ఢిల్లీలో ‘ఆప్’ గెలవగానే సంబంధం లేనివాళ్లు సంబరాలు చేసుకొంటున్నారు. ‘తుపాకులు పేల్చిన వారికి చీపురుతో బదులిచ్చారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేయడమే దీనికి ఉదాహరణ. ఇక సీతారాం ఏచూరి మొదలుకొని ప్రచ్ఛన్న కమ్యూనిస్టు మేధావులంతా అక్షరాలతో భాజపాపై తమ అక్కసంతా వెళ్లగక్కారు. ‘విద్వేష రాజకీయాలకు, విభజన రాజకీయాలకు చెక్’ అంటూ ఏచూరి, చిదంబరం సంబరపడిపోతున్నారు.
మమతా బెనర్జీ అయితే ఏకంగా ‘సీఏఏ - ఎన్నార్సీకి వ్యతిరేక తీర్పు’ అంటూ తీర్పు చెప్పేసింది. ‘సీఏఏ ఉచ్చులో కేజ్రీవాల్ పడలేదు’ అంటూనే మరోవైపు ఇది సీఏఏ విజయం అని చెప్పడం మూర్ఖత్వం తప్ప ఇంకేం కాదు. ఇక భాజపా వ్యతిరేక నెటిజన్లు ‘షాను - మోదీని’ అనేక రకాలుగా అవమానిస్తూ వాళ్ల పనై పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
అనేక ‘సందర్భాల్లో’ వ్యాసాలు రాసే సూడో సెక్యులర్ మేధావులు ‘్భరత్‌కు ఇపుడు కేజ్రీవాల్ లేదా ప్రాంతీయ పార్టీలే దిక్కు’ తమ అక్షరోన్మాదం ప్రకటిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే 150 ఏళ్ల చరిత్రకు దగ్గరున్న కాంగ్రెస్ ‘తమకు సున్నా వచ్చినా సరే భాజపా ఓడిందని’ సంబరాలు చేసుకొంటున్నారు. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వాళ్లకు ఢిల్లీలో ఒరిగిందేమీ లేకున్నా మిఠాయిలు పంచుకుంటుంటే మనం ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేం చేయలేదు.
పూర్వం ఒక తపస్సు చేస్తున్న వాడికి దేవుడు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అంటే అవతలి గట్టుపై తపస్సు చేస్తున్న వాడికి నాకన్నా రెట్టింపు ఇవ్వండి’ అన్నాట్ట. మరి నీకేం కావాలి అంటే ‘నాది ఒక కన్ను తీసేయ్’ అన్నాడట. సరిగ్గా కాంగ్రెస్, కమ్యూనిస్టుల పరిస్థితి ఇలా ఉంది. ఆఖరుకు కాంగ్రెస్‌లో పేరు మోసిన ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ‘కాంగ్రెస్ దుకాణం మూసేసి, బీజేపీని ఓడించే పని ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేద్దామా! ప్రాంతీయ పార్టీలకు దేశాన్ని అప్పగిద్దామా?’ అంటూ నేరుగా ప్రచ్ఛన్న కమ్యూనిస్టు కాంగ్రెస్ నేత పి. చిదంబరాన్ని కడిగి పారేసింది.
నిజానికి 2015 ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్లు ఉంటే 67 ఆప్ గెలుచుకోగా 3 భాజపా గెలిచింది. 2020లో 62 ఆప్ గెలుచుకోగా భాజపా 8 గెలిచింది. సున్నా సీట్లకు 4 శాతం ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి భాజపా ఓటమిని విజయంగా భావించడం విచిత్రం. భాజపా8 సీట్లు 38.51 శాతం ఓట్లను సాధించడం గొప్ప విషయమే. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతికి పాల్పడకపోవడం, ఉచిత పథకాలు, ఆఖరుకు ‘మోదీనే మా ప్రధాని’ అంటూ పాక్‌ను హెచ్చరించడం, షాహీన్‌ఖాన్‌కు పరోక్షంగా మద్దతు ఇవ్వడం వంటివి కలిసొచ్చాయి.
అలాగే భాజపాకు మదన్‌లాల్ ఖురానా, సుష్మా స్వరాజ్, సాహెబ్‌సింగ్ వర్మ, అరుణ్‌జైట్లీ వంటి ఢిల్లీ బేస్డ్ నాయకులు గతించడం, మనోజ్ తివారీ వంటి సున్నిత మనస్కుడు వాళ్ల స్థానాన్ని భర్తీ చేయలేక పోయాడు. కేజ్రీవాల్ ‘హనుమాన్ చాలీసా’ పఠించడం వల్ల హిందువుల ఓట్లలో కొంత చీలిక రావడం, భాజపా మీద విద్వేషంతో ముస్లింలు ఏకపక్షంగా ఓట్లు ఆప్‌కు వేయడం భాజపా ఓటమికి కారణం. ‘ముస్లింలు ఇలా ఓట్లేయడం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని మేధావీ చెప్పడు!? ఎందుకంటే అది ప్రజాస్వామ్య పరిరక్షణ అంటుంటారు.
అయితే భాజపా ఓటమికి స్థానిక నాయకత్వాలు కూడా ఒక కారణం. మోదీ, అమిత్ షాలే వచ్చి వ్యూహ రచన చేయాలని స్థానిక నాయకత్వాలు నోరు తెరచి చూస్తుండడం దిక్కుమాలిన చర్య. వాళ్ల స్థాయిలో గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల్లో, కేంద్రంలో మంచి విజయం అందించారు. అంతేగాకుండా ఇటీవల భాజపాలోని కొందరు సంతుష్టీకరణ, లాబీయింగ్ ఉచ్చులో పడుతున్నారు. మీడియాలోని సింహ భాగం కమ్యూనిస్టు ప్రభావంతో, కుల ప్రాంతీయ పక్షపాతంతో నడుస్తున్నది. ఇదంతా భాజపా వ్యతిరేకం అని చెప్పేందుకు మొన్నటి ఢిల్లీ ఫలితాల విశే్లషణలే గొప్ప ఉదాహరణ.
భాజపాకు గుండెకాయ లాంటి జాతీయవాదం వదలిపెట్టిన ప్రతిసారీ ఇలాంటి పరాజయాలే. బట్టగాల్చి మీద వేసే ఎర్ర మీడియా సంస్కృతిపై కేసీఆర్‌లా ఓ దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలా కొన్ని వర్గాలను అతిగా సంతృప్తి పరచాలి అనే లక్షణం భాజపా వదిలిపెట్టాలి. సిద్ధాంతాలు లేని వ్యక్తులు రాజకీయాలు త్రిప్పే స్థితికి రానివ్వకూడదు. ఇతర పార్టీలతో లాబీయింగ్ చేసే వాళ్లను క్రింది స్థాయి నుండి వేళ్లతో సహా పీకెయ్యాలి. ఇతర పార్టీలపై ఓ వైపు యుద్ధం అంటూనే వాళ్లతో అవసరాలకు లాలూచీ పడడం ఓ కంట కనిపెట్టాలి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భావ దారిర్య్రం ఉంది. అలాగే విశ్వవిద్యాలయాల్లో పత్రికా రంగంలో, మేధోరంగంలో జాతీయవాదంపై రాజీ పడకూడదు. సోషలిస్టులు, పూర్వ కమ్యూనిస్టులు భాజపాలోని కొందరు అగ్ర నాయకులతో సంబంధాలు నెరపుతూ ప్రాంతీయ పార్టీలకు లాభం చేస్తున్నారు. రోజువారీగా జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకోని సంఘ్ కూడా కొన్ని విషయాలలో నిర్లిప్తంగా ఉంటున్నది. తొంబయ్యవ దశకంలో ఉండే పోరాట పటిమ జాతీయవాదులు కోల్పోతున్నారు. స్థానిక నాయకత్వంలో మోదీ, షాల్లో ఉండే డైనమిజం ఒక వంతైనా లేదు. నిజానికి ఇపుడు వాళ్లిద్దరు గట్టి మనుషులు ఉండబట్టి సరిపోయింది గానీ వాజ్‌పాయ్ లాంటి వాళ్లున్నా చంద్రబాబు లాంటి వాళ్లు చక్రం తిప్పేవాళ్లు.
ఉత్తరాది రాష్ట్రాల్లో, కర్ణాటక మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో ఈ అవలక్షణాలన్నీ భాజపా నాయకుల్లో ఉన్నాయి. అమిత్ షా ఢిల్లీ నుండి వచ్చి రాష్ట్ర అధ్యక్షునితో అన్నీ చెప్పి వెళ్లాడు. కానీ రాష్ట్ర నాయకులు రాజధాని విడిచి కదలరు. జిల్లా అధ్యక్షులను తమ దగ్గరకే పిలుచుకుంటారు. ఈ జిల్లా నాయకుల మండల నాయకులను జిల్లా కేంద్రానికి పిలుచుకుంటారు.
ఇదీ దుస్థితి. కాబట్టి క్రింది స్థాయిలో చాలా చోట్ల ఏజెంట్లు కూడా ఉండరు. దేశం విషయానికి వస్తే ప్రజలు భాజపా కావాలని కోరుకొన్నా, ప్రాంతీయ పార్టీ ఉచిత పథకాలు, ధన ప్రవాహం, పార్టీ నిర్మాణం - వ్యూహాల ముందు స్థానిక భాజపా నాయకుల చేష్టలు దిగదుడుపే. 2018 ఫిబ్రవరి తర్వాత గోరఖ్‌పూర్, పూల్పూర్ భాజపా ఓడగానే చంకలు గ్రుద్దుకున్నట్లే ఢిల్లీ ఓడగానే 2024 జాతకాల ఫలితాలను వారికి సమాధానం చెప్పాలంటే రాష్ట్రాల నాయకులు సంతుష్టీకరణ, లాబీయింగ్ వదిలిపెట్టాలి.
********************* *******
*✍✍ శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*14-02-2020 : శుక్రవారం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి