ఈ రోజుల్లో అందరూ ప్రాణయామం, ఆసనాలనే ‘యోగం’ అనుకొంటున్నారు. కానీ మన యోగవేత్తలు అలా చెప్పలేదు. మనం ఎవరం? మనం ఎక్కడనుండి వచ్చాం? ఎక్కడికి వెళ్తాం? అనే తాత్విక జ్ఞానసంపద ఆధారంగా యోగ విద్యను సృష్టించారు. 

జీవుని పరమలక్ష్యం తెలుసుకొని, ఎరుక గలిగి పరమాత్మను పొందే గొప్ప తత్త్వశాస్త్రం యోగవిద్య. జీవాత్మ వెళ్లి పరమాత్మతో కలవడమే యోగం అని యాజ్ఞవల్క్యుడు నిర్వచిస్తే, చిత్తవృత్తులను నిరోధించడమే యోగమని పతంజలి పేర్కొన్నాడు. 

జీవుల పరమలక్ష్యమైన పరమాత్మ సంయోగానికి దేహాన్ని సంసిద్ధం చేయడం కోసమే అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించారు. అందులోని 8అంగాలు మనసును, శరీరాన్ని శుద్ధిపరచి వివేక ఖ్యాతి కలిగిస్తాయని దత్తాత్రేయయోగం చెప్పింది. అవి.. 

యమము (క్రమశిక్షణ), నియమం (నడవడిక), ఆసనం (శారీరక విధానం), ప్రాణాయామం (మనస్సు నిలకడ), ప్రత్యాహారం (నిగ్రహం), ధారణ (దీక్ష), ధ్యానం (తన్మయత్వం), సమాధి (ఏకాగ్రత).

పూజాకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః
జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో లయః

కోటి పూజల కన్నా ఒక స్తోత్తం, కోటి స్తోత్రాల కన్నా ఒక జపం, కోటి జపం కన్నా ఒక ధ్యానం, కోటి ధ్యానాల కన్నా ఒక లయం ముఖ్యమని కాలోత్తర తంత్రం తెలిపింది. ఈ లయమే యోగం అని యోగ విజ్ఞానం తెలిపింది. అలాంటి యోగవిద్యను త్రిమూర్తులే యోగేశ్వరులై మనకు అందించారు. 

హిరణ్యగర్భుడైన బ్రహ్మ యోగవిద్యను యాజ్ఞవల్క్య మహర్షికి చెప్పగా, ఆ మహర్షి తన భార్య గార్గేయికి ఉపదేశించాడు. లుప్తంగా ఉన్న ఈ యోగాన్ని ఆధునిక కాలంలో గొప్ప యోగ పరిశోధకుడు నాగలింగ శివయోగి లోకానికి అందించాడు. మహేశ్వరుడు హఠయోగవిద్యను పార్వతికి అందించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత రూపంలో ఆత్మయోగం అందించాడు.

అది సర్వమత ఆమోదమై గొప్ప రాజయోగంగా స్థిరపడింది. తర్వాత పతంజలి మహర్షి ఈ యోగవిద్యనంతా క్షాళనచేసి 193సూత్రాల్లో లోకానికి అందించాడు. వీటన్నింటిలోనూ.. పరమాత్మ ధ్యానమే యోగమని చెప్పబడింది. దానికితోడుగా ఆచరణాత్మకమైన సాధన కోసమే మిగతా విషయాల ప్రతిపాదన జరిగింది. 

మనస్సు కోతి అయితే, ఆ కోతి కల్లు తాగితే, దానికి తేలుకరిస్తే, దానికి దయ్యంపడితే అది ఎన్నిగెంతులు వేస్తుందో చెప్పలేం. అలాంటి మనస్సును నిశ్చలం చేసి సహజమైన ఆనందంలో ఉంచే ప్రక్రియ యోగం. దానిలో పుట్టిన వృత్తులను ఒక్కొక్కటిగా చేధిస్తూ ఏకాత్మకమైన స్వరూపంగా మార్చాలి అన్నదే యోగవిద్యలో అసలు రహస్యం.

*********************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి