అమెరికాలో ఉన్న తమ కొడుకును చూద్దామని ఓ వృద్ధ దంపతులు అక్కడికి టూరిస్ట్ వీసాపై వెళ్లారట. అక్కడే ఉద్యోగం చేస్తున్న ఆ కొడుకు స్నేహితుడు తల్లిదండ్రులతోపాటు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. వాళ్లింట్లో భోజనం ముగించి, చేయి కడుక్కునేటపుడు తండ్రి చెవిలో కొడుకు మెల్లగా- ‘నాన్నా! మనం వీళ్లింట్లో భోజనం చేసినందుకు మా స్నేహితుడికి థాంక్స్ చెప్పు’ అన్నాట్ట. వెంటనే ఆ పెద్దాయన ‘బాబూ! మాకు మంచి భోజనం పెట్టినందుకు థాంక్స్’ అన్నాట్ట. ఆ తర్వాత టూరిస్ట్ వీసా గడువు ముగియగానే వృద్ధులు భారత్‌కు వచ్చేశారు. 

కొన్నాళ్లకు కొడుకు తండ్రికి ఫోన్ చేసి ‘‘నాన్నా! మనకు భోజనం పెట్టిన నా స్నేహితుడు ఇండియాకు పనిమీద వస్తున్నాడు. ఓ పది రోజులు మనింట్లోనే ఉంటాడు. మీరు అతడిని బాగా చూసుకోవాలి’’ అని చెప్పాడు. ఆ అబ్బాయి వచ్చి పది రోజులు ఈ వృద్ధ దంపతుల దగ్గరే ఉండి తన పనులు చేసుకొన్నాడు. వాళ్లు అతనికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. తిరిగి అతను వెళ్లిపోయేముందు కార్లో కూర్చోవడానికి వెళ్తుంటే ఈ వృద్ధుడు ‘‘బాబూ! మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించినందుకు థాంక్స్’’ అన్నాడట. వెంటనే అతను-‘ఇదేమిటి..? ఆ రోజు అమెరికాలో మా ఇంట్లో భోజనం చేసినపుడు మీరే థాంక్స్ చెప్పారు. ఈ రోజు నాకు భోజనం పెట్టి మీరే థాంక్స్ చెబుతున్నారు’ అన్నాడట. 

ఈ దేశంలో అన్నం తిన్నవాళ్లకే పెట్టినవారు థాంక్స్ చెబుతారు. ‘అతిథి దేవోభవ’ అన్న ప్రాథమిక సూత్రం నుండి ఇది పుట్టింది. ఇదే భారతీయ సంస్కృతి అన్నాడట. ఈ భారతీయ సంస్కృతి ప్రాచీనమైనదేగాక, మహోన్నతమైనదని ప్రాచ్యులే గాక, ఎందరో పాశ్చాత్యులు కూడా తమ అభిప్రాయం వెలిబుచ్చారు.

కేవలం 15 ఏళ్లు ఇరాన్‌ను ముస్లింలు పాలిస్తే అక్కడంతా ఇస్లాం వ్యాప్తి చెందింది. 17 ఏళ్లు ఇరాక్‌ను ముస్లింలు తమ ఆధీనంలోకి తీసుకుంటే అక్కడ ఇస్లామిక్ కల్చర్ అభివృద్ధి చెందింది. అలాగే 21 ఏళ్ళు ఈజిప్టును ఇస్లాం స్వాధీనం చేసుకుంటే అక్కడ అంతా ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది. యూరప్‌ను 50 ఏళ్ళు క్రైస్తవులు పాలిస్తే అదంతా క్రైస్తవమయమైంది. దాదాపు 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు ఆంగ్లేయుల రూపంలో క్రైస్తవులు పాలించినా భారత్‌లో హిందూ జాతీయత తట్టుకొని ఎలా నిలబడగలిగింది అన్నది ఇవాళ్టి భేతాళ ప్రశ్న!?

భారతీయత ఇక్కడే కాదు.. ప్రపంచానికే వెలుగు చూపింది. క్రొత్తగా పుట్టిన అన్ని మతాలకూ ఆధారమైంది. ఇందులోంచి స్వీకరించినవి కొన్ని, స్వీకరించకూడదనుకొన్నవి మరికొన్ని- ఇవే ఆయా మతాల ప్రాథమిక సూత్రాలయ్యాయి. అందుకే భారతీయ నాగరికత, సంస్కృతుల వైశిష్ట్యాన్ని ఇష్టం ఉన్నా, లేకున్నా మాక్స్ ముల్లర్ లాంటివాడు ‘‘జ్ద్ఘీఆ నిశజూజ్ఘ ష్ఘశ ఆళ్ఘష్ద ఖఒ?’’ అనే పేరుతో ఉపన్యాసాల పరంపరను పాశ్చాత్య దేశాలకు అందించాడు. హిందూ ప్రాచీన సంస్కృతి ముందు గ్రీకుల, రోమనుల, అరబ్బుల, పారసీకుల సంస్కృతుల ‘బోన్సాయ్’ మొక్కలే! ప్ర పంచంలోని ఎన్నో మ తాలకు, సంస్కృతులకు, నాగరికతలకు ఇక్కడి నుం చే జీవం అందింది. ఇప్పటికీ ఎన్నో దేశాలు మతం ఆధారంగా మనకు సరిపోలకున్నా సంస్కృతిని అలాగే ఉంచుకొన్నాయి. 

ఇండోనేషియా ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం. అక్కడ రామాయణ ఘట్టాలను తెలిపే ‘రామ్‌లీల’ ఏటా జరుగుతుంది. ఎన్నో భారతీయ గ్రంథాలు ఇతర దేశాలకు దిక్సూచి అయ్యాయి. జర్మన్‌లో వాళ్ల వైద్య విభాగంలో ఒకదానికి చరకుడి పేర ‘చర్కాలజీ’ అని పేరు పెట్టుకున్నారు. 
ఇండోనేషియా వాళ్ల ఏయిర్‌వేస్‌కి ‘గరుడ’ అనీ, వాళ్ల కరెన్సీ నోట్లపై ‘గణేశుడి’ బొమ్మను చిత్రించుకొన్నారు. బుద్ధుడు పుట్టిన ఈ నేల నుండి ధ్యాన విద్య ప్రపంచంలోకి వెళ్లింది. దీని ప్రభావంతోనే పాశ్చత్య దేశాల్లో ‘జెన్‌సాధువులు’ పుట్టుకొచ్చారు. వాళ్లలో అన్నీ మన అవధూతల లక్షణాలే.

ఆధునిక కాలంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనం కోసం 31 మే 1893లో చికాగో వెళ్లారు. ఆధునిక, ప్రాచీన మహర్షుల సందేశాన్ని, ఇక్కడి మహాభక్తుల సందేశాన్ని, వేదాంత సారాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందదే. స్వామి హైందవాలయాలకు, బౌద్ధ ఆరామాలకు వున్న సారూప్యాన్ని గమనించాడు. 

జపాన్‌లోని టోకియో, యోకోహామాలను చూసి హైందవ బౌద్ధ సంస్కృతుల విశాలత్వాన్ని పరిశీలించాడు.
వివేకానందుడు చూపిన బాట వల్ల ఆయన తర్వాత ఎందరో పాశ్చాత్య దేశాల బాట పట్టారు. స్వామి రామతీర్థ అద్వైతామృత రసాన్ని పాశ్చాత్యులకు పంచిపెట్టి మత్తులో ముంచాడు. 

వివేకానందుడు పాశ్చాత్య దేశాలకు వెళ్లి వచ్చాక 25 ఏళ్ల తర్వాత మరొక గొప్ప యోగి పరమహంస యోగానంద అమెరికాలో అడుగుపెట్టాడు. ఆయన యోగుల జీవితాలను, శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి రచించిన ‘ఎ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ (ఒక యోగి ఆత్మ కథ) ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదించబడి లక్షలాది కాపీలు అమ్ముడుపోయింది. పాశ్చాత్య సమాజంపై ఈ గ్రంథం ప్రభావం అనన్య సామాన్యం.

పాశ్చాత్య పాత్రికేయుడు, ఆధ్యాత్మిక పరిశోధకుడు పాల్ బ్రంటన్ రాసిన ‘ఏ సీక్రెట్ సెర్చ్ ఇన్ ఇండియా’- ‘రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అనే్వషణ’ అన్న పుస్తకం పాశ్చాత్యులను భారత్ వైపు నడిపించింది. మేడం బ్లావెట్ స్కీ, సిస్టర్ నివేదిత వంటి ఎందరో ఈ సంస్కృతిపై మక్కువ పెంచుకొని ఈ మట్టితో మమేకమయ్యారు. కానీ పాల్ బ్రంటన్ తన రచన కోసం భారతదేశం అంతా ఓ హేతువాదిలా, అనే్వషణ చేస్తాడు. ఎందరో సిద్ధ పురుషులను కలుస్తాడు. చివరకు రమణ మహర్షి దగ్గర అతడు శాంతి పొందుతాడు. ఆ తర్వాత రమణ మహర్షి పాశ్చాత్య ప్రపంచంలోకి విస్తరింపబడినాడు. 

జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, స్వామి రామల తమ గ్రంథాలు, సాధనల ద్వారా పాశ్చాత్య లోకాన్ని ఆకర్షించారు. ఈ రోజుకూ అరుణాచలంలో ఎప్పుడూ విదేశీయులు కన్పిస్తారు. పాశ్చాత్యులను విశేషంగా ఆకర్షించిన వారిలో నిసర్గదత్త మహారాజ్ ఒకరు. గొప్ప ఆత్మజ్ఞానిగా పేరొందిన ఆయన ఇల్లు చిన్న సందులో ఉన్నా, విమానాలు దిగి నేరుగా ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చేవారు.

ఓషోగా పేరొందిన ఆచార్య రజనీశ్ చెప్పినంతగా ప్రాచ్య- పాశ్చాత్యుల వేదాంతం మరెవరూ చెప్పలేదు. వందలాది మంది తత్త్వవేత్తలను ఆయన ఆధ్యాత్మిక లోకానికి రుచి చూపించాడు. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో చర్చిలను కొనుగోలు చేసి కృష్ణ మందిరాలుగా మార్చుతున్న ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి.్భక్తివేదాంతస్వామి పాశ్చాత్య ప్రపంచాన్ని కృష్ణమయం చేస్తున్నారు. 

తన ప్రౌట్ ఫిలాసఫీ ద్వారా ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ సృష్టించిన ప్రభాత్ రంజన్ సర్కార్ సిద్ధాంతం పాశ్చాత్యులను శివయోగం తెలుసుకొనేలా చేసింది. అతి పెద్ద సంస్థగా బ్రహ్మ బాబా స్థాపించిన బ్రహ్మకుమారీస్ ఎలా సముద్రాలను దాటి దూసుకుపోతుందో మనం కళ్లారా చూ స్తున్నాం. భగవాన్ సత్యసాయి పాశ్చాత్యులకు భక్తి పరిమళాలను పంచిపెట్టారు. మహర్షి మహేశ్ యోగి పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలను స్థాపించారు.

రాం దేవ్, శ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి ఇవాళ ఆధ్యాత్మిక క్షేత్రంలో అందుకోలేనంత దూరం నడిచారు. ఇదంతా భారతీయం. ఈ రోజుకూ మన కళ్లముందు సంచరించే యోగులు ఎందరో ఉన్నారు. వారు వేస్తున్న నైతిక బీజాలు సమాజాన్ని నైతిక చట్రంలో బంధిస్తున్నాయి. నిరాహార యోగినిగా మాతా మాణికేశ్వరి సాత్విక ఆహార ప్రాధాన్యం లోకానికి అందిస్తున్నారు. 

ఆత్మజ్ఞానిగా శ్రీ గురు గెంటేల వెంకటరమణ ప్రేమను పంచుతున్నారు. మనం జీవించి ఉన్న గురువులను పట్టించుకోం. వెంకటరమణులు మరో రమణ మహర్షిలా తత్త్వ ప్రబోధం చేస్తున్నారు. వారి ‘ఆత్మబోధ’ మనం అనుకునే - చెప్పుకొనే గొప్ప గురువులకేం తీసిపోదు.

ఇలా ఎందరో పాశ్చాత్యులు మనవైపు చూస్తుంటే, ఇక్కడివారు మాత్రం అస్తమిస్తున్న సూర్యుని కోసం అటువైపు ముఖం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ల పేరుతో కొందరు విపరీతమైన మత మార్పిడి జరుపుతూ దేశంలో అంతర్గత శాంతి లేకుండా చేస్తున్నారు. అక్కడ అమ్ముకొన్న చర్చిల ధనాన్ని ఇక్కడ విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. మోదీ అధికారంలోకి వచ్చి ఎన్జీవోలను కట్టడి చేయగానే ఆయా సంస్థల కార్యకలాపాలు తగ్గిపోయాయి. దాంతో మోదీపై కత్తిగట్టిన ఈ గ్యాంగంతా ఇప్పుడు కులం ఉచ్చును కార్యాచరణగా ఎంచుకొన్నాయి.

 ఎక్కడైనా పార్టీలపై కక్ష ఉంటుంది గాని వ్యక్తులపై యుద్ధం చేస్తారా? రకరకాల క్రొత్త అస్తిత్వాలను సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించేటట్లు చేసి, ఇక్కడి హిందువులను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలు చేయడమే కొందరు పనిగా పెట్టుకొన్నారు. ‘ఒలింపిక్స్‌లో మొదటి బహుమతి పొందిన ఛాంపియన్ ఇంటివెనుక గుంతలో పడి చచ్చినట్టు’ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే- మన మేధావులు మాత్రం ఉదయం లేచింది మొదలు హిందూత్వను ఎలా బోనులో నిలబెట్టాలని చూస్తున్నారు. 

గజనీ, ఘోరీ, నాదిర్షా, ఔరంగజేబులే హిందూ మతాన్ని ఏమీ చేయలేకపోయారు. మార్క్స్, మావో చతికిలబడ్డారు. ఇపుడు కొన్ని ‘మిణుగురు పురుగులు’ దాడి చేస్తే- సహించే శక్తి ఈ దేశానికి ఉందనేది చారిత్రక సత్యం.


************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి