భారతదేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. అంతకుమించి ఓ గొప్ప రాజనీతిజ్ఞుని కూడా కోల్పోయింది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించాక దేశమంతా మార్మోగిన నినాదం ఇది. కొందరు జన్మించడం అజ్ఞాతంగా జరిగిపోతుంది. 

మరణించడం మాత్రం గొప్పగా మరణిస్తారు. ఎందుకంటే జన్మించడం మన చేతుల్లో ఉండదు. కానీ మరణానికి ముందు వేసుకొన్న పూలబాటలు అతడిని సామాజికవేత్తగా మారుస్తాయి. సరిగ్గా మరణానికి ముందు జీవితంలో వాజ్‌పేయి చూపిన ఆదర్శాలు అంతే ప్రభావవంతంగా ఆలోచించే విధంగా తోస్తున్నాయి.

ఒక వ్యక్తి శరీరం వదలిపెట్టడానికి ముందు దాదాపు 12 ఏళ్ళు బయటి ప్రపంచానికి తన ముఖాన్ని కూడా చూపించలేదు. ఒక్క మాట ఎవరితోనూ మాట్లాడలేదు. అయినా అతని మరణం కోట్లాదిమంది కంట కన్నీరు పెట్టించడం వెనుక అతని చింతన ఎంత గొప్పదో మనం ఈ రోజు ఆలోచించాలి. 

బహుశా! వాజ్‌పేయిలో రాజనీతిజ్ఞత కవిత్వంగా దాగి ఉంది. అతను గొప్ప భావకుడు. హిందీలో అతని కలం నుండి జాలావారి, అతని నోటి నుండి ప్రవహించే కవితాఝరి శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేసింది. కవిత్వం, భాష, ప్రసంగం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి వాజ్‌పేయి కవిత్వాలు, ప్రసంగాలు ఒక ఉదాహరణ. సాధారణ విషయాన్ని సైతం కళాత్మకంగా తీర్చిదిద్ది శ్రోతల హృదయంలోకి పంపగల  ఒంపగల నేర్పు వాజ్‌పేయి సొంతం. 

సంఘం తొలినాళ్లలో తీర్చిదిద్దిన నాయకుల్లో వాజ్‌పేయి ఒకరు. శ్యామాప్రసాద్ జమ్ముకాశ్మీర్‌లో ‘ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా’ ఇచ్చిన నినాదం కొసను అందుకొని అటల్ నాయకుడిగా ఎదిగారు. అలాగే ఏకాత్మతా మానవతావాదం ప్రవచించిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ వంటి నిరాడంబర రాజకీయ నాయకుని పంచన పెరిగిన వటవృక్షం వాజ్‌పేయి. అయితే శ్యాంప్రసాద్ ముఖర్జీలా, దీన్ దయాల్ ఉపాధ్యాయలా అనుమానాస్పద చావుకు గురికాకుండా బతికిన వాజ్‌పేయికి దేవుని అనుగ్రహం ఉన్నట్లే అనిపిస్తుంది. 

వాజ్‌పేయి ఈ ఇద్దరి తర్వాత జనసంఘ్‌ను, భారతీయ జనతా పార్టీని తన భుజాలపై మోసిన వ్యక్తి. అంతేకాదు ఆనాటి నెహ్రూ వాద  గాంధేయ వాద సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా నిలబడి ఎదిగిన మహానాయకుడు. స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ ఎదురులేని నాయకుడు.

ఆ తర్వాత ఇందిర అంతే వేగంతో ప్రజల్లో మమేకం అయ్యారు. అలాంటి ప్రవాహాలను తట్టుకొని నిలబడ్డ ధీశాలి వాజ్‌పేయి. తన పార్టీవారితో కాకుండా జయప్రకాశ్ నారాయణ, మొరార్జీదేశాయ్ వంటి భిన్న భావజాల సిద్ధాంతాల వ్యక్తులతో రాజకీయ ప్రస్థానం నడిపించినా ఎవరికీ లొంగకుండా తన భావజాలంలో ఉండడం సామాన్య విషయం కాదు. అక్రమంగా వచ్చిన అధికారం వాసన కూడా చూడనని చెప్పగల త్యాగమూర్తి వాజ్‌పేయి. 

పాకిస్తాన్‌తో యుద్ధం గెలిస్తే ఇందిరను అభిమానించగల సహృదయుడు. అదే ఇందిర తప్పుచేస్తే జెపి వంటి నాయకులతో కలిసి ఎదురించగల ధీరుడు. సంకీర్ణాలు విఫలమయినపుడు అలాంటి పీకలేని తోకలేని పార్టీలను కూడా అధికారానికి దగ్గర చేయగల సంయోజకుడు వాజ్‌పేయి. 

ఆయన సంకీర్ణంలో పని చేసిన ఎందరో నాయకులు ఈ రోజు ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు.
నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి వారు ఈ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే పాకిస్తాన్‌తో ఆయన నెరపిన రాజకీయ దౌత్యం శాంతికాములకు ఊరట కాగా, కార్గిల్ యుద్ధవిజయం ఆయన రాజకీయ టెంపరితనానికి ఉదాహరణ. 

ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే   ఆ పార్టీలోకి జంప్‌చేసే జంప్ జిలానీలు వాజ్‌పేయిని చూసి చాలా నేర్చుకోవాలి. దాదాపు 60 ఏళ్ళు అధికారం రాదని తెలిసినా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండడం అంత సులభమైన విషయం కాదు. ప్రతి పక్షంలో ఉంటూ భారతదేశం తరపున ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించడం ఆయన రాజనీతిజ్ఞతకు అద్దం పడుతుంది.

అన్నింటికన్నా అద్వాణీతో ఆయనకున్న స్నేహం భారత రాజకీయ స్నేహబంధాల్లో చాలా విలువైంది. బహుశా! ఏ జంటా ఇంత సుదీర్ఘ స్నేహ బంధాన్ని రాజకీయాల్లో కొనసాగించలేదు. ఏనాడూ పొరపొచ్చాలతో బజారుకెక్కలేదు. అద్వాణీదీ గట్టి మనస్తత్వం. వాజ్‌పేయిది సున్నిత మనస్తత్వం. ఈ మనస్తత్వాలను గులాబీ చెట్టుకున్న పూలు, ముళ్ళతో పోల్చవచ్చు. పూలు చెట్టుకు అందం. ముళ్ళు ఆ పూలకు రక్షణ. ఈ రెండింటి వేరు ఒక్కటే, అదే ఇక్కడి విశేషం. ఈ వేరు నుండి పూవుకు, ముళ్ళకు సంబంధించిన ప్రత్యేక వేరును పక్కన బెట్టడం ఆ చెట్టునాటిన వాళ్ళకే సాధ్యం కాదు. అలాంటి సంబంధ బాంధ్యవాలు అద్వాణీ, వాజ్‌పేయిలు నెరపారు. వారి సుదీర్ఘ ప్రయాణం అజరామరం.

ఇదంతా ఈ రోజు ఉన్న కలుషిత రాజకీయాల్లో చర్చించదగిన అంశాలు. అయితే దురదృష్టకర విషయమేమిటంటే భారతీయ మీడియా వాజ్‌పేయి మరణం తర్వాత గొప్పతనాన్ని చూపిస్తూ మోడీని వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేసిందన్నది పచ్చి నిజం. 

వాజ్‌పేయి రాజకీయమంతా, ఆయన  రాజనీతి కౌశలం అంతా ఆనాడున్న నెహ్రూ నుంచి సోనియాగాంధీవరకున్న దుర్లక్షణాలపై పోరాడడం కాదా? వాజ్‌పేయి ఏదో మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు అన్నట్లు ధ్వని సంకేతాలను ముఖ్యంగా తెలుగుమీడియా ఇవ్వడం ఎల్లోమీడియా వికృత విన్యాసం కాదా?   ఇపుడు తలపండిన రాజకీయ దురంధరులంతా తాము బీజేపీలో మరణిస్తే ఎంత బాగుండేది అనుకుంటారని అంచనా.

ఎందుకంటే వాజ్‌పేయి అంతిమయాత్రలో ప్రధానితో సహా మంత్రులందరూ ఆరు కిలోమీటర్లు నడచి ప్రజలతో పాటు వెళ్ళడం ఒక అద్భుత సంఘటనే. జీవితకాలం మొత్తం కమ్యూనిష్టు పార్టీలో సేవలందించిన సోమనాథ్ ఛటర్టీ వ్యక్తిగతంగా ఓ అభిప్రాయం వెలిబుచ్చినంత మాత్రాన కమ్యూనిష్టులు నిర్దాక్షిణ్యంగా అతనిపై వేటు వేశారు. వాళ్ళ కుటుంబం ఆయన పార్థివదేహంపై కమ్యూనిష్టు జెండాను కప్పడానికి నిరాకరించారు. 

ఒక చిన్న విషయానికి అంతదారుణమైన శిక్ష సోమనాథ్ చటర్జీకి ఆ వయసులో పడింది. అలాగే భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, మహామేధావి. బహు భాషా పండితుడైన రాజనీతిజ్ఞుడు పి.వి. నరసింహారావు, నెహ్రూ కుటుంబేతర తొలి కాంగ్రెస్ ప్రధాని.
అలాంటి వ్యక్తి మరణిస్తే ఆయన పార్థివశరీరాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వంది ఎవరు? కనీసం ఎందుకలా జరిగిందని అడిగే ధైర్యం నాయకులకు గానీ, ఈ దేశ మీడియాకు గానీ ఎందుకు లేకపోయింది? అలాగే కాంగ్రెసు రాజకీయాలకు ప్రత్యమ్నాయంగా సరికొత్త ప్రయత్నం చేసి సఫలమైన ఎన్టీఆర్‌ను కుటుంబసభ్యుడు, అల్లుడైన చంద్రబాబు అధికారం కోసం ఎంత ఘోరంగా వంచించారు. 

 ఇవీ ఈ దేశంలో జరిగిన అధికార రాజకీయాలు. కానీ వీటి గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. కానీ వాజ్‌పేయి  గుజరాత్ అల్లర్ల గురించి అన్న ఒక్క మాటను సూడో సెక్యులర్ లిబరల్ ఎల్లో మీడియా పరోక్షంగా మోడీని తక్కువ చేసి చూపెట్టడానికి ప్రయత్నించింది.

గుజరాత్ అల్లర్లకు మూలమైన గోధ్రా రైలు దుర్ఘటనలో మరణించిన 79 మంది కరసేవకుల ప్రాణాల గురించి  ఎప్పుడైనా ఈ హర్యాలీ మేధావులు, నాయకులు మాట్లాడారా? వాజ్‌పేయి ఆ రోజు చెప్పిన ఒక్క సూత్రం గురించే ఈ రోజు చర్చిస్తున్నవారు ఆయన జీవితాంతం ఎవరికోసం, ఏ పాలనకు వ్యతిరేకంగా సుద్దులు చెప్పాడో విస్మరిస్తున్నారా? వాజ్‌పేయి రాజకీయాల నాటికే ఎన్నో కుటిల రాజకీయాలు ఈ దేశంలో ఉన్నది నిజం. 

వాజ్‌పేయి  మోడీల సమకాలీన రాజకీయం చాలా తక్కువ. అయితే వాజ్‌పేయి పాటించిన కొన్ని విలువలను కాదనలేం. కానీ ఈ రోజు జరుగుతున్న రాజకీయ వంచనను హద్దులు మీరిన విలువలతో ఎదుర్కోవడం సాధ్యం కాదు.

వాజ్‌పేయి గొప్పవాడు. సంకీర్ణ ధర్మాన్ని, మమ్మల్ని చాలా గౌరవించాడు అని ఊదరగొట్టిన చంద్రబాబు కనీసం మరణించిన రోజు ఏపీలో ఎందుకు సెలవు ఇవ్వలేదు? ‘మరణం తర్వాత వైరం ఉండదు’ అని శాస్త్రాలు చెప్తాయి. 

 సోనియాగాంధీ నామ మాత్రంగా నివాళులు అర్పించారు కానీ వాజ్‌పేయిపై మనసులో ఏం ఊహించుకున్నారో ఎవరైనా చెప్పగలరా? వాజ్‌పేయి రాజకీయాలు ఆదర్శం అని చెప్పిన మమత ఎన్‌ఆర్‌సీలో 40లక్షల అక్రమ చొరబాటుదారుల పేర్లు లేవని గుండెపగిలేంత ఏడ్చిందట. ఎన్‌ఆర్‌సి లో అక్రమ చొరబాటుదారులను చొప్పించడం వాజ్‌పేయిలాంటి అఖండ దేశభక్తుడు ఇష్టపడతారా?

ప్రతీ విషయాన్ని హిందూ కులాల పేరుతో చూస్తున్న  చేస్తున్న రాజకీయం వాజ్‌పేయి ఇష్ట పడతాడా? కాబట్టి సమకాలీన రాజకీయాల్లో వాజ్‌పేయి ఒక గీటురాయి. కానీ ఆదర్శాల ఆధారంగా రాజకీయాలు ఉండాలి. కానీ అలాగే ఉండాలి అనుకోవడం కూడా తెలివి తక్కువతనమే అవుతుంది. అది అత్యాశ కూడా!

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి