సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఇండియా-పాక్ సరిహద్దులో 4.7 కిలోమీటర్ల దూరంలో ‘కర్తార్‌పూర్ కారిడార్’ నిర్మాణం జరిగింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి పాకిస్తాన్ విడుదల చేసిన ఓ వీడియోతో వివాదం చెలరేగుతున్నది. 

భారత్‌లోని పంజాబ్ డేరాబాబా నానక్ సాహెబ్- పాక్ పంజాబ్‌లోని గురుద్వారా దర్బార్ సాహెబ్‌లను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ కారిడార్ సిక్కులకు పరమ పవిత్రమైంది. 1999లో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి- పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన దౌత్య చర్చల్లో భాగంగా ఈ నిర్మాణం ప్రారంభమైంది. 26 నవంబర్ 2018లో భారత్‌లో శిలాఫలకం పడగా 28 నవంబర్ 2018 నాడు పాకిస్తాన్‌లో శిలాఫలకం వేశారు. 

భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ.. పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నవేళ.. భారత్‌లోని సిక్కు వర్గానికి వేర్పాటువాదం గుర్తుచేసేందుకు పాక్ పన్నాగం పన్నిందన్న విషయం మరోసారి బయటపడింది. ఈ కారిడార్ ప్రారంభానికి సంబంధించి పాక్ రూపొందించిన వీడియో‘కర్తార్‌పూర్ గురుద్వారాకు వస్తున్న సిక్కు భక్తులకు స్వాగతం’ అంటూ ప్రారంభమవుతుంది. అయితే ప్రారంభంలో నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మొదలైన వాళ్లను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతున్న దృశ్యాలు చూపిస్తూ, ఆ తర్వాత ఖలిస్థాన్ వేర్పాటువాదులు జర్నయిల్‌సింగ్ బింద్రన్‌వాలా, మేజర్ జనరల్ సాహెబ్ సింగ్, ఆక్రమిక్‌సింగ్ ఖల్సా మొదలైనవారి ఫొటోలు ఈ వీడియాలో కన్పించడం వివాదాస్పదంగా మారింది.

ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కుల ఊచకోత భయంకరమైంది. దాంతో కాంగ్రెస్‌కు సిక్కులు దూరమయ్యారు. ఇటీవల సిద్ధూ కాంగ్రెస్‌లో చేరి పాకిస్తాన్ వెళ్లి ఎన్నోసార్లు భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో మన్మోహన్‌సింగ్ లేని ఉత్సహం మీడియా ముందు ప్రదర్శించాడు. 1984 కన్నా ముందు సిక్కులలో కొందరు ‘ఖల్సా’ పేరుతో ఖిలిస్తాన్ ఉద్యమానికి జీవం పోశారు. ఏకంగా ఆనాడు కొందరు ఖలిస్తాన్ వేర్పాటువాదులు స్వర్ణదేవాలయానే్న అడ్డాగా చేసుకోగా అప్పటి ప్రధాని ఇందిర ‘ఆపరేషన్ బ్లూస్టార్’ చేపట్టి దాన్ని అణచివేశారు. బింద్రన్‌వాలా సహా ముగ్గురు ఖలిస్థాన్ ఉద్యమ నాయకుల మరణంతో ఆనాటి వేర్పాటువాదం ఆగిపోయింది. 


అయితే ఇపుడు తాజాగా ఈ వీడియో సాంగ్ భారతీయులను కలవరపరుస్తోంది. పాకిస్తాన్ తన భూభాగంలోని పంజాబ్ ప్రజల మనోభావాలను ఏనాడూ గౌరవించలేదు. ఈనాటికీ అక్కడి పంజాబ్‌లో పంజాబీ భాష లేకుండా చేసింది. ‘పంజాబీ’ మాట్లాడే సిక్కులకు ఒక్క పాఠశాలను కూడ ఏర్పాటు చేయలేదు. విచిత్రం ఏమిటంటే పంజాబీ మాత్రమే మాట్లాడే ముస్లింలపై ఉ ర్దూనే బలవంతంగా రుద్దుతోంది. ఇపుడు సిక్కులకు మ రోసారి ఈ వేర్పాటువాదుల దృశ్యాలను చూపించి భారత్‌లో చిచ్చుపెట్టాలని పాకిస్తాన్ చూస్తోందా?
లాలాలాజపతి రాయ్, భగత్‌సింగ్, గురునానక్, గురుగోవింద్ సింగ్ వంటి పుణ్యపురుషులు నడయాడిన కాలంలో 1981-2001 మధ్య కాలంలో 21,608 మంది వీరులు ఈ వేర్పాటువాదం అణచేందుకు తమ ప్రాణాలను బలిపెట్టారు. 


క్రీ.శ. 1708కి ముందు సిక్కుల చివరి గురువు గురుగోవింద్ సింగ్ మతోన్మాద ముస్లిం పాలకుల నుండి ఈ దేశాన్ని, హిందూమతాన్ని కాపాడేందుకు ‘ఖల్సాపంత్’ ఏర్పాటుచేశాడు. ‘హిందూమత సంరక్షణకు సిక్కుల కంటే అత్యంత సాహసోపేతంగా పోరాడిన మతం ఏదీ లేదు’ అంటారు మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ.
1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటీష్‌వారు హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసేందుకు సయ్యద్ అహ్మద్‌ఖాన్‌ను ఎంచుకున్నట్లే హిందూ సిక్కు ఐక్యతను నాశనం చేసేందుకు ‘మ్యాక్స్ ఆర్థర్ మెకాలిఫ్’ను ఎంచుకొన్నారు. 1862లో ఇంపీరియల్ సివిల్ సర్వీసులో చేరిన మెకాలిఫ్ 1864లో పంజాబ్‌కు పంపబడి సిక్కుమతం స్వీకరించాడు. 


భాయ్ కహ్న్ సింగ్ నాభాతో జతకట్టి గురుగ్రంథ సాహెబ్ సహా చాలా గ్రంథాలను ఆంగ్లానువాదం చేశాడు. 1897లో ‘హమ్ హింద్ నహీ’ అంటూ భాయ్ కహ్న్‌సింగ్ ఓ చిన్న పుస్తకం రాసి ఖలిస్థాన్ ఉద్యమానికి బీజం వేశాడు. దీని ప్రభావంతో 1 మే 1905 నాటికి స్వర్ణదేవాలయం చుట్టూ వున్న హిందూ ప్రతిమలను తొలగించేవరకు వచ్చింది. ఈ విచ్ఛిన్నకర ఉద్యమానికి ‘తత్‌ఖల్సా’- నవ సిక్కులు- అని పేరు పెట్టుకొన్నారు. ఈలోపు 1909లో మింటో- మార్లే సంస్కరణల కుట్రకు బ్రిటీష్‌వారు అమలు చేశారు. దాంతో ముస్లింలలోని ఒక వర్గం తమ మతానికి ప్రాధాన్యత కావాలని ఆందోళన మొదలుపెట్టింది. 

హిందూ భారత్ నుండి మమ్మల్ని వేరుచేయాలని ముస్లిం లీగ్ డిమాండ్ చేసినట్లే సిక్కులు కూడా తమకు ఓ భూభాగం కావాలని అన్నారు. 1901 జనాభా లెక్కల సందర్భంలో పంజాబ్‌లో 10 లక్షలకుపైగా ఉన్న జనాభా 1911 వచ్చేసరికి 30 లక్షలకు పెరిగింది. 1911 జనాభా లెక్కల్లో తమను ప్రత్యేకంగా గణించాలని సిక్కులు కోరేవరకు పరిస్థితి వెళ్లింది. దానికి బ్రిటీష్ సెనె్సస్ కమిషనర్ సరేనన్నాడు.

1971లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా రెండు ముక్కలైన తర్వాత దిక్కుతోచని స్థితిలో భారత్‌ను ప్రత్యక్షంగా ఓడించడం సాధ్యం కాదని పరోక్షంగా దెబ్బతీయాలనుకుంది. 1977లో పాకిస్తాన్ అధికార పీఠాన్ని ఆక్రమించిన జనరల్ జియా ఉల్ హక్ భారత్‌ను ముక్కలు చేయ డం, తిరుగుబాట్లు, తీవ్రవాదం భారత్‌లో పెంచి పో షించడం, నేపాల్-బంగ్లా సరిహద్దుల ద్వారా భారత్‌లోకి చొరబడి అక్రమయుద్ధం చేయడం అనే త్రివిధ వ్యూహాలను ఎంచుకొన్నాడు. ఈ కుట్రలను అమలు చేసేందుకు ఐఎస్‌ఐ, ఒకటి నిషేధిస్తే మరోటి పుట్టుకొచ్చే రక్తబీజులను ఈరోజుకూ చూస్తున్నాం. 


పంజాబ్ సరిహద్దు జిల్లాలైన గురుదాస్‌పూర్, అమృత్‌సర్ జిల్లాల్లో ఖలిస్థాన్ తీవ్రవాదం మొలుచుకువస్తే దానికి పరోక్షంగా పాకిస్తాన్ సహాయం చేసింది. ఇపుడు కూడా బిహార్‌లోని కిషన్‌గంజ్ వంటి సరిహద్దు జిల్లాల్లో ఇస్లామిక్ టెర్రరిజం చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల అక్కడ ఓ మతోన్మాద పార్టీ గెలవడం ఆందోళన కలిగించే విషయం. ఇవన్నీ బేరీజు వేస్తే కర్తార్‌పూర్ కారిడార్‌కు వచ్చే సిక్కు భక్తులకు ఖలిస్థాన్ నాయకుల ముఖాలు చూపెట్టి పాకిస్తాన్ భారత్‌లో మరో వేర్పాటుకు నాంది పలకనుందా? అనిపిస్తుంది. వెంటనే ఆ వీడియోను వెనక్కి తీసుకోకపోతే మన దేశ సిక్కు యువకుల మెదళ్లలోకి విషం ఎక్కే ప్రమాదం వుంది. ఇప్పటికే ఈ దేశంలో బలమైన హిందూ జాతి నుండి అనేక వర్గాలను వేరుచేస్తున్న శక్తులకు ఊతం దొరికే అవకాశం వుంది.
 ********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*08-11-2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి