కొత్త కొత్త పదాలను సృష్టించి వాటిని ‘ఎర్ర నిఘంటువు’లోకి ఎక్కించడంలో మన కామ్రేడ్‌లు ఆరితేరిన ఘనులు. ఫ్యూడల్‌, భూస్వామ్య, గ్లోబలైజేషన్‌.. వంటి పడికట్టు పదాలతో జనాల నాడిని పట్టేస్తుంటారు. ఇటీవల మూకదాడి అనే పదాన్ని పుట్టించి చర్చకు వదిలారు. నిజానికి మూకదాడి చేయడం శుద్ధ తప్పే. ఒక ఘటన జరగాలంటే చర్య, ప్రతిచర్య రెండూ ఉంటాయి. మనదేశంలో జరిగే ప్రతి సంఘటనకు మూలమైన చర్యను గురించి ఎవరూ మాట్లాడరు! కానీ ప్రతీ చర్యను మాత్రం భూతద్దంలో చూపించి చిలువలు పలువలుగా వ్యాఖ్యానం చేసి తమ మేధావితనాన్ని నిరూపించుకుంటారు.
ఉదాహరణకు గోవధ చేసిన వారి వలన అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. మనదేశంలో కాంగ్రెసు పాలనలోనే గోవధ నిషేధం ఎక్కువ రాష్ట్రాల్లో అమలు జరిగింది. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గోవులను వధిస్తామని చెప్పే వారిని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. గోవులను కబేళాలకు తరలించే వారిపై ఎలాంటి చట్టాలు ప్రయోగించడం లేదు. తద్వారా ఈ దేశంలో సింహభాగం ఉన్న మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. నిజానికి అక్కడ చర్య జరిపి తెంపరితనం ప్రదర్శిస్తున్న వారిపై చర్య తీసుకోకపోవడం వల్ల ప్రజలే చట్టాలను చేతిలోకి తీసుకుంటున్నారు. సెక్యులర్‌ ప్రభుత్వాలు గోవులకే కాదు, సాధువులకు కూడా నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. మూకదాడి చేయడం తప్పే. కానీ వాళ్ల మూగరోదనను పట్టించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది. ‘మెజార్టీ ప్రజల మనోభావాలను గంపకింద పెట్టి తొక్కేద్దాం’ అనుకునే మొగలాయీ మనస్తత్వం ఉన్నన్ని రోజులూ ఇలాంటి ఘటనలను ఏ ప్రభుత్వం ఆపలేదు. కాబట్టి మూకదాడి గురించి కుంగి కృశించే లిబరల్‌ మేధావులు కాస్త మెజార్టీల మూగరోదన గురించి కూడా పట్టించుకోవాలి.

*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి