‘‘కుండను చూస్తున్న వ్యక్తి తాను కుండకన్నా వేరుగా భావించినట్లే శరీరాన్ని చూసి దానికన్నా నేను వేరు అనే భావన కలిగి ఉండాలి’’ అని తత్వవేత్త అష్టావక్రుడు చెప్పాడు. ఇదే సత్యాన్ని వశిష్ఠుడు తన విశిష్టమైన యోగం ద్వారా శ్రీరామునికి అందించాడు. ఈజ్ఞాన పరంపర ఉపనిషత్తుల ద్వారా యోగ శాస్త్రం ద్వారా, తత్త్వశాస్త్రం ద్వారా లోకానికి అందింపబడింది. అలాంటి తత్త్వ దృష్టిని అందుకొని మన కళ్లముందు నడిచే గురుతత్వంగా ఆత్మసాక్షాత్కార శాస్త్రాన్ని అందిస్తున్న గురువులు శ్రీశ్రీ గెంటేల రమణులు..!

1963 జూలై 17న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, గెంటేల నరసింహారావు పుణ్యదంపతులకు జన్మించారు. గొప్ప సద్గురువుగా పేరొందిన శ్రీ సద్గురు శివానందమూర్తిగారి మార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక జీవనంలో పూర్ణత్వం సాధించారు. దేశ విదేశాల్లో ఆధ్యాత్మికతను వ్యాప్తిచేసి బలుసుపాడులోని వారి పూర్వీకుల వ్యవసాయ క్షేత్రానే్న ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్ముఖమైన యోగసాధనతో భక్తులమధ్య ప్రేమూర్తిగా వెలుగొందుతూ ప్రబోధం, వౌనం రెండూ ఏక కాలంలో ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఒక ఊరి కథ పేరుతో అందించిన ఆత్మకథలో నమక చమకాల వైవిష్ట్యాన్ని ఆవిష్కరించారు. శ్రీమణీయం, గీతాసారం, అష్టావక్రగీ, సత్యము-అవగాహన, సత్యదర్శనం పేరుతో వారు అందించిన పుస్తకావళి వారి అంతర్ముఖీనమైన ఆత్మజ్ఞానం వెల్లడిస్తున్నాయి.


జిడ్డు కృష్ణమూర్తి-రమణమహర్షి తత్వంలోని వర్తమాన ఆధ్యాత్మిక విద్యను ఆకళింపు చేసుకొన్న వారు లోకానికి తమ బోధ ద్వారా సూక్ష్మంగా అందిస్తున్నారు. 1996లో బలుసుపాడులో సద్గురు శివానందమూర్తిగారి విగ్రహ స్థాపన చేసి ఆశ్రమాన్ని సుసంపన్న ఆత్మక్షేత్రంగా మలచి ‘గురుధామ్’ అనే పేరు పెట్టుకొన్నారు. దేశాన్ని -దైవాన్ని సమానంగా ప్రేమించే శివానందమూర్తిగారి అడుగుజాడల్లో వేలాదిమందికి అక్కడ ఆధ్యాత్మిక వికాసం కలుగుతున్నది. దీనితోపాటు వారి పరిభాషలోనే చెప్పాలంటే ‘‘చెట్టు చేమ, చీమ, దోమ, పశువు, పక్షీ, నీరూ, నింగీ, నేల, ఆకాశం అన్నీ పరమేశ్వర శక్తిని వ్యక్తీకరించే రూపాలే. పదాలన్నీ ఆయనే. అంతా శివపదమే’’ అన్నట్లు దేశాన్ని దైవంగా ప్రేమించాలని చెప్తారు.

మనం చాలాసార్లు గతించిన గురువులే గొప్పవాళ్లు అంటుంటాం. మన కళ్లమందు నడిచే మహాత్ములను గుర్తించం. మన కాలంలో జీవిస్తున్న అద్భుతమైన ఆత్మజ్ఞాని వెంటరమణులు! వారి ఆత్మజ్ఞానం అంతా ప్రేమతత్వమే! వ్రేలికున్న ఉంగరంలా, ముంజేతికున్న కంకణంలా, కంఠాభరణంలా మనలోనే వున్న ఆత్మ విద్యను మరిచిపోయి ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. 

అలాంటివాళ్లను స్వస్వరూపానుసంధానం కలిగించి ‘నీవు ఎవరు?’ అన్న సత్యాన్ని శ్రీ వెంకటరమణులు ప్రబోధిస్తారు. సారవంతమైన నేలలో విత్తనాలు పారేసినా మొలచినట్లు వారి సన్నిధిలో అలా కూర్చుంటే చాలు ఆత్మతత్వం అవగతం అవడం మొదలవుతుంది. దృష్టి వున్నా గ్రుడ్డివారిలా ప్రవర్తించే వాళ్లకు వెంకటరమణులు ఒక దారిదీపం. వారి ప్రబోధానుసారం వెళ్లడం మొదలుపెడితే మాయా ప్రంచంలోని వస్తువుల అసలు రహస్యం తెలుసుకొని సత్యదర్శనం చేస్తాం. వేగంగా వీచే గాలివల్ల మేఘాలు మాయమై ఆకాశం నిర్మలమైనట్లు మనలోని దుర్గుణాలు పటాపంచలవుతాయి.

కుతర్కం లేని ఆధ్యాత్మిక స్వచ్ఛత వారి ప్రబోధం నిండా ఉంటుంది. బురదలో దొర్లాడుచూ అమృతకలశాన్ని వదలిపెట్టినట్లు ఈ రోజు మనుషులు ఆత్మ విద్యను విస్మరించి వెర్రెత్తిన శునకాల్లా సంచరిస్తున్నారు. అలాంటివారికొరకు గురువుగా వెంకటరమణులు ప్రేమతత్వం, సూక్ష్మబుద్ధి, వౌనసాధన, ఆత్మ విద్యాప్రబోధం అనే త్రివిధమైన బోధాధికార అర్హతలను అందించి విజ్ఞులుగా తయారుచేస్తున్నారు.

కర్పూరం తన సుగంధం అందించినట్లు వారు తమ తపోశక్తిని ఎల్లడెలా వ్యాపింపజేస్తూ బ్రహ్మజ్ఞానమగ్నులై ఉన్నారు. వెంకటరమణులు శరీర ధ్యాసను వదలిపెట్టి జాగ్రదవస్థలో కూడా నిర్వికారులుగా ఆత్మజ్ఞానం ప్రబోధిస్తున్నారు. పాదరసం అగ్నిలో పడినా దహించని విధంగా ఆయన సంసారంలో వుండి సత్సంగం వదల్లేదు. ‘‘సన్యాసంలో ఉండి నియమంగా ఉండడం కాదయ్యా; సంసారంలో వుండి నిష్ఠగా ఉండడం నేర్చుకో’’ అని ఓ తత్వవేత్త చెప్పినట్లు శ్రీ వేంకటరమణులు సంసార భౌతికంగా తన చుట్టూ పెట్టుకొనే సత్య వివేచన చేస్తున్నారు. శ్రీ లాహిరీ మహాశయునిలా సంసారంలో ఉంటూనే ఓంకార జ్ఞానం లోకానికి అందిస్తున్నారు. రమణ మహర్షిలా శబ్దాలమధ్య నిశ్శబ్దాన్ని సాధించారు. పిల్లగాలులు మఱ్ఱివృక్షాన్ని ఏమీ చేయనట్లు ఈ లౌకిక బంధాలేవీ ఆయనను ఆటంకపరచలేదు. బ్రహ్మజ్ఞానమగ్నమైన రమణుల సాధనను చుట్టుప్రక్కనున్న విషయ వాసనలు అణువంత కూడా చలింపజేయలేదు.

నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయన్నట్లు, గోవులు ఇతరుల కొరకే పాలు ఇస్తాయన్నట్లు, వృక్షాలు పరులకోసమే ఫలించినట్లు వారి ఆత్మజ్ఞాన సంపదంతా తనవద్దకు వచ్చినవారి జ్ఞాన తృష్ణను తీర్చడానికే వినియోగిస్తున్నారు. చెప్పులు వేసుకొని తిరిగేవాడికి భూమి అంతా చర్మంతో కప్పబడినట్లు అనిపిస్తుంది. మనస్సు మొత్తం బ్రహ్మజ్ఞానంతో నిండితే లోకమంతా పరబ్రహ్మ స్వరూపంగా కనిపిస్తుంది. ఇపుడు వెంకటరమణుల స్థితి అది. అందుకే వారు తన స్వగ్రామంలోని ప్రతి ఘటనలో శివతత్వాన్ని దర్శించారు. ప్రతి విషయంలో ఆత్మ దృష్టిని ప్రదర్శించారు. ‘‘నూర్పుడి చేసి ఉంచిన ధాన్యపు రాశులు పొలాల్లో ఏర్పాటుచేసిన కళ్లాలను చూస్తుంటే నమఃఉర్వర్యాయ చ ఖల్యాయచ’’ అన్న శ్లోకం స్ఫురించింది. ఉర్వర్యాయచ -్భమియందున్న స్వామికి, ఖల్యాచ -్భమిపై వున్న ధాన్యపు రాశిగా వున్న స్వామికి నమస్కారం’’ అన్న దాన్ని ఇంకా వివరిస్తూ ‘‘పంటను పండించే భూమికి, ధాన్యం నూర్పిడి జరిగే ప్రదేశంగా ఉన్న దైవస్మరణలో కార్యకారణాలుగా వున్న శివస్మరణే కన్పించింది’’ అంటారు.

అలులు లేని సముద్రంలా ఉండే ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ ప్రేమమయమై వుంటుంది. వెంకటరమణులు నిత్యసంతోషిగా ఉంటూ గాలిలేనిచోట వున్న దీపంలాగా వారి మనస్సును స్థిరపరచుకొని ఆధ్యాత్మిక ప్రబోధనం చేస్తున్నారు. వర్తమాన విషయాలపై ఆసక్తి లేకుండా, భావిజీవితంపై ఆశ లేకుండా, గడిచిన అనవసర విషయాలను స్మరించకుండా అనన్య చింతనతో భగవద్ధ్యానం చేస్తుంటారు. ఆయన ఆలోచనాలోచనాలకు అందించిన ఆత్మగత విషయాలను పుస్తక రూపంలో, సత్సంగం రూపంలో ప్రతి గురువారం , ప్రతి ఆదివారం ఉదయం వేళ జిజ్ఞాసులకు అందిస్తున్నారు.

రమణులు రంగు రంగుల వస్త్రాలు ధరించకుండా, దండకమండలాలు లేకుండా, గండపెండేరాలు తొడగకుండా రుషిలా జీవించుకుంటూ ఆధ్యాత్మిక బీజ వ్యాప్తి చేస్తున్నారు. వెంకటరమణుల శాంతమైన మృదుస్వభావం, స్థిరమైన సద్గుణాలు, శీలంతో కూడిన పవిత్ర జీవనం వారివద్దకొచ్చే వారి ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గాలు. అనేక వృక్షాల మధ్య కల్పవృక్షంలా శోభిల్లే ఆ గురుమూర్తి నిర్గుణ తత్వానికి సగుణ సాకార జీవనానికి వారధిలా భాసిల్లుతున్నారు.

అద్దం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తనలో ఎదుటివారి ముఖాన్ని చూపించినట్లు వెంకటరమణులు తమ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుసరణ ద్వారానే ముముక్షువు కావలసిన జ్ఞానతత్వం నిర్దేశిస్తారు. ఎవరికి ఏ సమయంలో ఎంత మోతాదులో ఆధ్యాత్మిక పరిజ్ఞానం అందించాలో ఆయనకు తెలుసు. ఏనుగు ఒకే తొండం ఎలాగ గాలినీ, నీటినీ స్వీకరిస్తుందో మనకున్న ఒక్క మనసే ఆధ్యాత్మిక, లౌకిక జీవనాలను రెంటినీ కొనసాగిస్తుంది. నిజానికి అవి రెండూ విడిగా లేవు. సాధకులు తమ సాధనద్వారా కఠోర శ్రమ చేసి ఫలితాలను సాధిస్తారు. సామాన్యులు అది చేయలేరు అని వెంకటరమణులు బోధిస్తారు. అందుకోసం రమణ మహర్షి వంటివారు సామాన్యులకు జీవనంలోని విషయాల్లోనుండే సిద్ధంగా వుండే దైవానుభవాన్ని తెలియజేసే అద్భుత విచారణామార్గాన్ని అందించారని చెప్తారు.

విచారణామార్గంలో సాధన అంటే సత్యశోధననే అంటారు వెంకటరమణులు. ఈ విచారణ ఒకరకంగా జ్ఞానయోగ సాధన. అలా చేస్తూపోయాక మన ప్రమేయం లేదని తెలియడమే అంతరార్థమని అంటారు. ముక్తి మన సహజ లక్షణం అంటారు వెంకటరమణులు. దానికి ఓ అద్భుతమైన ఉపమానం చెప్తారు. చెట్టునీడలో వున్న మనిషి కావాలని నీడ నుండి బయటకు వచ్చి ఎండ వేడిని అనుభవించి, విశ్వప్రయత్నం చేసి మళ్లీ నీడలోకి రాగానే సంతోషంతో ‘‘అమ్మయ్యా, ఇప్పటికైనా నీడని చేరుకున్నాను’’ అన్నట్లే ఇది అంటారు.
ఇలా అఖండమైన ఆత్మజ్ఞానంతో ప్రబోధ ప్రవాహంతో కొనసాగుతున్నారు. మనం చూడని రమణమహర్షి, మెహర్‌బాబా, లాహిరి మహాశయునిలా ఎన్నో చెప్పుకొంటాం. మన కళ్లముందు నడుస్తున్న ఆత్మజ్ఞాని శ్రీ గెంటేల వెంకట రమణులు. ఎవరు నిరంజనుడైన నిర్గుణ పరబ్రహ్మను గూర్చి చింతిస్తారో వారే సద్గురువులని శ్రీ సమర్థ రామదాస స్వామి చెప్పినట్లు అలాంటి గొప్ప సద్గురువు శ్రీ గెంటేల వెంకటరమణులు. వారి ఆధ్యాత్మిక ఫ్రబోధనం అనుసరణీయం. వారి అపార తపోజీవనం అమృతతుల్యం.

*********************************
✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ధర్మభూమి : ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి