ఇవాళ భారతదేశంలో విపక్షం గోబెల్స్‌ ప్రచారాన్ని, విధానాన్ని మనసా వాచా నమ్ముతున్నట్టు కనిపిస్తున్నది.గోబెల్స్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రచార శాఖ మంత్రి అన్న విషయం తెలిసిందే. అబద్ధాన్ని నిజం చేసే విన్యాసాలలో అతడు సిద్ధహస్తుడని చరిత్ర ప్రసిద్ధికెక్కాడు. హిట్లర్‌ తన ఆత్మకథ ‘మెయిన్‌కాంఫ్‌’లో ఇంకో ముఖ్య విషయం రాశారు. తనకు ఇబ్బందులు ఏర్పడినప్పుడల్లా ‘దేశం ప్రమాదంలో పడింది’ అని నమ్మించే ప్రయత్నం చేసేవాడట. ఇప్పుడు రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్షాలు ఈ హిట్లర్‌ పాలసీని నూటికి నూరుశాతం అమలు చేస్తున్నాయి.
నిప్పుకు చెదలు పట్టించాలని..
నీళ్లను విషంతో కలుషితం చేయాలని..
ఆకాశంలోని సూర్యుడిపై దుమ్మెత్తిపోయాలని..
మర్రిచెట్టు మొదట్లో మాటుబెట్టి అంటించాలని..!
ఇటువంటి సాధ్యంకాని అనేక కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2004-14 మధ్యకాలంలో సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం చేయని కుంభకోణం లేదు. జరుపని అవినీతి లేదు. ఆనాడు కాబూలా బ్రూనీ వంటి ఇటాలియన్ల సామ్రాజ్యం భారత్‌లో నడిచింది. ఓ లెక్క ప్రకారం 30 శాతానికి పైగా నకిలీనోట్లను పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఈ దేశ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి తమ చీకటిపనులు చక్కబెట్టుకున్నది. గోకుల్‌ చాట్‌, ముంబై దాడులు యథేచ్ఛÛగా జరిపిన తీవ్రవాదులు ఈ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేశారు. డా||సుబ్రహ్మణ్య స్వామి పరిశోధనల ప్రకారం యూపిఏ ప్రభుత్వంలో 60వేల కోట్లు రాజా, 15 వేల కోట్లు కరుణానిధి కుటుంబం, 5 వేల కోట్లు చిదంబరం కుటుంబం, 36వేల కోట్లు సోనియా గాంధీ కుటుంబం వెనకేసుకున్నాయి. 2012లో యూపీఏ ప్రభుత్వం ఉండగానే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక స్కాం వెలుగుచూసింది. రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడిపే సోనియాగాంధీ, ఆమె కొడుకు రాహుల్‌, వారి ముఖ్య అనుచరులపై కేసు నమోదు అయ్యింది. భూమ్యాకాశాలను ఏకం చేసిన మహా స్కాంలు ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి.
మరోవైపు రాజరిక వ్యవస్థను తలపిస్తూ ఈ దేశానికి తామే దిక్కు అన్నట్లు నెహ్రూ-గాంధీ కుటుంబం వ్యవహరిస్తూ వచ్చింది. వారి మార్గంలోనే దేశం మొత్తం దాదాపు అన్ని రాష్ట్రాలను ఏదో ఒక కుటుంబం పాలించే సంస్కృతిని నెహ్రూ కుటుంబం ప్రవేశపెట్టింది. దాంతో ఇవాళ కుటుంబ పాలన కూకటి వ్రేళ్ల క్రింద ప్రజాస్వామ్యం చిక్కుకుని రోధిస్తున్నది. అలాగే అవినీతిని చట్టబద్ధం చేసి నాయ కులంతా జైళ్లకు వెళ్లడం షరామామూలు అయిపోయి సామాన్య ప్రజల్లోకి ఈ ‘జాడ్యం’ అంటురోగంలా వ్యాప్తి చెందింది. రాజకీయాలు సేవకన్నా ధన సంపాదనకే ముఖ్యంగా వాడుకునే స్థితిని కాంగ్రెస్‌, దాని సంస్కృతి నుండి పుట్టిన ప్రాంతీయ పార్టీలు స్థిరీకృతం చేసాయి. ఆశ్రిత పక్షపాతంతో, బంధు ప్రీతితో దేశాన్ని నింపేసి ప్రజాసామ్య విలువలకు పాడెగట్టారు.
ఈ అంటురోగాలతోపాటు ‘బుజ్జగింపు’ అనే మహమ్మారిని ఈ దేశంపై వదలి గంపగుత్తగా ఓట్లు పొంది అధికార మత్తులో తులతూగడం పార్టీలకు ఒక అలవాటుగా మారింది. దీని దుష్పరిణామం ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిందంటే దిగ్విజయ్‌సింగ్‌ లాంటి కాంగ్రెస్‌ నాయకుడు ‘ఒసామా జీ’ అని తీవ్రవాదులను సంబోధించే వరకు వెళ్లింది. అలాగే బాట్లా హౌజ్‌ ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాదులు చనిపోతే ‘సోనియాగాంధి రాత్రంతా నిద్రపోకుండా వెక్కి వెక్కి ఏడ్చింది’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడించే స్థితికి వెళ్లింది.
ఇలాంటి దుస్థితినుండి ఈ దేశాన్ని కాపాడేందుకు దేశ ప్రజల్లో 2014కు ముందు ఓ ‘నిశ్శబ్ద విప్లవం’ వచ్చింది. సామాన్యుడి నుండి మాన్యులని పిలవబడే వాళ్ల వరకు మోదీని ఈ దేశ కాపాలాదారుగా చేద్దామనుకొన్నారు. అంతే..! దేశం ఓ భరతమాత ముద్దుబిడ్డను అక్కున చేర్చుకొంది.
వికసించిన కమలం మోదీ
గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 27 ఫిబ్రవరి 2002 నాడు 59 మంది హిందూ భక్తులను సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణంగా ఓ మతోన్మాదమూక పెట్రోలు పోసి తగులబెట్టింది. దాంతో మతఘర్షణలు చెలరేగి ఇరు వర్గాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గోద్రా ఘటనను సెక్యులర్‌ శక్తులు ఖండించిన కారణంగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైయ్యారు. కానీ ఇదంతా మోదీపై నెట్టి ఆయనను ‘ముస్లిం వ్యతిరేకి’గా చిత్రీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గోబెల్స్‌ ప్రచారం మొదలుపెట్టారు. కానీ నరేంద్రమోదీ తన పని తాను చేసుకొంటూ గుజరాత్‌ను ఒక ఆదర్శ అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం మోదీని అనేక విషమ పరీక్షలకు గురిచేసింది. అనేక విధాలుగా ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి చిరాకు కలిగించింది. అయినా ‘ధీరుల్‌ విఘ్న నిహన్యమానులగుచున్‌’ అన్నట్లుగా మోదీ రాచమార్గంలో వెళ్లిపోయాడు. ఈ బురదను త్రోసివేస్తూ కమలంగా వికసించి 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, మునుపెన్నడూ లేనివిధంగా పార్లమెంటునే దేవాలయంగా భావించి నతమస్తకుడయ్యాడు.
దుష్ప్రచారం షూరూ…!?
మోదీ ప్రధాని కానేకాడు అని కొందరు! అయితే ఈ దేశంలో సెక్యులరిజం బ్రతుకదు అని మరికొందరు..!! ఇలా బురద జల్లుతుండగానే అనంతమూర్తి అనే కన్నడ సాహిత్యవేత్త ‘మోదీ ప్రధాని అయితే నేను ఈ దేశం విడిచి వెళ్లిపోతా’ అన్నాడు. దురదృష్టవశాత్తూ ఆయన తర్వాత ఆయన ఈ లోకాన్నే విడిచివెళ్లాడు. ఓవైపు రాజకీయశక్తులు, మరోవైపు మతోన్మాదశక్తులు, సెక్యులర్‌ ముసుగేసుకున్న కుహన లౌకికవాదులు, కమ్యూనిస్టులు, అందరూ మోదీని ఈ దేశ గద్దెపై చూడడం ఇష్టంలేక నీచమైన విమర్శలకు దిగారు. ఆఖరుకు మణిశంకర్‌ అయ్యర్‌, దిగ్విజయ్‌సింగ్‌ లాంటివారు పాకిస్తాన్‌తో కలిసి ‘మోదీని దించేస్తాం’ అని ప్రకటించారు.
2014 నుండి ఇటీవల వరకు మణిశంకర్‌ అయ్యర్‌, దిగ్విజయ్‌సింగ్‌, రాజ్‌ బబ్బర్‌, శశిథరూర్‌, జిగ్నేష్‌ మేవానీ, కె.నారాయణ, బాలకృష్ణ… వంటి వాళ్లు ఈ దేశ ప్రధాని అని కూడా చూడకుండా సంస్కార రహితంగా తిట్లకు పాల్పడ్డారు. 2014లో ప్రభుత్వం ఏర్పడ్డాక మోదీని బోనులో నిలబెట్టేందుకు ప్రతిపక్షాలకు, మోదీ వ్యతిరేకులకు ఏ విషయం దొరకలేదు. అమెరికా వెళ్లకుండా అంతర్జాతీయ శక్తులతో కలిసి కుట్ర చేసి వీసా రాకుండా చేసిన వాళ్ల కళ్లముందే – అదే అమెరికా రెడ్‌ కార్ఫెట్‌ వేసి పిలవడం ఈ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. అలాగే సర్జికల్‌ స్ట్రైక్‌, డోక్లాం ఘటనలను కూడా మోదీ సమర్థంగా ఎదుర్కొన్నాడు. వివిధ దేశాలకు పర్యటనలకు వెళ్లి ఈ దేశ గౌరవం మరింత పెంచాడు. అంతర్జాతీయ స్థాయిలో మనదేశ ప్రధాని పదవి విలువ పెరిగిపోయింది. ఇందులో కొన్ని ముందూవెనుకా జరిగినా మోదీ వ్యతిరేక శక్తులకు తమ భవిష్యత్తు కన్పించింది.
కొత్త కత్తులకు పదును..!
అప్పుడప్పుడు దేశ నాయకులు ప్రజల అంచనాలను మించి పని చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా చేయాలని ఆశిస్తాం. మోదీ విషయంలో అలాగే జరిగింది. గతంలో మన్మోహన్‌ సింగ్‌ను బాగా గమనించిన ఈ దేశ మధ్యతరగతి వర్గం మోదీపై ఎక్కువ ఆశలు పెట్టుకొంది. అవినీతి జరుగకుండా, వ్యవస్థల ప్రక్షాళన చేయడం మోదీ పనితనం. కానీ తాయిలాలకు అలవాటుపడిన జనానికి వెంట వెంటనే ఆయని పనితనం ఫలితాలు కన్పించలేదు. అయినా అతణ్ణి ఈ దేశం నమ్మింది. నరేంద్రమోదీ ప్రధాని పదవిలోకి వచ్చాక మతపరమైన ప్రసంగాలు చేస్తే ఆయనపై దుమ్మెత్తి పోసేవారు. అది గ్రహించిన ప్రధానిని ఆచితూచి మాట్లాడడం అనవసర వ్యవహారాల్లో మంత్రులను, పార్టీ నాయకులకు జోక్యం లేకుండా చేయడం ఓ క్రమశిక్షణగా పెట్టుకొన్నారు. ఈ లోపు కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలయ్యింది. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏకే ఆంటోనీతో ఓ కమిటీ వేసింది. ఆయన నిర్మొహమాటంగా ‘కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ వ్యతిరేకతను” బట్ట బయలు చేసాడు. దాంతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, కుహనా లౌకిక వాద కుటుంబ పార్టీలు ‘మైనార్టీ వాదం’ ప్రక్కకు పెట్టాయి. ఎందుకంటే వాళ్లు ఎంతలా మైనార్టీలను బుజ్జగిస్తే వెంటనే మెజార్టీ ప్రజలు మోదీవైపు నిలబడడం మొదలు పెట్టారు. కాబట్టి కుహనా లౌకిక వాద శక్తుల కొత్త అస్త్రం సిద్ధం చేసుకొన్నాయి.
2016లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల అనే విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే దానిని కేంద్రానికి, మోదీకి ఆపాదించి దుష్ప్రచారం మొదలుపెట్టారు. కమ్యూనిస్టులు లాల్‌-నీల్‌ జెండాపేరుతో క్రొత్త అస్త్రం సృష్టించి తమ వంధిమాగధ మీడియా ద్వారా రోహిత్‌ దళితుడని ప్రచారం చేసారు. ఇక కేజ్రీవాల్‌, రాహుల్‌, ఏచూరి వంటి మోదీ ఆగర్భ శత్రువుల గుంపు హైద్రాబాద్‌లో వాలిపోయి మోదీపై, భారతీయ జనతాపార్టీపై కులవాద అస్త్రం ప్రయోగం చేసారు. నిజం నిద్రలేవకముందే అబద్ధం అరవై దేశాలు తిరిగిందన్నట్లు మోదీ వ్యతిరేక మీడియా దేశంలో కులవాదంపై పెద్ద ఎత్తున రచ్చ చేసింది. ఈలోపు పార్లమెంటులో స్మృతీ ఇరానీ దస్తావేదుల ఆధారంగా ఇవన్నీ కడగేసి, దుమ్ము దులిపింది. ఈ అబద్ధం ప్రచారంలో ఉండగానే ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి దళితుడే కాడని తేలింది. కానీ ఈ శక్తులకు ఇక్కడే మజా దొరికింది.
మోదీని పాలనలో ఎదుర్కోవడం కన్నా దుష్ప్రచారంతో ఎదుర్కోవడం చాలా సులభం అని వారు గ్రహించారు. వాళ్లందరిని హిట్లర్‌ ఆవహించాడు. అందుకే పూటకో అబద్ధం. దీనికి బ్రిటీష్‌ అనలిటికా అనే విదేశీ సంస్థను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి కాంగ్రెస్‌ పార్టీ ఉపయోగించుకొంటున్నట్లు రిపబ్లిక్‌ జాతీయ న్యూస్‌ ఛానల్‌ ఆధారాలతో బయటపెట్టింది. ఎక్కడ ఎలాంటి చిన్నపాటి స్థానిక ఘర్షణ జరిగినా దానిని అంతర్జా తీయ సమస్యంగా చేయడం, ప్రతివిషయానికి కుల, మతం రంగు అంటించి బురద చల్లడం మొదలు పెట్టారు. స్థానికంగా జరిగే ప్రతిఘటనను చిలువలు పలువలు చేసి దానిపై ప్రధాని స్పందించాలని కోరడం, లేదంటే ఆ మనపై దుష్ప్రచారం చేయడంలో వారు విజయవంతం అయ్యారు. నేరాలు, హత్యలు, గోహింస, దానిపై ప్రతిఘటన, స్థానిక మత ఘర్షణలు.. ఇలా ప్రతి వాటిని ఏదోరకంగా మోదీపైకి నెట్టడం అలవాటుగా పెట్టుకొన్నారు.
గతంలో వాజ్‌పేయి, అద్వాణీలు జీవిత పర్యంతం పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్‌ మంచిపని చేస్తే చక్కగా సహకరించారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో సోనియా, రాహుల్‌, ఖర్గే ఏనాడూ పార్లమెంట్‌ను నడవనివ్వ లేదు. చర్చలు జరిగితే వాళ్ల జాతకాలు చెప్పి మోదీ కడిగివేస్తాడని భయం. ఈ లోపు 2018 ఫిబ్రవరిలో చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థంతో ఎన్డీయే నుండి బయటకు వచ్చి ఈ గ్యాంగులో చేరాడు. ప్రత్యేక ¬దా అనేది ఒక నెపం మాత్రమే. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థలో అధిక సంపన్నుల్లో సోనియా తర్వాత చంద్రబాబు అని చెప్తారు. ఆయన తన యావశ్శక్తిని మోదీపై బురద జల్లేందుకు ఉపయోగిస్తున్నారు.
దుష్ప్రచారం ఒక రాజకీయ అస్త్రం..!
పరిపాలనపై చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. సిద్ధాంతాల మాటున యుద్ధం చేసే కమ్యూ నిస్టులు ఈ దేశంలో అవసాన దశలో ఉన్నారు. కానీ వారు తయారుచేసిన వ్యవస్థీకృత సిబ్బంది సాంస్కృతిక రంగంలో, మేధోరంగంలో ఇప్పటికీ బలంగా ఉంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏం చేయకున్నా ‘కాషాయీకరణ’ ముద్రవేసి అపఖ్యాతిపాలు చేసారు. అందుకే మోదీ ఈ దఫాలో అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ దేశంలో ఏదో మూలన జరిగే సంఘటనకు కులం, మతం రంగురుద్ది ఇంకో వైపున జరిగే ఎన్నికలకు వాడుకోవడం మొదలు పెట్టారు. అక్కడా దుష్ప్రచారమే ఆయుధం..!?
2014లో సాధారణ ఎన్నికల్లో మోదీ విజయం తర్వాత ఢిల్లీ, బిహార్‌ తప్ప 2018 డిసెంబర్‌ వరకు అన్ని ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తూ వచ్చింది. అన్నాహజారే ముసుగులో వచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్‌లో ఇప్పుడు చంద్రబాబులా మిడిసిపడి మోదీకి సముఉజ్జీనని బోల్తాపడ్డాడు. ఈ లోపు నితీశ్‌ కుమార్‌ను మోదీని నిలువరించే వ్యక్తిగా సెక్యులర్‌ గ్యాంగ్‌ ఎక్స్‌పోజ్‌ చేసింది. లాలూ లాంటి అవినీతిపరునితో నీతీశ్‌ ఉండలేక తిరిగి మోదీ చెంతకు చేరాడు. ఇలా దేశంలో వచ్చే ఎన్నికల ముందైనా ఓ యుద్ధ వాతావరణం సృష్టించి ‘దుష్ప్రచారం’ చేయడం వెనుక శక్తులు ఎవరున్నారు….?
దేశం కోసం ప్రాణం ఇచ్చే ధీరుడు…!
భారతికి ఎందరో ఋషులు తపస్సు చేస్తే దొరికిన బాంధవుడు..!!
ఫకీరులా అన్నీ అర్పించిన ప్రియభారత పుత్రుడు..!
చక్రంలా భారత రాజకీయాలను తిప్పుతున్న నరేంద్రుడు..!!
దుష్ప్రచారపు సుడిగుండాల నుండి
పుట్టుకొచ్చిన దేశభక్తుడు.. !
విషపు కత్తుల వలయంలో చిక్కుకొన్నా
దేశమే ముందని చెప్పేన మోదీపై యుద్ధం ఎందుకు..?


ఏనాడూ లేనివిధంగా మోదీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు బహిరంగ విమర్శలకు దిగడం ఓ వింత. అదీ నేరుగా చెప్పకుండా ప్రభుత్వం వైపు వేలు చూపించేవిధంగా ఆరోపణలు చేయడం. జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ఈ ప్రెస్‌మీట్‌లో జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను దోషిగా చూపిస్తూ ఈయన వెనుక ఎన్డీయే ఉందన్న సంకేతం ఇచ్చారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తన పదవీవిరమణ లోపు రామమందిరంపై తీర్పు ఇస్తాడని తెలిసే ఇలాంటి తెరవెనుక కుట్రను రచించి అమలు చేసారని విజ్ఞుల అభిప్రాయం.
ఆఖరుకు కర్ణాటక ఎన్నికల తర్వాత అర్థరాత్రి తలుపులు తీయించింది కూడా ఈ భయాందోళనలకు గురిచేసే కదా! తర్వాత జస్టిస్‌ దీపక మిశ్రాపై కాంగ్రెస్‌ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని చూసింది. అంతెందుకు! ఇటీవల కపిల్‌ సిబ్బల్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు 2019 ఎన్నికల వరకు రామమందిరం ఇష్యూ వద్దని సుప్రీంకోర్టును బ్లాక్‌మెయిల్‌ చేస్తే, రాజీవ్‌ ధావన్‌ అనే న్యాయవాది బ్లాక్‌మెయిల్‌ చేసి లలిత్‌ అనే ఒక న్యాయమూర్తిని ధర్మాసనం నుండి తప్పుకొనేటట్లు చేశాడు. ఇలా న్యాయ వ్యవస్థను కులం, మతం, పక్షపాతం అంటూ వాడుకుంటున్న వారే మోదీని అపఖ్యాతి చేసేందుకు న్యాయ వ్యవస్థపై బురద జల్లుతున్నారు.

దుష్ప్రచారం వెనుక..

ఢిల్లీ ఎన్నికలు రాగానే చర్చిలపై దాడులంటూ మొదలు పెట్టిన ఈ గ్యాంగు అవి అయిపోగానే మిన్నకుండిపోవడం మనం చూసాం. అలాగే అసహనం పేరుతో అవార్డు వాపసీ గ్యాంగ్‌ తమకు పూర్వం ఇచ్చిన అవార్డులను వాపసు ఇస్తుంటే వాళ్లకు ఇన్ని అవార్డులు వచ్చాయా? అని అప్పుడు తెలిసింది. సాహిత్య అకాడమీ ఇచ్చిన 39 మంది తమ అవార్డులను వాపస్‌ ఇచ్చారు. ఉదయ్‌ ప్రకాశ్‌, అశోక్‌ వాజ్‌పేయి, క్రిష్ణశోబ్టీ, మంగళ్‌దేశ్‌ దర్బల్‌, కాశీనాథ్‌ సింగ్‌, రాజేశ్‌ జోషి వంటి హిందీ రచయితలు మొదలుకొని కాత్యాయనీ విద్మహే వంటి తెలుగు రచయిత్రులు ఇందులో ఉన్నారు. అఖ్లాఖ్‌ హత్య తర్వాత కొందరు గౌరీ లంకేశ్‌ హత్య తర్వాత మరికొందరు అవార్డు వెనక్కి ఇచ్చి మోదీపై దుష్ప్రచారంలో భాగస్వాములయ్యారు. 2017 సెప్టెంబర్‌ 5న గౌరీలంకేశ్‌ అనే జర్నలిస్ట్‌ను ఎవరో చంపారు. ఇది ఖండనీయం. కానీ ఆమె మరణించిన 15 నిమిషాల్లోనే ఒకవర్గం మేధావులు సీఐడీ దర్యాప్తు సంస్థల్లా కొందరు వ్యక్తులను, కొన్ని సంస్థలను దీనికి బాధ్యులను చేస్తూ మాట్లాడారు. ఆమె శ్రద్ధాంజలి సభను న్యూఢిల్లీ ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో పెట్టారు. గౌతమ్‌ లాహడీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన డి.రాజా, కన్హయ్య కుమార్‌ పాల్గొన్నారు. దీని ఆర్గనైజ్‌ చేసింది లెఫ్ట్‌వింగ్‌ మీడియా గ్రూప్‌. కర్ణాటకలో జరిగిన హత్యను ఢిల్లీకి చేర్చి మోదీపై బురదజల్లి తర్వాత రాబోయే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చడం ఆనాడు వీరి ఉద్దేశం.

రోజుకో అస్త్రం

 ఉన్నావ్‌, కథువాలలో జరిగిన రేప్‌లపై మోదీని దోషిని చేసేందుకు పదవీవిరమణ పొందిన ఐఏఎస్‌ అధికారులతో మరో ప్రోగ్రాం చేసారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగిన నేరాలను మోదీకి ఆపాదించాలంటే జాతీయ మీడియా దానిని చూపించాలి. కాబట్టి ఏఎస్‌పి అంబ్రేష్‌, వప్పల బాలచంద్రన్‌, చంద్రశేఖర్‌ బాలకృష్ణన్‌, ప్రదీప్‌ భట్టాచార్య వంటి 49 మంది మాజీ ఐఎఎస్‌లు మోదీకి లేఖ రాయడం వెనుక అసలు ఉద్దేశం దుష్ప్రచారమే.
 2017 ఆగష్టులో పదవీ విరమణ చేసి పోతూపోతూ ‘అసహనం’ అంటూ పదవి నుండి దిగిన హమీద్‌ అన్సారీ రెండురాళ్లు వేసాడు. ఏనాడూ పన్నెత్తి మాట అనని మోదీని దోషిగా చూపించాలని అమీర్‌ఖాన్‌ అనే నటుడు, హమీద్‌ అన్సారీ మొదలుకొని మానవ హక్కుల సంఘాల చేతిలో తోలుబొమ్మ అయిన నషీరుద్దీన్‌ షా వరకు ఇదే బాపతు.
 చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నంత వరకు మోదీ ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడిన ప్రధానమంత్రి మీడియా, ఆయన భాజపాకు దూరం కాగానే ప్లేట్‌ మార్చాయి. రోజూ ప్రధాని అని కూడా చూడకుండా తెలుగు మీడియా చేస్తున్న ‘మానహననం’ ఇంతా అంతా కాదు. ఇదంతా దుష్ప్రచార కుట్రలో భాగమే.
 ఇటీవల సుప్రీంకోర్టునుప్రయోగించి తమకనుకూల వాదనలు చేసి ఏదో ఒక ఆర్డర్‌ను తెచ్చి దాంట్లో ప్రభుత్వాన్ని దోషిగా మార్చడం కపిల్‌ సిబ్బాల్‌, ప్రశాంత్‌ భూషణ్‌ వంటి న్యాయవాదులు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని సవరించాలని కపిల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే సందర్భంలో కోర్టు ఇచ్చిన డైరక్షన్లు ప్రభుత్వానికి ఆపాదించి మోదీని ‘దళిత వ్యతిరేకి’గా ముద్ర వేయాలని చూసారు.
 కథువాలో ఓ ముస్లిం అమ్మాయిని రేప్‌ చేసారనే కథనం ఎక్కువ ప్రచారం చేసి దానికీ మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సబబు? అలా అంటే చంద్రబాబు పాలించే దాచేపల్లి మొదలుకొని కేజ్రీవాల్‌ పాలించే ఢిల్లీ ఎన్నోచోట్ల జరిగే సంఘటనలను కులమో, మతమో అద్దితే ఆయా పార్టీల నాయకులు బాధ్యత వహిస్తారా?
 యూపీలోని కైరానా, సారంగపూర్‌ వంటి చోట్ల మతఘర్షణలకు మోదీ, బీజేపీ కారకులని కలర్‌ ఇవ్వడం వెనుక దురద్దేశాలు లేవా?
 కర్ణాటకకు చెందిన అనంత కుమార్‌ హెగ్డే రాజ్యాంగ సమీక్ష జరగాలని అంటే వెంటనే కాంగ్రెస్‌, కమ్యూనిష్టు శక్తులు భాజపా మోదీ నేతృత్వంలో రాజ్యాంగం రద్దు చేస్తుంది’ అని ప్రచారం చేస్తారు. మరి 110కి పైగా రాజ్యాంగ సవరణలు చేసినవారు గతంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినట్లా? తప్పుడు వ్యాఖ్యానాలతో దుమ్మెత్తి పోయడమే దీని వెనుక రహస్యం.
 ఇటీవల అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్‌ మతం పేరుతో విభజించి లక్షలాది మంది ఊచకోతకు కారణమైన మహమ్మదాలీ జిన్నా ఫోటోను పెట్టారు. 30.4.2018 నాడు సతీశ్‌ గౌతమ్‌ అనే భాజపా నాయకుడు ఉపకులపతికి ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత ఈ ఇష్యూలోూవీఖూఖ కుూదీహూకి ఘర్షణ తలెత్తింది. కానీ ఈ ఘర్షణలకు, ఈ అసహనానికి కారణం మోదీ అంటారు ఎర్రన్నలు. అంటే వాళ్లు ఎలాంటి దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డా ఏమీ అనకూడదన్నమాట.
 కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌ వంటి వామపక్ష విద్యార్థి నేతలు ఆజాదీ పేరుతో విశ్వవిద్యాలయాల్లో యాకూబ్‌ మెమెన్‌ను కీర్తిస్తారు. బుర్హాన్‌ వానీ అనే తీవ్రవాదికి నివాళులు అర్పిస్తారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. వాళ్లను ఏమైనా అంటే మోదీ నియంత అనీ, భావస్వేచ్ఛ మాకు లేదని ప్రచారం చేస్తారు?
 ఇక ఎల్లో మీడియా ఇటీవల ఉత్తర-దక్షిణభారతం అనీ, ఫెడరల్‌ స్ఫూర్తి అంటూ కేంద్రాన్ని మోదీని నిందిస్తూ రోజుకో వంట వండి వార్చుతుంది. అవినీతిపరులైన వ్యాపార నాయకులపై ఐటిదాడులు జరిగితే మోదీ తెలుగువారి ఆత్మగౌరవంపై దెబ్బకొడుతున్నాడని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ‘ఆఖరుకు’ సిబిఐకి ఎన్‌ఐఏకు రాష్ట్రాల్లో సహకరించం’ అని తెలుగుదేశం ప్రభుత్వం వాదిస్తుంది.

ఇక ఇటీవల కాంలో రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై రాహుల్‌ అనేక అబద్ధాలతో దుష్ప్రచారాలతో దూసుకు పోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల అత్యంత గౌరవిస్తున్న యశ్వంత్‌ సిన్హా లాంటివాళ్లు సుప్రీంకోర్టులో దీనిపై వ్యాజ్యం వేశారు. కోర్టు దీనిలో ఎలాంటి వ్యూహాత్మక కుంభకోణం లేదు అన్నది. అయినా ఈ దేశ ప్రతిపక్షనాయకుడు ఎలాంటి ఆధారాలు లేకుండా పదేపదే ‘గోబెల్స్‌’ను ఆవహించుకొని మాట్లాడుతున్నాడు. అసలు అంబానీ కుటుంబం మోదీ నాలుగేళ్ల పాలనలోకి శ్రీమంతులయ్యారా? గతంలో సోనియా యూపీఏ ప్రభుత్వం 5800 కోట్ల ఢిల్లీ విమానా శ్రయం లైన్‌ను అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చింది? ఇన్నేళ్లలో హెచ్‌ఎఎల్‌ను ఎందుకు అభివృద్ధి పరచలేదు. ప్రధాని నేరుగా కూర్చొని మాట్లాడుతాడా? దీనికి ఓ పద్ధతి ఉందా? బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్నప్పుడు ఎయిర్‌టెల్‌, ఐడియా, రెలియన్స్‌, వోడాఫోన్‌లకు అనుమతి ఎందుకు ఇచ్చారో చెప్పగలరా? 1963 నుండి 2013 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెహ్రూ కాలంలోనే రక్షణ రంగంలో జీపుల కుంభకోణం జరిగింది. రాజీవ్‌ గాంధీ బోఫోర్స్‌ శతఘ్నుల కుంభకోణంలో నేరుగా సోనియానే పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదంతా వదిలిపెట్టి, ఎలాంటి కుటుంబం, బ్యాంక్‌ ఖాతాలు లేని మోదీపై బురదజల్లే దుష్ప్రచారం మూడు రాష్ట్రాల్లో బోటీబోటీ మెజార్టీతో గెలిపించి ఉండవచ్చు కానీ సత్యం?


రాజస్థాన్‌లో గుజ్జర్లను, మహారాష్ట్రలో మరాఠాలను, హరియాణాలో జాట్లను, ఆంధ్రలో కాపులను, తెలంగాణలో ముస్లింలను, గుజరాత్‌లో పటీదార్లను రిజర్వేషన్ల పేరుతో రెచ్చగొడుతూ వారి మనస్సుల్లో మోదీపై భారతీయ జనతా పార్టీపై విషం నింపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 60 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ, దానితోక పార్టీలు ఏనాడూ ఈ విషయంపై మాట్లాడలేదు. కానీ వారి ప్రయోజనాల కోసం రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కేంద్రాన్ని బోనులో ఎక్కించడం వెనుక పెద్ద కుట్ర ఉంది. వాళ్లు ఎంచుకొన్న లక్ష్యం పూర్తయినా, కాకున్నా దుష్ప్రచారం జరిగితే చాలు.

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ చోక్సి, లలిత్‌ మోదీలను మోదీ తయారు చేసాడా? వాళ్లకు బ్యాంక్‌ అప్పులు ఇచ్చింది ఎవరు? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2008 వరకు మన బ్యాంక్‌లు 18 లక్షల కోట్లు అప్పులు ఇస్తే, యూపీఏ పాలనలో 2008 నుండి 2013 వరకు కేవలం ఆరేళ్లలో 34లక్షల కోట్ల ఋణం ప్రభుత్వం ఇచ్చింది. ఎగవేతదారులకు బ్యాంక్‌ తలుపులను బార్లా తెరచిన వారే నీతులు చెప్తూ మోదీపై దుష్ప్రచారం చేయడం కుట్ర కాదా?


**********************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి * 
జాగృతి : వారపత్రిక 
21 : 27 : జనవరి - 2019
సంపుటి : 71, సంచిక : 12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి