చరిత్రను, సంస్కృతిని కలగాపులగంగా మార్చి ఇది ‘మిశ్రమ సంస్కృతి’ అంటూ దబాయించే పనికి కంకణం కట్టుకొన్న ‘స్వయం ప్రకటిత’ మేధావుల కబంధ హస్తాల నుండి ఇప్పుడిప్పడే విముక్తి కలుగుతున్నది. ఇటీవలి కాలం వరకు రొమిల్లా థాపర్, రామచంద్ర గుహ లాంటి ‘ఒంటి కన్ను శుక్రాచార్యుల’ చేతిలోబడి అష్టవంకరలు తిరిగినట్లే తెలంగాణ సాంస్కృతిక వైభవానికి లేని ‘ఊదుపొగ’ వేసేవారు ఎక్కువయ్యారు. 

భారతగడ్డపై వెలిసిన ప్రాచీన ‘సాంస్కృతిక వైభవం’ కలిగిన ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం చెప్పుకోదగింది. ఆ వైభవానికి మూలభూతమైన సంస్కృతి, చరిత్ర, కళలు, భాష, సాహిత్యం.. అన్నీ ఈ నేలలో తడిమిచూస్తే ఓ సౌందర్యానుభూతి, సాంస్కృతిక పరిరక్షణ ఏక కాలంలో కలుగుతాయి. ఇక్కడి గోపరాజుల కాలం క్రీ.పూ.300 నాటి నాణాల్లో ‘నారన’ అన్న పేరు కన్పిస్తుంది. ఇందులోని అన్న ‘శబ్దమే’ తొలి తెలుగు మాటగా గుర్తించాలని చెప్తారు. అదే విధంగా ప్రాకృత భాషలో ‘గాథాసప్తశతి’ రచించిన హాలుడు క్రీ.శ.61లోనే అత్త, పిల్ల, పత్తి లాంటి తెలుగు పదాలు వాడడం ఇక్కడి భాష ప్రాచీనతను తెలియజేస్తుంది. క్రీ.శ.947 నాటి ‘కుర్క్యాల శాసనం’లోని కంద పద్యాలు ఇక్కడి సాహిత్య వైభవపు తొలి అడుగులను సూచిస్తాయి. ఇది తెలుగువారి వైభవమే.

భారతాంధ్రీకరణ చేసిన నన్నయ భట్టు సహాధ్యాయి నారాయణ భట్టు కన్నడ- తెలంగాణ ప్రాంత సరిహద్దువాడని పరిశోధకులు చెబుతున్నారు. తిక్కన సోమయాజి కాకతీయ గణపతి దేవుడి సహాయమర్థించి భారతానువాదం చేసినట్లు చెప్తారు. ‘ఆదికావ్యం’ పేరుతో తెలంగాణకు చెందిన పంపకవి జైనతీర్థంకరుల్లో ప్రథముడైన వృషభదేవుడి చరిత్ర రాయగా, శాపానుగ్రహ సమర్థడైన వేములవాడ భీమకవి గొప్పతనం మనకు తెలియనిది కాదు.

 నీతిశాస్త్రాన్ని అందించిన బద్దెకవి, వ్యాఖ్యాతృ చక్రవర్తిగా పేరొందిన మల్లినాథ సూరి, దేశికవిత్వాన్ని అందించి ధృవతారగా నిల్చిన పాల్కురికి సోమనాథుడు, మందార మకరంద సంశోభితమైన పోతన, సంకీర్తనలకు 12వ శతాబ్దంలోనే బాటలు వేసిన సింహగిరి కృష్ణమాచార్యులు, ఉత్తరాది రాగాలను తెలుగువారికి అందించిన రామదాసు, అచ్చతెలుగులో కావ్యం రచించిన పొన్నగంటి తెలగన్న, ద్విపద రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి, హుళక్కి భాస్కరుడు, కొఱవి గోపరాజు, కాసె సర్వప్ప, మారన, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, కుప్పాంబిక, కొలని రుద్రదేవుడు, మడికి సింగన, తిమ్మకవి, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు వంటి మహాకవులందరి యోగదానం ఈ నేలలో నిండి నిబిడీకృతమై ఉంది. అలాగే రాకమచర్ల వెంకటదాసు, దున్నన్నద్దాసు, చెర్విరాల బాగయ్య, శివరామ దీక్షితులు, భాగవతుల కృష్ణదాసు, తల్లావఝల జాలమాంబ వంటివారు తెలంగాణ ఆధ్యాత్మిక, తత్వధారను రక్షించినవారే. ఆధునిక కాలంలో దాశరథి, కాళోజీ, సినారె, వానమాములై వరదాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, దేవులపల్లి, గడియారం, గంగుల సాయిరెడ్డి వంటి వారెందరో ఇక్కడ సాహితీ సుగంధాలను వెదజల్లారు.

తెలంగాణ ప్రాంతాన్ని దేవగిరి నుండి కంచి వరకు విస్తరించి అఖండ ‘కాకతీయ సామ్రాజ్యానికి’ తనవంతు సహాయం చేసి చరిత్రలో నిలిచిన గణపతిదేవుడు, సామంతులను నిలువరించి ఆ వైభవాన్ని కాపాడిన వీరనారి రుద్రమదేవి, తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవం నిలబెట్టేందుకు తన ప్రాణాలర్పించిన ప్రతాపరుద్రులు మొదటి అమరవీరుడు. క్రీ.శ.1321లో గోలుఘ్‌ఖాన్ సైన్యాన్ని నిలువరించిన కొలని రుద్రదేవుడు, అన్నదేవుడు తెలంగాణ ప్రాంతాన్ని రక్షించిన వీరులు. క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక హిందూ రాజ్యభావన కలిగించిన ముసునూరి ప్రోలయ నాయకుడు, ముసునూరి కాపయ్య నాయకుడు, ఇక్కడి ప్రజలను రక్షించే వ్యూహాలుపన్నిన బెండపూడి అన్నమంత్రి, రేచర్ల సింగమనేడు, మహామంత్రి మాదన్న, రాజాకిషన్ ప్రసాద్ వరకు అందరూ ఈ నేలకోసం తపించినవారే. అలాగే అనపోత, మాదానాయకుల త్యాగం, వినాయక దేవుడి అసమాన శౌర్యం మరువలేనిది.

తెలుగుజాతికి అత్యద్భుత శిల్పాన్ని అందించి, పాశుపత శైవాన్ని రక్షించి, జాయప సేనాని ద్వారా సంగీత, నాట్యాలకు సంబంధించిన నృత్తరత్నావళి వెలువరింపజేసి, ఆస్థాన కవి విశ్వనాథుని ద్వారా ‘ప్రతాపరుద్రీయం’ అనే అలంకార గ్రంథం అందించిన కాకతీయుల సేవలను ఈ ప్రాంతం ఎంతగా ఆదరించిందో వారిని ఎదురించి నిల్చిన చిన్న సామంతులు సమ్మక్క- సారక్క, జంపన్నలను అలాగే స్మరించింది.

గుణాఢ్యుడు, మల్లియరేచన, కాకునూరి అప్పకవి, సురభి మాధవరాయలు, అన్నంభట్టు ధర్మపురి శేషప్ప, మరింగంటి కవులను ఏ స్థానంలో పెట్టుకొన్నారో వేపూరి హనుమద్దాసు, ఉదారి నాగదాసు, మత్కిదాసు, సిద్ధప్ప వరకవి, ఈగ బుచ్చిదాసులకు అదే స్థానం ఇచ్చిన రసహృదయులు ఈ ప్రాంతవాసులు. గద్వాల, ఆత్మకూరు వంటి సంస్థానాల్లో ఎందరో ఇతర ప్రాంత కవులు పోషింపబడినారు. అలాగే రాజకీయంగా బహుమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించినా, వారిలోని మతదృక్కోణాన్ని ధిక్కరించి ఇబ్రహీం కులీకుతుబ్‌షా(1550-1580)ను మల్క్భిరామునిగా అభివర్ణించి- అద్దంకి గంగాధరుడు తపతీ సంవరణోపాఖ్యానం అంకితంగా అందించాడు. అబుల్‌హసన్ తానీషా (1672-1687) సంస్థానంలో రాజోద్యోగిగా ఉండి తన విశేషమైన ‘రామభక్తి’తో అత్యద్భుతమైన భద్రాచల రామాలయాన్ని నిర్మించాడు కంచర్ల గోపన్న.

అందరూ విగ్రహారాధనను నవరాత్రుల్లో చేస్తే తెలంగాణ ప్రజలు పూలతో నిర్గుణ బతుకమ్మను పేర్చి, ఆమెను శ్రీచక్రంపై ప్రతిష్ఠించిన స్ర్తిమూర్తిగా, శ్రీమూర్తిగా అర్చిస్తారు. ఇక్కడ సాత్వికమైన భోజనంతోపాటు దేశ విదేశాల రుచులను తనలో కలుపుకున్న ప్రజలు కన్పిస్తారు. సాదాసీదా మనుషులు, కల్మషం లేని హృదయాలు, గ్రామదేవతారాధన, నమ్మకాలు, ప్రకృతిలో మమేకమయ్యే పండుగలు ఈనేల అంతటా ఒకేలా ఉంటూ వైవిధ్యం క్రొత్తదనాన్ని చూపెడుతుంది. పోతన భాగవతానికి ఎంతలా పరవశిస్తారో, ఈ మట్టి మనుషుల మనసుల నుండి వెలువడిన జానపదాల్లో, భజన కీర్తనల్లో, తత్వాల్లోని సాహిత్యం చూసి అదే స్థాయిలో మురిసిపోతారు. జానపదాల సజీవ భాష ఈ రోజు ఎల్లలు లేకుండా అన్ని ప్రాంతాలకూ సోకింది. మాటకో సామెత, తట్లు (పొడుపు కథలు) ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు ఇక్కడి సాహిత్య సంపదను తెలియజేస్తాయి. 

విద్యాగంధం లేని వారిని సైతం విలువగట్టే సాంస్కృతిక ధార ఇక్కడి ప్రజలకున్న సాహిత్య శ్రద్ధను తెలియజేస్తాయి. సామాన్య గ్రామీణ స్ర్తిలు వినిపించే బతుకమ్మ, ఉయ్యాల, మంగళహారతి పాటలు ఈనాటికీ అందర్నీ అలరిస్తున్నాయి.

క్రీ.శ.1323లో కాకతీయుల కళావైభవం ప్రభ తగ్గి సుమారు 600 ఏళ్లు బానిసత్వపు ఛాయల క్రింద బ్రతుకులీడ్చినా ఇసుమంతైనా తమ అస్తిత్వం కోల్పోకుండా ఈ సాంస్కృతిక వైభవాన్ని ఏదో రూపంలో ఇక్కడి ప్రజలు కొనసాగించారు. రజాకార్లను పోషించిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో యుద్ధానికి దిగిన రామానంద తీర్థ, పండిట్ నరేంద్రజీ, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నర్సింగరావు, ఎం.చెన్నారెడ్డి, కమలమ్మ, అహల్యాబాయి, ఎంఎస్ రాజలింగం, దాశరథి వంటి ఉద్ధండులకు ఇచ్చే గౌరవం చాకలి ఐలమ్మ, పూలమ్మ, కొమ్రం భీం, మొగిలయ్య గౌడ్, షోయబుల్లా ఖాన్‌లు కూడా నిస్సంకోచంగా పొందారు. మాలికాఫర్‌కు ఎలా ఎదురొడ్డి నిల్చారో ఖాసీం రజ్వీకి అలాగే ఎదురు నిలిచిన తెగువ ఇక్కడి చరిత్రకుంది. 

తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఏకపక్షం కాదు. దానికున్న విభిన్న పార్శ్వాలు, కోణాలు దానిని అణచివేసినా తిరిగి లేచే ‘సజీవ లక్షణం’ మనకు ఎల్లెడలా కన్పిస్తుంది. దీని మూలం తెలంగాణ నిసర్గతత్వమే!

(‘ప్రజ్ఞ్భారతి’, ‘ఇతిహాస సంకలన సమితి’ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ‘తెలంగాణ వైభవం’ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా..)

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*29-09-2019 : సోమవారం*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి