కలకత్తా కాళీ సాక్షిగా కుటుంబ, కులపార్టీలన్నీ మరోసారి తమబలం చూపిద్దామని బయల్దేరాయి. పోయినవాళ్లంతా ప్రధాని అభ్యర్థులే. ఈ ‘కప్పల తక్కెడ’ను ‘తప్పుడు తడకల కూటమి’గా భావించి జనం నవ్వుకుంటున్నారు. ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీశాడని’ వ్యంగంగా చెప్పినట్లు తన సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని చంద్రబాబు అక్కడకెళ్లి చెప్పిన ఓ ‘ఆణిముత్యం’పై సోషల్‌మీడియా పండుగ చేసుకుంది. ‘ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు బిజెపి వారు కొంటున్నారు’ అన్నాడు. వేదికపై ఉన్న ఫరూఖ్‌ అబ్దుల్లా, శరద్‌యాదవ్‌ లాంటి వాళ్లకు ఇదొక గొప్ప నైతిక సూత్రంగా అనిపించి ఉండవచ్చు. ప్రపంచంలోని అన్నింటినీ మొదట తానే సృష్టించానని చెప్పుకొనే చంద్రబాబు ‘ఎమ్మెల్యేల వైస్రాయి బీభత్సకాండ’ గురించి మాత్రం నోరు మెదపరు!? బాబు మొదట అధికారంలోకి వచ్చిందే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అన్న విషయ విస్మరిస్తే ఎలా? దానిని వారసత్వ సంపదలాగా ఈ రోజుకూ కొనసాగిస్తున్నారు. 20కిపైగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను తన చంకనబెట్టుకొని చంద్రబాబు ఇంత బాగా అబద్దాలు చెబితే ఉత్తరభారతం వాళ్లకు తెలియకపోవచ్చుగానీ, ఇన్ని అసత్య డైలాగులను తెలుగు ప్రజలు విని ‘నీవు మనిషివా? బాలకృష్ణవా?’ అని ప్రశ్నిస్తే ఆయనేం చేస్తాడు?
ఇక బోఫోర్స్‌ కుంభకోణం నోట్లో నాని నాని శరద్‌యాదవ్‌ ‘బోఫోర్స్‌’ అని యధాలాపంగా చెప్పేయడం ఈ సభలో హైలైట్‌ జోక్‌. మాయవతి, సోనియా, రాహుల్‌లు రాకుండా తమ ప్రతినిధులను పంపారు. అంటే ఇదంతా మమతా బెనర్జీ తాను ప్రధాని గద్దిపైకి ఎక్కాలని చేస్తుందని భావించే మాయా, రాహుల్‌లు రాలేదని మీడియా చెవులు కొరుక్కొంది. ఇక్కడ తండ్రిలా నల్లద్దాలు పెట్టుకోకుండా వచ్చిన స్టాలిన్‌ బాబు చెన్నైలో ‘రాహుల్‌ భావిప్రధాని’ అన్న మాట కలకత్తాలో అనలేదు. ‘బహుశా! మమత తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ పేరు చెప్తే బాగుండదని అనుకున్నాడా? లేక తన మనసులో ఇంకేమైనా ఉందా! ఇక ఎక్కడ అధికార బెల్లం ఉంటే అక్కడ వాలిపోయే ఫరూఖ్‌ అబ్దుల్లాను ఎవరు పట్టించుకొన్నారు? ఇందులో కన్పించిన మరో గొప్పనేతలు హార్దిక్‌పటేల్‌, యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, శతుఘ్న్‌సిన్హా, జిగ్నేశ్‌ మేవానీ వంటి ధీరులు. వారందరి మధ్యలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ బాబుగారు, శరద్‌పవార్‌లు కూర్చొంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే. దగ్గు తుమ్ముల కేజ్రీవాల్‌ ‘పాకిస్తాన్‌ నాశనం కాకుండా ఉండాలంటే మోదీ, షాలను మరోసారి అధికారంలోకి రానివ్వద్దు’ అన్నాడు. రాహుల్‌ సందేశం మోసుకొని వచ్చిన అభిషేక్‌ మనుసింఘ్వీ మరోసారి కాంగ్రెస్‌ భజన చేసి రాహుల్‌గాంధీ అష్టోత్తరం చదివి వెళ్లిపోయాడు. రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలను దాచిపెట్టి మరీ పాలన కొనసాగిస్తున్న కుమారుస్వామి, దేవేగౌడలు తమను కాంగ్రెస్‌ ఎలా వంచిస్తున్నదో చెప్పేందుకు వచ్చినట్లు అనిపించింది. వాళ్లంతా కలవగానే మహాఘట బంధన్‌ సర్కార్‌ కర్ణాట ప్రభుత్వానికి అన్నలాగే ఉంటుందేమో అనిపించిందట కొంతమందికి. ఇదంతా చూసి బిత్తరపోయిన జనాలను అదేరోజు ప్రధాని ఇచ్చిన పంచ్‌డైలాగ్‌ దిమ్మతిరిగేట్టు చేసింది. ‘నన్ను ఒక్కడిని కొట్టేందుకు కుటుంబ పార్టీల దోపిడీదారులంతా ఒక్కటయ్యారు’ అన్నమాట జనాన్ని కొత్త ఆలోచనవైపు తీసుకెళ్లింది. ‘ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనమ్‌’ అన్నట్లు ‘నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు’ అన్పించింది.
ఈ దేశ మెజార్టీ పజ్రలారా! ఒక్కసారి.. ప్లీజ్‌..!!
‘వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయాయి. క్రైస్తవులపై, ముస్లింలపై, దళితులపై దాడులు పెరిగాయి’ అంటూ చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత? ఈ దేశానికి ఈ ప్రభుత్వ హయాంలో దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి కాలేదా? దక్షిణ భారతం నుండి ఒకరిని ఉపరాష్ట్రపతి పదవి వరించింది ఎవరి హయాంలో ? డా|| అబ్దుల్‌కలాం లాంటి ముస్లిం మేధావిని రాష్ట్రపతి పీఠంలో కూర్చోబెట్టిన ఘనత ఎవరిది ? ఇవన్నీ విస్మరించి గాలివాటం ప్రచారంలో మెజార్టీ ప్రజలను కులాలుగా విభజించి పాలిస్తున్నది ఎవరు? కులాలవారీగా, కుటుంబాల వారీగా రాష్ట్రాలను పంచుకొని తమ అధికారం కాపాడు కోవడానికి ఈ దేశాన్ని వంచిస్తున్నది ఎవరు? మైనార్టీలను, తమ కులాలను ఒక్కటి చేసి అధికారం పొందాలనుకుంటున్న గుంపు ఎవరిది? ఈ దేశాన్ని అందరూ పాలించవచ్చుగానీ మెజార్టీ భావజాలం ఉండే వ్యక్తులు పాలించ కూడదా? ‘ఈ దేశపు మొదటి ముద్ద ముస్లింలదే’ అని ఆనాడు సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పదవిలో ఉండి ప్రకటిస్తే అది గొప్ప సెక్యులరిజమా!? మెజార్టీ ప్రజలారా! గమనించండి ప్లీజ్‌..!
దాదాపు ఈ దేశంలో వెయ్యేళ్ల పాటు హిందువు లను మైనార్టీలే పాలించారు. ఎన్నో నిర్బంధాలను, అణచివేతలను తట్టుకొని ఇక్కడి మెజార్టీ ప్రజలు తమ సంప్రదాయాలను కాపాడుకున్నారు. తమ చరిత్రను మసిబారనీయకుండా ఉంచే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఇక్కడ మెజారిటీలైన హిందువుల పరిస్థితి పాకిస్తాన్‌లోని హిందువుల కన్నా గొప్పగా ఏం లేదు. రాజకీయ వ్యవస్థలోని లోపాల కారణంగా ఓటుబ్యాంకు రాజకీయాలు మొద లయ్యాయి. జిన్నా కారణంగా బలైన హిందువులు విభజన సమయంలో నరకం చూశారు. 10 లక్షల మంది మరణించారు, 20 లక్షల మంది నిరాశ్రయు లయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో, కాశ్మీర్‌లో, కేరళలో హిందువులు మైనారిటీలైనప్పటికీ మెజారిటీ కిందే లెక్క. ఈ మెజార్టీల గురించి మాట్లాడిన వారంతా ఈ దేశంలో మతతత్వ వాదులు! ఇక్కడున్న మైనార్టీలను గుర్తిస్తూ ఎంత బాగా మాట్లాడితే అంత గొప్పవాళ్లు..!! మెజార్టీ ప్రజలారా! గమనించండి ప్లీజ్‌..!
ఏ దేశమైనా తన అస్తిత్వాన్ని అక్కడి మెజార్టీ ఆధారంగా చెప్పుకొంటుంది. కానీ ఇక్కడ మెజార్టీ ప్రజలను ‘కుల సంఘాలు’గా చేసి ఆడుతున్న వింత నాటకం ఒక రకంగా భవిష్యత్తులో మెజార్టీ ప్రజల దుస్థితిని తెలియజేస్తున్నది. మెజార్టీ ప్రజలను అభిమానించే వ్యక్తులు ఈ దేశాన్ని పాలించవద్దు అనే రాజకీయ సంకేతాలు ఇక్కడి హిందూమనోభావా లను దెబ్బతీయడమే గాక ఆందోళన కలిగిస్తున్నాయి. నకిలీ లౌకికవాద ముసుగేసుకున్న పార్టీలు జాతీయ వాదులపై ఎంత కక్షగట్టాయో మన సాంస్కృతిక సంస్థలను చూస్తే అర్థం అవుతుంది. ఈ దేశం వదలి ఎక్కడికీ వెళ్లలేని మెజార్టీలు ఈ దేశాన్ని ప్రేమించడం నేరమా? ‘హిందువులను గురించి మాట్లాడ్డం అపచారం’ అనే రీతిలో జరుగుతున్న దుష్ప్రచారం గమనించండి. మెజార్టీ ప్రజలారా! ప్లీజ్‌..!
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
28 జనవరి : 03 ఫిబ్రవరి - 2019
సంపుటి : 71, సంచిక : 13

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి