ప్రియమైన భారత పుత్రులారా! నాకు 72వ స్వాతంత్య్ర వేడుక జరపాలని మీరు ఉద్యుక్తలవుతున్న ఈ సమయంలో మీతో ముచ్చటించాలని అనిపిం చింది. అది 1921వ సంవత్సరం! అప్పుడే లోకం పోకడలు తెలుసుకొంటున్న 15 ఏళ్ళ వయసున్న చంద్రశేఖర్ తివారీ నాపై విపరీతమైన ‘తల్లిప్రేమ’ పెంచుకున్నాడు!! కొవ్వు బలిసిన తెల్లకాకులను ఇక్కడి నుండి తరిమి వేయాలని సత్యాగ్రహ పోరాటం తీవ్రంగా జరుగు తున్నది. ఈ సత్యాగ్రహం మోక్షక్షేత్ర మైన వారణాసిలో కూడా ఉధృతమైంది. ఇందాక చెప్పాను కదా! అక్కడే నా ముద్దు బిడ్డ ఈ చంద్రశేఖర్ అంత చిన్న వయసు లో బ్రిటీషువారికి వ్యతిరేకంగా ‘వందేమాతరం’ అన్నాడు. ముక్కు పచ్చలారని ఆ చిన్న బాలున్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
నీ పేరేమిటి? అని గర్జించాడు మెజిస్ట్రేట్
ఏ మాత్రం తొణకకుండా ‘ఆజాద్’ (స్వతంత్రుడు) అన్నాడు.
నీ తండ్రి పేరు ఏమిటో చెప్పగలవా?
స్వాధీన్...! అన్నాడు ఏ మాత్రం తడుముకోకుండా!
నీ చిరునామా! ఇస్తావా?
జైలుఖానా..! అంటూ జడ్జిని నివ్వెపరిచాడు చంద్రశేఖర్. అంతే ఆనాటి నుండి నా ఈ చిన్ని బాలుని ‘చంద్రశేఖర్ ఆజాద్’ గా పిలవసాగారు. ఇలాంటివెన్నో నన్ను దాస్యశృంఖలాల నుండి విముక్తి సమయంలో జరిగిన అపూర్వ సంఘటనలు...!! అంతెందుకు! నా మరో ముద్దు బిడ్డగా చెప్పే గాంధీని గురించి ఇక్కడెం దరో పొగడ్తల వర్షం కురిపించారు. అతనికి ‘జాతిపిత’ అని బిరుదు ఇచ్చారు. అతని విశ్వ విఖ్యాత భావనను ఆనాటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎంత గొప్పగా చెప్పాడో మీకు తెలుసా! “రక్త మాంసాలు గల ఇలాంటి వ్యక్తి భూమి మీద నడిచాడని ముందుతరాల వారు నమ్మలేరు” అన్నాడు. ఎంత గొప్ప వాక్యం! సత్యం, అహింస అనే రెండు ఆయుధాలను చేతిలో ధరించి రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం ధ్వంసం చేద్దామని కొల్లాయి గట్టాడే..! గాంధేయవాదం పేరుతో అతని ఆదర్శం ఇప్పటికీ ఈ దేశంలో జపించబడు తుంది.
కానీ స్వాతంత్య్రం పొందాక గాంధేయవాదం కాస్తా ‘గాంధీ వారసత్వం’గా మారుతుందని అతడు కూడా ఊహించలేకపోయాడు!? నేను ఈ దేశానికి ప్రధానిని అయితే రామరాజ్యం తేవడమే గాక మూడు అంశాలు తప్పక అమలు చేస్తానని మోహన్‌దాస్ ఎన్నోసార్లు చెప్పాడు. గోవధ నిషేధ చట్టం, సంపూర్ణ మద్య నిషేధం, భాషల పరిరక్షణ... ఈ మూడూ ఈ రోజుకూ వెర్రితలలు వేయడానికి కారణం ఎవరు? స్వాతంత్య్రం వచ్చాక అతని పేరుని ఎక్కి అధికారం సాధించారు కాని ఆదర్శా లు అమలుచేయలేదు. దేశ విభజన పేరుతో నన్ను మూడు ముక్కలు చేస్తే దాని నెపం మొత్తం గాంధీ తనపై వేసుకున్నాడు. మొన్నటికి మొన్న పత్రికల్లో ఒక వార్త చూసి నేను నివ్వెర పోయాను! టిబెట్‌లో ఉన్న నాపై ఎంతో అభిమానం చూపే బౌద్ధ గురువు దలైలామా చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. దేశం ముక్కలు కాకుండా నన్ను అఖండ భారత్‌గా ఉంచాలని గాంధీ ఆ రోజుల్లో, అవసరమైతే మహ్మదాలీ జిన్నాను ఈ దేశం గద్దెపై కూర్చోబెట్టాలని అనుకున్నాడట! కానీ ఆ గాంధీకి ముఖ్య అనుచరుడైన జవహర్‌లాల్ నెహ్రూ ‘ససేమిరా’ అన్నాడట!
అయినా ఆనాడు నా స్వేచ్ఛ కోసం ఎందరు ప్రయత్నించారు. వాళ్ళ ప్రాణాలను నాలో కలిపేశారు. ముక్కు పచ్చలారని ముగ్గురు యువకులకు అప్పటికి మీసాలు కూడా మొలవలేదు. నా కోసం, నా బిడ్డలందరి స్వేచ్ఛకోసం ఉరితాడును ముద్దాడిన రాజగురు, సుఖ్‌దేవ్ భగత్‌సింగ్‌లను 23 మార్చి 1931న కరకు బ్రిటీషు ప్రభుత్వం ఉరి తీసింది.
జిస్ మర్‌నే తే జగ్ డరే మేరే మన్ ఆనంద్
మర్‌న్ తేహి పాయే పూరణ్ పరమానంద్
ప్రపంచాన్ని భయపెట్టే మృత్యువు నా మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. మరణం ద్వారానే పరమా నందం కలుగుతుందని సంత్ కబీర్ మాటను భగత్‌సింగ్ పునరుద్ఘా టించి నా కోసం ప్రాణం విడిచి పెట్టాడు! ఎంత త్యాగం! ‘మీ రక్తం నాకు ఇవ్వండి మీకు స్వాతంత్య్రం నేను ఇస్తాను’ అంటూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన మరో నా ముద్దు బిడ్డ నేతాజీ సుభాస్‌చంద్రబోస్‌కు పుట్టుక తప్ప చావులేదు! “స్వాతంత్య్రం మీరు ఇచ్చేదే మిటి! అది నా జన్మ హక్కు’ అని నిర్భీతిగా ప్రకటించిన లోకమాన్య బాల గంగాధర తిలక్ అంత వృద్ధాప్యంలో కూడా మాండలే జైలులో శిక్షననుభవిం చిన దృశ్యం తలచుకుంటే నా కళ్ళ నుండి ఆశ్రువులు ఆగడం లేదు.
అలాగే మరో ముద్దుబిడ్డ వీర సావర్కర్ కూడా దాస్య విముక్తం చేయడం కోసం అండమాన్ దీవుల్లో సెల్యు లార్ జైలు శిక్ష అనుభవిం చాడు కదా! వీళ్ళందరినీ ప్రేరేపించిన ఓ గొప్ప మంత్రం వందేమాతరం! నన్ను స్మరించే ఈ మంత్రం రాసిందెవరో తెలుసా! అయినా ఎందరు నా కోసం త్యాగం చేశారు. గిరీంద్ర చంద్రశే ఖర్ బోస్, నానా సాహెబ్, లాలాలజ పతిరాయ్, రాంప్రసాద్ బిస్మిల్, వాసుదేవ బలవంత్ ఫడ్కే, అనంత లక్ష్మణ, మదన్ లాల్ థింగ్రా, బాజీ ప్రభు, యతీంద్రనాథ్ దాస్, సర్దార్ ఉద్యంసింగ్, అరవింద్ ఘోష్, ఝన్సీలక్ష్మీబాయి, తాంతియా తోపే, అస్ఫఖు ల్లాఖాన్, అల్లూరి సీతారామ రాజు, వీర పాండ్యకట్ట బ్రహ్మన వంటి ఎందరో నా ముద్దు బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఈ దేశం కోసం వదిలి పెట్టారు. ఇంత గొప్ప సాధనతో, బలిదానంతో సాధించు కొన్న నా స్వేచ్ఛను ధ్వంసం చేస్తున్న కొందరు కుపుత్రులను చూసి నాకు మళ్ళీ దుఃఖం కలుగు తోంది.
తమ అవసరాల కోసం నా బిడ్డలే భాషాభేదాలు, ప్రాంతీయ నినాదాలు, ప్రాదేశిక హద్దులు, కులం, మతం... అన్నీ వాడుకుంటూ నాకు శిరోభారం కలిగిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎవరు కలిగించినా ఎందరో నవ యువకులు నన్ను అనేక రూపాల్లో ఆరాధిస్తున్నారు. గంగగా, గోవుగా, గీతగా, భారతమాతగా నన్ను పూజిస్తున్నారు. అదే నాకు వెయ్యేనుగుల బలం. మీరంతా నన్ను ఎప్పుడూ మది లో పెట్టుకొనేందుకు ఓ దేశభక్తుడు చెప్పిన రెండు మాటలు చెప్పి ముగిస్తా ను. “యవ్వనం లోనే దేశ భక్తి పిచ్చి మనసు నిండా ఉంటుం ది. తర్వాత ఉడుకునెత్తురు ఇలా ప్రవహిస్తుందో, లేదో”!!
*************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం : విజయక్రాంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి