ఢిల్లీ-నోయిడా మధ్య రాకపోకలకు అడ్డుగోడ పెట్టిన షాహీన్ బాగ్ ధర్నాలోకి చిన్నపిల్లలను రాకుండా ఆపేయాలని సాహస బాలల అవార్డు గ్రహీత అయిన జెన్ గుణరతన్ సదావరై సుప్రీంకోర్టు సీజేను కోరింది. ఈ పనె్నండు ఏళ్ల బాలిక విజ్ఞప్తి అక్కడి రాజ్యాంగ పరిరక్షకులు వింటారో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవల ఆ నిరసన ప్రదర్శనలో నాలుగు నెలల శిశువు మరణించడం జరిగింది. ఈ దేశంలో కృత్రిమ రాజ్యాంగ పరిరక్షకులంతా రోజూ రకరకాల హక్కులకోసం పాటుపడేవారే. ఆఖరుకు దేశద్రోహులకు, రేపిస్టులకు కూడా వీళ్లు రక్షణ కవచంగా ఏర్పడుతుంటారు. వీళ్లదృష్టిలో రాజ్యాంగ పరిరక్షణ అంటే తైమూర్, గజనీ, ఘోరీ, నాదిర్షా, ఔరంగజేబులను గొప్పవాళ్లుగా పూజించడం. వాళ్ల తప్పులను ఎత్తిచూపినవాళ్లంతా మతతత్వవాదులుగా ముద్రవేస్తారు.

పోలీసులు రాష్టమ్రంతా కార్డన్ సెర్చ్ పేరుతో ప్రజలను చైతన్యవంతం చేస్తారు. కానీ హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం కార్డన్ సెర్చ్ చేయడం తప్పని ఓ ఎమ్మెల్యే పోలీసులను తిట్టి వెనక్కి పంపిస్తాడు? వాళ్లంతా రాజ్యాంగ పరిరక్షకులు!? బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల్లోని సురక్షిత ముస్లిములంతా ఈ దేశంలోకి స్వేచ్ఛగా రావాలని, లేదంటే సెక్యులరిజం ప్రమాదంలో పడిందని చెబుతారు. 


అదే బంగ్లాదేశ్ నుండి వచ్చిన తస్లీమా నస్రీన్‌పై ప్రెస్‌క్లబ్‌లో ప్రజాపతినిధులు దాడి చేస్తారు! ఇదంతా సెక్యులరిజం పరిరక్షణే! అలాగే గొప్ప ఇస్లామిక్ పండితుడు, మేధావి తారేఖ్ ఫత్తేను ‘నీకు ఈ దేశంతో సంబంధం లేదని నిందిస్తారు. పాకిస్తాన్ నుండి వెళ్లి కెనడా పౌరసత్వం తీసుకొని భారత్‌లో సింధు నాగరికత గొప్పతనాన్ని చెప్పే ఈ కమ్యూనిష్టు ఈ దేశంలోని అర్బన్ నక్సల్స్‌కు ససేమిరా నచ్చడు. బుర్హాన్ వనీని ఆరాధించే తుక్డే తుక్డే గ్యాంగుకు అద్నాన్ సమీ అస్సలు నచ్చడు. ఇదంతా రాజ్యాంగ పరిరక్షణే సుమా!
‘‘జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఆరునెలలుగా నిర్బంధంలో ఉన్నారు.


 ఎలాంటి అభియోగాలు లేకున్నా, ఇప్పటికీ వారు నిర్బంధంలోనే ఉండడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? లేదా’’ అంటూ భావి భారత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెగ బాధపడిపోతుంది. ఏనాడైనా ‘కాశ్మీర్ పండిట్లు’ ఇన్ని అత్యాచారాలకు గురయ్యారు కదా! చిన్న కన్నీటిబొట్టు విడిచిందా? వాళ్ల దృష్టిలో కాశ్మీర్ అంటే ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలే. వాళ్లను కాపాడేందుకే మన దేశం ఉంది. ఈ రాజ్యాంగ పరిరక్షణలన్నీ వారి కోసమే. 

కాశ్మీర్ రాష్ట్రం తీవ్రవాదుల చేతిలో బందీ అయినపుడు ఏ ప్రజాస్వామ్యవాదీ ఈ దేశంలో నోరు విప్పలేదు. కానీ ఒమర్ అబ్దుల్లాకు గడ్డం పెరిగిందని చాలామంది కృతక ప్రజాస్వామ్యవాదులు బాధ పడిపోతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యమే! ఎందుకంటే, సూడో సెక్యులర్ మేధావులంతా ‘రాజ్యాంగం’ అంటూ గొప్ప ప్రవచనాలు చెబుతున్నారు కాబట్టి మనం నమ్మి తీరాల్సిందే. కానీ పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో 311 ఓట్లు పొందినా, రాజ్యసభలో 125 ఓట్లు పొంది గెలుపొంది, డిసెంబర్ 12నాడు భారత రాష్టప్రతి చేత పౌరసత్వ సవరణ చట్టంగా ఆమోదం పొందినా అది ప్రజాస్వామ్యం కానేకాదు. 

ఎందుకంటే ఈ అద్భుత ప్రజాస్వామ్య పరిరక్షణవాదులు ఇలాంటి విషయాలను ప్రజాస్వామ్యంగా స్వీకరించరు. ఎందుకంటే వాళ్లది ‘షరియా బోల్ష్‌విక్ ప్రజాస్వామ్యం!?’ అందునా ఈ దేశ మెజారిటీ ప్రజల ప్రతినిధిగా ముద్రవేయబడ్డ నరేంద్ర మోదీ, అమిత్‌షాలు చెప్తే వీళ్లు వింటారా? ఎందుకంటే ఈ దేశ మెజారిటీ ప్రజల గొంతును అణచడమే నిజమైన ప్రజాస్వామ్యం? ఇక కమ్యూనిస్టు బాకాలు చెప్పే కులజాఢ్యం వంటి అవలక్షణాలన్నీ ఈ దేశ మెజారిటీ ప్రజల్లో ఉన్నాయి. మరి 800 ఏళ్లు ఈ దేశాన్ని గొప్పగా పాలించిన బాబర్ సంతతి ఎందుకు కులతత్వం పోగొట్టలేదని ఒక్కరూ ప్రశ్నించరు? అలా ప్రశ్నిస్తే సెక్యులర్ పాతివ్రత్యం భంగం అయిపోయి మనం కొట్టుకపోమూ!

అంతెందుకు! వ్యతిరేకంగా ధర్నాలు చేసేవారు గతంలో ఒక్కసారైనా మనఃపూర్వకంగా జాతీయగీతం ఆలపించారా? మువ్వనె్నల జెండాలు ఒక్కసారైనా వీరు చేత ధరించారా? అని ఈ రోజు భారత ప్రజలు విస్తుపోతున్నారు. మత్సే భగవాన్, జోగేంద్రనాథ్ మండల్ వంటి దళిత నాయకులకు పాకిస్తాన్‌లో ఎంత ఘర పరాభవం ఎదురయ్యిందో తెలియకుండానే చంద్రశేఖర్ ఆజాద్, రావణ్ వంటివాళ్లు జామియా మసీదు మెట్లపైన గెంతులేస్తున్నారా? జోగేంద్ర నాథ్ మండల్‌ను మూడేళ్లకే రాజీనామా చేసి వెనక్కి వెళ్లిపోయేలా చేసిన వారి గురించే ఈ ఆందోళన అని అర్థం చేసుకోవాలా?


 బమియాన్ బుద్ధ విగ్రహాలను ఫిరంగులతో పేల్చేసినవారిని పిలిచి అక్కున చేర్చుకొనే ప్రజాస్వామ్య పరిరక్షణ చూస్తే నవ్వాలా! ఏడ్వాలా? లక్షలాదిమందిని హత్యచేసిన బంగ్లాదేశ్‌లోని గొప్ప ప్రజాస్వామ్యవాదులను ఈ దేశంలోకి తేవాలని ఇక్కడి ప్రజాస్వామ్య పరిరక్షణవాదులు ఆందోళన చేస్తున్నారా?

 డా॥ బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచి, కనీసం ఈ దేశం ట్రాఫిక్ రూల్స్‌ను కూడా లెక్కలేనివాళ్లు రాజ్యాంగ పరిరక్షక అవతారం ఎత్తితే మన ఏ బావిలో దూకి చావాలి? ప్రగతిశీలత పేరుతో దేశ మూలభావన చంపడం ‘భ్రూణహత్య’ కాదా? అనేకానేక రాజ్యాంగ సూత్రాలను డా అంబేద్కర్ వడబోసి కదా మన రాజ్యాంగం సిద్ధం చేసింది. అలాంటి మార్గదర్శి రాజ్యాంగ రచన సందర్భంలో ‘లౌకికవాద’ శబ్దం ఎందుకు చేర్చలేదో ఈ పరిరక్షకులు చెప్పగలరా? కామాలు, ఫుల్‌స్ట్ఫాలు కూడా మార్చేందుకు వీలులేని రాజ్యాంగ ప్రవేశికలోకి సెక్యులర్ శబ్దం ఎలా చేరింది? ఎవరో అన్నట్లు ‘రాజ్యాంగంలోని ఒక్క వంతు విషయాలను ఆచరించినా ఈ దేశం ఎప్పుడో మారిపోయేది’’ అన్నది నిజం
.
కృత్రిమంగా సృష్టిస్తున్న రాజ్యాంగ పరిరక్షకులు కేవలం ఒక వర్గంవారి హక్కులకే రాజ్యాంగం ఉందని భ్రమపెట్టడంకన్నా వాచాలత్వం ఇంకొకటి లేదు. మెమొంటోలుగా, బహుమతులుగా ఇచ్చిన రాజ్యాంగాన్ని పుస్తకాల అల్మారాల్లో అలంకారం కోసం కాకుండా కాస్త చదివితే తెలుస్తుంది. ‘ఇది అందరి కోసమా? కొందరి కోసమా!’ అని.


*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*07-02-2020 : శుక్రవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి