తమాదిదేవ మజరం కేచిదాహుశ్శివాభిధమ్‌
కేచిద్విష్ణుం సదాసత్యం బ్రహ్మాణం కేచి దూచిరే

ముసలితనం లేని ఆ ఆది దేవుని కొందరు శివుడని, ఇంకొందరు విష్ణువని అన్నారు. మరికొందరు బ్రహ్మ అని అన్నారు. కానీ సత్య స్వరూపుడైన ఆయన ఒక్కడే అని శాస్త్రార్థం తెలిస్తే.. ఉన్నది దృష్టి భేదం మాత్రమేనని, సృష్టి భేదం కాదని గ్రహిస్తాం. అందుకే మన దేశ సాంస్కృతిక జీవనంలో కూడా అలాంటి నిర్మాణాత్మక దృష్టిని మనం గమనించవచ్చు. 

ఆధునిక ఆవిష్కరణలు చేసినవాళ్లు, విప్లవాలు లేవదీసే గొప్పవారు ఈ భూఖండంపై జన్మించకపోవచ్చు. కానీ ఓ పతంజలి, యాజ్ఞవల్క్యుడు, గోరఖ్‌నాథ్‌, గౌతమబుద్ధుడు, శ్రీరామకృష్ణులు, రమణ మహర్షి, శ్రీకృష్ణుడు.. ఇలా ఎందరో ఈ గడ్డపై జన్మించారు. వీరందరి ప్రబోధాల్లో వైవిధ్యం ఉన్నా వీరి అంతర్గత శక్తిలో సారూప్యం ఉంది. అందుకే ఓ బలమైన సాంస్కృతిక బంధం ప్రజల్లో నిరంతరం జీవనాడిలా చైతన్యం కలిగిస్తున్నది. నదులు, పుష్కరాలు, కుంభమేళాలు, ఆలయాలు, ఉత్సవాలు, పండుగలు, పర్వాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ శకలాలుగా ఉన్న మనస్సుకు సకలేశుని తత్వం ఎఱుకపరిచేవే.

మనం శివభక్తులమైతే అమర్‌నాథ్‌ నుండి రామేశ్వరం వరకూ మన ఆధ్యాత్మిక యాత్రను చేయవచ్చు. లేదు.. ‘నేను అమ్మవారిని అర్చిస్తాను’ అనుకుంటే వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు, ముంబాదేవి నుండి కామాఖ్య వరకు ప్రయాణం చేసి ఆ తల్లిని సేవించవచ్చు. విష్ణు భక్తులమైతే జగన్నాథ్‌ నుండి మథుర వరకు, అయోధ్య నుండి గురువాయూర్‌ వరకూ అన్నీ విష్ణు స్థలాలే. గురు స్థానంలో ఉన్నవారిని గురించి చర్చ చేస్తే కేరళలోని కాలడిలో జన్మించిన ఆదిశంకరులు దేశం నలుమూలలా మఠాలను నిర్మించారు. 

ఆయన మందిరం శ్రీనగర్‌లో ఉంటే, సమాధి స్థలి ఉత్తరాఖండ్‌లో ఉంది. శంకరుడు అందించిన అద్వైతం ఎన్నో అడ్డంకులను తట్టుకొని నిలబడింది. ఈ దేశంలో రామానుజుడికి ఎంత ప్రాధాన్యత ఉందో సంత్‌ రవిదా్‌సకు అంతే ప్రాధాన్యత ఉంది. ఎవరు ఎక్కడ ఏ పూజ చేసినా సంకల్పంలో అన్ని నదుల కలయిక ఉంటుంది.

గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావే జలే స్మిన్‌ సన్నిధింకురు

అంటూ చేతిలోకి నీటిని తీసుకునిఆయా నదుల పేరుతో పిలిచి ‘పుణ్యత్వం’ కలిగిస్తాం. ఈ నదులు దేశంలోని అనేక చోట్ల పారుతన్నా, వాటికి ఏకత్వం కలిగించే సంస్కృతి మనది. పంటనిచ్చే భూమిని, పునీతులను చేసే అగ్నిని, జలాన్నిచ్చే నదిని సూక్తాలతో కృతజ్ఞతతో అర్చిస్తాం. ఈ అపార సాంస్కృతిక ఏకత్వ భావన ఈ దేశంలోని ఆధ్యాత్మిక ఏకత్వానికి, అవిచ్ఛిన్న జ్ఞాన ప్రసారానికి ఆలంబనగా మారింది. సత్యాన్వేషణను పరిశోధించకుండా దర్శించిన తత్వశాస్త్రం వల్లనే ఈ ఏకాత్మ భావన సాధ్యమైంది.

*************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 18 - 11 - 2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి