'గ్రంథ చౌర్యం' గతి మారేదెప్పుడు ?



దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలో వచ్చిన 'దానిపేరే సారంగధరియ' అన్న ఒక జానపద గీతం విషయంలో వివాదం నడుస్తోంది. నిజానికి ఆ పాట ఆభానకం. కర్త ఎవరో తెలియదు. లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చిన ఆ పాటను తన సహజమైన గొంతుతో మంగ్లీ పాడింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తాను సేకరించిన పాటను తన పాటగా ప్రచారం చేసుకొంటున్నాడని 'కోమలి' అనే జానపద గాయకురాలు ఆరోపణలు గుప్పించింది. ఈ మధ్యలో శిరీష అనే మరొక గాయని తానూ ఆ పాట ఆలపించినట్లు ప్రకటించడంతో వివాదం మరింత రేగింది. నిజానికి ఈ పాటను ఈ ముగ్గురిలో ఎవరూ రచించలేదు. 'సేకర్త' కోసం ఈ కొట్లాట!? సహజంగా సినీ పరిశ్రమ ధనం, పేరూ రెంటి చుట్టూ తిరుగుతోంది కాబట్టి ఈ చర్చంతా నడుస్తోంది. ఇలాంటి ఎన్ని ఆణిముత్యాలు అమ్ముకొని సినీ కవులు, పెద్దలు గొప్పవాళ్లయ్యారో లెక్క కూడా పెట్టలేం. కానీ పాటలకు ప్రాణం పోసిన జానపదులు ఎంత గొప్పవాల్లో ఈ వివాదం చూశాక అర్థం అవుతోంది. ఇదంతా గ్రంథచౌర్యమే. అడిగేవాడు లేడు కాబట్టి ఇది 'లిటరరీ ప్లాగరిజం' పరిధిలోకి రాకపోవచ్చు. నిజానికి జానపదులు అమాయకంగా పదాలు అల్లారు గాని తమ ముద్ర వేయలేదు. నిజానికి వాల్మీకి చెప్పిన రామకథను మార్చి ఎందరో కల్పితాలతో అనేక రామాయణాలు రాశారు. వేదవ్యాసుడు సంస్కృత భాగవతం రాయలేదని, టోపదేవుడు రాశాడని చెప్పేవాళ్లు ఎందరో ఉత్తర భారతంలో ఉన్నారు. పోతన మహాకవి 'భోగినీ దండకం' వంటి అశ్లీల రచన చేస్తాడా ? అని కొందరంటే భజగోవిందం ఆదిశంకరులది కాదని ఇంకొందరంటారు. కలం పేరుతో రాసే ఎందరో కవుల పైనా వివాదాలున్నాయి. భార్యలకు భర్తలే నవలలు, కథలూ రాసి ఇస్తారని కొందరు 'ఘోస్ట్ రైటర్స్' లిస్టే తయారుచేసి ప్రచారం చేశారు. కొందరు ధనవంతులు తమ పేర రచనలు చేయిస్తారని చెప్పేవారూ ఉన్నారు. భారతంలో వ్యాసుడు వాల్మీకి చెప్పిన ఏదైనా ధర్మసూత్రాలను చెప్పేటపుడు 'పురావాల్మీకి ప్రోక్తః' అంటాడు. కాళిదాసు మొదలుకొని చాలామంది కవులు పూర్వకవి స్తుతి చేసి తమ వినయాన్ని ప్రదర్శించేవారు, ఇంకొందరు కథాచౌర్యానికి పాపపరిహారం చేసుకొనేవారు. ఎందరో కవుల కావ్యాలపై వివాదాలున్నాయి. నన్నయ భారతాన్ని నారాయణభట్టు సరిచూసాడంటే ఆయన నన్నయకన్నా గొప్పవాడే కావచ్చు అని వాదించే వారూ ఉన్నారు. భారత రచనలో తనకు 'అభిమత స్థితి' తోడ్పడినందుకు నన్నయ నారాయణభట్టును కృతజ్ఞతగా భారతావతారికలో స్తుతించాడు. నన్నెచోడుడి తోక వెంటే మానవల్లి రామకృష్ణ కవి ఉంటాడు. ఆముక్తమాల్యద పెద్దనదా? రాయలదా? అన్న వివాదం వస్తే 'రాయలు రాశాడు. పెద్దన చూశాడు' అని పండిత పరిశోధకుడు వేదం వేంకటరాయశాస్త్రి తేల్చేశాడు. క్రీడాభిరామం శ్రీనాథుడిదా? వినుకొండ వల్లభరాయుడిదా? అంతెందుకు, బండి యాదగిరి రాసిన 'బండెనుక బండి గట్టి' పాటను అందరూ గద్దరే అనుకున్నారు. గూడ అంజయ్య పాటలు చాలా రోజులకు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఎన్నో సాహిత్య వివాదాలు ముసురుకొని.. ఉన్నాయి. ********************************* ✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి

1 కామెంట్‌: