార మాధ్యమాలు దీనికి తోడురాగా భాజపాకు జరగాల్సిన నష్టం జరిగింది!

 ఈలోపు కన్నా లక్ష్మీనారాయణను ఏపీ భాజపా అధ్యక్షుడిగా అమిత్ షా నియమించాడు. బాబు సర్కారును ఎండగట్టడానికి బయలుదేరిన కన్నాను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఆమధ్య తిరుమల దర్శనానికి అమిత్‌షా వస్తే తెదేపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడికి దిగారు. విష్ణువర్థన్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ల మధ్య సవాళ్లు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాయి. ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ తిట్టిన బండబూతులను చంద్రబాబు ఖండించకపోగా ఈరోజువరకు వివరణ ఇవ్వలేదు.

నాలుగు నెలలుగా ఇలాంటి పరిణామాలు నిత్యకృత్యమైనా భాజపా గట్టిగా నిలబడడం లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో తెదేపాను నమ్మి అగాథంలో తాము పడిపోయిన సంగతి ఇప్పటికిగాని భాజపా నేతలకు బోధపడలేదు. ఏపి భాజపా నాయకులు తాము రాష్ట్రానికి చేసిన మేలును గురించి చెప్పలేకపోవడమే గాక చంద్రబాబు పాలనలోని వైఫల్యాలను ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. హోదా విషయంలో మొదటినుండి భా జపా నేతలకు స్పష్టత లేనందున ఎలా పడితే అలా ప్రకటనలు చేశారు. 

తెదేపా,వైకాపాల ప్రశ్నలకు ఎల్‌కెజి పిల్లల్లా జవాబులిస్తూ పోతున్నారు. కేంద్రంలో ఏం జరుగుతుందో, మోదీ దృష్టిలో ఏ విషయం ఎలా ఉందో గమనించకుండా వాగ్దానాలిచ్చేశారు. వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ వాగ్దానాలకు రక్షణ కవచంలా పనిచేశాడు. ఆయన ఉప రాష్టప్రతి కాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భాజపా నేతలు కళ్ళు తెరిచి చూసేసరికి కలియుగం మూడుపాళ్లు గడిచిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

మొదటి నుంచి చంద్రబాబుతో వైరం కొనసాగిస్తున్న సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ, గోకరాజు గంగరాజులకు ప్రాధాన్యం ఇవ్వకుండా కామినేని శ్రీనివాస్, ముత్యాలరావుకు అగ్రస్థానం కల్పించారు. వెంకయ్య చంకలో ఎక్కిన కామినేని శ్రీనివాస్ ఏనాడూ చంద్రబాబును ఎదిరించింది లేదు. ముత్యాలరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉంటూ పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను కూల్చినా మాట్లాడలేదు. పుష్కరాల తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోయిన తర్వాత కూడా ముత్యాలరావు పెదవి విప్పింది లేదు. 

హిందుత్వ ప్రతినిధిగా చెప్పుకునే పార్టీలో మంత్రిగా ఉంటూ తిరుమలలో గాని, తన శాఖలో గాని పెద్దగా మార్పులు తెచ్చింది లేదు. కనీసం తిరుమలలో హైందవ ధర్మం కోసం అతను ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు లేకపోగా మత మార్పిడులు, టీటీడీలో వివాదాస్పద నిర్ణయాలు సర్వసాధారణంగా నడిచాయి. పార్టీ కోసం వీర్రాజు ఒక్కడే మాట్లాడుతుంటే భాజపా మంత్రులిద్దరూ అతనికి బాసటగా నిలిచింది లేదు!

ఇటీవల రామ్ మాధవ్ ఏపీకి వస్తే ‘కమలనాథుల’కు కాస్త ధైర్యం వచ్చినా, ఆ తర్వాత పార్టీ శ్రేణులు నిరుత్సాహంలోనే ఉన్నాయి. భాజపా ప్రచారక్‌గా ఉన్న రవీంద్రరాజు ఏం చేస్తున్నాడన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. ఇక ఎమ్మెల్సీ మాధవ్ సహా ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు ప్రకటనలు అడపాదడపా  అడపాదడపా కనిపిస్తున్నా, తెదేపాను దెబ్బకొట్టేంత తీవ్రస్థాయిలో అవి లేవు. ధనబలం, కులబలం, పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్న తెదేపాను ఢీకొనాలంటే భాజపా శక్తులు చాలా సమర్థవంతంగా ఉండాలి. 

‘తలనొప్పికి జండూబామ్ రాసుకున్నట్టు’ పైపైన ప్రచార ఆర్భాటాలు, బాబుపై గౌరవ ప్రదర్శనలు పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడవు. ముఖ్యంగా మీడియా తీరును భాజపా నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. భాజపాను బోనులో నిలబెట్టడానికి కొన్ని ప్రసార ప్రచార మాధ్యమాలు ప్రయత్నిస్తూ, శత్రుపార్టీల కన్నా తామే ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా భాజపా వారు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆత్మహత్యా సదృశం. కొన్ని టీవీ చానళ్లు మోదీని వ్యక్తిగతంగా తెగ దూషిస్తున్నా, కొందరు తెదేపా నాయకులు ప్రధాని అని కూడా చూడకుండా మోదీని తీవ్ర పదజాలంతో తిడుతున్నా పట్టించుకోకుండా అవధూతల్లా భాజ పా నాయకులు ఇంకెన్నాళ్లు ఉంటారు?

మోదిని కాల్చిపారేయాలని, ఉరి తీయాలని గతంలో సిపిఐ నారాయణ లాంటివాళ్లు నోరు పారేసుకున్నా, కొరటాల శివలాంటి సినిమా దర్శకుడు మోదీని మనిషిని చేయాలని ట్వీట్లు చేసినా, టీవీ చానళ్లలో యాంకర్లు సైతం ఇష్టం వచ్చినట్లుగా ప్రధానిని దూషిస్తున్నా పట్టించుకోని పార్టీ తమ నేతలకు భాజపా శ్రేణులు ఎలా సహకరిస్తాయి.? కనీసం గవర్నరుకు ఫిర్యాదు చేసైనా ఈ వ్యతిరేకుల నోరు కట్టడి చేయాల్సింది.

 తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగాను, తనపై వ్యక్తిగతంగాను ఆరోపణలను చేసిన టీవీ చానళ్ల వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకొని వారిని ఆదిలోనే కట్టడి చేశాడు. దాంతో తెలంగాణ ప్రభుత్వంపై నోరెత్తడానికి భయపడుతున్న మాధ్యమాలు తమను తాము మోదీని తిట్టడంలో ఎంగేజ్ చేసుకున్నాయి. ఓ సినిమా నటుడు ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో చంద్రబాబును ఇరికించేలా కేంద్రం ప్రయత్నిస్తోందని అబద్ధాలు చెప్పినపుడు అతనిపై కేసు పెట్టాల్సింది. ఇవన్నీ మోదీ, అమిత్ షా ఏపీకి వచ్చి చేస్తారా? 

స్థానిక పరిస్థితులను బట్టి ఇక్కడి నాయకులు పార్టీని అభివృద్ధి చేస్తే పైనున్న పార్టీ పెద్దలు సహకారం అందిస్తారు. ప్రతిదానికీ రోజువారీగా అమిత్ షా వచ్చి సమీక్ష చేస్తాడా? అసలు మోదీ మనసులో ప్రత్యేక హోదా గురించి ఏముందో ఏపీ భాజపా నేతలకు అవగాహన లేనందునే సమస్య ఇంత దూరం వచ్చింది.

ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా పదేళ్లకు పొడిగించారని ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ చెబుతున్నా ఆ పదేళ్ల తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉంటే ఒకరినొకరు నిందించుకుని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి అతి పెద్ద సముద్ర తీరం ఎన్నో సహజవనరులు, కష్టపడి పనిచేసే ప్రజలు, విద్యాబలం ఉన్నందున ఇప్పటికప్పుడు పెద్ద ప్రమాదంలోకి జారిపోయే అవకాశం లేదు. 

ఇపుడు సమస్యంతా చంద్రబాబు నిర్మించాలనుకుంటున్న అమరావతి చుట్టే తిరుగుతోంది. అమరావతిలో రాజధాని పెట్టడానికి కారణాలేమిటి? ఎవరి ప్రోద్బలంతో, ఏ నివేదికలతో రాజధానిగా రూపొందుతుందనే అంశాన్ని ప్రధానంగా ప్రశ్నించడంలో భాజపా విఫలమైంది.

చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఇప్పటికీ బయట పెట్టనందుకు భాజపా గట్టిగా ప్రశ్నించాల్సింది. కేరళకు చెందిన భాజపా ఎంపీ వెల్లంవెళ్లి మురళీధరన్‌ను ఏపి భాజపా ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆయన అనుభవం వున్న రాజకీయ వ్యూహకర్తనే! 

ఆంధ్రా భాజపాలో బలమైన నాయకులుగా పేరున్న వారు ధైర్యంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేయలేకపోతే, హద్దులుమీరిన వారి మంచితనం అసలుకే ఎసురుపెట్టే ప్రమాదం ఉంది. విశాఖ భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు మొన్న పార్లమెంటులో నోరు విప్పడం తప్ప ఏనాడు తెదేపా పోకడల్ని వ్యతిరేకించలేదు. అందుకు కారణాలు తెలియక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. 

అస్సాంలో లక్షమంది బంగ్లాదేశీ వలసదారులు, రోహింగ్యాలు ఉంటున్నప్పటికీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాళ్లను దేశంలో చాలా మర్యాదగా చూసుకోవాలని వాదిస్తోంది. ఈ కోవలోనే ఓటు బ్యాంకు కోణంలో తెదేపా ఇంకొక అడుగు ముందుకేసి ఆ వలసదారుల్లో ఎక్కువమంది ముస్లిం ఉన్నారని కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. అయినా కంభంపాటి హరిబాబు లాంటి సీనియర్ నాయకులు దీనిపై స్పందించడం లేదు. చంద్రబాబుపై వైఎస్ జగన్ దూకుడుగా వ్యవహరిస్తుండగా ఆ స్థాయిలో భాజపా పనిచేయలేకపోతోంది. 

అమరావతి నిర్మాణాల్లో అవతతవకలను భాజపా ఎత్తి చూపలేకపోతోంది. ప్రభుత్వాలపై ఒంటికాలిపై లేచే కమ్యూనిస్టులు పవన్‌తో ఉంటూనే చంద్రబాబును పరోక్షంగా రక్షిస్తున్నారు. ఇందులోని వైచిత్రిని భాజపా బయట పెట్టలేకపోయింది. అమరావతిని బూచిగా చూపి కేంద్రాన్ని, మోదీని బోనులో నిలబెడుతున్నా, తెదేపా కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏపీ భాజపా ఫెయిల్ అయిందనే చెప్పాలి.

ప్రసార ప్రచార మాధ్యమాల ఏకపక్ష దోరణిని ఎదుర్కొనలేక పోవడంలో ఏపీ భాజపా నాయకుల అమాయకత్వం, నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క కెసిఆర్ అనుకుంటే తెలంగాణలోని అన్ని చానళ్లకు చలిజ్వరం వచ్చేంత పని జరిగింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం ఉండి కూడా మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భాజపా నేతలు అడ్డుకోలేకపోయారు. ‘ఎల్లో మీడియా’ వికృతాన్ని కేంద్ర ప్రచార ప్రసార మంత్రిత్వ శాఖ విభాగానికి తెలియచేయలేకపోయారు.

 ‘ద్రౌపది’ని అవమానిస్తూ పుస్తకం రాసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ‘పద్మ’ అవార్డు పొందాడు. తెదేపా, భాజపా కలిసి ఉన్నన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తిన ఓ మీడియా సంస్థ ఒక్కసారిగా భాజపాపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయినా భాజపా మాత్రం కింకర్తవ్యం అంటూ ఇంకా విమూఢత్వంలోనే ఉండిపోయింది. 

కేంద్ర సాహిత్య అకాడమీలో ఆంధ్రాకు చెందిన నక్సలైట్ కవులు, రచయితలు తమ స్థానాలను పదిలపర్చుకుంటున్నా - వారి గురించి ప్రాథమికంగానైనా వ్యతిరేకించే పరిజ్ఞానం లేకుండా పార్టీని నడుపుతున్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ శాఖ అనంతపురానికి వచ్చినప్పటికీ అందులో చొరబడటానికి వామపక్ష శక్తులు ప్రయత్నించినా వాళ్లను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 

మేధోబలాన్ని సమకూర్చుకోకుండా పార్టీని నడపడం అంటే యుద్ధానికి వెళ్లే సైనికుడు కత్తి, డాలు ఇంట్లో మరచిపోవడం వంటిదే. ఎన్నికలు తరుముకొస్తుంటే - దిక్కులు చూస్తుండడం శత్రువుకు ఆయుధాలు ఇవ్వడమే. కులవాదంతో మగ్గిపోతున్న ఏపీని జాతీయభావంతో నింపడానికి శక్తియుక్తులు ప్రదర్శించాల్సిన సమయంలో ప్రతిరోజు టీవీల్లో ప్రత్యేక హోదాపై వివరణలు ఇస్తూ కాలం గడిపితే నిరాశే మిగలడం ఖాయం.


*******************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి