శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా॥
సిద్ధలక్ష్మీ.. మోక్షలక్ష్మీ.. జయలక్ష్మీ.. సరస్వతీ.. శ్రీలక్ష్మీ.. వరలక్ష్మీ.. ఆరుగురే లక్ష్మీదేవతలు. కాలక్రమంలో సంతానలక్ష్మీ, గజలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, విజయలక్ష్మీ అనే పేర్లు పెట్టి మొత్తం ఎనిమిది మంది తల్లులను సృష్టించారు. పై శ్లోకం నిరంతరం మనం చదివే మంత్రపుష్పం చివర్లో ఉంటుంది. అది ప్రామాణికం అయితే భక్తి తీవ్రత  ఆ వరలకే్ష్మ ఇన్ని రూపాలను ధరించింది.! సర్వ శుభలక్షణం స్వరూపిణి మంగళదేవత అయిన శ్రీలక్ష్మీదేవి సంపదలకు అధినేత్రియై ప్రజలకు సకల శుభాలనిచ్చే మంగళమూర్తి. ఆమెను ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా ఆరాధిస్తాం.
స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై అధివసించి తన విభూతులను ప్రపంచానికి అందిస్తుంది. నారాయణుడి అనపాయిని (వీడనిది)గా, అనుపగామినిగా (వదలకుండా అనుసరించేది) ఉండి, ఆయన విజయాలలో భాగస్వామిగా నిలిచింది. సకల లోకాలకు  ‘శాంతిని కలిగించే’ ‘శ్రీమన్నారాయణ క్రీడకు’ లక్ష్మీదేవి అండగా నిలుస్తూ  ఆ ‘శ్రీ’ మూర్తిలా, ‘స్త్రీ మూర్తు’లంతా పురుషార్ధం సాధించే తమ భర్తలకు అండగా నిలవాలని సూచిస్తుంది.
దేవి శక్తులన్నింటికీ మూలమైంది శ్రీలక్ష్మీదేవి. అన్ని శక్తులను మించిన శక్తి ఈమే! లక్ష్మీదేవి శ్రీరూపంగానూ, లక్ష్మీరూపంగానూ చూస్తాం. ఈ శక్తులు రెండు విడిగా ఉన్నా, ఒకటిగా ఉన్నా రెండూ ఉన్నట్లే! ఈ రెండు రూపాల్లోనూ వీరు విష్ణు భగవానుని భార్యలే! ఈమె దయను కొద్దిగా సంపాదించిన వ్యక్తి కూడా ధనవంతుడు అవతాడు. లక్ష్మీదేవి పద్మవనంలో నివసిస్తుంది. పద్మంలో కూర్చుంటుంది. పద్మాన్ని ధరిస్తుంది.సమస్త సంపదలకూ అధిష్ఠాన దేవత అయిన శ్రీదేవి శుద్ధమైన సత్తతత్తం కలది. వికారాలకు, దోషాలకు అక్కడ ప్రవేశం లేదు. భగవంతుడు అవతారమెత్తినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా అవతరించి ఆయన చూపే లీలల్లో సహాయపడుతూంటుంది. 
అలాంటి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించే మాసం శ్రావణమాసం. విత్తనాలను భూమి తల్లి గర్భంలో బీజావాపనం చేసి, భవిష్యత్తులో తమకు చక్కని‘ధాన్యం’ ఫలంగా ఇవ్వాలని, వ్యవసాయిక దేశంలో లక్ష్మిని ఆరాధించడం సంప్రదాయం. ‘ధనం మూలమిదంజగత్’  అన్నట్లు ఈ లోకంలో మానవుల సుఖభోగాలకు ఆధారభూతంగా ‘లక్ష్మీకటాక్షం’ కోరడం ఈ మాస ఆరాధనలో ప్రత్యేకత. అదీ లక్ష్మీదేవిని వరాలిచ్చే తల్లిగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించే పర్వదినమే శ్రీ వరలక్ష్మీ వ్రతం.
వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు?
ఈ వ్రతానికి తిథి, వార, నక్షత్రాల పట్టింపులు లేవు. భక్తితో ఎవరు ఆచరించినా మేలే జరుగుతుంది.
వ్రతం ఏర్పాట్లు
శ్రీలక్ష్మిని పూజించే ప్రదేశంలో చక్కని అలంకరణ చేయాలి. పూజ కోసం వరలక్ష్మిని స్థాపించే పీఠంపై దేవతాహ్వాన లాంఛనంగా ‘పద్మం ముగ్గు’ వేయాలి. ఈ రోజుల్లో తయారుచేసిన అమ్మవారి  విగ్రహాలు దొరుకుతున్నాయి. తమ శక్తికొలది బంగరం, వెండి, రాగి మొదలైన వాటిలో ఏదో ఒక విగ్రహాన్ని చక్కగా అలంకరించుకొని స్థాపించడం ఒక పద్ధతి లేదా కొబ్బరికాయకు కళ్లు, ముక్కు, చెవులు దిద్దుకొని వస్త్రాలు ధరింపచేసి విగ్రహం తయారుచేసుకోవచ్చు. మరికొందరు ఈ కొబ్బరికాయకే అమ్మవారి ముఖ భాగాన్ని అతికించి అలంకరణ చేస్తారు. 
ఈ కథలోని అంతరార్థం
ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని ప్రేమించాలి, వారి అభిమానం చూరగొనాలి. అలాగే తన తోటి స్త్రీలను ఇంటికి ‘పసుపుబొట్టు’కు పిలవడం వల్ల సామాజిక సంబంధాలను పటిష్టం చేసుకోసుకోవాలి. డబ్బును ఎల్లప్పుడూ పూజించాలి  గౌరవించాలి. అప్పుడే దాని విలువ మనుషులకు తెలుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందగల్గుతారు.
మంగళ స్వరూపిణీ..
ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ విజయలక్ష్మి! విద్యాలక్ష్మి.. ఆమెయే సరస్వతి..! ఎక్కడ ధనధాన్యరాసులుంటాయో అక్కడ ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి..! ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యలక్ష్మి..! ఎక్కడ ఆనందం.. శాంతి.. సుఖం.. తాండవిస్తాయో అక్కడ.. ఆనందలక్ష్మి!
ఆమె నారాయణీ.. సౌభాగ్యదాయినీ.. మంగళ స్వరూపిణీ: అలాంటి లక్ష్మీ అనుగ్రహసిద్ధి కోసం స్త్రీలు వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. తన తోడు  నీడ అయిన పురుషుని ఆయుష్షును కాపాడాలనీ.. తన కుటుంబం ఆరోగ్యం.. ఆనందం .. ఉన్నత స్థితి..అదృష్టం, దాతృత్వం పొందాలని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతం ఆచరిస్తుంది. ఈ వ్రతం ఆచరించడానికి కులభేదం లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. తమ శక్త్యానుసారంగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఆచరించాలి, పూజలోని తత్వాన్ని గ్రహించడం ప్రధానం. స్త్రీలలోని మాతృశక్తిని చైతన్యం చేసే వ్రతం ఇది. 
లక్ష్మీదేవి సహజాలంకార భూషితురాలు. కృతకంగా చేసే పూజకన్నా, నిర్మల మనస్సుతో ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో, వస్తువులతో చేస్తే ఆమెకు మరింత ప్రీతికరం. స్త్రీల మధ్య బంధం పెనవేసే వ్రతం ఇది. పసుపు పరస్పరం పంచుకోవడం వల్ల మనుషుల్లోని మనసుల్లోని కల్మషాలు నశించి ‘లక్ష్మీప్రదం’ అవుతుంది.
వరలక్ష్మీ  మూలం...!
నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైన మునులను ఉద్దేశించి సూతమహర్షి చెప్పిన వ్రతకథ ఇది. స్కాంద పురాణంలో ్ర‘స్తీలకు సౌభాగ్యం, ధనం, భూమి, విద్య, ప్రీతి, కీర్తి, తుష్టి, పుష్టి, శాంతి కలిగించే ఓ గొప్ప వ్రతం ఏదైనా చెప్పాలని పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థిస్తే, శివుడు ఈ లోకానికి అందించిన సౌభాగ్య ఆరాధన వరలక్ష్మీ వ్రతం. అష్టుశ్వైర్యాలకు ప్రతీక అష్టలక్ష్మీ సమష్టిరూపమైన తల్లి వరలక్ష్మి. పరమేశ్వరుడు విష్ణుపత్ని అయిన ‘లక్ష్మీ ఆరాధన’ ఈ లోకానికి అందించి హరిహరాద్వైతం ప్రకటించాడు. లక్ష్మీణివూర్వతుల సమన్వయం కూడా ఇందులో కన్పిస్తుంది. స్త్రీలు తమ తోటివారితో సఖ్యత ఎలా పాటించాలో చెప్పే సందేశం ఇందులో ఉంది.
శ్రీ మహాలక్ష్మ్యష్టక  స్తోత్రం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే || 1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 2 ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 3 ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 4 ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే || 5 ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 6 ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 7 ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 8 ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 9 ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్‌ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||10 ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్  ప్రసన్నా  వరదా శుభా ||11||


***************************************
  డాక్టర్. పి. భాస్కర యోగి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి